Tuesday, August 8, 2017

మనుసుల మాట 14 .

                                                    

" రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేల్ల లో దళిత బహుజనుల పైన పోలీసులు జరిపిన చిత్రహింసల పైన విచారణ జరిపించి దొషులను కఠినంగా శిక్షింప జేస్తా " అని ఆ నియోజక వర్గ ఎమ్మెల్లే మరియు మంత్రిగారైన కె టి ఆర్ గారు సెలవిచ్చారు.

బస్ ఇంకేంది, ఖేల్ ఖతమ్ దుక్నమ్ బంద్. అంతేనా? ఇన్నోద్దుల సంది నోరుదెరువని ఏలికలు వచ్చి ఎముడాల కాడ ఎదురుకునంగనే ఎతంత  సల్లారి పోయినట్టేనా? కొట్టిన దెబ్బలను, అయిన గాయాలను పుణికి చూసినంత మాత్రాన మంత్రమేసినట్టు మాని పోతయా? మీ ఉసురువోసుకోన్నోళ్లను ఊకేనే వదిలిపెట్టమని జోకొట్టి నంత మాత్రాన బుసగొట్టిన సర్పాలన్నీ బుట్టల వడ్డట్టేనా ? ఆ పోలీసు లాఠీలన్నీ వారం రోజుల పాటు ఊరికేనే వీళ్ళ శరీరాలను చీరి పోగులు పెట్టినయా? వాళ్ళ పక్కటేముకలు పుటుక్కు పుటుక్కుమని వట్టిగనే విరిగి పోయినయా? వాళ్ళ కిడ్నీలు కమిలి పోయి వట్టిగనే అవసాన దశకు చేరుకున్నయా? ఆ నరక బాధ భరించలేక పెయ్యంత వేడి వేడి ఆవిర్లు గక్కుతుంటే కమిలి పోయిన దెబ్బలకు , నోట్లే  నాలుక పిడుచ గట్టుక పోయి ,  మొత్తుకునే శక్తి లేక నోట్లే నుంచి వచ్చే పిల్లికూతల కీకలకు కడుపుల పేగులు నోట్లెకు వచ్చేదాకా ఏడ్చిన ఎడ్పులకు కార్చిన కన్నీళ్ళకు కారణమేవ్వడని  కె టి ఆర్ ను ప్రశ్నించగలరా ? ( ప్రశ్నిస్తే మల్లెన్ని తన్నులో ) అంత విచక్షణ రహితంగా  గొడ్లను కొట్టినట్టు ( అమ్మో! గొడ్లను కొడితే గో రక్షనోళ్ళు సావగొట్టరు? )  కొట్టేతందుకు పోలీసోళ్ళకు ఏమన్నా పిచ్చి లేసిందా ? ఎవ్వరి ఆదేశాలు లేకుంటనే గంతగణం  కొడుతరా? ప్రజలను ఇంతలా కొట్టి భయభ్రాంతులకు గురి జేయవలసిన అవసరం ఎవరికుంటది? ఆ ఇసుక , ఆ గ్రానైట్ , లారీల వైపు, క్వారీల వైపు కన్నెత్తి చూడ సాహసించని పరిస్తితి ఎవరి లాభం కోసం? ( అట్లని ఎవ్వడన్న నోరుదెరిచి అడుగ సాహసిస్తే కడమంచి వెంకటేష్ తీరుగా ఎల్లారెడ్డి పేట లాకప్ డెత్ కథే మరి . సర్కారా మజాకా ? )  .
మక్కెలిరుగ దంచి మలాం బూసుడంటే గిదేనేమో?

దళిత గిరిజన బహుజనులకు ఇదంతా కొత్తేమీ గాదు . ఇప్పటికీ తొమ్మిది వందల ఏండ్ల కిందట 12 వ శతాబ్దం లోనే తెలంగాణ చరిత్రకే గర్వకారణమైన ( ప్రత్యేక తెలంగాణ సాధన మాదేనని ఎట్లైతే గర్వంగా చెప్పుకుంటారో ) కాకతీయ చక్రవర్తుల కాలం లోని తొలి చక్రవర్తి ప్రతాపరుద్ర దేవుని కాలం లో ఇప్పుడు మేడారం గా పిలువు బడుతున్న మేడరాజు రాజ్యాన్ని మేడ రాజు కూతురైన సమ్మక్కను పెండ్లాడిన కరీంనగర్ జిల్లాకు చెందిన పగిడిద్దే రాజు (కోయ) పరిపాలిస్తున్న కాలం. వరుసగా రెండు మూడు సంవస్తరాలనుండి వర్షాలు పడని కారణంగా పంటలు పండక పన్నులు చెల్లించ లేమని పగిడిద్దే రాజు చక్రవర్తికి మొరవెట్టుకుంటడు . కాదు కూడదు పన్నులు కట్టవల్సిందే నని రాజు హుకూమ్ జారీ జేస్తడు . ఈ అడివిని రాజు మొలేసి నీళ్ళు వొసిండా ? అడివిల కాయగసరు తిని బతుకున్న మనం పన్నులు కట్టకుంటే రాజు తలదీసి మొలేసేది ఉంటదా అని నమ్మిన కోయలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటరు .

పాయే! ప్రతాప రుద్రదేవునికి విషయం చేరే! ఉగ్రుడైన చక్రవర్తి తన సైన్యాలను పగిడిద్దే రాజు మీదికి యుధ్ధానికి పంపుతడు. సంపెంగ వాగు కాడ అడ్డమొచ్చిన జంపన్న ను అడ్డంగా నరికి చంపుతరు. పగిడిద్దే రాజును ఆయన కోయ సైన్యాలను ఊచ కోత  కొస్తరు. బరిలోకి దూకిన సమ్మక్కను పట్టపు రాణివి అవుదువు రమ్మని ప్రలోభ పెడుతరు . కానీ దేనికీ ప్రలోభ పడని , జంకని సమ్మవ్వ కరవాలమ్ దీసుకొని కదన రంగాన దునికి కడదాకా యుద్ధం జేస్తది . సమ్మక్క , ఆమెతో బాటు ఆమె కూతురు సారలమ్మ కూడా యుధ్ధం లో అమరులు అవుతారు. తమకు రక్షకులు గా నిలిచిన సమ్మక్క సారలమ్మలను (పేన్కు) పితృ దేవతలను చేసుకొని కోయలు ఏడాదికోసారి వాళ్ళను యాది జేసుకుంటరు. కొంత కాలం తర్వాత వాళ్ళ మనుసులకు అయిన గాయం మసక బారిన తర్వాత గిరిజనులను మాయ జెసి మళ్ళా పన్నులు వసూలు జేసుకొనే కొరకు గుర్రాల మీద ఒంటెల మీదా బెల్లం కుడుకలు పట్టుకొని సమ్మక్క జాతరను జరిపిస్తామని మేడారం జేరవస్తరు కాకతీయ రాజులు . ( నేరెళ్ళ ఓట్ల కోసం ఇప్పుడు కె టి ఆర్ వచ్చినట్టు)

రాజ్యం బహు క్రూరమైంది . అది సమ్మక్క సారలక్కలను చంపుతది మేడారం జాతర జరిపిస్తది . కొమురం భీమ్ ను చంపుతది జోడే ఘాట్ ల దర్బార్ వేడుతది . ఇంద్రవెల్లిల అమాయక గిరిజనుల పై తూటాల వర్షం  కురిపిస్తది  శాంతి సభలు జరుపుతది . చుండూరు, కారం చేడుల ఊచకోత కోస్తది అంతా ఉట్టిదే అంటది. నేరెళ్ళలో చావగొట్టి చెవులు మూస్తది , కొట్టినోని సంగతి చూస్త అంటది. 12 వ శతాబ్దం నుండి 21 వ శతాబ్దం వరకు ఎన్నో రాజ్యాలు వోయినై , ఎందరో రాజులు వొయిండ్రు ,. కానీ రాజ్యం స్వభావం మాత్రం మారలేదు. మారుతున్నదల్లా బాధలు భరిస్తూ మళ్ళీ మళ్ళీ వాల్లనే నమ్ముతున్న , ఆరాధిస్తున్న ప్రజలు మాత్రమే!

మా తల రాతలు ఇంతే , మా ఖర్మ ఇంతే, అని భరించగలిగిన ఖర్మ సిద్దాంతాన్ని పట్టుకొని వ్రేలాడే విధంగా ఉన్న మన మెదళ్ళకు పట్టిన ఆ బూజును వదిలించుకొనేదాక మేడారం, నేరెళ్ళలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి.