Saturday, February 9, 2013


ఎందుకు చని పోతున్నారు? నా మరణమే చివరి మరణం కావాలని నా చావు తో నైనా కేంద్రం తెలంగాణా ఇవ్వాలనే దింపుడు గల్లం ఆశ తో నిరాశోపహతులు ఐన యువత పిట్టల్లా రాలి పడుతున్నారు.భవిష్యత్ పైన గుండె నిండా విశ్వాసం తో కన్నవాల్లకు కడ దాకా తోడూ నీడై నిలువాల్సిన బాధ్యత మరిచి ఇంత పిరికిగా ఓట్ల రాజకీయ యజ్ఞానికి సమిధవై కాలిపోతున్నావు.కాని బిడ్డలారా ! ఒక్క సారి ఆలోచించండి. కాకి గొట్ట కుండ, గద్ద గొట్ట కుండ, జరమోచ్చినా ఏకచ్చినా కండ్లల్లో వత్తులు వేసుకొని నిద్రాహారాలు మాని బొడ్డు కోసినకాన్నుంచి తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు కడుపార దాగించి నీ ఉచ్చ, పియ్యి ఎత్తి పోసి"మది రోయక తానెన్నొ ఊడి గాలు" జేసి ఇప్పటి దాక నీకు బట్ట,బాతా ఇచ్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే కనీసం సావుదలకైనా గంటేడు గంజి పొయ్యక పోతవా అనుకొంటుంటే నువ్ జేసిన పనేంది?సచ్చే దాకా కడుపుల పేగులు నోట్లేకు వచ్చేటట్టు తల్సుకొని తల్సుకోని ఏడ్చే తట్టు దుఃఖం బెట్టి పోతావా?ఇదేనా నీ కన్న తల్లి ఋణం దీర్చుకునుడు.అయిన బట్ట గట్ట కుండా ,అయిన తిండి దినకుండా కడుపు గట్టుకోని పైసా పైసా కూడ బెట్టి నీ బట్టకు, పొట్టకు,సదువుకు సక్కబెడితే నువ్వా తండ్రికి ఇచ్చిన బహుమానం ఇదా?సచ్చే దాక ఏడ్చి ఏడ్చి సావు మని శాసించి నువ్వు నడుమంత్రపు సావుజస్తే అది త్యాగామంటారా?ఇది దుర్మార్గం. ఎవని కోసం జస్తున్నవో ఒక్కసారి తేరి పార జుడు.భరద్వాజ తన చివరి మెసేజ్ లో వాన్ని చెప్పుతో కొట్టండి అంటే నువ్వేమో కొత్త చేతగాక చచ్చి ఉరుకొంటే వాడెందుకు ఆ పనిజేస్తాడు?తెలంగాణా ఉద్యమకారులను జుడు,ఎవడన్న చస్తే డప్ప లేస్తలేరు, ఆ ఒక్క నాడు నా నా యాగిజేసి తెల్లరంగ నే ఎవనింట్ల వాడు పంటున్నాడు.ఎహే! ఇగ తెలంగాణా వస్తనే ఉంటె ఇంకా ఉద్యమం ఎందుకని ఒకడు ఆంటాడు.ఆయనను కానకుంట కాంగానే లెండ్రి,లెండ్రి యుద్ద్డం జేస్తమంటాడు.అసలు ఉద్యమం ఎవరి కోసం జరుగాలే, ఎవరి కోసం జరుగుతున్నది? యువత! ఒక్క సారి నిదానంగా నిలబడి ఆలోచించు.ఏమిజరుగుతున్నది,ఎవరికోసం మీ శరీరాలు కాలిపోతుంటే, కండలు రాలిపోతుంటే మంటల్ల బడే టందుకు ఉరుకుతున్నరు?కాలి కూలిన మీ భయంకరమైన శవాలను అపురూపంగా ఆలింగనం జేసుకున్న మీ అమ్మా నాన్నలు, ఆలుబిడ్డలు,ఎంత హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారో చూడు.ప్రతి సంఘటన మన అనుభవం లోకే రావాల్సిన అవసరం లేదు.ఎదుటి వాళ్ళ అనుభవాలను చూసి మనకూ అదే పరిస్తితి వస్తుందని భావించాలే.కొందరికి వాళ్ళ తెలంగాణా వాళ్ళకు ఇప్పటికే వచ్చింది.మరి కొందరికి వస్తది గావచ్చు.కాని మీ అయ్యవ్వకు నువ్వు రావు గాదు బిడ్డ.నీ ఆలుబిడ్డలకు నీ అండ లేక ఆగం అయి పోతరు గాదు కొడుకా? నిజమే! చావడానికి కూడా చాలా ధైర్యమే కావాలి.అంత ధైర్యం,అంత తెగింపు ఉన్న యువత దాన్ని దేని కోసం ఉపయోగించాలి? సర్వ దోపిడీ పీడనల విముక్తి కోసం ఉపయోగ పడితే నీ జాతి గర్విస్తుంది. ఇలా పిరికి పందలా నది యుద్ధం నుండి ఉత్తరునిలా పరిగెత్తి పొతే నిందిస్తారే గాని స్తుతించరు. పోరాడ చేతగాక నడుమనే ఎత్తేసి పోయినోని పిల్లలని నీ పిల్లలను అవహేళన జేసినప్పుడు నీ వలన వాల్లెంతగా కుమిలి పోతారో ఒక సారి ఆలోచించు.మీ చావులేమైనా భగత్ సింగ్ కొమురం భీమ్ లను యాదికి దెచ్చే సందర్భాలా? సరే నీవనుకున్నట్టే తెలంగాణా నీ చావు తర్వాత వస్తుందనే అనుకుందాం.వస్తే ఏమౌతుంది?ఓ తెలంగాణ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కాబోలు, మంత్రులు, ఎంపిలు,ఏమ్మేల్లెలు తెలంగాణా వాళ్ళే ఉంటారు.కొన్ని ఉద్యోగాలు వస్తాయిగావచ్చు. రాజకీయ నాయకులకు నిజంగా నిజాయితీ ఉంటె కొన్ని ప్రాజెక్టులు కట్టి సాగు నీటి సౌకర్యం కల్పిస్తారు కాబోలు, కాని లక్షలాది ఎకరాల్లో కిలోమీటర్ల కొద్దీ భూగర్భాన్ని పెల్లగిస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఆగిపోతాయా? లక్షలాది సమ్వస్తరాల నుండి పంచ భూతాలను సమతుల్యం తో ఉంచుతున్న గుట్టలు,చెట్లు, జీవ వైవిధ్య విధ్వంసాన్ని ఆపుతార? కుప్పలు తెప్పలుగా విస్తరించి విరాజిల్లు తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలను మూసివెసి సరిపోయినాన్ని ప్రభుత్వ పాఠశాలలు,ఆసుపత్రులు నెలకొల్పుతారా? అంతెందుకు ఉన్న భూమి నైనా సమానంగా అందరికి పంచుతారా? తెలంగాణా వనరులద్వారా సమకూరు తున్న సంపద అయినా అందరికి సమానంగా పంచుతారా? ఇప్పటికే వెయ్యి మంది బిడ్డల ఉడుకుడుకు పాణాలు బోయినా గూడా మన తెలంగాణా లీడర్లు కనీసం వాళ్ళ పదవులు వదులు కోవడానికి కూడా సిద్ధపడ లేదే! అలాంటి పాషాణ హృదయాలు నీ ఒక్క బక్క ప్రాణం తో కరుగుతాయనుకొంటే అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. తెలంగాణా సమ శీతోష్ణ ప్రాంతం.ఇక్కడి సారవంత మైన భూముల్లొ అరొక్క తీరు పూలు, పండ్లు,పంటలు పండుతాయి. నేరుగా అమెరికా యూరోప్ దేశాలకు ఎగుమతి జేసుకోనేతందుకు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. బొగ్గు,నీళ్ళు,గ్రానైట్,హేమటైట్ ,లాంటి అనేకమైన విలువైన ఖనిజ సంపద ఉంది.ఇదంతా సీమాంధ్ర పెట్టుబడి దారుల ద్వారా మల్టినేషనల్ కంపనీలకు కట్టబెట్టే ప్రయత్నం లో భారత పాలక వర్గాలు పోటీబడుతున్నాయి. అందుకే తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం అనే ఒక రాజ్యాంగ బద్ద మైన ప్రజాస్వామిక హక్కునే కాల రాస్తే ఇక ఏ రకమైన హక్కుల ఉద్యమాన్నయినా ఇలాగె అణిచి వేస్తారన్న భయం లో ప్రజలు వనరుల రక్షణకో, పర్యావరణాన్ని కాపాడమనో,లేక మా భూములు మాకు కావాలనో సామాన్య ప్రజలు ఉద్యమించ కుండా చూడ వచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలవి భ్రమలు మాత్రమె నని అణిచి వేస్తే ప్రజలు ఉవ్వెత్తున ఎగిసి పడి ప్రభుత్వాలను ముంచి వేస్తారన్న వాస్తవాలు ప్రభుత్వాలకు అర్థం గావాలంటే బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అందుకని చావడానికి సైతం సిద్ధ పడి బలవన్మరణం చెందుతున్న వాళ్ళు ధైర్యాన్ని కూడ గట్టుకొని చావకుండా నిలిచి జరుగుతున్న సర్వ దోపిడీ పీడనల అసలు మూలాల పైన యుద్ధం జేయవలసిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది.మీవంతు బాధ్యత ఎవరో నిర్వహిస్తారని భ్రమ పడి ఈ లోకాన్ని విడువడం విజ్ఞత అనిపించుకోదు. పెంటయ్య.వీరగొని. కరీంనగర్.

Sunday, February 3, 2013


ఆరుద్ర పురుగులు. మానేటి జలాశయమా - మది నిలిచిన జ్ఞాపకమా! మబ్బసలె కానరాని - మహా గడ్డు రోజులల్లా మానేరు పారేటట్టు - మడులన్ని నిండే టట్టు మహా కుంభ వృష్టి కురియు పుడమంత తడిసి ముద్దయి - చిగురించు చెట్టు చేను అని మరి మరి జెప్పిండ్రా - ఎన్నెల్లో అన్నలంతా అయితాదె బాపు అంటే -అనుమాన మెందు కనిరి. ఆ ఆశ తోనే యువత - ఆలోచన పరులంతా అడుగడుగు కలుపుకొని - కడలోలె కదిలినారు శ్రీకాకులిజయ నగరం - జైతాల జైత్ర యాత్ర కరినగరు కదన రంగం - పడిలేసే పాలమూరు ప్రజా బిడ్డ లెంత మందో - ప్రాణాలు ఇచ్చినారు తుఫాను రాక పాయె - కరువేమో పోకపాయే రాబందు లన్ని జేరే - రాకాసి పాలనాయే దూడల మూతి గట్టి - ఆవుల పాలు పిండి కొండాలు పిండిజేసి - గ్రానైట్ క్వారీల్ దవ్వి ఓపెను కాస్టులంటూ - భూమంత దవ్వి పోసీ ప్రాజెక్టులంటూ గట్టి - నీళ్ళన్ని దొంగిలించి నిను నిండ ముంచినొల్లను - నిలువునా పాతరేస్తం అధికారమివ్వు మంటూ - నీ ఓటు దొబ్బి నోడు అధికార మొచ్చినంక - అవతలి వైపు జేరే దిగ్భ్రాంతి నొంది నోళ్ళు - లోకాన్ని జదువనోల్లు మల మలా మాడినారు - వురి కొయ్య నురికి నారు. అవివేకమైన యువతా - అది పిరికీ తనము కొడుకా నిను గన్న పేగు కోసి - కారమూ జల్లి పోతవ దుర్మార్గ మాత్రు ద్రోహి - ఇదార త్యాగమంటే తొడగొట్టి దండు గట్టు - అందరిని కూడ గట్టు బోధనా మొదలుబెట్టు - దోపిడీ పీడన లేని ప్రజా రాజ్యమోచ్చేదాక - కడ దాక బరిలే నిలువు అన్నార్హులలిసినోల్లు - అంగలార్సు డాపుండయ్య రోకండ్లు వలిగే టట్టు - రోహిణి ఎండలుంటే కప్పలు,ఎర్రలన్ని - కనిపించ కుండ పొతయ్ ఆయిటీ బూనినంక - వానేట్ల గురిస్తట్ల తల దాసుకున్న కప్పల్ - తెప్పలుగ వచ్చి చేరు ఎండ్రి కాయల్ మండ్ర గబ్బల్ - ఎదురెక్కి వస్తయన్న ఆరుద్ర పురుగు లొచ్చు - అడివంత అండగుండు . వీరగొని పెంటయ్య. కరీంనగర్ .