Thursday, March 23, 2017

ఇంటిమీదెవుసమ్ 37 .

                                                            

1980 -1990 ప్రాంతం లో నాతోబాటుగా ఊపాధ్యాయ ఉద్యమం లో కలిసి పనిజేసిన ఒక మిత్రుడు ఈ మధ్యన మా ఇంటికి వచ్చిండు. పాత రోజులను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా అయిపాయే గద అంటూ చాలా బాధ పడ్డడు . ఆ నాడు బడిలో పిలగాండ్లకు కొదువ లేకుండే, చాలినంత మంది ఉపాధ్యాయులు లేకుండిరి, చాలినన్ని తరగతి గదులు లేకుండే. అట్లాంటిది    ఊరూరికి 3,4 తరగతి గదులు ఉన్న బడులు మూతలువడి పశువులకు, అసాంఘిక కార్యక్రమాలకు నెలవై పాయే అని మదన పడుతూ ,  ఆనాడు మనం ఎంత చెప్పినా,  ఎహ ! వీళ్ళు గిట్లనే అంటరు అని లెక్కజెయ్యక పాయిరి .  ఇదే ముచ్చట మనం ఇప్పుడంటే ,   మా తప్పు ఏమున్నది? సర్కారు విధానాలు చెయ్యంగనే బడులు మూతలువడుతున్నాయని బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నరు అన్నడు.   కాదా మరి సర్కారుది ఏమీ తప్పే లేదా అని నేను మాట్లాడంగానే గయ్యిమని ఇంతేత్తున లేసిండు. అరే భై సర్కారంటేనే గట్లుంటది , ఎంతసేపు ఒకవిషయాన్ని ,  ప్రజలకు అందకుంటా జేసి దాన్ని అందేటట్లు చేయడానికి తాను చాలా ప్రయత్నం చేస్తున్నట్టు నాటకం ఆడుతది , కానీ ఆ రంగం లో పనిజేస్తున్న వాళ్ళకు సోయి ఉండాలే కదా అన్నడు. సోయి అంటే ఏమి చేయాల్సి ఉండే అంటవ్ అన్నా. ఏ రంగం ఐనా బతికి బట్ట కట్టాలే అంటే ఆ రంగం లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు ఆధునికం అవుతూ తన ఆచరణకు  పదును పెట్టుకుంటూ అమలు తీరు ప్రయోజనకంగా ఉందా లేదా అని తనకు తానే పరీక్ష పెట్టుకోవాలే అన్నడు.  అంటే ఎట్లా అని అడిగిన.
రైతు మారుతున్న ఋతువులకు అనుగుణంగా తన  పంటను మార్చుకుంటూ , ఆ పంట వేయడానికి దుక్కి తయారు జేసేకాన్నుంచి ఎలాంటి విత్తనం ఎంచుకోవాలే , అడుగు పెంట ఏమి వెయ్యాలే, ఎంత మాసర వెయ్యాలే, నీటి అవసరం ఎంత ఎన్ని రోజులకు పంటకు వస్తది , అన్న విషయాల పట్ల ఒక సమగ్రమైనా అవగాహనతోటి పంట వేస్తడు , ఏడాదికి ఏడాది పంట తీస్తనే ఉంటడు . ఒక్క ఏటి పంటకోసం పెద్దగా చదువుకొని ఒక రైతే ఇంత పకడ్బందీ గా పని జెస్తుంటే ,  అట్లాంటిది , సార్లు డిగ్రీలకు డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు చదువుతరు , భావి తరాల కు జీవితాంతం పనికి వచ్చే చదువుల పట్ల ఎంత శ్రధ్ధ ఉండాలే అన్నడు. నిజమే కానీ వాళ్ళ చేతుల ఏముంటది చెప్పు, సర్కారు ఏది చెప్పుమంటే అది చెప్పాలే, ఎట్లా చెప్పుమంటే అట్లా చెప్పాలే, సార్లు లేకున్నా తరగతి గదులు లేకున్నా అతని బాధ్యత కాదుగదా అన్నాను. ఆయన నవ్వుకుంటా " బండి ఇరుగుతే ఎడ్ల గాయొచ్చు"  అనుకునే పటికేనే ఇట్లా అయింది. అనుకుంటూ తన అనుభవం , తాను పనిజేసిన బడి, పిల్లల స్తాయి ఏకరువు పెట్టిండు. అది సరే కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనే ఒక జాడ్యం బాగా ప్రబలి పోయింది కదా అన్న. అవును అయితే కావచ్చు.  ఇంగ్లీష్ మీడియం కంటే మాతృభాష లో చదువు ఐతే  విద్యార్థులకు నేర్చుకోవడానికి ఎంత సులభమో  ప్రజలకు అర్థం చేయించాలి . కాదు , కాదు మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని ప్రజలు కోరితే ఉపాధ్యాయులు ఆ మీడియం లో బోధించడానికి సిద్ధపడాలే గానీ మేము ఆ మీడియం లో చదువుకోలేదు, మేము చెప్పలేము అంటే ఇగో ఇట్లనే ఉంటది అన్నడు.

అది అంతా తేలిక అయిన విషయం కాదు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే డీ ఈడీ , బీ ఈడీ , లు కూడా వాటి విధానాలు మార్చుకోవాలే ,  ఎస్సీ ఆర్ టి , ఎన్ ఎస్ ఇ ఆర్ టి లు కూడా వాటి వాటి విధానాలు మార్చుకోవాలాయే , సర్కారు పనులు అన్నీ శాష్ట్రీయంగా ఉండాలే నాయే , అదే ప్రైవేట్ అంటే దాని యజమాని ఇస్టమ్ . సర్కారు అంటే అట్లా కాదుగదా ఆనంటూ  దీనికి ఏమి జవాబు చెప్పుతవ్ అన్నట్టు ఆయన వైపుజూసిన .

ఇగో చూడూ! , పంట సరిగా వచ్చేటట్టు లేదూ,  అనుకుంటే రైతు ఏమి జేస్తడు ? , దానికి పూతలువెట్టుకుంట, సవరదీసుకుంటా  కూసోడు, ఏదైతే గదే ఆయే అని తెగువ జేస్తడు , పంటతోటే , భూమి తోటే లడాయి మొదలు వెడుతడు. ఈరుమారు మొత్తం ఉన్నకాడికి దున్ని పారేసి ఇంకో పంట వేసి ఫలితం రాబట్టే ప్రయత్నం జేస్తడు  , ఇదిగూడా గంతే .  సార్లు అందుకు తయ్యారుగుండాలే , గుండె ధైర్ణం కావాలే, అందరినీ కూడగట్టే నేర్పు ఉండాలే  అని ముగించిండు .

Tuesday, March 21, 2017

మహా పథం కవితా సంకలనం పైన విశ్లేషణ.

                                       
                                                         

కవి తన,  నా మాట లోనే తాను ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నాడో చెప్పుకున్నాడు. " తెల్లారింది మొదలు డబ్బుకోసం పరుగు పెడుతున్న మనిషిని మనీషిగా నడిపించాలంటే మరణాన్ని గుర్తుచేయడం మినహా మరో మార్గం లేదు " అంటాడు. సంపద,  అధికారం, హోదా , వెంపర్లాట లో మనిషి తనకు తానుగా ధ్వంసం అవుతూ సాటి  మనుషులకు భారమౌతూ సకల విలువలను సమాధి చేస్తూ "ఇదే  బతుకంటే " అన్న భ్రమలల్లో బ్రతుకుతున్నమనుషులను  నేలమీదకు దించి,  అయ్యా ! బతుకంటే ఇది బిడ్డా  , అని వెన్నుచరిచి చెపుతున్న   పదాల సమాహారమే ఈ కవితల సముదాయం.

భూగోలాన్ని బడబాగ్ని ముంచెత్తినప్పుడు అంతా అయిపోయింది ఇక ఏమీ మిగులలేదని దిగులు చెందుతున్నతరుణం లో  ఒక ఆశా కిరణమై " నేను లేనని,   కానే కానని,  కూలానని ,  కాలానని ,  ఏడ్చువారికెల్ల, ఇదుగో ఇక్కడే ఉన్నానని,   ...సర్వవ్యాప్తమై , " అని అంటాడు కవి , నిరాశోపహతులకు ఒక ఆశా అంకురం  గా ఉంది మొదటి కవిత ఉంది . " ఎవరు నేను?" లో మనిషి , జీవన యానాం ఎంత వ్యథ భరితమో వివరిస్తూ అవన్నీ దాటుకుంటూ " ఏ తీరం చేరాన్నేను ,  దారులన్నీ దాటుకుంటూ " అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు ఉన్నా కూడా అది సమాజమంతటినీ ఇంత తండ్లాడి మీరు సాధించింది ఏమిటి అని ప్రశ్నించిన తీరు సూటిగా బాణం వేసినట్లు ఉంది.  "నేను" కవితలో , ప్రతిమనిషి పంచభూతాల సృష్టి యని , " పదార్థ యదార్థ ,  శక్తిని నేను ", అంటూ సృస్తి రహస్యాన్ని అతి తక్కువ మాటల్లో , ఎంత గొప్ప భావాన్నైనా ఎంత సులభంగా వ్యక్తీకరించవచ్చో నిరూపించి చూపాడు. సైన్స్ స్టూడెంట్ కవి అయితే ఎలా రాస్తాడో మనం "ఎటుకేసి" లో చూడవచ్చు . ఏ సైన్స్ అయినా తత్వ శాస్త్రం లో ఎలా ఒదిగి పోతుందో చూపెడుతూ ,ఎటునుండి ఎటు పోతున్నానో ఎందుకు పోతున్నానో అంటూ తనను తాను ప్ర్సశ్నించుకుంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు.  

"కుప్పకూలిన యంత్రాన్ని" . చాలా అత్యద్భ్తమైన కవిత. " బాలుడినై బతికి ,  యువకుడినై ఉరికి , నడివయసున నడిచి,  అలసి సొలసిన,  నా దేహమిప్పుడు , కుప్పకూలిన యంత్రం." ప్రాణి పుట్టుకను గమనాన్ని  చాలా సహజంగా గతితార్కిక కోణం నుండి చక్కగా కవిత్వీకరించారు. ఆహారమంటే మన్నే, పంచబూతాలే, చలనం ,చైతన్యం కూడా పంచబూతాలే  అని అరటిపండు ఒలిచి తినిపించినంత సులభంగా కవిత్వీకరించాడు,  " మహా ప్రస్థానం" , చాలా గొప్ప వ్యక్తీకరణ. కండ్లముందర కదలి సాగుతున్న జీవన యానాన్ని కళాత్మకంగా , సృజనాత్మకంగా అదీ జీవ పరిణామక్రమ  కోణం నుండి శ్రమ విభజన కోణం నుండి చెప్పడం గొప్పగా ఉంది. ముగింపులో  "చల్లని కట్టెగా " మారకుండా ,చితిమంట లో చిదుగు అయినా బాగుండేది.

"నేనొకన్ని " కవితలో , ప్రశ్నిస్తూ పోవడం మాత్రమే గాదు అంటూ " చీలిన మనుషుల,  పేలిన మనుషుల ,  అతికించాలని,  బతికించాలని, విడిపించాలని ,  నడిపించాలని " పరిష్కారం కూడా చూపించాడు. "ఎక్కడ మీదైవమ్ " లో దేవుని ఉనికిని సూటిగా ప్రశ్నించి అందరినీ ఆలోచిపజేశాడు .  రోజూ ఆయిన గుడి ముందు ఆయన నామ స్మరణజేస్తూ  చిప్పవట్టుకొని అడుక్కుంటున్న ఒక్క యాచకుని బతుకు కూడా మార్చలేని ఆ దేవుడు నీవు ఒక్కరోజు గుడికి వెళితే నీ బతుకు మారుస్తాడా అన్న సినిమా డైలాగు ను గుర్తుచేస్తు " బ్రహ్మ లిఖితమని,  కర్మఫలితమని.  జాతక ముహూర్త ,  గ్రహ గృహ బలమని , స్వర్గం నరకం , మోక్షం అంటూ ,  రంభా ఊర్వశి,  మేనకలంటూ ,  పబ్బం గడిపే , నయవంచకులకు," అని తెగడిన పదాలు చదువుతుంటే , సి. వి . రాసిన సత్యకామ జాబాలి కావ్యం ను గుర్తు జేసింది ఈ కవిత,  " సోక్రటీసును వస్తున్నా " దీర్ఘ కవిత,  ఆహా ! " కల్లబొల్లి పురాణాల,  రంకుల రామాయణాల ,  బొంకుల జయభారతాల ,  బూటక జీబ్రేలు కథల, బైబిల్లా, ఖురానులా,  గీతల భాగవతాల ను , త్యజియించితే తప్పు ఎట్ల " హేతువుకు అందని కాకమ్మ కథల ను పోస్ట్మార్టం చేసిన కవిత. అలాగే " లేడు రాలేడు " కవిత కూడా దేవుని ఉనికిని ప్రశ్నించేదే! ఒకవైపు దేశమంతా కాషాయీకరణ , సనాతన సంప్రాదాయం అంటూ తిరోగమణ బాట పడుతున్న చారిత్రక సందర్భం లో ఇలాంటి కవితా సంపుటి రావడం,  1970 దశకం లో  విప్లవోద్యమాలు పురిటి నొప్పులు దీస్తున్నా కాలం లో  సత్యకామ జాబాలి రావడం అనేవి ఆషామాషీ  గా వాటికి అవే గాలిలో నుండి పుడుతున్నవి కాదు. మనుషుల  దుఖం కుమ్మరాము మసిలినట్టు మసిలి వచ్చిన మనోవేదన ఫలితమే ఈ మహా పథం.

" అడివినంత నరికించి ,  కలపనంత దాటించి ,  గుట్టను రాళ్ళను జెసి.  రాళ్ళను గుట్టలుగ పోసి ,  ఇసుకంతా కుప్పేసి.  మట్టంతా పోగేసి,  కుప్పెసీ పోగేసీ,  ఊడ్చేసీ అమ్మేసీ,  ఛీ ఛీ ఛీ ". ఆనంటూ , వనరుల ధ్వంసాన్ని కవి అసహ్యించుకుంటున్నడు . మార్కెట్టూ , దలాల్ స్ట్రీట్ మాయాజాలాన్ని కడిగేసినాడు. " బక్కచిక్కి బిక్కజాచ్ఛి , బతుకుతావుర పిరికిపంద, బలిసినోడి కాళ్ళకింద,  బానిసోడా ఏమి బతుకుర." అని నిలబడి కలబడాలని కవి పిలుపునిస్తాడు. " ఎవడి పీఠం " , " చెప్పగలవా ? " లాంటి కవితలు అధికారాన్ని ప్రశ్నిస్తూనే , వ్యవస్తలోని అసమానతలను సహేతుకంగా ఎత్తిచూపుతున్నాయి. "పల్లె చితికి ." కవిత  ప్రపంచీకరణ విధ్వంసం పల్లెను ఎలా కొల్లగొట్టిందో వివరిస్తుంది. మొప్పలు ఊపుతున్న యుధ్ధభయాన్ని గురించి ఉద్వేగంగా చెపుతాడు కవి." రణాపరావతాలు " లో యుధ్ధ రహస్యాలను బద్దలు కొడుతాడు.    వసంత మేఘాన్ని వదిలి పెట్టలేదు, మల్లెప్పుడొస్తారని మరువకుండా పిలుస్తున్నడు.

బిగ్ బ్యాంగ్ థీరీ నుండి, పదార్థం పుట్టుకనుండి, డార్విన్ పరిణామ క్రమం నుండి,పదార్థమే ప్రధానం అనే సిద్ధాంతాల నుండి మొదలిడి ,  ఆత్మ పరమాత్మ సిద్దాంతాల నుండి ద్వైతం , అద్వైతం, క్రీస్తు, అల్లా ల దాకా భావం ప్రధానం అనే సిధ్ద్ధాంతాల వరకూ ఒక శాస్త్రీయమైన విశ్లేషణ తో సాగిన కవిత్వం ఈ మహాపథం అనే కవితా సంకలనం. కవితా వస్తువు అసామాన్యమైంది అయినప్పటికీ అందరికీ అందుబాటులోకి తేజూసిన ప్రయత్నం అభినందనీయం. భాష మాత్రం కొంత కఠినంగా ఉన్న మాట వాస్తవం. ఇంకా సరళమైన, అందరికీ అర్థమైన పదాలు  వెదుకులాడి ఉపయోగించగలిగితే ఇంత కస్టపడి ఇన్ని విషయాలు ఒక్కదగ్గర చేర్చిన దానికి మరింత ప్రయోజనం ఉండి యుండేది. రాజ్యాంగం లో రాసుకున్న సమ సమాజ సాకారం కోరుకుంటున్న ఉద్యమాభిమానులు అందరూ తప్పకుండా చదువ వలసిన మంచి  పుస్తకం " మహా పథం ". కవి చిల్ల మల్లేశం .

Sunday, March 19, 2017

ఇంటిమీదెవుసమ్ 36

                                                         

ఆకుకూరలు అన్నీ అయిపోయినై. మల్లా కొత్తగా విత్తనాలు వేసిన. విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు నీళ్ళు చేతి తో చల్లడం వలన అప్పుడే పుడుతున్న లేత మొలుకలు చనిపోతున్నాయని , నీళ్ళు నిదానంగా పడే కొరకు  వాటరింగ్ గార్డెన్ బకెట్ ఒకటి కొని తెచ్చుకోవడానికి గంజ్ లకు పోయిన . అక్కడ  మా డిగ్రీ క్లాస్ మెట్ దుకాణం ఉంటే అతని వద్ద కూర్చొని నా అవసరం చెప్పిన. ఆయన  కరీంనగర్ గంజ్ ల చాలా పేరున్న పెద్ద సేటు . చాలా రోజుల తర్వాత కల్సినవన్నా పొదువు గాని కాసేపు కూర్చో అని "  ఏమి చేస్తున్నవ్ రిటైర్ అయిన తర్వాత " అని అడిగిండు. ఇప్పుడైతే ఇంటిమీద నాలుగు మడులు తయారు జేసుకొని కూరగాయల సాగు  , ఎవుసమ్ జేస్తున్న అని చెప్పిన. ఒక్కటే నవ్వుడు. గీ ఎవుసమ్ జేసుడు ఏందన్నా! భలే గమ్మతి జెప్తున్నవ్ , అన్నడు . ఈ కూరగాయల మొక్కలు ఎంత గొప్పవో, ఆరోగ్యానికి ఎంత మంచివో, అమృత తుల్యమైన ఆహారం భుజించడానికి ఇవి ఎంతగా  ఉపయోగ పడుతున్నాయో చెపుతూ ఇవన్నీ మీకు తెలియవని కాదు గాని శ్రధ్ధ పెడితే ఎవరైనా ఈ పని చేయవచ్చు అని అంటూనే మార్కెట్ లో మనం కొని తెచ్చుకుంటున్న కూరగాయాలు, ఆకుకూరల పైన విషతుల్యమైన పురుగు మందులు, అడుగు మందులు మన ఆరోగ్యాలకు ఎంత హాని చేస్తాయో వివరించిన . మీకు ఇది గూడా తెలిసే ఉంటది ఎందుకంటే ఆ మందులు అమ్మే దుకాణాలన్నీ మన గంజ్ ల చుట్టుపక్కలల్నే ఉన్నయి గదా అని చెప్పిన.  , నిజమే ఈ విషయాలన్నీ ఇంత వివరంగా ఇంత చదువుకున్న నా లాంటి వాల్లకే ఇంతవరదాక పూర్తిగా తెలియదు. ఈ విషయాలన్నీ అందరికీ తెలియ జేసే కార్యక్రమం ఏదైనా ఉంటే బాగుండు అన్నడు. దాదాపుగా టి వి లల్లో వార్తా పత్రికలల్లో అనేకంగా వస్తున్నాయి, ఆ దృస్టి తో ఉన్న వారికే మాత్రమే అవి కనిపిస్తాయి కాబోలు అనుకున్నాను.  

ఆయన అన్నట్టు నిజంగానే ప్రభుత్వం అయినా ఈ విషయాలన్నీ ఒక ప్రచార కార్యక్రమం చేపట్టి వినియోగదారులకు చెప్పుతే బాగానే ఉంటది. ఉద్యాన వన విభాగం వాళ్ళు తోటలు పెంచుమని అంటున్నారు గాని ఆర్గానిక్ ఆహార పదార్థాలు తింటే మంచి రుచి తో బాటు ఆరోగ్యానికి ఎంతమంచిదో  వినియోగ దారులకు వివరిస్తే ప్రజలను దవఖానలకు దూరంగా ఉంచినవాళ్లు అవుతారు కదా అనిపించింది. కానీ సర్కారు అనేదానికి ప్రజల ఆహార ఆరోగ్యాల కంటే గూడా వాటితో వ్యాపారం జేసే వాళ్ళ ప్రయోజనాలు అంటేనే చాలా ఇస్టమ్ . ఎందుకంటే రేపు ఓట్లు వేసేది ప్రజలే అయినా అవి కొనుక్కోవడానికి అవసరమైన డబ్బులు ఇచ్చేది వాళ్ళే కదా మరి.

సరే సర్కారు సంగతి పక్కనబెడుదాం, మన ఆరోగ్యాని కోసం, మన ఆనందం కోసం, మన ఆహారం కోసం మనం ఎవరిమీదనో ఎందుకు ఆధార పడాలి ?  మనం పెరటి తోట, వంటింటి తోట, పెంచుకోవడం ఏమంత పెద్ద విషయం గాదు . ఎంత చిన్న జాగా ఉన్నా కూడా మనం ప్రయత్నం జేస్తే  మన కుటుంబానికి ఓ రోజుకు సరిపడా ఆకుకూర లభిస్తుంది. ఖాళీ ప్లాస్టిక్ బాటల్లు కూడా ఇక్కడ సద్వినియోగం జేసుకోవచ్చు. కావలసినది కాసింత శ్రధ్ధ్ద పట్టుదల మాత్రమే. అందుకని అవకాశం లేదనే కారణం తో ఈ ఆలోచన పక్కన పెట్టకుండా ప్రయత్నించి చూడండని  అందరితో కోరుతున్నా.

Thursday, March 16, 2017

యాది - మనాది 3

                                                 

భూమయ్య సార్ ఉన్నప్పుడు ఒకసారి మేమిద్దరం కలిసి సర్వాయి పాపన్న జీవిత చరిత్రమీద ఒక పరిశోధన గ్రంధం రాద్దామని అనుకున్నము . అప్పటికే కొంపల్లి వెంకట్ గౌడ్ పాపన్న పైన ఒక మంచి పుస్తకమే తెచ్చి ఉన్నాడు. కానీ  కర్ణాటక ప్రభుత్వం తన విశ్వవిద్యాలయాలల్లో టిప్పుసుల్తాన్ చరిత్రను పాఠ్యాంశం గా చేర్చడానికి కారణమైన పుస్తకం స్తాయి లో సర్వాయి పాపన్న పైన సాధికారికమైన పరిశోధనాత్మక పుస్తకం తెచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఒక బహుజన వీరుడు " భారత దేశపు తొలి ప్రజాస్వామిక విప్లవ వీరుని " గా ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు బోధించే పరిస్తితిని తేవాలని అనుకున్నాము. దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని ఒక పెద్ద చర్చే జరుగుతున్నది అప్పటికే. అందుకని రాజ్యాధికారం అంటే ఏమిటి ? రాజ్యాధికారం ఎందుకోసం దళిత బహుజనులకు కావాలో , చరిత్రలో దళిత బహుజనులకు రాజ్యాధికారం ఎప్పుడూ రానే లేదా ? వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారు? మరి ఇప్పుడు వస్తే ఏమి చేస్తారో చెప్పే స్పస్టమైన ఎజెండా వారికి ఉందా ? ఏ ఎజెండా పైన రాజ్యాధికారం కోసం దళిత బహుజనులు డిమాండ్ చేస్తున్నారు ? దళిత బహుజనులకు రాజ్యాధికారమే ఏకైక ఎజెండానా ?  దానికి  చరిత్ర లో ఛత్రపతి శివాజీ, సర్వాయి పాపన్నలు ఏమి చేశారో శాస్త్రీయ ఆధారాలతో నిరూపించే  పరిశోధక పుస్తకం పుస్తకం తేవాలన్నది ఆయన సంకల్పం. దానికి ఇద్దరం కలిసి పనిజేయాలని అనుకున్నాము. దానికి ఆరంభము గా ఆయన " భారత తొలి ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న " అంటూ ఒక వ్యాసం రాసిండు. అది ప్రింట్ మీడియా లో కూడా వచ్చింది. అయితే అనుకున్న  ఆ పని పూర్తిచేయకుండానే అర్ధాంతరంగా ఆయన వెళ్లిపోయిండు . . ఆ క్రమం లో మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలు, చర్యలు , నాకు యాదికి ఉన్నంత వరకు అందరితో పంచుకోవాలన్న తపన తో ఇది రాస్తున్నాను.  

సర్వాయి పాపన్న కు సంబంధించిన ఏ ఆనవాలు కూడా మిగులకుండా  ఆనాటి హైందవ, మహ్మదీయ పాలకులు వెదికి వెదికి ధ్వంసం చేశారు. చివరికి ఆయన చిత్రపటం గూడా పేర్వారం జగన్నాధం గారు లండన్ మ్యూజియం నుండి తెచ్చే దాకా ఆయన ఆనవాలు జానపదుల గొంతుల్లో తప్ప ఎక్కడా ఏమీ లభించనంతటి విధ్వంసం , భయోత్పాతాన్ని సృస్టించి గానీ వదిలివేయలేదు. ఆ ఫోటోను  కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళక పోయి ఉండి  ఉంటే ఇక్కడి రెడ్డి, వెలమ, బ్రాహ్మణ పాలకవర్గాల వారి ప్రతినిధులు ఆ చిత్రపఠాన్ని గూడా చింపివేసి ఆనవాలు లేకుండా చేశామని చంకలు గుద్దుకొనే వారు కదా అని మేము అనుకున్నాము. ఎందుకు వాళ్ళకు అంత కసి ద్వేషం అని నేను ప్రశ్నించినప్పుడు , భూమయ్య సారు చెప్పింది ఏమంటే , భగవత్ గీత లో బ్రాహ్మణులు కృష్ణభవానుని తో చెప్పించిన " చాతుర్ వర్ణం మయం సృస్టీ , గుణ కర్మానుసారమ్ " అన్న విషయాన్ని గుర్తు జేసి , శూద్రులు సేవక వృత్తులవారు మాత్రమే . వారు రాజ్యాధికారానికి అనర్హులు , అని బ్రాహ్మణ భావజాలం బలంగా నమ్ముతుంది. కనుక కడ  జాతి వాడు రాజ్యాధి కారి ఐతే మను ధర్మ శాస్త్ర ప్రకారం శిరచ్ఛేదన విధించాలని వారి విశ్వాసం . కనుకనే కడజాతి వాని నాయకత్వమే కాదు, వానికి ఆస్తి హక్కు గానీ , ఆయుధధారణ హక్కు గానీ ఉండబోదని వారి శాస్త్రాల్లో రాసుకున్నారు. అందుకనే చాలా కాలం దాకా శూద్రులకు ఏ హక్కులు లేకుండేటివి . బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవజేసుకోవడమే వారికున్న హాక్కులు. ఐతే  9 వ శతాబ్దం లో కాకతీయ రాజుల కాలం లో యుధ్ధ అవసరాలకొరకు బలశాలురు అయిన కొందరు శూద్రులను శుధ్ధ శూద్రులు గా పుణీకరించి సైన్యం లో చేర్చుకున్నారు. అట్టి వారిలో వెలమలు గా చెలామణి అవుతున్న పద్మనాయకులు, రెడ్లు గా చలామణి అవుతున్న వ్యవసాయాధారులైన కాపులు అని చెప్పారు.అప్పటి నుండి ఈ రెండు సామాజిక వర్గాలకు ఆయుధ హక్కు, ఆస్తి హక్కులు సంక్రమించాయి. అయితే వీరు తమ మూలాలు మరిచిపోయి రాజును మించిన రాజా భక్తి తో శూద్రులను అణిచివేయడానికి ముందు వరుసలో ఉన్నారు అన్నాడు. ఇక్కడే ఆయన నాకు శివాజీ పట్టాభిషేకానికి పూనా బ్రాహ్మలు నిరాకరించిన కథ చెప్పారు. ఔరంగా జేబు తో అనేక యుధ్ధాలు జేసి ఎన్నో కోటలను స్వాధీనం చేసుకున్న తర్వాత తాను పట్టాభిషేకం  చేసుకొని సింహాసనాసీనుడు కావాలని భావించి , తల పైన కిరీటం బ్రాహ్మణుడే పెట్టాలనే నియమం ప్రకారం బ్రాహ్మణుడిని ఆహ్వానిస్తే , పూణే లోని బ్రాహ్మలు అందుకు నిరాకరించి నపుడు కాశీ నుండి లక్ష వరహాలిచ్చి పండితుణ్ణి రప్పించి పట్టాభిషేకం చేయించుకుంటాడట . అలా ఎలా జేస్తారని పూనా పండితులు ప్రశ్నిస్తే శివాజీకి రాజ అంశ ఉంది కనుకనే ఆయన రాజయినాడు. అని అంటూ సూర్యవంశం వారసుడని వరుస కలిపారట . ఆ లక్ష వరహాలు మాకే ఇస్తే ఈ మాత్రం పని మేము చేయక పొదుమా అని నిస్టూరమాడితే ,  మీరేందుకు నారాజు అవుతారని శివాజీ , పూనా పండితులకు కూడా 50 వేల వరహాలు ఇచ్చి సాగనంపాడట అని చెప్పాడు .

సర్వాయి పాపన్న జీవించి ఉన్న కాలం లో ఫ్రెంచ్, ఆంగ్లేయుల చరిత్రకారులు ఇక్కడ పర్యటించిపోయి ఉన్నారు కనుక ఆయా దేశాల పురా వస్తు ప్రదర్శన శాలల్లో గానీ , మ్యూజియం లల్లో గాని పాపన్నకు సంబంధించిన విషయాలు లభించ వచ్చు కదా అన్న ఆలోచనలతో ఆ రెండు దేశాలకు వెళ్ళి రావాలని అనుకున్నాము. ( సశేషం )

ఇంటిమీదేవుసమ్ 33

                                               

మొన్న 4 మార్చ్ నాడు మా వాకింగ్ మిత్రులం అందరం కల్సి రాజస్తాన్ లోని చారిత్రక ప్రదేశాలు చూద్దాం అనుకొన్నం గాని అనివార్య కారణాల వలన నేను పోలేకపోయాను. ఐతే ఈ సందర్భంగా నా ఉపాధ్యాయ జీవితం లోని ఒక అనుభవం గుర్తుకు వచ్చి మీతో పంచుకుందాం అని చెబుతున్నాను. అది నేను అలుగునూర్ లో పనిజేస్తున్న రోజుల్లో విద్యార్థులతో ఎక్స్ కర్షన్ కార్యక్రమం ఏర్పాటుచేసిన సందర్భంగా విద్యార్థులను మోటివేట్ జేసే బాధ్యత నాదైంది.  హైద్రాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం , కొల్కొండ ఖిలా, ఛార్మినార్, హుస్సేన్ సాగర్ గురించి కొంచెం అద్భుతంగానే చెప్పిన. రాయేష్ (పేరు మార్చిన ) అనే విద్యార్థి చాలా శ్రద్ధగా వింటూ తన డౌట్స్ గూడా క్లియర్ చేసుకున్నాడు. క్లాస్ లో ఆవేరేజ్ స్టూడెంటే కానీ ఈ విషయం మాత్రం చాలా జాగర్తగా వింటుంటే ఈ అబ్బాయి తప్పకుండా వస్తాడని అనుకున్న. . అనుకున్నట్లే అందరికంటే ముందుగా తన పేరు లిస్ట్ లో రాయించుకున్నడు . కానీ తీరా బయలుదేరే సమయానికి రాలేదు. ఆరా దీస్తే వాళ్ళ ఇంట్ల వద్దన్నరని తెలిసింది. సరే లెమ్మనుకొని మేము వెళ్ళిపోయినమ్.

తిరిగి వచ్చేవరకు రాయేష్ కుటుంబ సభ్యులు మా పోలగాడేడని లొల్లికి వహ్చిండ్రు. " అరె ! మాతోటి రాలేదు గదా అని మేమూ ,మాతో   వచ్చిన పిల్లలు గూడా చెప్పిండ్రు. ఊరి వాళ్ళు సైతం  బస్సు వెళ్ళి పోయినంక గూడా మీ పోలగాడు మీ ఇంట్ల నే ఉండే గదా ? వద్దనే తోలియ్యకుంట  లొల్లిజేసే , ఇప్పుడు సార్లు అదుగో ఉన్నరా ?  , సార్ల మీద లొల్లిజేసుడు సరిగాదు ఆనంగానే చేసేది ఏమి లేక ఊకున్నరు . ఎక్కడ వెదికినా దొరుకలేదు అన్నరు . మా లొల్లిల మేము పడిపోయి మార్చే పోయినం .

2014 ల ఒక నాడు రాయేష్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు వచ్చి మేము మేము గెట్ టు గెదర్ పెట్టుకుంటున్నం, అప్పటి సార్లను అందరినీ పిలుస్తున్నాం మీరూ  రావాలే అంటే పోయిన. నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక తెల్ల కారు కొంచెం హై ఫై ది ఆఫీసు ముందుఉంది. నన్ను చూడంగానే పిల్లలు బిల బిల మని చుట్టూ చేరిండ్రు. నేను పిల్లలు అంటున్నా గాని వాళ్ళు నాకు అప్పటి పిల్లల తీరు కనిపించినా వాళ్ళంతా పిల్లలకు తలిదండ్రులు అయిన వాళ్ళే. అందరూ దగ్గరికి వచ్చి నేను ఫలానా, నేను ఫలానా , గుర్తు పట్టింద్రా సార్ అంటే  " అరే ! అప్పుడే మర్చిపోలేదు లే " అని చెబుతున్నా. ఇంతల ఒక విద్యార్థి వచ్చి ' ఈనే ఎవరో చెప్పుండ్రి " సార్ అన్నడు ."  ఊహూ యాదికి వస్తలేడు " అన్న . ఇతడు రాయేష్ సార్ అన్నడు. " అరే! నువ్వా , బాగున్నావా , ఇంటికి ఎప్పుడు వచ్చినవ్ ఎట్లా వచ్చినవ్ " అంటే సార్ మీతోని మాట్లాడాలే సార్ అని పక్కకు తీసుక పోయిండు . ప్రోగ్రామ్ ఇంకా మొదలవ్వలేదు కనుక మా మీటింగ్ ఎవ్వరికీ ఇబ్బంది కాలేదు.

రాయేష్ తన కథ చెప్పుడు  మొదలువెట్టిండు . వాళ్ళ నాయినలు నలుగురు అన్నదమ్ములట. వాళ్లందరి కి కలిసి ఇతనొక్కడే సంతానం అట. ఉమ్మడి కుటుంబం. చాలా గారాబంగా చూసేవాల్లట ఇంట్లో. అంత దూరం ఎక్స్ కర్షన్ పోతే ఎక్కడ తప్పిపోతడో అని భయపడి పంపలేదట. నేను చెప్పిన ఆకర్షణీయమైన మాటలు విన్న తర్వాత ఎట్లనైనా అవి చూడాలే అన్న పట్టుదల కలిగిందట. మా బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి ఏడ్చి కండ్లు తుడుసుకుంట ఇంట్ల నుండి బైటికి వస్తే వీడింకెక్కడికి పోతడని వాళ్ళు పట్టించుకోలేదట , ఇదే సందని,  ఆటో ఎక్కి కరీంనగర్ వచ్చి అక్కడ హైద్రాబాద్ బస్సెక్కి జేబుల ఉన్న డబ్బుల తోటి టికెట్ కొనుక్కొని సీట్ల కూర్చొని అట్లనే నిద్ర పోయిండట. హైద్రాబాద్ ల అందరూ దిగిపోయిండ్రా లేదా అని కండక్టర్ చూసుకునే సరికి , వీడు కనిపిస్తే నిద్ర లేపి దింపివేసిండట. మా ఓల్లు వచ్కింది ఇక్కడికే కదా , వాళ్ళ బస్సు ఇక్కన్నే  గదా ఉంటది,  అని వెతుక్కుంట , వెతుక్కుంట , మోయింజాహీ మార్కెట్ కాడికి వచ్చేసరికి బాగా రాత్రి అయిపోయి దుకాణాలు మూసి వేసిండ్రట . ఒకమూసి ఉన్న  షట్టర్ ముందు కూర్చొని వచ్చిపోయే బస్సులల్ల మా బస్సు ఉంటదేమో అని చూసుకుంటా చూసుకుంటా అట్లనే నిద్ర పోయిండాటా. పొద్దుగాల దుకాణదారు లేపే దాకా తెలివి కాలేదట. లేసిణాంక బాగా దుక్కం వస్తే ఎక్కేక్కి పడి ఏడిస్తే దూకాణదారు ఊకో వెట్టి చాయ్ దాగిచ్చిండట . తన సంగతి చెప్పుతే తనను  ఏమిజేస్తరో అని భయపడి ఏమడిగినా ఏమి చెప్పకుంట మౌనంగా ఉన్నడట . కాసేపటికి అక్కడ పండ్ల బుట్టలను  కూలోళ్లతో బాటూ తానూ పెట్టవలిసిన చోట పెడుతూ పోయిండట .  మధ్యాహ్నం దుకాణా దారే హోటల్లనుండి అన్నం తెప్పిస్తే తిన్నడట . రెండుమూడు రోజులు బస్సులను పరిశీలిస్తూ పండ్ల బుట్టల పని జేస్తూ ఉండే సరికి అదే మంచిగ అనిపించి అక్కన్నే ఉందామని డిసైడ్ అయిండట. ఉర్దూ, భాష ల ఆర్ పార్ అయి హైద్రాబాద్ ఆనుపాణాలు , నగరం నఖురాలన్నీ ఔసోపన పట్టి  దుకాణా దారుకు నమ్మకమైన మనిషిఅయిండట .  తర్వాత ఒక రోజు యజమాని ఇతని వివరాలన్నీ అడిగి ఇంటికి పోవాలే ఇది పద్దతి గాదూ అంటే ఆరెండ్ల తర్వాత తిరిగి అలుగునూర్ వచ్చిండట. వచ్చేవరకు ఇక్కడ కరీంనగర్ నగరపాలక సంస్త అయినందున  రియల్ ఎస్టేట్ దందా మస్తుగా నడుస్తున్నదట. వస్తే వస్తే నే ఆ దందానే తనకు సరైందని భావించి అదే చేస్తున్నడట . ఆఫీస్ ముందట ఉన్న కారు తనదేనట . మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి 70 లక్షలు ఖర్చు చేసిన గాని రాజకీయ అనుభవం లేక గెలువలేక పోయిన అని అంటూ సార్ ఇప్పుడు చెప్పండి, మీరు షెహ్ బాస్ అని మెచ్చుకున్న ముందటి బేంచి వాళ్ళు ప్రయోజకులు అయినట్టా నేను అయినట్టా అని ప్రశ్నించిండు . కాసేపు ఆలోచనల వడ్డ . హార్వర్డ్  యూనివర్సిటీ ల చదువులు  మానేసి , వ్యాపారం ల పడ్డ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్,  ఫేస్ బుక్ యజమాని మార్క్  జుకర్ బర్గ్ లు వంటి వారే గొప్ప  ప్రయోజకులు  అని సమాజమంతా వేదాలు ఘోషించినంత స్పస్టంగా ఘోషిస్తుంటీ నా రాయేష్ ఎందుకు ప్రయోజకుడు కాకుండా పోతాడని భావించి నువ్వూ ప్రయోజకుడవే నాయనా అన్నాను. హాపీ గా నవ్వుతూ వెళ్లిపోయిండు .

ఇంటిమీదెవుసమ్ 35

                                                       

కోట్స్ గార్డెన్ నుండి తెంపుక వచ్చిన ఒక పుష్పగుచ్చం అందామా,  సరే అందాం ! " జీవనదులపై పరుచుకుంటున్న ఎడారి --
తరువాత విస్తరించడం జనావాసాల మీదకే " అని రమేశ్ బాబు సూదమ్ ..అంటున్నాడు. ఐతే చాలా మంది ఇదంతా ఏదో వట్టి ఊహా జనితం ఉబుసుపోని వాళ్ళు చెప్పే ముచ్చట్లు అని అనుకొంటున్నారు. ఎందుకు అంటున్నానంటే అప్పట్లో అంటే 1991 లో మన పాముల పర్తి వారు ప్రధాన మంత్రి అయి ఆర్థిక సంస్కరణల పేరుతోటి అంతా ప్రయివేటీకరణ చేస్తున్నప్పుడు మేము ఏ పి టి ఎఫ్ అనే ఉపాధ్యాయ సంఘం లో పనిజేస్తుండే వాళ్ళం.  మన పాఠశాలలు గూడా అన్నీ ప్రైవేట్ అయిపోతాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం అని పిలుపు ఇచ్చినప్పుడు , సోదర సంఘాల వాళ్ళు , ప్రభుత్వాల చేతలను గుడ్డిగా నమ్మే వాళ్ళు , ప్రభుత్వాలు సామాన్య ప్రజల కొరకేగదా పాలన జేస్తున్నాయనీ నమ్మే అమాయక చక్రవర్తులంతా , వీళ్ళకు ఎక్కడ పని లేదు అన్నిటికి ఉద్యమాలు అంటరు, అని ఆడిపోసుకున్నరు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూతలువడుతుంటే " నిజమే నండి మీరు అన్నది " అంటున్నరు . అట్లనే ఇప్పుడు సూదమ్ రమేశ్ బాబు చెప్పింది కొందరికి నమ్మశక్యం కాక పోవచ్చు, కానీ పచ్చి పచ్చిగా ఉన్న నా  అనుభవం చెప్పుతా చదువండి.

మొన్న మార్చ్ 10 నాడు కరీంనగర్ లో బయలుదేరి గోదావరిఖని వద్ద గోదావరి నది దాటంగానే ఇందారం వద్ద ఓపెన్ కాస్ట్ ఘనులు స్వాగతం పలికినై, ఇందారం దాటి గోదావరి తీరం వెంట , వేలాల, పౌనూర్, శివ్వారం ఊర్ల కు వెళుతుంటే గోదావరి తీరం వెంట ఉన్న అన్నీ ఊళ్ళు ఇసుక క్వారీల లారీల తొక్కిడికి ఆవిసి పోయే ఉన్నయి . పౌనూర్ లో రాత్రి ఆగినం. అక్కడ మా అక్క ఉంటది . చిన్నప్పుడు మా అక్క దగ్గరికి పోతే గోదావరి నది లో ఈత కొట్టడం పెద్ద సంబురమ్ . దసరా నుండి సంక్రాంతి వరకు ఎప్పుడు పోయినా దుబ్బుల నాగయ్య మమ్ములను ఓడ ల కూసోవెట్టుకొని గోదావరి నది దాటించేది. గొదావరిలొ గంగ రొయ్యలు పట్టి మా అక్క వాళ్ళ ఇంటికి పంపేది దుబ్బుల నాగయ్య. ఇప్పుడు నాగయ్య చచ్చి పోయిండు, గోదావరి నది ధార కూడా చచ్చిపోయింది . తెల్లవారి పౌనూరులో బయలు దేరి శివ్వారం దాటి ఎల్ మడుగు పక్కపొంటి చెన్నూర్ కు పోయినమ్. ఎల్ మడుగు అంటే మొసళ్ళకు,  గంగ రొయ్యలకు ప్రసిద్ధి. అసోంటి ఎల్ మడుగులో మొసళ్ళు లెవ్వు , రొయ్యలు లెవ్వు, అడుగున అండుమట్టి పేరుకోని ,  ఉండవల్సిన ఇసుక తోడుక పోబడ్డది . చెన్నూరు పక్కన సుద్ధాల అనే గ్రామం ఉంటది. అక్కడ ఒక రోజు ఆగి చెన్నూరు వద్ద గోదావరి నది ల  పోసి ఉన్న మట్టి రోడ్డు( బ్రిడ్జి గాదు, ఉత్త మట్టిరోడ్డు పైన బస్సులు, కార్లు దాటుతున్నై)  ద్వారా గోదావరి దాటి కాళేశ్వరం పోయినమ్. తొవ్వ పొంటి ఏమి లారీలు , ఆ లారీల టైర్ల తొక్కిడికి దాంబర్ రోడ్ల మీద కంకర అంతా ఎవ్వరో తవ్వి పోసినట్టు కుప్పలు కుప్పలుగా , రాశులు రాశులు గా ఆనాటి అడివి తొవ్వలకంటే చాలా అధ్వాన్నంగా ఉన్నయి . పలుగుల, కుంట్లం, పూసుకు పెళ్లి, కాళేశ్వరం గ్రామాల ఒడ్ల పొంటి ఇసుక గుట్టలు , గుట్టలుగా పోసి ఉంది .కాళేశ్వరం ఊరు దాటిన తర్వాత గోదావరి ప్రాణహిత నదుల పైన కట్టిన వంతెన దాటి సిరోంచ, అంకీస ఆసరెల్లి ,గ్రామాల తర్వాత  వెంకటాపురం వద్ద ఇంద్రావతి( ఇక్కడ కూడా నదిల మట్టిపోసి రోడ్డు వేశారు)  దాటి ఛత్తీస్ గడ్ రాష్ట్రం లోని  భూపాల పట్నం వెళ్ళేదాకా ఇదే పరిస్తితి. అలాగే అలనాడు పులులు తిరుగాడిన పెను అడవంత పాడై పోయింది.  ఇసుకను తీసుక వెళ్లడానికి వేలాది లారీలు లైన్లు కట్టి ఉన్నయి. ఇనుప పండ్ల పొక్లెన్లు లారీలు నిండే దాకా .నిర్విరామంగా ఇసుకను తవ్వి పోస్తూనే ఉన్నాయి. ,.ఈ క్రమం ఇక్కడ కరీంనగర్ లో గ్రానైట్ క్వారీల పేరుతో మొదలై మానేరు నది పరీవాహక ప్రాంతం వెంట గోదావరి నదీ , అది దాటి ప్రాణహిత అక్కడ అది గూడా దాటి ఇంద్రావతి దాకా , తెలంగాణ నుండి చేత్తీస్ గఢ్ దాకా ఈ విధ్వంసం సాగుతూనే ఉంది. . అట్లా సహజ వనరులైన గుట్టలు,అడువులు ,ఇసుక అంతా కొల్లగొట్టబడి తోడి వేయబడిణాంక అక్కడ భూగర్భ జలాలు అంతరించి పోవా ? సహజ వనరులు అంతరించిన తర్వాత అది ఏడారే గదా ? ఎడారి మట్టి కాళ్ళ మహా రాక్షసి వలె విస్తరించడం వలన జనావాసాలను ముంచెత్తుతున్నట్టే గదా ? ఇప్పుడు పసిడి పంటలు పండుతున్న ఈ నేలమ్మ రేపు రేపు రేగిస్తాన్ గా మారి పోతే దానికి కారణం నువ్వూ నేనేనా ?

ఏన్దో ఇదంతా , ఏమి జరుగుతున్నదో ! మనసోంటోల్లమ్ మాట్లాడితే అభివృధ్ధి నిరోధకులమ్ అట . అరె భై ! రేపటి తరాలకు నిలువ నీడలేకుంట, కాలూన జాగలేకుంట , పీల్చేతందుకు సరిపడ గాలి లేకుండా ,  ఉన్నకాడికి నువ్వే ఆంబాసిమ్ పట్టుపట్టి తోడుకొని జుర్రుక  తింటే , మా అసోంటోల్లు మంట్లే గలిస్తే మానాయే గానీ నోట్లే బంగారు చెంచాలు పెట్టి , పాదాలకింద రెడ్ కార్పెట్ పరిచి ఈ భూమ్మీదికి మీ మీ సంతానాలను తోలుకొని వస్తున్నారే ! వాళ్ళ సంగతి కూడా మీకు పట్టి లేదా పెట్టుబడి దారుళ్ళారా ? వాళ్ళకు రక్షణ కవచాల్లా నిలిస్తున్న పాలకు లారా అని నిలదీస్తున్నట్టుగా ఉంది మన కోట్స్ గార్డెన్ కొశ్చనింగు.

Sunday, March 12, 2017

ఇంటిమీదెవుసమ్ 34

                                                              

ఎవుసమ్ ఫలితం కొంత  నిరాశా జనకం కావడానికి నాకైతే కోతుల బెడద, నాసిరకం విత్తనాలకు తోడు పగలు అలివిగాని  ఎండ, సాయంత్రాలు గాలి దుమారం,కారణాలు అవుతున్నాయి.  అయినా విడిచి పెట్టేది లేదూ , కాసినన్నే ఆయే అనుకుంటా . అయితే మనుసున పడుతలేదు అన్నప్పుడల్లా చిన్ననాటి మిత్రుడు నాగేందర్ వద్దకు వెళ్తుంటాను . మొన్నోకసారి నేను వెళ్ళే వరకు ఆయన అప్పుడే ఆయన ఒక సినిమా చూసిండట, దాని కథ చెప్పుకొచ్చిండు.

సగం ల నుంచే చూసిండట . సినిమా లో హీరో చనిపోతాడట. హీరో చనిపోవడాన్ని దర్శకుడు సింబాలిక్ గా ఇలా చూపాడట .  పక్షులన్నీ వలస పోతుంటాయట , అలిసి , శక్తి క్షీణించి  పోయిన పక్షులు కొన్ని అనివార్యంగా  చనిపోతుంటాయట . చనిపోయే వాటికి ఇక నేను రెక్కలు ఆడించ లేను అన్న సోయి కలిగే ఉంటాయట కానీ తన నిష్క్రమణ గుంపు పక్షులకు తెలియ కుండా వెనుకకు తప్పుకొని తను రాలిపోతూ కూడా గుంపు ప్రయానం ముందుకు సాగడానికి సహకరిస్తాయట . ఆ విషయం చెబుతూ అది ప్రకృతి ధర్మం.  ప్రకృతి ధర్మం అని అంటూనే ఈ వలసలు అనేవి అనాది నుండి ఉన్నవే, వలసల కారణంగానే జనసమూహాల నాగరికత సుసంపన్నం అయింది అనడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు అన్నాడు. అయితే వలస వచ్చిన పక్షులు అయిన జంతువులు అయినా అప్పటికే స్టానికంగా ఉన్న ఆయా సమూహాల పైన ఆధిపత్యం చలాయించినప్పుడు ఘర్షణలు తప్పవు. అప్పుడూ తప్పలేదు ఇప్పుడూ తప్పదు అన్నాడు. క్రీ: పూ: 5 వేల ఏండ్ల కిందటి మెసోపోటేమియా నాగరికత, క్రీ : పూ: 3500 కిందటి సింధూ లోయ నాగరికతలకంటే ముందు ఉన్న "గణ" జీవితాల సమయం లో కూడా కొత్త గణాలు వచ్చినప్పుడు అంతవరదాక ఆ ప్రాంతం లోతిరుగాడుతూ  ఉన్న గణాలు తమకు ఆహారం తగ్గిపోతున్నదని కొత్త గణాలను చంపివేయడం ఆ క్రమం లోనే గణాల స్తానమ్ లో రాజ్యాలు రావడం, ఆ రాజ్యాలు కూడా సరిపోక సామ్రాజ్యాలు రావడం , ఆ మార్పోల్లో ఎన్ని యుధ్ధాలు ఎంత జన హననం జరిగిందో చరిత్రలో చదువుకున్నాము. అట్లాంటి మానవ హననాలు ఇక ముందు జరుగకూడదనే అనేక వ్యవస్తలను మానవ సమాజాలు ఏర్పాటు జేసుకున్నాయి. కానీ కొందరు దుందుడుకు స్వాభావుల కారణంగా వ్యవస్తాలన్నీ కాలరాయబడి మానవ సమాజాలు భయాందోళనలకు గురికావాల్సిన పరిస్తితి ఏర్పడుతున్నదని అంటూ , ఏదీ ఆగదు , మార్పు అనేది సహజం, ఏ మార్పు కోసం ఇది జరుగుతున్నాదో వేచి చూడాల్సిందే అన్నాడు.