Tuesday, June 28, 2016

          సూడ సక్కని రూపు నీది - సుక్కలల్లో సెందురునివి
          నువ్ పక్కనుంటే పండు వెన్నెల ఆర్ణవయ్యా- నీ రూపమెంతో సక్కనా ఓ ఆర్ణవయ్యా !

          సంద్రమందలి అలలవోలే - ముందుకెనుకకు ఊగుకుంటూ
          అలల పైన నురుగువోలే వీరగోనీ - దోసమెరుగని దొర నవ్వు నీదేనోయీ

          ఊటసెలిమెల నీళ్ళ తీరుగ-- సల్లనీ నీ నవ్వు జూస్తే
          సకల బాధలు సమసి పోవును ఆర్ణవయ్యా - ఆ మహిమ నేర్పిన మానసెవ్వరు ఆర్ణవయ్యా !

          సూరీని కంటే ముందే లేసీ ఆట బొమ్మల పోగు జేస్తే
          ఆ అలికిడికి కుందేటి పిల్లలు ఆర్ణవయ్యా - నీ చుట్టు జేరీ ఆటబెడుతయి ఆర్ణవయ్యా

          ఆటలాడి పాటబాడి అలసి నీవు నిదుర బోతే --
          సల్ల నైనా పిల్ల గాలుల ఆర్ణవయ్యా -- సముద్రుండూ పంపి మురిసెను ఆర్ణవయ్యా !

          మా కంటి వెలుగువు ఇంటి దీపమ - జ్ఞాని గా వెలుగొందవయ్యా
          సెమట సుక్కల విలువ దెలిసీ ఆర్ణవయ్యా - నువ్ సల్లగా వర్ధిల్లవయ్యా ఆర్ణవయ్యా !