Monday, February 27, 2017

ఇంటిమీదెవుసమ్ 30

                                                          

శారీరిక శ్రమ కొంచెం ఎక్కువ అయితున్నదో ఎందో ఈ మధ్యన రోజూ మధ్యాహ్నం  నిద్రవస్తున్నది కొంచెం .  బయట డోర్ కొట్టిన చప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే వెళ్ళి డోర్ తీసిన. ఎదురుగా , నాతో గతం లో ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి పనిజేసిన వీరన్న అనే మిత్రుడు , ఆయన వెనుక ఒక ఆడ కూతురు. లోపాలికి ఆహ్వానించి , ఎండన పడి వచ్చిండ్రు గదా అని  చల్లటి మంచి నీళ్లు రంజన్ ల నుంచి ముంచి,  తెచ్చి ఇచ్చిన.

ఆ: చెప్పండి ఎంపని మీద వచ్చిండ్రు. ఎవరీ అమ్మాయి అని ఆమె దిక్కు చూస్తూ  అడిగిన. అమ్మాయి నిండు చూలాలు . ఈ అమ్మాయి మీకు తెలిసినాయనే,  జాగిత్యాల  యెంకటేశం( పేరు మార్చిన) కూతురు, ఆమే మీతోని మాట్లాడేది ఉందంటే తీసుకొని వచ్చిన అన్నాడు. మళ్ళీ ఆయనే అన్నడు, ఈ అమ్మాయిది లవ్ మ్యారేజి, భర్త ఇంట్ల నుండి వెళ్లగొట్టిండు, తలిదండ్రులు ఇంట్లకు రానిస్తలేరు , ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నది, బియ్యం, పప్పు లు ఫలానా ఆయన మీకు తెల్సినాయినే ఇప్పించిండు , మీరుకూడా ఏమైనా సహాయం చేస్తారేమోనని వచ్చినం అన్నడు. వాళ్ళ నాన్న ఎందుకు రానిస్త లేడు , నేను  వస్తపా ,  అడుగుదాం అన్న. ఆ అమ్మాయి నోరు విప్పింది , అంకుల్ ,ఈ అంకుల్ చెప్పినట్టు మాది ప్రేమ పెళ్లి కాదు,  నిజానికి అతన్ని నేను ప్రేమించలేదు, నా చదువు అయిపోయిన తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ లో నాకు ఏర్ హోస్టస్ గా జాబ్ వచ్చింది,నెలా నెలా జీతం డబ్బులు మా నాన కు ఇచ్చేదాన్ని. ఆ డబ్బుల్తో ,  మా నాన ఇల్లుకట్టుకుందాం అంటే జగిత్యాల లో ఇల్లు కట్టుకునుడు మొదలు పెట్టినమ్, మా ఇంటిముందర ఉండే వడ్లోల్ల పిల్లడు ఎప్పటికీ నన్ను చూస్తూ ఉండేది, నన్ను చూస్తున్న విషయం గమనించినా  , తెలిసీ తెలియని వయసు లో ఫాంటసీ గా అనిపించి నేను ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. ఒక రోజూ హైద్రాబాద్ లో డ్యూటీ ముగుంచుకొని ఇంటికి వస్తుంటే నన్ను కిడ్నాప్ చేసి రేప్ చేసిండు. పేపర్లో కూడా వచ్చింది. కేస్ పెట్టినం. కేసు ముగుంపు దశకు వచ్చే సమయం లో మా వకీళ్ళు ఏమి లోపాయి కారి ఒప్పందానికి వచ్చిండ్రో ఏమో కానీ అతడు నిన్ను పెళ్లి జేసుకుంటడు కేసు విత్ డ్రా జేసుకొమ్మని ఒత్తిడి చేసిండ్రు. సరే అని ఒప్పుకొని అతన్ని పెళ్లి జేసుకున్న. కులం గానోన్ని, ఏమి ఉద్యోగం సద్యోగం, సంపాదన లేనోన్ని పెండ్లి జేసుకున్నవని మా నాన నన్ను ఇంటికి రావద్దన్నడు . హైద్రాబాద్ ల నే ఇల్లు దీసుకొని అక్కన్నే ఉండుకుంట నేను డ్యూటీలు చేస్తూ ఉండేది. ఆయనకు కూడా దేశాలన్నీ తింపి చూపిన. ఏమి పనిచేయక పోయేది. నా జీతం డబ్బులు మొత్తం అతడే తీసుకుంటుండేది. ఆ  డబ్బులతోటే ఆయన ఇద్దరు చెల్లండ్ల పెళ్లిళ్లు కూడా చేసినమ్. ఇంతలా నాకు ప్రెగ్నెన్సి వచ్చింది. కనుక ఫోర్స్ బుల్ సెలవులో ఉండవలసి వచ్చింది. హైద్రాబాద్ లో ఇల్లుకిరాయి ఎందుకని జగిత్యాల వచ్చినం. ఒకరోజు రాత్రి  బాగా తాగి తనతో బాటు మరొకడిని వెంట దీసుకొని వచ్చి మా బెడ్ రూమ్ లోకి తోలిండు. ఆ వచ్చిన వాన్ని నేను తీవ్రంగా ప్రతిఘటించిన . నా భర్త లోపటికి వచ్చి ఈయన ఎవరనుకుంటున్నవ్ , ఆయన తల్సుకుంటే నీ లాంటి వాళ్ళు బోలెడు మంది ఆయన కాళ్ళ  కాడ  పడి చస్తర్, ఒప్పుకోక పోతే చంపుత అంటూ తన చేతుల ఉన్న కత్తి తోటి ముఖం పైన చేతుల పైన గాయాలు చెసిండని చెప్పింది. ( సంక్షిప్తత దృస్ట్యా, సభ్యత దృస్ట్యా కొంత ఎడిట్ చేశాను) . వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసిందట, కానీ ఎవరూ పట్టించుకోలేదట, హాస్పిటల్ కు వెళ్ళి వైద్యం చేయించుకొని వారం రోజుల తర్వాత హైద్రాబాద్ వెళ్ళి పోలీస్ మంత్రిని కలిస్తే ఆయన అక్షింతలు వేసిన తర్వాత గాని నిందితుణ్ణి అరెస్ట్ చేసి జైల్ లో వేయలేదట. ఆ పని అంతా అయిపోయి తండ్రి ఇంటికి వెళ్తే  నీవు ఇట్లా గర్భం పెట్టుకొని నా ఇంట్లో తిరిగితే ,  నాకు పెండ్లి కావాల్సిన బిడ్డ ఉంది,   అంతగా ఐతే మరి గర్భ విచ్ఛిత్తి చేసుకొని రా అప్పుడు ఆలోచిస్తా , నిన్ను ఇట్లా ఇంట్లో పెట్టుకుంటే దానికి పెళ్లి కాదు, అన్నాడట. నన్ను కనలేదా తండ్రిగా నీకు బాధ్యత ఏమీ లేదా అంటే నువ్వు ఎక్కడనన్న  పో నాకు నీతో సంబంధం లేదు అన్నాడట. అంటూ బోరున విలపించింది. చాలా బాధ అనిపించింది. నా వంతుగా కొంత ఆర్థిక సాహాయం అందించి,  ఇట్లాంటి సందర్భాల్లో సహాయం అందించే ఒక స్వచ్ఛంద సంస్త అడ్రస్  హైయద్రాబాద్ ఇచ్చి పంపిన.

ఆ  పిల్ల అట్లా కావడానికి ఆమె తండ్రి భావించినట్టు అంతా ఆ పిల్ల తప్పేనా ? ఆమెను కిడ్నాప్ చేయడం వాని దుర్మార్గమే కావచ్చు , కానీ అక్కడ ఆ తండ్రి తన రెక్కలల్లో దాచుకోవాల్సిన తీరులో లోపమే లేకుండా ఉండే అందామా ? ఆయన ఆ లోపం చేసి ఉంటే , అందుకు ఈ  సమాజం , వ్యవస్త ,  మీడియా పాత్ర లేనే లేదా ? ఆ రేపిస్టు  అంతా నిర్భీతిగా ఒక అమ్మాయిని రేప్ జేసి , పెళ్ళాడి , తార్పుడు గాడు గా మారేటంతటి దుర్మార్గుడుగా మారడానికి ఈ ప్రభుత్వాల, చట్టాల, పాలనల, దోషం లేదని అందామా ? మొత్తంగా మనిషి ఇంత స్వార్థ పరుడు గా మారుతున్న సందర్భం లో అనేక ప్రశ్నలను మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తున్నది. అమెరికా లోని కాన్సాస్ లో ఆడమ్స్ ఫ్యూరిస్టర్ అనే జాత్యహంకారి , శ్రీనివాస్ కూచి బొట్లను కాల్చి చంపినప్పుడు అదే జాతికి చెందిన ఇయాన్ గ్రీల్లోట్ తుపాకి తూటాలకు అడ్డు నిలిచి అలోక్ ను మృత్యుముఖం నుండి రక్షించి " నా తోటి వ్యక్తి కోసం నేను ఏమి చేయాలో అది చేశాను " అంటాడు. అలాంటి నిస్కల్మషమైన మనుషులను కులాల వారిగా మతాల వారిగా , దేశాలా వారిగా , జాతుల వారిగా విభజిస్తున్నది ఎవ్వరూ ? వారి పట్ల మనం ఎందుకు జాగ్రత్తగా ఉండలేక పోతున్నాం.? వారి మాయ మాటలకు మోస పోయి అధికార పగ్గాలు  ఎందుకు అప్పగిస్తున్నామో మనుసున్న మనుషులుగా అందరం ఆలోచించాలి. అని నేను ఇది ముగిస్తుంటుండగా నా భార్య పైన బంగ్ల మీద కోతులు ఏందో బాగా లొల్లి జేస్తున్నై ఉరుకు ఉరుకు అంటే బంగ్ల మీదికి పరిగెత్తిన,  కోతులనుండి మొక్కలను కాపాడుకునేతందుకు . కానీ అక్కడికి పోయే వారకు ఏమున్నది. ఒక చిన్న కోతి పిల్ల నేను అమర్చిన జి ఏ వైరుల చిక్కుకొని దాటరాక మొత్తుకుంటున్నది . చిన్న,  పెద్ద కోతులన్నీ ఆ చిన్న కోతికి మద్దతుగా అక్కడ చేరి ,  పెద్ద బొబ్బ వెడుతున్నై. వాటి దగ్గరకే మనం పొలేని పరిస్తితి. ఒక పెద్ద కోతి మెల్లెగా సుతారంగా ఆ పిల్ల కోతిని తీగల్ల నుంచి దాటించుకొని తీసుకొని పొంగానే కోతులన్నీ అక్కడి నుంచి కామ్ గా వెళ్ళి పోయినై. జంతువులమ్ కాదు మనుషులం అని చెప్పుకొనే మనం అందరం అట్లా స్పందించే లక్షణం మళ్ళీ ఎప్పుడు అందిపుచ్చుకుంటామో వేచి చూద్దాం !

Wednesday, February 22, 2017

ఇంటిమీదెవుసమ్ 29

                                                   

" మనం కూరగాయలు పండించాలంటే మనం నడుం వంచాలి " . నానాజీ , రూఫ్ గార్డెన్ , (చీడ పీడ) వాట్స్ అప్ గ్రూప్.

ఎవరికైనా ఏ పనికైనా ఈ సూత్రం వర్తిస్తుందని అనడానికి నా అనుభవం చెపుతాను చదువండి.  1973 లో కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కాలేజీ లో బి ఎస్సీ కాంగానే గణిత ఉపాధ్యాయుల కొరత వలన మాకు బి ఎడ్ లేకుండానే 150 రూ: వేతనం పైన మా బ్యాచీ లో చాలా మందిని   హాఫ్ ఏ మిలియన్ స్కీమ్ కింద ఎంపిక జెసి , వేతనం తక్కువ కనుక ఎవరి ఊరికి సమీపాన వారిని  టీచర్లు గా నియమించిండ్రు.  అట్లా నాకు మహాదే పూర్ సమితి లోని మా ఊరు ధన్నవాడ పక్కనే ఉన్న గంగారం హైస్కూల్లో పోస్టింగ్ వచ్చింది . నా వయస్సు అప్పుడు 21 . నా విద్యార్థులు నా కంటే అయిదారెండ్లు చిన్నవాళ్లు. కనుక మేమంతా దోస్తుల లెక్కనే ఉందుము. పొద్దుగాల పది నుంచి మాపటీలి నాలుగున్నర దాకా లీజర్ అన్నది లేకుండా పాఠాలు చెప్పుడు. చుట్టి అయిందంటే పిల్లలు మేము కలిసి వాలీ బాల్ ఒక రోజైతే బాల్ బ్యాట్మెంటన్ మరో రోజు ఆరు గంటల దాకా ఆడుకునుడు. చాలా ఖుషీ గా సాగిపోతున్న  రోజులు.  

అప్పటిదాకా ఆ బడికి హెడ్ మాస్టర్ గా ఉన్న శ్రిపెరంబుదూరు శీనయ్య సార్  బి.ఎడ్ . ట్రెనింగ్ చేయడానికి వరంగల్ వెల్లిండు. కానీ ఆయన భార్యా పిల్లలు మాత్రం గంగారం లోనే ఉండే వాళ్ళు. అప్పుడు వాల్లకు వేతనం ఇచ్చి ట్రెనింగ్ పంపిండ్రు. ఆయన ట్రెనింగ్ సహచరులు  ,  కాల్వ శ్రీరామ్ పూర్ మండలం  మల్యాల లో పనిజేస్తున్న  రాపోలు రవీందర్ రెడ్డి  , కరీంనగర్ జిల్లా  ఎలిగేడు లో పనిజేస్తున్న ముప్పాళ లక్ష్మణ్ రావు లు .ఆయన వేతనం తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా ఓరుగల్లు పోరు ముచ్చట్లు చెప్పేటోడు . చాలా ఉత్సాహంగా ఉండేటియి . కానీ మా నాయిన నన్ను 1962 ల  ఆరో తరుగతికి మంతెనకు పంపే టప్పుడు , ఆ తర్వాత నా మనుసు పక్క తొక్కుల్లు తొక్కినప్పుడల్లా  ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు నన్ను కట్టిపడేసెటియి . " కొడుకా ! మా నాయిన వందెకురాల భూస్వామి, కానీ ,ఆయినను కాదని  నేను కట్టుబట్టల తోటి , భుజాన మొకేసుకొని కలువచెర్ల విడిచి ఈ ఊరు ధన్నవాడ కు వచ్చిన. నా స్వంత కస్టమ్ తోటి మిమ్ములందర్నిగౌరవంగా  సాదుకోస్తున్న. మొన్న చూసినవ్ గదా! రాధకిస్టయ్య(మాజీ స్పీకర్ శ్రీపాద రావు తండ్రి) పంతులు తోటి పీవీ సాబు ( మాజీ భారత ప్రధాని, అప్పుడు మంథని ఎమ్మెల్లే. పోటీదారు )మనింటికి వచ్చి అందరి ఓట్లు వేపించుమని  అడిగిండంటే నేను అందరితోటి మంచిగా ఉండేపటికేనే గదా?  ఇసోంటోల్ల తోటి కూడా మంచిగ ఉండాలే . లేకుంటే  బతుకుడు కస్టమ్ .   కనుక ఏ పంచాయితీలకు పడావులకు పోవద్దు, నీ పనేన్దో నువ్ జేసుకో . ఎవ్వని మీద ఆధార పడకుండా బతికే బతుకు దెరువు సంపాయించుకో . నీ బాధ్యత నువ్ వంద శాతం సరిగ్గా  నిర్వహించి ఈడు సరేరా అనిపించుకునే బతుకు బతుకు . ఎండ్ల ఏలు వెట్టినా కాలి పోతవు . నిన్నెవ్వడు కాపాడాడు , , అని చాలా గట్టిగ చెప్పిండు. ఆ మాటలు  1979 లో ఆయన  చనిపోయే దాకా నా పైన చాల ప్రభావాన్ని చూపినై .

  అది అప్ గ్రేడెడ్ హై స్కూల్ . ఆరుగురు సార్లం, ఎనిమిది తరగతులు , 350 మంది పిల్లలు. శీనయ్య సార్ ప్రభావం వలన   చదువు ఇక్కడ బాగా చెప్పుతరని, గొప్ప పేరు ఉన్నందున ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వద్దురు. తరగతి గదులు చాలి నన్ని లేకుండే. ఒక రోజు ఊల్లే పెద్దమనుషుల తోటి మీటింగ్ పెట్టినం. రెండు పెద్ద పెద్ద కొట్టాలు వెయ్యాలే అని  అనుకున్నం ,  మరి ఎట్లా వేసుడంటే ,  ఇంటికి ఒక్క మంచె రగడు, ఇయ్యాలే , పరాయి ఊర్లళ్లనుంచి వచ్చేవాళ్ళు వడ్లోల్ల కూల్లు భరించే టట్టు నిర్ణయం జరిగింది. ఆది వారం నాడు పెద్ద పెద్ద  పిల్లలను వెంట దీసుకొని ఆరుగురం సార్లం ఇంటింటికి దిరిగినమ్. అప్పటిదాకా ఆ గ్రామాలల్లో మాగి జొన్న అని తెల్ల జొన్నలు పండిద్దురు . అప్పటికి అవ్వన్ని అడివంచు ఊళ్ళు కనుక జొన్న కంకులు తినడానికి రామ చిలుకలు , గోర్రెంకలు , దుబ్బురు పిట్టలు, జక్కోరుగాళ్ళు, ఊరువిసికలు బొమ్మానంగా వచ్చేటియి . వాటినుండి కావలికి చేనుకు ఒకటి లేదా రెండు మంచెలు వేద్దురు . కనుక ప్రతి ఇంట్ల గెల్లాలకు మంచ రగడులు అనే ఈ వాసాలు ఉండేటివి. ఇగ మాకు ఊరి పెద్దల లైసెన్స్ ఉన్నది గదా ? ఊళ్ళోళ్ళకు కూడా విషయం తెలుసు కనుక ,  వాళ్ళ ఇంటికి పోంగానే వాసాలు బయట పెడుదురు . మొదలు దిక్కు మేమూ , కొసల దిక్కు పిల్లలు,  పట్టుకొని బడికి తీసుక వచ్చినమ్. పిల్లల తలిదండ్రులు కొందరు వడ్ల పని వచ్చిన వాళ్ళు ఉండిరి . వాళ్ళ సహకారం తోటి రెండు కొట్టాలు( పెద్ద పూరిపాకలు) కట్టుడు అయింది. ఇగ పైన ఎండగొట్టకుంట , వానకు  ఉరువకుంట పైకప్పు కావాలే. ముందుగాలనే దీనికి కూడా ఉపాయం చేసుకున్నం . ఏందంటే గంగారం , దామరకుంట మధ్యన విలాసాగరం అనే ఊరు ఉంటది. విలాసాగరం చెరువు చాలా పెద్దది. తుంగ గడ్డి అని ఆ చెరువులో పుష్కలంగా ఉంటది . అది కోసుకొని వచ్చి ఎండబెట్టి పైన కప్పుతే బేఫికర్ , అనుకున్నం . కానీ చెరువుల బాగా జనిగెలు ఉంటై . అండ్లకు దిగుడు ఎట్లా అనుకుంటుండంగనే చీర్ల సూరయ్య అనే విద్యార్థి అదెంత పని సార్ , పొగాకు రసం కాల్లకు రాసుకొని దిగుతిమా అంటే అవి మన జోలికి రావు అన్నడు . శని వారం , ఆదివారం , రెండు రోజులు సార్లం ఆరుగురం, పెద్ద పిల్లలు ఒక వంద  మంది దాకా ఈలసరం చెరువులకు దిగి ఎనిమిది బండ్ల తుంగ గడ్డి కోసీనం . సర్పంచ్ బండ్లు పంపించిండు . తుంగ గడ్డి బడికి చేరింది. ఎండబెట్టినంక పిల్లలు ,  సార్లం కలిసి తుంగ ను కొట్టాల పైన పైకప్పుగా కప్పినమ్ .  పైసా ప్రభుత్వ బడ్జెట్ లేకుంట మా బడి ఆకామిడేషన్ సమస్య పిల్లలం ,మేమూ కలిసి పరిష్కరించుకున్నం .ఈ పానంతా బడి పనిదినాలు కాకుండా సెలవు రోజుల్లనే అయ్యేటట్టు చుకున్నాం  . కానీ ఇప్పుడు ఊరూరికి కావాల్సినన్ని బిల్డింగులు ఉన్నై, అవసరానికి మించి సార్లు ఉన్నరు , కానీ చదువుకొనేతందుకు  మాత్రం  విద్యార్థులు కరువైండ్రు . ఇక్కడ ఎవరి బాధ్యతను ఎవరు సక్రమంగా నిర్వహించ లేక పోయారు అంటే ,  ప్రభుత్వమే అని ఉపాధ్యాయులు , కాదు కాదు , ఉపాధ్యాయులే నని ప్రభుత్వాలు, కాదు కాదు కానే కాదు వీళ్ళిద్దరు కలిసే ప్రభుత్వ పాఠశాలలను భ్రస్టు పట్టించి సమాజం లో విలువలు దిగజారి పోవడానికి కారణమయ్యారని ప్రజలు అంటున్నారు. కనుక ఇప్పటికైనా ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా ప్రజల నుండే ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది.

Monday, February 20, 2017

ఇంటిమీదెవుసమ్ 28 .

                                     ఇంటిమీద ఎవుసమ్ 28

ఫిబ్రవారి నెల పుస్తకాలల  దినోత్సవం కూడా ఉన్నందున కావచ్చు నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇంచార్జ్ చిల్ల మల్లేశం గారు తాను రాసిన మహా పథం కవితల పుస్తకం తెచ్చి ఇచ్చిండు.   అట్ట వెనుక రాసి ఉన్న కవితా చాలా ఖతర్నాక్ గా ఉన్నది. . మల్లేశం గారిది అలుగు నూరు. నేను గణితం ఉపాధ్యాయునిగా , ప్రధానోపాధ్యాయునిగా ఎడేండ్లుఅలుగునూర్ లో  పని జేసిన అనుభవం ఉంది కనుక మా మధ్యన అలుగునూరు పాఠశాల ముచ్చట్లే ప్రధానంగా సాగినై. మీరు అలుగునూర్ లో పనిజేసినప్పుడు బడి చాలా బాగా నడిచింది అని ఆయన ఆనంగానే నాలో ముడుచుకొని ఉన్న బడి పంతులు లేచి నిలబడ్డాడు . ఆయన వెంట వచ్చిన సుభాష్ అనే అతని సహచరుడు మా టీచర్ ఆకుల భూమయ్య సార్ చాలా గొప్ప ఉపాధ్యాయుడు అనే సరికి ఇక నేను ఆగ లేక మా తరం రికార్డు వేసుడు షురూ జేసిన

మేము అక్కడ పని జేసినప్పుడు పాఠశాల కేవలం చదువు వరకే పరిమితం గాకుండా సాయంత్రం ఆటలు, ప్రతి శనివారం సాయంత్రం పిల్లల ఇస్టారాజ్యం అని ఉపన్యాసాలు, పాటల పాడుకోవడం, కవితలు చెప్పుకోవడం, మానేరు పత్రిక అని ఒక గోడ పత్రిక తీసే వాళ్ళం. పిల్లలు రాసిన , లేదా సేకరించిన కథలు, జానపద గేయాలు ఒక డ్రాయింగ్ పేపర్ మీద మా మునయ్య సార్ చేవ్రాలు అద్భుతంగా ఉండేది ఆయన తోటి రాయించి నోటీస్ బొర్ద్ద్ పైన అతికిస్తే పిల్లలు ఆ రచనల కింద వాళ్ళ పేర్లు చూసుకొని మురిసి పోదురు . వచ్చే సంచికలో నా పేరు ఉండాలే , అంటే నా పేరు ఉండాలే అని పోటీలు వడి రాసుకొని వద్దురు. నేను వాటిని ఎడిట్ చేసి మునయ్య సార్ కు ఇచ్చేదీ. ఆయన అందంగా తీర్చి దిద్ది గోడ పత్రిక పధిహేను రోజులకు ఒకసారి తీసుక వచ్చేది.

మా బడి పని విధానం, మేము చేస్తున్న కృషి తెలియ జేస్తూ పిల్లలు ఆడుకోవడానికి ఆటస్తలమ్ చదునుగా లేదు కొంత గ్రావెల్ పని ఉందని దానికి మీ ఆర్థిక సహాయం కావాలని అలుగునూర్ శివార్ లో ఉన్న ఈనాడు యాజమాన్యానికి లేఖ రాసిన. ఆనాటికి పిల్లికి బిచ్చం కూడా వేయదు అని పేరున్న ఈనాడు యాజమాన్యం అలుగు నూర్ పిల్లల ఆటస్తలమ్ కోసం 25 వేల రూపాయల చందా ఇచ్చింది. ఆటల సారు ఎడవెల్లి రాజీ రెడ్డి సార్ ఆ బాధ్యత తీసుకునే పటికే ఇప్పుడు ఆ బడికి చాలినంత ఆటస్తలమ్ తయారైంది. బడి చుట్టూ ఉన్న మర్రి, రాగి, మేడి చెట్లు కూడా మేము పెట్టినవే. వాటిని చూసినప్పుడు చాలా సంతృప్తి అనిపిస్తుంది.

మేము తరుచుగా  పిల్లల ఇండ్లకు వెళ్ళేవాళ్లం . అలా  వెళ్ళడం వలన పిల్లల తలిదండ్రుల ఆర్థిక మరియు
సామాజిక స్తితి తెలిసేది. మీ అబ్బాయి , లేదా అమ్మాయి బాగా చదువుతున్నారు, వాళ్ళను ఇంకా పై చదువులు చదివించాలి అని మేము చెప్పినప్పుడు వాళ్ళ మొఖాలు వెలిగి పోయేవి. అట్లనే సార్ మీరు చెప్పుతున్నరుగదా అని వాళ్ళు అన్నప్పుడు మా మొఖాలు వెలిగేటివి.

ఒకసారి ఏడవ తరగతి చదువుతున్న వెంకటి అనే అబ్బాయి వరుసగా బడికి రావడం లేదని గమనించి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళినమ్. మేము వెళ్ళేసరికి  బురుద కాళ్ళ తోటి వెంకటి  గప్పుడే ఇంటికి వస్తున్నడు .  నన్ను చూసి భయం భయం గా గలుమల్లనే ఆగి పోయిండు . ఎదురుగా వెళ్ళి భయం లేదన్నట్టుగా భుజం మీద చెయ్యేసి ఏం సంగతి ఎందుకు బడికి వస్తలెవ్వని అనునయంగా అడిగిన. మీరు జెయ్యంగనే అన్నడు . పానం దస్సుమన్నది. అయినా వేగిర పడకుండా , అట్లనా ? నేను ఏమన్నా కోడితినా అన్న. కొట్టుడు కాదు గాని కొడుతవేమో అన్న భయం తోటే నేను వస్తలేను అన్నడు.నేను ఎందుకు కొడుత అనుకుంటున్నావ్ అంటే నాకు లెక్కలు వస్తలెవ్వు, అర్థం అయిత లెవ్వు అన్నడు.  నీకు ఏ లెక్కలు వస్తలెవ్వు  అంటే ఎవ్వీ వస్తలెవ్వు అన్నడు. సరే నీకు అన్నీ అర్థం అయ్యేటట్టు చెప్పుత , నిన్ను  కొట్ట అని హామీ ఇచ్చి బడికి తీసుకొని వచ్చిన.  తీసివేత, గునుకారం , భాగారం, అతనికి అర్థం అయ్యే దాకా చెప్పిన . బస్ ఆ ప్రోత్సాహం తోటి తర్వాత సంవస్తరం నుండి తరగతి లో అతడే మొదటి ర్యాంకర్ గా నిలిచిండు . అందుకనే నేను ఆ బడిలో ప్రతి సంవస్తరం వేయించే వీధి నాటకం లో భాగంగా ఒక సారి వేసిన వీధినాటకం " ఈత " లో వెంకటి ప్రధాన పాత్ర వేసిండు. నేను రాసిన " ఉరువిసికెల పోరు "  కథా  సంకలనం లో ఆ నాటకం ఉంది.  అని చెపుతూ ఇక్కడ ఒక ఉపాధ్యాయునిగా అలుగునూరు నాకు ఇచ్చిన గొప్ప సంతృప్తిని గురించి మీకు చెప్పాలే అన్న.

వాళ్ళకు టైమ్ అవుతుండ వచ్చు కానీ నా ఉత్సాహాన్ని చూసి నన్ను నిరుత్సాహ పరుచలేక  "చెప్పండి "  అన్నరు.

2014 ల నేను మా పిల్లలతో కొన్ని రోజులు గడుపుదామని వాళ్ళ దగ్గరికి పోయుంటి . ఒక నాడు షాపింగ్ మాల్ ల  ఒక యువకుడు  " నమస్కారం సార్ అనుకుంటా " ఎదురుగా వచ్చిండు. దేశం గాని దేశం ల నన్ను సార్ అని సంబోధించే వాళ్ళు ఎవరై ఉంటారని నేను  అట్లనే చూస్తున్న . " సార్ నేను వెంకట్ ను అలుగునూరు " అన్నడు.

' అరే నువ్వారా " అని  ఒక్కసారి ఆనందం పట్టలేక బిగ్గిత కాగలిచ్చుకున్న . సార్ ఆనాడు మీరు మా ఇంటికి వచ్చి నాకు ధైర్యం జెప్పి అట్లా లెక్కలు చెప్పే పటికే నేను ఇంజనీరు సదువు చదివి ఇక్కడికి రాగలిగిన " అన్నడు . నాకు కండ్లల్ల నీళ్ళు గిర్రున తిరిగినై .


                                     


Wednesday, February 15, 2017

ఇంటిమీదెవుసమ్ 27

                                               

చాలా రోజుల తర్వాత మిత్రుడు బెజ్జారపు రవీందర్ తాను ఈ మధ్యన రాసిన " తాటక " నవల నాకు ఇవ్వడానికి వచ్చిండు. ఆ పుస్తకానికి తాను రాసిన ముందుమాట ఆదివరకే చదివి ఉన్నాను కనుక ఆర్యుల, ద్రావిడుల , గురించిన చర్చ జరిగింది . ఐదు వేల ఏండ్ల కిందటి నుండే నగర జీవులైన ఆర్యులు , ద్రావిడుల నుండి అడివిని ,  భూమిని గుంజుకొనే ప్రయత్నం సాగుతుంటే , అడువులను , భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేని ద్రావిడుల  లేదా అసురుల , ప్రతిఘటనే రామాయణ కథ అని అనుకున్నాం .

రవీందర్ వెళ్ళి పోయిన తర్వాత పాత జ్ఞాపకాల దొంతర నా మనుసులో మల్లొక్కసారి కదిలింది. 1980 వ దశకం చివర్లో అనుకుంటా మేము రాయికల్ లో ఒక మండల విద్యా మహా సభ నిర్వహించినమ్. ఆ సభ నిర్వహణ బాధ్యతను ఇద్దరు వ్యక్తులు స్వీకరించిండ్రు. ఒకరు మా సంఘం మండల శాఖ ప్రధాన కార్యదర్శి ముప్పాళ రాంచెందర్ రావ్ అయితే మరొకరు మా సంఘం అధ్యక్షులు బెజ్జారపు శంకరయ్య సార్. మహా సభలకు ఎంత మంది వస్తారు, వారికి భోజన వసతి సౌకర్యం కలిపించడం, సభల నిర్వహణకు వేదిక, సభలో మాట్లాడే అంశాలు, ఆయా అంశాలను ఎవరితో మాట్లాడిద్దామ్, ఈ పనులన్నిటికి అవసరమైన ఆర్థిక వనరులు ఎట్లా సేకరిద్దామ్ అన్న విషయాలను కార్యరూపం లో పెట్టడానికి నేను నాలుగైదు రోజుల  ముందుగానే రాయికల్ కు వెళ్ళిన. అప్పటికే శంకరయ్య సార్ తో పరిచయం ఉన్నా సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ఇగో ఈ సభల సందర్భం లోనే !  అక్కడ ఉన్నన్ని రోజులు నా భోజనం ఎక్కువ సార్లు శంకరయ్య సార్ ఇంట్లోనే. అప్పటికి నాకు రవీందర్ తో  పరిచయం లేదు. ఆ సందర్భం లో ఆయన అక్కడ లేకుండెనో ఏమో కూడా. అయితే శంకరయ్య సార్ అప్పడు తాను నైజాం కాలం లో ఉర్దు మీడియం లో చదువుకోవడానికి ఎంతెంత  కస్టపడ్డది చాలా వివరంగా చెప్పిండు. శంకరయ్య సార్ వాళ్ళ నానా ఎవరో ఒక పట్వారీ వద్ద గుమాస్తా గా పనేజేసేవాడట . ఆ సంస్కారం వలన , వాళ్ళ నాన్న శంకరయ్య సార్ ను జగిత్యాల లో చదివించిండట  దొరలు నావాబుల పిల్లలు గ్రామాల నుండి వచ్చిన పిల్లలను కొట్టి తిట్టి ఏడిపించేవాల్లట. పలకను పగులగొట్టడం, పుస్తకాలను చించివేయడం, నోరు తెరిచి ఎందుకు ఇట్లా అంటే వీపుపగుల గొట్టడం వాళ్ళకు సరదా ఆటలట . అన్ని  కస్టాలు పడి నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకొబట్టే ,  ఇగో ఈ బడి పంతులు నౌకరీ వచ్చిందని చెప్పిండు. ఒక డెబ్బై ఏండ్ల కిందటి వరకు కూడా వెనుకబడిన వాళ్ళ చదువుల పట్ల ఎంతటి  అణిచివేత ఉండేదో అర్థం జేసుకుంటే దప్ప ఇంతవరదాకా వీళ్ళందరూ ఎందుకు ఇంతటి  పేదరికం లో  మగ్గి పోయారో అర్థం కాదు. దళితులకైతే అప్పటికి ఇంకా అక్షరాబ్యాస భాగ్యం లభించి నట్టే లేదు ఈ ప్రాంతం లో .

ఆ సందర్భం లోనే రాయికల్ పక్కన్నే ఉన్న ఇటిక్యాల గడీని చూసిన . చుట్టూ చాలా ఎత్తైన ప్రహారీ గోడ, పెద్ద ప్రవేశ ద్వారం . దానికి ఇరుపక్కల దొర దర్శనం కోసం వచ్చిన వాళ్ళు నిలిచి ఉండే స్తలమ్ , ప్రవేశ ద్వారానికి ఈశాన్యం మూలన ఒక పెద్ద బావి, దానికి ఎత్తైయన రెండు పంతెకొక్కులు ( మోట కొట్టడానికి ఉండే చిమ్ములు ) ఇంకా ఆ కాలం రాజసానికి చిహ్నంగా చీకిపోయి   ఐనా నిలిచిఉన్నై. ఆ బావి నీరు ను ఒంటెల తోటి పైకి మోటకొట్టించి ప్రహరీ గోడ పైన కట్టి ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ లకు నింపి నల్లాలు తింపుకొనే వాల్లట . ప్రహారీ గోడను ఆనుకొని గుర్రాల శాల ఉంది. రకరకాల గుర్రపు బగ్గీలు పైన వేలాడ దీసి ఉన్నై . లోపలికి వెళ్తుంటే ఇరుపక్కల ఇరాన్  నుండి తెప్పించిన సిరామిక్ నగిషీల పలకలు  అతికించి ఉన్నాయి. పెద్ద పెద్ద కడపలు, దర్వాజాలు ఉన్న నివాసపు గదులు, చాలా పెద్ద వంటశాల , భోజన శాల ఉన్నాయి. ఆ వెనుక ఒక పెద్ద దిగుడు బావి , ఈతకొలను ఉంది, అందులో తామర పువ్వులు ఉన్నాయి. ఎంత రాజసమో కదా అని అబ్బుర పడ్డాము . 1980 వరకు కూడా ఆ ప్రాంతం లో ఎమ్మెల్లెగా, ఎంపీగా పోటీ జేసె అభ్యర్థులు  ఎవరైనా ఆ దొర గడీ ముందు చేతులు జోడించి నిలబడి తాము అనుజ్ఞ ఇస్తే గ్రామాలల్లో ప్రచారం చేసుకుంటా మని వేడుకొనే వారట. జగిత్యాల జైత్రయాత్ర తర్వాతనే ఆ గడీ గోడలకు బీటలు వారినై అని చెప్పిండ్రు. ఒక వైపు శత్రు దుర్బెధ్యమైన కోట గడీలు, మరో వైపు అయ్యా బాంచెన్ అనే కూలీ నాలీ జనాలు. అంతటి అసమతుల్యం కారణంగానే ఇక్కడ రైతాంగ తిరుగుబాటు జరిగింది.

రామాయణ కాలం లో అసురుల నివాసాలైన అడువులను గుట్టలను యజ్ఞ యాగాదుల పేరుతోటి నాగరీకరించి ఫణి పుంగవుల వ్యాపార అంగళ్ళ కొరకు అయోధ్యలాంటి నగరాలు నిర్మిస్తే, ఇప్పుడేమో అభివృద్ధి పేరు తోటి , ప్రజలు నివసిస్తున్న , వ్యవసాయం చేస్తున్న సుసంపన్నమైన భూములను ప్రభుత్వం ఆక్రమించి , ప్రాజెక్టులు ఓపెన్ క్యాస్ట్ మైన్స్, సెజ్జులు, క్వారీల కోసం సంపన్నులకు ధారాదత్తం చేస్తున్నారు.  రాజ్యాలు మారినై, దోపిడి రూపాలు మారినై కానీ రాజ్యం అనేది ప్రజల శ్రమను పీల్హుకోవడం అనేది మారలేదు , అని మనుసుల అనుకుంటున్న , బైట ఎవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది .  

Sunday, February 12, 2017

ఇంటిమీదెవుసమ్ 26

                                                  
మొన్న పున్నం నాడు సాయంత్రం ,  సూదమ్ రమేశ్ ఆహ్వానం మేరకు ఆయన మిద్దెమీదేవుసమ్  మధ్యన జరుగుతున్న " ఎన్నీల ముచ్చట్లు " సమావేశం కు పోయిన. కరీంనగర్ జిల్లా కేంద్రం ల ఒక సంప్రదాయం గత మూడున్నర సంవస్తారాల కిందనే మొదలైంది. ఎందంటే, కవులు ఎవరికి వాళ్ళే రాసుకొను చదువుకునే కంటే వాళ్ళు , వాళ్ళు, రాసిన కవితలను ఒక రోజు నాడు అందరూ ఒక దగ్గర సమావేశమై కూర్చొని చదువితే ఒకరికి మరొకరి ఇనిస్పిరేషన్ ఉంటుందని ,  అది పున్నమ అయితే బాగుంటుందని మొదలు పెట్టుకున్నరు. ప్రారంభం లో నేను కూడా వెళ్ళే వాన్ని . చాలా రోజుల తర్వాత ,  రమేశ్ ఆహ్వానం మేరకు ఇగో ఈ రోజు మళ్ళా వెళ్ళిన. ఆడ మగ కవులు అందరు కలిసి దాదాపు నలబై మంది అక్కడ జమ అయినారు.  ఉన్న వాళ్ళల్లో వయస్సు లో బహుశా నేనే పెద్దవాన్ని కావడం మూలాన, పెద్ద వయస్సు వలన చరిత్ర లో జరిగిన అనేక సంఘటనలకు  సాక్షులుగా  ఉంటూ ,  తద్వారా వ్యక్తులు పొందిన  అనుభవాలు ఉంటాయి కదా  ? అందుకనే ఏమో నన్ను అతిథి గా భావించి నాలుగు ముచ్చట్లు చెప్పుమన్నరు .

నేను 1984 నుండి 2001 లో నేను ఏం. ఇ. వో . అయ్యేదాకా APTF , DTF  , ఉపాధ్యాయ సంఘం లో చాలా క్రియా శీలకంగా పని జేసిన అనుభవం ఉంది.   ఉపాధ్యాయ సంఘంగా అప్పుడు మేము " విద్యా వైజ్ఞానిక సభలు " , రాష్ట్ర, జిల్లా , మండల స్తాయి లో అనేకంగా  జరిపే వాళ్ళం . ఉపాధ్యాయులకు, యువకులకు, ఆ ప్రాంతం లో ఉండే ప్రజానీకానికి  సమ కాలీన సామాజిక, ఆర్థిక రాజకీయ విషయాల పైన నిష్ణాతులైన వ్యక్తులతో ,  ప్రసంగాలు ఇప్పించి , వారికి సమాజం లో జరుగుతున్న అనేక విషయాల పైన అవగాహన కల్పించే ప్రయత్నం చేసేవాల్లమ్ .ఈ కార్యక్రమాలకు ఆర్ . రవీందర్ రెడ్డి, ఆకుల భూమయ్య సార్లు ఆద్యులు. నా లాంటి చాలా మందిమి ఆ స్రవంతి లో కలిసి పని జేసిన వాళ్ళం .

ఆ సందర్భంలో హైద్రాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం నుండి  ప్రొ. డి . నర్సింహా రెడ్డి , ఆర్థిక శాస్త్రం మూలాలు, ప్రొ. హరగోపాల్ సామాజిక శాస్త్ర పరిణామ క్రమాన్ని, సంబల్ పూర్ విశ్వ విద్యాలయం ప్రొ. ఆర్. ఎస్. రావ్ ఆర్థిక అంశాల వెలుగు నీడలు, ఆనాటి  సీఫెల్ రెజిస్ట్రార్ ప్రొ. జయశంకర్, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొ. బియ్యాల జనార్ధన్ రావ్ ప్రాంతీయ అసమానతల గురించి, ప్రొ. కాత్యాయిని విద్మహే , వోల్గా లాంటి వారు స్త్రీ వాద సాహిత్యం గురించి , సియెస్సార్ ప్రసాద్ రాజకీయ ఆర్థశాస్త్రం శాస్త్రం, వి. చెంచయ్య , ఆకుల భూమయ్య గతితార్కిక భౌతిక శాష్టం గురించి , డా: కె. శివా రెడ్డి, డా: నందిని సిధా రెడ్డి లాంటి వారు ప్రజల పై  సాహిత్య ప్రభావం గురించి, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ విజన్ 20 : 20 , రామజన్మ భూమి పైనా , అద్భుతమైన ప్రసంగాలు చేసే వాళ్ళు. ఆ సందర్భంగా నేను కూడా ఆ ప్రసంగాలు విన్న వాన్ని.

అట్లా యాదికి ఉన్నవాటిలో కొన్ని విషాయాలు వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఎన్నీళ్ళ ముచ్చట్ల వ్యవస్తాపక నిర్వాహకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వర్లు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  కవులు గా , బుధ్ధి జీవులుగా మనం ఆచరణ వాదులమ్ అయి ఉండాలే , అనేక విషయాలు రాసీ, చెప్పి ఆచరించకుంటే అర్థం లేదు అన్నారు. ఆ తర్వాత కవులు తమ కవితలను , పాటలను పాడి వినిపించారు. సూదమ్ రమేశ్ చిన్న కూతురు గాయిత్రి పదవ తరగతి అమ్మాయి కూడా తన కవిత్వాన్ని వినిపించింది. రమేశ్ అయితే మిద్దె తోట మీదనే కవిత్వం రాసి వినిపించిండు .వ్యవసాయమంటే ఏమిటో తెలియని తనను , భూమిలో వేసిన  గింజ , ప్రకృతి లోని గాలి, తేమ , సూర్య రశ్మి ప్రభావం వలన పులకించి మొనదేలి మొలకై , భూమిని పట్టున , పగులగొట్టుకొని    మొలకెత్తి , తనను ఆవహించి  పచ్చని చెట్టుగా చిగురింప జేసిందని  మురిసి పోయిండు . సమావేశం లో పాల్గొన్న వాళ్ళంతా మిద్దె తోటను ముచ్చటగా తిరిగి చూసిండ్రు.  వీలున్న వాల్లమందరం  రాసాయనాల కలుషితం కానీ కూరలను పండించుకొని తినాలే అని ముచ్చట్లు పెట్టుకున్నరు. " ఎన్నీల ముచ్చట్లకు మిద్దె తోట ముచ్చట్లు " తోడైనై . చివరగా మిద్దెతోట పైన రమేశ్ పండించిన టమాటకు ఆలుగడ్డ కలిపి వండిన ఆలూ టమాట కూర్మాతో వచ్చిన వాళ్ళందరికీ  వేడి వేడి  చపాతీలు తినిపించి పంపించిండ్రు రమేశ్ కుటుంబ సభ్యులు.

Wednesday, February 8, 2017

ఇంటిమీదెవుసమ్ 25

                                                 

కరీంనగర్ పట్టణానికి కూరగాయలు సరఫరా జేసిన  గ్రామాలల్లోఒకనాడు  నీలోజీ పల్లెది పెట్టింది పేరు. మానేరు నది ఒడ్డున ఆ గ్రామం ఉండడం ఆనాడు ఆ గ్రామానికి వరమైతే మిడ్ మానేరు డ్యామ్ కట్టుడుతోటి మానేరు  నది ఒడ్డున ఉండడం ఆ గ్రామానికి ఇప్పుడు శాపం అయింది. డ్యామ్ కడుతున్నం మీ గ్రామం ఖాళీ జేయాలే అని పబ్లిక్ ఒపెనియన్ మీటింగ్ రోజున మేము కూడా పోయి ఉంటిమి . ఆ నాడు రైతులంతా మాకు భూమికి బదలు భూమి ఇవ్వాలే అని పట్టుబట్టిండ్రు . మీటింగ్ నడువనియ్యమని గొడవ గొడవ చేసిండ్రు.

తోట  రాజలింగు అని ఒక  పెద్దమనిషి ముందుకు వచ్చి "  అయ్యా ! కలెక్టర్ సాబు , మా తాత ఇరివై ఎకురాల ఆసామి ,  ఇద్దరు అక్కలకు ఆ భూమి ఆసరా తోటి పెండ్లిల్లు చేసిండు. మేమిద్దరం అన్నదమ్ములమ్ మాకు పెండ్లిల్లు జెసి సెరి పదేకురాలు పంచి ఇచ్చిండు. నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డే. ఈ భూమి ఆసరా ఉన్నదన్న ధైర్యం తోటి నేను నా కొడుకులను బిడ్డేను చదివిచ్చుకుంటాన. రేపు వాళ్ళ పెండ్లిల్లు పెరంటాలు జెసి పంపుత అన్న ధైర్ణం తోటి ఉన్న.అంతా అయినంక నా కొడుకులకు తలా అయిదేకరాలు పంచి ఇస్తా కూడా . కానీ ఇప్పుడు ఈ భూమి గుంజుకొని మీరు డబ్బులు ఇస్తే అరిసేతుల పెట్టుకున్న ఐసు ముక్క తీరుగా ఆ డబ్బులు కరిగి పోతై , రేపు నా పొల్లగాండ్లకు భూమి ఉండది . భరువస లేని బతుకులై పోతై . దండం బెడుతం మా భూములంతుకు భూములే ఇయ్యలే" అని ఒక్కతీరుగా బతిమిలాడిండు . కానీ పోలీసులను పెట్టి మీటింగ్ అయ్యింది అనిపిచ్చుకొని వెళ్లిపోయిండ్రు.

గత ఐదు వేల సంవస్తరాల నుండి ఏ నాగరికతలను పరిశీలించినా గుట్టలు , అడవులు కలిగిన నది ఒడ్డు వెంటనే జనావాసాలు వెల్లివిరిసినట్టు చరిత్ర చెపుతున్నది. కానీ ఇప్పుడేమో గుట్టలను కూల్చివేస్తూ, అడవులను నరికి వేసి నది ఒడ్డు గ్రామాలను ఖాళీ చేయించి అభివృధ్ధి నమూనా అంటే ఇదే అంటున్నారు. ప్రజల అభిప్రాయం తో సంబంధం లేకుండానే నీలోజీ పల్లె ఖాళీ అయింది .

మొన్న ఒక పని పైన కొదురు పాక వెళ్ళిన . పక్కనే ఉన్న నీలోజీ పల్లె ఎట్లున్నదో చూద్దామని వెళ్ళిన.వానా కాలం ప్రారంభం లోనే డ్యామ్ లో నీళ్ళు ఆపుతున్నాం ఇండ్లు మునిగి పోతాయని చాటింపువేసి ఊరును ఖాళీ చేయించిండ్రు. వాళ్ళు చెప్పినట్టే నీళ్ళు వచ్చి ఊరు మునిగి పోయింది. విపరీతమైన వర్షాల మూలంగా  నీళ్ళు బాగా వచ్చి డ్యామ్ కట్ట తెగిపోయింది .ఆ తర్వాత  మునిగిన ఇండ్లు తేలినై కానీ , అన్నీ నీళ్ళు నిలిచినప్పుడు కూలి పోయినై . . .ఇప్పుడు నీళ్ళు లేక డ్యామ్ ఎండిపోయి ఉంది. నీళ్ళు లెవ్వు కనుక ఆ భూములను సేద్యం చేసుకొని కూలిన ఇండ్లను శుబ్రమ్ చేసుకొని ఉంటున్నరు కొందరు. తోట రాజలింగు ఉన్నడేమో చూద్దాం అని ఇల్లు వెతుక్కుంటూ పోయిన. చీకిపోయిన పైకప్పు తో జీర్ణావస్తలో ఉన్న ఇంట్లో నుండి బైటికి వచ్చి "ఎవ్వలు సారు మీరు "  అన్నడు . నా పరిచయం చేసుకున్నా .

" అయ్యో సారు ! కూసుండవెదుదామంటే కుర్సీ లేదు, మంచం లేదు." అనుకుంట చేతులు పిసుక్కుంటున్నడు. బాధతో .
" మర్యాదల కోసం రాలేదు బాపు .ఎట్లున్నరో చూసిపోదామని వచ్చిన " అన్న . గాయింత మాటకే తడిసి ముద్దైండు పెద్దాయన .భూమికి నస్టపరిహారంగా ఇచ్కిన డబ్బులతోటి బిడ్డే పెండ్లి చేసిండట .కొడుకులకు పెండ్లిల్లు అయినయట . మిగిలిన డబ్బులు  కొడుకులు చెరిసగం తీసుకున్నరట  . ఇండ్లు మునిగి పోతున్నై అని చెప్పినప్పుడు కరీంనగర్ ల ఇల్లు కిరాయికి తీసుకొని ఉన్నరట .కరీంనగర్ లేబర్ అడ్డా కాడా రోజు కులీకి పొయ్యేటోడట. ఒక్క తెలిసిన మొఖం గూడా కనిపిచ్చేది కాదట. డ్యాం కట్టదెగి ఊరు తేలిన తర్వాత అక్కడ కిరాయి ఇండ్లల్ల ఉండలేక మళ్ళా ఇక్కడికే వచ్చి ఉంటున్నరట పెద్దమనుషులైన భార్యాభర్తలు . డబ్బులు మాత్రమే ఇచ్చి తమ బాధ్యత అయిపోయిందని ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నదట .

"ఉందామంటే ఎక్కడా ఇల్లు లేదు. చుట్టాలు పక్కాలు ఒక్క నాడంటే ఏమనుకోరేమో ఎల్లకాలం వాళ్ళ వద్ద ఉండలేము , తుపాకి దెబ్బకు  బెదిరి ,  చెట్టుమీది నుంచి లేసి పోయిన పిట్టల లెక్క , ఊరు ఖాళీ అయిన తర్వాత ఊరుకొక్కరం అయినం . ఎవ్వరూ ఎక్కడ ఉన్నది తెలువది . ఓ మాట లేదు ముచ్చట లేదు. కరెంటు లేదు, మా బతుకుల తీరుగనే ఉరుకు తొవ్వ లేదు దారి  లేదు . మమ్ముల మంచిగున్నావా అన్న మానవుడు లేడు .

Sunday, February 5, 2017

ఇంటిమీదెవుసమ్ 24

                                                     

ఎండాకాలం వచ్చేకంటే ముందే అవకాశం ఉన్న కూరాగాయల  సాగు ప్రయత్నం లో ఈ రోజు గంగవాయిలీ, బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర గింజలను నాటుదామని ఇంటిమీద  మడులను సిధ్ధం చేస్తున్నాను. శీతాకాలం ప్రారంభం లో పెట్టిన టమాటా చెట్లు ఇంకా కాస్తున్నయి . . నేను తలవంచుకొని నా పనిలో నేను నిమగ్నమై ఉన్నాను.

పక్కింటామే చూచూ ! కోతులు పాడుగాను అన్నం గంజు ఎత్తుకొని పోతున్నయని కట్టే దీసుకొని కోతివెంట బడ్డది . కోతి అదురక బెదురక నోరుదెరిచి నోట్లే కోరలు బైటికి వెళ్లబెట్టి గుర్ గుర్ అనుకుంటా ఆమెను బెదిరిస్తున్నది. ఇంతల మరో వైపు నాలుగైదు కోతులు వచ్చి అన్నం గంజును ఖాళీ జేసినై. ఆమె కేకలకు ఆమె భర్త ఇంకో కట్టేవట్టుకొని వస్తుండంగానే వాళ్ళ గోడ దునికి మా కాంపౌండు లోకి వచ్చినై. వస్తువస్తూనే టమాటా పందిరి పైన దునికి చేతికి అందిన పండ్లు కోసుకొని పరిగెత్తుకొని గోడ అవతల పెట్టుకొని విందు భోజనం తీరుగా అన్నీ కల్సీ తింటున్నై.

వీటి బాధ పడలేక కొనిపెట్టుకున్న గులేర్ ( వై ఆకారం లో ఉండే రబ్బరుతీగెల ఉండీల ) తీసుకొని వాటి గుంపు పైన గురి పెట్టిన. చెట్టు చాటుకు, గోడ చాటుకు దాక్కొని వచ్చే గులుక రాళ్ళను కాచుకొని చూస్తున్నై. రెండు మూడు సార్లు రాళ్ళను వాటి పైకి రువ్వంగానే పారి పోయినై. మళ్ళీ నేను నా పని లో నిమగ్న కాంగానే ఎట్లా కనిపెడుతున్నాయో గాని వాటి సయ్యాట మళ్ళీ మొదలైతున్నది . నేను గులేర్ తియ్యంగానే ఉరుకుడు, నేను పని మొదలు పెట్టంగానే మల్లా వచ్చుడు. నన్ను ఆటాడుకుంటున్నై. కోతి చేస్టలు వివేకవంతమైనవా , పిచ్చివా అని బేరెజు వేయడం అయ్యే పనిగాదు .

ఐతే ఈ మధ్యన మా వార్డ్ కార్పొరేటర్ ఒక మీటింగ్ పెట్టి దొంగలు, ఆవారాగాళ్ళు, చైన్ స్నాచర్లు , రెచ్చిపోతున్నారు కనుక సి సి కెమెరాలు పెడుతాం కాంట్రిబ్యూషన్ కావాలని చెప్పిండు. వాస్తవానికి పోలీసుల వద్ద వాళ్ళ రేటింగ్ కోసం నాయకులు, పెద్ద అధికార్ల దగ్గర రేటింగ్ కోసం పోలీసులు ఆడుతున్న నాటకం అది . సరే అది మన ప్రస్తుత చర్చనీయ అంశం కాదుగానీ దొంగలు, చైన్ స్నాచర్ల కంటే కోతుల బెడద ఎక్కువ అని నేను చెప్పినప్పుడు దాన్ని కూడా పరిష్కరిద్దామ్ అన్నాడు మా కార్పొరేటర్..

ఒక వైపు కోతుల తో నా కొట్లాట సాగుతుండగానే మా ఇంటి పక్కనున్న చెట్టుకిందకు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. దాని డ్రైవర్ కొన్ని మక్కజొన్నలను ఆ వ్యాన్ లో చల్లుకుంటూ కోతులను ఆవ్ ఆవ్ అని ఆహ్వానిస్తున్నాడు. దూరం నుండి చూస్తున్నై కానీ దగ్గరకు రాలేదు ఏవీ కూడా. అతడు దూరంగా వెల్లంగానే మెల్ల మెల్లగా పిల్ల కోతులు భయపడుకుంటా భయపడుకుంటా వచ్చి వ్యాను ఎక్కినై. లోపల టాప్ కు కట్టిఉన్న మక్కవెన్నులకు ఊగులాడుతున్నై. దిగిపోతున్నై . ఒక సారి పెద్ద కోతి వచ్చింది గేట్ దాకా వెళ్ళి కేర్ మని అరిచి కిందికి దునికింది. ఒక్క సారి అన్నీ దునికి వెళ్ళి పోయినై. అవి ఇట్లా ఆటాడుకుంటూ ఆటాడుకుంటూ నమ్మకుండా నే తేపకోసారి వచ్చి  వేసిన గింజలు అన్నీ తిని పోయినై.

" ఆకారాణంగా ఒక వ్యక్తి నీ పై అతి ప్రేమ చూపుతున్నాడంటే అతడు నిన్ను మోసం చేయడానికే " అని ఆ కోతులు గ్రహించాయి. కానీ బుధ్ధీ , జ్ఞానం మాకే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ఈ తరం యువతరం , ప్రేమ పేరుతో, ఈజీ మని పేరుతో రకరకాల ఆకర్షణలకు లోబడి   సాలె గూడు లాంటి సమస్యల్లో ఇరుక్కు పోతున్నారు.

Thursday, February 2, 2017

ఇంటిమీదెవుసమ్ 23


మొన్న పరుచూరి విధాత్రి మా ఇంటిమీదెవుసమ్ తోట  చూసేతందుకు వచ్చినప్పుడు అందరం కలిసి ఇక్కడనే మరో మిత్రుడు సూదమ్ రమేశ్ మిద్దె తోటను వెళ్ళి చూడాలని అనుకున్నం. అనుకున్న ప్రకారం మొన్న సాయంత్రం నా భార్య లక్ష్మి నేను విధాత్రి వాళ్ళ  ఇంటికి వెళ్ళినమ్. అది కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ప్రశాంతి నగర్ కాలనీ లో హౌసింగ్ బోర్డ్ వాళ్ళు కట్టించిన చిన్న మిద్దె ఇల్లు. ఇల్లు చాలా నీట్ సర్ది ఉంది. ఇంట్లోకి వెల్లంగానే ఆతృత కొద్ది మిద్దె  మీదికి ఎక్కినమ్, అక్కడ చూడంగానే వల్ల అభిరుచికి ఫిదా అయినమ్. స్తలమ్ చిన్నదే అయినా అందులో పెట్టిన మొక్కలు అనేకం. మరువం, మందారం, ఆకు కూరలు, సోంపు ఆకు మొక్క, దాల్చిన చెక్క నమిలితే ఎలాంటి రుచో అదే రుచి ఉన్న దాల్చిన మొక్క, టమాటా, వంకాయ, బొప్పాయ, మల్టీ విటామీన్ మొక్క, కళ్యామాకు, మునగ, తో బాటుగా తమలపాకుల చెట్టు, అబ్బా ఎన్ని మొక్కలని . చాలా అబ్బురం అనిపించింది.

విధాత్రి మాటల సందర్భంగా వాళ్ళ నానమ్మ వస్తే ఎన్నెన్నికొత్త  మొక్కలు వాళ్ళ ఇంట్లో పురుడు పోసుకుంటాయో పూసగుచ్చినట్టు చెప్పింది. వాళ్ళ కుటుంబాలల్లో  చుట్టాలిండ్లకు వెళ్లినప్పుడు వాళ్ళ మధ్యన జరిగే సంభాషణ ఎట్లా ఉంటుందట కదా అంటే, " మీ ఇంట్లో ఈ మధ్యన ఏమి కొత్త మొక్కలు నాటారు , ఏమి కొత్త పుస్తకాలు కొన్నారు, ఏమి కొత్త పుస్తకాలు చదివారు " ఇదీ ఇలా ఉంటుందట వాళ్ళ సంబాషణ . నాకు చాలా ఆనందం వేసింది. సామాన్యంగా ఇప్పటి ట్రెండ్ ఏమి కొత్త సినిమాలు చూశారు, ఫలానా సీరియల్ లో ఫలానా పాత్ర ఉంటుందే , అది ఏ పాత్రను చంపుతుంది? ఎవరిని పెళ్ళాడుతుంది , ప్రేమించిన వాన్నా లేక ఇంటికి వచ్చిపోయేవాన్నా అని ఒక అనాగరిక మైన అవాంఛనీయమైన చర్చలు జరుగుతున్న రోజుల్లో , ఒక ఆరోగ్యకరమైన , విలువలు కలిగిన  సమాజం కోసం ఎలాంటి చర్చలు జరుగాల్సి ఉందో తెలియజెప్పిన విధాత్రి కుటుంబానికి బంధు మిత్రులకు అభినందనలు చెబుదాం .

అంతకు ముందే వాళ్ళ ఇంటినుండి రెండు సార్లు రెండు రకాల  దుంప బచ్చలి ఇచ్చిండ్రు. ఇవ్వాళ మా ఇంట్లో అదే కూర, ఐతే నేను వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు మరో బహుమతి ఇచ్చారు, అదే తమలపాకుల మొక్క మరియు సోంపు మొక్క. రెండూ ఏనుకూన్నై మా దోస్తాన్ తీరుగానే. కొన్ని కూరగాయల విత్తనాలు కూడా తీసుకొని అయిదుగురం కల్సీ తీగలగుట్ట పల్లి లో ఉన్న సూదమ్ రమేశ్ ఇంటికి పోయినమ్. వాళ్ళ భైరవుడు ఉగ్రరూపుడై  తన అనుమతి లేకుండానే ఏమిటీ ఈ  ఆగమనం అంటూ ఆగమాగం జేసిండు   కాసేపు. ఆ తర్వాత చాలా కూల్ అయ్యిండనుకోండి . రమేశ్ మిద్దె తోటలో కాలీఫ్లవర్, టమాటా, వంకాయ చెట్లు , నిలువు పందిరికి పాకి ఉన్న బచ్చలి తీగెలను చూశాం. అప్పటికే చీకటి  పడింది.

రమేశ్ ఇంట్లో టీ తాగిన తర్వాత వాళ్ళ చిన్నమ్మాయి గాయిత్రి తో మాటలు కూడా చాలా కుతూహలంగా సాగినై. మా వెంట ఉన్న విధాత్రి,  గాయిత్రి పేరు వింటేనే అంత్య ప్రాస ను గుర్తుజేసింది  మాకు.  గాయిత్రి పదవ తరగతి చదువుతున్నది . టెన్ బై టెన్ సాధన గురించి బడిలో జరుగుతున్న కసరత్ గురించి చాలా జాలీ గా చెప్పింది. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే ఆ విద్యార్థులను ఎవరిని కదిలించినా ఆబ్బబ్బ చచ్చి పోతున్నాం బాబూ ఈ రుద్దుడు తో అనే వాళ్ళే గాని స్పోర్టివ్ గా తీసుకుంటున్న వాళ్ళు తక్కువ.

ఏమి చదువుదామనుకుంటున్నావంటే చాలా స్పస్తంగా , దృఢ నిర్ణయం తో సివిల్స్ అంది.  చాలా విషయాలు అడిగి తెలుసుకుంది. సివిల్స్ కోసం ఏమి డిగ్రీ చేస్తే సరే అనీ, ఎట్లా చదువితే తను సివిల్స్ సాధించ గలనూ అని చాలా కుతూహలం కనబర్చింది . ఆమె విశ్వాసం నన్ను ఆనందింప  జేసింది. ఎందుకంటే అదే రోజు ఉదయం నాతో వాకింగ్ జేసె ఒక తండ్రి ,  తన కొడుకు హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడని వాడు రేసింగ్ బైక్ కొని ఇస్తేనే కాలేజీకి వెళ్తానని లేకుంటే వెళ్ళేది లేదని నెల రోజులుగా ఇంట్లోనే భీష్మించుక కూర్చున్నాడని అబ్బాయి చదువు పట్ల చాలా ఆవేదన వ్యక్త పరిచిండు . తన వలె తన కొడుకు తక్కువ చదువుతో తక్కువ సంపాదనతో సరిపెట్టుకోవద్దని పెద్ద ఉద్యోగం జెసి గొప్పగా బతుకాన్నని తన పిల్లోన్ని చిన్నప్పటి నుండే హైద్రాబాద్ లో ఏ క్లాస్ ఇంగ్లీష్ మీడియం బడిలో హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నా అన్నాడు.

నాకైతే ఇక్కడ తండ్రి దే తప్పని అనిపించింది . తన పిల్లని సామర్థ్యం, వాని అర్హత, అవగాహన స్తాయి గమనించకుండా మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇంగ్లీస్ మెడియమ్ రెసిడెన్సియల్ స్కూల్లో వేస్తే మనం ఏది కోరుకుంటే పిల్లోడు అది అవుతాడని అనుకోవడం పిల్లల తలిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటు. అలాగే చదువు ఉన్నా లేకున్నా ఈ తలిదండ్రులు అనే వాళ్ళు బాగా సంపాయించి తన పిల్లలు తనకంటే ఇంకా ఎక్కువ సంపాయించాలని అనుకోవడం వలన సమాజానికి చెడు సంకేతాలు వెళ్ళి సమాజం చెడిపోవడానికి ఈ పెద్దలే దోహద పడుతున్న విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే సమాజానికి అంతమంచిది. .రమేశ్ కూతురు గాయిత్రి  ఎందుకు అంత బాధ్యతగా ఆలోచిస్తున్నది, అదే  ఆ ఇంజనీరు పిల్లోడు ఎందుకు అంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడో బుధ్ధి జీవులంతా ఆలోచించాల్సిన విషయం.