Tuesday, November 28, 2017

మనుసుల మాట 18.

                                                 


ఈ రోజు ఉదయం  నుండి హైద్రాబాద్ లో ఒక వైపు మెట్రో రైల్ ప్రారంభోస్తవం మరోవైపు ఇవాంక నాయకత్వం లో  ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ను టి వి లో చూస్తూ మెదడు వేడెక్కింది. ఏదైనా ఒక మంచి పాట విని  మనుసును ప్రశాంత పర్చుకుందామని యు ట్యూబ్ ను  ఓపెన్ చేసిన. లతా మంగేష్కర్ పాడిన "యే మేరే వతన్ కీ లోగో " పాట ఎంతో హృద్యంగా అంతకంటే ఎక్కువ గంభీరంగా దేశ సరిహద్దుల్లో దేశ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల రక్షణ  కొరకు తమ ప్రాణాలను అరిస్తున్న అమర జవాన్ ల  కుర్బాణీ ని కీర్తిస్తున్నపాట వింటుంటే నిజంగానే షహిదొంకా యాద్ సే అంఖోమే ఆంసూ ఆయా.

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ

తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దీన్ హై హమ్ సబ్కా "
కింది రెండు లైన్లు ఇవ్వాళ చాలా మందే అన్నారు. ఈ రోజు చాలా శుభదినం అనే అన్నారు అందరూ. ఒకటి కాదు రెండు కాదు 180 దేశాల వ్యాపార ప్రతినిధులు భారత దేశం లో  పెట్టుబడులు పెట్టడానికి వచ్చిండ్రు . . వారికి ఫలకు నామా ప్యాలస్ లో నీతి ఆయోగ్ ద్వారా భారత ప్రజల కస్టార్జిత సొమ్ము తోటి  ఒక్కొక్క భోజనానికి 18000 రూపాయల పెట్టి భోజనాలు కూడా పెట్టిచ్చిండ్రు . . వాళ్ళకు మంచిగా తినవెడితే తాగవెడితే వాళ్ళు ఖుషీ అయి చాలా ఉద్యోగాలు కల్పిస్తారని ప్రజల సొమ్ము దండిగానే ఖర్చు చేసి చాలా ఆశలే కల్పిస్తున్నరు అందరు.  ఉద్యోగాలు వస్తే మంచిదే కానీ గత చరిత్ర అనుభవాలు అందుకు భిన్నంగా ఉన్నయి మరి.

1964-65 లో నేను మంథని హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అమెరికా నుండి ఇద్దరు వ్యవసాయ శాస్త్ర వేత్తలు వచ్చిండ్రు. వాళ్ళు ఇక్కడ మనకు కొత్త కొత్త విత్తనాలు ఇచ్చి ఇక్కడి మన వ్యవసాయాన్ని అభివృధ్ధి చేస్తామని వచ్చిండ్రు అన్నరు , కానీ తీరా వాళ్ళు వెళ్ళు పోయిన తర్వాత తెలిసింది వాళ్ళు మన విత్తనాల జీన్స్ ను ఎత్తుకెళ్లి పోయిండ్రని.

మోన్సాంటో కంపనీ అట్లనే బి టి విత్తనాలను ప్రవేశ పెట్టినప్పుడు కూడా ఇక పంట కు ఢోకా ఉండదు రైతుల ఇండ్లు బంగారు గోడలతోటే కట్టుకుంటరు అని ప్రచారం చేసిండ్రు. కానీ మనం ఇక్కడ రోజూ చూస్తున్నం  రైతుల  మరణాల వార్త లేని రోజు ఉంటలేదు.

చంద్రబాబు హయాం లో జినోమ్ వ్యాలీ తోటి ఇంక ఇక్కడ ఔషధాలు కారు చౌకగా లభిస్తాయని అన్నరు. కానీ తీరా ఇక్కడి భూములు పోయినై, ఉన్న భూములల్లో కూడా భూగర్భ జలాలు కలుషితమై కాలకూట విషపు నీళ్ళ నే తాగునీటికి సాగు నీటికి వాడుకొనవలసిన పరిస్తితులు వచ్చినై.

పరాయి దేశం నుండి వస్తున్న వాళ్ళకు కారు చౌకగా భూములు, నీళ్ళు( ఈ నీళ్ళను వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రజలను అప్పులల్లో ముంచుతున్నరని  ప్రతి పక్షపొల్లు ఇప్పటికే ఆడిపోసుకుంటున్నరు), కరెంటు ఉచితంగా ఇచ్చుకుంట వాళ్ళు విసిరేసే చిన్నా చితకా ఉద్యోగాలను మహాప్రసాదంగా భావిస్తున్న పరిస్తితి. కానీ ఆ భూములకే వీళ్ళకు ఇచ్చినట్లే నీళ్ళు కరెంటు, ఎరువులు, విత్తనాలు ,  ఇస్తే మన రైతులే , వీళ్ళు వెదజీమ్మే కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా ఎందరికో ఉపాధి కల్పించే అవకాశం మన వ్యవసాయం లోనే ఉన్న పరిస్తితిని పాలకులు మరిచి పోతున్నరు.

ఆనాడు ఇక్కడి వనరులు దోచుకొనే పోతున్నరని  300 యేండ్లు కోట్లాడి ఒక్క ఆంగేయులను వెళ్లగొట్టగలిగినం . అదీ ఇప్పుడు , ఒక్కరు  కాదు ఇద్దరు కాదు 180 దేశాల వాళ్ళను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాం . దానికి ,

" తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దిన్ హై హమారా  

అంటున్నం. కానీ ,

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ  "

అనే పరిస్తితి రాకుండా జాగ్రత్త పడినమా అనేది నా లాంటి సామాన్యుని ప్రశ్న.

.

Monday, November 20, 2017

ఇంటిమీద ఎవుసమ్ 1 .

ఎవుసమ్
ఈ రోజు మిద్దె తోట ల వంకాయ మొక్కలను నాటినం . మిత్రులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తోట చూడడానికి వచ్చి తాను రాసిన ఇంటి పంట పుస్తకం ఇచ్చిండు.
తోట పెట్టినవ్ సరే ! రేపు రేపు కాయలు గూడా కాస్తాయి గావచ్చు. కానీ నీ తీరుగా ఇంకా పది మంది తోట పెంచాలంటే వారికి స్పూర్తి ఇచ్చే విధంగా నీ అనుభవాలను పది మందికి
పంచి, నీవు ఎందుకు తోటను పెంచాలనే నిర్ణయం తీసుకున్నావో రాయాలని కోరిండు . భూమి నుండి బువ్వదీసే అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు గా , మట్టి పిసికి మట్టి బుక్కిన
మనుషుల సాహ చర్యమ్ కలిగిన కారణాల దృస్ట్యాను , అలాగే కొంత కాలం ఆ పని నుండి దూరమై తిరిగి భూమిపైన కాలూన డానికీ కారణం వివరిస్తూ రాస్తే అది ప్రకృతికి మేలు
జేయడమాత్రమే గాకుండా భూమి తల్లిని కాపాడిన వాళ్ళం కూడా అవుతామని కథా రచయితవు కూడా కనుక నీవు రాయాలని అడిగిండు. అట్లా మొదలయింది ఈ ఎవుసమ్ కథ .
ఇప్పటికీ అరువై ఏండ్ల కిందటి ముచ్చట. అంటే 1 9 5 7 జూన్ మాసం అది. మా ఇంట్ల శిలుకావు అని ఒక ఆవు ఉండేది. డానికీ ఒక కోడె లేగ ఉండేది. దాని పేరు కూడా శిలుకే.
అది పుట్టినప్పుడు మా నాయిన దాని ఊపురానికి తువ్వాల జుట్టి నోటి తోటి పైకి లేపిండట అందుకని అది నడుస్తున్నప్పుడల్లా దాని ఊపురం ఒయ్యారంగా అటుయిటూ ఊగుతుండేది .
ఆ శిలుక కోడె లేగ అన్నా దాని ఊపురంఅటూ ఇటూ ఊగుతుంటే దాని ఉరుకుడు అన్నా నాకు బాగా ఇస్టం ఉండేది.
పాల కోసం ఒక బర్రె ఉండేది. దాని పేరు పాపలి బర్రె. డానికీ ఒక పెయ్య దుడ్డే ఉండేది . ఆ రెండీటీ తో ఆడుకునుడంటే నాకు చాలా ఇస్టమ్ . నేను ఎటుబోతే అవ్వి నా వెంటనే
తిరిగేటియి . ఆటితోటి ఆడుకోవడం ..మా అవ్వ బెట్టే బువ్వ దీనుడు,నా లోకంగా ఉండేది. మాపటీలి పాలకుండ కడుగంగా అవ్వ గీకి పెట్టిన పాలగోకుడు దీనుడు ఇస్టమ్
అసోంటిది మా నాయిన నన్ను బడికి తీసుకొని పోయిండు . ఒక కట్టె పలుక, దాని మీద దిద్దే తందుకు బలుపమ్ ఇచ్చి బల్లే కూసున్ద బెట్టి తన పనికి తను పోయిండు.
నా మనుసంత మాపటీలి అవ్వ గీకి పెట్టె పాలగోకుడు మీద , కొల్లాగ , పెయ్య దుడ్డే మీద.
నరహరి సార్ ఆ ,ఆ లు పెట్టిచ్చిండు పలుక మీద . ఆ, ఆ అనుకుంట దిద్దుమన్నడు .
రెండు మూడు సార్లు దిద్దిన గావచ్చు. నాకు తెలువకుంటనే నా ఇద్దరు దోస్తులు ఎప్పుడో నా మనుసులకు వచ్చి చేరిండ్రు.
ఇగ నా లోకం ల నేను ఉన్న.
ఈపుల సర్రు మని ఒక సరుపు వడ్డది .
అన్నన్న నీయవ్వ ! అనుకుంట ఎనుకకు దిరిగిన .
. చెంప మీద చెళ్లుమని మల్లోటి వడ్డది .
ఏమన్నవురా ? సారు గద్దరాయించిండు .
లాగు దడిసింది . ఏమనలేదు సారు. లాగుడదిసింది అన్న.
చల్ , బేవకూఫ్ , ఇంటికివోయ్యి ఇంకో లాగు దొడుక్కొని రాపో అన్నడు.
కట్టె పలుక భుజమ్మీద పెట్టుకున్న, నీ బడి పీసునా వారేద్దు , ఇంకా నీ బడికి అత్తనా కొడుక అని మనుసుల అనుకుంట ఇంటి దారి వట్టిన .
గలుమ కాడికి వచ్చిన్నో లేదో ఎక్కడికి వోయినవ్ అన్నట్టుగా ఒర్రుకుంట ఉర్కచ్చినయి రెండూ.
ఆ రెండీటీని వట్టుకొని ఎవ్వలకు దొరుక కుంట. జల్లుకచ్చిన మక్కతోట ల జొచ్చిన.
పచ్చటి మక్కతోట , కమ్మటి వాసన. మేము ముగ్గురం అటూ మెసులు తుంటే మక్కా కర్రలకు ఒరుసుకుంటున్నం. మక్క జల్లు కొసలనుంచి పుప్పొడి కుంకుమ తీరుగా
మామీద పడుతుంటే ఇగ దాంట్ల నుంచి బైటికి రా బుద్ది గాలేదు.
నిన్న గట్టిన మోట నీళ్ళకు భూమి మెత్తగ తడిసి ఉన్నది. కుంకుమ తీరుగ మీదబడ్డ పుప్పొడి తోటి కలగలిసి కమ్మటి వాసన .
మన్ను పిస్కు కుంట ఎడ్లను జేసుకుంట, ఎట్లున్నయి ?మీ తీరుగ ఉన్నయా? అని వాటికి జుపుకుంట ఎంతన్న సేపు అట్లనే ఆడుకుంట ఉన్న.
మాపటీలి బర్లచ్చే యేళ్ల అయ్యింది గావచ్చు దుడ్డెబొక్కు ఒర్రుడు షురూ జేసింది.
నాకు గూడ పాలగోకు కుతి లేసుడు మొదలైంది.
నాయిన ఏనంగా జూసిండో . ముసిముసి నవ్వు నవ్వుకుంట అడుగుల అడుగులేసుకుంటా కాలు సప్పుడు గాకుంట మాదగ్గెరికి వచ్చిన సంగతి ఆటలాడుకుంటున్న మేము
గమనించనే లేదు.
నెత్తి మీది బూరు అందుకోని ఆవుదు కాడికి దీసుక పొయ్యి చేతులకంటిన బురుద కడిగి అవ్వకు అప్పజెప్పిండు .
అట్లా మొదలైంది నా ఎడ్లు, ఎవుసమ్ , భూమి సంబంధం కథ.

Thursday, November 16, 2017

గీతా కార్మికుల వెలుగు దివ్వే దేశిని చిన మల్లయ్య.!

                                 

( 20 నవంబర్ 2017 సోమవారం నాడు కరీంనగర్ లో కా: దేశిని చినమల్లయ్య సంస్మరణ సభ సందర్భంగా )

ఒక సామాన్య గీతా కార్మికుడై ఉండీ, కేవలం ఐదవ తరగతి చదువుతోనే  22 సంవస్తరాలు బొమ్మన పెళ్లి గ్రామ సర్పంచ్ గా, 20 సంవస్తరాలు ఇందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా , అదీ ఒక ప్రతిపక్ష పార్టీ అయిన సి పి ఐ నుండి గెలుపొందడం అతని అసామాన్య రాజకీయ చతురతకు , ప్రజా పక్షపాత వ్యక్తిత్వానికి నిదర్శనం.

దేశిని చినమల్లయ్య యుక్తవయస్సు వచ్చేనాటికి పోరాటాల పురిటి గడ్డ హుస్నా బాద్ ప్రాంతం లోని అతని స్వగ్రామం అయిన బొమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న మహ్మదా పూర్ గుట్టల శ్రేణుల్లో  కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కార్యక్రమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నై. సహజంగానే తాటి చెట్లు ఎక్కడానికి రెక్కలు తప్ప మరో ఆధారం లేని దేశిని , కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడు అయినాడు.  .స్తానికునిగా , గీతకార్మినికునిగా మహ్మదా పూర్ గుట్టల శ్రేణి ఆయనకు కొట్టిన పిండి కనుక ,  సాయుధ రైతాంగ గెరిల్లా వీరులకు అన్నపానాదుల కల్పనలో , డెన్ ల నిర్వహణలో , వార్తాహరునిగా  చురుకైన పాత్ర పోషించాడు. తన కనుల ముందే కాకలు తీరిన వీర యోధులు ఒరిగిపోయి , తాను కలల్లుగన్న సమ సమాజ స్వప్నం కూలిపోగా రెక్కలు తెగిన పక్షిలా తిరిగి తన గీతా వృత్తి వైపు రాక తప్పలేదు.

సాయుధ పోరు విరమించిన సి పి ఐ పార్టీ 1952 లో ఎన్నికల బరిలో దిగింది. 1959 లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయత్ రాజ్ చట్టం అమలైంది. తదనంతరం  నిజాయితీకి , నిస్వార్థానికి మారుపేరైన దేశిని మల్లయ్యను ప్రజలు బొమ్మనపెళ్లి గ్రామ సర్పంచగా ఎన్నుకున్నారు.  ఆనాటి నుండి 22 సంవస్తరాలు అప్రతిహతంగా సర్పంచ్ గా గ్రామ ప్రజల ఆదరాభిమానాల మేరకు పనిజేశాడు. 1976-77 లో హుస్నాబాద్ సమితి ప్రసిడెంట్ రాంభూపాల్ రెడ్డి , పదవీచ్యుతుడు అయినందున వైస్ ప్రసిడెంట్ గా ఉన్న మల్లయ్య సమితి ప్రసిడెంట్ అయినాడు. ఎమర్జెన్సీ తర్వాత 1978 లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఇందుర్తి నియోజక వర్గం నుండి ఎమ్మెల్లే గా ఎన్నిక కావడం సామాన్య విషయం కాదు. జాతీయ పార్టీ కాంగ్రెస్, జనతా పార్టే అభ్యర్థులు సంపన్నులు మరియు అగ్రవర్ణాలకు చెందిన వారు అయినప్పటికినీ సి పి ఐ  పార్టీ నుండి  ప్రజల మనిషిగా ఒక సామాన్య గీతా కార్మికుడు తాడి చెట్లు ఎక్కుకుంటూనే ప్రచారం చేసుకొని వచ్చి గెలిచి రావడం ఒక అబ్భురమే ఆనాటికీ ఈనాటికీ.  1985, 1989, 1994 వరుసగా మూడు సార్లు ఇందుర్తి నియోజక వర్గం నుండి వైరి వర్గం ఎంతో బలమైన రాజకీయ ఆర్థిక పునాది కలిగినది అయినప్పటికినీ  ప్రజల మద్దతుతో గెలుపొందాడు. తన నియోజక వర్గ ప్రజలకోసం ఎంతదూరమైనా అలసట లేకుండా బస్సులో, కాలి  నడకన వచ్చి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవాడు. ప్రస్తుత రాజకీయ అవినీతి ఆడంబరాలకు ఆయన ఆమడ దూరం లో ఉండేవాడు. 1999 లో సి పి ఐ కుల రాజకీయ చదరంగం లో దేశీనికి ఇందుర్తి నుండి టికెట్ ఇవ్వలేదు. పైగా ప్రారంభం లో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అది సమర్థించలేదు ,  కనుక అనివార్యంగా సి పి ఐ ని విడిచి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం లోకి  ఉరికినాడు. మొన్న 11 నవంబర్ నాడు తన అంతిమ శ్వాశ విడిచేదాక పీడిత ప్రజానీకం గురించే తపించిన నిస్వార్థ జీవి.

1964 ఆగస్టు లో  ఏపీ కోఆపరేటివ్ ఆక్ట్ వచ్చేదాకా తెలంగాణ లో  దొరలు , భూస్వాములు ప్రభుత్వం వద్ద కలాల్ మాములాను హర్రాజ్ పాడుకొని వచ్చి గ్రామాలల్లోని గీతకార్మికులనుండి  మునాఫా తీసుకొని చెట్లు గీయనిచ్చేవాళ్లు. దొరలు , భూస్వాములు అడిగినంత మునాఫా వెల్లదు , ఇవ్వలేమని వేడుకున్నా గూడా చెట్లను స్తానికులకు ఇవ్వకుండా  వేధించేవాళ్లు. వాస్తవానికి తెలంగాణ గీతకార్మికులకు నైజాం పాలన ప్రత్యక్ష పీడనకంటేగూడా స్తానిక దొరల, భూస్వాముల గడీల పీడనే అధికంగా ఉండేది.  

"మా భూమి"  సినిమా లో "దొరా ! మీరుకొట్టిన దెబ్బలకు గౌండ్ల నారిగాడు సచ్చిపోయిండు . " అంటాడు జీతగాడు.
" గడీ గోడ అవుతల బొంద వెట్టుండ్రి " అంటడు దొర. అటువంటి పరిస్తితిలో దేశిన చిన మల్లయ్య, ధర్మ భిక్షాం గారల నేతృత్వం లో ఖమ్మం జిల్లా గార్ల లో గీతా కార్మికులతో పెద్ద మీటింగ్ జరిపి "కల్లు  గీతా కార్మిక సంఘం " ఏర్పాటుజేసి , హర్రాజ్ విధానం రద్దు జెసి కలాల్ మాములాలను కల్లు గీతా కార్మిక సంఘాలకు అప్పగించాలని ఉద్యమించడం జరిగింది.  దేశిని చినమల్లయ్య, ధర్మ భిక్షం గారల నాయకత్వం  మరియు గీతా కార్మికుల సంఘటిత శక్తి కి దిగివచ్చిన ప్రభుత్వం అప్పటినుండి గీసే వాళ్ళకే చెట్లు అన్న హక్కును కలుగ జేసి హర్రాజ్ విధానానికి స్వస్తి పలికింది .

మారిన కాలానికి అనుగుణంగా చెట్లు ఎక్కే సాధనాలు ఆధునీకరించబడని కారంగా గీస్తున్న చెట్ల పైనుండి గీతకార్మికులు పడి చనిపోతుంటే వారికి ప్రభుత్వం నస్టపరిహారమ్ ఇవ్వాలని అసెంబ్లీ లో పోరాడిన ఫలితంగా 5000 రూపాయలతో ప్రారంభమైన ఎక్స్ గ్రేషియా ఇప్పుడు 5 లక్షలకు చేరడానికి ఆద్యుడు దేశిని చినమల్లయ్య.

ప్రభుత్వాలకు ఆనాటి నుండి నేటి వరకు  కల్లు గీతా వృత్తి ఒక ఆదాయ వనరు. వాస్తవానికి వృత్తులన్నీ అడుగంటి పోయి బతుకు దెరువే గగణమై పోతున్న పరిస్తితి లో ఇంకా కల్లు వృత్తి దారులనుండి పన్ను వసూలు చేయడం దారుణం. అలాగే మినరల్సు, విటమినులు పుష్కలంగా కలిగి ఉన్న నీరా ను నిర్ణీబంధంగా స్వేచ్చ మార్కెట్ లో విక్రయానికి అవకాశం ఇచ్చి గీతా కార్మికుల వృత్తిని బలోపేతం చేయాలని ఉద్యమించే శక్తి యుక్తులు కలిగిన మరో దేశిని చినమల్లయ్య లాంటి యువ నాయకత్వం కోసం  గీతా కార్మిక సమాజం ఎదురు చూస్తున్న క్రమం లో,  ఉన్న వయోవృధ్ధ పెద్ద దిక్కు దేశిని చిన మల్లయ్యను , కోల్పోవడం  గీతా కార్మిక లోకానికి తీరని లోటు.



Thursday, November 9, 2017

.మనుసుల మాట 17.

                                                           
భారత దేశం లోని 2.19 లక్షల మంది కుబేరుల సంపద 87,700 కోట్ల డాలర్లు అంటే అక్షరాల 56.12 లక్షల కోట్ల రూపాయలు. దైనందిన జీవితం లో వారు ఉపయోగించుకొంటున్న స్తిర, చర ఆస్తుల విలువ , వారు సేకరించుకొన్న కళా ఖండాల విలువ కాకుండా కనీసం పది లక్ష్ల డాలర్లు అంటే 6.4 కోట్ల సంపద పై బడి ఆస్తులు కలిగి ఉన్న  లక్స్మీ పుత్రుల జాబితా ఇది. కాప్ జెమినీ అంతర్జాతీయ సంస్త సేకరించిన వివరం ఇది.  

ఆర్థిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత స్టీగ్లిట్జ్ విశ్లేషణ ప్రకారం ప్రపంచం లోని 99 శాతం సంపద కేవలం 1 శాతం గా ఉన్న కుబేరుల వద్ద నే ఉందన్నాడు. ఈ లెక్కన భారత దేశం లోని ఈ 2.19 కుబేరుల పైన ప్రభుత్వం దృస్తి పెడితే సరిపోయే దానికి 130 కోట్ల మంది సామాన్య ప్రజలను నోట్ల రద్దు పేరుతో జి‌ ఎస్ టి పేరుతో రేపు బి టి టి అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ పేరు తో ప్రజలను చావమోది చెవులు మూయడం  ఎందుకన్నది మా లాంటి మంద బుద్ధుల ప్రశ్న .  

ప్యారడైస్ పేపర్ లీక్ లో 740 మంది, పనామా పేపర్ లీక్ లో 500 మంది , స్విస్ బ్యాంక్ వివరాల లీక్ లో 1195 మంది, రాడియా టేప్స్ లో 100 మంది, భారతీయులు , అందులో ;దేశ భక్తుల పేరుతో బడా పెట్టుబడి దారులు,  బ్రాండ్ అంబాసిడర్లు  , కేంద్ర  ప్రబుత్వ క్యాబినెట్ మంత్రులు, వారి ఎంపీలు ఉంటారు కానీ వారిని ఎవరూ ఏమీ అనరు. పైగా ఆ లిస్టులల్లో పేర్లు ఉన్నంత మాత్రాన వారిని తప్పుబట్టలేమని ప్రభుత్వ పెద్దలే వెనుకేసుకొని వస్తున్నారు. మరి  ఇక దొంగలు ఎవ్వరు? సామాన్య ప్రజాలెనా? కండ్లు మూసుకొని మీకు ఓట్లు వేస్తున్నందుకా? మీరు వేస్తున్న పన్నులన్నీ నోరుమూసుకొని చెల్లిస్తున్నందుకా?  ఇన్నేసి కుంభ కొనాలకు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నాఏనాడూ కూడా  ఇదేందని అడుగని ప్రజల అమాయకత్వమే నేరమా?

ఇంత విస్పస్టంగా ప్రజలందరికీ చెన్దవలసిన సంపద ఎక్కడ పోగై ఉందో తెలుస్తున్నా గూడా అది వెలికి తీసే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా నల్ల డబ్బు పనిబడుతాం, అవినీతి పరుల పై పోరాటం చేస్తాం అంటూ, సంపన్నుల పైన్నే పన్నులు వేసి అట్లా వచ్కిన సంపద పేదలకు పంచుతామని బీరాలు పోతూ  ఎంతకాలం నమ్మబలుకుతారని  ప్రజలు ప్రశ్నించే కాలం ఇంకా ఎంతో దూరం లో లేదు.

రోజూ పత్రికలల్లో చూస్తున్నాం ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చి పెట్టె సంస్తలల్లో పనిజేసే అధికారుల ఇండ్లల్లో, సంక్షేమ పథకాలను అమలుపరిచే సంస్టల్లో పనిజేస్తున్న అధికారుల ఇండ్లల్లో, రక్షణ, నిఘా విభాగాలల్లో పనిజేస్తున్న అధికారుల ఇండ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు లెక్కకు మిక్కిలి కోట్లాది రూపాయుయల ఆస్తులు బట్టబయలు అవుతున్నాయి. తెలుస్తూనే ఉంది కదా సంపద ఎక్కడ పొగైతున్నదో.

ప్రభుత్వాలకు నిజంగానే చిత్త శుద్ది ఉంటే నీతి గా పాలన చేయాలన్న సంకల్పమే ఉంటే మన లాంటి వారం ఎవ్వరమ్ కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేకుండా చాలా తేట తెల్లంగా కనిపిస్తున్న సత్యాలను చూడ  నిరాకరించకుండా చర్యలు గైకొంటే సామాన్యుల పైన భారం తప్పుతుంది.