Tuesday, November 29, 2016

ఎవుసమ్ 5

                                                    ఎవుసమ్ 5

మన మిద్దె తోట ను చూసెతందుకు పాత్రికేయ మిత్రుడు జయంత్ గారు వచ్చిండ్రు . రఘోత్తమ్ సార్ తన గూఫీ కి వీళ్ళు మనోల్లే అని చెప్పి శాంతింప జెసి నట్టు కాకపోయినా నా మొక్కలకు ఈ సారు మిమ్ముల జూసేతందుకే వచ్చిండని నోటి తోటి చెప్పలేదు గాని మా స్పర్శను బట్టి అవ్వే అర్థం జేసుకున్నయ్ . మెంతులు మారాకు వేసినయ్ తోట కూర సన్నగ నాజూకు వొతున్నది . ధనియాలు ఇంకా దినాలు లెక్కబెడుతున్నయ్ . రోజూ నీళ్లయితే చల్లుతున్న అని జయంత్ సార్ కు చెప్పిన.
ఆయిన వెళ్ళి పోయినంక నిన్న మొన్న రాయక పోతి గదా అనుకున్న. ఎందుకు రాయ లేదో మీతో గూడా పంచుకుందామని మొదలు వెట్టిన ఇగో ఇట్లా . అది 1966 అనుకుంటా ఎండా కాలం ల  మా ఊర సెరువు ఎండి పోయినంక శిగురు బాయిల దునికి ఈతలు గొడుతున్నం పోరాగాండ్ల మంత జమై. మా యీడు పిలగాడే ఒగాయిన మాతోటి గలిసి ఈత గొట్టే తండు.కు బాయి కాడికి వచ్చిండుకొత్తగ .  బాయి వాళ్ళ మామదే గనుక మాతోటి ఆయినకు ఏం పని అనుకుండో ఎందో గాని " గభేళ్ళు " మని బాయిల దునికిండు . ఒడ్డెంబడి  దరి మీద నిలబడి చూస్తున్న మేమంతాబిడియ పడి  పైకి ఎక్కినమ్. బట్టలు మార్చుకొని పొడి బట్టలు కట్టుకున్నం , వెళ్ళి పొయ్యేతందుకు తయారైతున్నం . బాయిల ఉన్న కొత్త పిలగాడు మీది నుంచి దునుకుదామని కావచ్చు పైకి ఎక్కిండు. మేమంతా వెళ్ళి పొయ్యేతందుకు సిద్దంగా ఉన్నం గదా, మమ్ముల జూసీ మీతో ఆడుకుందామని నేను వస్తే మీరెల్లి  పోతరా ? అన్నడు . పాపం అనిపించింది. అరె , మనం కూడా ఈనే తోటి కాసేపు ఆడుకుందాం అని వాళ్ళను ఆపిన. ఇగో గట్ల మొదలైంది మా డొస్తానీ. బాయిల ఈత గొట్టుడు నుంచి మొదలైన సోపతి సేను శెలుకల పొంటి దిరుగుడు, వరి కల్లాల కాడ గంటల కొద్ది ముచ్చట.


వరి పొలం బంగారి రంగుల పండిందంటే కోతకు వచ్చినట్టు లెక్క. మేమైతే పొలం కోత మొదలు వెట్టే నాడు కోడి పిల్లను కోసుకొని పోలి జేసుకుందుము . పొలం కోత అయి మెద ఎండినంక మెద గడుదురు . కట్టిన మెద మోపులను కల్లం లకు మోసుకొని తెద్దురు . కల్లం అంటే గుండ్రంగా వృత్తాకారం లో పారవట్టి నున్నగా చెక్కి ఉశికే లేకుంట చెత్త లేకుంట ఎత్తి పోసి పెండ తోటి అలుకుదురు . తెచ్చిన మెద తెచ్చినట్టు ఒక బండి గీరే అంటే బండి చక్రంమీద కొట్టే వాళ్ళు ,దాన్ని పంజగొట్టుడు అంటరు . రాలిన వడ్లను కొలుసుకొని ఇంటికి తెచ్చుకుందుం బండ్ల మీద బోరాలు వేసుకొని.పంజ గొట్టిన గడ్డిని  కుప్ప పేరుద్దురు గుండ్రంగా. అది అందరికీ రాకపోయ్యేది . అదో పెట్టుడు సుతారమే అప్పుడు. అట్లా కుప్ప వెట్టిన తర్వాత ఓ మంచి రోజు చూసుకొని బంతి గడుదురు. బంతి అంటే కొన్ని ఎడ్లను లైను గా ఉంచి తలుగుల తోటి ఒకదానితోటి ఇంకొకటి కలిపి బంతి ( గుంపు) గట్టి ఆ ఎడ్ల తోటి వరిని తొక్కిస్తే వరికంకులకు మిగిలి  ఉన్న వడ్లు కర్ర నుంచి వేరయ్యేటియి . నడుమ నడుమ ఎన్ను వొడుసుడు ఉంటది. బడి ఎగ్గొట్టి బంతి గొట్టుడంటే బలే సంబురమయ్యేది . వరి కర్రలకు ఉన్న ముల్లు గుట్టి మస్తు దురుద వెట్టేది . ఉడుకుడుకు నీళ్ళ తోటి తానం జెస్తుంటే అబ్బ ఎంత హాయిగ ఉండేదో పానానికి . అయితే ఆ బంతులు గొట్టే కాడికి ఆయన్ను వాళ్ళ మామ పంపేటోడు . సాయితకు నేను గూడా పోతుంటి అసోంటి జానీ డొస్తు సుడిగాల రమేశ్ ఇప్పుడు అమెరికల పౌరుడు. ఆయిన సొంతూరు కాళేశ్వరం. ఆయిన మొన్న వాళ్ళ అమ్మ చెన్నూరుల ఉంటే ఆమె కోసం చెన్నూరుకు వస్తే కలుద్దామని నేనూ పోయిన అందుకని రెండు రోజులు నాగా వడ్డది ఎవుసమ్ జేసుడు.

Monday, November 28, 2016

ప్రజల పై యుద్దాలు

                                         ప్రజలపై  - యుద్దాలు . 1

గత ఇరవై రోజులు గా భారత దేశ వ్యాప్తంగా నోట్ల రద్దు వలన ప్రజలపైనా ఏ విధమైన యుద్ధం జరుగుతున్నదో , దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ దిన చర్యలను మానుకొని నోట్ల వేటలో ఏ విధంగా వీధుల వెంట బారులు తీరి విసిగి వేసారు తున్నారో చూస్తున్నాము. వామ పక్ష పార్టీల బంద్ గానీ ప్రధాన ప్రతిపక్షం ఆక్రోశం గానీ ప్రజలను ప్రభావితం చేయలేక పోయింది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాగూడా భరిస్తూనే ఉన్నారు తప్పితే ప్రభుత్వం పైన పెద్దగా తిరుగుబాటు తెలుపడం లేదు. సామాన్యంగా ప్రజలకు బాగా డబ్బు ఉన్న వాళ్ళ పైన సానుభూతి ఉండదు. ఈ నోట్ల రద్దు వలన వాళ్ళు చాలా నస్తపోతారని ప్రజలంతా భావిస్తున్నారు. కనుకనే నల్ల కుబేరులకు మోడి మంచి షాక్ ఇచ్చినాడని సంబుర పడుతుండ్రు. కానీ వాస్తవానికి ఇప్పుడైతే ఎక్కడా నల్లకుబేరులు నస్ట పడుతున్న దృస్టాంతా లెక్కడ మనకు కనిపించడం లేదు. భవిశ్యత్తులో ఏమి జరుగుతుందో చూద్దాం. అంతవరదాకా  మనలాంటి సామాన్యులు ఎదిరి చూడడం డప్ప ఎదిరించ లేని నిస్సహాయ పరిస్తితి.

ఇప్పుడిప్పుడే ఇంకో మాట కూడా విన వస్తున్నది. నగదు రహిత లావా దేవీలు, ఆస్తి పాస్తుల ఇ పాస్ , గుడ్ మంచిదే ఈ విధానాన్ని ప్రభుత్వం చిత్త శుద్ది తో అమలు చేయ గలిగేతే. మన దేశం లో చట్టాలు చాలానే ఉంటాయి కానీ అవి అమలుకు నోచు కోవు . ఈ నోట్ల రద్దు విషయమే చూడండి బొంబాయి కేంద్రంగా కొత్త రెండు వేల నోట్లు దేశ వ్యాప్తంగా పంపిణీ అయితూనే ఉన్నాయి. నల్ల ధనవంతులు వాళ్ళ ధనాన్ని బంగారం రూపం లో స్టిరాస్తుల రూపం లో ఇప్పెటికే ఎప్పుడో దాచుకున్నారని అంటున్నారు. కొద్ది గొప్ప ఉన్నోళ్ళు సైతం తమ పలుకు బడి ఉపయోగించి నస్ట నివారణ చర్యలు ఎప్పుడో తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నది మాత్రం మన బోటి సామాన్యులే.

నగదు రహిత లావాదేవీలు, ఇ పాస్ వ్యవస్తా ప్రవేశ పెట్టడాన్ని నేనైతే స్వాగతిస్తాను , అక్షరాస్యతే అంతంత మాత్రం అనే విషయాన్ని చర్చ కోసం కాసేపు పక్కన బెడుదాం. ఇప్పుడు లాభాలు కొందరికి  ఇబ్బడి ముబ్బడి ఎందుకు వస్తాయి, సేల్స్ టాక్స్ కోసం వాళ్ళు రశీదు ఇవ్వాలని చెప్పే వ్యవస్త ఎందుకు నిస్తేజంగా ఉంది? రోడ్లు బిల్డింగులు, ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల సొమ్ము ఎలా మిగులుతది ? వాటి పర్యవేక్షకులకు లంచాల రూపం లో లక్షలాది నల్లధనం , ఆ కాంట్రాక్టర్లు కట్టబెట్టిన రాజకీయ నాయకులకు కోట్లాది ఎన్నికల ఫండు ఎట్లా వస్తున్నది? కడకు మిలట్రీ యూనిఫాం, వాళ్ళ బూట్లు,వాళ్ళకు ఇచ్చే ఆహారం దగ్గర నుండి ఆయుధాల దాకా  నాసి రకం ఇవ్వబడి బడా ఆయుధ వ్యాపారులు బలిసి పోతున్నారు . పరిపాలకులు జరిగే లబ్ది జరిగి పోతున్నది. నగదు రహిత లావాదేవీలు నిజంగా చిత్త శుద్దితో అమలు జరిగితే ఇవన్నీ ఆగి పోవాలి . కానీ మళ్ళా దేశ భద్రత, అఫిషియల్ సీక్రెట్ అని సన్నాయి నొక్కులు నొక్కితే సామాన్యుడు బలిగావడం తప్పితే ప్రయోజనం ఉండదు.

అలాగే ఇ పాస్ విధానం వలను ఒక వ్యక్తికి ఉన్న సమస్త ఆస్తులు, అంటే భూములు, ఇండ్లు, ఫ్యాక్టరీలు, స్తిర చరాస్తులన్నీ ఆన్ లైన్ లో పెడితేనే వాటిని తాను మళ్ళీ ఎవరికైనా అమ్ముకోవడం గానీ మార్చుకోవడం గానీ ఉండే పరిస్తితి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాంటి నిర్ణయమే గనుక ప్రభుత్వం తీసుకుంటే మనందరం దాన్ని ఆహ్వానిచాల్సిందే! ఆ నిర్ణయాన్ని పక్కా గా అమలు చేయాలని ఉద్యమాలు చేయాల్సిందే గానీ వద్దని ఎందుకు చెప్పాలి ఎవరైనా ?



Friday, November 25, 2016

ఎవుసమ్ 4

                                                   ఎవుసం  3
  
పొద్దున్నే మిద్దె తోట కు నీళ్లు పెట్టె టందుకు పొయిన . తొట్లల్లో చల్లిన విత్తనాలు కొన్ని పండ్లిగిలించి నా మొఖాన చూస్తూ పలకరిస్తున్నయి .    సంబురమైంది.
అంతకు ముందు రోజు మిరప మొక్కలకు వేప నూనె స్ప్రే చేస్తున్నప్పుడు మొక్కలను కిందికి వంచి,  పైకి లేపి,  చెట్టంతా తడిసె తట్టు వేప నూనె నీళ్లు. స్ప్రే జేసిన తీరు ఎట్లని పిచ్చిందంటే   చిన్ననప్పుడు తల అటు దింపి , ఇటు దింపి నెత్తంతా సమరు బూసి,  పిల్లగాండ్లకు    తలంటి స్నానం చేయించినట్టు అనిపించింది. పసి పిలగాండ్లల్ల ,  పెరిగే మొక్కలల్ల దినాం దిరిగే మనుషులకు ఆయిశ్శు పెరుగుతదని మా నాయిన జెప్పేటోడు. ఆ లెక్కన రైతులు , బడి పంతుళ్లు మంచి అదృష్ట వంతులన్నట్టు . ఇగ రైతులంటేనేమో సాంప్రదాయకంగా జూసినప్పుడు ,  తప్పని సరి పరిస్థితులలో మరో నైపుణ్యం రాక లేదా ఇంకో పనిజేసుడు ఆ రోజుల్ల నాదాన్ అనిపించి ఎవుసాయం జేసెటోల్లు. బడి పంతుళ్లు అంటెనేమో కొందరు ఖాయిష్ తోటి ఆ నౌకరికి వస్తే మరికొందరేమో ఉన్న ఊళ్లే నౌకరి , ఎవుసం కూడా జేసు కోవచ్చ్చు , ఓ పూట పోయినా పోకపోయినా   సదువు చెప్పినా చెప్పక పోయినా నడుస్తదని ,  ఖాయిష్ జేసెటోల్లు. మొత్తం మీద ఎట్లైతే ఏందీ గాని వాళ్లకు తెలువకుంటనే ఆయుష్ పెంచుకునే పనిల వఛ్చి పడ్డరు .

ఇగ రైతులైతేనేమో నీయవ్వ ఇంత బతుకు బతికి గా బండ కింది సావు జత్తమారా  అని మా చిన్నప్పుడు రైతు కుటుంబాల యువకులు బొగ్గు బాయి పనికి పోకపోదురు. సరే తర్వాత దానికే పోటీలు బడి ఉరికురికి గెలుసుకున్నరనుకోండ్రి .

ఇంతల రఘోత్తం రెడ్డి సారు నుంచి  ఫోన్, ఏమయ్యా ! తోట పని జేత్త లెవ్వా అని . అరె నేను రోజు చేస్తనే ఉంటి , ఈ సారు గిట్ల అంటడేంది అని మనుసుల అనుకుంటనే , అయ్యో సారు , తలిగిచ్ఛుకున్నప్పుడు తప్పుత దా ఇగో గిప్పుడే నీళ్లు జల్లఛ్చిన నీ ఫోన్ వచ్చింది అన్న.

మరి రాస్త లెవ్వు గద అన్నడు .
రోజు తోట పని జేసినట్టే , చేసిన పని అనుభవం గురించి రోజూ రాయాలే , అన్నడు .
మల్ల నాకు మా పెద్ద సారు పల్లి సీతారాం సారు యాదికొచ్చిండు.
ఈ సదువు , ఎవుసం , ఈ రెండు నన్ను చివరి దాకా విడిచి పెట్టి పొయ్యేటట్టు లెవ్వుగదా అనిపించింది .
సారూ ! రాస్తే రామాయణమంత అయ్యేటట్టు ఉన్నది గదా అన్న.
రాయి , రామాయణమే రాయి నిన్నెవ్వరు వద్దంటున్నరు అన్నాడు.
రాస్తమ్ సార్, కానీ చదివేటోళ్లు ఉండద్దా అన్న.
సరే ! ఏంరాద్దామనుకొంటున్నవ్ అని అడిగిండు.
అదే నా ఎవుసం 1 ల మా నాయిన మట్టి పిసికిన నా చేతులను అవుదు కాడికి తీసుక పొయ్యి ఎందుకు కడిగిండు? ఒకప్పుడు మా నాయిన జేసే కుల కశ్పి నాదాన్ అనుకోని భూమి జాగా కొని ఎవుసం జేసిండు. అసొంటిది  ఆయనే నన్ను ఎవుసం వద్దని సదువుకో బిడ్డా అంటున్నడు . కుల వృత్తులు , ఎవుసాయం కూలి పోయి ఉత్పత్తి తో సంబంధం లేని సేవా రంగమే గొప్పదనే అభిప్రాయం వెనుక సమాజం ఎంత తండ్లాట ఉందొ రాద్దామని , అన్న.
నిజమే ! పెంటయ్య గారూ ! అసలీ కుల వృత్తులన్నీ వ్యవసాయం కోసమే వఛ్చినయాయే . వ్యవసాయాన్ని బలోపేతం జేసే టందుకే ఈ వృత్తులన్నీ వఛ్చినయి. వ్యవసాయం పైన్నే ఈ వృత్తులన్నీ బతికినై. కానీ పాలించేటోళ్లు తలకిందులు ఆలోచనల ఫలితంగా వ్యవసాయాన్ని దెబ్బదీసి నందున ఇవ్వాల కులవృత్తులన్నీ కూలిపోయినయ్. అన్ని వృత్తులల్ల వాల్లే చొరబడ్డరు . పేదోనికి బతుకు దెరువు లేకుంటయ్యింది. సరే ! ఆ రాజకీయం పక్కన బెడుదాం . ఇప్పుడైతే మనటువంటి వాళ్ళు మన స్థాయి లో చిన్న చిన్న ఎవుసం జేద్దాం  ! పెద్ద పెద్ద లాభాలు ఉన్నయని నిరూపిద్దాం అన్నడు ..
భేష్ !  బాగున్నదికదా !