Saturday, February 9, 2013


ఎందుకు చని పోతున్నారు? నా మరణమే చివరి మరణం కావాలని నా చావు తో నైనా కేంద్రం తెలంగాణా ఇవ్వాలనే దింపుడు గల్లం ఆశ తో నిరాశోపహతులు ఐన యువత పిట్టల్లా రాలి పడుతున్నారు.భవిష్యత్ పైన గుండె నిండా విశ్వాసం తో కన్నవాల్లకు కడ దాకా తోడూ నీడై నిలువాల్సిన బాధ్యత మరిచి ఇంత పిరికిగా ఓట్ల రాజకీయ యజ్ఞానికి సమిధవై కాలిపోతున్నావు.కాని బిడ్డలారా ! ఒక్క సారి ఆలోచించండి. కాకి గొట్ట కుండ, గద్ద గొట్ట కుండ, జరమోచ్చినా ఏకచ్చినా కండ్లల్లో వత్తులు వేసుకొని నిద్రాహారాలు మాని బొడ్డు కోసినకాన్నుంచి తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు కడుపార దాగించి నీ ఉచ్చ, పియ్యి ఎత్తి పోసి"మది రోయక తానెన్నొ ఊడి గాలు" జేసి ఇప్పటి దాక నీకు బట్ట,బాతా ఇచ్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే కనీసం సావుదలకైనా గంటేడు గంజి పొయ్యక పోతవా అనుకొంటుంటే నువ్ జేసిన పనేంది?సచ్చే దాకా కడుపుల పేగులు నోట్లేకు వచ్చేటట్టు తల్సుకొని తల్సుకోని ఏడ్చే తట్టు దుఃఖం బెట్టి పోతావా?ఇదేనా నీ కన్న తల్లి ఋణం దీర్చుకునుడు.అయిన బట్ట గట్ట కుండా ,అయిన తిండి దినకుండా కడుపు గట్టుకోని పైసా పైసా కూడ బెట్టి నీ బట్టకు, పొట్టకు,సదువుకు సక్కబెడితే నువ్వా తండ్రికి ఇచ్చిన బహుమానం ఇదా?సచ్చే దాక ఏడ్చి ఏడ్చి సావు మని శాసించి నువ్వు నడుమంత్రపు సావుజస్తే అది త్యాగామంటారా?ఇది దుర్మార్గం. ఎవని కోసం జస్తున్నవో ఒక్కసారి తేరి పార జుడు.భరద్వాజ తన చివరి మెసేజ్ లో వాన్ని చెప్పుతో కొట్టండి అంటే నువ్వేమో కొత్త చేతగాక చచ్చి ఉరుకొంటే వాడెందుకు ఆ పనిజేస్తాడు?తెలంగాణా ఉద్యమకారులను జుడు,ఎవడన్న చస్తే డప్ప లేస్తలేరు, ఆ ఒక్క నాడు నా నా యాగిజేసి తెల్లరంగ నే ఎవనింట్ల వాడు పంటున్నాడు.ఎహే! ఇగ తెలంగాణా వస్తనే ఉంటె ఇంకా ఉద్యమం ఎందుకని ఒకడు ఆంటాడు.ఆయనను కానకుంట కాంగానే లెండ్రి,లెండ్రి యుద్ద్డం జేస్తమంటాడు.అసలు ఉద్యమం ఎవరి కోసం జరుగాలే, ఎవరి కోసం జరుగుతున్నది? యువత! ఒక్క సారి నిదానంగా నిలబడి ఆలోచించు.ఏమిజరుగుతున్నది,ఎవరికోసం మీ శరీరాలు కాలిపోతుంటే, కండలు రాలిపోతుంటే మంటల్ల బడే టందుకు ఉరుకుతున్నరు?కాలి కూలిన మీ భయంకరమైన శవాలను అపురూపంగా ఆలింగనం జేసుకున్న మీ అమ్మా నాన్నలు, ఆలుబిడ్డలు,ఎంత హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారో చూడు.ప్రతి సంఘటన మన అనుభవం లోకే రావాల్సిన అవసరం లేదు.ఎదుటి వాళ్ళ అనుభవాలను చూసి మనకూ అదే పరిస్తితి వస్తుందని భావించాలే.కొందరికి వాళ్ళ తెలంగాణా వాళ్ళకు ఇప్పటికే వచ్చింది.మరి కొందరికి వస్తది గావచ్చు.కాని మీ అయ్యవ్వకు నువ్వు రావు గాదు బిడ్డ.నీ ఆలుబిడ్డలకు నీ అండ లేక ఆగం అయి పోతరు గాదు కొడుకా? నిజమే! చావడానికి కూడా చాలా ధైర్యమే కావాలి.అంత ధైర్యం,అంత తెగింపు ఉన్న యువత దాన్ని దేని కోసం ఉపయోగించాలి? సర్వ దోపిడీ పీడనల విముక్తి కోసం ఉపయోగ పడితే నీ జాతి గర్విస్తుంది. ఇలా పిరికి పందలా నది యుద్ధం నుండి ఉత్తరునిలా పరిగెత్తి పొతే నిందిస్తారే గాని స్తుతించరు. పోరాడ చేతగాక నడుమనే ఎత్తేసి పోయినోని పిల్లలని నీ పిల్లలను అవహేళన జేసినప్పుడు నీ వలన వాల్లెంతగా కుమిలి పోతారో ఒక సారి ఆలోచించు.మీ చావులేమైనా భగత్ సింగ్ కొమురం భీమ్ లను యాదికి దెచ్చే సందర్భాలా? సరే నీవనుకున్నట్టే తెలంగాణా నీ చావు తర్వాత వస్తుందనే అనుకుందాం.వస్తే ఏమౌతుంది?ఓ తెలంగాణ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కాబోలు, మంత్రులు, ఎంపిలు,ఏమ్మేల్లెలు తెలంగాణా వాళ్ళే ఉంటారు.కొన్ని ఉద్యోగాలు వస్తాయిగావచ్చు. రాజకీయ నాయకులకు నిజంగా నిజాయితీ ఉంటె కొన్ని ప్రాజెక్టులు కట్టి సాగు నీటి సౌకర్యం కల్పిస్తారు కాబోలు, కాని లక్షలాది ఎకరాల్లో కిలోమీటర్ల కొద్దీ భూగర్భాన్ని పెల్లగిస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఆగిపోతాయా? లక్షలాది సమ్వస్తరాల నుండి పంచ భూతాలను సమతుల్యం తో ఉంచుతున్న గుట్టలు,చెట్లు, జీవ వైవిధ్య విధ్వంసాన్ని ఆపుతార? కుప్పలు తెప్పలుగా విస్తరించి విరాజిల్లు తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలను మూసివెసి సరిపోయినాన్ని ప్రభుత్వ పాఠశాలలు,ఆసుపత్రులు నెలకొల్పుతారా? అంతెందుకు ఉన్న భూమి నైనా సమానంగా అందరికి పంచుతారా? తెలంగాణా వనరులద్వారా సమకూరు తున్న సంపద అయినా అందరికి సమానంగా పంచుతారా? ఇప్పటికే వెయ్యి మంది బిడ్డల ఉడుకుడుకు పాణాలు బోయినా గూడా మన తెలంగాణా లీడర్లు కనీసం వాళ్ళ పదవులు వదులు కోవడానికి కూడా సిద్ధపడ లేదే! అలాంటి పాషాణ హృదయాలు నీ ఒక్క బక్క ప్రాణం తో కరుగుతాయనుకొంటే అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. తెలంగాణా సమ శీతోష్ణ ప్రాంతం.ఇక్కడి సారవంత మైన భూముల్లొ అరొక్క తీరు పూలు, పండ్లు,పంటలు పండుతాయి. నేరుగా అమెరికా యూరోప్ దేశాలకు ఎగుమతి జేసుకోనేతందుకు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. బొగ్గు,నీళ్ళు,గ్రానైట్,హేమటైట్ ,లాంటి అనేకమైన విలువైన ఖనిజ సంపద ఉంది.ఇదంతా సీమాంధ్ర పెట్టుబడి దారుల ద్వారా మల్టినేషనల్ కంపనీలకు కట్టబెట్టే ప్రయత్నం లో భారత పాలక వర్గాలు పోటీబడుతున్నాయి. అందుకే తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం అనే ఒక రాజ్యాంగ బద్ద మైన ప్రజాస్వామిక హక్కునే కాల రాస్తే ఇక ఏ రకమైన హక్కుల ఉద్యమాన్నయినా ఇలాగె అణిచి వేస్తారన్న భయం లో ప్రజలు వనరుల రక్షణకో, పర్యావరణాన్ని కాపాడమనో,లేక మా భూములు మాకు కావాలనో సామాన్య ప్రజలు ఉద్యమించ కుండా చూడ వచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలవి భ్రమలు మాత్రమె నని అణిచి వేస్తే ప్రజలు ఉవ్వెత్తున ఎగిసి పడి ప్రభుత్వాలను ముంచి వేస్తారన్న వాస్తవాలు ప్రభుత్వాలకు అర్థం గావాలంటే బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అందుకని చావడానికి సైతం సిద్ధ పడి బలవన్మరణం చెందుతున్న వాళ్ళు ధైర్యాన్ని కూడ గట్టుకొని చావకుండా నిలిచి జరుగుతున్న సర్వ దోపిడీ పీడనల అసలు మూలాల పైన యుద్ధం జేయవలసిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది.మీవంతు బాధ్యత ఎవరో నిర్వహిస్తారని భ్రమ పడి ఈ లోకాన్ని విడువడం విజ్ఞత అనిపించుకోదు. పెంటయ్య.వీరగొని. కరీంనగర్.

Sunday, February 3, 2013


ఆరుద్ర పురుగులు. మానేటి జలాశయమా - మది నిలిచిన జ్ఞాపకమా! మబ్బసలె కానరాని - మహా గడ్డు రోజులల్లా మానేరు పారేటట్టు - మడులన్ని నిండే టట్టు మహా కుంభ వృష్టి కురియు పుడమంత తడిసి ముద్దయి - చిగురించు చెట్టు చేను అని మరి మరి జెప్పిండ్రా - ఎన్నెల్లో అన్నలంతా అయితాదె బాపు అంటే -అనుమాన మెందు కనిరి. ఆ ఆశ తోనే యువత - ఆలోచన పరులంతా అడుగడుగు కలుపుకొని - కడలోలె కదిలినారు శ్రీకాకులిజయ నగరం - జైతాల జైత్ర యాత్ర కరినగరు కదన రంగం - పడిలేసే పాలమూరు ప్రజా బిడ్డ లెంత మందో - ప్రాణాలు ఇచ్చినారు తుఫాను రాక పాయె - కరువేమో పోకపాయే రాబందు లన్ని జేరే - రాకాసి పాలనాయే దూడల మూతి గట్టి - ఆవుల పాలు పిండి కొండాలు పిండిజేసి - గ్రానైట్ క్వారీల్ దవ్వి ఓపెను కాస్టులంటూ - భూమంత దవ్వి పోసీ ప్రాజెక్టులంటూ గట్టి - నీళ్ళన్ని దొంగిలించి నిను నిండ ముంచినొల్లను - నిలువునా పాతరేస్తం అధికారమివ్వు మంటూ - నీ ఓటు దొబ్బి నోడు అధికార మొచ్చినంక - అవతలి వైపు జేరే దిగ్భ్రాంతి నొంది నోళ్ళు - లోకాన్ని జదువనోల్లు మల మలా మాడినారు - వురి కొయ్య నురికి నారు. అవివేకమైన యువతా - అది పిరికీ తనము కొడుకా నిను గన్న పేగు కోసి - కారమూ జల్లి పోతవ దుర్మార్గ మాత్రు ద్రోహి - ఇదార త్యాగమంటే తొడగొట్టి దండు గట్టు - అందరిని కూడ గట్టు బోధనా మొదలుబెట్టు - దోపిడీ పీడన లేని ప్రజా రాజ్యమోచ్చేదాక - కడ దాక బరిలే నిలువు అన్నార్హులలిసినోల్లు - అంగలార్సు డాపుండయ్య రోకండ్లు వలిగే టట్టు - రోహిణి ఎండలుంటే కప్పలు,ఎర్రలన్ని - కనిపించ కుండ పొతయ్ ఆయిటీ బూనినంక - వానేట్ల గురిస్తట్ల తల దాసుకున్న కప్పల్ - తెప్పలుగ వచ్చి చేరు ఎండ్రి కాయల్ మండ్ర గబ్బల్ - ఎదురెక్కి వస్తయన్న ఆరుద్ర పురుగు లొచ్చు - అడివంత అండగుండు . వీరగొని పెంటయ్య. కరీంనగర్ .

Saturday, December 15, 2012


కాంగ్రెస్గ్రె వాళ్ళ అఖిల పక్షం అసలు రంగు సామాన్య జనులందరికి ఇప్పటికే తెలిసి పోయింది. కాని కాంగ్రెస్ ఎంపి లకు,ఏమ్మేల్లెలకు,ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాన్ని పూర్వ పక్షం చేయడానికి కాంగ్రెస్ కుటిలత్వానికి పుట్టిన రంకు బిడ్డ లాంటి మంత్రి పదవులు చేపట్టిన పచ్చి స్వార్థ పరులకు మాత్రం ఇంకా జ్ఞానోదయం కావడం లేదు.2014 దాకా ఏమీ తేలదన్న భరోసా కలిగిన బాబు, జగన్ పార్టీల నేతలు మాత్రం మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదనే ఒక దొంగ నాటకం ఆడుతున్నారు. అరే మీరు తెలంగాణా కు వ్యతిరేకం గాకుంటే మా తెలంగాణా మాకు వస్తది కదా? అప్పుడు ఇక మీరు దేనికి ముఖ్య మంత్రి అవుతారు. ఇక్కడి ప్రజల రాజకీయాలతో మీకు సంభంధం ఏమిటి? మీ కాళ్ళకు పుండ్లు బడుతుంటే,కీళ్ళు సడులుతుంటే, మేం ఎంత వద్దని ఛీ కొట్టినా ,ఎందుకు మా వెంట బడి తిరుగుతుండ్రొ అర్థం చేసుకో లేనంతటి అమాయకులం కాదుకదా? ఎన్నికల ఒక్క రోజు నా వెనుక ఉండండి ఆ తర్వాత 5 ఏండ్లు మీ వెనుక బడుత అని చెప్పుతనే ఉంటె ఇంకా 6 ఏండ్ల దాకా తెలంగాణా ఆశ వదులు కొండని చెప్పుతుంటే మీ మోచేతి నీళ్ళకు ఆశ పడి బతుకుతున్న మా తెలంగాణా నాయకులను మరియు ఆంధ్ర పార్టీల నాయకత్వాన్ని మా తెలంగాణా మేలు కోరే వారని ఎట్లా నమ్ము మంటారు? ఇక తెలంగాణా కోసమే మా తన్. మన్. ధన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా, చెంద్ర బాబు విసుర్తున్న సవాలు " తెలంగాణా వస్తే మీ దుకాణం బంద్ ".అన్న దానికి సమర్థవంతంగా జవాబు ఇవ్వడం లేదు. 2000 సంవస్తరం లో స్తానిక సంస్తల ఎన్నికల్లో అంచనాలకు మించి మండలాధ్యక్షులను,జిల్లా పరిషద్ చేర్మన్ లను ప్రజలు గెలిపించినారు,2004 జన్రల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్ర తెలిసి కుడా పొత్తు పెట్టుకొంటే వాళ్ళను, మిమ్ములను కలిపి అధికారం లోకి తీసుక వచ్చినారు ప్రజలు, మీ రాజకీయ పరపతి పలుచ బడ్డప్పుడల్లా ఓట్లేసి ఓట్లేసి అలసి పోయినారు గాని నీ సంగతేందని అడుగలేదు. ప్రజలు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి మిలియన్ మార్చ్ తలబెడితే వద్దంటిరి, మహత్తర పోరాట రూపం సకల జనుల సమ్మె ఒక వైపు తీవ్రాతి తీవ్రంగా జరుగుతుంటే నాయకత్వం అంతా కట్టగాట్టుకొని డిల్లీ కి వెళ్ళిపోయి శత్రువు వ్యూహానికి మన కోట ద్వారాలన్ని అప్పగించిపోతిరి. అధినాయకుడు హైదరాబాద్ రాలి కి హాజరు కాడు, వచ్చిన వాళ్ళు సైతం మమ్ములను సంప్రదించకుండానే నెక్లెస్ రోడ్ లో భైఠాయిమ్పు కొనసాగిస్తారా అంటూ అలిగి పోతిరి. ఇప్పుడేమో ఎన్నికల జ్వరం పట్టుకొని 100 అసెంబ్లీ,17 పార్లమెంటు సీట్లు గెలువాలని పిలుపు యివ్వబడితిరి. అంటే సీమాంధ్ర పార్టీలు అంటున్నట్లు గానే అందరూ 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం తేలదని స్పష్టం జేస్తున్నారు గదా?2014 తర్వాత మల్లి 2019. ఇదేనా ఉద్యమ పార్టీల ముందు చూపు? వాటి వ్యూహం? ఇప్పట్కి రాజకీయ పార్టీలు తక్కువ ఉన్నయట ఇక ఉస్మానియా విద్యార్థులు ఒక రాజకీయ పార్టి బెడుతారట. సరే వాళ్ళను వద్దనే టందుకు మనం ఎవరం గని. ఎన్నికలపార్టీల తోటి సంబంధం లేదని చెప్పుకొంటున్న ప్రజసంగాల తీరు మరొతీరుగ ఉన్నది. దొరల తెలంగాణా కాదు సామాజిక తెలంగాణా అనేది ఒకరు.ఈ సామాజిక తెలంగాణా అనే విశేషణం పాపం సినిమా నటుడు చిరంజీవి వచ్చిన తర్వాత ఒక రూఢ్యర్థమ్ తో పిలువ బడుతున్నది. ఉత్తర ప్రదేశ లో దళిత బహుజన పార్టీ మాయావతి పుణ్యాన బాగా బదునాం అయిన తర్వాత ఇక్కడ మన తెలంగాణా లో సామాజిక తెలంగాణా అన్న మాట ప్రజాస్వామిక తెలంగాణను పక్కకు జరిపింది. వర్గ స్పృహ లేకుండా వెనుక బడిన కులాల ప్రాతిపదికన అధికారం సాధించుకున్నా ఆ అధికారం అగ్ర కులాలకు అగ్ర వర్గాలకు ఊడిగమ్ చేయడానికి దప్ప మరి దేనికి పనికి రాదన్న విషయం మాయావతి నుండి మౌర్య సామ్రాజ్యాధిపతి చెంద్ర గుప్తుని దాక, ఆ తర్వాత శాతవాహనులదాక చరిత్ర సమస్తం యురేషియా ఆర్యులైన బ్రాహ్మణ సేవలో తరించిన నగ్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గొల్ల కులానికి చెందిన ముర కుమారుడు చంద్రగుప్త మౌర్య చక్రవర్తి క్రీ||పూ|| 317 నుండి 298 దాక ప్రపంచ విజేత గ్రీకు వీరుడైన అల్లెగ్జండర్ చక్రవర్తి అంతే వాసుల నుండి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని చాణిక్యుని శిష్యుడు గా బ్రాహ్మణ వాదానికే సేవజేసిండు. కుమ్మరి కులానికి చెందిన శాత వాహనులు కరీంనగర్ జిల్లా కోటిలింగాల రాజదానిగాజేసుకొని క్రీ|| పూ|| 230 నుండి క్రీ|| శ|| 220 వరకు 500 ఏండ్లు పాలించినా కూడా ఇప్పుడు ఎక్కడ కుమ్మరులు పాలక వర్గాలుగా ఉన్న దాఖలా లేదు. పల్లవులు , చాళుక్యులు కుడా శూద్ర కులాలకు చెందిన వారే.క్రీ|| శ|| 200 నుండి 900 వరకు 700 ఏండ్లు పాలించినా కుడా ఇప్పుడు శూద్రులు రాజ్యాధికారం కోసం పోరాడాక తప్పడం లేదు.భారత దేశపు స్వర్ణయుగం అయిన గుప్తులు శుద్రులే.అయిన వీరి కాలం లో బ్రహ్మనిజానికి వ్యతిరేకంగా 4 వ శతాబ్దంలో భక్తీ ఉద్యమాలు వచ్చినాయి.చేర,చోర రాజులు కుడా సత్ శుద్ర కులానికి చెందిన రాజులే. కాకతీయులు కుర్మ కులం వాళ్ళు,క్రీ||శ|| 1083 నుండి 1323 వరకు దాదాపు 250 సంవస్తరాలు పాలించి నా కూడా ఇప్పుడు కుర్మ కులం ఎంత వెనుకబడి ఉన్నదో చూస్తున్నాము. మొన్న మొన్నటి శివాజీ మాలి కులం.అంటే శూద్రుడు. మరాఠ బ్రాహ్మలు శుద్రునికి రాజ్యాధికారం అర్హత లేదు అని అడ్డు తగిలితే కాశీకి వెళ్లి బ్రహ్మలను తీసుకొని వచ్చి అడిగిన దక్షిణ ఇచ్చి క్షత్రియ జంధ్యం వేయిన్చుకున్నట్లు చదువుకున్నాము.ముఖ్య మంత్రులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్,ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ,యాదవులు,అజిత్ జోగి ఎస్టి. మాయావతి ఎస్సి,కర్పురి ఠాకూర్ సింగ్ మంగలి, కరుణానిధి బిసి , ఇందరు రాజులు, ముఖ్య మంత్రులు వందల సంవస్తారాలులుగా రాజ్యాధికారం పొంది దళిత బహుజనుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నది చరిత్ర సత్యమేనాయే . మన రాజ్యాంగం ప్రసాదించిన బిక్షతో ఏమ్మేల్లెలుగా, ఎంపీలు గా గెలిచిన మన దళిత ప్రతినిధులు అమెరిక సామ్రాజ్య పెట్టుబడికి ఎలా కోరలు తోముతున్నారో అది ఎఫ్ డి ఐ ల అనుమతా, అను ఒప్పందమా, అది బొగ్గు కుంభ కొనమా, అది 3జి కుంభ కొనమా, అది స్విస్ బ్యాంకుల నల్ల ధనమా , అన్ని విషయాల్లో సంపన్నుల వైపు నిలిచి పోరాడే శక్తులను అతి కిరాతకంగా అనిచివేస్తూ వాళ్ళ కాళ్ళ కింది నేలను,తల పైన నీడను లాక్కోవడానికి యధా శక్తిగా దోచుకొనే వాళ్లతో దోస్తీ కలిపి తమ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. అంటే ఇప్పుడేదో సామాజిక తెలంగాణా వస్తే దళిత బహుజనులకు ఒరిగేది ఏమీ ఉండదన్నది చరిత్ర చెబుతున్నది.వర్తమానం మన కళ్ళముందు కనబడుతున్నది.వర్గ స్పృహ కలిగిన కార్మిక వర్గ చైతన్యం కలిగిన పార్టీల నాయకత్వం లో మాత్రమే సంపద సమానంగా పంచె వ్యవస్థ ఏర్పడుతుంది. కనుక ప్రస్తుతం, కనీసం భౌగోళిక తెలంగాణా కోసం అయినా ఓట్ల సీట్ల పార్టీల తో బాటు గా అన్ని ఉద్యమ ప్రజా సంగాలు తమ తమ స్వార్థ రాజకీయాలను,ఇగొలను,పక్కన బెట్టి ఈజిప్ట్ తరహా లో ఒక దీర్ఘ కాలికమైన బ్రహ్మాండమైన ఒక సమిష్టి పోరాట రూపాన్ని ప్రజల ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం తక్షణం ఉన్నది. త్వమేవ శుంఠ, అంటే త్వమేవ శుంఠ అనుకుంటూ శిగ పట్ల తో ఇంకా కాలం వెల్ల దీస్తే భవిష్యత్ తరాలు ప్రస్తుత తెలంగాణా నాయకత్వాన్ని అసహ్యించు కుంటాయి . పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, సర్వాయి పాపన్న తెలంగాణ వనరుల రక్షణ సంఘం.

Friday, December 14, 2012


లాభం దోపిడీ మోసం నుండి మాత్రమె రాదు , మంచి వ్యాపారం నుంచి వస్తుంది, సమర్థవంతమైన ప్రణాళిక ఉంటె లాభాలు పోగేయ వచ్చు.___ సజ్జన్ జిందాల్ , చేర్మన్ & ఎండి , జిందాల్ కంపని. అసలు లాభం అంటే ఏమిటి?అది ఎట్లా వస్తుందో చూద్దాం . ఒకరి వద్ద వడ్లు ఉన్నాయి మరొకరి వద్ద కొన్ని కుండలు ఉన్నాయి. ఒక దాని అవసరం మరొకరికి ఉంది. వస్తు మార్పిడి నుండి డబ్బు మారకం ప్రారంభం అయిన తర్వాత ఎ వస్తువుకు ఎంత ధర నిర్నయించాలనే మీమాంస వచ్చింది. అపుడు ఏ వస్తువుకు అయినా ధర ఎలా నిర్నయించాలె అనే ఒక ఆలోచన చేయాల్సి వచ్చింది. కుండలు, చూద్దాం, ఒక మనిషి ఒక బండి తీసుకొని చెరువుకు పోయి రోజంతా మట్టి చేరవేసి మరునాడు ఆ మట్టిని రాళ్ళు రప్పలు లేకుండా నలుగ కొట్టి నీళ్ళు పోసి మెత్తగా తోక్కుకొని ఆ మరుసటి రోజు సారే పైన కుండలు అనుతాడు.వాటిని నీడలో ఎండపెట్టి కుమ్మరి వాములో పేర్చి నాలుగు బండ్ల ఊక నో కట్టెలో బొగ్గో వేసి కాల్చి అట్లా తయారైన ఒక 100కుండలను ఏ రేటుకు అమ్మాలనుకొన్నప్పుడు. ఒక రోజుకు ఎడ్లబండి మనిషి కూలి 400 రూ . రెండు రోజులు తయారు చేయడానికి రోజుకు 200 చొప్పున 400రూ.కుండలు పేర్చి కాల్చే దానికి ఒక రోజు 200రూ 4 బండ్ల ఇంధనానికి 1600రూ.మొత్తం 2600రూ.అంటే ఒక్కొక్క కుండను రూ .26 చొప్పున అమ్మవలసి ఉంటుంది. అలాగే ఒక్క ఎకరం పొలం మూడు సార్లు దున్ని నాటుకు అనుకూలంగా కైలు జేసి 10 బండ్ల ఎరువు పోసి,ఒక 20 kg ల విత్తనాలను నారుపోసి 10 మంది కూలీలతో నాటు వేసి రెండు సార్లు కలుపు తీసి పై ఎరువులుగా ఒక బస్తా డి ఎ పి ఒక బస్తా ఉరియా వేసి 100 రోజులకు కోత కు వచ్చేదాకా నీళ్ళు పెట్టి వరి కోసి, వడ్లు తాయారు జేసి అట్లా తయారైన 20 క్వింటాళ్ళ వడ్లను ఎ ధరకు మార్కెట్ లో రైతు విక్రయించుకొవాలి అన్నప్పుడు,దున్నడానికి ఒక 1500రూ,విత్తనాలు 500రూ,నాటు మరియు కలుపు కలిసి రూ.2500, వారి కోత వడ్లు తయారు చేయడానికి ఒక 1500రూ. అనుకొంటే 10 బండ్ల ఎరువు ఒక 2500రూ, రెండు బస్తాల రసాయనిక ఎరువకు ఒక 1000రూ. అనుకొంటే మొత్తం 9500రూ. అవుతున్నాయి.ఒక ఎకరానికి కౌలు 5000రూ. మరియు అతడు ఈ 100 రోజులు పొలాన్ని చూసుకుంటూ నీళ్ళు పెట్టడానికి గాను అతని కుటుంభం అంతా పనిజేస్తుంది వాళ్ళ కూలి ఒక 6500రూ. అనుకొంటే మొత్తం కలిసి రూ.21,000/ పండిన పంట 20 క్వింటల్లు. అంటే ఒక్కో క్వింటాల్ రూ.1050 చొప్పున అమ్మాల్సి ఉంటుంది. అట్లా గాకుండా కుండకు రూ.30 చొప్పున అమ్మితే తయారు దారుకు రూ. 4 లాభం ఉంటుంది. నేను ఇంత రిస్క్ తీసుకొని కుండలు తయారు జేస్తున్న కనుక నాకు ఒక్క 4 రూ. లాభం తీసుకొంటే తప్పా? అనేది తయారు దారు వాదన,అవును తప్పే అనేది సత్యం. ఎందు కంటే అక్కడ ప్రతి ముడి సరుకుకు మానవ శ్రమకు విలువ కట్టిన తర్వాత అదనంగా ఇంకా ధర కలుపుకొని అమ్ముతాననడం అనైతికత కాదా? అయితే యిక్కడే తయారి దారు ఒక కొత్త జిమ్మిక్కు చేసి విషయం సామాన్యులకు అర్థం గాకుండా చేసున్నాడు. ఏమిటంటే? ఆ కుండకు ఆకర్షనీయమైన రంగు,అందమైన డిసైన్ చేయడానికి,అందులో నీళ్ళు చల్లగా ఉండడానికి నా పరిశోధకుడు ఎంతోకాలం శోధించి సంపాదించిన జ్ఞానం నేను కొనుగోలు చేసి ఇవి రూపొందించిన కనుక ధరను నేను 30 కాదు 40 చేసి అమ్మితే తప్ప నాకు గిట్టుబాటు కాదు అని ఒప్పిస్తాడు. ఈ ఇంటెలెచ్త్చువల్ ప్రాపర్టీ అనేది ఒక మోసం అని ఎందుకు అంటున్నామంటే జ్ఞానం అనేది సమాజానుగతం అయినది. నీళ్ళలో పడితే మునిగి పోతం,అగ్గిలో చేయిబెడితే కాలుతది అనేది మనకు ఎవరో పనిగట్టుకొని చెప్పిన సైన్స్ కాదు.సమాజం నుండి నేర్చుకోన్నదే.అయితే నీళ్ళు.నిప్పు నుండి విద్యుత్తూ,సంకర విత్తనాల నుండి అధిక దిగుబడి,అభివృద్ది చెందినా టెక్నాలజీ ద్వారా శ్రమ తగ్గడం, కంపూటర్ ద్వార పనే వేగా వంతం , ఇవన్ని పరిశోధనలే కదా? అవును ఆనాడు శాశ్త్రగ్నులు ఇప్పటే వాలే తమ ఆవిష్కరణలకు డబ్బులు అడుగలేదు కాని ఇప్పటి పరిస్తితి వేరు కనుక లాభాలు సంపాదించే అవకాశం ఇవ్వకుంటే అభివృద్ధికి పరిశోధనలు జరుగవు అంటున్నారు, కాని పరిశోధనలు ప్రభుత్వాల బాధ్యత అయి ఉండాలే.అయితే ఇక్కడ లాభం ఎట్లా వస్తున్నదంటే ధరలు అధికంగా నిర్ణయించడం వల్లనే అనేది స్పష్టం అయ్యింది కదా? పరిశ్రమలల్లో తయారైన ఉత్పత్తులకు ధరలు పరిశ్రమాదిపతులే ధరలు నిర్ణయించుకుంటారు. దానికి ప్రభుత్వాలు అడ్డుచేప్పావు.వాళ్ళు ఎంత ఎక్కువ ధరకు నిర్ణయించుకుంటారు అంటే ప్రతి వస్తువుకు ప్రకటన రేటు ఒకటి ఉంటె దాని పైన కమిషన్ పోను అమ్మకపు రేటు ఇంత అని ధరల పట్టిక డీలర్ వద్ద ఉంటుంది. ఇదంతా మోసం కాదా? మోసం లేకుంటే లాభం అనేదే ఉండదు.తక్కువ మోసం ఎక్కువ మోసం తప్పితే. ఇక వడ్ల ధరకు వద్దాం. వడ్లు పండించేది రైతు కాని అతని ఉత్పత్తికి ధర నిర్ణయించేది సర్కారు.రైతుకు గిట్టుబాటు ధర రాకుంటే అతడు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. వీలయితే కూలీలకు తక్కువ కూలి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాని ఇప్పుడు పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత రైతుకు ఆ అవకాశం కుడా లేకుండా పోయింది.ఆయనకు నష్టం వస్తే అప్పుల పాలై ఉన్నకాడికి అమ్ముకోవడం లేదంటే ఆత్మహత్యలకు పాల్పడడం.అదే పార్సిశ్రామిక వేత్తలకైతే బ్యాంకులు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పెట్టుబడి దార్లు పారిశ్రామిక వేత్తలు ఈ సర్కారు మాది అనుకుంటున్నారు.కాని రైతులు,కూలీలు మాత్రం అలా అనుకొనే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండడం లేదు. pentaih.veeragoni

Monday, October 8, 2012

bio diversity meeting in hydrabad is a joke!


తెలంగానీయులను అపహాస్యం జేస్తున్న హైదరాబాద్ జీవ వైవిధ్య సదస్సు ! ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సదస్సులో మాట్లాడుతూ సేవ్ ఎర్త్, సేవ్ బయో దైవేర్సిటి అని ప్రజలకు పులుపునిచ్చినాడు.అసలు భూమిని కాని, జీవవైవిధ్యాన్ని కాని ధ్వంసం చేస్తున్నదెవరు? నిస్సందేహంగా ఆ పని చేస్తున్నది ప్రభుత్వాలే. ఎలాగో ఒక సారి పరిశీలిద్దాం.కరీంనగర్ జిల్లాలో కొన్ని కోట్ల సంవస్తరాల క్రితం భూమి ఏర్పడ్డనాడు పుడమి తల్లి పుక్కిలించి ఉమిసిన లావా గట్టి పడి గండు శిలలు గా మారిన క్రమం, ఆ గండు శిలలు మరికొన్నికోట్ల సంవస్తరాలు మంచుచే కప్పబడి ఉండడం, ఆ తర్వాత వాతావరణ ప్రభావం వలన క్రమంగా మంచుకరిగి నున్నని రాళ్ళు ఏర్పడడం అనేది అద్భుతము అయిన ఒక ప్రక్రుతి ప్రక్రియ.అనంతమయిన మంచు కరిగి బండ రాళ్ళను ఒరుసుకొని ప్రవహించిన ఫలితంగా పగిలిన రాళ్ళు దుమ్ము దుమ్ము అయి ఇసుక, మట్టిగా ఈ బండ రాళ్ళు రూపాంతరం చెందినాయి.కరిగిన మంచులో కొట్టుకొని పోకుండా మొండిగా నిలిచిన బండ రాళ్ళకు ఇన్ని కోట్ల సంవస్తరాల తర్వాత తాము గ్రానైటు సరుకై అటు ప్రభుత్వాలకు ఇటు క్వారీ యజమానులకు కరెన్సీ నోట్లము అయి సామాన్య ప్రజల బ్రతుకుల్లో బండలై పడుతామని పాపం మా సినారే అన్నట్లుగా మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నఆ రాళ్ళ కు అప్పుడు తెలియదు. అలాగే ఇప్పుడుకరీంనగర్ లో మొత్తం 750 గుట్టలకు గ్రానైట్ క్వారీలు నడుస్తున్నందున ఆయా గుట్టల పైన నివసిస్తున్న గుడ్డేలుగులు,కోతులు, కొన్దేంగాలు,కొండచిలువలు,రామ చిలుకలు, నెమళ్ళు,గబ్బిలాలు,ఉడుతలు,తేనెటీగలు తమ ఆవాసాలు కొల్లగొట్టబడి నందున ఊళ్ళ పైన పడి మనుషుల చేతుల్లో చచ్చిపోతున్నాయి.సీతా ఫలాలు,దొరుకుత లేవు.పశువులకు మేతదొరుకక గొడ్డు,గొర్రె అంతరించి పాలు ,మాంసం దొరకటం గగనమే అయింది.వర్షాన్ని కురుపింప జేసే పర్వతాలు లేనందున వర్షాలు పడక వాగులు ఒంకలు పొర్లి పొంగక చెర్లు నిండక చేపలు దొరుకక పోవడం మాత్రమె గాదు వ్యవసాయాలు కూడా సాగడం లేదు. భుగర్భ జలాలు అడుగంటే పోయి తాగడానికి నీళ్ళు దొరుకని పరిస్తితి.ఇదంతా అభివ్రుద్దియే అంటున్నది ప్రభుత్వం, దాని ఘనులఅభివృద్ధి శాఖ....పైన జెప్పిన జీవులన్నీ అంతరించి పోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఇక మరో విషయం,ఇదే జిల్లాలో తిమ్మాపూర్ అనే మండలం లో పర్ల పెళ్లి అని ఒక మేజర్ గ్రామం ఉన్నది.అక్కడ చుట్టూ పక్కల వరి, మొక్క జొన్న విస్తారంగా పండించడానికి కారణం లోయర్ మానేరు డ్యాం సమీపాననే ఈ ఉరు ఉండడం.పచ్చని పంటపొలాలతో అలరారుతున్న ఈ గ్రామానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక చీడ పట్టించింది. అది హరిత బయో ప్రోడక్ట్ కంపని.ప్రభుత్వం తన విధానాల్లో భాగంగా పెట్రోల్ కొనుగోలుకు విదేశీ మారకం ఆదా చేయాలనే కారణం తో బాటుగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే కారణం చూపుతూ పెట్రోల్ లో20% ఇథనాల్ కలిపి ఇందనం వాడాలని నిశ్చయించింది.అందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలల్లో పర్యావరణ రక్షణ ఉద్యమాల వలన మూతబడిన పాత అవుట్ డేటెడ్ టెక్నాలజీ మిషనరీలను అతి తక్కువ ధరలకు ఇక్కడి పెట్టుబడి దారులకు సాంకేతిక సహాయం పేరుతొ అక్కడి ప్రభ్య్త్వాలు సప్లై చేసినాయి.అట్లా హరిత బయో కంపని యజమాని పర్లపల్లికి రావడానికి, కిరణ్కుమార్ సామాజిక వర్గానికి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సి సైలెంట్ వర్కింగ్ పార్టనర్ కావడం కారణమయింది.అప్పటి సర్పంచ్ కూడా అదే సామాజిక వార్గానికి చెందిన వాడు అయినందున తనను వాళ్ళు మోసం చేయరన్న నమ్మకం తో వాళ్ళు చెప్పిన చోటనల్ల సంతకాలు చేసిండు. గత సంవస్తరం కంపని స్టార్ట్ అయింది.ఈ కంపని మొక్క జొన్న్, బియ్యం నూక తో ఇతోనాల్ తయారు చేస్తుంది.ఈ బియ్యం నూక లో కూడా ఒక మోసమే. బ్లాక్ మార్కెట్ అయిన ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం లారీల కొద్ది ఇక్కడికే చేరిన కూడా అధికార పార్టి వాళ్ళది కనుక ఎవరు అడ్డగించఋ. సరే ఆ బియ్యాన్ని మరియు మక్కలను పెద్ద పెద్ద నీటి తోట్లల్లో పులియ బెడుతారు.అలా పులియ బెట్టడానికి ఒక లీటర్ ఇతోనాల్ తయారీకి 25 లీటర్ల నీరు కావాలి.అంటే దీని కెపాసిటీ రోజుకు 60 ,౦౦౦ లీటర్ల ఎతోనల్ తాయారు చేస్తుంది కనుక రోజుకు దీని నీళ్ళ వాడకం 15 లక్షల లీటర్ల నీరు. అట్లా మురిగిన 15 లక్షల లీటర్ల నీటిని రోజు బయటికి వదలడం వలన వాయు కాలుష్యం జరిగి గబ్బు కంపు వాసన దానితో ఆ చుట్టూ పక్కల పర్లపెల్లి,మొగిలిపాలెం,పీసుపల్లె,ములకనూరు,కొత్తపల్లి,నల్లగొండ,నాతకానిపల్లె,పోలంపల్లి,ఇప్పలపల్లె,నుస్తులాపూర్,మల్లాపూర్ ,మన్నేమ్పల్లి 12 గ్రామాల కు చెందిన దాదాపు యాబయ్ వేల మంది జనాబాకు వాంతులు, శరీరాల పైన దద్దులు, గర్బిణీ స్తీలకు గర్భ స్రావాలు అయిన సందర్భం కూడా ఉన్నది.అలాగే ఈ 15 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకి పోయి జల కాలుష్యం ఏర్పడి త్రాగునీరు కలుషితం అయిపోయి వాంతులు విరోచనాలు,కరీంనగర్ నుండి వైద్య బృందం వెళ్లి ప్రజల అభియోగాలు వాస్తవమే నని చెప్పినాయి,ఈ 12 గ్రామాల కు చెందిన 50 వేల జనాభా,వారికి అన్నపానీయాలు అందిస్తున్న 45 వేల ఎకరాల సాగు భూమి,30 చెరువులు,100 కుంటల అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సందర్భం లో ప్రజలు ప్రతినిద్యాలు చేయడం మొదలుకొని ధర్నాలు రాస్త్త రోకో లు చేసి విసిగి పోయి ఆకరుకు ప్రజలంతా కలిసి కంపనిని ఆపి వేసిన తర్వాత పర్యావరణ శాఖ స్పందించి ప్రజల అభ్యంతరాలు వాస్తవమేనని తాత్కాలికంగా కంపనీని మూసి వేసింది. కాని హైదరాబాద్ లెవల్లో యజమానులకు ఉన్న పరపతిని ఉపయోగించుకొని మళ్ళీ కంపని తెరువడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఎంతగానో పోరాడి కేసులు జైళ్ళ పాలు అయి మురుగును మూసివేయించుకుంటే ప్రభుత్వ పెద్దలు మల్లి ఈ పాకి ని తమ పైన రుద్దినారు గదా అని ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజు దాదాపు ఒక 500 మంది మహిళలు సాయంత్రం రెండున్నర గంటల ప్రాంతం లో కలెక్టరేట్ ముట్టడించినారు.ఈ బయో ప్రాడక్ట్ విషాల వలన ఉర పిచ్చుకలు, బల్లులు చనిపోతున్నాయి.ఎలుకలు పిల్లులు కూడా ఆ నీళ్ళు ద్రాగి చనిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో జీవ వైవిధ్య సదస్సు గురించి అంతంత గొప్పగొప్ప మాటలు చెబుతున్నా ఓ ప్రభుత్వమా 193 దేశాలల్లో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారే! మరి ఇక్కడ మా 12 గ్రామాల 50 వేల మంది ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కోల్పోతున్నాము,మా ఉర పిచ్చుకలు మా బల్లులు మా పిల్లలు అన్యాయమై పోతుంటే మేము ఐదు గంటల నుండి ఓ ప్రభుత్వమా మా కస్టాలు వినరండి అని మండుటెండలో మహిళలం పిల్ల పాపాలను వదిలి మీ కార్యాలయం ముందు పడిగాపులు పడి ఉన్నాము అని గొంతు ఎండిపోయేదాకా నినాదాలు చేసినారు.ఓ నాగరికమయిన ,ఆధునికమైన కరీంనగర్ ప్రజలారా!వినండి , ఈ సమస్య మా ఒక్కరిదే కాదు,రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని ప్రస్తుతం మా భూగర్భం నుండే ఇస్తున్నా,,ఇప్పుడు కంపని మానేరు డ్యాం నుండి ఆ నీటిని తీసుకోవడానికి అనుమతి పొందింది,ఇప్పుడే మీకు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయి, మరి 15 లక్షల లీటర్లనీల్ల్లు రోజు బయో కంపనీకి పొతే కరీంనగర్, హనుమకొండ పట్టణవాసులకు విపరీతమయిన త్రాగు నీటి సమస్య వస్తుంది అని ఆ అమాయక పల్లె జనం నగరవాసులకు జ్ఞానోదయం కలుగ జేసినారు ఓ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమా! నీ పాలనా లోని 12 గ్రామాల కు చెందిన 50 వేల మంది కే స్వచ్చ మైన గాలి, స్వచ్చమైన నీరు, ఆరోగ్యంగా బ్రతికే ప్రాథమిక హక్కుకే భద్రత కల్పించ లేని నువ్వు 193 దేశాలకు చెందిన 200 కోట్ల పై చిలుకు ప్రజలకు ఏమి జీవ వైవిధ్యాన్ని ఉద్భోదిస్తావని పర్ల పల్లి బయో ప్రాడక్ట్ ను వ్యతిరేకించే ప్రజలంతా ఇవ్వాళ నిలదీస్తున్నారు. పెంటయ్య. వీరగొని విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి, పర్యావరణ కార్యకర్త,

Friday, October 5, 2012


అది కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆగ్నేయంగా ఉన్న చిన్న గ్రామం, సర్వాయి పేట.. అక్కడ ఎప్పుడో 1675 లో సర్వాయి పాపన్న నిర్మించిన ఒక కోట శితిలావస్తలో ఉంది. అలనాడు సర్వాయి పాపన్న దాచిపెట్టిన సంపద దొరుకుతుంది అన్న అత్యాశ తో గుప్త ధనం కోసం కోటలోని చాల భాగాన్ని తవ్వి పోసినారు. తెలంగాణా కు చరిత్రే లేదని బుకాయించే సీమాంధ్ర పాలకవర్గాలు చారిత్రిక ఆధారాలను కాపాడడం లో విఫలం అయినారు. కోటకు కొద్ది దూరం లోనే సర్వాయి పాపన్న నిర్మించిన సర్వాయి చెరువు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఊరికి మధ్యలో ఉన్న కోట ముఖ ద్వారం, దానిని అనుకోని ఉన్న బురుజు అలనాటి దర్పానికి గుర్తుగా ఇంకా అలాగే ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆ బురుజు పైన ఫిరంగులు పెట్టి శత్రువులను నిలువరించే వారట. అక్కడినుండి భూమిలో గుండా కొమ్ముగుట్ట పైన ఉన్న కోటకు దారి ఉండేదంటారు. బురుజు పక్కన్నే పెద్ద బావి ఉన్నది.కోట ముఖద్వారం ఈ బురుజు ను ఆనుకొని ఎత్తయిన ప్రాకారం చాల వరకు శిథిలమై ఉన్నది. ఆ కోట ముఖద్వారం వద్దా కూర్చొని ఆనాటి పాపన్న గుర్రపు డెక్కల చప్పుడు ఏమైనా వినిపిస్తుందో ఏమో నని భూమికి చెవు ఆనించి విన్న గూడా 350 ఏండ్ల కింద గాలిలో కలిసిన ఆ శబ్ద తరంగాలను వినలేక పోయాము. కాని ఆ బండ రాళ్ళ పైన ఆయన హస్త ముద్రికలను , ఎత్తయిన ఆ బురుజుల పైన ఆయన నడయాడిన కాలి ముద్రల ఆనవాళ్ళను పోల్చుకొనే ప్రయత్నం లో అక్కడ నుండి కదిలినాము., అలనాడు దొరల భూస్వాముల ఆగడాలను అరికట్టడం లో అయన కూడ గట్టిన ఆ దళిత బహుజన సైన్యాలు ఎంతటి నిర్భీతి తో ఎంతటి ధైర్య సాహసాలతో ఆ నేల పైన నడయాడినాయో కదా అన్న తన్మయత్నం అక్కడనుండి కదుల లేక కదుల లేక మెల్లగా కొమ్ముగుట్ట వైపు బయలు దేరి పోయినాము. గొల్ల పల్లి, ఉమ్మాపురం గ్రామాల గుండా సాగిన మా ప్రయాణం కొమ్ముగుట్ట, బయ్యన్న గుట్ట, మూడురోకండ్ల గుట్ట, ఇట్లా ముప్పై యారు గుట్టల శ్రేణి లో తలమానికంగా ఉన్న కొమ్ముగుట్ట పాదాల నుండి ప్రయాణం సాగుతుంటే నెమలి పక్షుల కూతలు మనుషులు పిలిచినట్టుగా వినిపిస్తున్నాయి. శత్రువులు ఎవరో వస్తున్నారు జాగ్రత్త అని అలనాడు సర్వాయి పాపన్న్నకు కూడా ఇట్లాగే ఈ ప్రక్రుతి సహకరించింది కావచ్చు అనిపించింది. ఆ చిట్టడివి చెట్ల సందుల నుండి పోతుంటే చిన్న కాలి దారి వొకటి కనిపించింది.ఆ కాలి దారెంట పొతూ ఉంటె సీతాకోకలు గుంపులు గుంపులు గ బండ రాళ్ళ పైన ఉన్న, మట్టి పైన ఉన్న మాధుర్యాన్ని గ్రోలటానికి కాబోలు కింద వాలుతూ పైకి లేస్తూ వాటి ఆకలి పోరాటం సాగిస్తున్నాయి, అలాగే దాదాపు ఒక అరగంట నడిచిన తర్వాత బండ రాళ్ళ సందుల గుండా వస్తున్న సెలయేళ్ల ధారలు, అక్కడక్కడ చిన్న చిన్న మడుగులు. అబ్బ నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయి కదా ఇక్కడ అనిపించింది. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయి నందున మేము తెచ్చుకున్న నీళ్ళ బాటిల్స్ అయిపోయినందున ఆ బండల పైనుండి జల జలా వస్తున్న సెలయేటి నీటిని దోసిటి నిండా పట్టుకొని తాగినాము. అసలు మినరల్ వాటర్ అంటే అవి. . ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఆ నీళ్ళు. ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళిన మేము సరిగా గమనించ లేదు కాని అప్పటికే మేము పోతున్న దారి అన్ని చిన్న చిన్న దారులు గా విడి పోయింది . ఏ దారి గుండా వెళ్ళాలో అర్థం కావడం లేదు. సరే ఏదో ఒక దారి అనుకోని ఒక దారి గుండా వెల్లినాము. అయితే అ దారి మమ్ములను సర్వై పాపన్న నిర్మించుకున్న కోట వైపు కాకుండా మరో వైపు కు తీసుకొని పోతున్నది. అయితే అప్పటికే బాగా అలిసి పోయిన మేము ఏమి చేద్దాం తిరిగి వాపసు పోదామా , ఇంతకష్ట పడివచ్చి అయన నివసించిన స్తావరం చూడకుండా నే వెళ్ళిపోవడం ఎట్లా అని మీమాంస లో ఉండగా మా టీం సభ్యుల్లో ఒకరు అగాగో కోట గోడ అంటూ చుపెడుతున్నారు.ఉత్సాహం తో అందరం అటువైపు చూసినాము. దూరంగా చాల ఎత్తులో ఒక పాకురుబట్టిన పాత బండ రాళ్ళ గోడ ఒకటి కనిపించింది.ఏదో గొప్ప నిధి దొరికినట్టుగా అందరం బిరా బిరా అటువైపు అడుగులు వేసినం. కంటికైతే కనిపిస్తున్నది కాని దాని లోనికి పోవడానికి ద్వారం దొరుకుత లేదు.ఎటు వైపు పోయినా ఎక్కి దాట వీలు గాని కోట గోడనే అడ్డం వస్తున్నది. అరె ఆ కాలం ల ఇక్కడ ఇంతటి శత్రు దుర్భేద్యమైన కోట కట్టుకోవచ్చునని అతి సామాన్యుడు, ఒక కళ్ళు గీత వృత్తి దారునికి ఇంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎట్లా కలిగిందోకదా అని అబ్బురపడ్డాము. అయితే మాకు తెలిసింది ఏమిటంటే ఆ కోట లోపలికి పోవడానికి ఒకే ద్వారం ఉన్నదట.చివరికి మా టీం సభ్యులు చెట్లు ఆకుల తో ముసి ఉన్న ఒక ద్వారం కనుగొన్నారు. ఆ ద్వారం గుండా లోపలి పోయినాము. విశాలమయిన బండ రాళ్ళు. అక్కడ ఒక ఎత్తయిన రాయి పైన పాపన్న కూర్చునేవాడు అని ఒక రాతి సింహాసనం వంటి పెద్ద బండ రాయినే చూపినారు. అక్కడ నుండి శత్రువుల ఆచూకీని చూడడానికి రెండు వైపులా ఎత్తయిన బురుజులు ఉన్నాయి అయితే అవి చాల వరకు శిథిల మై పునాదులు, కొన్ని కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలక్షేపానికి ఆడుకొనే పులి జూదం పటం బండ పైన చెక్కి ఉన్నది. దాని కి కొంచం ఎడమ వైపు ఒక హనుమంతుని విగ్రహం చెక్కి ఉన్నది. కాని అది పాపన్న కాలం లో చెక్కినది కాకపోవచ్చుననుకొనే వారు ఉన్నారు. ఎందుకంటే పాపన్న బ్రాహ్మనీయ సంస్కృతిని పెద్దగ అభిమానించిన ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు.ఎందుకంటే ఆసియా ఖండం లోని అత్యంత ఉన్నతమైన స్తూపం నిర్మించబడి రాజ్యం చే ధ్వంసం చేయబడిన హుస్నా బాద్ పట్టణం లో సర్వాయిపాపన్న చేత మట్టి తో నిర్మించ బడ్డ పోచమ్మ గుడి ఉన్నది.దాని పూజారి గా కూడా ఒక దళిత మహిలనే నియమించి నట్లు గా ఆధారాలు ఉన్నాయి. అంతే గాకుండా ఆయనకు సమయం చిక్కినపుడల్లా రక్షణ స్తావరాలు నిర్మించుకోవడం,ప్రజల కష్టసుఖాలు తెల్సుకోవడం, శత్రువులు వసూలు చేస్తున్న పన్నులు చెల్లించ వద్దని ప్రజలను చైతన్య పరచడం. లాంటి పనులతోని తీరిక లేకుండా ఉన్న వాస్తవ వాది. ఛత్రపతి శివాజీ సమకాలికుడు అయిన పాపన్న శివాజీ వలె గుళ్ళు, గోపురాలు కట్టి ఉంటె బ్రాహ్మణా సమాజం పాపన్న చరిత్రను కుడా గ్రంధస్తం చేసి ఉండేది.మొఘల్ చక్రవర్తులను ఎదిరిస్తున్నాడు కనుక మహ్మదీయ చరిత్ర కారులు, మొఘల్ చక్రవర్తులకు తాబెదార్లు గా, పన్నులు వసూలు జేసి ఇస్తూ వారికంటే క్రూరంగా ప్రజలను హింసిస్తున్న స్తానిక హైందవ దొరలను చీల్చి చండాడుతున్నాడు కనుక హైందవ చరిత్ర కారులు పాపన్న చేరిత్రను ఎక్కడ గ్రంధస్తం చేయలేదు. అయిన ప్రజా నాలుకల పైన ఆశువు గా వచ్చిన పాపన్న చరిత్రను జానపదులు తమదయిన వీరోచిత , తమదైన సంస్కృతితో ఈ తరం దాక తమ నాలుకల పైన మోసుకొని తెచ్చినారు. ఆ కొండ పైన రెండు పెద్ద బండ రాళ్ళ మధ్యన ఉన్న చిన్న చిన్న రాళ్ళు, మట్టిని తొలిగించి అక్కడ ఆ గుట్ట పైన రెండు కోనేరులను నిర్మించినాడు.ఆ కోనేరులోనికి దిగడానికి మెట్లు సైతం చెక్కించి నాడు.సముద్ర మట్టం నుండి దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉన్న ఇతని కోటపైన సహజ సిద్ధమైన కోనేరులు నిర్మించుకొని ప్రకృతిని సైతం అక్కడ తన అధీనం లో ఉంచుకో గలిగినంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగిన అసాధరణమైన ఒక సామాన్య మనిషి పాపన్న.కొండ పై భాగాన ఉన్న శిల్పాలు కొన్ని చూసి కిందకి ప్రయాణం అయినాము. అయితే పాపన్న ఆరాధించే ఒక ప్రక్రుతి శిల్పం, దాని పేరు.బయ్యన్న, అది మాకు ఎక్కడా కనిపించలేదు. అది చూడ లేక పోయామే అన్న అసంతృప్తి మాకుఉన్నది. . కాని అప్పటేకే బాగా అలిసి పోయి ఉన్నాము .పైగా సూర్యుడు మాకంటే ముందుగానే తిరుగు ప్రయాణం లో ఉండీ మమ్ములను వేగిర పెడుతున్నాడు.అలనాడు గుర్రాలు సైతం ఎక్కినా గుట్టల పైనకు మాకు పోవడానికే గాదు రావడానికి కూడా చాల కష్టం అవుతున్నది. బండల పైనుండి జారుతూ చెట్ల ఉడలు పట్టుకొని , మెల్ల మెల్లగా కిందికి వస్తున్నాము ఒక్కసారిగా దాదాపు ఏడు ఫీట్ల ఎత్తుగా ఉన్న బయ్యన్న విగ్రహం మాకు అడ్డంగా వచ్చింది నన్ను దర్శించుకోకుండానే మిమ్ములను పోనిస్తానా అన్నట్లు గ మాకు అయన తారస పడేసరికి చాల ఆనంద ఆశ్చర్యాలు కలిగినాయి. కోర మీసాలు, ఏడు చేతులు,ప్రతి చేతిలో ఒక ఆయుధం, ఆ ఆయుధాలన్నీ కూడా ప్రకృతియే.ఇనుప శూలం,విల్లంబులు,పడగ విప్పిన నాగుపాము,అర్ధ చంద్రుడు,డమరుకం,కమలం, యమపాశం,ఉన్నాయ్. ఒక కుక్క,బుద్దుడు,నరుకబడిన శత్రువు తల ఉన్నాయి.దిగంబరంగా చెక్కిన్చుకోబడ్డ ఈ విగ్రహానికి పాపన్న కోట లోనికి వచ్చేటప్పుడు,కోటలోనుండిబయటికి పోయేటప్పుడు పూజున్చుకొని పోయే వాడట. ఆ విగ్రహం కింద నిధి ఉండవచునో ఏమో అనుకోని దుండగులు.తవ్వినారు.విగ్రహం పక్కనుండి తెల్లని సెలయేరు పారుతున్నది.బయ్యన్నను దర్శించుకున్నామన్న సంతోషం మా అలసటను తొలగించింది.చల్లని తెల్లని సెలయేటి నీరు కడుపునిండా తాగి మనుసు నిండా పాపన్న చరిత్రను తలుచుకొంటూ తిరుగు ప్రయాణం అయినాము. గుట్ట దిగువన మరో చారిత్రిక మైదానం . అదే దండు దుబ్బ. తన సైన్యానికి పాపన్న అక్కడే శిక్షణ ఇచ్చేవాడట. సామాన్యులకు, సంపద సృస్తికర్తలకు సరైన వాటా లభించాలంటే సాయుధ పోరు చేయక తప్పదని 375 సంవస్తరాల కింద నే మార్క్స్ మాటే లేని రోజుల్లో మన సర్వాయి పాపన్న మహ్మదీయులైన మొఘల్ లను, హైన్దవులయిన స్తానిక దొరలను ఎదిరించడానికి ఒక చాకలి సర్వాన్న, ఒక మంగలి మాదన్న, ఒక జక్కుల పెరుమండ్లు,ఒక దూదేకుల పీర్ సాహెబ్,లాంటి దళిత బహుజనులతో దండు గట్టి సాయుధ పోరు జేసి దళిత బహుజనుల రాజ్యం సాధించుకున్నాడు.ఇంతటి మహత్తర దార్శనికుడు., ఇంతటి గొప్ప యుద్ద్దవీరుడు,ఇంతటి ప్రజాపక్షపాతి,సంపద సృష్టికర్తలకు సంపద దక్కాలన్న సమ సమాజ వాది యొక్క చరిత్ర గాని, ఒక విగ్రహం గాని తెలంగాణా లో అందునా ఆయన పుట్టిన వరంగల్ జిల్లలో గాని,అయన సమరం జేసిన పొలాస జగిత్యాల, కరీంనగర్ లో గాని లేదా గోల్కొండానే జయించిన ఈ విప్లవ యోధుని విగ్రహం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన గాని పెట్టుమని అడుగడానికి కారణం చరిత్ర తెలియక పోవడం ఒక కారణమయితే దళిత బహుజనులలో తమ ఆత్మ గౌరవ ఉనికి కై తమ అస్తిత్వాలను నిలుపుకోవడానికి తెగించి పోరాడాలన్న సీరియెస్ నేస లేక పోవడం మరో కారణం. సంపద సృస్తికర్తలకు సమ న్యాయం జరుగాలని అనోకొనే వారు,అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్ళు,ఇప్పటికయినా ఒక్కటయ్యి ,375 ఏండ్ల కిందనే మొఘల్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి, అగ్రకుల హైందవ పాలనను ఓడించి, ప్రకృతినే ఆరాధించి ,దళిత బహుజలతోదండు గట్టి సాయుధ పోరుజేసిన తెలంగాణా దేశీ దార్శనికుని మార్గం లో ఆలోచించి రాజ్యాధికారం దిశలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించవలసి ఉన్నది. పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యపర్యవేక్షనాదికారి. న్యాయవాది.

Monday, September 24, 2012


సకల జనుల సమ్మె విరమించ బడిన తర్వాత తెలంగాణా ఉద్యమం పని అయిపోయిందని సమైక్య వాదులు సంబరపడి పొతే తెలంగాణా ప్రజలు కూడా కొందరు ఇంత పెద్ద ఉద్యమం ఆబాలగోపాలం అందరు పాల్గొని ఇన్ని రోజులు ఇంత త్యాగం తో ఇంత ప్రశాంతంగా ఇంత ఉత్తేజంగా ఇంత ప్రజాస్వామ్య యుతంగా పోరాటం జేస్తే గూడా ప్రత్యేక రాష్ట్రం సాధ్య పడలేదు గనుక ఇక మనం ఎంత కొట్లాడినా ఏమీ లాభం అనుకోని నిరాశ పడ్డారు. ఇప్పుడు తలపెట్టిన సెప్టెంబర్ 30 లాంటి ర్యాలి సమ్మె సందర్భం లో జేస్తే ప్రజల ప్రతిస్పందన భాగస్వామ్యం బాగా ఉండేది, ప్రభుత్వం దిగివచ్చేదని, చేయ వలసిన సమయం లో చేయకుండా తెలంగాణా రాష్ట్ర సిద్ధిని వాయిదా వేయడం లో అన్ని రాజకీయ పార్టీల తోబాటుగా జాకులు గూడా తమ బాధ్యత ఏమీ లేదని అంటే ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. 1948 కి ముందే ప్రారంభ మైన గయిర్ ముల్కి గో బ్యాక్ నినాదం 1969 నాటికి రక్తం చిందించ గలిగినంతటి తీవ్ర స్తాయికి వెళ్ళిపోయింది.369 మంది అస్తిపంజరాలతో ముఖ్యమంత్రి సింహాసనాన్ని చేక్కిన్చుకున్న మర్రిచేన్న రెడ్డి ఒక్కడే తెలంగాణా ద్రోహి కాదు, ఆయనతో బాటుగా రాజ్యాధికారం పచుకున్న రాజకీయ నాయకులు అందరితో బాటుగా ఎమ్మెల్సి పదవులు పొందిన ఉద్యోగ సంగాల నాయకులూ కూడా భాగస్వాములే. 1970 నుండి 1997 లో తెలంగాణా జనసభ ఆవిర్భావం దాక ఈ 27 ఏండ్ల సుదీర్ఘ కాలం తెలంగాణా వాదం తెలంగాణా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పదిలంగా అలాగే ఉంది. వరంగల్ డిక్లరేషన్ నాటి ఊరేగింపు లో ckm కాలేజి నుండి బస్సు స్టాండ్ ముందున్న స్పోర్ట్స్ గ్రౌండ్ దాక సాగిన ప్రజల కవాతు లో పెల్లుభికిన ఉత్సాహం చూసిన తర్వాతనే సీమాంధ్ర పాలకుల పాలన పట్ల ప్రజలు ఎంతగా ఏవగించు కుంటున్నారో అర్థం అయ్యింది . 1997 నుండి 2004 వరకు ఈ ఏడేండ్ల కాలం లో తెలంగాణా ప్రజలను, తెలంగాణా వాదాన్ని, తెలంగాణా రైతులను, యువకులను , విద్యార్థులను అత్యంత కిరాతకంగా అణిచి వేసి వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఉద్యమాలను లేకుండా చేయచ్చునన్న ఒక తప్పుడు అవగాహనతో ఒక బెల్లి లలితను, ఒక కనక చారి లాంటి ఎందరోతెలంగాణా ఉద్యమ కారులను హత్యలు గావించి న చంద్రబాబు నాయుడు సర్కారు తెలంగాణా వాదాన్ని ప్రజల్లో లేకుండా చేయ లేక పోయింది.2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకంగా , తెలంగాణా వాదానికి వ్యతితెకంగా , బహుళ జాతి కంపనీల వ్యాపారాలకు అనుకూలంగా tips , trims intellectual property rights ఎజెండాగా, తన మానిఫెస్టో తో ఎన్నికలకు దిగింది. ఆంధ్ర , తెలంగాణా తేడ లేకుండా అన్ని ప్రాంతాల్లో చెంద్రబాబు పాలసీని ప్రజలు తిరస్కరించినారు.చెంద్రబాబు నాయుడు క్రూర నిర్బంధ పాలన వలన రెక్కలు తెగిన పక్షి వలె గాయ పడి ఉన్న తెలంగాణా వాదాన్ని 2000 సం. లో కెసిఆర్ చేతిలోకి తీసుకున్నాడు.అణిచివేత నుండి కొంత వెసులు బాటు దొరికిన తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెంతన సేద దీరి ఆయనకు బంగారు బాతుగుడ్లనే బహుకరించారు. కాని అక్కడనే అయన ప్రజల వైపు నుండి గాక ప్రభుత్వం లో చేరిపోయి కాంట్రాక్టులు కమిషన్లు గురించి మంతనాలు సాగిస్తుంటే ఒక వైపు ప్రజలు దూరం గావడం మరో వైపు ఉన్న ఏమ్మేల్లెలు ఊసి పోవడం తో రాజశేకర్ రెడ్డి తన సర్కారు నుండి బయటకు వెళ్లి పోయే పరిస్తితి కల్పించిండు. బై ఎలెక్షన్ల తో చావుదప్పి కన్ను లొట్ట బోయినట్టు అయింది.మొదటి నుండి కేసీఆర్ ఉద్యమాలు వద్దు లాబీయింగ్ ద్వారానే తెలంగాణా నేను సాధించి పెడుతానంటే , తేరగా వస్తుంటే ఎందుకు తిప్పల బడాలె అనుకొనే కొందరు అరె అయన పద్దతిలో అయన పోతుండు, మీరు కావాలంటే కొట్లాడుకోండి అన్నారు. అందుకే మిలియన్ మార్చ్ వద్దన్నాడు, సకల జనుల సమ్మె అనే సంకుల సమరం ఒక వైపు ముమ్మరంగా సాగుతుంటే ప్రధాన నాయకత్వం యుద్ధ రంగాన్ని వదిలేసి రాయబారానికి హస్తినాపురికి వెళ్ళింది. ఇందులో ఏదో మతులబు ఉండే ఉంటుంది అనుకొన్నారు అమాయకమ్మన్యులు కొందరు. పర్కాల ఉప ఎన్నికల తర్వాత సెప్టెంబర్ 29 నాటికి తెలంగాణా ఇవ్వకుంటే 30 నాడు తెలంగాణా ప్రజలంతా పెద్ద ఎత్తున హైదరాబాద్ కు మార్చ్ చేస్తామని పొలిటికల్ జే ఎసి ప్రకటించింది. రేపో మాపో ఒకవైపు తెలంగాణా వస్తా ఉంటె ఇంకా ఈ ఉద్యమాలతో ఏమి పని అని నాకు సిగ్నల్స్ వస్తున్న్నాయి అని అన్నవాళ్లు ఉన్నారు.. ఇట్లా ఎన్నో సార్లు వచ్చే దసరా, వచ్చే దీపావళి, వచ్చే ఉగాది, వచ్చే రంజాన్, వచ్చే బక్రీద్, వచ్చే స్వతంత్ర దినోత్సవం ఇక మన తెలంగాణా రాష్ట్రం లోనే అనంగా వినీ, వినీ విసుగుజెందిన ప్రజలు తమ మానాన తాము 30 నాటి మార్చ్ కోసం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మీరు చేసుకుంటే ఉద్యమాలు చేసుకోండి నేను మాత్రం ఇగో చుడుండి లాబీయింగ్ తోనే తెలంగాణా తెస్తానని గత 20 రోజులనుండి డిల్లీ లో దిగే గడపా ,ఎక్కే గడప తో ఫుల్ బిజీ. ఆఖరుకు వాళ్ళు తెలంగాణా ప్రకటించక ముందే TRS ను ఆఫర్ జేసిండు. ప్రణబ్ కుఖర్జీ కమిటీ వలె, రోశయ్య కమిటి వలె,శ్రీకృష్ణ కమిటి వలె ఒక కమిటి వచ్చినా , లేదా సిక్స్ పాయింట్ ఫార్ముల వలెనో, 610 జివో వలెనో ప్రాంతీయ మండల్ వలెనో ఒక ప్యాకేజి వచ్చినా ఇంకేంది ఇగ తెలంగాణా వచ్చినట్లే సంబురాలు జేసుకుందాం రండని పిలుపు ఇచ్చేటట్లు ఉన్నారు. కాని తెలంగాణా ప్రజలు ఇప్పటికే లెక్క లేనన్ని సార్లు, కమిటీల పేరుతొ ప్యాకేజీల పేరుతొ మోసపోయి ఉన్నారు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దప్ప మరే విషయాన్ని గూడా తెలంగాణా ప్రజలు అంగీకరించరు. కనుక రాజకీయ నాయకుల మాయోపాయ ఉచ్చులలో ప్రజలు చిక్కుకొని 30 సెప్టెంబర్ మార్చ్ ను ఎట్టి పరిస్తితిలో గూడా వాయిదా వేసుకోవద్దు. అలాంటిది ఏదయినా జరిగితే మాత్రం ఇక చాల కాలం దాక ఏ నాయకత్వాన్ని గూడా తెలంగాణా ప్రజలు నమ్మని ఒక నిస్సహాయ స్తితికి తెలంగాణా ఉద్యమాలు నేట్టివేయబడుతాయి. అందుకని నాయకత్వం బహుపరాక్! వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షనాదికారి తెలంగాణా ప్రజా ఫ్రంట్, కరీంనగర్.