Thursday, December 24, 2015

భూమి పుత్రుడు భూమయ్య సార్ !

 భూమి పుత్రుడు భూమయ్య సార్ !
               (24 డిసెంబర్ నాడు భూమయ్య సార్ 2 వ వర్ధంతి సందర్భంగా)
ఒక మామూలు వ్యవసాయ కుటుంబం లో పుట్టి పెరిగిన ఆకుల భూమయ్య అనే ఒక సాధారణ మనిషి ని   “భూమయ్య సార్ “ అని సమాజం ఎందుకు మన్నించిదో ఆలోచించాల్సిన విషయం.
తొలి సంతానం అనారోగ్యం తో చనిపోయినపుడు మాలి సంతానమైన భూమయ్యను పుట్టగానే భూమి పైన వేసి  ఓ భూమాతా ! మా బిడ్డ ను నీవే కాపాడాలని వేడుకుంటారు. ఆ సాంప్రదాయం తెలంగాణ గ్రామాలల్లో ఉంది. భూమిని తొక్కినా , తన్నినా,తవ్వినా, దున్నినా, కాల్చినా,పేల్చినా  నశించ కుండా ఉన్నట్టుగానే మా బిడ్డడు గూడా భూమి తీరుగా చిరంజీవి గా బతుకాలని ఆ తల్లిదండ్రుల తంద్లాట.
ఆయన పాఠశాల విద్య పెద్దపల్లి హైస్కూల్ లో జరిగింది. తెలంగాణ సాయుయధ పోరాట యోధుడు గట్టే పల్లి మురళిధర రావు వెద జల్లిన విప్లవ విత్తనాలు మొలకెత్తనున్న నేల . గొప్ప గణిత బోధకుడైన దేశికా చార్యులు మెచ్చిన విద్యార్థి తను.1968 లో హైస్కూల్ చదువు అయిపోయి డాక్టర్ కావాలన్న కోర్కె తోకరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో P U C చదువుతుండగా తొలి దశ తెలంగాణ ఉద్యమం బద్దలైంది.ఉద్యమం లో ముందు వరుసలో ఉన్నాడు కనుక అరెస్టయి జైలుకు వెల్లిండు.జైలు నుండి బయటకు రాగానే తెలంగాణ వ్యాప్తంగా ఎటు జూసీనా శ్రీకాకుళోద్యమము నుండి ఎగసిపడ్డ విప్లవ నిప్పురవ్వలు దావానలమై మండుతున్నై. విద్య సంస్తలన్నింటికి సెలవులు ప్రకటించారు. విప్లవ రాజకీయాలు అధ్యయనం జేయడానికి కావలసినంత సమయం దొరికింది. ఇదే కాలం లో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న చాలా మంది యువకులు కేవలం తెలంగాణ సంకెళ్ళను తొలగించడం మాత్రమే గాకుండా భారత దేశం తో బాటుగా ప్రపంచ ప్రజల ను కట్టి వేసిన పెట్టుబడి దారి వ్యవస్త కబంద హస్తాలనుండి బంధ విముక్తుల్ని చేయాలన్న సంకల్పం తో జీవన్మరణ పోరాటాల బాటను ఎంచుకున్నారు. ఆ క్రమం లో ముందుకు వచ్చిన భూమయ్య జమ్మికుంట ఆదర్శ కాలేజీ లో బి. యస్సీ. చదువుతూ ఎంవీ తిరుపతయ్య తెలుగు ఉపన్యాసకుల పాఠాలు వింటూ నల్ల ఆదిరెడ్డి , శనిగరం వెంకటేశ్వర్లు( సాహు) ల సాహచర్యం లో విప్లవ బాటలోకి వచ్చిందంటే “పట్టిన ఆ ఎర్ర జండా ప్రాణముండగ విడువలేదు.”
1975 జూన్ లో వచ్చిన ఎమర్జెన్సీ  భూమయ్యను మళ్ళీ జైలుకు పంపింది. 1977 లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత బయిటకు వచ్చిన ఆ నాటి యువత తమ కుటుంబ జీవితాలను, వ్యక్తిగత సుఖ సంతోషాలను తృణ ప్రాయంగా భావించి ప్రజలందరి సుఖ సంతోషాల కోసం విప్లవాల బాట పట్టినారు. 1978 రాడికల్ విద్యార్థి సంగం వరంగల్ సభల తర్వాత “గ్రామాలకు తరలండి” అన్న పిలుపు ఇచ్చింది. వందలాదిగా వచ్చి చేరుతున్న కొత్త క్యాడర్ కు రాజకీయ పాఠాలు బోధించాలి. అప్పటికే ఉపాధ్యయు డు  గా ఉన్న భూమయ్యకు ఆ బాధ్యత అప్పగించ బడింది. 1978 నుండి ఈ 35 సం. ల సుదీర్ఘ కాలం భూమయ్య కేవలం బడిలో పాఠాలు జెప్పే పంతులు గా మాత్రమే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ పాఠాలు జెప్పే “సారు” గా స్తిరపడి పోయినందున ఆయన పేరు భూమయ్య సారు గా స్తిరపడిపోయింది.
సమాజ పురోగమనానికి మార్గ దర్హ్సకత్వం వహించే ది  విద్య. ఆ విద్య రంగం లో తాను ఉపాధ్యాయుడుగా పనిజేస్తౌన్నందున ఊయపాధ్యాయ రంగా సమస్యల పైన , విద్యారంగాన్ని సమూలంగా సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చాలన్న డిమాండ్ తో పోరాటం జేసె అవకాశం తనకు వచ్చింది. అందు కోసం అంతవరదాకా తాను పనిజేస్తున్న పి ఆర్ టి యు  పరిధి సరిపోలేదు. దానికి తోడు 1981 లో జమ్మికుంట లో జరిగిన పియర్టియు దశాబ్ది ఉత్సవాల్లో వీరు ప్రజా రాజకీయాల ఎజెండాను ముందుకు తెచ్చారు. మార్పు కు ఇస్ట పడని బ్రాహ్మణ భావజాల వాదులు ఉద్యమాన్ని ముందుకు పోకుండా మోకాలడ్డినారు. వారితో వేగలేక అప్పటికి కొంత ప్రజాస్వామికంగా ఉండే ఎపేటిఎఫ్ సంఘాన్ని 1983 లో తెలంగాణకు విస్తరింప జేయడం లో భూమయ్య సార్ ప్రధాన పాత్ర పోషించారు.
ఆనాటికి నక్సల్బరి పోరాటాల చేత ప్రభావితు లైన ఉపాధ్యాయులు ఎపిటిఎఫ్ నిర్మాణం లో కలిసి వచ్చినారు. అది ఉపాధ్యాయ ఉద్యమం గానీ, అది రైతాంగ ఉద్యమం గానీ, అది యువజన ఉద్యమం గానీ, అవి ఏవైనా అవి కేవలం తమ కోసం మాత్రమే గాదు మొత్తం సమాజం మార్పుకోసం జరుగుతున్నా పోరాటాలుగా గుర్తించారు. మొత్తం సమాజ సమస్యలు పరిష్కరించ బడినపుడే తమ సమస్యలు గూడా పరిష్కరింప బాదుతాయి తప్పితే కేవలం తమ సమస్యలు విడిగా పరిష్కరింప బడవు అన్న అవగాహనతో ఉద్యమాలు సాగుతుండేవి.
ఈ 35 సం.ల ఉద్యమ కాలం లో ఆయన జరిపిన పోరాటాలను రెండు గా విభజిస్తే 1. ప్రత్యక్ష పోరాటాలు. 2. బౌధ్ధిక పోరాటాలు. ప్రత్యక్ష పోరాటాల్లో రెండు అతి ముఖ్యమైనవైతే అందులో మొదటిది విద్యారంగం లోని అవినీతి అయితే రెండవది ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ అయిడెడ్ ఉపాధ్యాయుల పోరాటం.1987-88 ఎన్టీ రామా రావ్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం  లో జీవో 370 తెచ్చి వేలాది మంది ఉపాధ్యాయులను వారి వారి స్వత డివిసన్ల నుండి దూరంగా బదిలీ జేసినాడు.అధికారుల రాజకీయ నాయకుల చేతివాటం చెప్పనలవి గాలేదు. ఉపాధ్యాయులందరిని ఏక తాటి పైకి తెచ్చి జీవో రద్దు కై పోరాటం జేసినాడు. 1989-90 లో కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల , జమ్మికుంట,లాంటి జన సమ్మర్దం ఉన్న చోట ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఉపాధ్యాయులను కట్టుబానిసలకంటే హీనంగా చూస్తున్న కాలం. వారికి అండ గా అధికారులు రాజకీయ నాయకులు . భూమయ్య సార్ నాయకత్వం లో నిరవధిక సమ్మెలు, బంధు లు జరిపి ఆనాటి జిల్లా కలెక్టర్ ఐ వి సుబ్బ రావు గారి తో ఒక రాత్రంతా ఇల్లందు గెస్ట్ హౌస్ లో చర్చలు జరిపి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేశారు.
ఇక బౌధ్ధిక రంగం అంటే విధ్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చాలనీ, వివిధ యాజమాన్యాల్లోని విధ్యను ఒకే గొడుగు కిందకు చేర్చి కామన్ స్కూల్ విధానం ద్వారా ఒక ప్రాంతం లో నివశిస్తున్న వారెవరైనా గానీ ఆ ఆవాసం లోని పాఠశాలలోనే చదివించాలనే నిబంధన ఉండాలని, అలాగే ఆశాష్ట్రీయమై, ప్రజల నిత్య జీవితాలతో సంబంధం లేని తలకిందుల కారికులం స్తనం లో ఆయా ప్రాంతం లోని వనరులను ఉపయోగించుకొని ఉపాధి పొందుతూ స్వయం సంపూర్ణ వ్యవస్త ల  నిర్మాణానికి తోడ్పడే విద్యావిధానం కొరకు ఆయన కృషి చేసినారు.ఇదేదో నినాద రూపం కాకుండా ఆచరణలో ఎట్లా సాధ్య పడుతుందో చూపడం కోసం 1998 వేసవి లో ధర్మపురి లో వర్క్ షాప్ నిర్వహించి తరగతుల వారీగా విషయాల వారీగా నిష్ణాతులతో చర్చలు జరిపి ఆ సారాంశాన్ని క్రోడీకరించి  2012 లో “ శాష్ట్రీయ విద్య విధానం “ అనే ఒక పుస్తక రచన జెసి ప్రచురించాడు.
ఇక పోతే భౌగోళికంగా నైనా సాకారం అయిన తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ లోని అన్నీ మండలాల్లో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి నమూనా అన్న అంశం పైన జయా శంకర్, బియ్యాల జనార్ధన్ రావు తో అనేక సభలు సమావేశాలు ఆయన నాయకత్వం లో నిర్వహించ బడ్డాయి.ఇక తెలంగాణ ఏర్పాటు కోసం 1969 నుండి తాను కృషి చేస్తూ 1997 లో వరంగల్ డిక్లరేషన్ రావడానికి కీలక పాత్ర పోషించాడు. 1998 లో తెలంగాణ జనసభ కు సార్ కన్వీనర్ గా రాజ్యం తో రాజీలేని పోరాటం జేసినాడు. ఒక వైపు తన సహచరులైన  బెల్లి లలితా, కనకా చారి, ఆయిలన్న, చంద్రమౌళి, నల్ల సంపత్ , సుదర్శన్, వెంకటేశ్వర్లు లాంటి వారు ప్రభుత్వ ఫాసిస్టు దమన కాండ లో బలై రాలిపోతున్నా గూడా మొక్క వోని ధైర్యం తో నిలబడి ఒంటరి పోరాటం జేసినాడు.
తెలంగాణ జనసభ పైన అప్రకటిత నిషేధం వస్తే ఐక్య కార్యాచరణ కమిటీ, అది కూడా సాగనప్పుడు తెలంగాణ ప్రజాఫ్రంట్ ఇలా ఎప్పటికేది అవసరమైతే దాన్ని ఆలంబనగా జేసుకొని తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాటం జేసినాడు.భౌగోళిక తెలంగాణ తో ప్రజల బాధలు తీరవని ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ఏజండా పైకి తెచ్చాడు.1/70 చట్టం అమలుచేయకుండా పోలవరం కట్టి గిరిజనులను ముంచివేసి , ఓపెన్ కాస్ట్ మైన్స్ , గ్రానైట్ క్వారీస్, ఇసుక రీచులు, మొత్తంగా వనరులన్నింటిని కొల్లగొడుతూ గుట్ట పెట్టుబడి దార్లకు భూ పందేరమ్ జేస్తూ బడుగు జీవుల బతుకులు బుగ్గి జేసె తెలంగాణ గాకుండా అందరూ సమానంగా ప్రజాస్వామ్యయుతంగా జీవించే తెలంగాణ కొరకు 24 డిసెంబర్ 2013 నాడు బషీర్భాగ్ ప్రెస్ క్లబ్ లో “ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలు” ఆవిష్కరించి అమరులందరిని పేరు పేరున కొనియాడి అర్థాంతరంగా తన గమ్యం నుండి వైదొలిగి పోవడం ప్రజాస్వామిక తెలంగాణ లక్షయానికి తీవ్ర విఘాతం కలిగింది.భూమయ్య సార్ గనుక బతికి ఉన్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నఅపసవ్య విధానాలపై తప్పకుండ ఏదో ఒక ఉద్యమ నిర్మాణం జరిగి ఉండేది. ఆయన వారసులమ్ అని చెప్పుకుంటున్న వారందరము మరో ఉంద్యమానికి సన్నద్దము కావలిసిన అవసరాన్ని గుర్తించాలి .