Sunday, January 29, 2017

రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 3


ఇవ్వాల ఆంధ్ర జ్యోతి పేపర్లో సిద్ది పేట పోలీస్ కమిష్నర్  తనను వేధిస్తున్నాడని హుస్నాబాద్ సి ఐ గారు  వాపోతు వార్తలల్ల ఎక్కిండు.  అనధికార సమాచారం మేరకు ఒక పోలీస్ స్టేషన్ కు ఎస్సై గానో సి ఐ గానో లేదా ఒక డివిజన్ కు ఏ సి పి గానో పోస్టింగ్ పొందాలంటే రాజకీయ ప్రాపకం తో బాటు గా లక్షల కొద్ది మాముల్లు సమర్పించుకుంటే దప్ప లూప్ లైన్ పోస్టింగు లే నట. ఇందులో కొన్ని స్టేషన్ లకు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందట. ఎందుకంటే అక్కడ బాగా ఆమ్దానీ వచ్చే అవకాశం ఉంటే ఎక్కువ రేటు పలుకుతుందట. గ్రానైట్ క్వారీలు, ఇసుక క్వారీలు, రియల్ ఎస్టేట్ దందాలు , బ్రాందీ షాప్ లు, ఇట్లా బ్లాక్ దందాలు  ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ స్టేషన్ ల కు డిమాండ్ ఉంటదట .


అంటే ఏమిటి చట్ట వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను వీళ్ళు అడ్డుకోనందుకు చట్టవ్యతిరేక వ్యతిరేక దందాదారులు చేస్తున్న వారు  వీళ్ళకు లంచాలు ఇస్తారన్న మాట . మాజీ నక్సలైట్ నయీమ్ వాళ్ళ లాంటి కథలు ఆవేగదా ? చట్ట ప్రకారం జరిగితే తద్వారా సిద్దించే ఆదాయమంతా ప్రజా ప్రభుత్వానికి చేరుతుంది . అన్నీ చట్ట ప్రకారం జరుగాలనే , ఇన్కమ్ టాక్స్ , సేల్స్ టాక్స్ , రెవెన్యూ, కమర్శియల్ టాక్స్, విజిలెన్స్, పోలీస్, ఎక్సైజ్ , ఇట్లా అనేక రకమైన వ్యవస్తలను రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు జేసుకున్నాము. వీటిని ప్రజామోద్య యోగంగా నిర్వహించడానికి చట్ట సభలు , ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఇవన్నీ రాజ్యాంగం పుణ్యాన వచ్చినవే.


కానీ రాజ్యాంగాన్ని కాపాడుతామని, అమలు చేస్తామని వాగ్దానాలు చేసి వచ్చిన రాజకీయ నేతలు , ప్రభుత్వాధికారులు రాజ్యాంగ వ్యవస్తలను వాటి స్పూర్తి మేరకు వాటిని పనిజేయనీయకుండా ఆ వ్యవస్తలను నీరుగారుస్తూ వ్యక్తిగత లబ్ది పొందుతూ అశేష ప్రజానీకం ప్రయోజనాలనన్నింటిని వారికి దక్కకుండా బొక్కేస్తున్నారు .


ఛత్తీస్ గఢ్ లో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా , వనరుల ధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బేలా భాటియా ను రాష్ట్రం విడిచి వెళ్ళి పోవాలని హుకుం జారీ చేస్తున్నారు. భారత పౌరురాలుగా ఆమె కు భారత దేశం లో ఎక్కడైనా నివసించే హక్కు ఉంటది. కానీ అది ఛత్తీస్ గఢ్ లో అమలు ఉండదు.


ఆదానీలు , అంబానీలు వేల కోట్ల రూపాయల పన్నులు , బ్యాంకు అప్పులు చెల్లించడం లేదని సోసియల్ మీడియా లో రోజు వార్తలు వస్తుంటాయి. కానీ వారంతా ముఖ్య మంత్రుల , ప్రధాన మంత్రుల ల చుట్టే ఉంటారు.


ఎన్నికైన పార్ల మెంటు గాని, అసెంబ్లీ గానీ తొలి సమావేశం అయిన నాటి  నుండి అయిదేండ్ల కాలపరిమితి పనిజేయాలని రాజ్యాంగం లో ఉంటుంది. కానీ ప్రధాని మోడి అనుచర వర్గం యేమో  ఒకే దేశం ఒకే సారి ఎన్నికలు అని సభలు, సమావేశాలు పెట్టి పిలుపు ఇస్తాయి.


అమెరికా రాజ్యాంగం ప్రకారం చట్ట పరమైన పేపర్లు ఉన్న వాళ్ళు ఎవ్వరైనా  ఆ దేశం లో నివసించవచ్చు .కానీ డొనాల్డ్ ట్రంప్ యేమో ఫలానా దేశస్తులు అమెరికా లో ఉండకూడదని, రాకూడదని ఫత్వా జారీ జేస్తాడు.

ఒక రాష్ట్రం , ఒక దేశం ,ఒక  అగ్రరాజ్యం ,  ఇట్లా అన్నీ కూడా  రాజ్యాంగాలను ఉల్లంఘిస్తూ , రాజ్యాంగ వ్యవస్తలను కాల రాస్తూ వాళ్ళు మాత్రమే రాజకీయంగా , ఆర్థికంగా మరింత , మరింత బలోపేతం అవుతూ ప్రజలను మాత్రం మరింతగా మరింతగా  పరాధీనులను జేస్తూ  పోతున్నారు. కానీ ప్రజలు మాత్రం మళ్ళీ మళ్ళీ అటువంటి వారినే ఎన్నుకుంటున్నారు.

ఇంటిమీదేవుసమ్ 22

                                              ఇంటిమీదెవుసమ్ 22

ఇయ్యాల నా ఇంటిమీద కోతులు కిస్కింధ కాండే జేసినయ్. బాగా నారాజ్ అయిన. పదేండ్ల సుంది కరీంనగర్ చుట్టుపక్క గుట్టలను గ్రానైట్ క్వారీలకు గంపగుత్తాగా దోచిపెడుతున్నది సర్కారు. పాత సర్కారంటే పరాయోంది తెలంగాణ సర్కారు అట్లా చేయదని కొందరు ఆశ పడ్డరు . వట్టిపోయిన తెలంగాణ కాదు వనరులున్న తెలంగాణ అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రాయే . కానీ సర్కారంటేనే వనరులు దోసుకునుడనే నిర్వచనానికి వచ్చేటట్టు చేస్తున్నై సర్కారులన్నీ.

1969 ల తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్నందున ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం లో విద్యా సంస్తలన్నింటిని సర్కారు మూసివేసింది. అప్పుడు నేను పి  యు సి ( ప్రీ యూనివర్సిటీ కోర్స్ ) చదువుతున్న.కాలేజీ బందై  ఇంటికి పోయినంక ఆ ఏడాది కాలం ఫుల్ టైమ్ ఎవుసమ్ చేసిన. అప్పుడు మా ఊరికి ఉత్తరం వైపు ఉన్న జంగల్ ను హైద్రాబాద్ నుండి ఎవరో సేటు కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం నరికించిండు . ఎడ్డ్ల బండ్ల తోటి ఒక్క దగ్గరికి చేరవేసే తందుకు నేను బండి గట్టుకొని కిరాయికి పోయిన. పెద్ద పెద్ద మాకులు ముక్కలు ముక్కలు నరికిండ్రు. ఇద్దరిద్దరం పట్టి బండి నింపుకొని సడుగు పక్కన ఒక్కదగ్గర కుప్ప వేస్తే అట్లా అడివంత లారీల కు లారీల కొద్ది పట్టణాలకు చేరింది. మిగిలిపోయిన అడివి రష్యా, చైనా, ఇంగ్లాండ్ దొరలకు  దొర పొగాకు అంటే వర్జీనియా పొగాకు క్యూరింగ్ కోసం ఇక్కడి ఇనుప ఫర్నేసులల్లా కాలి బూడిద అయింది.

అట్లా అడువులను తమ దేహం మీద మొలిపించుకొని లక్షల సంవస్తరాల నుండి మానవ మనుగడ కోసం రక్షణ కవచం లా నిలిచిన గుట్టలు , తమ పైన ఉన్న అడువులు అంతరించిన తరువాత దోపిడి దార్లకు గుట్టలంటే నోట్ల కట్టలే అయినై. గుట్టలను ధ్వంసం చేయడం అభివృధ్ధి ఆట. ఆ పని జేస్తున్నందుకు వాళ్ళకు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 300 కోట్లు రాయితీ ఇచ్చిండ్రు. వాళ్ళు పెడుతున్న గ్రానైట్ కోత మిషన్లకు బ్యాంకులు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నాయి. గ్రానైట్ ను పరిశ్రమ గా భావించి ఆ లోన్ల మీద సబ్సిడీ ఇస్తున్నది . అంతేగాదు కరెంటు గూడా వాళ్ళకు సర్కారు సబ్సిడీ పైన సప్లై చేస్తున్నది. సబ్బండ జనాలకు అక్కెరకు ఆదుకునే గుట్టలను ఏ ఒక్కనికో కట్టబెట్టి వాణి లాభాలకు కారణమైతరు  అందుకు ఎవరి ప్రతిఫలం వాళ్ళు పొందుతరు.

మొత్తం గుట్టలన్నీ ధ్వంసం అయిన తర్వాత గుట్టల్ల ఉన్న కోతులు, గుడ్డేలుగులు , కొండచిలువలు, నెమలి పిట్టలు, తేనె టీగలు , గుడ్ల గూబలు ,ఆ గుట్టలల్ల నివాసం ఉన్న  ఆరోక్క జీవ రాశి తమ నివాసాలు కోల్పోయి పునరావాసం కోసం ఊర్ల దారి వట్టినై. పంట పొలాలు, వంటగదులను కోతులకు  నివాసాలు గా చేసింది సర్కారే !

మా చిన్నప్పుడు ఎవ్వరి పశువులన్న పచ్చని పంట పొలం గాని, ఆఖరుకు  దడి దునికి గడ్డి మేసినా గాని బంజెరుదొడ్డి ల కట్టేద్దురు . పశువుల యజమాని తప్పుకు దండుగ కట్టి విడిపించుక పొయ్యేది. మనిశైనా , జంతువైనా ట్రెస్ పాస్ జేస్తే నేరం. జీవ వైవిద్యాన్ని కాపాడ వలసింది సర్కారు. కనుక కోతుల యజమాని సర్కారు అవుతుంది. జంతువు తప్పుజేస్తే జంతువు యజమాని తప్పుదారి అవుతాడు. కనుక కోతులు చేస్తున్న నస్టానికి తప్పుదారు ఎవ్వరైతరో ఎవ్వర్ని బంజేరు దొడ్లే వెయ్యాన్నో  మీరే చెప్పాలే !

Saturday, January 28, 2017

యాది ..మనాది 2

                                                  యాది --- మనాది  2

యాది మనాది 2 ఇంత వెంటనే రాస్తా అని అనుకోలేదు.ఈ రోజు  పొద్దున లేవంగానే మా అల్లుడు బుర్ర తిరుపతి నుండి  మెస్సెజ్ వచ్చింది. రామోజు సత్యనారాయణ శర్మ గుండె పోటు తో రాత్రి చనిపోయిండని . గుండె కలుక్కుమన్నది .  నేను మరొక ఆప్త మిత్రున్ని కోల్పోయిన.

ఎప్పటి యాది ?

అది 1979 సెప్టెంబర్ 30 . మా నాయిన వీరగొని నర్సయ్య నన్ను ఒంటరి వాన్ని చేసి వెళ్ళిపోయిన రోజు. అక్టోబర్ లో దసరా పండుగ వచ్చింది. అప్పుడు నా భార్య లక్ష్మి మేన మామ ఎగోలపు రాజయ్య మమ్ములను ధన్నవాడ నుండి మంగ పేట కు దసరా పండుగకు పిలుచుకొని పోయిండు . . మంగ పేటను నేను ఎప్పుడు యాది జేసుకున్నా ఆ రోజుల్లో ఎప్పుడూ పారే హుస్సేన్ మియా వాగు, ఆ వాగు నీళ్ళతో ఆ ఒడ్డు ,  ఈ ఒడ్డు  , న ఉన్న పొలాలన్నీ సస్యశ్యామలమై ఉండడం , ఊరు చుట్టూ పెద్ద పెద్ద తాటి చెట్లు, సారవంతమైన మట్టి , నీళ్ళు, పంటలు పండించే తందుకు శ్రమ పడే యువ శక్తి పుష్కలంగా ఉన్న గ్రామం యాదికి వస్తది .

మా తమ్ముడు ఏగోలపు రాజేందర్ ,  బావమర్ది  బుర్ర రాయమల్లు , మామ వరుస అయ్యే బుర్ర చిన్నన్న వీళ్ళంతా చుట్టాలు కావడం మూలంగా వాళ్ళకు గురువు లాంటి సత్యనారాయణ శర్మ ఇంటికి నన్ను తీసుక పోయి నన్ను ఆయనకు పరిచయం చేసిండ్రు. అట్లా సత్యనారాయణ శర్మ నాకు 38 ఏండ్ల కింద పరిచయం అయిండంటే ఇగో ఈ రోజు మా సోపతి విడిపోయింది. సత్యనారాయణ శర్మ ఊరు యువకులనందరిని కూర్చొబెట్టుకొని తనకు తెలిసిన విషయాలన్నీ వారికి బోధించే వాడు. అట్లా సత్యనారాయణ శర్మ కాస్త సత్తెయ్య పంతులు అయిండు . ఆనాటికి ఆయన ఇంకా ప్రభుత్వ టీచర్ కాలేదు. కానీ పౌరోహిత్యం కూడా చేస్తున్నందున అందరూ సత్తెయ్య పంతులు అనే పిలిచేవాళ్లు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన తర్వాత ఆయన పేరు రిజిస్టర్ లో సత్యనారాయణ శర్మ అయింది. కానీ ఆబాల గోపాలానికి మాత్రం ఆయన సత్యనారాయణ పంతులు లేదా సత్తెయ్య పంతులే.

నా ఆహ్వానం మేరకు 1980 జనవరి ల ఆయన మిత్రుడు టి. తేజన మూర్తిని తీసుకొని ఒక సైకిల్ మోటార్ పైన మా ఊరు ధన్నవాడకు వచ్చిండ్రు. మా ఊరికి చేరుకునే వరకు వాల్లు తెచ్చిన ఆ పాత మోటార్ బైక్ మొరాయించి స్టార్ట్ కాకుండా ఉండిపోయింది. మెకానిక్ లు ఎవ్వరూ ఉండని  ఊరు మాది. బండిని విడిచి పెట్టి పోలేని పరిస్తితి వారిది. ఆ బండి పుణ్యాన మూడు రోజుల పాటు మేము ముగ్గురం చాలా విషయాలు చర్చించుకునే అవకాశం దొరికింది .వాళ్ళు ఇద్దరు పక్కా సాంప్రదాయ వాదులు. నేను వాటికి విరుద్ద భావజాలం కలిగిన వాన్ని.  అయినా కూడా ఎక్కడ కూడా ఆ మూడు రోజుల మా అభిప్రాయాల కలబోతలో ఎవరిని ఎవరం హర్ట్ చేసుకోలేదు.,  పైపెచ్చు మా స్నేహం గట్టిపడ్డది కూడా అప్పుడే .

ఎస్. రామ చెంద్రమ్ అని కరీంనగర్ కార్ఖానా గడ్డకు చెందిన ఒక ఉపాధ్యాయుడు మా " సి వో యు " ఆధీనం లో ఉన్న గుమ్మళ్ళ పెళ్ళిలో హెడ్ మాస్టర్ గా పనిజేస్తుండే వాడు . నాతో ఏదో పనిబడి ఆయన మా ఇంటికి వస్తే సైకిల్ మోటార్ విషయం చెప్పిన. కిందా మీదా పడి బండిని స్టార్ట్ చేసిండు. నా ఆతిథ్యానికి ధన్యవాదాలు చెప్పి తిరుగు ప్రయాణమైనారు .

ఆ తర్వాత ఆయన స్వంత తమ్ముడు రామోజుల శంకర్ అలియాస్ చెంద్రన్న  ఈ సమాజాన్ని దురస్తు జేసె పనిలో సాయుధుడై వెళ్లిపోయిండు. ఒకే తలిదండ్రుల పెంపకం లోపుట్టి పెరిగిన అన్నదమ్ములు  ఇద్దరు భిన్న దృవాలను ఎంచు కున్నారు.

మంగ పేట గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్, బురా రాయమల్లు, ఏగోలపు రాజేందర్ ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటం లో అసువులు బాసినారు. ఈ సమాజానికి మంగపేట మట్టి ,   హుసేన్ మియా వాగు తన పురిటి బిడ్డలను బహుమతి గా ఇచ్చింది.



ప్రత్యామ్నాయ రాజకీయాలకై పోరు బాట ఎంచుకున్న వాళ్ళు, జయరాజన్న పాట బాడి నట్టు   "  పేరు కోసం అందామా అయ్య అవ్వబెట్టిన పేర్లు ఉండై, డబ్బు సంపాయించడం కోసం అందామా సంక సద్దిగూడా ఉండది. " అట్లా కేవలం ప్రజల సామాజిక హక్కుల కోసం పోరాటం జెసి అమరులైతే వాళ్ళ చుట్టాలు పక్కాలు వారికి వారసత్వ హక్కుగా ఉండే భూమిని కాజేసి అమరుల భార్యా బిడ్డలను ఆగం జేసె ప్రయత్నం జరుగుతున్నది . ఆ క్రమం లో బుర్ర చిన్నన్న అమరుడైతే ఆయన పాలు భూమిని ఆమ్ముకొనే ప్రయత్నం జరిగింది. ఆ సందర్భం లో సత్యనారాయణ శర్మ ఆ గ్రామం " ఆలివర్ గోల్డ్ స్మిత్ విలేజ్ స్కూల్ మాస్టర్ "  వలె బుర్ర చిన్నన్న భార్యా బిడ్డల పక్షాన నిలిచి వారి హక్కులను కాపాడే కృషి చేసిండు.

అలాంటి వ్యక్తికి శ్రధ్ద్ధాంజలి ఘటించి హుసేన్ మియా వాగులోంచి నడిచి వస్తుంటే సత్యనారాయణ శర్మ మనుమడు ఎవరితోనో చెప్పుతున్నడు " మా తాతయ్య కాలి పోతున్నడు చూస్తున్న , ఆగు " . అని . ఆ పసి హృదయం ఎంత మదన పడుతున్నదో కదా అని గుండె బరువెక్కిన హృదయాన్ని  చిక్కబట్టుకొని ఇల్లు జేరిన .

Friday, January 27, 2017

యాది .. . మనాది !

                                                    యాది --- మనాది   1

అదే రెటైర్ అయిన కొత్త లో ఒక రోజు ఆకుల భూమయ్య సార్ కాల్ చేసిండు. ఆ రోజు నేను మా ఊరు ధన్నవాడ లో ఉన్నాను. అదే విషయం చెప్పిన. ఏం పని మీద వెళ్ళినావని అడిగితే , మనకు చదువనేర్పిన  , నడత నేర్పిన బడికి మన రుణం దీర్చుకొనే పనిమీద వెళ్ళిన అని చెప్పిన. ఎలా చేస్తున్నావాపని అని అడిగితే , ఇవ్వాళ సర్కారు బడికి వస్తున్న పిల్లలు అందరూ దాదాపుగా పేదవాళ్లే కనుక మనకు చేతనైన ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదీ  మా నాయిన వీరగొని నర్సయ్య జ్ఞాపకార్థం ఇస్తున్నట్టు చెప్పిన. మంచి పని చేస్తున్నవ్ . ఇక నుండి నేను కూడా మా ఊరు జులపెళ్ళి మండలం కాచాపూర్ బడికి ఏదో ఒకటి చేస్తానని చెప్పిండు.

అన్న మాట ప్రకారం 2009 జనవరి నుండి ఆయన కూడా పదివేల రూపాయల చొప్పున 15 ఆగస్టు, 26 జనవరికి కాచాపూర్ విద్యార్థులకు  ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే ప్రతిసారి రేపు ప్రోగ్రామ్ ఆనంగా ఒక రోజు ముందుగా కరీంనగర్ లో మా ఇంటికి వచ్చేవాడు, ఒక్కొక్క సారి అరునక్క కూడా ఆయన వెంట వచ్చేది. ప్రోగ్రామ్ రోజున తెల్లవారు జామున్నే లేచి ప్రయాణమై నలుగురమ్ కలిసి పెద్దపల్లి వరకు వెళ్ళి వారిని పెద్దపల్లి జండా చౌరస్త్తా వద్ద వదిలి మేము ధన్నవాడకు వెళ్ళే వాళ్ళం. సాయంత్రానికి కరీంనగర్ చేరుకొనే వాళ్ళం. వీలైతే హైద్రాబాద్ వెళ్ళే వాడు వీలు కాకుంటే మా ఇంట్లోనే ఉండే వాడు. అప్పుడప్పుడు మా మనుమరాలు శ్రీజని తో ఆయన ఎక్కువ సమయం గడిపే వాడు. ఆమె కాస్త అల్లరి పిల్ల . అల్లరి పిల్లలను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. వాళ్ళిద్దరు మంచి దోస్తులు  .అయ్యిండ్రు .

విగత జీవుడైన భూమయ్య సార్  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో రాత్రి పది గంటలకు వస్తే శ్రీజని పట్టుబట్టి భూమయ్య సార్ ముఖం చూసి శ్రద్దంజలి చెప్పి తన దుఖం పంచుకున్నది. నాకు భూమయ్య తాతను చూడబుద్ది అవుతుందని ఎన్నో సార్లు మారాం చేసింది కూడా. ఎలా తెచ్చి చూపగలం, ఏమని సముదాయించగలం ?

2013 డిసెంబర్ 24 నాడు ప్రొఫెసర్  కాశిం గారు  రాసిన తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించి ,  ప్రసంగించిన సందర్భం లో  తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో అమరులైన వారీనందరిని పేరుపేరుణా యాది జేసి ఇంటికి చేరకముందే రోడ్డు ప్రమాదం పేరు తో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు భూమయ్య సార్ ను కబళించింది . జీవించినంత కాలం శాస్రీయ విద్యా విధానం కోసం, ప్రజల జీవించే హక్కుల కోసం , ప్రజాస్వామిక తెలంగాణ కోసం , అనుక్షణం విరామం లేకుండా ఉద్యమాలు నిర్మించిన ప్రజా ఉపాధ్యాయుడు ఆకస్మికంగా హఠాత్తుగా అదృశ్యం చేయబడ్డాడు. ఒక వేల ఆ ఒక్క రోజు భూమయ్య సార్ జాగ్రత్తగా ఉండి ఉంటే నిన్న మాతో బాటుగా పెద్దపల్లి వరకు వచ్చి కాచాపూర్ బడి పిల్లల కు సంతోషాలు పంచేవాడు కదా అనేది ఇవ్వాల్టీ నా మనాది.

ఇంటిమీదెవుసమ్ 21

                                                              ఇంటిమీదెవుసమ్ 21

గత 8 సంవస్తరాల నుండి నేను  పుట్టి పెరుగిగి, ఆడి పాడి, బతుకు పాఠాలు నేర్చుకున్న  ఊరిలో, నేనూ , నా పిల్లలు కూడా చదువుకున్న, మా ఊరి బడికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న పిల్లలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఒక పని గా పెట్టుకున్నాను.  ప్రతి 15 వ  ఆగస్ట్ కు వెళ్ళేవాన్ని. ఈ సారి ఆ సమయం లో నేను ఇక్కడ లేకపోవడం చేత 26 జనవరినాడు , నిన్న  వెళ్ళినాను. ఐతే నేను వెళ్ళి ఆ విద్యార్థులను ప్రోత్సహించడం మాత్రమే గాకుండా నా పూర్వ విద్యార్థులు అదే పాఠశాలలో చదువుకున్న వారిని సైతం మోటివేట్ జేసి వారోతో కూడా పాఠశాల అవసరాలకు ఆర్థికంగా సహాయం చేయిస్తున్నాను. ఆ క్రమం లో ఇన్సూరెన్సే కంపనీలో ఉన్నతోద్యోగం చేస్తున్న నా పూర్వ  విద్యార్థి గాడపర్తి వెంకటేశ్వర్లు తన సతీ సమేతంగా పాఠశాలకు వచ్చి పిల్లలకు ప్రోత్సాహకాలు అందించాడు.

ఆ సందర్భంగా మా నాయిన జ్ఞాపకార్థం మిగిలి ఉన్న మడ్ల చేనుకు పోయిన . మా ఇండ్లకు దగ్గర్లోనే ఉంటది. అక్కడనే నేను జొన్న చేనుకు పిట్టే కావాలి కాసింది.   20 వ పోస్ట్ లో నేను రాసిన విషయాల కొనసాగింపు కు అక్కడ మరింత  సమాచారం దొరికింది.

20 వ పోస్ట్ లో మనిషి తన పంట కాపాడు కోవడానికి పురుగుమందు కలిపిన బియ్యం చల్లి పశు పక్షాదుల మరణానికి కారణమైన విషయం అందులో రాసినాను. ఐతే ఇక్కడ ఇదే చేనులో నేను పిట్ట కావాలి కాసిన రోజుల్లో మా ఊరి చుట్టూ అతి దగ్గరలో చిట్టడివి ఉండేది. కొంచెం దూరం పోతిమా అంటే పెద్ద అడివే  ఉండేది. రాత్రంతా ఆ అడివిలో తల దాచుకొనే పక్షులు తెల్ల వారకుంటానే జొన్న చేన్ల మీదికి ఆహారం కోసం వచ్చేవి. మేము అప్పటి ,  ఆ , అడివంచునున్న గ్రామాలల్లో ఉండే ఆ చలిలో గజ గజ వణుకుతూ తల చుట్టూ వరికట్లమ్ కట్టుకొని ఈ పిట్టలను చేన్ల పైన వాలకుంటా ఒడిశెండ్ల తోటి కొట్టుకుంటా మంచెమీద కావాలి ఉందుము. ఒక్కొక్క సారి రామ చిలుకలు గుంపులకొద్ది వచ్చేటియి . మంచే మీది నుంచి ఒడిశెల తోటి విసిరే ఒడిశెల గుండ్ల చప్పుడుకు లేవకుంట అట్లనే జొన్న కంకులు తినుకుంట కర్రలమీదనే ఉండేటియి . అప్పుడు మంచే దిగి చిలుకలు వాలిన పుట్టుగుంపుల దిక్కు ఏయ్ ! లే లే అని మొత్తుకుంట ఉరుకుదుము . ఆకలి మీద ఉండునో ఏమో కొన్ని చిలుకలు అస్సలు లేవకుంట అట్లనే ఉండేటియి. అప్పుడు మా జొన్నలు దొంగతనంగా తింటున్నారా అని కోపం తో ఉన్న నేను మెల్లగా ఒక రామ చిలుక తోకను యెనుకనుంచి దొరుక వుచ్చుకున్న. కేర్ కేర్ మని ఒక్కటే లొల్లి జేసుకుంటా దొరికిన కాడనల్లా కొరకవట్టింది .  దొరికినవ్ బిడ్డా నీ సంగతి ఇట్లగాదని రెక్కలు మెలివెట్టి మంచెకాడికి తీసుకవోయిన . భయం తోటి ఉన్నదాయే తప్పిచ్చుక పోదామని రెండు మూడు ప్రయత్నాలు చేసింది కానీ నేను సాగనీయ్యలేదు.

ఇంటికి వొయ్యే టప్పుడు మెల్లెగా దాని నున్నటి రెక్కలు, మెడ దువ్వుకుంట దాని అందమైన , ఎర్రటి ముక్కును సరిదిద్దుకుంటా ఆనందం తోటి దాన్ని ఇంటికి తీసుకొని పోయిన. గలుమల్లనే నన్నుజూసిన నాయిన " ఏందిరా ! రామ చిలకను దొరుకవట్టినవా? ఇడిచి పెట్టు ఇడిచి పెట్టు పాపం దలుగుతదిరా ? " అన్నడు .

" ఏ ! నేనెక్కడ ఇడిసి పెడుత . చేనంత తిన్నది. ఇంకో సారి సేను మొఖాన రాకుంట జేసి గాని దీన్ని ఇడిసి పెట్ట అన్న "

" అరే ! అద్దు కొడుకా , అవ్వెట్ల బతుకాలే రా ! పండిచ్చిన పంటంత మనమే తింటమార ? అచ్చెగాడు , బిచ్చెగాడు , పసులు, పచ్చులు అందరు తింటరు ,  అన్నీ బతుకాలే . ఇడిసి పెట్టు ఇడిసి పెట్టు " అని నేను ఆ రామ చిలుకను విడిచి పెట్టేదాకా ఊకుండలేదు .

Wednesday, January 25, 2017

రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 2

                                              రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 2

ఆబ్కారి శాఖ లో పనిజేస్తున్న మా మిత్రుడు యుగంధర్ ఫేస్ బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేసిండు. అందులో ఒక సి ఐ మీడియా తో మాట్లాడుతూ ప్రతి బ్రాందీ షాప్ నుండి వారు నెలకు 50 వేల లంచాలు వసూలు జెసి పై అధికారులకు పంపితేనే ఎవరి వాటా వారు తీసుకొని వీరి నెల జీతాలు విడుదల చేస్తారట . లేదంటే అడ్డగోలు స్కాడ్ లు వేసి వేధిస్తారట . ఆయన బైటికి వచ్చి మీడియా తో అంత ఓపన్ గా చెప్పాడు. కొద్ది రోజులక్రితం సిద్దిపేట డివిజన్ లో ఒక పోలెసు అధికారి గ్రానైట్ లారీల నుండి లంచాలు వసూలు చేసి ఇవ్వలేనని ఆత్మహత్య ఛేసుకున్న విషయం చూశాము. నయీమ్ అనే ఒక మాజీ నక్సలైట్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల,పెద్ద పెద్ద ఐ ఎ ఎస్,  ఐ పి ఎస్ , అధికారుల అండదండలతో వేల ఎకరాల భూమి  కబ్జా జేసి, పదుల సంఖ్య లో హత్యలు, మాన భంగాలుచేసి నట్లు గా మీడియా లో లీకులు చదివాము. సర్కారేమో అటువంటిది ఏమీ లేదని ఏకంగా కోర్టుకే చెప్పేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక ఐ   పి  ఎస్ అధికారి ఎర్ర చెందనం రక్షించే క్లూస్ టీం బాస్ అయి ఉండి కూడా ఆఫీసు లో జరుగుతున్న లీకుల మూలంగా ఎలా చేస్టలుడిగి ఉండి పోవాల్సి వస్తున్నదో అంటూ ఏకంగా మీడియా ముందే వాపోయాడు.

మొన్నటికి మొన్న ఒక బార్డర్ సిపాయి తనకు పెడుతున్న భోజనం ఎ పంది కొక్కులు తినిపోతున్నాయో అంటూ మీడియా ముందు ప్రాణ భయం తో బిక్కుబిక్కు మని వాపోయింది చూశాము. నోట్ల రద్దు, దాని పర్యవసానం, ఆ సంధర్భంగా వచ్చిన పాత నోట్లు ఎన్ని? ముద్రించిన కొత్త నోట్లు ఎన్ని ? దానికి సంబంధించిన ఫైల్ పరిశీలించుటకు వచ్చిన పార్లమెంటరీ కమిటీ ముందు ఆర్ బి ఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ జవాబు చెప్పకున్నా ఫరువాలేదని సాక్షాత్ పరిశీలించడానికే వచ్చిన మాజీ ఆర్ బి ఐ గవర్నర్ మద్దతుగా నిలుస్తాడు . ఎవరి ప్రయోజనాల కొరకు ఎవరు ఎవరిని కాపాడుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బొగ్గు కుంభకోణం, టెలికాం కుంభకోణం, జి3 కుంభకోణాలకు లెక్కలేని , బాధ్యత లేని , భయం లేని రాజ్యం అయిపోయింది . చత్తెస్ గఢ్ లో సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్కజేయకుండా ఇప్పటికీ కొత్త మొఖం తో సల్వా జూడుం  , జులుం నడుస్తూనే ఉంది.

రేపు రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజును భారత ప్రజలు గర్వంగా జరుపుకోబోతున్నారు. కానీ బలిసిన  వారి ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్తలను ఇలా కూల్చి వేస్తూ పోతుంటే ఈ రాజ్యాంగం పైన ప్రజలకు విశ్వాసం ఎలా బలపడుతుందో రాజ్యాంగ నేతలు ఆలోచించాల్సిన విషయం .

ఇంటిమీదెవుసమ్ 20

                                                                  ఇంటిమీదెవుసమ్ 20


పురుగుమందులు చల్లడం వలన మేలుజేసే క్రిమికీటకాలు కూడా నశించి పోతున్నాయని రాసిన రాతలు చదివిన తర్వాత నా అనుభవం లోని విషయాలు కూడా మీతో పంచుకోవాలని రాస్తున్నాను.


రెండు సంవస్తారాల క్రితం అక్టోబర్ మాసం లో మా ఊరికి పోవాల్సి వచ్చింది. మా అన్న కొడుకు ఈత చెట్టు పైనుండి పడి చనిపోయిండు .  ఆ సందర్భం లో మూడవ రోజు , ఐదవ రోజు శవాన్ని దహనం చేసిన చోట వంట జేసి పక్షులకు పెట్టడం సాంప్రదాయం. పక్షులు వచ్చి తినిపోయేదాకా బంధుమిత్రులు అక్కడే ఉంటారు. చాలా సేపు వేచి చూసినమ్ ఒక్క పక్షి కూడా రాలేదు. ఈ విషయం ఎన్నో సార్లు ఎందరో కథలు కథలుగా రాశారు కూడా. సరే ఏ పక్షి రాకపోయినా మనషులు ఆగిపోరు కదా?


ఆ రెండుమూడు రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. మా వాడకు పడమర వైపు కాపొల్ల వాడ ఉంటది. నాతో చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నేను చదువు చెప్పిన విద్యార్థులు చాలా మంది ఆ వాడలో ఉంటారు. వాళ్ళతో కాసేపు కాల క్షేపం చేద్దామని అక్కడికి వెళ్ళిన. నేను వెళ్ళిన తర్వాత నా విద్యార్థులు ఓ పది పదిహేను మంది జమైనారు. వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్న వాళ్ళే. అందరూ వరి , పత్తి   ప్రధానంగా పండిస్తున్నవారే.


ఎవరెవరు ఎన్నెన్ని ఏకరాల్లో పత్తి , వరివేసింది ఆరా తీస్తున్నాను. వాళ్ళు చెపుతున్నారు. ఏ పంట సులభం అంటే వరి సులభం పత్తి కి ఎక్కువ పని పెట్టుబడి అన్నారు. మా చిన్నప్పుడు మన ఊరు చుట్టూ ఉన్నా చేన్లల్ల అయితే తెల్ల జొన్న, లేదా నువ్వులు, కందులు, గోధుమలు వేద్దురు కదా ఇప్పుడు ఎందుకు వేస్తా లేరు? అంతకస్టమైనా ఆ పత్తినే ఎందుకు పండిస్తున్నారని అడిగిన. కస్టపడ్డా లాభం వస్తున్నదని అన్నారు. జొన్నలు, కందులు పండుత లెవ్వు , పండినా ధర ఉంటలేదు. పెట్టుబడి వెల్లడమే కస్టమైతాంది అన్నరు .


కానీ పత్తికి ఇత్తునమ్ బెట్టిన కాన్నుంచి మందులే అన్నరు. ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు కొడుతరు అని అడిగిన.
విత్తనాలు వచ్చుడే మందు కలిపి వస్తున్నై కనుక మునుపటి తీరుగా పెంక పురుగు ఏమీ ముడుతలేదు . కానీ పక్షులే తవ్వుకొని బుక్కుతున్నై . అందుకని  పక్షులు తినకుంట ఏంజేస్తున్నారంటే , ఇయ్యాల రేపు అగ్గువకు దొరికే కిలో రూపాయి బియ్యం ఓ బస్తా,  అరబస్తా కొని ఆ బియ్యం ల  ఎండ్రీన్ కలిపి చేనంత చల్లుతరు . ఇగ ఆ బియ్యం తిన్న కాకులు , గోర్రెంకలు, ఉరవిస్కెలు, రామ చిలుకలు , దుబ్బెర పిట్టలు , అక్కడనే చేనులనే చచ్చిపోతై. రెండుమూడు రోజులు చేనంత గబ్బు వాసనే. ఆ చచ్చిన పిట్టల తిన్న గద్దలు, పిల్లులు, కుక్కలు కూడా చచ్చి పోతున్నయని వాళ్ళు చెప్పంగానే నేను నోరెల్లవెట్టిన .

Sunday, January 15, 2017

ఇంటిమీదెవుసమ్ 19

                                          ఇంటిమీదెవుసమ్ 19

కూరగాయల మొక్కల పెంపకం దినచర్యలో ఒక భాగమైపోయింది. సమయం చాలడం లేదు. వాటి మధ్యన కూర్చుంటే వాటి రక్షణ లో భాగంగా చేయవల్సిన పనుల జాబితా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలతో నిండి పోతున్నది. బయటి అంశాలతో అనేక విషయాల సారూప్యత కనిపించి రాయవల్సిన అంశాలు కూడా చాలా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చి చేరిపోతున్నాయి.

మొన్న ఖత్లాపూర్ మండలం దుంపేట్ గ్రామం లో ఆకుల స్వామి అనే మిత్రుని ఆహ్వానం మేరకు ఆ గ్రామం వెళ్ళిన. కుశల ప్రశ్నల అనంతరం ఆయన నన్ను ఆ ఊళ్ళో ఉన్న గుడికి పోదాం అన్నడు . అబ్బా ! ఊరూరికి ఓ గుడి ఉండనే ఉంటది, నాకు ఆ విషయం లో పెద్దగా ఆసక్తి లేదు,  ఇంకా ఏదన్నా ఉంటే చెప్పు పోదాం అన్నాను. గుడి పక్కన్నే ఎనుకటిది ఒక గడి ఉంది దాన్ని కూడా చూడ వచ్చు అన్నాడు. సరే అని బయల్దేరినమ్.

భూమి చల్లబడుతున్న కాలం నాడు పుడమి తల్లి కడుపు  అడుగు పొరలల్లో సలసల మసులుతున్న లావా , బలహీన పొరలున్న ఛోటా ఆ పొరలను చీల్చుకొని బయటకు వచ్చి ,  చల్లారి గుట్టలు గా,  గండ శిలలు గా మారిన విషయం చిన్నప్పుడు భూగోళ శాస్త్రం లో చదువుకున్నాం. దుంపేట లో కూడా అట్లా ఏర్పడిన ఒక చిన్న గుట్ట ఉంది .  ఏ కాలం లోనో జరిగిన భూకంపానికి ఆ గుట్ట శిలలు కంపించి ఒక రాయి పైన మరో రాయి పడి ఒక చిన్న  గుహ లాగా ఏర్పడ్డది. అట్లా ఏర్పడ్డ ఆ సోరికే లో ఎవరో ఒక ఆస్తిక వాది దేవతాయుత దేవుని చ్తిత్రాన్ని బండ పైన చెక్కినాడు. ఆ చిత్రానికి మొదలైన పూజా , ఆ స్వయంభు లక్శ్మినర్సింహా స్వామి తదనంతరం విగ్రహానికి నోచుకోని గుడి కి నోచుకోని ధూప దీప నైవేద్యాలకు భూమి కలిగియుండి ఇప్పటికీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం ఠంచన్ గా ప్రతి యేడాది జరుగుతున్నట్లు గా అక్కడి పెద్దమనుషులు చెప్పినారు.

భావ మాత్రమై విశ్వాసాల పునాది పైన వెలసిన దేవునికి ఎకరాల కొద్దీ భూమి ఉంటుంది,  నిత్యం ధూప దీప నైవేద్యాల తో బాటు ఏడాది కొ సారి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా జరుగుతుంది.   ఇలాంటి  పుణ్య భూమి లోలక్షలాది మంది ప్రాణముండి కదిలాడే మనుషులు  ఆరోగ్యాని , ఆకటి  తిండికి మొఖం వాచీ ఎందరో నేత, గీతా, వ్యవసాయ, కార్మికులు ,బలవన్మరణాల పాలై వేల సంక్ష్యలో పరతి ఏడు నేలకోరుగుతున్నారు. ఎందుకు ఇట్లా అనేది ఎవరికీ పెద్ద చర్చనీయ అంశం కాకుండా పోతున్నది.  రాజ్యాంగం నిర్దేశించిన ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు గాని , ఆరోగ్యంగా జీవించే హక్కు గాని వీరికి ఎందుకు హుళిక్కో అడిగితిమా అంటే ఇక మన పని అంతే !

పక్కనున్నా పాత గడీ గురించి  మల్లో సారి మాట్లాడుకుందాం

Thursday, January 12, 2017

ఇందుకు బాధ్యులెవ్వరు ?

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రాస్  బడిని తనిఖీ చేసిండు. పిల్లలు వాళ్ళ పేర్లు , తలిదండ్రుల పేర్లు తప్పుగా రాసిండ్రు. బస్. సార్లను సస్పెండ్ చేసిండు. శబ్బాస్ !
జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ సాబ్ బడి తనిఖీ జేసిండు. ముగ్గురు సార్లను ఇంటికి బంపిండు.  శబ్బాస్ ! రోనాల్డ్ రాస్ సార్ నిజామా బాదు ల ఆదిల బాదుల అక్కన్నో ముడేండ్లు ఇక్కన్నో మూడేన్లు పని జెసి నట్టే ఉన్నది. ఆయిన పని జెసి వచ్చిన కాడ బల్లన్ని బాగు పది పోయిన యా ? ఆహా ! విమర్శించడం  కాదు గాని,  ఇన్ని రోజుల సంది సర్కారు బళ్ళు ఇంతకంటే మంచిగా నడిచినయా ? ఇప్పుడే చెడిపోయినయా ?  ఇంత కోపం ఎందుకొచ్చే పెద్ద సార్లకు. కడియం సార్ బళ్ళను దురస్తు జేస్తా అన్నాడో లేదో కలెక్టర్ సాబులు కత్తులు దీసుకొని కుత్తుకలు ఉత్తరిస్తుండ్రు.

టీచర్లది  అస్సలే తప్పు లేదని వాళ్ళను నేనేమీ సమర్థించడం లేదు . కానీ ఇప్పుడు ఈ కలెక్టర్లు ఎత్తి చూపుతున్న తప్పులు ఇప్పటికిప్పుడే తయ్యారు అయినయా లేక దశాబ్దాల ఉదాసీనత  ఫలితమా ఒక సారి ఆలోచించాలే. 1990 నూతన విద్యా విద్యా విధానం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల అనుయాయులు, కొండొకచోట రాజకీయ నాయకులే ప్రైవేట్ విద్యా సంస్తలను ప్రారంభించారు. అవి లాభాల బాట పట్టడానికి ప్రభుత్వ సంస్థలను బలహీన పరిచారు. ఉపాధ్యాయుల ఖాళీలను ఏండ్ల తరబడి నింపలేదు. సర్కారు బడులల్లా చదువు చెప్పే టీచర్లు సరిపోయినంత మంది ఉండరినే అభిప్రాయం కలిగించింది రాజకీయ వ్యవస్తే. 1990 నుండి 2000 దాకా ఈ రకమైన దాడి జెసి ఆ తర్వాత GATT WTO ల ఒప్పందం మేరకు ప్రబుత్వ రంగ సంస్థలను బొందబెట్టే కార్యక్రమం లో భాగంగా ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేశారు. 2010 వరకు ఆ పని సంపూర్ణం జేసిన సర్కారు, 2010 నుండి సెకండరీ విద్య వెంట బడి ఆ కార్యం కూడా ముగించింది. ఇక ఇప్పుడు విశ్వవిద్యాలయాల భరతం పట్టే పనిలో నిమగ్నమైంది. అయితే అది చేస్తున్న పనికి ఒక విశ్వసనీయత కావాలి. అందుకే , ఈ సస్పెన్షన్లు , టీచర్లను భయబ్రాంతుల చేయడం, ప్రజల్లో బాదునామ్ చేయడం అందుకే. కనుక రోగికి  ఎయిడ్స్ రక్తం ఎక్కించిందీ తనే , ఆ వ్యక్తి ఎయిడ్స్ రోగీ అని వెక్కిరిస్తున్నదీ తనే.

WTO ,  GATT ల ఆదేశాల మేరకు ప్రభుత్వాలు  ఇవ్వాళ విద్య ను మొత్తంగా ప్రైవేటీకరించడానికి  నిర్ణయించుకొని, రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 41 నుండి 45 వరుకు రాసిపెట్టిన నిర్బంధోచిత ప్రాథమిక విద్యను పాతరేస్తున్నాయి .  మన పాలకులకు భారత రాజ్యాంగం కంటే గూడా WTO ,  GATT ల ఆదేశాలే శిరోధార్యం అయినట్టు ఉంది.

ఆ టీచర్లకు చదువు నేర్పింది ఈ సర్కారు వ్యవస్తే, ఆయనను టీచర్ గా ఎంపిక జేసింది ఈ సర్కారు వ్యవస్తే, ఆయన్ను ఇంతవరదాకా చదువు చెప్పకున్నా ఉపేక్షించింది ఈ సర్కారు వ్యవస్తే, అవ్వన్నీ సర్కారు వ్యవస్తాకు తెలిసే జరిగినాయి కదా ? ఈ విద్యా వ్యవస్తాలు ఇలా చెడి పోవడానికి, ఆ ఉపాధ్యాయుడు, ఆ హెడ్ మాస్టర్, ఆ ఏం ఈ వో, ఆ డి ఈ వో.. ఆ కలెక్టర్, ఆ  విద్యా మంత్రి, ఆ  ముఖ్య మంత్రి, ఆ  ప్రధాన మంత్రి అందరు బాధ్యులే.

ప్రవేట్ అంటేనే వారి పెట్టుబడికి లాభాల గ్యారెంటీ  కావాలి . అడిగినంత ఫీసు చెల్లించి చదువిన చదువరి,  తను పెట్టిన పెట్టుబడి పోనూ లాభం కోరుకుంటాడు. డబ్బు పెట్టి చదువు అనే సరుకు కొంటాడు. ఆ విద్యను ఒంట బట్టించుకొన్న ఆ మనిషి తానే సరుకై అంగట్లో నిలబడి అమ్ముడు పోతాడు. ఆ  మనిషి రక్తం, మెదడు, అంతా సరుకే. సరుకులు అమ్ముకోవడం సొమ్ముజేసుకోవడం వ్యాపార నీతి. ఇక నుండి మానవ సమాజం పరస్పర సహకారం, సామరస్య పూర్వక సహజీవనం కాకుండా వ్యాపార నీతి ప్రధానంగా ఉంటుందన్న మాట. అటువైపు మన విద్యా విధానాన్ని నడిపిస్తున్న రాజకీయ వ్యవస్తాను డిస్ మిస్ జేయడం న్యాయమా ? అక్కు పక్షి బడి పంతులును సస్పెండు జేయడం న్యాయమా వ్యవస్తా ఆలోచించాలే. !

Saturday, January 7, 2017

రాజ్యాంగ వ్యవస్తలు .............. 1

రాజ్యాంగ వ్యవస్తలు చెడిపోవడానికి రాజకీయ వ్యవస్త లే కారణం. 1


అప్పుడు నేను పెద్దపెళ్ళిలో మండల విద్యాధికారిగా పనిజేస్తున్నాను. నేను ఒక పాఠశాలకు పర్యవేక్షణకు వెళ్ళినప్పుడు ఒక ఉపాధ్యాయుడు సెలవు పత్రం గానీ అనుమతి గాని లేకుండా  రెండు రోజుల నుండి బడికి రావడం లేనట్టు గమనించాను.

ఆయన పాఠశాలకు ఆబ్సెంట్ అయినట్లు రిమార్క్ రాసి రెండు రోజుల వేతనం ఎందుకు కట్ చేయగూడదూ  అంటూ మేమో ఇచ్చాను.

వెంటనే ఒక రాజకీయ నేత నుండి ఫోన్ , " నేను ఫలానా మాట్లాడుతున్నాను , మా బంధువు ఫలానా వ్యక్తి కి వేతనం కట్ చేస్తానని మేమో ఇచ్చావట అది వాపస్ తీసుకో "  అని.

ఒక ఉపాధ్యాయుడు బాధ్యత లేకుండా బడికి రాకుంటే వ్యవస్తకు ఎట్లా నస్టమో  వివరించాను. గవ్వన్ని మాకు చెప్పద్దు. మాకు తెలువదా ? నేను చెప్తున్నాను , నువ్ మా వోని వేతనం ఇచ్చేయ్ అంటూ ఆర్డర్.

అట్లా ఇస్తే నా అడ్మినిస్ట్రేషన్ చెడిపోతుంది, మండలం లో విద్యా వ్యవస్త క్రమశిక్షణ తప్పి  విద్యార్థుల చదువులకు నస్టమ్ జరుగుతుంది ,  కనుక నేను మీరు చెప్పినట్టు చేయలేను " అన్నాను.

అంత నీతి మంతునివా ?  నువ్వేం తప్పులు చేస్తలెవ్వా ? అంటూ ఓ  రాయి విసిరి చూశారు.

మీ బంధువైన ఆ ఉపాధ్యాయున్నే అడుగండి అన్నది నా జవాబు. సరే నీ సంగతి ఎక్కడ చూడన్నో అక్కడ చూస్తానని బెదిరింపు. నేను ఫోన్ కట్ చేశాను. తర్వాత నా ఆచరణ గురించి తెలుసుకొని మళ్ళీ ఇక అడుగలేదనుకోండి.

కానీ ఇప్పుడు వారే పాలక పార్టీ ఎమ్మెల్యే ! వారి పరిపాలన ఎట్లా ఉంటుందో మనం ఊహించడమేమీ కస్టమైన విషయం కాదుకదా ?  

Thursday, January 5, 2017

ఇంటిమీదేవుసమ్ 18

ఇంటిమీదెవుసమ్ 18



నేను నాటిన మొక్కలు సరిగ పెరిగి పుష్పించడం లేదన్న బాధను ఈ విషయం లో అనుభవగ్నుడైన రఘోత్తం రెడ్డి సార్ తొ పంచుకున్నప్పుడు ,  తెలిసిన విషయాలే ఐనా మరో సారి ఆయన గుర్తు చేసిండు .                         అవీ మీతో శేర్ చేసుకుందామని ! ఏ పంటకు ఐనా సహజంగా తాను పులకరించి పుష్పించి ఫలించే ఒక ౠతువు అంటూ ఉంటుంది . మన మన అనుభవాలల్లో వానా కాలం మొదలైందంటే , పుడమి తల్లి ఒడలంతా తడిసిందంటే ఇగ మనం ఎవుసం శురూ జేద్దుము . వరి నార్లు వోసుడైనా , పెసల్లు అలుకుడైనా , ఏ విత్తనం ఐనా ముందో మందు అని ఐన్ మీద నాట్లువడాలె అని అన్ని ఇండ్లల్ల ఇత్తునం బెట్టుడు శురూ అయ్యేది .
అస్సల్ అన్నంబెట్టే పంటల పని కాంగానె కూరగాయల మొక్కల పని మొదలయ్యేది . బీర పాదులు , పొట్ల పాదులు , చిక్కుడు , బెండ , ఇట్లా అన్ని కూరగాయల సాగు మొదలయ్యేది . నా చిన్నప్పుడు తోట కూర  సాగు ప్రత్యేకంగా జరుగక పోయేది . మక్క తోట , మిరుప తోట ల కావలిసినంత తోట కూర పైసలు లేకుంటనె ఎవరైన తెంపుకుందురు .
అప్పటి ఆ వాతావరం , వర్షాలు గాలిలో తేమ , ఆ పంటలకు సరిగ్గా సరిపోయేది . కాని అత్యాపేక్ష పరుడైన మనిషి స్తల కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అన్ని పంటలు పండించడానికి పూనుకుంటున్నాడు . ఆ వాతావరనం వాటికి అనుకూలించక చీడ పీడనల బారిన పడుతున్నాయి . వైరస్ తెగులు సోకుతున్నది . మనిషి తన అతి తెలివిని ఉపయోగించి రక రకాల రసాయన మందులను వాటిపైన ఎగజిమ్మి కాల్లు గట్టి పాలువిండినట్టు అననుకూల పరిస్తితిలో ఐనా పంట దీస్తున్నడు .
కాని కాపుతో పాటుగా అవిమోసుకవస్తున్న రసాయనాలు , హార్మోన్లు , ఖనిజ లవణాల అవశేషాలు మనుషుల శరీరాల్లో ప్రవేశించి అలివిగాని రోగాల బారిన పడేస్తున్నాయి . కనుక మనం గూడా ఏ సీజన్ లో పండే పంటను ఆ సీజన్ లో వెసుకొని ప్రక్రుతికి దగ్గరగా జీవిస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది .  కదా !