Wednesday, July 12, 2017

మనుసుల మాట 13.

                                                          

ఇంటిమీద నాటిన బీర పాదులు , ఆనిగపు  పాదులు తీగలు యెల్లినై.ఈ రోజు  వాటిని పందిరి మీదికి ఎక్కించే పని జేసేవరకు పెయ్యంత చెమటలు పట్టినై. శుబ్రంగా స్నానం చేసిన తర్వాత ప్రాణానికి చాలా హాయి అనిపించింది. బయట వాతావరణం కూడా ఈ రోజు చాలా ఆహ్లాదంగా ఉంది. మిత్రుడు నాగేందర్ ను కలిసి వద్దామని ఈజీగా ఉంటుందని ఫ్యాంట్ టి షర్ట్ వేసుకొన్న. ఆ టీ షర్ట్ మా చిన్నోడు ,  నేను అమెరికా వెళ్లినప్పుడు నాకెందుకురా బట్టలు , చాలానే ఉన్నై , అన్నా వినకుండా కొన్ని బట్టలు తీసుకున్నడు. వానికి నా ఇస్టమ్   ఎట్లా తెలుసో గానీ నాకూ కొన్న వాటిలో ఒక చక్కని తెల్లటి టీ షర్ట్ అడ్డంగా ఆకుపచ్చ గీతలు ఉన్న టీ షర్ట్ తీసుకున్నడు. అదే వేసుకున్న. తెల్ల టీ షర్ట్ కు నాకూ ఉన్న అనుభూతి ఒక్కసారి మనుసుల మెదిలి నా బాల్యం లోకి  తీసుక పోయింది.  

నేను తొమ్మిదో  తరగతి చదువుతున్నప్పుడు అంతవరదాకా ఉన్న సత్యనారాయణ హెడ్ మాస్టర్ రిటైర్ అయితే రాఘవా చారి అని ఒక సాంప్రదాయ ఆచార్యులు హెడ్ మాస్టర్ గా వచ్చిండు.  ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలంటే చాలా ఇస్టమ్.  1966 రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమం లో గ్రామీణ కళలకు అవకాశం ఇచ్చిండు. అంత వరదాకా మా మంతెన హై స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే రామాయణ, మహాభారతాల పాత్రల " ఏక పాత్రాభినయాలు " , లేదా పౌరాణిక నాటకాలు వేద్దురు. కానీ మాకు గ్రామీణ కళల ప్రదర్శనకు అవకాశం వచ్చింది కనుక రామయ్య అనే మిత్రుడు నేను , ఇంకా రాజీ రెడ్డి అనే మరో క్లాస్ మేట్ , ముగ్గురం కలిసి ఎల్లమ్మ ఒగ్గు కథ చెప్పినమ్. తబలా, డోలక్, మృదంగ వాయిద్యాలు తెలిసిన మా మంతెన శ్రోతలకు మొదటి సారిగా మేము కంజీరా డప్పుసప్పుడుతో కథ జెప్పుడు షురూ జేసినప్పుడు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసిన మాకు  కథజెప్పుడు అయిపోయినంక మనకు తప్పకుండా ప్రైజ్ వస్తది అనుకున్నం . అనుకున్నట్టే మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా ముగ్గురికి తెల్లటి టీ షర్ట్ లు బహుమతి గా ఇచ్చిండ్రు. అంతవరదాకా అంగీలు తొడుక్కున్న నాకు తెల్లటి టీ షర్ట్ బలే బాగున్నది అనుకున్న వేసుకొని చూసి. దాన్ని అట్లనే దాసి పెట్టుకోని సంకురాత్రి పండుక్కు ఇంటికి పోయినప్పుడు మా అవ్వకు చూపిన . ఎక్కడిది కొడుకా అని ఆరా దీసింది. విషయం చెప్పంగనే బాగ సంబుర పడి ,అయితే నువ్వు పోటీలల్ల కొత్త ఆంగి గెలుసుకచ్చినవా కొడుక  అని తన చేతుల తోటి నాకు ఆ ఆంగి, అంటే అదే టీ షర్ట్ తొడిగింది. ఆ రోజంతా తెల్లగా పాల తీరుగ మెరిసిపోతున్న టీ షర్ట్ తోటి ఊరంతా తిరిగి అందరికీ చూపి సంబుర పడ్డ. తెల్లారి ఆంగి ఇడిసినంక సబ్బువెట్టి పిండుకొని దాసిపెట్టుకున్న.

ఏప్రిల్ మాసం ల ఏడాది పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన . వచ్కేవారకల్లా జొన్న కోతలు జరుగుతానై. జొ న్న పోతలు అన్నా, జొన్న కోతలు అన్నా ఆ కాలం ల రైతులకు పెద్ద పని, పెద్ద సంబురమ్, ఇంటిల్లిపాది అందరూ చీకటి తోటి  లేసిందంటే  పొద్దు చెండ్లల్లనే పొడిసేది. మా నాయిన ఎప్పుడు పుంజులుగుయ్యంగా పోయిండో గానీ లేసినంక వీన్ని మడ్ల చెండ్లకు పంపుమని మా అవ్వకు చెప్పి పోయిండట . నేను పొద్దుగాల లేసి ఇంటిముందట ఉన్న వేప చెట్టు నుంచి పలుకర పుల్ల ఇరుసుకొని పండ్లు తోముకుంటుంటే అవ్వ ఆ ముచ్చట చెప్పింది. నాకేమో తానం జెసి తెల్ల టీ షర్ట్ వేసుకొని దోస్తుగాళ్లతోటి గడుపుదామని ఉండే. అదే ముచ్చట అవ్వతొని చెప్పిన. అయితే మానాయే బిడ్డ మాపటీలి పోదువుగాని, పూర్ణం బూరెలు జేత్త నువ్వచ్చేవారకు అని బుదరిచ్చి పొమ్మన్నది. సరే ఇగ తప్పెటట్టు లేదని ఆ తెల్ల టీ షర్ట్ తొడుక్కోనే చేనుకు పోయిన. నేను పోయే వారకు నాయిన జొన్న సొప్పకట్టలను ఒక్క దగ్గెర గూడేత్తున్నడు . జొన్న చేను రాత్రి పూటనే కోస్తరు. ఎందుకంటే అప్పటికే ఎండలు బాగ ముదురుతై, ఎండెక్కిందంటే జొన్న ఆకులు కోసుక  పోతై. రాత్రి పూట మంచుకు మెత్తబడి ఉంటై కనుక తెల్లారక ముందే కోత కోసి మనుసులు ఇంటికి జేరుతరు. ఇన్టోల్లు మెదలను కట్టలు కట్టుకొని ఒక్కదగ్గర గూడేసుకోని ఆ సొప్ప గూళ్లను ఎడ్ల బండ్ల మీద ఇంటికి కల్లం లకు చేరేసుకొని ఓ మంచి రోజునాడు కంకి ఇరుసుడు షురూ జేస్తరు .  

నేను పొయ్యే వారకు నాయిన మా ఇంటి పాలేర్లు అందరు కలిసి సొప్ప కట్టలు కట్టి గూడేసుడు అయిపోయింది. నేను పోయినంక ఎడ్లను దెచ్చి బండ్లు గట్టినమ్. ఒగ పాలేరేమో అక్కడక్కడ మిగిలి పోయిన జొన్న కర్రలు ఒక్క దగ్గెర ఏరి కుప్పేస్తున్నడు. ఇద్దరు పాలేర్లు ఒగ బండి మెలుగుతున్నరు ( సొప్ప కట్టలను బండిల పేర్సుడు) . మా నాయిన బండి మెలుగుతే నేను సొప్ప కట్టలు బండి మీదికి ఇసిరి వెయ్యాన్నన్న మాట. రేకల పాల్లమ్ మెలిగే దాక ఇబ్బంది లేదు . రేకల పాల్లమ్ వచ్చేదాకా సొప్పకట్టలు పొడుగు మెలుగుతరు. రేకల మీదికి వచ్చిన తర్వాత  అడ్డంగా మెలుగుతరు. ఆ పని అందరికీ సరిగా రాకపోయ్యేది. మా నాయిన ఏ పనిల ఐనా గొప్ప సుతారికాడే. ఆయన పొడుగు మెలుగుడు అయిపోయింది అడ్డం మెలుగుతున్నాడు. ఒక్కక్క సొప్పకట్టాను పైకి పది పన్నెండు ఫీట్ల ఎత్తుకు ఇసురాలే. ఒక్కెక్క కర్రకు కంకి దాదాపు కడుముంతంత  , కడుముంతంత ఉన్నై. ఆ యేడు కంకులు బాగ మంచిగ ఏపినై ( పెరిగినై) . ఒక్క కంకి నలిస్తే అరుసోడు (పావుకిలో) జొన్నలు రాల్తై. బలిమిటికి , బలిమిటికి కట్టలు పైకి ఇసురుతున్న. ఇంతల ఒక కాటుక కంకి (ఫంగస్ వలన నల్లబడినవి) పలిగి నా తెల్లటి టీ షర్ట్ కు కర్రెటి మరక చేసింది. అయ్యో ఎంత పని అయిపాయే తొడుక్కోని రాకున్నా మంచిగుండు అని నేను నా షర్ట్ దిక్కు చూసుకుంటున్న. పైకి సొప్పకట్ట పోకపోయ్యేవరకు నాయిన వంగి కిందికి చూసేవారకు నేను షర్టును చూసుకుంటున్న. పని ఎవ్వరు సక్కగ చెయ్యక పోయినా ఆయినకు బాగ కోపం వచ్చేది. నేను కట్ట పైకి వెయ్యకుండా నా షర్ట్ దిక్కు చూసుకుంటా పని ఆపివేసినందుకు కోపం వచ్చి కర్రకు ఉన్న ఓ కంకిని విరిసి నా మీదికి విసిరిండు. కంకి తలుకాయకు తాకింది. టిపిక్కిన కిందవడ్డ. ఆర్రే కొడుకా అని బండి మీదినుంచి నాయిన కింద దునికిండట . రెండు చెవులు మూసి కంతలు నలిసిండట, ఏడుసుకుంట కండ్లు దెరిసిన. నిండిన కాడికి సాలనుకోని మెలిగిన  బండికి గిర్రసేరు తోని  కట్టేసుకొని ఇంటికి వచ్చినమ్. అవ్వకు విషయం దెలిసి నాయినను మస్తు కొప్పడ్డది. ఇగ ఈడు పనిజేత్తే మనం బతికినట్టే గాని  ఇంటికాన్నే ఉండనియ్ అని నాయిన బండి కొట్టుకొని చేనుకు పోయిండు. ఇంతకు ఇదే నయం అనుకోని తానం జేసి అవ్వజేసిన బూరెలు దిని షర్ట్ కు అంటిన మసి ని శుభ్రం జేసుకొని టింగురంగా అనుకుంటా సోపతి గాల్లకు నా టీ షర్ట్ సోకులు చూపేతందుకు నడూళ్ళెకు నడిచిన.  ఈ ముచ్చెట మీతోటి పంచుకొనేదాకా మనుసుల వట్టలే . అందుకే ఇదంతా రాసిన.

Sunday, July 2, 2017

మనుసుల మాట 12.

                                                       

సరుకుల బండ్లకు రాజులు
సైనిక కాపలను యిచ్చి
సేవ పేరు తోటి పన్ను
సేఠ్ ల నుండూడ గొడితే

                                గూడ్స్ టాక్స్ పేర  నేడు
                                గుండు గుత్త పన్నంటూ
                                పన్ను పోటు ప్రజల పైన  
                                పస్తులున్న తప్పదాయే!

సరుకుల తయ్యారులోన
సర్వజనులు శ్రామికులే
సరుకులుగొను ప్రజలందరు
కట్టే పన్ను ప్రజల శ్రమే !

                                 బేపారికి కమీషను
                                 నౌకరిగాండ్లకు జీతాల్
                                 నాయకులెన్నికల ఫండ్
                                 శ్రమ జీవుల కస్టఫలమే !

తిన్న తిండి మీద పన్ను
పన్న పడక మీద పన్ను
పాలు దాగే పసి బిడ్డకు
పన్ను పోటు పొత్తిళ్ళు !

                                ప్రజల గోళ్ళు ఊడగొట్టి
                                పన్నులు వసూలు జేసె
                                పనే కదా సర్కారంటే
                                రాజైనా ప్రదానైనా చేసేది అదే పనే !

రాజ్యాంగం ప్రియాంబులు
పెద్ద పెద్ద లెక్చర్లూ
గద్దెల నెక్కేంత వరకే ,
ఎమ్మెన్ కంపిన్ల సేవే ఏకైక పరమార్థం !

                                 సంక్షేమపు రాజ్యమంటు
                                 ప్రజల కొరకే పాలననే
                                 మాటలన్ని బూటకాలే
                                 మనువాదపు నాటకాలే !

బుక్కెడంత బువ్వకొరకు
రెక్క బొక్కలిరుగుతుంటే
ఎక్కే దిగే విమానాలు
ఎవని సేవలోన వారు?

                                అడవులను తెగనరికి  
                                గుట్టబండ లిరిగేసి  
                                ఇసుక బొగ్గు మసి జేసి
                                నేల  నీరు గాలి కూడ అంగట్లో అమ్ముకొంటు !

సహజ వనరు సంపదంత
దర్జాగా అమ్ముకొంటూ
ప్రజల పైన పన్నెందని
ప్రశ్నించుడు తప్పెటులా ?

                                 కోట్ల కోట్ల సంపదంత
                                 కొల్లగొట్టినోళ్ల గొట్ట
                                 చేవలేని సర్కారుకు
                                 చేతైంది పన్నులేయ !

అధికారం, ప్రతిపక్షం
అందరు పన్నుల పక్షమే
అందుకే ఓ జనులారా
అడుగ రండి ముందుబడి !

                                రాజకీయ ముసుగులిడిచి
                                రండి కదలి ప్రజలంతా
                                ఎవరికొరకు ఈ పన్నులు
                                ఎదురు నిలిచి అడుగాలే !