Wednesday, November 19, 2014

రాజ్యాధికారం ఎందుకోసం?

చాలా కాలం నుండి  అన్ని తరగతులకు చెందిన శ్రేణులు తమకు రాజ్యాధికారం కావాలని నినదిస్తున్నాయి..కొందరు దళిత బహుజనుల నినాదం తీసుకొంటే మరికొందరు బీసీ నినాదం తీసుకొంటున్నారు..ఇంకా మరికొందరు ప్రాంతీయ వాదం లేవనెత్తుతున్నారు.అసలు రాజ్యాధికారం అంటే ఏమిటి? ఒక ఎమ్మెల్లే సీటో , ఒక ముఖ్య మంత్రి పదవో వస్తే రాజ్యాధికారం వచ్చినట్లేనా? ఇంత వరదాకా దళితులు, బీసీలు ఎంత మంది ఎమ్మెల్లెలు కాలేదు, ఎంతమంది దళితులు ఎంత మంది బీసెలు ముఖ్య మంత్రులు కాలేదు? మరి వాళ్ళ వలన ఈ దళిత, బీసీ , ఎస్టీల సమస్యలు ఎందుకు పరిస్కారం కాలేక పోయినాయి? 
     
   అట్లా అడిగితే , ఇంత వరదాకా ఆయా పదవుల్లోకీ వచ్చిన వారు ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి వచ్చినారు, కనుక ఆ రాజకీయ పార్టీ సిద్దాంతం మేరకు పనిజేసినారే కానీ దళిత బహుజనుల కోసం పని చేయలేదు , చేద్దామన్నా ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు కనుక ఏమీ చేయలేక పోయినారు , కావున ఇప్పుడు మేము ఆ నినాదం తోటి వస్తున్నాము, కావున దళిత బీసీ ఓటర్లు మాకే ఓటు వేసి గెలిపించాలి అన్నది వారి వాదన. సరే వాళ్ళు అన్నట్లు గానే ఓటర్లు అట్లానే ఆలోచిస్తారని కాసేపటి కోసం అనుకుందాం. మరి వీళ్ళ పార్టీ ఏమిటి? వీళ్ళ మానిఫెస్టో ఏమిటి? ఇంత వరదాకా ఈ వాదం తో ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ. మరి దాని ఆచరణ యూపీ లో ఎట్లా విఫలమైందో చూసినాము.అవకాశం వచ్చినప్పుడు అగ్రకుల రాజకీయ నాయకుల కంటే ఏమీ తీసిపోని విధంగా పాలన చేసి మళ్ళీ అదే సిద్దాంతం పైన మాకు అధికారం కట్టబెట్టండి అంటే ప్రజలు నమ్మరు కదా?

     స్వంత సైన్యం లేకుండా రాజ్యాధికారం అనేది ఉండదు. స్వంత సైన్యం మన రాజ్యాంగం ప్రకారం కేంద్ర లో అధికారం లోకి వస్తే తప్ప సాధ్యం కాదు. సరే కేంద్రం లో కూడా అధికారం లోకి ఇట్లా వాదించే వాళ్ళు ఏదో ఒకనాడు వస్తారనే అనుకుందాం. అప్పుడు అమెరికా అనుమతి లేకుండా ఇక్కడి ప్రభుత్వాలు ఎవరి ఆస్తులు ఎవరికి పంచుతారు? పార్లమెంటు లో  ఇంత స్తంపింగ్ మెజారిటీ ఉండీ కూడా కనీసం విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని తెప్పించడానికి మోడీ ప్రభుత్వం పడుతున్న ఆపసోపాలు చూస్తున్నాము. అలాంటిది ఒక రాష్ట్రం లోనో లేక కేంద్రం. లో  కూడా అధికారం లోకి వచ్చి ఇట్లా వాదిస్తున్న వాళ్ళు చేసేది ఎక్కువకు ఎక్కువ తమకు అత్యంత సన్నిహితులు అయిన వారికి కొన్ని ప్రయోజనాలను సమకూర్చి పెట్టగలరేమో గాని వాళ్ళు మాటల్లో చెబుతున్నట్లు గా సంపూర్ణ మైన మార్పు వాళ్ళు అనుకుంటున్న పద్దతుల్లో ఎట్లా సాధ్యమో ఈ వాదనజేసే వాళ్ళ మేధావి వర్గం జవాబు చెప్పాలి. వర్గ స్పృహ లేకుండా వర్గరహిత సమాజం గురించిన ఆలోచన లేకుండా ఎవరు అధికారం లోకి వచ్చినా వాళ్ళ వాళ్ళ ఆస్తులు మరి కొంచెం పెంచుకోవడానికి పనికి వస్తుంది గాని అశేష ప్రజానీకం ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండ జాలదు.

    వీరగొని పెంటయ్య.
  విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.
కరీంనగర్.