Saturday, June 24, 2017

మనుసుల మాట 11.

                                                        

సరుకుల పైన సేవా పన్ను కథా క్రమం:
క్రీ. పూ. 3000 సం. నాటికి మధ్య ఆసియా లో పామేరు పీఠభూమి(ఉత్తర కురు) భూ భాగం పైన ఇండో, ఇరానియన్ జాతి ప్రజలు తిరుగాడునాటికి ఈ భూమి మీద నామ మాత్రపు వ్యవీస్తీకృత జీవన  వ్యవస్త ఏర్పడినట్లుగా చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. విశాలమైన భూభాగం, సమృధ్ధిగా ఉన్న అటవీ సంపద, ఆరోగ్యకరమైన  పశుసంపద, వెరసి జానాభా అభివృధ్ధికి చాలినంత అవకాశం ఉన్న పరిస్తితులు. అంతకంటే ముందు తరాలవరకు  క్రూర జంతువుల ప్రమాదాలకు తోడు సభ్య సమూహాల ఆహార కరువు యుధ్ధాలు తోడవటం వలన సమూహాలు గణాలు గా మారి ప్రజాస్వామిక  గణ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందరూ ఆహార అన్వేషణలో ఉత్పత్తిలో  పాల్గొంటారు, అవసరం అయితే అందరూ శత్రువుతో పోరాడుతారు. ఏ గణం లోని సభ్యుడు అయినా గణ నియమాల ప్రకారం తన చేతనైనంత పని చేస్తాడు, ఆకలైనంత ఆహారం తింటాడు, గణ నియమానుసారం సాంసారిక, సాంస్కృతిక కార్యక్రమాలల్లో తన పాత్ర నిర్వహిస్తాడు.

క్రీ.పూ. 2000 సం. నాటికి చిన్న చిన్న గణాలు మన లేని పరిస్తితీ , కొన్ని గణాలు కలిసి  రాజ్యాలు గా ఏర్పడితే తప్ప తమ జాతి సంఖ్యను పెంచుకోలేని, శత్రువు నుండి రక్షించుకోలేని  పరిస్తితి. రాజ్యం అంటే సైన్యం, సైన్యానికి అన్నపానీయాల కోసం అదనపు సంపద కావాలి. అదనపు సంపద సృస్టికి అంతవరదాక ఓడిపోయిన దాసులతో అలివిగాని చాకిరీ చేయించడం మొదలైంది. రాతి గొడ్డణ్లు పోయి రాగి గొడ్డణ్లు వచ్చినై, వ్యవసాయం వచ్చింది, మద్రులు, పర్శవులు, పురూవులు మొదలైన రాజ్యా వ్యవస్తలు  వచ్చినై. ఈ రాజ్యాల మధ్యన కూడా ఆధిపత్యం కోసం యుద్దాలు నిరంతరం సాగేవి.

క్రీ.పూ. 1800 సం. నాటికి సురులూ , అసురులు అన్న జాతుల మధ్యన పోరాటాలు మొదలైనట్లుగా చరిత్ర. శత్రువుల నుండి రక్షణ కోసం ఒకే చోట నివాసాలు ఉండి అవి  పట్టణాలు గా వెలుగొందడం, ఆ పట్టణాల రక్షణకు కోట గోడలు , పెద్దసంఖ్యలో సైన్యం  అవసరం పడుతాయి. అందుకని అప్పటికే అభివృధ్ధి చెందిన వ్యవసాయం లోనుండి కొంత శాతం పన్ను,  రాజుకు చెల్లించాలి. అందరి రక్షణ కోసం పాటుబడే రాజ్యానికి పన్నుచెల్లించడం అసమంజసం అని ఆ సమాజానికి ఏమీ అనిపించలేదు.  

క్రీ.పూ.1500 సం. కాలం నాటికి కురు పాంచాల ప్రాంతాలల్లో  వైదిక ఆర్యుల కాలం ఆరంభం అయింది. పాలించబడితున్న ప్రజలు   , ఎల్లప్పుడూ రాజు, పురోహితుల పట్ల విధేయులుగా ఉండాలంటే  దేవుడిని తేక తప్పలేదు. భూమి భగవంతుని సృస్టీ , రాజు భవంతుని ప్రతినిధి కనుక భూమి మొత్తం రాజుది. ఆ భూమిని దున్ని పంట పండిస్తున్న ప్రజలు రాజుకు పన్నుకట్టాలి అన్న నానుడి ఆరంభం  అయింది.  అంతేకాకుండా ఇక బొక్కసానికి సొమ్ము రావడానికి వివిధ మార్గాల అన్వేషణ ప్రారంభం అయింది. తమ రాజ్యం గుండా రవాణా అయ్యే సరుకులకు పణులు (వ్యాపారులు, వైశ్యులు) పన్ను చెల్లిస్తేనే తమ రాజ్యం గుండా వెళ్లడానికి అనుమతి ఇస్తామని ఇబ్బంది పెడుతారు. అంతే గాకుండా తన ఏలుబడి లో ఉన్న ప్రజలతోటి వ్యాపారం చేసి డబ్బుగడిస్తున్నావు ,నా రక్షణలో ఉన్న ప్రజలను దోచుకోవడానికి నీకు అనుమతి ఇస్తున్నాను కనుక నీ దోపిడి లో నా వాటా ఎంత ? ( వ్యాపారి చిన్న దోపిడి దారైతే, రాజు అందరినీ దోచుకొనే పెద్ద దోపిడి దారు)  అట్లా పన్నులు చెల్లించే వ్యాపారులు కొంతకాలానికి దారి దోపిడి దార్ల నుండి ఇబ్బందులు ఎదురైతున్నందున తమకు రక్షణ కావాలని కోరుతారు. అది వ్యాపారులకు రాజు చేస్తున్న సేవ, ఆ సేవకు రాజు విధించే సుంకం అట్లా , సేవలకు  పన్ను అయింది.  ఇబ్బడి ముబ్బడిగా ప్రజలనుండి, వ్యాపారులనుండి  పన్నులు వసూలు జెసిన  రాజులు, రాజకుటుంబాలు, సైన్యాధిపతులు, పురోహిత వర్గం  భోగ లాలసత్వమయమైన జీవితాలు గడిపేవి. శ్రమ జీవులైన ప్రజలు ఏ రాజైనా అదే చేస్తున్నాడు కనుక ఎవరుపరిపాలించినా మా బతుకులు ఇంతే అని ప్రజలు రాజుల యుధ్ధాలల్లో ఎన్నడూ భాగస్వాములు కాలేదు.  ప్రజల అశాంతి ని శాంతింప జేయడానికి , పూర్వజన్మ, కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశ పెడుతాడు యాజ్ఞ వల్క మహా ముని. ప్రజల పైన పన్నులు, కర్మ సిధ్ద్ధాంతమ్ రెండూ కవల పిల్లలు.

ఈ పన్నుల పరంపర క్రీ.పూ.322 మౌర్య వంశం కు ముందు , గ్రీకుల  దండయాత్ర నుండి క్రీ.శ .11 శతాబ్దం మహ్మద్ గోరి దండయాత్ర వద్దనుండి క్రీ. శ. 16 వ శతాబ్దం బ్రిటిష్ పాలకుల ప్రవేశం నుండి 1947 దాకా ప్రజలతోటి సంబంధం లేకుండా రాజుల అవసరాల మేరకు, వారి  వారి విలాసాల కులాసాల మేరకు పన్నులు వేయడం ,గొల్లూడగొట్టి వసూళ్లు జేయడం జరిగింది.   
1950 లో భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది గదా? అందులో పేర్కొన్నట్లు గా సంపద అందరికీ సమానంగా,పంచేదానికి , ప్రజలందరి మధ్యన ప్రజాస్వామిక వాతావరణం ఉంచే దానికోసం ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా?   రాజరిక వ్యవస్తలో ఏదైతే ,  పన్నుల వసూళ్లు, దేశం లో ఉన్న సహజ సంపదలను వీలైనకాడికి అమ్ముకొని అనుభవించే పద్దతికి  , సంక్షేమ రాజ్యాలల్లో రాజ్యాంగం మేరకు అమలు కావాల్సిన రక్షణలు సామాన్య ప్రజలకు లభిస్తున్నాయా అన్నది చర్చనీయాంశం అవుతుంది గానీ జి‌ ఎస్ టి వలన ఏ సరుకులకు ఎంత పెరుగుతున్నది అన్నది సామాన్య ప్రజలకు సంబంధం లేనిది గా అయిపోయింది.  ఎట్లాగైనా ఎంతైనా వాళ్ళు పెంచుతారు , మనం చెల్లించాలి అనేదే ప్రజల అభిప్రాయం, రాచరిక వ్యవస్తలో వాళ్ళు యుధ్ధాలు చేసుకుంటారు, ఎవడు గెలిచినా దోచుకుంటాడు అనుకున్నట్లుగానే  సంక్షేమ రాజ్యాలని అనుకుంటున్న ఈ యుగం లో కూడా పాలించే వాడు ఎవడైనా పన్నులు వేస్తాడు, వాడు, వాణి అనుచరగణం .ప్రజల సొమ్ముతో రాజభోగాలు అనుభవిస్తారు.
నేను ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. G.O.Ms.No.38, Revenue (Endt.1) Dept, dt.29-1-2016.
Salary:Nill,special allowance: 8000, samptuary allowance: 7000, conveyance allowance:15000,if using own car:30000,rent free accomidation:50,000,car advance:10,000,00,computer :25000,crockery and cutlary:1,50,000  one time grant. Furniture :3,00,000. 1private secratary, one P.S.  one ps /pa out siders, attendars 3. Jamedar one , one driver, sweeprs 3.
ఇక ఆరోగ్యం, విదేశీ యాణం కమ్యూనికేషన్ అన్నీ ఫ్రీ. ఇవి కాకుండా దేశం లో ఉన్న సహజ వనరులు పెట్టుబడి దార్లకు అమ్ముకుంటే వచ్చే పర్సులు అవి వేరే. సహజ వనరుల విధ్వంసం వలన చచ్చేది సామాన్య ప్రజలు వచ్చేది మన రాజులకు కమిషన్లు.
సరుకుల పైన  సేవ పన్నులు వేయడం గాదు , ప్రజా సేవకులమ్ అని చెప్పుకుంటున్న వారు   ఆస్తులు కూడబెట్టుకోవడం మానేసి , ముందుగా విద్యా, వైద్యం సౌకర్యాలను ప్రివెట్ రంగం నుండి తొలగించి , సహజ వనరులను రక్షిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనండి . అప్పుడు మీరు ఏమి పన్నులు ఎందుకోసం ప్రజల పైన వేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ప్రజలతో సంబంధం లేకుండా రాచరిక వ్యవస్తలో అధికార కాంక్ష కోసం యుధ్ధాలు జెసి ప్రజలను కస్టాల పాలు చేస్తే ఆ వ్యవస్తలు ఎందుకు మిగిలి లేవో చరిత్రను చదువండి.






Wednesday, June 21, 2017

మనుసుల మాట 10.

                                                

మొన్న మా ఊరికి పోయి వస్తుంటే మంథనికి వచ్చే సరికి నేను చిన్నప్పుడు చదువుకున్న బడి ని చూద్దాం అనిపించింది. బడి వద్దకు పోయే సరికి గేటు తీసే ఉన్నది. మేన్ గేట్ లోకి ఎంటర్ అవుతూ కుడి వైపు తిరిగి చూసిన, మేము చిన్నప్పుడు ప్రార్థన గంట కంటే ముందే వచ్చి కూచుండే మట్టి కట్ట ఆనవాలు కోసం చూసిన. ఆ మట్టి కట్ట మీద బొడ్డుమల్లే చెట్లు ఉండేటియి . చలికాలం ల రాలిన బొడ్డుమల్లే పూలు ఏరుకొని వాటి సువాసనలు మనుసు నిండా పీల్చుకునేటోల్లమ్. అవి ఏవీ లేవు. ఉంటే ఆనందం, ఆశ్చర్యం , కానీ లేకపోవడం అదీ 50  సంవస్తారాల తర్వాత వాటి ఆనవాలు కోసం వెతుక్కోవడం నా అత్యాశ గాక మరెంటి. 1968 ల హెచ్ ఎస్సీ లో ఉండంగా ఎందుకో మా బడి ఫీసులు పెంచిండ్రు అప్పుడు. మేమంతా ఫీసులు తగ్గించాలే అని స్ట్రైక్ చేసి క్లాసులళ్లనుండి మొత్తం వెయ్యి మందిమి  బయటికి వచ్చి ఆ మట్టి కట్టమీద కూసున్నం. మా హెడ్ మాస్టర్ ఖాదర్ ఫిదా గారు మా లీడర్లను పిలిచి అరే ! బిడ్డా! ఫీసుల సంగతి మీ అమ్మా నాయినలు చూసుకుంటరు, మీకు చదువు నస్టమ్ అయిద్ది క్లాసులళ్ళకు వెళ్ళండి అని ఎంత నచ్చజెప్పినా మా లీడర్లు గాని మేము గాని అస్సలు వినలేదు. ఆయిన సరే మంచిది బిడ్డా అని , తన చాంబర్లకు పోయి ఈత బరిగే  తీసుకొని  వచ్చి ,క్లాసులళ్ళకు పోతరా పోరా! అని ముందర ఉన్నోన్ని ఎవ్వన్నో ఒక్కటి పీకిండు. ఇగజూడు ! అందరం ఎగవడి, ఎగవడి క్లాసులళ్ళకు ఊరుకినమ్. అప్పుడు మా వయసు 15--16 ఉంటై. అయినా మా పెద్దసారు ఒక్క గద్దరాయింపుకు  గజ్జుమని క్లాసులళ్ళకు పోయినమ్. అది ఆ కాలం ల ఉన్న క్రమశిక్షణ .

అది యాది జేసుకుంటా కొంచం ముందరికి పోయే వరకు మేము రోజూ ఉదయం ప్రార్థన జేసె స్తలమ్, అక్కడ మేము 6 నుండి 11 తరగతులకు చెందిన 12 సెక్షన్ల వాళ్ళం 12 లైన్లు గట్టి నిలబడితే మా ముందు, మా పెద్దసారు ఆయిన తర్వాత లెక్కల సారు లొకే కిషన్ రావు సారు, సైన్సు సారు గీట్ల జనార్ధన్ రెడ్డి, హింది సారు పి. రాజన్న, తెలుగు సారు బి . అచ్యుత రాజు సారు, జి. శ్రీరాములు.సారు, గట్టు బుచ్చయ్య సారు,లొకే లక్ష్మణ శర్మసారు,  మారుపాక రాజన్న సారు, గణపతి సారు ఇట్లా దాదాపు 20 మంది సార్లు ఉద్దండ పండితులు నిలబడి ఉండే నిండు పెరోలగమే ఆ ప్రార్థన సమావేశం సభ. ఆ సార్లు నిలబడి ఉండే స్తలమ్ లకు వెళ్ళి నిలబడ్డ . ఏదో పులకరింపు. ఆ నాడు నిటారుగా నిలబడి ఉన్న టేకు మొగురాలు కాల ప్రభావం వలన పడమటికి పొద్దువాలి పోయినట్లే వాలి పోయి ఉన్నాయి. గోడ మీద ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంథని, స్టాపితం 1944 అని రాయబడి ఉంది. అక్కడినుండి కొంచం ఎడమ వైపు అంటే తూర్పు వైపు తిరిగి ( నేను వెళ్లింది సాయంత్రం 5 గంటలకు కనుక బడి మూసి వేయబడి ఉంది) గోడ వెంట వెళితే మేము 1964-65 సంవస్తారామ్ లో 8 వ తరగతి చదివినప్పుడు కూచున్న తరగతి గది వచ్చింది. కిటికీల తలుపులు మూసి ఉన్నాయి. ఆ కిటికీ ఇనుప ఊచలు తడిమి చూసిన. అచ్యుత రాజు సారు గజేంద్ర మోక్షం చెప్పుతున్నప్పుడు చదివిన " సిరికిన్ జెప్పడు శంఖ చక్రముల్ చేదోయి సంధింపడు" , అలాగే నరకా సుర వధ లో " వేణిమ్ జొల్లెము జూట్టి లేచి నిలిచే , వేణీ లోచన తన ప్రాణేశాగ్రభాగంబునన్ " , వరూధిని ప్రవరాఖ్యలోని " నిండు మనంబు  నవ్యనీత సమానంబు" ,  ఎన్ని పద్యాలని ఆ సారు గొంతునుండి రాగయుక్తంగా పాడిన రాగాలు ఆ గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయా అన్నట్లు  అనిపించింది. నాకు ఇట్లా ముచ్చట్లు రాసే విధానం , సాహిత్యం పట్ల అభిరుచి కలుగడానికి  మా నాయిన వీరగొని నర్సయ్య, నుండి మా అన్న వీరగొని చేంద్రయ్య తర్వాత అచ్యుత రాజు సార్ వంటివాళ్లు పెట్టిన బిక్షే.  కొంచెం ముందుకు వెల్లీ మూల తిరుగంగానే నైంత్ క్లాసుల పి. రాజన్న హిందీ పాఠం యాదికి వచ్చింది, కవయిత్రి సుమిత్ర చౌహాన్ రాసిన, " మై లేట్ ఆయీ థీ , మై లేఠీ థీ, మేరే ఊపర్ ఏక్ లేటా థా !.......ఏ దునియా శకల్ మత్ కరో వో మేరా బేటా థా!" ఏమి కవిత్వమని. ఆ గది దాటి ముందుకు రాంగానే టెంత్ క్లాస్ ల గీట్ల జనార్ధన్ రెడ్డి సారు జెప్పిన భౌతిక శాస్త్ర నియమాలు,  ఆ గది తర్వాత మేము హెచ్ ఎస్సీ చదువుకున్న లెవెన్త్ క్లాస్ రూమ్, అక్కడ లొకే కిషన్ రావు సారు చెప్పిన అజంతా రేఖా గణితం, అజంతా బీజగణిత సూత్రాలు, ఖాదర్ ఫిదా సార్ చెప్పిన ఇంగ్లీష్ గ్రామర్, అన్నీ సినిమా రీల్ల తీరు తిరిగినై.   చివరల ఇంకొక్క సంగతి చెప్పాలే మీకు. రాదారం సీతారాం సార్ అని అప్పటికే పెద్దాయన, బడి ని డిసిప్లిన్ ల ఉంచుడుల పి టి సార్ ఇబ్రాహీం సార్ కు జతగా రాదారం సీతారాం సార్ ఉండేటోడు. సార్ కు కోపం వస్తే దిబ్బడ దబ్బడ రెండు ఉతికేటిది. తెలివైన పెద్దపిల్లలు ఒక్కటి కొట్టంగనే టిపిక్కిన కింద వడి లిట్టర, లిట్టర కొట్టుకునుడు జెద్దురు. ఆని సోపతిగాళ్ళు అయ్యో,అయ్యో, సార్ ! పొరడు ఎట్లనో చేస్తున్నడు ఆనంగానే అరే! మల్లయ్య! ( అటెండర్) మంచినీళ్లు తే అని తాగిపిచ్చి తంద్లాడుతుండేది. మెల్లెగా కండ్లు తెరిచిన  దెబ్బలు తిన్న పిలగానికి అరే వీనికి అయ్యన్న హోటల్ ల ఇడ్లీ తినిపిచ్చి చాయ్ తాగించుక రా పొండ్రి అని వాణి వెంట పొయ్యేతందుకు ఇంకో పిల్లగానికి అని 2 టిఫిన్ , చాయ్ అని రాసిచ్చిన  చిట్టి మీద వీళ్ళు 2 పక్కకు 0 పెట్టి 20 టిఫిన్ లు తిని చాయ్ లు తాగి వద్దురు. అందుకని సారు తోటి దెబ్బలు పడే దానికి ఒక బ్యాచ్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేది.  

చివరగా మేము హాకీ , వాలీ బాల్ ఆడిన మైదానం లకు వెళ్ళిన అప్పటికే అక్కడ జమైన పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒకసారి నేను హాకీ ఆడుతున్న. నాకు పెద్దగా ఆ ఆట వచ్చేది గాదు. స్టిక్ పట్టుకొనే వచ్చే బాల్ కు ఎదురుగా ఊరికి వస్తున్న మా క్యాప్టెన్ మాదాడి భాస్కర్ రెడ్డి ,  అది ఔట్ బాల్ రా వదిలేయ్ అంటున్నడు , నేనూ వదిలేద్దామనే అనుకున్న కానీ నేనూ బాల్ కు ఎదురుగా ఉరికస్తున్నగదా , అది కాలు కు తాకీ ఫౌల్ అయి  పెనాల్టీ ఇవ్వడం తో వాళ్ళు గోల్ చేసిండ్రు. ఇగ నన్ను టీం మేట్స్ అందరూ ఒక్కటే తిట్టుడు. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మనుసంత ఆనందం నిండగా బయటకు రోడ్డు మీదికి వచ్చిన.

ఇగో ఇక్కన్నేఈ రోడ్డు మీదనే , నా  మిత్రుడు నాగేందర్ కలిసి పి యు సి చదివేతందుకు తాను కరీంనగర్ వెళ్తున్నా అని చెప్పి నా చదువు కొనసాగడానికి మార్గదర్శకుడు అయిండు.

అయ్యా అవ్వలు జన్మనిచ్చి విద్యాబుద్దులు చెప్పిస్తే, ఉపాధ్యాయులు జ్ఞాన బిక్ష పెడితే , నిజమైన మిత్రులు ఎందరో మన అభ్యున్నతికి తోడ్పడ్డారు. ఎవరమైన మనం ఇప్పుడు ఈ స్తాయిలో ఉన్నమంటే, జన్మనిచ్చిన తలిదండ్రులు, ఆటపాటలు నేర్పిన తోడబుట్టువులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత మన పట్ల ఈర్ష్య అసూయలు  లేని నిజమైన  మిత్రులే కారణం.

Tuesday, June 6, 2017

మనుసుల మాట 8.

                                                           

ప్రపంచ పర్యావరణ దినం ఈ రోజు. పెరిగి పోతున్న గ్లోబల్ వార్మింగ్ గురించి బుధ్ధీజీవులంతా చాలా మదనపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త , స్టీఫెన్ హాకింగ్  ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ఈ భూ గ్రహం ఇంకో వంద సంవస్తారాలకంటే ఎక్కువ కాలం మనుగడలో ఉండదు అని చెపుతున్నాడు. సామాన్యులమైన మనం కూడా అలివిగాని వేడి ని అనుభవిస్తున్నాము. ఎవరికి వాళ్ళం మన మన జీవిత కాలం లో ఇంత వేడిని ఎప్పుడూ అనుభవించి ఉండలేదని చెప్పుకుంటూ తల్లడిల్లి పోతున్నాం.

పర్యావరణాన్ని రక్షించుకోవడానికి చెట్లు పెంచాలనీ, జంతు జీవజాలాన్ని కాపాడుకోవాలని, ఫాసిల్ ఇందనాలను మండించకూడదనీ , అణుధార్మిక పదార్థాల వినియోగం వద్దని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కానీ జరుగుతున్నదేమిటి? నా చిన్నప్పుడు పట్టణాల నుండి గుత్తే దార్లు మా అటవీ ప్రాంతమైన మహాదేపూర్ జంగల్ కు వద్దురు. వాళ్ళు కోపులు గుత్తవడుదురు . సర్కారే అడివిని నరుకుక పొమ్మని అనుమతి ఇచ్చేదీ. సర్కారు అనుమతి ఇచ్చేది ఇంత ఐతే ఆయన లంచాలు ఇచ్చి జంగలంతా నరుకుక పొయ్యేది. ఆ కాంట్రాక్టర్ లను ఎవరైనా ఇదేంది అంటే వాళ్ళు అడివిల అన్నలు అయిపోదురు, సర్కారు కు టార్గెట్ అయేటోల్లు. సరే అడివంతా  ఒడిసిపాయే. కరీంనగర్ చుట్టూ కాలారి గుట్టలు ఉండేటియి. ఆ గుట్టల మీద అడివి ఉండేది, సమస్త జంతు జీవజాలం బతికేదీ , గుట్టకింద భూమిల పుష్కలంగా నీటి జాడలు ఉండేటియి. కానీ జంగలాత  కాంట్రాక్టర్ల తీరుగానే గ్రానైట్ కాంట్రాక్టర్లు  కూడా సర్కారు మద్దతు తోటి వాళ్ళకు కేటాయించిన స్తలమ్ కంటే ఎన్నో రెట్ల భూమిని తవ్విపోసిండ్రు. గుట్టలు పోవడం వలన సమస్త జంతుజీవజాలం గ్రామాల పైన, పట్టణాన పైన పడ్డై. భూగర్భ నీటిమట్టం పడిపోయి హరిత హారం పేరుతోటి సర్కారు పెట్టిన చెట్లు చచ్చి ఊరుకుంటున్నై. వేల కోట్ల ఖర్చు వృధా. ప్రజలు అలివిగాని వేడితో అల్లాడుతున్నారు. ఇక ఫాసిల్ ఇందనాలు అయిన డీసీల్ పెట్రోల్ , బొగ్గు విపరీతంగా మండించ బడుతున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయిన పవన, సోలార్, విద్యుత్తులు , బ్యాటరీల తో నడిచే కార్ల వినియోగం పెరుగాల్సి ఉందని అన్నా ప్రభుత్వాలు వాటిపైన శ్రధ్ధ పెట్టడం లేదు. అను ధార్మిక పదార్థాల వినియోగం కూడదని అంటున్నాకూడా మనం కూడక్కలమ్ వద్ద అనుయింధన విద్యుత్ ఉత్పత్తికి నిన్ననే రష్యా తో ఒప్పందం చేసుకున్నాము. అటు ఎక్కువకు ఎక్కువ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న అమెరికా ప్యారిస్ ఒప్పందం తో మాకు పనిలేదు పర్యావరణ పరిరక్షణకు పైసా విదిల్చేది  లేదని ట్రంప్ మహాశయుడు ఢంకా బజాయిస్తున్నాడు.పైగా ప్రపంచదేశాలకు ఆయుధాలను అమ్మే వ్యాపారం విరివిగా చేస్తూనే ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు.  మన దేశం లో కూడా పర్యావరణానికి హాని జేసె వనరుల విధ్వంసం ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాస్త్ర, పశ్చిమ బెంగాల్, లో విచ్చ్కల విడిగా సాగుతున్నది. వద్దని మొత్తుకుంటున్న స్తానిక గిరిజనులను నిర్ధాక్షిణ్యంగా సర్కారు బలగాలతో అణిచివేస్తున్నారు.


అయ్యా ! అభివృధ్ధి పేరుతోటి మీరు కూడబెడుతున్న ఈ సంపద అంతా ఎవరు అనుభవించాలి రేపు? తరతరాలు తిన్నా తరుగని సంపద సంపాదించామని మురిసిపోతున్న సంపన్నులారా! ప్రకృతి ధర్మానికి విరుధ్ధంగా పోతే ఎవ్వరూ మిగలరు అని చరిత్ర చెపుతున్నది. అంతెందుకు మీరెన్ని డబ్బులు పెట్టుకున్నా మీ ఆయుష్షును 100, 120 కంటే పెంచుకోలేరు కదా ? అదనంగా జీవించే ఆ కాలం కూడా ఏ రకమైన ఆకలిలేక, చురుకుదనం లేక, శరీరాలను బలవంతంగా కదిలిస్తూ, ఏమే తినలేక తాగలేక , బతుకు మీది యావ చావక జీవశ్చవాళ్ళా బతుకుతున్నారే! ఆ బతుకు ఏమి బతుకురా తండ్రి! ఇంతమంది ఉసురుబోసుకుంటూ బొర్రలు, కండల కళేబరాలు పెంచుకుంటూ మీకు మీరు  మురిసి పోతున్నారేమో కానీ మీ మురుగును ప్రకృతి ఇంకా  ఎంతో కాలం భరించలేదని పర్యావరణ వేత్తలు  మొత్తుకుంటున్నారు. భూమి ఘోషను ఆలకించండి. లేదంటే ఎవడి గోతిని వాడే తవ్వుకొనే అవసరం లేకుండానే అవని మాత ఆసాంతం అదృశ్యం అయిపోనున్నదట.

మనుసుల మాట 9

                                                                       

నిన్న సోమవారం మధ్యాహ్నం ఒక పెళ్ళికి వెళ్ళాను. బ్రహ్మాండమైన పెళ్లిపందిరి, వేద మంత్రాల మధ్యన పెళ్లితంతు కార్యక్రమం అయిపోవచ్చింది. చివరగా అరుంధతి నక్షత్ర దర్శనం కోసం వధూవరులకు ఆకాశం కనిపించే విధంగా ఫంక్షన్ హాల్ బయటకు పంతులుగారు తీసుకొని  వెళ్లారు. ఈ లోగా ఆహుతులను ఆహ్లాద పరిచే కార్యక్రమం లో భాగంగా  గానా బజానా లైవ్ నడుస్తున్నది. ఇంతల ఒక యువకుడు వచ్చి వారితో ఏదో మాట్లాడినాడు. అనౌన్సర్ అర్థం కానీ పదాల తో ఏదో అనౌన్స్ చేశాడు. మాకు చివరిగా అయితే స్క్రీన్ పైన చూసి ఆనందించండి అన్న మాటలు అర్థం అయినాయి. సరే ! స్క్రీన్ కు కండ్లను అతికించామ్ .

రొమాన్స్  సినిమాలో హీరో , హీరోయిన్  వెంట పరిగెత్తుతూ డూయేట్ పాడుతున్నట్లుగా పెళ్లి కూతురూ, పెళ్ళికొడుకు ఒకరి వెంట మరొకరు ఉరుకుతున్నారు. అరె భై !  అది సినిమా.ఇది జీవితం . అది  నిజం కాదు. ఇది నిజం. అక్కడ వాళ్ళు అట్లా ఆడటానికి పాడటానికి , పడటానికి, లేవటానికి ఒక డైరక్టర్, కొరియోగ్రాపర్, మ్యూసిక్ డైరెక్టర్, పాటరాసిన కవి, దానికి ఒక కథ ఇంత మాయా నాటకం వెనుక ఉంటే వాళ్ళు అలా తైతక్కలాడుతారు. దాన్ని మనం అనుకరించడం నాగరికత అనో లేక మధుర జ్ఞాపకాలు అనో అనుకోవడం తెలియని తనమే అవుతుంది. సినిమా  వాళ్ళు నిజానికి భార్య భర్తలు గా నటిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు గా కలిసి నూరేళ్ళు కాపురం చేయ వలసిన  వాళ్ళు. . వాళ్ళ ప్రణయం బజార్ల చూపితేనే వాళ్ళ బతుకుదెరువు సాగేది. కనుక ప్రజల వ్యామోహాన్ని సొమ్ముజేసుకోవడానికి వాళ్ళకు అది తప్పనిసరి అయిన కార్యక్రమం.  అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా , సీన్ టేక్ ఓ కె అయిన తర్వాత నటులు హమ్మయ్య ఒక పని అయిపోయిందని సేద తీరుతుంటారు.  అది యూరోపియన్ కల్చర్ అయినా మరే కల్చర్ అయినా సినిమాలో వలె బజారులో ప్రణయ కలాపాలు సాగించిన నాగరిక సమాజం ఇంతవరకు ఎక్కడా ఉన్నట్లుగా దాఖలాలు లెవ్వు. .  సినిమా లో వలె అంతా అబద్దమో, నటననో కాదు కదా ఇక్కడ .  వీళ్ళు ఒక జీవిత కాలం ఆలుమొగలుగా అన్యోన్యంగా జీవించ వలిసిన వాళ్ళు , వాళ్ళ ప్రేమ కలాపాలను  బజారులో పెట్టుకోవడం నాగరికత గా చలామణి కావడమే బాధాకరం అనిపించింది నాకు.

వీలైతే ఒకసారి జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత రావూరి భారధ్వాజ రాసిన " పాకుడు రాళ్ళు " నవల చదువండి.   సినిమా వాళ్ళ జీవితాలు ఎంతటి జారుడు బండలో అర్థం అవుతుంది . రేపు కలిసి గుట్టుగా కాపురం చేయవలిసిన ఈ జంట కాలువల పొంటి, చెట్ల పొంటీ , పొదలపోంటీ ఒగలవెంట ఒగలు  ఈ ప్రణయ కలాపాలు ఏమిటీ? కన్న తల్లికి అయిన కనుమరుగు అవసరం అనుకున్న మానవ నాగరికత ఎక్కడ బాయే? ఆ జంట ప్రణయకలాపాలు , ఆహ్వానితులకు వినోదమైపోవడం నాకైతే బాధాకరం అనిపించింది. ఆ తీపి గురుతులు ఆ జంట సొంతం. అవి పది కాలాల పాటు పదిల పరుచుకొని  వాళ్ళు గుర్తు పొట్టుకోవాల్సినవి కానీ రట్టు జేసుకొనేవి కాదన్నది , మానవ సమాజం  అభివృధ్ధి అయిన తర్వాత మనుషులు  నిర్దేశించుకున్న ఒక మానవీయ నాగరికత.  వీడియో గ్రాఫర్స్ తమ వ్యాపారం కొరకు ఫలానా వాళ్ళు ఇలా చేయించుకొన్నారని, మీరుకూడా చేయించుకొండని పురమాయించంగానే తలిదండ్రులు కూడా ఇది చేయించకుంటే పిల్లలు బాధపడుతారనో లేక నాకేమీ తక్కువ , నేను ఆ మాత్రం చేయించలేనా అనే ఆధిక్య భావనో ఏమో కానీ అటు తలిదండ్రులు సరే అంటున్నారు, ఇటు పిల్లలు కూడా సై అంటున్నారు. సాటి వారిముందు మేము పెళ్లి ఘనంగా చేశామని పేరెంట్స్, చేసుకున్నామని పెళ్లి జంట భావిస్తున్నారు. ఆ విధంగా ఆ కొత్త పెళ్లి  జంట ను డబ్బులు తీసుకొని  అలా నటింప జెసి దాన్ని షూట్ జెసి వచ్చిన వారికి బహిరంగంగా ప్రదర్శింపజేయడం నాగరికత అని చెప్పేవిధానం సరైందేనా అని ఒక సారి అందరం ఆలోచించాల్సి ఉంది.   ఒక విచిత్రమైన, అనాగరికమైన, అవాంఛనీయమైన ఆచరణను నాగరికం , ఆధునికం, ఆచరణీయం అన్న భ్రమల్లో ప్రజలను , వ్యాపారీకరణ  ముంచివేస్తుంటే బుధ్దిమంతులైన పెద్దవాళ్ళు సైతం దానికి వంతబాడటం అనేది తప్పకుండా అందరం ఆలోచించవలసిన విషయం.  

" ఒకప్పుడు ఇంట్లో  వండుకొని తిని - సౌచానికి బయటకు వెళ్ళేవాళ్లు.
ఇప్పుడు బయట తినివచ్చి ఇంటిలో సౌచానికి వెళుతున్నారు.

ఒకప్పుడు దాన శీలురుల ధాతృత్వాన్ని బైటి వాళ్ళు వేనోళ్ల పొగిడే వారు.
ఇప్పుడు లోభి జనులు తమను తామే పొగడుకొని చంకలు గుద్దుకుంటున్నారు .

ఒకప్పుడు బయటివాళ్లు ఆడిపాడితే - ఇంట్లో వాళ్ళు వెళ్ళి వినోదించేవారు.
ఇప్పుడు ఇంటి వాళ్ళు ఆడిపాడి బయటివాళ్లను వినోదింపజేస్తున్నారు. "  


ఆంధ్ర జ్యోతి , ఆర్ . కె   కొత్తపలుకులు కాలం లో నుండి సేకరించినవి పై మాటలు.