Sunday, April 26, 2015

child labor !

 అది 2002 జూన్ మాసం.తొలకరి వానలు పలకరించినయి. ప్రబుత్వ పాఠశాలలు ప్రారంభానికి ముందు సర్కారు జేసె జిమిక్కులో భాగంగా బడి పండుగ అని అధికారులు ఆగమ్ ఆగమ్ చేస్తున్నరు . ఆనాటి జిల్లా కలెక్టర్ కు అత్యంత ప్రాధాన్యత అంశం పిల్లల చదువులు .ఆమె గోదావరిఖని వెళ్తున్నప్పుడు ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద ఒక పిల్ల వాడు బడికి పోకుండా సోడా బండి  వద్ద పనిజేస్తున్న విషయం గమనించి వెంటనే పెద్దపల్లి ఆర్ డి వో గారికి సమాచారం ఇచ్చిందట. వెంటనే విషయం మాకు చెరింది . ధర్మారం ఎక్స్ రోడ్ వద్దకు చేరుకొనే సరికి దాదాపు ఒక కిలోమీటర్ మేర దట్టమైన రాతి దుమ్ము ఆవరించి ఉంది. ఒక నాడు ఎత్తైన గుట్టలు ఇప్పుడు కొంచెం కొంచెం కోరుక్కు తిన్నట్టు చాలా వరకు అదృశ్యం అయినయి.అంతకంటే  కొద్ది రోజులకు
ముందే క్వారీ బ్లాస్టింగు లో ఒక కార్మికుడు మరో బాల కార్మికుడు చని   పోయినారు.

  వెళ్ళే టప్పుడు పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను  కూడా వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. సోడా బండి వద్ద ఒక పిల్లవాడు సోడాలు కొట్టి ఇస్తున్నాడు. బండి యజమాని డబ్బులు తీసుకుంటున్నాడు.లేబర్ ఆఫీసర్ బండి యజమాని వద్దకు వెళ్ళి తన పరిచయం చేసుకొని పిల్ల వాణ్ని పనిలో పెట్టుకోవడం నేరం . నీవు నేరస్తునివి స్టేషన్ కు నడువ్ అని గద్దరాయించిండు .

      ఆయన దండం దాశన పెడుతూ " అయ్యా ఈ పొల్లగాని అమ్మమ్మ ఒక్క తీరుగా బతిమిలాడితే కాదన లేక ఎంతో కొంత డబ్బులిస్తే నాకింత ఆసరా అయితడని వాల్ల అక్కెర తీర్తదని పనికి రమ్మన్న గాని , ఈ పొల్లగాడు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. గీ సోడా బండి మీద వెయిలు సంపాయిత్తనా సార్. నీ  దండం బెడుత నన్ను విడిచి పెట్టుమని "కాళ్లా వెల్లా బతిమిలాడిండు . మా టార్గెట్ కూడా పిల్లవాన్ని బడిలో చేర్చడమే గాని బండి యజమాని పైన కేసు చేయడం కాదు కనుక పిల్లవాన్ని పట్టుకొని జీపు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నం . వాడు బాగా ఏడుస్తున్నడు , ఈ కొత్త వాళ్ళు తనను ఎక్కడికి తీసుక పొతారో అన్న భయం తో ఏడుస్తున్నాడనుకొని మేము తనకు హాని చేయమనీ కొత్త పుస్తకాలు బట్టలు ఇచ్చి బడిలో చేర్పిస్తామని ఉండడానికి హాస్టలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని బుజ్జగిస్తూ చెప్తున్నం . కానీ అసలు వినడం లేదు . జీపు ఎక్క నంటే ఎక్క అంటూ గింజుకుంటున్నడు.నేను బతిమిలాడు తున్న , ఇంతల మా సహాయకులు పిల్ల వాన్ని బలవంతంగా జీపులో ఎక్కించిండ్రు . జీపు పెద్దపల్లి వైపు బయల్దేరింది. పిల్లలు అట్లాగే భయపడి మారాం చేస్తారు సార్ , అక్కడ హాస్టల్ లో ఉన్న పిల్లలను చూసిన తర్వాత సంతోష పడి ఉండి పోతారు మీరు ఫికర్ చేయకండి అంటూ మా సహాయకులు చెప్పడం తో మేము సరే లెమ్మని . జిల్లా కలెక్టర్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నం.మేము ఆఫీస్ వద్ద దిగి పోయినమ్ . జీప్ పిల్లవాన్ని తీసుకొని హాస్టల్ కు వెళ్ళి పోయింది.

    సాయంత్రం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత పిల్లవాడు అడ్జస్ట్ అయినాడా లేదా అని తెల్సుకోవడానికి హాస్టల్ కు వెళ్ళిన. వార్డన్ ఎదురుగా వచ్చి" మధ్యాహ్నం మీరు పంపిన అబ్బాయి
ఇంత వరదాకా ఏడుపు ఆపలేదు, అన్నం తిన లేదు ఎక్కెక్కి పడుతూ ఏదో యాదికి జేసుకుంటూ యాదికి జేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నడు సార్ " అని చెప్పిండు.
    నేను అంధోలనగా పిల్లవాని దగ్గరకు పోయి దగ్గరకు తీసుకొని అనునయిస్తూ భుజం మీద చేయి వేయంగానే నా చేతిని విసురుగా తీసి వేసిండు. నేను చెప్పేది వినకుండా బిగ్గరగా ఏడుస్తున్నడు." అరె ! చిన్న నువ్వు ఏడువకు ఇక్కడ ఉండకుంటే మానాయే , ఇప్పుడే నిన్ను నేను మీ ఇంటి వద్ద దించి వస్తా . కానీ ఇక్కడ నీకు మంచిగ లేదా? అక్కడనే మంచిగ
ఉన్నదా" అంటే చప్పుడు చేయడు.
  బతిమాలంగా బతిమాలంగా నోరు విప్పిండు. తన పేరు రాజు అనీ తనకు ఆరు నెలల వయసున్న చిన్న చెల్లెలు , ముసలి అమ్మమ్మ ఉన్నారని చెప్పిండు.
  వాళ్ళను విడిచి పెట్టి వాల్ల నాన్న ఎటో వెళ్లిపోతే అమ్మమ్మ దగ్గర ఉంటున్నారట. ఈ మధ్యన్నే అమ్మ చనిపోయిందట. మరి మీకు రోజూ అన్నం ఎట్లా అని అడిగిన.
 " నేను రోజూ ఏదో ఒక పని చేస్త . ఆ పైసల తోటి మా చెల్లే కు మా అమ్మమ్మ పాలు కొనుక్క వచ్చి పోస్తాది . పాచి పని చేసి రాంగ అమ్మమ్మ అడుక్క వచ్చే బువ్వ తింటం " అన్నాడు.
 కడుపు తరుక్క పోయింది
  ఆఖరుకు వాడు చెప్పిన మాటకు నా కండ్ల వెంట నీళ్ళు వచ్చినయి...
  " సారూ ! మా చెల్లే ఏడుత్తాంది గావచ్చు పొద్దటి సంది దానికి పాలు లెవ్వు .సోడా బండి సేటు పైసలిచ్చినంక కొనుక్క పోతననుకున్న. అందుకనే నాకు ఏడుపు ఆగుతలేదు " అన్నాడు.
  చ! మేము ఏమి జేసీనం . వాని బతుకు బాగు జేయ బోయినట్లా !  ఆ పసి పాప ప్రాణం దీయ బోయి నట్లా అర్థం గాలేదు.

  వెంటనే డ్రైవర్ ను పిల్చి ఒక పాల పాకెట్ తెప్పించి ఆ పిల్ల వాన్ని జీపులో ఎక్కించుకొని ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న వాల్ల గుడిసె కు పోయినమ్. పిల్ల ఘోరంగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో సొమ్మ సిల్లి పోతే అమ్మలక్కలు వచ్చి పాలు పట్టినారట . మమ్ముల జూసిన ఆడవాళ్ళు ఒక్క సారిగా మా పైకి గయ్యి మని లేచిండ్రు. సిగ్గు తో చచ్చి పోయినమ్.
  పదమూడు ఏండ్ల తర్వాత నిన్న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో 29 మంది బాల కార్మికులను గుర్తించినట్లు వార్త వస్తే ! జ్ఞాపకాల పాతర తెరుచుకున్నది. పేదల ఆర్టిక స్తితి గతుల్లో మార్పు తేకుండా బాల కార్మికులు అని వాళ్ళను పట్టి తెస్తే సమస్య పరిస్కారం కాలేక పోతున్నది.

పెంటయ్య వీరగొని.
విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి .
కరీంనగర్

Thursday, March 26, 2015

రీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నదని చదివిన తర్వాత ఆ జిల్లా వాసిగా నా అనుభవం రాస్తున్నాను. ఒక 30 సంవస్తారాల కింద కరీంనగర్ జిల్లా లో గ్రానైట్ క్వారీలు అసలు లేకుందేటివి. ఆనాడు ప్రజలు ఈ గుట్టల పొంటి ఉన్న పచ్చిక మైదానాలల్లో గొర్రెలను మేపుకొని, ఆవులను,బర్రెలను మోపుకొని జీవిస్తూ ఉండే వారు. గుట్ట వెంట ఉన్న పేద వారైనగ్రామస్తులు కట్టెలు కొట్టుకొని పట్టణాల్లో అమ్మేవాళ్లు. మోదుగ ఆకులు తునికి ఆకులు సేకరించి విస్తర్లకు బీడీ లకు వాడేవాళ్లు. గుట్ట మొదళ్ళలో ఉండే ఇప్ప చెట్ల నుండి ఇప్ప పువ్వు. ఇప్ప పరుక సేకరించి అమ్ముకొని జీవించే వాళ్ళు. సీతా ఫలాలు ఓగు కాయలు బలుసు పండ్లు తవిశి బంక సేకరించి అమ్ముకొని జీవించే వాళ్ళు. గుట్ట ప్రారంభం లో ఉండే మైదానాలల్లో తాటి ఈత వనాల ను ఆసరా జేసుకొని గీతా వృత్తుల వాళ్ళు, చాపలు , బుట్టలు అల్లుకొనిజీవించే వాళ్ళకు   బ్రతుకు దెరువు ఉండేది. గుట్ట బందలకు పెట్టిన తేనె తెరల నుండి తేనె సేకరించి జీవించే వాళ్ళు.  ఇంత మందికి గుట్టలు ఆధారమై ఉండేవి. అంతే గాదు ఎన్నో వందల ఏళ్ల నుండి ఈ జీవన చక్రం ఆగి పోకుండా సాగుతున్నది.ఇంకా ఎన్ని వేల ఏండ్లయిన అరిగి పోనీ తరిగి పోనీ ఈ విధానం ఎలాగే కోన సాగే అవకాశం ఉంటుంది. గుట్ట మొదళ్ళలో ఉండే బావులల్లో నీళ్ళు పుష్కలంగా ఉండేటివి. వాటితో వ్యవసాయం నడిచేది. పది మందికి అన్నం దొరికేది, గుట్టల సమీపం లో వర్షాలు కూడా బాగా పదేవి. 
  ఇక పోతే గుట్టలను ఆసరా జేసుకొని కోతులు గుడ్డెలుగులు  జింకలు.నెమల్లు. .గడ్డలు గబ్బిలాలు. కొండ చిలువలు జీవిక్నేటివి. ఇదంతా ఒక జీవావరణ వలయం .
   గ్రానైట్ క్వారీలు వచ్చిన తర్వాత జీవ వైవిధ్యం విధ్వంసం అయింది. గుడ్డెలుగులు కోతులు కొండ చిలువలు గ్రామాలల్లో చేరినయి. పంటల దిగుబడి తగ్గింది. పంట పొలాల వైశాల్యం తగ్గింది. గ్రానైట్ ద్వారా ఏటా 200 కోట్ల రాయల్టీ ప్రభుత్వానికి వస్తున్నదట. కానీ 500 కోట్ల విలువగలిగిన రోడ్లు ధ్వంసం అయితున్నాయి . విలువ తెలియదు గాని మానేరు పై ఉన్న వంతెన పాడై పోయింది. .గ్రానైట్ క్వారీల వలన ఈ గుట్టలన్నీ అంతరించిన తర్వాత మళ్ళీ గుట్టలు మొలువవు కదా అప్పుడు ఇక్కడ జీవించే ప్రజలకు జీవనోపాధి ఉండదు. ఇక్కడ చూడ వాల్సింది పెట్టుబడి దారులకు ప్రకృతి సంపద అప్పనంగా దోచి పెట్టడానికి ప్రభుత్వాలు ఆలోచించడం గాడు స్టానికంగా జెవ్విస్తున్న ప్రజల బ్రతుకు దెరువు ఎట్లా అన్నదే ప్రధానం. గ్రానైట్ క్వారీలు రాక ముందు ఇక్కడి ప్రజలు జీవించి నారు. గ్రానైట్ క్వారీల వలన గుట్టలు అంతరించి పోయినాంక ఇక్కడి ప్రజలు ఎలా బతుకాలో ప్రభుత్వం, ఆలోచనా పరులంతా ఆలోచించాల్సిన విషయం.
  వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.

Wednesday, February 25, 2015

There wont be any mountains !

 రక్షణకు గుట్టలుండయి!

        గాలి నీరు ఆకాశ మేఘమా
        జాడ జెప్పరమ్మా గుట్టల జాడ జెప్పరమ్మా!

                              కాల గమనమున కరిగిన లోహపు
                              కంద గడ్డలమ్మా గుట్టలు పుడమి బిడ్డలమ్మా !

        పుట్టుకన్నదే లేకముందు
        ఈ గుట్టలు బుట్టినయీ  ప్రాణికి పుట్టుక నిచ్చినయీ !

                            తిండి లేక జీవ జంతు జాలము
                            తల్లడిల్లినపుడు గుట్టలే ఆదుకున్నాయపుడు !

         చెట్టు చేమలూ పెరిగేతందుకు
         మట్టిగ మారినయీ గుట్టలు పగిలి చిట్లిపోయీ !

                              ఆకలికన్నం అయ్యే చెట్లను
                             కడుపుల పెంచినయీ మనుషుల కథ నిలిపుంచుటకూ !

         దిస మొలతో ఆదవ్వ తాతలు
         దిగాలు పడినపుడు గుట్టలు నార చీరలిచ్చే !

                                వానకు  చలికి  వేడి తాకిడికి
                                వెతలు చెందినపుడు గుట్టలు దొనల దాచినాయి !

          బండ బండ రాపాడి కొండలో
          నిప్పు బుట్టె మొదట వెలుగుల జాడ జెప్పే గుట్ట !

                                  గిరుల దొరలిన గుండ్రటి రాల్లే
                                  బండి చక్రమయ్యే బతుకుల గతులు మార్చే గుట్టా !

           భీకర ప్రకృతి విలయం దెబ్బకు
          బిక్క జచ్చినపుడు మొక్కే బొమ్మ జెక్కనిచ్చే

                                  బొడ్రాయి నుండి భోలా శంకర్
                                  దేవుడెవ్వరైనా గుట్టల దేహ ఖండమేగా !

         బల్లాలు గోడ్డండ్లు గదలకు
         బతుకు నిచ్చే గుట్టా మనిషిని సాయుధునిగ జేసె !

                                 గుడులు చెక్కినా కోటలు గట్టిన
                                 గుట్ట బండే దిక్కై మనిషికి రక్షగ నిలిచింది !

        ఇన్ని జేసినా ఇమాన మెరుగని
        తేలు సంతతోల్లు కొండల తెగ నరికెస్తుండ్రు !

                                   వాగు వంకలకు పుట్టినిల్లు
                                    ఆ చెట్టు గుట్టలేగా అవి లేక చెరువు లెటుల !

           వానలుండకా చెరువు నిండకా
          పాడి పంట లెటుల ప్రజలకు బతుకు దెరువే కరువు !

                                పక్షులు పాములు ఎలుగులు కోతులు
                                యెగబడి తరుముతయీ గప్పుడు దిగబడి ఉరుకుతరు !

            కానీ ! గుట్ట లుండ వెచటా వారికి రక్షగ నిలుచుటకూ !

                వీరగొని పెంటయ్య , విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి 

Tuesday, December 16, 2014

The Gouds living in Agency area must be given S.T. Certificates!

రాజ్యాంగం రాసుకున్న నాటి కంటే ముందే నాగరిక సమాజాలు  అడవుల్లో గుట్ట చెట్టును నమ్ముకొని జీవిస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని క్రీ|| శ || 1917 నాటి నుండే ఆ ప్రజల కొరకు షెడ్యూల్డ  ట్రైబ్ అనే మాటను ఉపయోగించి నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్ అంటే చాలా స్పస్టంగా ఒక్కొక్క కులం, వృత్తి ని పేర్కొవడం జరిగింది. అట్లా పేర్కొన్న వాటిలో కళ్ళు గీత వృత్తిగా జీవిస్తున్న గౌడ్ లను కూడా షెడ్యూల్ ట్రైబ్ గా పేర్కొనడం జరిగింది. డా|| భీమ్ రావ్ రాంజీ అంబేడ్కర్ అధ్యక్షులు గా ఏర్పడ్డ భారత రాజ్యాంగ కమిటీ  26 నవంబర్ 1949 న ఆడాప్ట్ చేయబడి 26 జనవరి 1950 లో అమలు లోకి వచ్చింది. 25 భాగాలు కలిగిన భారత రాజ్యాంగం లో మొత్తం 448 ఆర్టికల్లు ఉంటే అందులో 7 వ ఆర్టికల్ లో చాలా స్పస్టంగా . ఏజెన్సీ ఏరియాలో నివసిస్తున్న గౌడ్ లు షెడ్యూల్ ట్రైబ్ కు చెందుతారని చెప్పబడింది. 1956 విశాలాంధ్ర ఏర్పడ్డప్పుడు అదే 7 వ ఆర్టికల్ లో ఏజెన్సీ ఏరియా లో నివసిస్తున్న గౌడ్ లను షెడ్యూల్ ట్రైబ్ లని అన్నారు. నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు. 2014  లో సైతం అక్షరం పొల్లుబోకుండా అదే 7 వ ఆర్టికల్ అలాగే చెప్పబడింది. కానీ సీమాంధ్ర పాలన లో అయితే ఎట్లాగైతే ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గౌడ బిడ్డలకు చదువుకొనే సౌకర్యం అందకుండా జెసి ఉద్యోగాలలో అవకాశం లేకుండా జేశారో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్తితిలో ఏమీ మార్పు కనిపించడం లేదు.వాస్తవానికి ఖమ్మం,వరంగల్, ఆదిలా బాద్ జిల్లాలల్లోని ఏజెన్సీ ఏరియా లల్లో నివశిస్తున్న గౌడ్ లందరికి ఎస్టీ సర్టిఫికట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ లేనిదేదో ఇవ్వాలని గౌడులు గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదు. రాజ్యాంగం లో ఉన్న దాన్నే కొందరు అవగాహన లేని అధికారుల మూలంగా జరిగిన పొరబాటును సరిదిద్దాలని మాత్రమే గౌడులు డిమాండ్ జేస్తున్నారు. 

  అందుకు నాంది గా ఖమ్మం జిల్లాలో కొందరు చదువుకున్న యువకులు విద్యార్థులు ఏకమై ఉద్యమం ప్రారంభించారు. ములుకల పెళ్లి మండలం లో కార్తీక వనభోజనాలల్లో కార్య రూపం దాల్చి, 10 డిసెంబర్ నాటికి అశ్వరావ్ పేట లో ఉద్యమ రూపం తీసుకున్నది. ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు ,లాంటి యువకులు గౌడుల ఇంటింటికి దిరిగి మోటివేట్ చేసినారు. ఖర్చులకు కూడా ప్రజలు డబ్బులు ఇస్తూ వేలాదిగా పిల్లలు, మహిళలు వృద్ధులు కదులుతున్న విధానం గమనించినపుడు వారు ఇంతవరదాక కోల్పోయినది ఏమిటో వారికి అర్థం అయినట్లు ఉంది.
    వీరి ఉద్యమానికి సంఘీభావం దెలుపడానికి సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరగొని పెంటయ్య గౌడ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం సత్తెయ్య గౌడ్ గారాలు అక్కడ ముల్కల పెళ్ళిలో మరియు అశ్వరావ్ పేట లో కూడా హాజరయ్యి వేలాదిగా తరలి వచ్చిన గౌడ బిడ్డలకు  బాసట గా నిలిచినారు. సర్వాయి పాపన్న ఫౌండేషన్ చేర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సైతం రెండు సమావేశాలల్లో పాల్గొని ఉత్తేజకరమైన ఉపన్యాసాలతో వారిని ఉద్యమం వైపు సాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కలిగించినారు. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సెక్రటరీ జెనరల్ గణగొని సత్యనారాయణ గౌడ్ ముల్కల పెళ్ళిలో పాల్గొని సర్వాయి పాపన్న వారసులమై పోరుజేయాలని సూచించినారు. ఖమ్మం లో 26 మండలాలు ఏజెన్సీ ఏరియా గా నిర్ధారించ బడినాయి. కనుక అక్కడ నివసిస్తున్న గౌడ్ లకు ఎస్టీ సర్టిఫికట్స్ ఎప్పటినుండో ఇవ్వాల్సి ఉండే.  అలా ఇవ్వకపోవడం వలన ఈ 65 సంవస్తరాల కాలం లో పది సంవస్త రాలకు ఒక తరం చొప్పున ఆరున్నర తరాలు తమ విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోవడం వలన ఎంతటి ఆర్థిక, సామాజిక నస్టమ్ జరిగిందో అంచనాకు సైతం అందని విషయం.ఒక ఉదాహరణ చూద్దాం! భారత భూభాగం లో ఎవ్వరైన ఏ వృత్తి అయినా చేసుకొని జీవించ వచ్చు అన్న హక్కును రాజ్యాంగం భారత ప్రజలకు ధకలు పరిచింది. వ్యాపారాలు చేసుకొనే వారు చేసుకుంటున్నారు. కమ్మరి, కుమ్మరిమ్ వడ్రంగి, చాకలి,మంగలి నేత వృత్తుల వాళ్ళు నిర్ణిబంధంగా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నరు . కానీ విచిత్రంగా ఒక కల్లు గీసుకొనే  గౌడ వృత్తి మాత్రం  గౌడులు చేయ గూడదు అని ఒక రాజకీయ పార్టీ శాసన సబ్యుడు చట్టం చేయించి తెస్తాడు. కానీ ఇదే చట్ట సభల్లో గౌడ బిడ్డలై పుట్టిన అనేక మంది సభ్యులు ఉంటారు, కానీ తమ తోటి సహోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోరు.ఇదీ మనలోని ఐక మత్యానికి ఒక మచ్చు తునుక. అలా చట్టం తేవడం వలన 26 మండలాలల్లోని వందలాది గీత కార్మిక సొసైటీలకు మనుగడ లేకుండా పోయింది. వీలాది మంది గీత కార్మికులు పొట్ట చేత బట్టుకొని రోడ్డున పడ్డారు. పడి లేచిన ఆ బిడ్డలే ఇక ఎవ్వరినీ నమ్మక తమ బతుకులు తామే బాగు జేసుకొనడానికి ఉద్యమ జెండా భుజాన బెట్టుకొని లాంగ్ మార్చ్ కు బయల్దేరినారు.

          తమకు జరిగిన జరుగుతున్న నస్టాన్ని నివారించడానికి ప్రస్తుత ప్రభుత్వామైనా వెంటనే స్పందించాలని ప్రజలతో బాటుగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సైతం బలంగా డిమాండ్ జేస్తున్నది. ప్రభుత్వం తక్షణం స్పందించని పక్షం లో ముందుగా క్షమ్మం జిల్లా కేంద్రం లో 10 వేల మందితో ప్రదర్శన నిర్వహ్స్తామని, అప్పటికి ప్రభుత్వం స్పందించని యెడల రాష్ట్ర రాజధాని హైద్రాబాదు లో ఒక లక్ష మండి తో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ప్రబుత్వాని హెచ్చరిస్తున్నాము అని అశ్వరావ్ పేట పురవీధుల గుండా జరిగిన ఊరేగింపులో ప్రజాల్తో బాటు సర్వాయి పాపన్న సంఘం సైతం నినాదాలు చేయడం జరిగింది.

వీరగొని పెంటయ్య.
అధ్యక్షులు 

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం.

Wednesday, November 19, 2014

రాజ్యాధికారం ఎందుకోసం?

చాలా కాలం నుండి  అన్ని తరగతులకు చెందిన శ్రేణులు తమకు రాజ్యాధికారం కావాలని నినదిస్తున్నాయి..కొందరు దళిత బహుజనుల నినాదం తీసుకొంటే మరికొందరు బీసీ నినాదం తీసుకొంటున్నారు..ఇంకా మరికొందరు ప్రాంతీయ వాదం లేవనెత్తుతున్నారు.అసలు రాజ్యాధికారం అంటే ఏమిటి? ఒక ఎమ్మెల్లే సీటో , ఒక ముఖ్య మంత్రి పదవో వస్తే రాజ్యాధికారం వచ్చినట్లేనా? ఇంత వరదాకా దళితులు, బీసీలు ఎంత మంది ఎమ్మెల్లెలు కాలేదు, ఎంతమంది దళితులు ఎంత మంది బీసెలు ముఖ్య మంత్రులు కాలేదు? మరి వాళ్ళ వలన ఈ దళిత, బీసీ , ఎస్టీల సమస్యలు ఎందుకు పరిస్కారం కాలేక పోయినాయి? 
     
   అట్లా అడిగితే , ఇంత వరదాకా ఆయా పదవుల్లోకీ వచ్చిన వారు ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి వచ్చినారు, కనుక ఆ రాజకీయ పార్టీ సిద్దాంతం మేరకు పనిజేసినారే కానీ దళిత బహుజనుల కోసం పని చేయలేదు , చేద్దామన్నా ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు కనుక ఏమీ చేయలేక పోయినారు , కావున ఇప్పుడు మేము ఆ నినాదం తోటి వస్తున్నాము, కావున దళిత బీసీ ఓటర్లు మాకే ఓటు వేసి గెలిపించాలి అన్నది వారి వాదన. సరే వాళ్ళు అన్నట్లు గానే ఓటర్లు అట్లానే ఆలోచిస్తారని కాసేపటి కోసం అనుకుందాం. మరి వీళ్ళ పార్టీ ఏమిటి? వీళ్ళ మానిఫెస్టో ఏమిటి? ఇంత వరదాకా ఈ వాదం తో ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ. మరి దాని ఆచరణ యూపీ లో ఎట్లా విఫలమైందో చూసినాము.అవకాశం వచ్చినప్పుడు అగ్రకుల రాజకీయ నాయకుల కంటే ఏమీ తీసిపోని విధంగా పాలన చేసి మళ్ళీ అదే సిద్దాంతం పైన మాకు అధికారం కట్టబెట్టండి అంటే ప్రజలు నమ్మరు కదా?

     స్వంత సైన్యం లేకుండా రాజ్యాధికారం అనేది ఉండదు. స్వంత సైన్యం మన రాజ్యాంగం ప్రకారం కేంద్ర లో అధికారం లోకి వస్తే తప్ప సాధ్యం కాదు. సరే కేంద్రం లో కూడా అధికారం లోకి ఇట్లా వాదించే వాళ్ళు ఏదో ఒకనాడు వస్తారనే అనుకుందాం. అప్పుడు అమెరికా అనుమతి లేకుండా ఇక్కడి ప్రభుత్వాలు ఎవరి ఆస్తులు ఎవరికి పంచుతారు? పార్లమెంటు లో  ఇంత స్తంపింగ్ మెజారిటీ ఉండీ కూడా కనీసం విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని తెప్పించడానికి మోడీ ప్రభుత్వం పడుతున్న ఆపసోపాలు చూస్తున్నాము. అలాంటిది ఒక రాష్ట్రం లోనో లేక కేంద్రం. లో  కూడా అధికారం లోకి వచ్చి ఇట్లా వాదిస్తున్న వాళ్ళు చేసేది ఎక్కువకు ఎక్కువ తమకు అత్యంత సన్నిహితులు అయిన వారికి కొన్ని ప్రయోజనాలను సమకూర్చి పెట్టగలరేమో గాని వాళ్ళు మాటల్లో చెబుతున్నట్లు గా సంపూర్ణ మైన మార్పు వాళ్ళు అనుకుంటున్న పద్దతుల్లో ఎట్లా సాధ్యమో ఈ వాదనజేసే వాళ్ళ మేధావి వర్గం జవాబు చెప్పాలి. వర్గ స్పృహ లేకుండా వర్గరహిత సమాజం గురించిన ఆలోచన లేకుండా ఎవరు అధికారం లోకి వచ్చినా వాళ్ళ వాళ్ళ ఆస్తులు మరి కొంచెం పెంచుకోవడానికి పనికి వస్తుంది గాని అశేష ప్రజానీకం ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండ జాలదు.

    వీరగొని పెంటయ్య.
  విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.
కరీంనగర్.

Monday, October 27, 2014

1969 తొలిదశ ఉద్యమం లో 369 మంది బిడ్డలు చనిపోతే , 1997 వరంగల్ డిక్లరేషన్ తో ఆకుల భూమయ్య కన్వీనర్ గా ఏర్పడ్డ తెలంగాణ జన సభ లోని  బెల్లి లలితా కనకా చారి ని అత్యంత క్రూరంగా చంద్రబాబు ప్రబుత్వమ్  చంపించిన తర్వాత వచ్చిన కాంగ్రెస్, తెలంగాణ ఇస్తున్నామని పార్ల మెంటు లో ప్రకటించిన వెంటనే  చంద్రబాబుతో బాటు సీమాంధ్ర లోని అన్నీ రాజకీయ నాయకులు అడ్డు దగిలి ఆపించిన తర్వాత అధైర్య పడ్డ వెయ్యి మంది బిడ్డలు బలవన్మరణం చెందితే సి డబ్ల్యూ సి నిర్ణయం జరిగింది. పార్లమెంటు లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పాస్ కాక ముందే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆకుల భూమయ్యను కూడా పొట్టన పెట్టుకుని ప్రజాస్వామిక తెలంగాణా భావనను అడ్డుకొనే ప్రయత్నం చేసింది. సరే ఇంత మంది బలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే సమైక్య రాష్ట్రం లో జరిగిన అన్యాయాలను సరిదిద్దే కార్యక్రమం లో భాగంగా కల్లు గీత కార్మికుల కు జరుగుతున్న న్యాయాన్యాలేమితో ఒక సారి చూద్దాం.
       2004 లో రాజశేకర్రెడ్డి ప్రభుత్వం రాగానే మల్టీ నేషనల్ కంపనీలు లిక్కర్ డాన్ లకు లబ్ది చేకూర్చి అందినకాడికి దండుకోవాలన్న కుట్ర మొదలైయింది . ఫలితంగా అల్తాఫ్బదలా  హైద్రాబాద్ లో .కల్లును  నిషేదించారు.టీఆర్ ఎస్ ప్రభుత్వం తన ఎన్నికల మనిఫెస్టో అమలు లో భాగంగా హైద్రా బాద్ లో కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది . మల్టీ నేషన్ కంపనీల తొత్తులైన సీమాంధ్ర పెట్టుబడి దార్లకు ఇది ఎంతమాత్రం మింగుడు పడలేదు. బస్ , లిక్కర్ మాఫియా లీలలు మళ్ళీ మొదలైనై . పట్టణాల్లో కల్లు కాంపౌండులు వద్దని మహిళా మణుల చేత ఉద్యమాలు తీయిస్తున్నారు. కల్లు కాంపౌండులు తెరిచినందున తమ మగవాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని తామూ స్వేచ్చగా తీరుగ లేక పోతున్నామన్నది వారి ఆరోపణ. 

        వాస్తవానికి స్వచ్చమైన కల్లు ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. పైగా ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్, విటామీన్స్ కల్లు లో పుష్కలంగా ఉంటాయి. భారత ఫుడ్ & న్యూట్రిషన్ గణాంకాల ప్రకారం ఒక కప్పు కల్లు లో శక్తి  114 క్యాలరీలు, పొటాషియం 15 mg.కాల్షియం 0.5%, ఫాస్ఫరస్ 0.1%, మెగ్నీషియం 0.6%, మాంగనీస్ 0.9%, ఐరన్ (ఇనుము ) 0.5% సోడియం 4.4gr,కాపర్ 1.1%, జింక్ 0.3%, సెలీనియం 0.2%, నియాసిన్ (బి 3విటమిన్) 0.1%, ఫంటోతెనిక్ ఆసిడ్ (బి3విటమిన్) 0.2%, థయమైన్(బి1విటమిన్)0.1%, రెబోఫ్లోవిన్ విటమిన్ బి2 0.5%, విటమిన్ బి6 0.3%, విటమిన్ సి 2.4%, ఫోలేట్ 0.2%, ఆల్కహాల్ 4 నుండి 6శాతం , కార్బోహైడ్రేట్స్ 21 gr,  ప్రోటీన్ 0.23 గ్రా||, షుగర్ 18 గ్రా|| డైటరీ ఫైబర్ 0.1 గ్రా||, ఆస్కార్బిక్ ఆసిడ్ 0.16 గ్రా||, సుక్రోజ్ 17.4 గ్రా||. చూడండి ఇవన్నీ మనం అవసరం మేరకు టాబ్లెట్ల రూపం లో టానిక్ రూపం లో మందుల షాప్ లో కొనుక్కొని వాడుతామ్. మందులకంటే  స్వచ్చమైన కళ్ళు వాడితే మంచిదే కదా?

    కళ్ళు దాదాపు 3500 యేండ్ల నుండే ప్రజల వాడుకలో ఉంది.పండుగలు, పబ్బాలు, విషాద,వినోద సమయాల్లో మానసికొల్లాసం కోసం, రిక్రియేషన్ కోసం మనుషులు వాడే ఒక ప్రకృతి సహజ సిద్దమైన , ఆరోగ్య పానీయం కల్లు .ఇటువంటి పానీయాన్ని లిక్కర్ డాన్ లు నియమించిన కూలి ఉద్యమ కారులు వద్దని వారిస్తున్నారు. ప్రతి సెకన్ కు ఒక ప్రాణం  తీస్తున్న మద్యం, గల్లీ గల్లీకి విస్తరించి ఒక్కొక్క సీసా రూ|| 100 నుండి 5000 దాకా అమ్ముడై తుంటే జేబులకు, తాగుబోతుల గుండెలకు చిల్లులు పొడువడం లేదా? అవి వద్దని ఈ మహిళా మనులు ఎందుకు ఉద్యమ్మలు చేయడం లేదని గీత కార్మికులు ప్రశ్నిస్తున్నారు, చరిత్రలో కల్లును మినహాయించి సంపూర్ణ మద్యపానం కోసం ఉద్యమాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ కల్లు వద్దు మద్యం ముద్దు అన్న ఉద్యమాలు చరిత్ర ఇంతవరకు చూడలేదు మరి .1980 ప్రాంతం లో ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణలో ప్ర, సా. దు , లను , బ్రాందీ బీరు దుకాణాలను మూయించింది. ఆ కొడుకులు సల్లగుండ అని గీత కార్మికులు దీవించిండ్రు.  ఆనాడు గ్రామాల నుండి తరిమి వేయబడ్డ దొరలు,భూస్వాములు పట్టణాలకు జేరి తొండ ముదిరి ఊసర వెల్లి  అయినట్లు బడా పెట్టుబడి దార్లు గా అభివృద్ధి చెంది లిక్కర్ డాన్ లు గా ఎదిగి  పేద  ప్రజల వృత్తుల్లోకి జొరబడి తమ తోడేలు కడుపులు నింపుకోవడానికి గొర్రెల గొంతులు కోరికే కుట్రలు జేస్తున్నరు .
      ఆఁ! కల్లులో కల్తీ జరుగకుండా ఉద్యమించండి ,  నిర్దిస్ట సమయం లోనే కల్లు కాంపౌండు లు తెరువాలని ఉద్యమించండి. ఇంకా మీకు మీ మీ కుటుంబాల ఆరోగ్యాల పట్ల ఆసక్తి ఉంటే పురుగు మందులు కలిపిన కూల్ డ్రింక్స్ నిషేదించాలని వాటి స్తానమ్ లో కల్లును శీతల పానీయంగా అభివృద్ది పర్చాలని ఉద్యమించండి. ఇంకా సమాజం పట్ల మీరు బాధ్యత గా ఫీల్ అయితే కల్లును మినహాయించి సంపూర్ణ మద్యపానం కోసం ఉద్యమిద్దామ్ రండి మీతో చేరడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. 

     మల్టీ నేషన్ కంపనీల ఉత్పత్తులు వాడితే లాభాలన్నీ విదేశాలకే గదా?కానీ కల్లు వినియోగం వలన స్టానిక కార్మికులకు ఉపాధి లభించి విదేశీ మారకం కూడా ఆదా అవుతుంది కదా? కనుక కల్లు వద్దని వాదించే వాల్లు ఎవరి ప్రయోజనం కోసం ఉద్యామిస్తున్నారో ఒక సారి ఆలోచించుకొమ్మని కోరుతున్నాం.
    స్టానిక వనరులను ఉపయోగించుకొని స్టానిక కస్టజీవులకు ఉపాధి చేకూర్చుకోగలిగిన విధానాలు అవలంభించి నపుడే స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్తను బలోపేతం జేసిన వాళ్ళం అవుతాము.కావున కల్లును మినహాయించి కూల్ డ్రింక్స్ తో బాటు సంపూర్ణ మద్యపానం నిషేదం కోసం ఉద్యమిద్దామ్ రండని ఆహ్వానిస్తున్నాం .
                                                           వీరగొని పెంటయ్య.
                                                  సర్వాయి పాపన్న  తెలంగాణ గీత కార్మిక సంగం .
                                                        9908116990.

Thursday, September 4, 2014

5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా!

ఉపాధ్యాయుడు ఎట్లా ఉండేవాడు,ఎట్లా ఉండాలని కోరుకొంటున్నారో అని ప్రసార మాధ్యమాలు

ఉపాధ్యాయ. దినోత్సవం నాడైనా సంవస్తరానికి ఒక రోజైన  సమాజానికి తెలియజెప్పడం ఒక మంచి పనే! 

 రాయ , చదువ నేర్పడం తో బాటుగా సామాజిక విలువలు తన విద్యార్థులకు నేర్పించడం ఉపాధ్యాయుని

 బాధ్యతగా ఉండేది కొంతకాలం. మరీ పూర్వకాలం లో అయితే విద్య యొక్క లక్ష్యం, కైవల్య ప్రాప్తి, జన్మ 

రాహిత్యం, మోక్ష సాధన గా ఉండేది. ఆనాడు గురువు లక్ష్యం కూడా అదే కనుక గురు, శిష్యుల మధ్య 

సంబంధం కూడా చాలా ఆనంద దాయకంగా ఒకరి అవసరం మరొకరిదిగా చాలా ఆదర్శ వంతంగా ఉండేది 

,ఆంగ్లేయుల ప్రవేశం తర్వాత విద్య లక్ష్యం విద్యార్థులను ఆంగ్ల మానస పుత్రులుగా తీర్చి దిద్ది పాలక వర్గాల 

సేవలో తరించి వాళ్ళ దోపిడి సొమ్ము లో నుండి కొంత జీత భత్యాలుగా పొందడం గా ఉండేది.

                      1947 తర్వాత కూడా అదే విధానం కొనసాగుతున్నప్పటికినీ పాలకులు మాత్రం 

మారినారు .అయినప్పటికినీ స్వాతంత్రోధ్యమ స్పూర్తి ఫలితంగా 1980 పీవీ నర్సింహా రావు నూతన విద్యా

 విధానందాకా చదువుకున్న వారికి చదువు చెప్పిన వారికి సమాజం లో ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ

 పీవీ పుణ్యాన పెట్టుబడి దారులకు విద్యారంగ లో ఉన్న లాభదాయకమైన మార్కెట్ అర్థం అయ్యి ప్రైవేటు 

రంగం లో విద్య ప్రారంభం అయ్యింది. పెట్టు బడి దారుల ఒత్తిడుల ప్రభావం వలన ప్రభుత్వ పాఠశాలల్లో 

నియామకాలు నిలిచి పోయి విషయ బోధకులు లేకుండా పోయినారు. ఫలితంగా ఆర్తికంగా వెసులు బాటు 

కలిగిన వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్ళడం జరిగింది.

          1991 లో దేశ పదవ ప్రధానిగా పీవీ అధికారం లోకి రాగానే మన్మోహన్ సింగ్ ఆర్టిక మంత్రి గా

 వీరిరువురు ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాల వలన సమాజం లో అంతవరదాక ఉన్న విలువల నిర్వచనమే 

మారిపోయింది. కరికులం లో ఉండే పౌరనీతి శాస్త్రం పోయి పర్సనాలిటీ డెవలప్మెంట్ , వ్యక్తిత్వ వికాసం 

వచ్చి చేరినాయి . పక్కవాడు పడిపోయినప్పుడు నీవు వానికి చేయి అందించావో నీ పరుగు పందెం లో నీవు  

.ఓడి పోతావు. .నీకు చేతనైనా కాకపోయినా , నీకు ఆ శక్తి ఉన్నా లేకపోయినా ఉన్నతమైన లక్షాన్నే 

ఎన్నుకో.నీవు ఎన్నుకున్న లక్షం వైపు నీవు సాగి పో పక్క వాన్ని ఎట్టి పరిస్తితి లో కూడా పట్టించుకోవద్దు 

అనే ఫిలాసఫీ వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చిందంటే కన్న తలిదండ్రులను కూడా పట్టించుకోని  పరిస్తితి.

సరే అది మన సబ్జెక్ట్ కాదనుకుందాం. ఈ భావజాలం జీర్ణించుకున్న సమాజం నుండి ఎదిగి వచ్చిన 

యువత అతడు ఉపాధ్యాయుడా, అతడు డాక్టరా, అతడు రాజకీయ  నాయకుడా ఎవరైతే ఏమిటి ఎట్లా 

అయితే ఏమిటి డబ్బు సంపాదించు వస్తువులు సమకూర్చుకో సౌఖ్యాలు అనుభవంచు. అదే నీతి.

మనుషులు, మానవ సంబంధాల కంటే వస్తువులే ఆనందాన్ని యివ్వగలవు అనే వస్తు వినిమయ 

సంస్కృతి పరిఢవిల్లిన సమాజం లో ఉపాధ్యాయులు కూడా శలభాలే అయినారు. ఆ మంట సృస్టించిన 

పాలక వర్గాలే ఉపాధ్యాయులు సరిగా పనిజేయడం లేదని ఊదర కొడుతూ మొత్తంగా విద్యా రంగాన్ని ప్రైవేట్ 

పరం జేసె కుట్ర జేస్తున్నారు .


          అయితే ఏమిటి? సార్లు సరిగా పనిజేయడం లేదు కనుక విద్య ప్రైవేట్ అవుతుంది మరి అనే వాళ్ళు 

రేపు పెట్టుబడి మోనోపలి అయిన తర్వాత పేదలకే కాదు మధ్య తరగతి వాళ్ళకు కూడా చదువు ''కొన ''

లేనంతటి పిరపు సరుకు అవుతుంది . కనుక ప్రజలంతా ప్రభుత్వాలను అడుగవల్సింది ప్రభుత్వ 

పాఠశాలలకు ఇచ్చే గ్రాంటు మాకే ఇవ్వుమని మరిన్ని ప్రైవేట్ విద్యా సంస్తలను పెట్టండి అని కాదు,

  అన్నిటికి అమెరికనే ఆదర్శం  అని వల్లిస్తున్న అమెరికా వలె కామన్ హుడ్ సిస్టమ్ 

ద్వారా అందరికీ ఒకే విధమైన కామన్ స్కూల్ విధానం  ద్వారా విద్యను అందించాలని ప్రజలు, ప్రబుత్వ 

ఉపాధ్యాయులు వారి సంఘాలు ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. ఇకనైనా ఉపాధ్యాయులు 

కేవలం తమ హక్కుల కోసం మాత్రమే గాకుండా బాధ్యతలను గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఒకవైపు 

మూత బడుతుంటే ఉదయం తొమ్మిది గంటలకే మీరు బడి ఎట్లా పెడుతారు అని అడుగుతున్నారంటే 

ఇంకా ఉపాధ్యాయులు  వాస్తవ పరిస్తితులను ఎన్నడు అర్థం జేసుకుంటారని ప్రజలు అడుగుతున్నారు.

                   ఉపాధ్యాయులు వృత్తి  నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి. ఏ వృత్తులను జుసినా 

మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి అయినవి మాత్రమే మనుగడ కొనసాగిస్తాయి. మారము 

అని మొండికి వేస్తే కాలగర్భం లో కలిసి పోక తప్పదు.

      ఏసు ప్రభువు భక్తులు ప్రార్తిస్తున్నట్టు '' ప్రభువా ! వారేమీ చేస్తున్నారో వారికి తెలియదు '' అన్నట్లుగా 

తలిదండ్రులు వారేమీ చేస్తున్నారో వారికి తెలియడం లేదు. ఒక ఆట లేని ,పాట లేని ,ఆహ్లాదం లేని వంచిన 

తల ఎత్తకుండా ఎంత ఎక్కువ సేపు కూర్చుండ బెడితే తమ బిడ్డడు అంత గొప్పవాడు అవుతాడనుకొంటు 

పిల్లల బాల్యాన్ని హరించి వేస్తున్నారు. వారిని సహజంగా వికసింపనివ్వకుండా అత్యుస్తాహమ్ తో 

 చిన్నప్పటి నుండే అలివి గాని కోచింగులతో , మొగ్గలను బలవంతంగా విప్పదీస్తున్నారు . అందుకే అవి 

సహజమైన తమ సువాసనలను కోల్పోయి ప్లాస్టిక్ పువ్వుల వలె కన్న తలిదండ్రుల తో బాటు గా 

తమ చుట్టూ ఉన్న సమాజపు తంద్లాటను స్పందనను  పట్టించుకోవడం లేదు, తమ తమ వ్యక్తిగత 

సుఖ సంతోషాలను దప్ప . తలిదండ్రులు , ఊపాధ్యాయులు పాలకులు ఇప్పటికైనా స్పందించక పోతే 

భావి సామాజానికి భవిష్యత్తు ఉండదు.



                                                              వీరగొని పెంటయ్య,

                                                    విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి 

                                                      9908116990