Monday, October 8, 2012

bio diversity meeting in hydrabad is a joke!


తెలంగానీయులను అపహాస్యం జేస్తున్న హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సు ! ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ సేవ్ ఎర్త్, సేవ్ బయో దైవేర్సిటి అని ప్రజలకు పులుపునిచ్చినాడు.అసలు భూమిని కాని, జీవవైవిధ్యాన్ని కాని ధ్వంసం చేస్తున్నదెవరు? నిస్సందేహంగా ఆ పని చేస్తున్నది ప్రభుత్వాలే. ఎలాగో ఒక సారి పరిశీలిద్దాం.కరీంనగర్ జిల్లాలో కొన్ని కోట్ల సంవస్తరాల క్రితం భూమి ఏర్పడ్డనాడు పుడమి తల్లి పుక్కిలించి ఉమిసిన లావా గట్టి పడి గండు శిలలు గా మారిన క్రమం, ఆ గండు శిలలు మరికొన్నికోట్ల సంవస్తరాలు మంచుచే కప్పబడి ఉండడం, ఆ తర్వాత వాతావరణ ప్రభావం వలన క్రమంగా మంచుకరిగి నున్నని రాళ్ళు ఏర్పడడం అనేది అద్భుతము అయిన ఒక ప్రక్రుతి ప్రక్రియ.అనంతమయిన మంచు కరిగి బండ రాళ్ళను ఒరుసుకొని ప్రవహించిన ఫలితంగా పగిలిన రాళ్ళు దుమ్ము దుమ్ము అయి ఇసుక, మట్టిగా ఈ బండ రాళ్ళు రూపాంతరం చెందినాయి.కరిగిన మంచులో కొట్టుకొని పోకుండా మొండిగా నిలిచిన బండ రాళ్ళకు ఇన్ని కోట్ల సంవస్తరాల తర్వాత తాము గ్రానైటు సరుకై అటు ప్రభుత్వాలకు ఇటు క్వారీ యజమానులకు కరెన్సీ నోట్లము అయి సామాన్య ప్రజల బ్రతుకుల్లో బండలై పడుతామని పాపం మా సినారే అన్నట్లుగా మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నఆ రాళ్ళ కు అప్పుడు తెలియదు. అలాగే ఇప్పుడుకరీంనగర్ లో మొత్తం 750 గుట్టలకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నందున ఆయా గుట్టల పైన నివసిస్తున్న గుడ్డేలుగులు,కోతులు, కొన్దేంగాలు,కొండచిలువలు,రామ చిలుకలు, నెమళ్ళు,గబ్బిలాలు,ఉడుతలు,తేనెటీగలు తమ ఆవాసాలు కొల్లగొట్టబడి నందున ఊళ్ళ పైన పడి మనుషుల చేతుల్లో చచ్చిపోతున్నాయి.సీతా ఫలాలు,దొరుకుత లేవు.పశువులకు మేతదొరుకక గొడ్డు,గొర్రె అంతరించి పాలు ,మాంసం దొరకటం గగనమే అయింది.వర్షాన్ని కురుపింప జేసే పర్వతాలు లేనందున వర్షాలు పడక వాగులు ఒంకలు పొర్లి పొంగక చెర్లు నిండక చేపలు దొరుకక పోవడం మాత్రమె గాదు వ్యవసాయాలు కూడా సాగడం లేదు. భుగర్భ జలాలు అడుగంటే పోయి తాగడానికి నీళ్ళు దొరుకని పరిస్తితి.ఇదంతా అభివ్రుద్దియే అంటున్నది ప్రభుత్వం, దాని ఘనులఅభివృద్ధి శాఖ....పైన జెప్పిన జీవులన్నీ అంతరించి పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఇక మరో విషయం,ఇదే జిల్లాలో తిమ్మాపూర్ అనే మండలం లో పర్ల పెళ్లి అని ఒక మేజర్ గ్రామం ఉన్నది.అక్కడ చుట్టూ పక్కల వరి, మొక్క జొన్న విస్తారంగా పండించడానికి కారణం లోయర్ మానేరు డ్యాం సమీపాననే ఈ ఉరు ఉండడం.పచ్చని పంటపొలాలతో అలరారుతున్న ఈ గ్రామానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక చీడ పట్టించింది. అది హరిత బయో ప్రోడక్ట్ కంపని.ప్రభుత్వం తన విధానాల్లో భాగంగా పెట్రోల్ కొనుగోలుకు విదేశీ మారకం ఆదా చేయాలనే కారణం తో బాటుగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే కారణం చూపుతూ పెట్రోల్ లో20% ఇథనాల్ కలిపి ఇందనం వాడాలని నిశ్చయించింది.అందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలల్లో పర్యావరణ రక్షణ ఉద్యమాల వలన మూతబడిన పాత అవుట్ డేటెడ్ టెక్నాలజీ మిషనరీలను అతి తక్కువ ధరలకు ఇక్కడి పెట్టుబడి దారులకు సాంకేతిక సహాయం పేరుతొ అక్కడి ప్రభ్య్త్వాలు సప్లై చేసినాయి.అట్లా హరిత బయో కంపని యజమాని పర్లపల్లికి రావడానికి, కిరణ్కుమార్ సామాజిక వర్గానికి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సి సైలెంట్ వర్కింగ్ పార్టనర్ కావడం కారణమయింది.అప్పటి సర్పంచ్ కూడా అదే సామాజిక వార్గానికి చెందిన వాడు అయినందున తనను వాళ్ళు మోసం చేయరన్న నమ్మకం తో వాళ్ళు చెప్పిన చోటనల్ల సంతకాలు చేసిండు. గత సంవస్తరం కంపని స్టార్ట్ అయింది.ఈ కంపని మొక్క జొన్న్, బియ్యం నూక తో ఇతోనాల్ తయారు చేస్తుంది.ఈ బియ్యం నూక లో కూడా ఒక మోసమే. బ్లాక్ మార్కెట్ అయిన ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం లారీల కొద్ది ఇక్కడికే చేరిన కూడా అధికార పార్టి వాళ్ళది కనుక ఎవరు అడ్డగించఋ. సరే ఆ బియ్యాన్ని మరియు మక్కలను పెద్ద పెద్ద నీటి తోట్లల్లో పులియ బెడుతారు.అలా పులియ బెట్టడానికి ఒక లీటర్ ఇతోనాల్ తయారీకి 25 లీటర్ల నీరు కావాలి.అంటే దీని కెపాసిటీ రోజుకు 60 ,౦౦౦ లీటర్ల ఎతోనల్ తాయారు చేస్తుంది కనుక రోజుకు దీని నీళ్ళ వాడకం 15 లక్షల లీటర్ల నీరు. అట్లా మురిగిన 15 లక్షల లీటర్ల నీటిని రోజు బయటికి వదలడం వలన వాయు కాలుష్యం జరిగి గబ్బు కంపు వాసన దానితో ఆ చుట్టూ పక్కల పర్లపెల్లి,మొగిలిపాలెం,పీసుపల్లె,ములకనూరు,కొత్తపల్లి,నల్లగొండ,నాతకానిపల్లె,పోలంపల్లి,ఇప్పలపల్లె,నుస్తులాపూర్,మల్లాపూర్ ,మన్నేమ్పల్లి 12 గ్రామాల కు చెందిన దాదాపు యాబయ్ వేల మంది జనాబాకు వాంతులు, శరీరాల పైన దద్దులు, గర్బిణీ స్తీలకు గర్భ స్రావాలు అయిన సందర్భం కూడా ఉన్నది.అలాగే ఈ 15 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకి పోయి జల కాలుష్యం ఏర్పడి త్రాగునీరు కలుషితం అయిపోయి వాంతులు విరోచనాలు,కరీంనగర్ నుండి వైద్య బృందం వెళ్లి ప్రజల అభియోగాలు వాస్తవమే నని చెప్పినాయి,ఈ 12 గ్రామాల కు చెందిన 50 వేల జనాభా,వారికి అన్నపానీయాలు అందిస్తున్న 45 వేల ఎకరాల సాగు భూమి,30 చెరువులు,100 కుంటల అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సందర్భం లో ప్రజలు ప్రతినిద్యాలు చేయడం మొదలుకొని ధర్నాలు రాస్త్త రోకో లు చేసి విసిగి పోయి ఆకరుకు ప్రజలంతా కలిసి కంపనిని ఆపి వేసిన తర్వాత పర్యావరణ శాఖ స్పందించి ప్రజల అభ్యంతరాలు వాస్తవమేనని తాత్కాలికంగా కంపనీని మూసి వేసింది. కాని హైదరాబాద్ లెవల్లో యజమానులకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని మళ్ళీ కంపని తెరువడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఎంతగానో పోరాడి కేసులు జైళ్ళ పాలు అయి మురుగును మూసివేయించుకుంటే ప్రభుత్వ పెద్దలు మల్లి ఈ పాకి ని తమ పైన రుద్దినారు గదా అని ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజు దాదాపు ఒక 500 మంది మహిళలు సాయంత్రం రెండున్నర గంటల ప్రాంతం లో కలెక్టరేట్ ముట్టడించినారు.ఈ బయో ప్రాడక్ట్ విషాల వలన ఉర పిచ్చుకలు, బల్లులు చనిపోతున్నాయి.ఎలుకలు పిల్లులు కూడా ఆ నీళ్ళు ద్రాగి చనిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో జీవ వైవిధ్య సదస్సు గురించి అంతంత గొప్పగొప్ప మాటలు చెబుతున్నా ఓ ప్రభుత్వమా 193 దేశాలల్లో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారే! మరి ఇక్కడ మా 12 గ్రామాల 50 వేల మంది ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కోల్పోతున్నాము,మా ఉర పిచ్చుకలు మా బల్లులు మా పిల్లలు అన్యాయమై పోతుంటే మేము ఐదు గంటల నుండి ఓ ప్రభుత్వమా మా కస్టాలు వినరండి అని మండుటెండలో మహిళలం పిల్ల పాపాలను వదిలి మీ కార్యాలయం ముందు పడిగాపులు పడి ఉన్నాము అని గొంతు ఎండిపోయేదాకా నినాదాలు చేసినారు.ఓ నాగరికమయిన ,ఆధునికమైన కరీంనగర్ ప్రజలారా!వినండి , ఈ సమస్య మా ఒక్కరిదే కాదు,రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని ప్రస్తుతం మా భూగర్భం నుండే ఇస్తున్నా,,ఇప్పుడు కంపని మానేరు డ్యాం నుండి ఆ నీటిని తీసుకోవడానికి అనుమతి పొందింది,ఇప్పుడే మీకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయి, మరి 15 లక్షల లీటర్లనీల్ల్లు రోజు బయో కంపనీకి పొతే కరీంనగర్, హనుమకొండ పట్టణవాసులకు విపరీతమయిన త్రాగు నీటి సమస్య వస్తుంది అని ఆ అమాయక పల్లె జనం నగరవాసులకు జ్ఞానోదయం కలుగ జేసినారు ఓ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా! నీ పాలనా లోని 12 గ్రామాల కు చెందిన 50 వేల మంది కే స్వచ్చ మైన గాలి, స్వచ్చమైన నీరు, ఆరోగ్యంగా బ్రతికే ప్రాథమిక హక్కుకే భద్రత కల్పించ లేని నువ్వు 193 దేశాలకు చెందిన 200 కోట్ల పై చిలుకు ప్రజలకు ఏమి జీవ వైవిధ్యాన్ని ఉద్భోదిస్తావని పర్ల పల్లి బయో ప్రాడక్ట్ ను వ్యతిరేకించే ప్రజలంతా ఇవ్వాళ నిలదీస్తున్నారు. పెంటయ్య. వీరగొని విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, పర్యావరణ కార్యకర్త,

Friday, October 5, 2012


అది కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆగ్నేయంగా ఉన్న చిన్న గ్రామం, సర్వాయి పేట.. అక్కడ ఎప్పుడో 1675 లో సర్వాయి పాపన్న నిర్మించిన ఒక కోట శితిలావస్తలో ఉంది. అలనాడు సర్వాయి పాపన్న దాచిపెట్టిన సంపద దొరుకుతుంది అన్న అత్యాశ తో గుప్త ధనం కోసం కోటలోని చాల భాగాన్ని తవ్వి పోసినారు. తెలంగాణా కు చరిత్రే లేదని బుకాయించే సీమాంధ్ర పాలకవర్గాలు చారిత్రిక ఆధారాలను కాపాడడం లో విఫలం అయినారు. కోటకు కొద్ది దూరం లోనే సర్వాయి పాపన్న నిర్మించిన సర్వాయి చెరువు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఊరికి మధ్యలో ఉన్న కోట ముఖ ద్వారం, దానిని అనుకోని ఉన్న బురుజు అలనాటి దర్పానికి గుర్తుగా ఇంకా అలాగే ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆ బురుజు పైన ఫిరంగులు పెట్టి శత్రువులను నిలువరించే వారట. అక్కడినుండి భూమిలో గుండా కొమ్ముగుట్ట పైన ఉన్న కోటకు దారి ఉండేదంటారు. బురుజు పక్కన్నే పెద్ద బావి ఉన్నది.కోట ముఖద్వారం ఈ బురుజు ను ఆనుకొని ఎత్తయిన ప్రాకారం చాల వరకు శిథిలమై ఉన్నది. ఆ కోట ముఖద్వారం వద్దా కూర్చొని ఆనాటి పాపన్న గుర్రపు డెక్కల చప్పుడు ఏమైనా వినిపిస్తుందో ఏమో నని భూమికి చెవు ఆనించి విన్న గూడా 350 ఏండ్ల కింద గాలిలో కలిసిన ఆ శబ్ద తరంగాలను వినలేక పోయాము. కాని ఆ బండ రాళ్ళ పైన ఆయన హస్త ముద్రికలను , ఎత్తయిన ఆ బురుజుల పైన ఆయన నడయాడిన కాలి ముద్రల ఆనవాళ్ళను పోల్చుకొనే ప్రయత్నం లో అక్కడ నుండి కదిలినాము., అలనాడు దొరల భూస్వాముల ఆగడాలను అరికట్టడం లో అయన కూడ గట్టిన ఆ దళిత బహుజన సైన్యాలు ఎంతటి నిర్భీతి తో ఎంతటి ధైర్య సాహసాలతో ఆ నేల పైన నడయాడినాయో కదా అన్న తన్మయత్నం అక్కడనుండి కదుల లేక కదుల లేక మెల్లగా కొమ్ముగుట్ట వైపు బయలు దేరి పోయినాము. గొల్ల పల్లి, ఉమ్మాపురం గ్రామాల గుండా సాగిన మా ప్రయాణం కొమ్ముగుట్ట, బయ్యన్న గుట్ట, మూడురోకండ్ల గుట్ట, ఇట్లా ముప్పై యారు గుట్టల శ్రేణి లో తలమానికంగా ఉన్న కొమ్ముగుట్ట పాదాల నుండి ప్రయాణం సాగుతుంటే నెమలి పక్షుల కూతలు మనుషులు పిలిచినట్టుగా వినిపిస్తున్నాయి. శత్రువులు ఎవరో వస్తున్నారు జాగ్రత్త అని అలనాడు సర్వాయి పాపన్న్నకు కూడా ఇట్లాగే ఈ ప్రక్రుతి సహకరించింది కావచ్చు అనిపించింది. ఆ చిట్టడివి చెట్ల సందుల నుండి పోతుంటే చిన్న కాలి దారి వొకటి కనిపించింది.ఆ కాలి దారెంట పొతూ ఉంటె సీతాకోకలు గుంపులు గుంపులు గ బండ రాళ్ళ పైన ఉన్న, మట్టి పైన ఉన్న మాధుర్యాన్ని గ్రోలటానికి కాబోలు కింద వాలుతూ పైకి లేస్తూ వాటి ఆకలి పోరాటం సాగిస్తున్నాయి, అలాగే దాదాపు ఒక అరగంట నడిచిన తర్వాత బండ రాళ్ళ సందుల గుండా వస్తున్న సెలయేళ్ల ధారలు, అక్కడక్కడ చిన్న చిన్న మడుగులు. అబ్బ నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయి కదా ఇక్కడ అనిపించింది. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయి నందున మేము తెచ్చుకున్న నీళ్ళ బాటిల్స్ అయిపోయినందున ఆ బండల పైనుండి జల జలా వస్తున్న సెలయేటి నీటిని దోసిటి నిండా పట్టుకొని తాగినాము. అసలు మినరల్ వాటర్ అంటే అవి. . ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఆ నీళ్ళు. ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళిన మేము సరిగా గమనించ లేదు కాని అప్పటికే మేము పోతున్న దారి అన్ని చిన్న చిన్న దారులు గా విడి పోయింది . ఏ దారి గుండా వెళ్ళాలో అర్థం కావడం లేదు. సరే ఏదో ఒక దారి అనుకోని ఒక దారి గుండా వెల్లినాము. అయితే అ దారి మమ్ములను సర్వై పాపన్న నిర్మించుకున్న కోట వైపు కాకుండా మరో వైపు కు తీసుకొని పోతున్నది. అయితే అప్పటికే బాగా అలిసి పోయిన మేము ఏమి చేద్దాం తిరిగి వాపసు పోదామా , ఇంతకష్ట పడివచ్చి అయన నివసించిన స్తావరం చూడకుండా నే వెళ్ళిపోవడం ఎట్లా అని మీమాంస లో ఉండగా మా టీం సభ్యుల్లో ఒకరు అగాగో కోట గోడ అంటూ చుపెడుతున్నారు.ఉత్సాహం తో అందరం అటువైపు చూసినాము. దూరంగా చాల ఎత్తులో ఒక పాకురుబట్టిన పాత బండ రాళ్ళ గోడ ఒకటి కనిపించింది.ఏదో గొప్ప నిధి దొరికినట్టుగా అందరం బిరా బిరా అటువైపు అడుగులు వేసినం. కంటికైతే కనిపిస్తున్నది కాని దాని లోనికి పోవడానికి ద్వారం దొరుకుత లేదు.ఎటు వైపు పోయినా ఎక్కి దాట వీలు గాని కోట గోడనే అడ్డం వస్తున్నది. అరె ఆ కాలం ల ఇక్కడ ఇంతటి శత్రు దుర్భేద్యమైన కోట కట్టుకోవచ్చునని అతి సామాన్యుడు, ఒక కళ్ళు గీత వృత్తి దారునికి ఇంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎట్లా కలిగిందోకదా అని అబ్బురపడ్డాము. అయితే మాకు తెలిసింది ఏమిటంటే ఆ కోట లోపలికి పోవడానికి ఒకే ద్వారం ఉన్నదట.చివరికి మా టీం సభ్యులు చెట్లు ఆకుల తో ముసి ఉన్న ఒక ద్వారం కనుగొన్నారు. ఆ ద్వారం గుండా లోపలి పోయినాము. విశాలమయిన బండ రాళ్ళు. అక్కడ ఒక ఎత్తయిన రాయి పైన పాపన్న కూర్చునేవాడు అని ఒక రాతి సింహాసనం వంటి పెద్ద బండ రాయినే చూపినారు. అక్కడ నుండి శత్రువుల ఆచూకీని చూడడానికి రెండు వైపులా ఎత్తయిన బురుజులు ఉన్నాయి అయితే అవి చాల వరకు శిథిల మై పునాదులు, కొన్ని కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలక్షేపానికి ఆడుకొనే పులి జూదం పటం బండ పైన చెక్కి ఉన్నది. దాని కి కొంచం ఎడమ వైపు ఒక హనుమంతుని విగ్రహం చెక్కి ఉన్నది. కాని అది పాపన్న కాలం లో చెక్కినది కాకపోవచ్చుననుకొనే వారు ఉన్నారు. ఎందుకంటే పాపన్న బ్రాహ్మనీయ సంస్కృతిని పెద్దగ అభిమానించిన ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు.ఎందుకంటే ఆసియా ఖండం లోని అత్యంత ఉన్నతమైన స్తూపం నిర్మించబడి రాజ్యం చే ధ్వంసం చేయబడిన హుస్నా బాద్ పట్టణం లో సర్వాయిపాపన్న చేత మట్టి తో నిర్మించ బడ్డ పోచమ్మ గుడి ఉన్నది.దాని పూజారి గా కూడా ఒక దళిత మహిలనే నియమించి నట్లు గా ఆధారాలు ఉన్నాయి. అంతే గాకుండా ఆయనకు సమయం చిక్కినపుడల్లా రక్షణ స్తావరాలు నిర్మించుకోవడం,ప్రజల కష్టసుఖాలు తెల్సుకోవడం, శత్రువులు వసూలు చేస్తున్న పన్నులు చెల్లించ వద్దని ప్రజలను చైతన్య పరచడం. లాంటి పనులతోని తీరిక లేకుండా ఉన్న వాస్తవ వాది. ఛత్రపతి శివాజీ సమకాలికుడు అయిన పాపన్న శివాజీ వలె గుళ్ళు, గోపురాలు కట్టి ఉంటె బ్రాహ్మణా సమాజం పాపన్న చరిత్రను కుడా గ్రంధస్తం చేసి ఉండేది.మొఘల్ చక్రవర్తులను ఎదిరిస్తున్నాడు కనుక మహ్మదీయ చరిత్ర కారులు, మొఘల్ చక్రవర్తులకు తాబెదార్లు గా, పన్నులు వసూలు జేసి ఇస్తూ వారికంటే క్రూరంగా ప్రజలను హింసిస్తున్న స్తానిక హైందవ దొరలను చీల్చి చండాడుతున్నాడు కనుక హైందవ చరిత్ర కారులు పాపన్న చేరిత్రను ఎక్కడ గ్రంధస్తం చేయలేదు. అయిన ప్రజా నాలుకల పైన ఆశువు గా వచ్చిన పాపన్న చరిత్రను జానపదులు తమదయిన వీరోచిత , తమదైన సంస్కృతితో ఈ తరం దాక తమ నాలుకల పైన మోసుకొని తెచ్చినారు. ఆ కొండ పైన రెండు పెద్ద బండ రాళ్ళ మధ్యన ఉన్న చిన్న చిన్న రాళ్ళు, మట్టిని తొలిగించి అక్కడ ఆ గుట్ట పైన రెండు కోనేరులను నిర్మించినాడు.ఆ కోనేరులోనికి దిగడానికి మెట్లు సైతం చెక్కించి నాడు.సముద్ర మట్టం నుండి దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉన్న ఇతని కోటపైన సహజ సిద్ధమైన కోనేరులు నిర్మించుకొని ప్రకృతిని సైతం అక్కడ తన అధీనం లో ఉంచుకో గలిగినంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగిన అసాధరణమైన ఒక సామాన్య మనిషి పాపన్న.కొండ పై భాగాన ఉన్న శిల్పాలు కొన్ని చూసి కిందకి ప్రయాణం అయినాము. అయితే పాపన్న ఆరాధించే ఒక ప్రక్రుతి శిల్పం, దాని పేరు.బయ్యన్న, అది మాకు ఎక్కడా కనిపించలేదు. అది చూడ లేక పోయామే అన్న అసంతృప్తి మాకుఉన్నది. . కాని అప్పటేకే బాగా అలిసి పోయి ఉన్నాము .పైగా సూర్యుడు మాకంటే ముందుగానే తిరుగు ప్రయాణం లో ఉండీ మమ్ములను వేగిర పెడుతున్నాడు.అలనాడు గుర్రాలు సైతం ఎక్కినా గుట్టల పైనకు మాకు పోవడానికే గాదు రావడానికి కూడా చాల కష్టం అవుతున్నది. బండల పైనుండి జారుతూ చెట్ల ఉడలు పట్టుకొని , మెల్ల మెల్లగా కిందికి వస్తున్నాము ఒక్కసారిగా దాదాపు ఏడు ఫీట్ల ఎత్తుగా ఉన్న బయ్యన్న విగ్రహం మాకు అడ్డంగా వచ్చింది నన్ను దర్శించుకోకుండానే మిమ్ములను పోనిస్తానా అన్నట్లు గ మాకు అయన తారస పడేసరికి చాల ఆనంద ఆశ్చర్యాలు కలిగినాయి. కోర మీసాలు, ఏడు చేతులు,ప్రతి చేతిలో ఒక ఆయుధం, ఆ ఆయుధాలన్నీ కూడా ప్రకృతియే.ఇనుప శూలం,విల్లంబులు,పడగ విప్పిన నాగుపాము,అర్ధ చంద్రుడు,డమరుకం,కమలం, యమపాశం,ఉన్నాయ్. ఒక కుక్క,బుద్దుడు,నరుకబడిన శత్రువు తల ఉన్నాయి.దిగంబరంగా చెక్కిన్చుకోబడ్డ ఈ విగ్రహానికి పాపన్న కోట లోనికి వచ్చేటప్పుడు,కోటలోనుండిబయటికి పోయేటప్పుడు పూజున్చుకొని పోయే వాడట. ఆ విగ్రహం కింద నిధి ఉండవచునో ఏమో అనుకోని దుండగులు.తవ్వినారు.విగ్రహం పక్కనుండి తెల్లని సెలయేరు పారుతున్నది.బయ్యన్నను దర్శించుకున్నామన్న సంతోషం మా అలసటను తొలగించింది.చల్లని తెల్లని సెలయేటి నీరు కడుపునిండా తాగి మనుసు నిండా పాపన్న చరిత్రను తలుచుకొంటూ తిరుగు ప్రయాణం అయినాము. గుట్ట దిగువన మరో చారిత్రిక మైదానం . అదే దండు దుబ్బ. తన సైన్యానికి పాపన్న అక్కడే శిక్షణ ఇచ్చేవాడట. సామాన్యులకు, సంపద సృస్తికర్తలకు సరైన వాటా లభించాలంటే సాయుధ పోరు చేయక తప్పదని 375 సంవస్తరాల కింద నే మార్క్స్ మాటే లేని రోజుల్లో మన సర్వాయి పాపన్న మహ్మదీయులైన మొఘల్ లను, హైన్దవులయిన స్తానిక దొరలను ఎదిరించడానికి ఒక చాకలి సర్వాన్న, ఒక మంగలి మాదన్న, ఒక జక్కుల పెరుమండ్లు,ఒక దూదేకుల పీర్ సాహెబ్,లాంటి దళిత బహుజనులతో దండు గట్టి సాయుధ పోరు జేసి దళిత బహుజనుల రాజ్యం సాధించుకున్నాడు.ఇంతటి మహత్తర దార్శనికుడు., ఇంతటి గొప్ప యుద్ద్దవీరుడు,ఇంతటి ప్రజాపక్షపాతి,సంపద సృష్టికర్తలకు సంపద దక్కాలన్న సమ సమాజ వాది యొక్క చరిత్ర గాని, ఒక విగ్రహం గాని తెలంగాణా లో అందునా ఆయన పుట్టిన వరంగల్ జిల్లలో గాని,అయన సమరం జేసిన పొలాస జగిత్యాల, కరీంనగర్ లో గాని లేదా గోల్కొండానే జయించిన ఈ విప్లవ యోధుని విగ్రహం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన గాని పెట్టుమని అడుగడానికి కారణం చరిత్ర తెలియక పోవడం ఒక కారణమయితే దళిత బహుజనులలో తమ ఆత్మ గౌరవ ఉనికి కై తమ అస్తిత్వాలను నిలుపుకోవడానికి తెగించి పోరాడాలన్న సీరియెస్ నేస లేక పోవడం మరో కారణం. సంపద సృస్తికర్తలకు సమ న్యాయం జరుగాలని అనోకొనే వారు,అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్ళు,ఇప్పటికయినా ఒక్కటయ్యి ,375 ఏండ్ల కిందనే మొఘల్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి, అగ్రకుల హైందవ పాలనను ఓడించి, ప్రకృతినే ఆరాధించి ,దళిత బహుజలతోదండు గట్టి సాయుధ పోరుజేసిన తెలంగాణా దేశీ దార్శనికుని మార్గం లో ఆలోచించి రాజ్యాధికారం దిశలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించవలసి ఉన్నది. పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యపర్యవేక్షనాదికారి. న్యాయవాది.

Monday, September 24, 2012


సకల జనుల సమ్మె విరమించ బడిన తర్వాత తెలంగాణా ఉద్యమం పని అయిపోయిందని సమైక్య వాదులు సంబరపడి పొతే తెలంగాణా ప్రజలు కూడా కొందరు ఇంత పెద్ద ఉద్యమం ఆబాలగోపాలం అందరు పాల్గొని ఇన్ని రోజులు ఇంత త్యాగం తో ఇంత ప్రశాంతంగా ఇంత ఉత్తేజంగా ఇంత ప్రజాస్వామ్య యుతంగా పోరాటం జేస్తే గూడా ప్రత్యేక రాష్ట్రం సాధ్య పడలేదు గనుక ఇక మనం ఎంత కొట్లాడినా ఏమీ లాభం అనుకోని నిరాశ పడ్డారు. ఇప్పుడు తలపెట్టిన సెప్టెంబర్ 30 లాంటి ర్యాలి సమ్మె సందర్భం లో జేస్తే ప్రజల ప్రతిస్పందన భాగస్వామ్యం బాగా ఉండేది, ప్రభుత్వం దిగివచ్చేదని, చేయ వలసిన సమయం లో చేయకుండా తెలంగాణా రాష్ట్ర సిద్ధిని వాయిదా వేయడం లో అన్ని రాజకీయ పార్టీల తోబాటుగా జాకులు గూడా తమ బాధ్యత ఏమీ లేదని అంటే ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. 1948 కి ముందే ప్రారంభ మైన గయిర్ ముల్కి గో బ్యాక్ నినాదం 1969 నాటికి రక్తం చిందించ గలిగినంతటి తీవ్ర స్తాయికి వెళ్ళిపోయింది.369 మంది అస్తిపంజరాలతో ముఖ్యమంత్రి సింహాసనాన్ని చేక్కిన్చుకున్న మర్రిచేన్న రెడ్డి ఒక్కడే తెలంగాణా ద్రోహి కాదు, ఆయనతో బాటుగా రాజ్యాధికారం పచుకున్న రాజకీయ నాయకులు అందరితో బాటుగా ఎమ్మెల్సి పదవులు పొందిన ఉద్యోగ సంగాల నాయకులూ కూడా భాగస్వాములే. 1970 నుండి 1997 లో తెలంగాణా జనసభ ఆవిర్భావం దాక ఈ 27 ఏండ్ల సుదీర్ఘ కాలం తెలంగాణా వాదం తెలంగాణా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పదిలంగా అలాగే ఉంది. వరంగల్ డిక్లరేషన్ నాటి ఊరేగింపు లో ckm కాలేజి నుండి బస్సు స్టాండ్ ముందున్న స్పోర్ట్స్ గ్రౌండ్ దాక సాగిన ప్రజల కవాతు లో పెల్లుభికిన ఉత్సాహం చూసిన తర్వాతనే సీమాంధ్ర పాలకుల పాలన పట్ల ప్రజలు ఎంతగా ఏవగించు కుంటున్నారో అర్థం అయ్యింది . 1997 నుండి 2004 వరకు ఈ ఏడేండ్ల కాలం లో తెలంగాణా ప్రజలను, తెలంగాణా వాదాన్ని, తెలంగాణా రైతులను, యువకులను , విద్యార్థులను అత్యంత కిరాతకంగా అణిచి వేసి వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఉద్యమాలను లేకుండా చేయచ్చునన్న ఒక తప్పుడు అవగాహనతో ఒక బెల్లి లలితను, ఒక కనక చారి లాంటి ఎందరోతెలంగాణా ఉద్యమ కారులను హత్యలు గావించి న చంద్రబాబు నాయుడు సర్కారు తెలంగాణా వాదాన్ని ప్రజల్లో లేకుండా చేయ లేక పోయింది.2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా , తెలంగాణా వాదానికి వ్యతితెకంగా , బహుళ జాతి కంపనీల వ్యాపారాలకు అనుకూలంగా tips , trims intellectual property rights ఎజెండాగా, తన మానిఫెస్టో తో ఎన్నికలకు దిగింది. ఆంధ్ర , తెలంగాణా తేడ లేకుండా అన్ని ప్రాంతాల్లో చెంద్రబాబు పాలసీని ప్రజలు తిరస్కరించినారు.చెంద్రబాబు నాయుడు క్రూర నిర్బంధ పాలన వలన రెక్కలు తెగిన పక్షి వలె గాయ పడి ఉన్న తెలంగాణా వాదాన్ని 2000 సం. లో కెసిఆర్ చేతిలోకి తీసుకున్నాడు.అణిచివేత నుండి కొంత వెసులు బాటు దొరికిన తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెంతన సేద దీరి ఆయనకు బంగారు బాతుగుడ్లనే బహుకరించారు. కాని అక్కడనే అయన ప్రజల వైపు నుండి గాక ప్రభుత్వం లో చేరిపోయి కాంట్రాక్టులు కమిషన్లు గురించి మంతనాలు సాగిస్తుంటే ఒక వైపు ప్రజలు దూరం గావడం మరో వైపు ఉన్న ఏమ్మేల్లెలు ఊసి పోవడం తో రాజశేకర్ రెడ్డి తన సర్కారు నుండి బయటకు వెళ్లి పోయే పరిస్తితి కల్పించిండు. బై ఎలెక్షన్ల తో చావుదప్పి కన్ను లొట్ట బోయినట్టు అయింది.మొదటి నుండి కేసీఆర్ ఉద్యమాలు వద్దు లాబీయింగ్ ద్వారానే తెలంగాణా నేను సాధించి పెడుతానంటే , తేరగా వస్తుంటే ఎందుకు తిప్పల బడాలె అనుకొనే కొందరు అరె అయన పద్దతిలో అయన పోతుండు, మీరు కావాలంటే కొట్లాడుకోండి అన్నారు. అందుకే మిలియన్ మార్చ్ వద్దన్నాడు, సకల జనుల సమ్మె అనే సంకుల సమరం ఒక వైపు ముమ్మరంగా సాగుతుంటే ప్రధాన నాయకత్వం యుద్ధ రంగాన్ని వదిలేసి రాయబారానికి హస్తినాపురికి వెళ్ళింది. ఇందులో ఏదో మతులబు ఉండే ఉంటుంది అనుకొన్నారు అమాయకమ్మన్యులు కొందరు. పర్కాల ఉప ఎన్నికల తర్వాత సెప్టెంబర్ 29 నాటికి తెలంగాణా ఇవ్వకుంటే 30 నాడు తెలంగాణా ప్రజలంతా పెద్ద ఎత్తున హైదరాబాద్ కు మార్చ్ చేస్తామని పొలిటికల్ జే ఎసి ప్రకటించింది. రేపో మాపో ఒకవైపు తెలంగాణా వస్తా ఉంటె ఇంకా ఈ ఉద్యమాలతో ఏమి పని అని నాకు సిగ్నల్స్ వస్తున్న్నాయి అని అన్నవాళ్లు ఉన్నారు.. ఇట్లా ఎన్నో సార్లు వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే ఉగాది, వచ్చే రంజాన్, వచ్చే బక్రీద్, వచ్చే స్వతంత్ర దినోత్సవం ఇక మన తెలంగాణా రాష్ట్రం లోనే అనంగా వినీ, వినీ విసుగుజెందిన ప్రజలు తమ మానాన తాము 30 నాటి మార్చ్ కోసం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మీరు చేసుకుంటే ఉద్యమాలు చేసుకోండి నేను మాత్రం ఇగో చుడుండి లాబీయింగ్ తోనే తెలంగాణా తెస్తానని గత 20 రోజులనుండి డిల్లీ లో దిగే గడపా ,ఎక్కే గడప తో ఫుల్ బిజీ. ఆఖరుకు వాళ్ళు తెలంగాణా ప్రకటించక ముందే TRS ను ఆఫర్ జేసిండు. ప్రణబ్ కుఖర్జీ కమిటీ వలె, రోశయ్య కమిటి వలె,శ్రీకృష్ణ కమిటి వలె ఒక కమిటి వచ్చినా , లేదా సిక్స్ పాయింట్ ఫార్ముల వలెనో, 610 జివో వలెనో ప్రాంతీయ మండల్ వలెనో ఒక ప్యాకేజి వచ్చినా ఇంకేంది ఇగ తెలంగాణా వచ్చినట్లే సంబురాలు జేసుకుందాం రండని పిలుపు ఇచ్చేటట్లు ఉన్నారు. కాని తెలంగాణా ప్రజలు ఇప్పటికే లెక్క లేనన్ని సార్లు, కమిటీల పేరుతొ ప్యాకేజీల పేరుతొ మోసపోయి ఉన్నారు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దప్ప మరే విషయాన్ని గూడా తెలంగాణా ప్రజలు అంగీకరించరు. కనుక రాజకీయ నాయకుల మాయోపాయ ఉచ్చులలో ప్రజలు చిక్కుకొని 30 సెప్టెంబర్ మార్చ్ ను ఎట్టి పరిస్తితిలో గూడా వాయిదా వేసుకోవద్దు. అలాంటిది ఏదయినా జరిగితే మాత్రం ఇక చాల కాలం దాక ఏ నాయకత్వాన్ని గూడా తెలంగాణా ప్రజలు నమ్మని ఒక నిస్సహాయ స్తితికి తెలంగాణా ఉద్యమాలు నేట్టివేయబడుతాయి. అందుకని నాయకత్వం బహుపరాక్! వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి తెలంగాణా ప్రజా ఫ్రంట్, కరీంనగర్.

Tuesday, April 17, 2012

ఈ ఏప్రిల్ 20 తో ఇంద్రవెల్లి మారణకాండకు 31 సంవస్తరాలు. 1981 ఏప్రిల్ 2o న గిరిజన రైతు కూలి సభ ఆధ్వర్యం లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు వారికే చెందేవిధంగా పట్టాలు ఇవ్వాలని, ఎందుకంటే అప్పటికే గిరిజనుల భూములను మైదాన ప్రాంతం నుండి వచ్చిన గిరిజనేతరులు ఆక్రమిన్చుకుంటున్నారు. అలాగే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, తప్పుడు కొలతలతో తప్పుడు తూకాలతో తమను మోసం జేస్తున్న వారినుండి రక్షణ కల్పించాలనే డిమాండ్ తో ఇంద్రవెల్లి లో గిరిజనులు సభ జరుపుకుంటున్నారు. వారి డిమాండ్స్ ఏమి రాజ్యాన్గెతరమైనవొ లేక రాజ్యాధికారాన్ని లాక్కునేవో కాదు. కాని రాజ్యం నిర్దాక్షిణ్యంగా దాదాపు 60 మంది గిరిజనులను కాల్చి చంపింది. అమరులైన వారి రక్తం ఏరులై గోదావరి, మానేరు , ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ నదుల గుండా ప్రవహించి చత్తీస్ గడ్, అభూజ్ మాడ్ లో జల్, జంగల్, జమీన్ ల పైన హక్కులకు ఉద్యమించాలన్నశక్తులకు ఊపిరులూదిన్ది.
ఇదే సందర్భం లో డిల్లీ లో మన్మోహన్ సింగ్, చిదంబరం లు దేశ ముఖ్యమంత్రుల సమావేశం లో తమ ఆర్ధిక మూలాలకు తమ భద్రతకు రక్షణ లేదు కనుక ఎన్సిటిసి ఏర్పాటుకు అందరు సహకరించాలని ముఖ్య మంత్రులతో అభ్యర్థించారు. ఇక్కడ ఎవరి ఆర్ధిక మూలాలకు భద్రత లేకుండా పోయిందో ఎవరి భద్రతకు భంగం కలిగిందో చర్చించాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా సెజ్ ల పేరుతొ, అనువిద్యుత్ కర్మాగారాల పేరుతొ , నీటి ప్రాజెక్టుల పేరుతొ, ఖనిజ సంపద తవ్వకాల పేరుతొ కోట్లాది పేద ప్రజల భూములను బలవంతంగా లాగుకొని ఒక వేదాంత , ఒక బ్రహ్మని, ఒక రహేజ , ఒక రిలయెన్స్ ఇట్లా బడా బాబులకు అప్పనంగా అప్పగించి వాళ్ళ ప్రయోజనాలకు రక్షణ కల్పించి వాళ్ళు సమర్పించే సుట్కేసులతో రాజకీయ నాయకుల వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్నారు. ఒక మధుకోడా , ఒక లాలు ప్రసాద్ యాదవ్, ఒక రాజశేకర రెడ్డి, ఒక రాజీవుగాంది , ఒక మాయావతి, ఒక జయలలిత, ఇలా వందల సంఖ్యలో నాయకుల పైన కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అదంతా ప్రజలకు చెందవలసిన సొమ్మే. కాని ప్రజలు పాపం ఎప్పుడు కూడా తమ ఆర్ధిక మూలాలకు ఈ రాజకీయ నాయకుల చీడ పట్టిందని వీళ్ళను అంతమొందించాలని అనుకోలేదు. సమస్యల మూలాలను వెదికి శాస్త్రీయ పరిశ్కారాలకోరకు కోల్పోతున్న ప్రజా సమూహాలను సమీకరించే ప్రయత్నం జేస్తున్నారు. కాని మన్మోహనుడు, చిదంబరం లు మాత్రం వాళ్ళ సమూహాల దోపిడీ ని ప్రశ్నిస్తున్న ప్రజా రాశులను అది ఇంద్రవెల్లి గాని, అది కాకరాల పల్లి కాని, అంది నందిగ్రామ్ కాని ఎక్కడైనా ప్రజలను కాల్చి చంపుతున్నారు. అంతే భవిష్యత్ లో అట్లా కాల్చి చంపడానికి మనమంతా ఏకం కావాలని పిలుపు ఇస్తున్నారు.
మరొక్క విషయం విధ్వంసం. అసలు ఎవరు విధ్వంసం చేస్తున్నారు. అది ఇసుక, అది మట్టి. అది ముడి ఖనిజం, అది గ్రానైట్, గ్రాఫైట్, అల్యూమిన, నీరు ఇట్లా అన్ని వనరులను ఒక లెక్క పక్క లేకుండా భావి తరాలకు మిగులకుండా తవ్వి విధ్వంసం చేస్తున్నది రాజ్యం అండ దండలతో పెట్టుబడి దారలా లేక ప్రజలా? ఈ విధ్వంసం వలన ఎంతటి కాలుష్యం వస్తున్నకూడా వాళ్ళ ఆరోగ్యాలను ఫణంగా పెడుతిన్నారే కాని మా ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ మా జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నారని ఇప్పటికి ఇంకా ప్రజలు తిరుగ బడటం లేదు. ఎక్కడో చదివినట్లు వేటాడే తోడేళ్ళు వేటకు ఐక్యం అవుతున్నాయి కాని వేటకు గురయ్యే గొర్రెలు ఐక్యం కావడం లేదుఅన్నట్లుగా ఎక్కడో కాదు మన రాష్ట్రం లో మన హైద్ర బాద్ చుట్టూ పక్కలనే 34 వేల ఎకరాల అత్యంత విలువైన భూములను పేదలైన హక్కు దారుల నుండి బలవంతంగా లాగుకొని నామ మాత్రపు ధరలకు ఆ భూమిని బడా బాబులకు ధారాదత్తం జేశారు. వారు ఏ ప్రాజెక్టులు కట్టక పోయినా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వక పోయినా పైగా అదే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి కోట్ల కొద్ది బ్యాంకు రుణాలు పొందినా, ఉద్దేశించిన ప్రాజెక్టు కట్టక పోగా ప్లాట్స్పెట్టి అమ్ముకుంటున్నా కూడా ఏ ఒక్కరిని ఏమి అనరు. ఎందుకంటే అందులో వాటాలు మీకు అదివరకే అంది ఉన్నాయి కనుక. మీవి , మీ చందాదారుల అక్రమ సంపాదన 5oo లక్షల కోట్ల రూపాయలు విదెశీ బ్యాంకులల్లో దాచుకుంటారు. అవి తెప్పెంచే ప్రయత్నం అధికార, ప్రతిపక్షాలు ఏవీ కాని చేయవు, కాని ఇక్కడ పేద ప్రజల అవసరాలైన ఉప్పుల పై, పప్పుల పై చెప్పుల పై, గ్యాస్, పెట్రోల్, డీసెల్ పైన అలివి గాని పన్నులు వేస్తారు. ప్రజలు స్వేచ్చ ,స్వాతంత్రాలతో, బ్రతుకు భద్రతతో జేవించే పాలన అందించుమని అధికారాన్ని పాలకులకు అప్పగిస్తే పాలకులు చేస్తున్నది ఏమిటి, ప్రజలు నిలబడ్డ నీడను అడుగిడిన ఆధారాన్ని విదేశాలకు మల్టీ నేషనల్ కంపనీలకు గంపగుత్తాగా అమ్మివేస్తూ ప్రశ్నించే ప్రజలను ఖబర్దార్ మా అంతర్గత భద్రతకు మీరు ముప్పుగా ఉన్న్నారని, తమ ఆర్ధిక మూలాలకు నీళ్ళు అందకుండా జేస్తున్నారని హెచ్చరిస్తా ఉంటె ప్రజలు ఇంకా ఎంతో కాలం సహించరు.
పెంటయ్య,వీరగొని.
కరీంనగర్.

Thursday, April 12, 2012

రపంచ వ్యాప్తంగా  కోట్లాదిమంది అవకాశాలను కేవలం వేలాది మంది అత్యంత దురాశా పరులైన వ్యక్తులు ప్రజలందరికి చెందవలసిన సంపదను అలనాడు హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టినట్లు చుట్టి చంకలో పెట్టుకొని పోయినట్లుగా వీళ్ళు సంపదనంతా పోగుజేసుకొని తిరుగుబాటుకు కారనమౌతున్నారు. పైగా తిరుగుబాటు దారులనే దోపిడీ దొంగలుగా  తీవ్రవాదులుగా సృష్టిస్తున్నారు. 11 వ శతాబ్దానికి  పూర్వం ప్రజలనుండి గోల్లుడ గొట్టి  వసూలు జేసిన సంపద అంతా మతాధి పతులు ప్రార్థనా మందిరాలలో దాచి పెట్టినపుడు ఆకలి బాధితులు అది దోచుకొని పొతే వాళ్ళను దగ్గులు, పిండారీలు , బందిపోట్లు దొంగలు అన్నారు. 12 వ శతాబ్దం తర్వాత నుండి ఆంగ్లేయులు  రాజ్యాధికారానికి వచ్చేదాకా దొరల గడీల పైన, మొగల్ చక్రవర్తుల కోటల పైన, వాళ్ళ సామంతుల దేవిడీల  పైన  ఒక సర్వాయి పాపన్న గౌడ్, ఒక ఛత్రపతి శివాజీ లాంటి బహుజన యోధులు చేసిన తిరుగుబాట్లను  పాలక వర్గాల కు వందిమాగదులైన చరిత్రకారులు దొంగ తనాలుగా దొంగ దాడులు గా, అభివ్రుద్దినిరోధకులుగా విచ్చిన్న కారులుగా  చిత్రీక రించారు. అలాగే ఇప్పుడు సెజ్జులల్లో, అభాయారన్యాలల్లో, పోలవరం లో, శ్రీపాద సాగర్ లో,  నెల్లూరు జిల్లా ముత్త్కూరు మండలం చిల్లకూరు, వెంకటచలంలో, సింగూరు, నందిగ్రామ్ , పోస్కో, నియమగిరి,సోంపేట,కాకరాలపల్లి, ప్రాజేక్టులల్లో భూములు కోల్పోయిన , తమ ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది నిర్వాసితులు తిరుగుబాటు జేస్తే వారిని  అభివృద్ది నిరోధకులు అంటున్నది రాజ్యం.
      రాజ్యం దాని స్వభావం ఎలా ఉండాలో ప్లేటో,అరిస్టాటిల్ నుండి చానుక్యుని  దాక రాజగురువులే ఏమని ప్రస్తావించారు? రాచరిక వ్యవస్థ లో గాని  శ్రేయో రాజ్యం లో గాని సంక్షేమ రాజ్యాలల్లో గాని ప్రజలనుండి తిరుగుబాటు రాకుండా రాజు ప్రజలను పాలించాలని చెప్పబడింది. అంతే గాని ప్రజలకు చెందవలసిన సమస్త సంపదలను తమ సైనిక బలం తో తమ తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం తో బాటుగా తమ తమ అనుచర బందుగానాలకు అందిన కాడికి దోచి పెట్టడం, రాజ రాజ వైభోగాలు  ప్రజల కన్ను కుట్టే ల అనుభ వించడం  ఉత్తమ పాలకులకు తగదు అని చెప్పినారు.కాని . ఇక్కడ భూ ప్రపంచం మీద ఎంత విధ్వంసం జరిగినా ఎంత కాలుష్యం విరజిమ్మినా సకల భద్రతల నడుమ బతుకుతున్న తమ జీవితాలకు ధోకా లేదన్న భరోసా తో గాలి, నీరు, రాయి, ఇసుక, మన్ను, ఖనిజ సంపద లను విచ్చల విడిగా భావి తరాలకు దక్కకుండా బొక్కేస్తున్నారు. ఇలా  కన్ను మిన్ను గానక బొక్కేస్తున్న దానికి అజీర్ణ రోగాలే ఈ ప్రజా ఉద్యమాలు అని వాళ్ళు అర్థం జేసుకోకుండా పోలీసు సైనిక బలగాలను ఉపయోగించి తమ రోగ నివారణ జేసుకోవచ్చు అని భ్రమ పడుతున్నారు. కాని పెట్టుబడి అనే లాభాపేక్ష కాన్సర్ తమ అన్నవాహికలకు సోకింది అన్న సోయి వాళ్లకు కలుగడం లేదు.
   ప్రైవేట్ విద్యుత్ సంస్తలకు ఇందన సరఫరా ఒప్పందానికి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా మేడలు వంచి మార్కెట్ రేటు కంటే తక్కువకు బొగ్గు సరఫరా చేయండని సాక్షాత్ భారత రాష్ట్ర పతే స్వయంగా ఉత్తర్వులు ఇచ్చిన ఫలితంగా కోల్ ఇండియా సంస్థ 95 వేల కోట్లు నష్టపోయి అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు లాభ పడుతున్నాయి. ఒక టన్ను బొగ్గు బయటికి తీయడానికి ఎంత మానవ శ్రమ అవసరం అవుతుంది అనే దానితో బాటుగా ఆ ఫాజిళ్ ఇందనం మండించడం ద్వారా ఎంత క్షయ , కాన్సర్ కారకాలు వ్యాపిస్తాయో ఆయా వ్యాధుల రేట్ ఆఫ్ ఇంక్రీసేస్ ను చూస్తే అర్థం  అవుతూనె ఉంది. అంతే గాకుండా స్తానికుల అవసరాలు వారి ఆరోగ్యాలను పరిగణన లోకి తీసుకోకుండా విదేశీ అవసరాలకోసం పెట్టుబడి దారుల లాభాల కోసం అపురూపమైన, మల్లి పునరుత్పత్తికి అవకాశం లేనట్టి సహజ వనరులను దోచి పెట్టె వాళ్ళు దొంగలు అవుతార లేక భావి తరాల కోసం కొంచమైన మిగుల్చుదాం, ఇంతగా మానవ హననానికి మేము అవకాశం ఇవ్వం  అని అడ్డుకొనే వాళ్ళు దొంగలు అవుతారా ఆలోచించ వలసిన విషయం.
     ఖతార్ రాజు షేక్ హమదబిన్ ఖలీఫా అల థాని ఏకంగా 747 -8 ఇంటర్ కంటినేన్తల్ అతి పెద్దవిమానం 480 మంది పయనించే విమానాన్ని 25o కోట్లకు కొనుక్కొని అందులో తాను తన పరివారం తో విహార యాత్ర చేస్తాడట. అందులో గుర్రాలు, ఒంటెలు,పెంపుడు  గద్దలు.రెండు రోల్స్ రాయిస్ కార్లు కూడా పెట్టుకొని ఆకాశం లో విహరిస్తాడు. నేనేమి తక్కువ వాన్నా అనీ తన రాజసం చూపుకొవదానికి సౌదీ రాజు ఆల్వా బీద్ బిన్  తలాల్ ఏర్బస్ ఎ 380 డబుల్ డెక్కర్ విమానాన్ని కొనుక్కున్నాడు. ఈ భూమి లో ఇంతటి ఖనిజ సంపద ఇందన సంపద నింపింది వీళ్ళు గాని వీళ్ళ తాత ముత్తాతలు గాని కాదు.ఈ బొగ్గు, ఈ పెట్రోలు ఆ బావులల్లో నింపింది వీళ్ళు గాదు,తవ్వి తీస్తున్నది కూడా వీళ్ళు గాదు. కాని సంపద మాత్రం వీళ్ళదే ఎలా అవుతుందో వాళ్ళ ఆస్తి హక్కు కే తెలుసు..  మన దేశం లో అనిల్ అంభాని కట్టిన భవనాన్ని చూసి తోటి పెట్టుబడి దారు అయిన టాటా నే మనమే సంపదను ఇలా అనుత్పాదక రంగం లో విలాసాలకు ఖర్చు చేస్తే ఇక నక్షలైట్లు పుట్టుకు రమ్మంటే రారా అని కామెంట్ చేసినట్లు ఒక పత్రికలో చదివినం.మన రాజశేకర్ రెడ్డి పుత్రుడు జగన్ లోటస్ పాండ్ ఎన్ని కోట్లు మింగిందో ఎంత రాజసం వెలగబెడుతున్నదో పత్రికల్లో చదివినం, నిన్నటికి నిన్న పోలీస్ డైరెక్టర్ జెనరల్ దినేష్ రెడ్డి, ఐ పి ఎస్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ ల ఒకరి పై ఒకరు అక్రమ సంపాదనల గురించి చేసుకున్న ఆరోపణల పైన నిగ్గు తేల్చండి అని  సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశించిందంటే అక్రమ ఆస్తుల వ్యవహారం అతడు ఒక పెట్టుబడి దారుడా ? ఒక రాజకీయ వేత్తా ? ఒక ఐ ఎ ఎస్ ఆఫీసరా ? ఈ వ్యవస్థ లో అవినీతి అక్రమాలకూ అవకాశం లేకుండా అడ్డుగా నేను విధులు నిర్వహిస్తా నని చెప్పుకొంటున్న పోలీస్ అధికారా ? సర్పంచ్ నుండి ప్రధాన మంత్రి దాకా , గ్రామా పరిపాలనాధికారి నుండి కలెక్టర్ దాక , పోలీస్ కానిస్టేబుల్  నుండి సైన్యాధి పతుల దాకా స్వంత ఆస్తులు పెంచుకోవడానికి ఎలా తండ్లాడు తున్నారో రొజూ పత్రికలల్లో చూస్తున్నాము. కనుక స్వంత ఆస్తికి అవకాశం లేని రాజ్యం కోసం ఆనాడు చానిక్యుడు చెప్పక పోయినా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆలోచనలను స్వాగాతిన్చాకుండా అణిచి వేత పైననే ఆధార పడితే సమాజాలు మరింత సంక్షోభాలల్లో కూరుకు పోయి ఈ భూ గ్రహం మీద మానవ మనుగడే ప్రశ్నార్థకం కాగలదు.
పెంటయ్య. వీరగొని.

Friday, April 6, 2012

ఆత్మహత్యలు ఆపుదాం.

ఆత్మా హత్యలు ఆపుదాం!
ఎందరు ఎన్ని తీర్ల విజ్ఞప్తులు చేసినా ఆత్మా హత్యలు ఆగడం లేదు. అసలు మరి ఈ ఆత్మా హత్యలు ఎందులకు జరుగుతున్నాయి. ఆ
పిల్లల మానసిక స్తాయి అలా ఎందుకు నిరాశావాదం వైపు పోతున్నదో ఆలోచించాల్సిన విషయం. తెల్నగాన లో ఉన్న రాజకీయ నాయకుల
స్వార్థ పూరిత వైఖరి కారణంగానే తెలంగాణా రావడం లేదు అన్న విషయం నిర్వివాదం.
ఇక్కడ మనం ఒక్కొక్క రాజకీయ పార్టీల అప్రజాస్వామిక విధానాల గురించి చూస్తే , తెలంగాణాకు తోలి శత్రువు కాంగ్రెస్. 1956 లో ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణా ప్రజల అభీష్టానికి మరియు ఫసల్ అలీ కమిషన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర లో విలీనం కావడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టి ప్రభుత్వమే కదా కారణం. అలాగే 1969 ఉద్యమాన్ని అణిచి వేసిన బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం గాని లేదా తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తెలంగాణా గడ్డ పైన చెడబుట్టిన చెన్నారెడ్డి గాని కాంగ్రెస్ పార్టి గన్నేరు పలుకుల గంధాలే కదా? బూర్గుల రామకృష్ణ రావు, సంజీవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వెంగల రావు , నుండి మొదలుకొని నిన్నటి రాజశేకర్ రెడ్డి రోశయ్య, ఇప్పటి కిరణ్ కుమార్ దాక అందరు తెలంగాణా రాష్ట్రం రాకుండా అడ్డుపడిన వారే. ఆ పార్టీకే చెందినా కొందరు ఎంపి ఏమ్మేల్లె లు తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని నమ్మబలుకు తుంటే ఇంకా మనయువకులు నమ్ముతూ వాళ్లకు జై కొడుతున్నారు.
ఇక తెలుగు దేశం పార్టి, అది మొదటి నుండే అంటే ఎన్టి రామారావు నుండే తెలంగాణాకు వ్యతిరేకంగానే ఉన్నది. తెలంగాణా రీజినల్ కమిటి రద్దు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు, ఉద్యోగ నియామకాలల్లో వివక్షత, తెలుగు జాతిమనది చక్కగా వెలుగు జాతి మనది అంటూ పాటలు పాడి గోదావరి కృష్ణ డేవలోప్మెంట్ ఫోరం కు రామోజురావు ను నాయకునిగా పెట్టి తెలంగాణా నీళ్ళను మద్రాస్ దాక తరలించుకు పోవడానికి పతక రచన చేసిన తెలంగాణా వ్యతిరేకి. ఆ తాను ముక్క చెంద్రబాబు ఏకంగా 2004 ఎన్నికల్లో తెలంగాణా విడిపోవడానికి వీల్లేదు, సమైక్యాంధ్ర నా నినాదం అన్న మానిఫెస్టో తో ఎన్నికల బరిలో నిలిచిన చరిత్ర టిడిపిది. 9 డిసెంబెర్ 2009 నాడు వచ్చినట్టే వచ్చి పోయిన తెలంగాణా రాష్ట్రాన్ని అడ్డుకున్నది టిడిపి. మొదటి నుండి కూడా అది తెలంగాణాకు వ్యతిరేకమే కనుక ఇవ్వాళ కొత్తగా అది తెలంగాణాకు ద్రోహం చేసేది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఏమి చెప్పిన తెలంగాణా ప్రజలు నమ్మే స్తితిలో లేరు. ఆ మేరకు ఈ రెండు పార్టీలు ప్రజల్లో తమ ప్రాభవాన్ని కోల్పోయిన విషయం అంతా గమనిస్తూనే ఉన్నారు.
ఇక తెలంగాణా కోసమే పుట్టినం అని చెప్పుకుంటున్న టి, ఆర్ ఎస్ కూడా తన ఓట్ల సంఖ్యా సీట్ల సంఖ్యా పెంచుకునే కార్యక్రమం దప్ప తనకు తానుగా పెద్దగా చేసింది ఏమి లేదు. 2004 ,2009 , జగిత్యాల్ ఉప ఎన్నికలల్లో మీరు మాకు ఒత్లువేసి గెలిపించండి చుక్క రక్తం చిందకుండా తెలంగాణా తెస్తానని చెప్పింది. అన్నిసార్లు ప్రజలు టి,ఆర్ ఎస్ ను ఆదరించారు.నిన్నటికి నిన్న ఒక్క మహాబుబు నగర్ దప్ప అన్ని చోట్ల టి, ఆర్ ,ఎస్ ను గెలిపించినారు.కాని తెలంగాణా రానే లేదు. పైగా 2014 లో అన్ని సీట్లు గెలిపిస్తే తెలంగాణా వచ్చితీరుతుంది
అనే మాయ మాటలు చెబుతున్నారు. వచ్చే ఉగాది, వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే బక్రీద్ తెలంగాణలోనే అని అబద్దపు మాటలు జెప్పి బిడ్డలను ఆశ పెడుతున్నారు. ఒత్లంటే ఓట్లు వేస్తున్నారు, పండుగల వెనుక పండుగలు పోతున్నాయి. కాని తెల్నగా మాత్రం రావడం లేదు.
కాంగ్రెస్ నాయకులే తెలంగాణకు అడ్డంకి అని ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అంటడు. కిరణ్ కుమార్ అది కేంద్రం చుసుకున్తున్నది అంటాడు.గండ్ర వెంకట్ రామనా రెడ్డికి దిమ్మ తిరిగి ఇప్పుడు తెల్నగాన ఇచ్చేది మేమే అంటాడు. మేము తెలంగాను వ్యతిరేకం కాదు అని బాబు సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఇంకా ఇక్కడి నర్సింహులు నానా బూతులు మాట్లాడు తాడు, 4 కోట్ల మంది నీ విధానం ఎండని నిలదీస్తే పట్టించుకోదతకాని ప్రధాన మంత్రి, హోం మంత్ర అడిగేతే లేఖ ఇస్తాం అంటడు ఎర్రబల్లి.
ఇక్కడ ఎవ్వరు తెలంగాణాకు వ్యతిరేకం కాదు అంటరు తెలంగాణా మరి ఎందుకు రావడం లేదో అర్థం గాక అమాయకులైన బిడ్డలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. కాని ఇక్కడే యువత జాగ్రత్తగా ఆలోచించాలి. గ్లోబలైజేషన్ పుణ్యాన ఇవ్వాళ అంతా వ్యాపారమే. డబ్బు సంపాదనే! సంపద ఇచ్చే సౌఖ్యలకు మొహం వాచిపోయిన మొఖాలే! అందునా రాజకీయ పార్టీలు మరీ దారుణం.ఘర్షణ లేకుండా ఎక్కడ మార్పు జరిగిన దాఖలా లేదు. శాంతియుతంగా గాది మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడన్నది పచ్చి అబద్దం. ఒక భగత్ సింగ్, ఒక సుఖ దేవ్, ఒక ఆజాద్ చెంద్ర శేకర్, 1857 సిపాయిల తిరుగుబాటు నుండి చౌరా చౌరీ సంఘటనలు, జలియన్ వాళ బాఘ్ దురంతాల దాకా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తర్వాతనే ఆంగ్లేయులు భారత దేశాన్ని విడువలేక విడువలేక విడిచిపోయిన విషయాలను మనం చరిత్రలో చదువుకున్నాము. ఇక్కడ 4 కోట్ల తెలంగాణా ప్రజల విముక్తి పోరాటం జరుగుతున్నది. ఇంత కాలం మంది అవకాశాలను , మంది సొమ్మును తిన మరిగిన .శక్తులు అంత సులభంగా తెలంగాణను వదిలి పొవాడానికి అంగీకరించవు.
అందుకని ఇది చదువుతున్న విద్యార్తులార, మేధావులారా, ముందుగా మనమంతా తెలంగాణా వ్యతిరేక శక్తుల తో పోరాటానికి సిద్ధ పడుదాం. మన చైతన్యాన్ని మన చుట్టుపక్కల పంచుదాం, కుత్తుకలకు ఉరితాల్ల్లు బిగించుకోవడం కాదు శత్రువుల ఆర్ధిక మూలాలను కత్తరిద్దాం.
పెంటయ్య,వీరగిని.

Reply

Forward

Monday, March 26, 2012

ప్రభుత్వమా ఎంత దయలేని దానవే !
గోదావరి నది పైన కరీంనగర్ జిల్లాలో రామగుండము మండలం ఎల్లంపల్లి వద్ద శ్రీపాద ప్రాజెక్ట్ పేరుతొ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇది తెలంగాణా లో కట్టబడుతున్నది కనుక తెలంగాణా ప్రజలకు మేలు చేసేదని భ్రమ పడు తున్నారు కొందరు. ఈ ప్రాజెక్ట్ 20 టియంసి ల నీళ్ళ సామర్థ్యం తో నిర్మిస్తున్నారు.
7 . 5 టియంసి ల నీళ్ళు రామగుండం ఎన్టిపిసి కి పోతాయి. మన నీళ్ళు మన బొగ్గు తో ఇక్కడ తయారౌతున్న 2600 మేఘవాట్ల విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్
వాటా 700 మేఘావాట్లు అయితే తెలంగాణాకు దక్కేది మాత్రం కేవలం 150 టిఎంసి లే. ఇక మంథని కి ఒక 2 .5 టిఎంసి లు ఇస్తుంటే మిగిలన 10 టిఎంసిల
నీల్లు మొత్తంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే గోదావరికి ఉపనది అయిన మంజీరా నుండి 30 టిఎంసిల నీళ్ళు హైదరాబాద్ కు ఎత్తుకేల్తూ మెదక్ , నిజామాబాద్ జిల్లాల రైతులను ఎండబెడుతున్నారు. అంతర్జాతీయ నది నీటి ఒప్పందం ప్రకారం ఒక నది పరీవాహక ప్రాంతానికి మరొక నది నీళ్ళు తరలించకూడదు.. కాని ఇక్కడ గొదావరినదీ జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి నిరాటంకంగా తీసుకొని పోతున్నారు. ప్రస్తుతం మనకు ఈ 10 టియంసిలే
కనిపిస్తున్నాయి కాని రేపు మొత్తంగా 20 టిఎంసి లకు 20 టిఎంసి లు ఎత్తుకొని పోతారు.
ఎల్లంపల్లి నుండి హైదరాబాదుకు 215 కిలోమీటర్ల దూరం చాలా పెద్దపెద్ద పైపుల ద్వారా లోయర్ మానేరు ద్యాములో ఉన్నన్ని తమకు ఒక నీటి చుక్క ఇవ్వకుండా తరలించుక పోతూ ఉంటె ఈ ప్రజలు చూస్తూ ఉండాల్సిందే. ఈ ప్రాజెక్ట్ వలన రామగుండం మండలానికి చెందిన ముర్మురు, ఎల్లం పల్లి, పోట్యాల,
మద్దిర్యాల, ఉండెడ, కొత్తపేట, వెమునూరు, చేగ్యాం, రామునూరు, ముత్తునూరు, మొక్కట్రావుపెట్ మరియు వెల్గతోఉకు కు చెందిన నాటి శాతవాహనుల
రాజధాని అయిన కోటిలింగాల ముంపుకు గురిఅవుతాయి.వీరికి చెందిన దాదాపు 10 వేల ఎకరాల భూమి మరో రెండు వేల నివాస గృహాలు లాగేసు కుంటున్నారు.అలాగే ఎలాంటి భూమి జాగా లేకపోయినా రెక్కల కష్టం జేసుఒని బతుకుతున్న వివిధ కుల వృత్తుల వారికి వారు ఎవరిపైనా అయితే ఆధార
పడి జీవేస్తున్నారో వాళ్ళను నిరాశ్రయులను చేయడం ద్వారా వీళ్ళూ జీవనోపాధి కోల్పోతున్నారు. తాటి, ఈత వనాలు, మామిడి, సీతాఫలాల, చెట్లను చంపెస్తున్నందున గౌడ, తెనుగు, ముదిరాజ్, గొల్ల కుర్మా కులాల వృత్తుల వాళ్ళు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే వీరందరికీ పునారావాసం
కల్పించే సమయం లో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో జివో 68 లో చెప్పింది. ప్రాజెక్ట్ వలన ఆయా ప్రాంతాల ప్రజల సమస్త జీవనోపాధిని లాగేసు కుంటున్నాము
అనే సానుభూతి మాటలు చెబుతూనే ఆచరణలో తిరకాసు పెడుతున్నది.
ఈ గ్రామాలన్నీ సింగరేణి బొగ్గు గనులకు సమీపంగా ఉన్నాయి.బతుకు దెరువు కోసం కొందరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్లకు ఆయా గ్రామాలల్లో ఇండ్లు వ్యవసాయ భూములు ఉన్నాయ్. తాత్కాలికంగా పనిజేసే చోట ఉన్నప్పటికిని వాళ్ళ భూముల సేద్యం జేసుకోవడానికి తలిదండ్రులను చూసుకొవాదానికి వస్తుపొతూ ఉంటారు.అయితే పెద్దపల్లి రెవెన్యు అధికారులు మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదని పునరావాస లబ్ది చెల్లించ నిరాకరిస్తున్నారు.
వాళ్ళ భూములు ,వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సమస్త బతుకు దెరువు మరేవరికోసమో త్యాగం చేయండని బలవంతగా నిరాశ్రయులను చేస్తున్నారు. వాళ్ళ తాత
ముత్తాతల నుండి వాళ్లకు అన్నం బెడుతున్న భూమి, పెండ్లిళ్ళు పేరంటాలు చేస్తున్న భూమి, చస్తే వాళ్ళ శవాలను బొందబెట్టుకోవడానికి కడుపు తెరుస్తున్న
నేల తల్లి. ఇప్పటికి ఉద్యోగ రీత్యా ఎక్కడ ఉన్నా ఎక్కడ చనిపోయినా శవాలని తీసుక వచ్చి ఆయా గామాలల్లోనే ఖననం చేసుకుంటారు. అయినా మీరు శాశ్వత నివాసస్తులు కారు మీకు పునరావాస లబ్ది లభించదు అంటూ మిక్కిలి నిర్దయగా వ్యవహరిస్తున్నారు రెవెన్యు అధికారులు.
వాళ్ళ పేరుతొ రెవెన్యు రేకార్డులల్లో భూములు ఉంటాయి,పంచాయితీ రికార్డులల్లో ఇండ్లు ఉంటాయి, ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటాయి, రేషన్ కార్డులు ఉంటాయి అయినా మీరు పర్మనెంటు రెసిడెంట్స్ కాదంటున్నారు. ఒక వ్యక్తీ ఆస్తి ఎక్కడైనా కలిగి ఉండడం ప్రాథమికమైన హక్కు, అలాగే జీవించి ఉండడం కూడా
ప్రాథమిక హక్కే! అయినపుడు ఈ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కులు అయిన ఆస్తి హక్కు, జీవించే హక్కులను కాల రాయడం లేదా? ప్రజల ఉప్పుదిని
బ్రతుకుతున్న ఈ ప్రభుత్వానికి , అధికారులకు ప్రజల హక్కులను కాపాడాలన్న స్పృహ లేకుండా పోతున్నది.
వందల ఏండ్ల నుండి ఈ గ్రామాలు ఉన్నాయి, గ్రామాలను ఒరుసుకొని గోదావరి నది పారుతున్నది.అయిన ఈ గ్రామాలకు ఒక్కనాడు గోదావరి నీళ్ళ రుచిని
ప్రభుత్వాలు చూపించ లేదు. ప్రజలు వాళ్లకు వాళ్ళు కలుగ జేసుకున్న నీటి వనరులు దప్ప ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాల రాశి ఏమి లేదు. వందల సంవస్తరాల నుండి కలో గంజో దాగి కలిసి మెలిసి జీవేస్తున్న ప్రజలను ఒక్క కలం పోటుతో ఉళ్లు విడిచి వెళ్లి పోమ్మంటుంటే తుపాకి దెబ్బకు పక్షుల గుంపు చెదిరిపోయినట్టు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ప్రజలకు సానిభుతితో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్నారు.
ఈ గ్రామాలన్నీ ఒక నాడు ప్రజాపోరాటాల ఒరవడిలో ఎరుపెక్కిన చైతన్య వంతమైన గ్రామాలే. మా కాలి కింది దుమ్ము లాంటి వారురా మీరు అంటే ఆ దుమ్మే
వారి కండ్లల్లో ఎగిసి పడిన మట్టి ఇది. ప్రజా రాజకీయాలు నేర్పిన ఎందరో విప్లవ వీరులు నడయాడిన నేల ఇది. అన్నలె గనుక ఉండి ఉంటె మనకు ఈ దుస్తితి
దాపురించి ఉండి ఉండేదా అనుకొంటున్నారు వాళ్ళ సామూహ చర్చల్లో, ఓ ప్రభుత్వమా! సమస్య నీవే సృస్తిస్తావు, పరిష్కారం కోసం వస్తే నీకు దిక్కున్న చోట
చెప్పుకోమని వెక్కిరిస్తావు, ప్రజలను పోరాటాల వైపు ఎగదోస్తావు, ఆ తర్వాత ఆ ప్రజల పైననే తుపాకి ఎక్కుబెడుతావు.
తన ప్రజలను ఆ ప్రజల ప్రభుత్వమే కాల్చి చంపడం ప్రజాస్వామిక పాలన కాదు అని సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించినా ఈ అధికారులకు తలకేక్కనపుడు
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ వేదుక్కోవాలో ఆలోచించే వైపు ప్రభుత్వాలే నేట్టివేస్తున్నాయి .
పెంటయ్య. వీరగొని.