Thursday, November 19, 2020

                             విద్యారంగం ..వైఫల్యాలు .. పరిష్కారాలు. 


రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ (REBS) యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుజేసిన వెబ్నార్ లో విద్యారంగం..వైఫల్యాలు..పరిష్కారాలు అన్న విషయంగా చర్చ జరిగింది. ఈ  చర్చలో పానల్ స్పీకర్ల్లుగా లింగయ్య rtd Dy director, అల్లం రాజయ్య రచయిత, డా. సాంబయ్య DIET, సంజయ్ ఒమెకర్ పొటర్స్ వీల్ ఎజుకేషన్, మరియు  సమన్వయ  కర్తగా వీరగొని పెంటయ్య సంస్త ఉపాధ్యక్షులు వ్యవహరించారు.   సంస్త సభ్యులు మరియు విద్యాభిమానులు  చర్చలో పాల్గొన్నారు. 

 

  పుట్టిన ప్రతి బిడ్డ ,  తన తలిదండ్రుల నుండి సమాజం నుండి నేర్చుకున్న జ్ఞానానికి విద్య మెరుగులు అద్ది , అనేకంగా ఉన్న సామాజిక అవసరాలల్లో ఏదో ఒక చోట తనకు అబ్బిన విద్య ద్వారా  సామాజిక అవసరాలను తీరుస్తూ తన జీవికను కొనసాగించేదిగా విద్య  ఉండాలి. 


  కానీ మన చదువుల్లో మార్కులు గ్రేడ్ లు, పాస్, ఫెయిల్, అనే విధానం  అమలౌతున్నప్పటినుండి కొందరు పిల్లలు జీనియస్, వరప్రసాదులు అనీ, మరికొందరు చదువు అబ్బనివారు, స్లో లర్నర్స్ అని ముద్ర  వేసి మన విద్యావిధానం బడి బయటకు పంపుతున్నది. తద్వారా  కోట్లాది మంది పిల్లలు సరైన ఉపాధి అవకాశం లభించక సమాజం లో గౌరవంగా జీవించే అవకాశాన్ని కోల్పోతున్నారు. 


పోనీ ఈ జీనియస్ లు గొప్పగా చేస్తున్నది ఏమిటని గమనిస్తే ఐతే కార్పొరేట్ సంస్టల్లో ఉద్యోగాలు జేస్తూ వారి సంపదను మరికొన్ని రెట్లు పెంచడానికి దోహదపడుతున్నారు. కాదూ కూడదు అంటే , కార్పొరేట్ సంస్తలకు ప్రకృతి సంపదలను, కారుచౌకగా మానవ వనరులను సమకూర్చి పెట్టె ప్రభుత్వాలల్లో బ్యూరోక్రాట్లు గా పనిజేస్తూ దోపిడి ప్రభుత్వాల పాలనను సుస్తిరం జేసె పనిలో తలమునకలై జీవిస్తున్నారు తప్పితే, సమాజం లో ప్రేమ, సమభావం, సౌశీలం, సంపద సమానంగా పంచబడాలనే దానికోసం వారు పనిజేయడమ్ లేదు, అలాగే మన విద్యావిధానం కూడా ఆ జ్ఞానాన్ని అందించడం లేదు. 


విద్యారంగం యొక్క ఈ వైఫల్యాలను తొలగించే పరిస్కార మార్గాల అన్వేషణలో ఈ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక వక్తలు పైవిషయాన్ని దృస్టిలో పెట్టుకొని మాట్లాడాలని సమన్వయకర్త కోరగా చర్చ ప్రారంభించబడింది. 


అల్లం రాజయ్య:-  విద్యను పై పై గా ఉపరితలం నుండి చూస్తే అనేక అంశాలు మనకు సరిగా అర్థం కావు. అందుకే విద్యా అంటే ఏమిటి? విద్యకు సమాజానికి ఉండే సంబంధం  ఏమిటి? విద్యకు చరిత్రకు ఉండే సంబంధం ఏమిటి అనే సామాజిక పునాది నుండి ఆలోచించక పోతే మనం ఎన్ని పిల్లిమొగ్గలేసినా దాని రూపానికి సంబంధించిన విషయమేతప్ప సారనికి చెందిన విషయాన్ని అర్థం జేసుకోలేము. సారం అంటే ఏమిటి? ఏ దేశం లోనైనా , ఏ ప్రాంతం లోనైనా ఉత్పత్తి శక్తులు ఎట్లున్నై అనే దాని పైన్నే ఆధారపడి విద్య,విజ్ఞాన శాస్త్రం , రాజకీయకార్య కలాపాలు , కళలు,మతాచారాలు,  అన్నీ ఉంటాయి. రెండోది ఉత్పత్తి సంబంధాలు. భారత దేశం లాంటి చోట్ల ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయి? ఉత్పత్తి సంబంధాలను నిర్ణయించే పద్దతి ఏముంటది? ఉత్పత్తి సాధనాల రూపం కూడా విద్యలో ప్రధానమైంది. ఉత్పత్తిలో మనుషుల స్తానమ్ ఏమిటి? పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయి? ఉత్పత్తి పంపిణీ ఎలా ఉంది? ఇవన్నీ కూడా అన్నీ రకాల సామాజిక జీవితాల  తో బాటు విద్యాపైన కూడా  ప్రభావం చూపుతాయి. మన దేశానికి వస్తే కులమున్నది, వర్గమున్నది, మతమున్నది. లింగవివక్షత ఉంది. భాషా పర వివక్షత ఉంది. ప్రాంతీయ వివక్షత ఉంది. ఇవన్నీ వివక్షలతో బాటు పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంటదో  చూద్దమ్. 


అద్భుతమైన వ్యక్తిత్వం తో రూపొందించబడాల్సిన విద్యార్థికి  ప్రప్రథమంగా స్వంత ఆస్తి కేంద్రం గా గల కుటుంబాల్లో ముందుగా వాళ్ళ తలిదండ్రులనుండే వారి మానసిక వికాసానికి అడ్డంకులు ఎదురౌతాయి. విద్యార్హి ఏమో ఉత్పత్తి శక్తుల వికాసం గురించి ఆలోచిస్తే వారి తలిదండ్రులేమో స్వంత ఆస్తి కేంద్రంగా  వాళ్ళు ఏమి చేయాలో నియంత్రిస్తారు. కుటుంబం లో ఆడపిల్లలను ఒక రకంగా చూస్తార్, మొగపిల్లలను ఒకరంగా చూస్తారు.కుటుంబంలో  పితృస్వామిక భావజాలం పసిపిల్లల మనసులను తీవ్రంగా గాయపరుస్తుంది. తనకు ఊహ తెలిసినప్పటినుండే స్వేచ్ఛగా వికసించాల్సిన పసి మనసులను  తలిదండ్రులు నిర్దయగా నలిపేస్తున్నారు. తాను ఏమి  నేర్చుకోవాలో తెలియని అయోమయం లో పిల్లలను కుటుంబ వ్యవస్త ఖూనీ చేస్తున్నది. ఇక రెండోది బడి. ఆ బడి ప్రజలు పెట్టుకున్నది కాదు.  తన అవసరాలకోసం ప్రజలనుండి అదనపు ఉత్పత్తిని  ఎలా పిండుకోవాల  అన్న స్వార్థ  చింతనతో దానికి ఓక పద్దతిని రూపొందించి రాజ్యం పెట్టిన బడి అది. ఇక్కడ పెట్టిన కరికులం అంతా కూడా అంటే అది భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, ఆలోచనలు అన్నీ కూడా హేతు విరుద్దం అయినవి. పుక్కుటి  పురాణాలు.  3000 ఏండ్ల నుండి ఇదే  విధానం మనది. పిల్లలు వేసే అనేక ప్రశనలకు మనవద్ద జవాబులు ఉండవు. ఎంతో అద్భుతంగా వికాసం చెందాల్సిన విద్యార్థిని ఒక చెరసాల, ఒక కాన్సెంత్రేషన్ క్యాంప్ లాంటి చోట పెడుతున్నాం. అక్కడ మళ్ళీ భాష వివక్షత, కుల ,లింగ వివక్షత తో పాటు ఉపాధ్యాయుల కోపతాపాల మనోభావాల ఫలితాలు ఉంటాయి. ఇలాంటి అభ్యసన కేంద్రాలల్లో 48 కోట్ల మంది  18 సంవస్తారాల లోపు పిల్లలు విద్యను అభ్యశిస్తున్నారు. ఇలాంటి చోట్ల వారి శారీరక, మానసిక వికాసం ఎట్లా జరుగుతది? వాళ్ళు ఏ సమాజం గురించి ఆలోచిస్తారు. 3000 సంవస్తారాల నుండి ఇదే ఒక అసమంజసమైన విధానం నడుస్తా ఉంటే మరీ ముఖ్యంగా గ్లోబలైజేషన్ మొదలైనప్పటి నుండి ఈ సమస్యలన్నీ ఇలాగే ఉండగా భారతీయ సంపదను ఎలా కొల్లగొట్టుక పోవాలనే దానికి ఒక ప్రణాళిక జరుగుతున్నది. 


ఈ విషయాలేవీ చెర్చించకుండా కేవలం విద్యావిధానం గురించి చర్చిస్తామంటే మనం గోతిలో పడ్డాట్లే. ప్రపంచీకరణ అంటే స్టానిక సమస్యలు వస్తాయి. ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఉంటది. సార్వత్రీకరణకు , వ్యక్తిగతానికి ఘర్షణ ఉంటది. సాంప్రదాయానికి,సనాతన వాదానికి  , గతితార్కికానికి ఘర్షన ఉంటది. దీర్ఘ కాళిక ప్రయోజనాలకు తక్షణ ప్రయోజనాలకు ఘర్షణ ఉంటది.  ఈ ఘర్శనలన్నీ మాయజేసి పోటీ తత్వం, నేర్చుకోవడం అనే ఓ పుక్కిడి పురాణాల కల్పిత గాతలను పిల్లల ముందుకు తెస్తు , మొత్తంగా భారతీయ సంపదని కొల్లగొట్టేందుకు మొత్తంగా 65% శాతం యువతను సర్వీస్ రంగం అనే ఒక కట్టుబానిస వ్యవస్తాలోకి తెచ్చే ఒక  కుట్ర అమలౌతున్నది. 


పైన చెప్పుకున్న అన్నీ సమస్యల గురించి భారతీయ సమాజం ఆలోచిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ వైఫల్యాలు వైదొలుగాలి అంటే కార్మికుల, ఆదివాసీల, రైతుల, పేదల, కింది కులాల   బిడ్డలు అందరికీ  శాస్త్రీయమైన ,  నాణ్యమైన విద్య అందాలి. పాఠ్యాంశాలను ఆచరణతో,  శారీరక శ్రమతో, ఉత్పత్తి ప్రక్రియ తో అనుసంధానం జేయడం, అప్పజెప్పే బట్టే విధానం కాకుండా జ్ఞానాన్ని కలిగించే బోధన,  జ్ఞాపక శక్తి కంటే జ్ఞానాన్ని సమీక్షించే పరీక్షావిధానం, వ్యక్తిగత జ్ఞానాన్ని లాజికల్ జ్ఞానం గా లాజికల్ జ్ఞానాన్ని  గతితార్కిక చారిత్రిక జ్ఞానం గా అభివృధ్ధి చేయడం, 40 కోట్ల మంది  పిల్లలు 30 కోట్ల మంది యువకుల జీవితాలు అర్థం,పర్థం  లేకుండా పోవడానికి ముందుగా రాజ్యం , ఆ తర్వాత ఉపాధ్యాయులు, తలిదండ్రులు , పౌర సమాజం మొత్తంగా  బాధ్యత వహించవలసి ఉంటుంది.  దీనికి కారణాలు  కొందరు పిల్ల పైకి నెడితే, కొందరు ఉపాధ్యాయుల పైన మరికొందరు తలిదండ్రుల పైంకి నేడుతున్నారు. తెలివైన వారు మాత్రం రాజ్యం పైకి నేడుతున్నారు.విద్య ఒక వర్గ పోరాటం.  ఒక ఆచరణాత్మకమైన అంశం. విద్య సామాజిక వైరుద్యాల్తో కూడుకున్నది. ఈ వైరుద్యాలు ఏమిటో  తెలుసుకున్నంత  మాత్రాన అవి  పరిష్కారం కాజాలవు .   మరి  ఎవరు పరిష్కరించాలి అంటే విద్యార్థులు తమ వ్యక్తిగత అనుభవాన్ని లాజికల్ అనుభవంగా, లాజికల అనుభవాన్ని గతితార్కిక అనుభవంగా , చారిత్రిక అనుభవంగా చేసుకొని ఉద్యామిస్తూ ఉంటే వారికి జతగా ఉపాధ్యాయులు,  తలిదండ్రులు,  మొత్తంగా పౌర సమాజం ఉద్యామిస్తే దప్ప ఈ విద్యా రంగ సంస్యలకు  పరిష్కారం లభించబోదు.  


Tuesday, September 29, 2020

                        విద్యా చట్టం 2020  పైన REBS అభిప్రాయం. 


కస్తూరి రంగన్ విద్యాచట్టం 2020 పైన ప్రధానమంత్రి మోడి మొదలుకొని వారి పాలక పార్టీ వాళ్లందరితో బాటుగా ఆ రాజకీయాలను అభిమానించే వారంతా ఇంత మంచి విద్యా చట్టం నభూతో నభవిష్యత్ అంటూ ప్రశంసించారు. కొందరు విద్యావేత్తలు మాత్రం ఇది గత విద్యాచట్టాలకంటే ఏమీ భిన్నమైనది కాదూ అంటూనే ఇంకా అపకారం చేసేదిగా కూడా ఉందని అన్నారు.


వేదకాలం లో విద్య కేవలం  కైవల్య ప్రాప్తి కోసం అని చెప్పారు. పారిశ్రామిక విప్లవం తర్వాత కాలం నుండి అది పెట్టుబడిదారుల యంత్ర కొరలను పదునుపెట్టడానికి ఉపయోగ పడుతూ వస్తున్నది.  అసలు విద్య అంటే ఏమిటి? అది నూతనసమాజ నిర్మానికి ఎలా దోహద పడేవిధంగా ఉండాలనేది ప్రశ్న. 


 తనకంటే ముందు పుట్టిన ప్రాణుల్లో ఉన్న జీన్స్  నుండి  కొన్ని జ్ఞానాలు సహజంగానే ప్రతి ప్రాణికి పుట్టుకతోనే వస్తాయి.  సహజంగా ఉన్న జ్ఞానానికి మెరుగులు దిద్దుతూ , ప్రకృతి, పరిసరాలలో ఉండే  కొత్త జ్ఞానాలను నేర్చుకుంటూ , ఈ ప్రకృతి , ఈ సమాజం మొత్తం సహకారం వల్లనే తాను  సౌకర్యవంతంగా  జీవిస్తున్నా అనే ఎరుక కలిగి,   తనతో బాటుగా, తనతో  సమానంగా  పశుపక్షాదులు, ఇతర జీవులు, ప్రకృతి , పర్యావరనం  సమతుల్యంగా , మనగలిగే విధంగా, తాను  సహకరించడానికి అవసరమైన జ్ఞానం కలిగించే విధమైనదిగా విద్య ఉండాలి. 


ఇక కస్తూరి రంగన్ విద్యాచట్టం  2020 కి వస్తే, దాని ముసాయిదా వచ్చినప్పుడే REBS స్పందించి 28 జులై 2019 నాడు  విద్యారంగ అభిమానులతో హైద్రాబాద్ లో ఒక సమావేశం నిర్వహించినాము.ముసాయిదా లో   ప్రస్తావించిన, మాతృ భాషలో విద్య,  పూర్వ ప్రాథమిక విద్య, విద్యకు బడ్జెట్ లో ఇచ్చే ప్రాముఖ్యత , పరీక్ష విధానం లో తేనున్న  మార్పుల గురించి ఆహ్వానిస్తూనే ,పూర్వ ప్రాథమిక విద్య పైన, మాతృభాషన్లో బోధన పైన, రాష్ట్ర జాబితా లో విద్య గురించి , కామన్ స్కూల్ విధానం గురించి, ఉపాధ్యాయ శిక్షణ, నియామకాలు, కారికులం, పాఠ్యపుస్తకాల భారం , పరీక్ష విధానం, మూల్యాంకనం, మొదలగు అంశాల పైన సూచనలు చేస్తూనే మొత్తంగా విద్య ప్రభుత్వరంగం లోనే నిర్వహించాలి కోరి యున్నాము. 


కానీ తీరా ముసాయిదా, చట్టం అయివచ్చిన తర్వాత, పూర్వప్రాథమిక విద్య అదే అంగన్వాడీ లల్లో ఉండేవిధంగానే ఉంది. మాతృభాషలో బోధన కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలకె పరిమిత మయ్యేవిధంగా ఉంది. బడ్జెట్ లో 6% అన్న మాట GDP లో 6% కు మాయ జేశారు. త్రిభాషా సూత్రం అంటూ దక్షిణ భారతం పైన బలవంతంగా హింది రుద్దుతూ ఉత్తరభారతం మాత్రం దక్షినాది భాష నేర్చుకొను ఆనే ఆధిపత్య భావన కనబరుస్తోంది. ఆచరణలో లేని సంస్కృతాన్ని అంటగట్టి ఆనందపడే ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తంగా ప్రైవేట్ పరమ్ జేసెదిగా ఉంది ఈ చట్టం. మరీ ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ రంగం లో పేలవమైన  విద్య, రాజులకు స్టాన్ ఫోర్డ్ స్తాయిలో నాణ్యమైన విద్య లభించే విధమైన ఒక వివక్ష పూరిత విద్యావిధానం కొనసాగే పరిస్తితి కనబడుతోంది. 


రాజ్యం ఏదైనా తన భావజాలానికి అనుగుణంగా, తన ఆర్థిక పునాదిని స్తిరపరుచుకొనే విధంగా ఉపరితలాంశమైన విద్యను రూపొందించు కుంటుంది. కానీ ఇప్పటి ఈ  భారతదేశం 1947 కు ముంది 650 సంస్తానలతో భిన్న జాతుల , భిన్న సంస్కృతుల , సముదాయం . అదేదీ  పరిగణనలోకే తీసుకోకుండా 3000 ఏండ్ల కిందటి భావజాలాన్ని ముందటేసుకొని తాము అనుకుంటున్న అఖండ భారత భావజాలాన్ని అశేష జన  సమూహం పైన రుద్దే ప్రయత్నం జరుగుతున్నది.  


పెంటయ్య వీరగొని.
రాష్ట్ర ఉపాధ్యక్షులు 
రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ 

Wednesday, August 5, 2020

కొత్తాచూపు కోసం ఎదిరిచూద్దాం !

                                 కొత్త చూపుకోసం ఎదిరిచూద్దాం! 


మొన్నటినుండి వాట్సాప్ లల్లో ఫెస్బుక్ లల్లో సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు అభినందనలు తెలుపుతూ కొందరు పోస్టింగ్లు పెడుతున్నారు. మంచిదే కదా? మెరిటోరియస్ వ్యక్తులను అభినందిస్తే ఆనంద పాడాల్సిందే కదా,  అభ్యంతరం దేనికి అన్న ప్రశ్న సహజంగానే ఎవరైనా వేస్తారు. బ్రిటిష్ పాలకుల నాటి ICS నుండి ఇప్పటి IAS, IPS లవంటి సివిల్ సర్వెంట్స్ అంటే ప్రజల సేవకుల దాకా  ఎవరికి సేవజేస్తున్నారో నేను మరోసారి చెప్పవలసిన అవసరం లేదు. అప్పటి నుండి ఇప్పటి దాకా ఈ సివిల్ సర్వీస్ సేవా రంగం లోకి ప్రధానంగా ఎవరు వస్తున్నారో చూద్దాం. అధికారం చెలాయించడం లో, ఆనందం పొందే వర్గాలు, తనకున్న హోదా ద్వారా లభించే గౌరవ మర్యాదలు, అతిధిసత్కారాలు, ఆదరణల రుచి తెలిసిన వారు మరీ కోరి కోరి ఈ రంగం లోకి వస్తున్నట్లు మనం గంనించ వచ్చు. డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, ఒకప్పుడు ఇంజ నీర్ల కొడుకులు ఇంజనీర్లు, అవుతున్నట్టుగానే సివిల్ సర్వీస్ లో పని జేస్తున్న వ్యక్తులు తమ పిల్లలను ఎన్ని కోచింగ్ లు ఉంటే అన్నీ కోచింగ్ లకు పంపి కొండోకచో తమ పలుకుబడి ఉపోయోగించి  ఇంటెర్వ్యూ లో నెగ్గింపజేసి తమ సంతానాన్ని సివిల్ సర్వెంట్లు గా చేస్తున్నారు.  అడపాదడపా ఎక్కడో ఒకచోట వెనుకబడిన తరగతులకు చెందినవారు కూడా అప్పుడప్పుడు  వస్తున్నారు. ఇక ఉన్న రిజర్వేషన్ అవకాశాన్ని వినియోగించుకొని Sc,St బిడ్డలు కూడా  కొందరు వస్తున్నారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే సివిల్ సర్వీస్ లోకి వస్తున్న మెజారిటీ పిల్లలు సవర్ణులో లేక సంపన్నులో అయి ఉంటున్నారన్న విషయం మనం గమనించాలి. తమ కులం వాడని, తమ మతం వాడని, తన ప్రాంతం వాడని ఎంత పక్షపాత పరిపాలన సాగుతున్నదో చూస్తూనే ఉన్నాం.  ఎలాగో ఓ లాగున వస్తున్నారు సరే! వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి చేస్తున్నారో జగమెరిగిన  సత్యమే కదా? రాజకీయ నాయకుల ప్రజాకర్షణ, ఓట్ల రాజకీయ పథకాలను అమలు చేసే పనిలో వాళ్ళు తీరికలేకుండా పనిజేస్తున్నారు. ఎక్కడో మచ్చుకు ఒక శంకరన్ లాంటి ప్రజాసేవా తత్పరతులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒక పూనమ్ మాలకొండయ్య లాంటి ఖచ్చితమైన అధికారులు అక్కడక్కడ కనిపిస్తుంటారు . సెలక్ట్ అయినకాన్నుంచి వాళ్ళకు లభించే శిక్షణ, దర్జా, సౌకర్యాలు, నౌకార్లు,చౌకర్లు, కార్లు, బంగ్లాలు, సేవకులు, లాంటి అనేక రాజలాంచనాలు ప్రజల డబ్బులతో సమకూర్చబడుతాయి. కానీ మెజారిటీ సివిల్ సర్వెంట్లు ఒక  PM,CM , Ministers, కు ఇచ్చే విలువలో పైసా వంతు కూడా సామాన్య ప్రజలకు ఇవ్వంగా నేనైతే చూడలేదు. మరి అంతంతేసి చదువులు చదివిన వివేచనా  పరులని, అత్యంత తెలైవైనవారనీ,  అసాధారణ ప్రజ్ఞావంతులని ఎన్నుకోబడిన ఈ సమూహం అంత స్వార్థ పూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నదంటారు ? అంటే చిన్నప్పటి నుండి తనకు బోధించ బడుతున్న విద్య, మరియు విలువలు ఎలా ఉంటున్నాయో చూడాల్సి ఉంటుంది.  తనకున్న నైపుణ్యం, తెలివితేటలు తన పూర్వీకుల జీన్స్ , తన కృషి ఫలితంగా  కాకుండా పూర్వజన్మ సుకృతం, దైవ కృప అనే ఒక అశాస్త్రీయమైన ఆలోచనా విధానం ఒక కారణమైతే, మరోకారణం సమాజం లో , నీవు ఎట్లా సంపాదించావనేది కాకుండా ఎంత సంపాదించావనే ప్రాతిపదికన గౌరవ మర్యాదలు లభించడం ఇంకో కారణం . 1947 నుండి మనం గమనిస్తే ఆ తొలి రోజుల్లో త్యాగపూరిత ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకోసం పనిజేసిన వారికి గౌరవ మర్యాదలు లభించేవే. కానీ ఇప్పుడు అతనికి ఉన్న సంపదను బట్టి అతనికి మర్యాద దొరుకుతున్నది. ఇప్పుడు చాలమందికి ఆదర్శం అంబానీలు, ఆదానీలు, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఉన్న వ్యక్తులు ఆరాధ్యం అయి కూర్చుంటున్నారు. కనుక ఆ పోటీలో ఎవరికి ఎంత చేతనైతే అంతా కూడబట్టుకొనే యావలో ఆ  పరుగుపందెం లో పాల్గొంటూ దక్కినకాడికి చిక్కించుకొనే పనిలో ఉంటున్నారు. ఇది కేవలం సివిల్ సర్వెంట్లే అలా చేస్తున్నారా అని వారిని ఆడిపోసుకోలేము. అటెండర్ నుండి IAS, దాకా, వార్డు మెంబర్ నుండి CM, లు PM ల దాకా ఎవరికి అవకాశం లభిస్తే వారు డబ్బుకోసమో అధికారం కోసమో సామాన్య ప్రజల ఎదల పైన్నుండో ,తలల పైన్నుండో ఎదిగి అందలం ఎక్కుతున్నవాళ్లే. అది ఈ కాలం నీతి అయ్యింది. పరుగుపందెం లో నీవు వెనుకబడకూడదనుకుంటే పక్కోడు పడిపోతున్నా నీవు పట్టించుకోవద్దు. దయ, జాలి , కరుణా, సౌభ్రాతృత్వం, సౌశీల్యం వంటి మాటలు  వద్దు, నీ గోల్ వైపు నీవు సాగిపో. నీ లక్ష్యం  డబ్బు సంపాదన, అధికారం సంపాదన అదే నీ కండ్ల ముందు కదులాడాలి. అందుకు నీవు డాక్టరువు అవుతావా? ఇంజనీరువు అవుతావా? సివిల్ సర్వెంటువు , రాజకీయనాయకుడువి అవుతావా? లేకుంటే బాబా అయినా ఫరువాలేదు  అన్న నీతి చలామణిలో ఉంది. 


ఇది మారాలంటే బడులు, విశ్వవిద్యాలయాలు, ఆరోగ్యశాలలు, అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. అందుకు ప్రజా ఉద్యమాలు జరుగాలి. 


Tuesday, August 4, 2020

భారతమా ఎటువైపు నీ పయనం.


                                               భారతమా ఎటువైపు నీ పయనం !


మునుపెన్నడూ కనీవినీ ఎరుగని  ఒక భయానకమైన ప అరిస్తితి. పులి దాడికి ఆలమంద జడిసి పరుగులిడినప్పటి పరిస్తితి. ఆనాడు ఆలమందకు ఓ  బోయిడు ఉన్నాడు కనుక  బతికున్న మందకు ధైర్యానికి  నేనున్నాను భయం వీడి మేతమేయండి అని ధైర్యం చెప్పే ఉంటాడు.  కానీ ఇప్పుడేమో సర్కారు మీడియా కలిసి కావాల్సినంత భయాన్ని కుమ్మరించి తడిసి వణుకుతున్న జనాల్ని పట్టించుకోకుండా రొమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకొన్న రొమ్ చక్రవర్తి  చందంగా వారి కంఫర్ట్ జోన్ లో వాళ్ళు హాయిగా బాతాలు జెప్పుతూ బతికేస్తున్నారు. 


రాష్ట్రంలో పార్టీ ఆఫీసుల నిర్మాణాల పైన, అడవులు, గుట్టలు నరికెసి నాటిన మొక్కల పైన,  తమ కార్య కర్తలతో రివ్యూ  చేసుకుంటున్నారు. అరే మేరే భయ్యా! ఇప్పుడు అది గాదు కదా కావాల్సింది? మీ ఉర్లే నర్సు, ఉందా? మీ మండలం లో ఉన్న దవాఖాంల డాక్టర్లు, నర్సులు ఎందరున్నారు? మందులున్నాయా? కారెంటైన్ కు సరిపోయే పబ్లిక్ ప్లేస్ లు ఉన్నాయా? ( స్కూల్ భవనమో, పంచాయత్ కార్యాలయామో, ఇంకా ఏదైనా) , మీ గ్రామం ఎవరికైనా కరోనా వస్తే సహకరించి ధైర్యం చెప్పడానికి ఎంతమందితో  వాలెంటీర్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు? నా నుండి (  MP,MLA,MPP,MPTC, Sarpanch) ఏ సహాయం కావాలో చెప్పండి, నేనున్నాను అధైర్యపడవద్దు అని  ధైర్యం చెప్పే నాయకుడే కరువైపోయిండేంది? 


ఇప్పుడు అర్జంటుగా మనుషులకు కావాల్సింది వైద్యశాలలు. కానీ మనం ఏంజెస్తున్నం? గుళ్ళు కడుతున్నం, ఇంకా అడిగితే  ఉన్నవి కూలగొట్టి మరీ కొత్తై కడుతున్నం. భారత ప్రధాన మంత్రి గుడి శంకు స్తాపనకు పోతడు. నరేంద్ర మోడీకి తాను ఏ మతాన్నైనా కలిగి ఉండే హక్కు ఉంటది. కానీ ప్రధాన మంత్రి పదవికి ఏ మతము ఉండదు, రాజ్యాంగ పదవులు మతాతీతమైనవి  అని మన రాజ్యాంగం చెబుతున్నది. కానీ మన ముఖ్యమంత్రులు తమ మత  విశ్వాసాలమేరకు ప్రజల డబ్బులతో గుడులకు మొక్కులు చెల్లించుకుంటరు. రాజకీయ లబ్దికొరకు హజ్ యాత్రికులకు,మసీద్, మందిర  పూజారులకు, ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు చెల్లిస్తారు. బోనాలు, ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ ఈవ్ లు ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తారు. రాజ్యాంగ స్పూర్తి కి ఇది విరుద్ధమైనా  మనం చేస్టలు ఉడిగి చూస్తుంటాము. 


భారత రాజ్యాంగం లో ఉన్న సెక్యులర్ మరియు  సోసియలిస్టిక్ అన్న రెండు పదాలకు ప్రస్తుతం చోటు లేకుండాపాలకులు  జాగ్రత్త పడుతున్నారు.  అప్పటి కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్  ఈ రెండు పదాలను తొలగించి భారత రాజ్యాంగం రీరైట్ చేయాలని ఏకంగా భారత పార్లమెంట్ లోనే చెప్పారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, వారు ఏ మతం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో ఈ దేశం లోని మిగతా ప్రజలంతా అదే విశ్వాసం కలిగి ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం . అవును అలా ఉంటే తప్పేమిటి అన్న ప్రశ్న వేసేవారు ఎక్కువగానే ఉన్నారు. అప్పుడు మరి  రాజ్యాంగం లోని మతస్వేచ్ఛకు అర్థం లేకుండా పోతది కదా? అంటే ,  పోతే పోతది కావచ్చు, అయినా ఈ మతం గోల నీకెందుకయ్యా అని మీరనొచ్చు.  అది అంతవరకే అయి ఊరుకోవడం లేదే? మతం ప్రాతిపదికన రాజ్యాధికారానికి వచ్చిన చరిత్ర మన కండ్ల ముందే కదలాడుతున్నది కదా? ఎల్ కె అద్వానీ, మురలి మనోహర జోషి లాంటి వాల్ల రథయాత్ర ఫలితమే గదా బిజెపికి అధికారం ప్రాప్తించింది? సరే ఇప్పుడు వాళ్ళను  భూమి పూజకు పిలువనే లేదట. ఇదికూడా ఒక సంకేతమే, అధికారం ఎవరిచేతిలో ఉంటే వారిమాటే చెల్లుబాటు.  అక్కడ  అంతకు ముందు కృషి చేసిన  వారి పట్ల  కృతజ్ఞత, గౌరవ మర్యాదలు ఉండవలసిన అవసరం లేదని ఈ ఉదంతం నిరూపిస్తున్నది. సరే మత భావనలు పాలన లో అమలు జరిపేవారు  రాజ్యాధికారం లోకి వస్తే నీకో,  సామాన్యులకో జరిగే నస్టమ్ ఏమిటో అన్నది కదా మీ ప్రశ్న? 


కస్తూరి రంగన్ కమిషన్ , బి ఎడ్ ను  4 సంవస్తారాల కోర్స్ చేసింది.  2 సంవస్తారాలు విద్యార్థులకు ఎలా బోధించాలో నేర్పిస్తారట. మిగతా రెండు సంవస్తారాలు దేశం లో అనాదిగా వస్తున్న సనాతన సంస్కృతి , ధర్మాలు, ఇతిహాసాల గొప్పదనం గురించి బోధిస్తారట. అవ్ , బోధిస్తారు,  అయితే తప్పేమిటి?  అంటే ఉపాధ్యాయుని సామాజిక చింతన ఏదైతే తన విద్యార్థులకు అదే బోధిస్తాడు. కనుక ఈ సమాజాన్ని తమ భావజాలానికి అనుగుణంగా, ప్రశ్నించే తత్వం లేకుండా, ఒకడు ఇచ్చేవాడు ఉంటాడు, మనం వాణ్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకొని అడుక్కోవాలి అంతే గాని ఇవి  మా  హక్కులు అంటూ ప్రశ్నించ కూడదు అని నేర్పించే ఉపాధ్యాయుల ను తయారుజేస్తారట .  ఒక మూస ఉంటుంది.  ఆ మూసలో ఏ మట్టి నింపినా ఒకే రకమైన బొమ్మలు వస్తాయి. ఆ మూస ద్వారా  ఎన్నయినా ఒకే రకమైన వినాయకుల విగ్రహాలు తయారు చేయవచ్చు. ఆ మూస తో రాముని విగ్రహాలు చేయలేము. కనుక కొత్త  ఉపాధ్యాయ మూసలను సమాజ నిర్మాణం కోసం తయారు చేసి తేబోతున్నారట. 


ఇక సోసియలిజం అంటే సమానత్వం. వ్యవసాయం మొదలైన తర్వాత ప్రపంచం లో  ఏ సమాజం లో కూడా సమానత్వం లేకుండా పోయింది. భారత దేశం లో మరీ లేకుండా పోయింది. ఇక్కడ కులాలు, వర్ణాలు ఉన్న మూలంగా ఒక కులం ఎక్కువ మరో కులం తక్కువ అనేది అనాదిగా ఉంది. అలాగే స్త్రీలు పురుషులతో సమానం అనే భావన కూడా లేదు. న స్త్రీ స్వతంత్ర మర్హతి అన్నారు. పుస్తకం వనితా విత్తం , పర హస్తం గతం గతః అన్నారు. ఇట్లా ఎన్నయినా చెప్పవచ్చు. ప్రజాస్వామిక పోరాటాలు జరిగిన దేశాలల్లో రంగు, లింగ బేధాల వివక్ష ఉండకూడదన్నారు. ఆ స్పూర్తి మేరకే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ , దండలో దారం వలె రాజ్యాంగ స్పూర్తిలోనే సెక్యులర్ సోసియలిజం భావనల  సువాసనలను భారత రాజ్యాంగానికి అద్దినాడు. కానీ ఆ రెండు పదాలకు నేడు  కాలం చెల్లిపోయింది అంటున్నారు పాలకులు.    


Thursday, July 30, 2020

             కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం పైన REBS స్పందన. 


కేంద్రప్రభుత్వ ఆలోచన మేరకు కస్తూరి రంగన్ రూపొందించిన నూతన విద్యావిధానం  ముసాయిదా పత్రం  పైన గత సంవస్తరమ్ Right Education for Better Society ఆధ్వర్యం లో హైద్రాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి rebs పక్షాన కస్తూరి రంగన్  కమిషన్ కు కొన్ని సూచనలు చేయడం జరిగింది. 


నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నూతన విద్యా  బిల్ లో మేము సూచించిన  కొన్ని సూచనలు పరిగణలోకి తీసుకున్నట్లుగా గమనించినాము. 


1).  ప్రాథమిక స్తాయి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలని rebs పక్షాన మేము కోరి యున్నాము. ప్రభుత్వం అందుకు అంగీకరించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇది అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు గైకొనాలని మేము కోరుతున్నాము. 


2) .  GDP లో 6% శాతం నిధులు ఇస్తామన్న  కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని కూడా కేంద్రం నిర్దేశించాలి .   ఎందుకంటే  విద్యా సెస్సు పేరుతో కేంద్రం  4% శాతం( 3+1) నిధులు ఎలాగూ ప్రజలనుండి వసూలు చేస్తున్నది. అందులో కొంత రాష్ట్రాలకు ఇస్తున్నది కనుక  రాష్ట్రాలు 30% నిధులు కేటాయించాలని కేంద్రం ఆదేశించవచ్చు . 


3). పరీక్షా విధానం కూడా మార్చాలని rebs కోరింది. అయితే అన్నీ తరగతులకు ప్రతి సంవత్సరము జరిపే  వార్షిక పరీక్షలు రద్దు పరుస్తూ కేవలం 3,5,8 తరగతులకు  మాత్రమే పరీక్షలను  పరిమితం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం .  విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం వీటినికూడా రద్దు  చేయాలి అని కోరుతున్నాం. 


4).  నర్మగర్భంగా సంస్కృతాన్ని బోధించే విషయాన్ని విద్యా చట్టం ప్రస్తావించింది . కానీ ఎక్కడా వాడుకలో లేని మృత  భాష అయిన సంస్కృతం లో  ఏదో విద్వత్తు దాగి ఉందన్న భ్రమలో విద్యార్థుల నెత్తిన ఆ భాషను రుద్దడం అశాస్త్రీయం. కనుక ఆ ఆలోచన మానుకోవాలి.  


5). ఉపాధ్యాయ శిక్షణా కోర్స్ డిగ్రీతో కలుపుకొని 4 సంవస్తరాల ఇంటెగ్రేటెడ్  ప్రొఫెషనల్ కోర్స్ గా తేవడాన్ని ఆహ్వానిస్తూనే ప్రాథమిక తరగతులు బోధించడానికి ఇంటర్ తో కలిపి 3 సంవస్తరాల  డిప్లమా ఇంటెగ్రేటెడ్ కోర్స్ కూడా  ఉంటే బాగుంటుంది. 


      ఇంకా చాలా విషయాలల్లో కమిషన్ ఏమి చెప్పిందో ఇంకా పూర్తిగా బయిటకు రాలేదు. కానీ చాలా రోజులనుండి ప్రజాస్వామికవాదులు శాష్ట్రీయ విద్యా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి ఇప్పటి ఈ కోవిడ్ 19 కాలం మంచి సందర్భం.  శాస్త్రీయ విద్యా అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. కా|| ఆకుల భూమయ్య సార్ శాష్ట్రీయ విద్యా పైన చాలా చక్కటి సూచనలతో ఒక పుస్తకం రాశారు. పూర్వకాలం లో విద్య మతాన్ని బోధించేది గా ఉంటే పారిశ్రామిక విప్లవం తర్వాత  పెట్టుబడిదారులకు వాళ్ళ సంపదలు ఇబ్బడి ముబ్బడిగా పెంచే ఒక వనరుగా విద్య ను కొనసాగిస్తున్నారు. భూమి, పర్యావరణం లో భాగమైన ప్రకృతి, జీవజాలం, మనిషి పరస్పర సహకారం తో సహజీవనం చేయడానికి విద్య దోహద పడాలి. అందుకు భూమి, పర్యావరణం, ప్రకృతి సూత్రాలు,  కుటుంబం, సమాజం, ఆహారం, ఆరోగ్యం గురించిన విద్య , విద్యార్థుల వయస్సు ను  దృస్టిలో   పెట్టుకొని ఆయా స్తాయిలకు తగ్గట్టుగా  కరిక్యులం రూపొందించబడాలి. రూపొందించిన కరిక్యులం బోధనకోసం పెడగాజి తోడ్పడాలి. 


ప్రైవేట్ పాఠశాలలు ఒకనాటికి వలె పోల్ట్రీ ఫార్మ్ కేజ్  లల్లో కోడిపిల్లలను ఉంచినట్లు గా ఇప్పుడు పిల్లలను ఉంచి చదువు చెపుతామంటే విచక్షణ జ్ఞానం ఉన్న ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. ఆన్లైన్ బోధనల వలన 70% పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదని సర్వేలు చెబుతున్నాయి. మరి పరిష్కారం ఏమిటి అంటే? సమాఖ్య భావజాలం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలం నుండి డిమాండ్ చేస్తూ వస్తున్నట్లుగా ఇప్పుడు నైబర్ హుడ్ స్కూల్స్ కావాలి. అంటే ఒక వెయ్యి పదిహేను వందల జనాబాకు వారికి నడిచి పోవడానికి అనుకూలమైనంత దూరం లో ఆన్ని సౌకర్యాలతో , చాలినంత మంది ఉపాధ్యాయులతో చక్కని పాఠశాల ఉండాలి.రెండో అంశం  కామన్ స్కూల్స్  కావాలి. అంటే ఆ ఆవాసం లో ఉన్న అందరూ పిల్లలు అదే బడిలో చదువుకోవాలి. ఎక్కడికంటే అక్కడికి ఎత్తిపంపే విధానం రద్దుచేయాలి. ప్రపంచం లో ఎక్కడ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ పద్దతి లేదు. తలిదండ్రుల పెంపకం ,ప్రేమ నుండి దూరం చేసే ఈ దుర్మార్గమైన పద్దతి కేవలం మన దేశం లో అదీ ప్రధానంగా దక్షిణ భారత దేశం లోనే ఎక్కువగా కనిపిస్తున్నది. దానికి సర్కార్లు ఓ  వత్తాసు.


పౌరసమాజం, తలిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు  కోవిడ్ 19 సందర్భాన్ని అయినా పురస్కరించుకొని నైబర్ హుడ్, కామన్ స్కూల్ విధానం కోసం ఇప్పుడైనా ఉద్యమించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తారని ఆశిస్తున్నాము . చాలు,  ఇక చాలు.  మన మన వ్యక్తిగత స్వార్థాల కోసం, మొత్తం సమాజపు బాగుకోరే  మంచి విద్యావిధానాన్ని అమలు పరుచుకోలేని  కారణంగా ఇప్పటికే మన సమాజం చాలా నస్టపోయింది . ఒక ఆహార స్పృహ, ఒక ఆరోగ్య స్పృహ, ఒక సోదరభావం , కరుణ,దయ, జాలి, బాధ్యత, ప్రశ్నించే తత్వం అడుగంటి పోయిన ఒక స్వార్థపూరిత సమాజం లో బతుకుతున్నాం. సరైన విద్యా విధానం ఉంటే వీటన్నిటిని చక్కదిద్దుకోవచ్చు. ఎలా ఆచరణలోకి తెద్దాం ఆలోచించండి !


వీరగొని పెంటయ్య 

రాష్ట్ర ఉపాధ్యక్షులు,

REBS ( రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ) 

  


 


Wednesday, December 25, 2019

కథలు ఎందుకు రాయాలే? ఎట్లా రాయాలే ?

తెలంగాణ రచయితల వేదిక వాళ్ళు ఈ రోజు కథా వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహిస్తే వెల్లుంటి. 
కథలు రాసే యువతరానికి చాలా సూచనలు , సలహాలు ఇచ్చారు సీనియర్ రచయితలు. చాలా మంచి ప్రయత్నం. ఈనాడు ఎవరిని చూసినా , ఏ డాక్తరో, ఇంజనీర్ ఓ, సివిల్ సర్వీసెస్ లోనో  ఉద్యోగం పొంది , బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా సేవలను కొనుక్కొని వాటి ద్వారా ఆనందం పొందండి అంటూ తలిదండ్రులు,కార్పొరేట్ విద్యాలయాలు పిల్లలకు, నేర్పిస్తున్నారు. ఈ క్రమం లో ఆ తలియదండ్రులు కూడా తమ జీవితాల్లో  అనేక ఆనందాలను కోల్పోతూ పిల్లలకోసమే , వారికి సంపాదించి పెట్టడం కోసమే జీవిస్తూ నత్త గుల్లల వలె జీవితాలను మోసుకొని తిరుగుతూ జీవిస్తున్నారు. పిల్లలను కూడా డబ్బులు సంపాదించి పెట్టె యంత్రాల వలె తయారు జేస్తున్నారు.దాని ద్వారా పిల్లలకు సామాజిక అవగాహన లేకుండా పోయి , తోటి వ్యక్తుల పైన బడి దౌర్జన్యంగా అయినా తమకు వాళ్ళ వద్ద నుండి  కావాల్సిందాన్ని వీళ్ళు లాగేసుకుంటున్నారు. అది ఒక రకంగా తమ హక్కు అని కూడా భావిస్తున్నారు. పౌర సమాజం ఒక శరీరం లాంటిది. శారీరానికి ఎక్కడ గాయమైనా శరీరం అంతా బాధ పడుతుంది. 

అందుకని పిల్లలకు మొదటి నుండి కన్న తలిదండ్రులు ,  తమతో బాటే పుట్టిపెరిగిన అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, అమ్మమ్మ, , నాయనమ్మలు, తాతలు, ఇరుగు పొరుగు, వాడకట్టు, ఊరూ వాడా జనుల సహకారం తోనే నీవు పొందిన, లేదా పొందుతున్న ఏ జ్ఞానం అయినా ఏ సౌకర్యం అయినా సాధ్యం అయిందన్న విషయం వాళ్ళకు అర్థం చేయించాలి. అందుకు కథలు చాలా దోహద పడుతాయి. అందుకే పిల్లలు చిన్నప్పటి నుండి కథలు చెప్పుమని అడుగుతుంటారు. కానీ తలిదండ్రులు వారికి కథలు చెప్పే ఓపిక లేక, చెప్పగలిగిన పెద్దవాళ్లను ఇంట్లో ఉండనివ్వక వృద్ధాశ్రమాలకు పంపి, వీళ్ళు టీవీలకు గుడ్లప్పగిస్తే పిల్లలు సెల్ఫోన్లకు కల్లప్పగిస్తున్నారు. పిల్లలను బిజీగా ఉంచగలిగితే వాళ్ళు అసలు సెల్ఫోన్ జోలికి పోరుగాకపోరు. ఉపాధ్యాయులు గానీ తలిదండ్రులు గాని తలుచుకుంటే  అద్భుతమైన కథలను పిల్లలచేత రాయించ వచ్చు. ( నేను అలుగునూర్ హైస్కూల్లో ఉండగా మానేరు గొడపత్రిక ద్వారా పిల్లల రచనలు కొల్లలుగా రాయించాము). అయితే పిల్లలకు ముందుగా మనం కథలు చెప్పాలి. ఏ కథలు చెప్పాలి? పిల్లల స్తాయికి తగ్గ, వారు ఆర్థమ్ చేసుకోగలిగిన స్తాయి కథలు చెప్పాలి. అవి ఏవి అయినా పరస్పరం సహకార పద్దతిలో , ఆనందంగా కలిసి జీవించే విధమైన, అందులో కొంత హాస్యం పాలు, మరికొంత కుతూహలం తొంగి చూసే విధంగా ఉండాలి. కొన్ని కొన్ని పరుల కోసం పాటుబడే హీరో యిజం కథలు కూడా ఉండాలి. అందుకోసం మనం చెప్పే కథలు గాకుండా పిల్లల చేత తప్పకుండా వారానికి రెండు మూడైనా కథల పుస్త కాలు చదివించాలి. 

ఇక ఇక్కడ కతా వర్క్ షాప్ విషయానికి వస్తే , కథలు రాసే వాళ్ళు ఎందుకు కథలు రాయాలి? ఎలాంటి కథలు రాయాలి? అన్నప్పుడు, మనిషి సంఘ జీవి. తనకు తెలిసిన విషయాన్ని మరొకరితో పంచుకోవాలి అనేది మనిషి స్వభావం. అందుకని తనకు తెలిసినది అంతా పంచుకొనే పనిలో ఉంటే ఆ మనిషి ఇంకా మరే పని చేయలేడు. అయితే మరి ఏవి పంచుకోవాలి? ఆనందం తో కలిసి బతకడానికి , సహకారం తో కలిసి బతుకడానికి, పక్కవాళ్ళకు ఉపయోగం అయ్యే విషయాలను తెలుపడానికి మనకు తెలిసిన విషయాన్ని పంచుకోవాలి. ఎలా పంచుకుంటావు? అందరికీ నీవొక్కనివే చెప్పలేవుకదా? అందుకే రాతలు. , అవి కథలు, అవి కవితలు, అవి వ్యాసాలు, కతలైతే కుతూహలాన్ని కలిగిస్తాయి. చదివిస్తాయి.కనుక కథను ఏనూకున్నావు . సరే.  కథలు రాయడానికి మన వద్ద సమాచారం ఉండాలి. అందుకు పరిశీలనా జ్ఞానం కావాలి. ఎలా పరిశీలిస్తావు? అందుకు నీకోక దృక్పథం కావాలి. ఏమి దృక్పథం? కొందరికి భక్తి దృక్పథం. అది వారికి మాత్రమే ఆనందం ఇస్తుంది. కొందరికి భజన దృక్పథం అది వారికి మాత్రమే భుక్తిని ఇస్తుంది. కొందరికి వర్గ దృక్పథం. అది అశేష జనబాహుల్యానికి అన్నపానాదులను అందించడం మాత్రమే గాక సమ భావం తో సంతోషంగా కలిసి జెవించడం నేర్పిస్తుంది. మరి ఆ దృక్పథం అలవడాలంటే ఏమి చేయాలంటే, ఆదివరకే ఆ కోణం లో ఉన్న రచనలను చదువాలి. ఆ కోణం లో ఎవరెవరు రాశారో తెలుసు కోవాలి. పురాణ కాలం లో అయితే చార్వాకులు, లోకాయుతులు, ఆ తర్వాత మత రాజ్యాలు వచ్చిన తర్వాత వాటిని ప్రశ్నించిన భక్తి ఉద్యమ కారులు. భారత స్వాతంత్రోద్యమ కాలం నాటికి భగత్ సింగ్. ఆయనకు ఆ దారి చూపిన ప్రపంచ దేశాల వర్గ పోరాటాలు. వాటికి ఆలంబనగా నిలిచిన సిద్ధాంతాలు. హేతువాద దృక్పథం. హేతువాద కొనసాగింపుగా వచ్చిన అందరికీ అన్నీ సమానంగా దక్కాలి అన్న నినాదం.  ఈ బూమి పైన పుట్టిన మానవులంతా సమానమే. ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఎవరైనా మేము ఎక్కువ మాకు మీ కంటే కొంచెం ఎక్కువ దక్కాలే అని అంటే మాత్రం ఖచ్చితంగా అలా కోరిన వాళ్ళు మరొకరి అవకాశాన్ని దోచుకున్నట్టే. కనుక ఉత్పత్తి అయినది అంతా సమానంగా పంచవడాలే. అనే వాదన ముందుకు వచ్చింది. ఆ వాదనను కాదనే వాడు ఎవడైనా వాడు దోపిడీ దారే. ఈ వర్గ స్పృహ పొందడానికి వర్గపోరాటాల పైన వచ్చిన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి అని చెప్పాలే. ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్నా బుక్ ఎక్సిబిషన్ ను పుస్తక ప్రియులు వినియోగించుకోవాలి . 

Sunday, December 1, 2019

ఆర్టీసీ సమ్మె - ఉద్యోగుల పై కెసిఆర్ వరాల జల్లు.

                        

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె జేసినన్ని రోజులు వాళ్ళ పైన ఉరుములు పిడుగులు కురిపించిన వ్యక్తి అకస్మాత్తుగా ఇయ్యాల వరాల జల్లు ఎందుకు కురిపించి నట్టు? కొందరు 
టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు కీర్తిస్తున్నట్టుగా ఆయన కరుణామయుడు, చేతికి ఎముకలేని  అపర దానకర్ణుడేనా ? లేక ప్రజాస్వామిక ఆకాంక్షలకు విలువ ఇచ్చే ఉద్యమనేతనేనా ఆలోచిద్దాం. 

ఆర్‌టి‌సి ని రక్షించుకుందాం అన్న నినాదం తో, ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో బాటుగా వారి సర్వీస్ రూల్స్ కు , సౌకర్యాలకు సంబంధించిన మరికొన్ని డిమాండ్స్ తో ఆర్టీసీ ఉద్యోగ్గులు 4అక్టోబర్ నుండి సమ్మేలోకి దిగిన నాటినుండే సియెమ్ కెసిఆర్ నేరుగా రంగం లోకి దిగి సమ్మెను ఉక్కుపాదం తో అణగదొక్కే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆర్టీసీ ఎండి గాని, కార్మిక శాఖ అధికారులు గాని, ఆర్టీసీ మంత్రి గాని దశలవారిగా స్పందించాల్సి ఉండగా నేరుగా సియెమ్ ఎందుకు కలుగ జేసుకున్నట్టు అని ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన మందకృష్ణ, కోదండరాం , బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తూనే ,  ఆర్టీసీ ఆస్తులపైన కన్నెసే సియెమ్ నేరుగా జోక్యం చేసుకున్నారు అని విమర్శలకు పూనుకున్నారు. ఖమ్మం లో శ్రీనివాసరెడ్డి ఆనే ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య కు పాల్పడేదాక ఆర్టీసీ మంత్రి, కొందరు బంగారు తెలంగాణ గ్రూప్ మంత్రులు ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సమ్మెను వ్యతృరేకిస్తూ మీడియా ముందు మాట్లాడినా శ్రీనివాస రెడ్డి మరణం తర్వాత అంతా సైలెంట్ అయిపోయినారు. కానీ సమ్మె ఉదృతం అవుతున్న క్రమం లో స్వయంగా ముఖ్యమంత్రే గంటల తరబడి సమీక్షలు జరిపి,గడువు లోగా డ్యూటీ లో జైన కాకుంటే సెల్ఫ్ డిస్మిస్సే అన్నాడు. ఆయన మాటను ఆర్టీసీ ఉద్యోగులు ఖాతరు చేయకపోవడం తో ఆర్టీసీ ని ప్రైవేటీకరిస్తున్నా అని, ఆర్టీసీ మూసి వేత , సమ్మె ముగింపు రెండు ఏకకాలం లో జరుగుతాయి అని ఉద్యోగులను భయభ్రాంతులకు గురిజేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు అభద్రతా భావానికి గురి అయిన కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా , అలా ఎవ్వరూ చేయవద్దు నిలబడి కలబడుదాం అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ , మరో వైపు ఆర్టీసీ నస్టాల కు కారణాలను , కారకులను గణాంకాలతో సహా ప్రజలముందు  బహిరంగ పరిచి ప్రజల మద్దతుకోసం చేతులు జోడించి , ప్రభుత్వ దాస్టీకాన్ని ప్రజలముందు బట్టబయలు చేస్తూనే , ఉద్యోగులు ఎంతమాత్రం బెదురకుండా తెలంగాణ ఉద్యమం లో చేసినట్లే ఆన్ని పోరాట పద్దతుల్లో మొక్కవోని ధైర్యం తో ఒక్కతాటి పైన నిలిచి పోరాటం చేసినారు. ఉద్యమ నాయకులు గా వ్యక్తులుగా , మంద కృష్ణ, కోదండరాం సమ్మె కు మద్దతుగా నిలబడినా, ఎంతో కొంత ప్రజామద్దతు కలిగిన కాంగ్రెస్, బిజెపి లు సమ్మెకు బయటనుండి మద్దతు గా నిలిచినారే గాని సమ్మేలో ప్రత్యక్షంగా వారి శ్రేణులను పాల్గొన జేసి సమ్మె ఉదృతానికి పూనుకోలేక పోయినారు. సమ్మె కారణంగా తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ప్రతిపక్ష పార్టీలు సొమ్ముజేసుకోలేక పోయాయి. సమ్మె సఫలమైతే అది మా పోరాట పటిమ ఫలితమే అందాం, సఫలం కాకపోతే ప్రభుత్వ నిరంకుశ వైఖరి అంటూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అనుకున్నాయేగాని పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోలేక పోయాయి. కారణం ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేకపోవడం అయినా అయి ఉండవచ్చు, లేదా ప్రపంచ బ్యాంకుకు ప్రీతిపాత్రమైన ప్రైవేటీకరణకు బలమైన మద్దతుదారులు వీరే కావడం మూలాన కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చారు అన్న సామెత  అయినా ఐ ఉండవచ్చు. . 

ఇక సామాన్య ప్రజల వైపు నుండి ఆలోచిస్తే! దసరా పండుగ ముందు సమ్మె జేసుడు సరిగాదని ప్రజలు సమ్మె ప్రారంభం లో కొంత మంది  గొణిగినా ఆ తర్వాత తర్వాత సమ్మెకు ప్రజలనుండి మద్దతు లభించడానికి కారణం, ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం,  డబ్బుల కోసం మిగిలిన ప్రభుత్వ సంస్తలవలే ప్రజలను వేధించిన సందర్భాలు లేవు, అవకాశం కూడా లేదు. అంటే ఎలాంటి అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా , వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా ప్రజలకు తమ సేవలను ప్రతిదినం కనీసం 8 గంటల పాటు అందజేస్తు,  నిత్యం ప్రజలతో కలిసి పనిజేస్తున్నతక్కువ వేతనం పొందుతున్న కస్టజీవులైన ఉద్యోగులు వీరే కావడం ఒక కారణం అయితే, చక్కని శిక్షణతో, క్రమశిక్షణ తో అతి తక్కువ ప్రమాదాలతో భద్రతాయుతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందజేస్తున్న ఏకైక సంస్త ఆర్టీసీ కావడం కూడా ప్రజల మద్దతు వీరికి లభించడానికి మరో కారణం.

ఒక వైపు సియెమ్ దఫా దఫాలుగా రోజులకొద్ది సమీక్షలు జరుపుతూ ఆర్టీసీ ని  మూసువేస్తున్నాం అని ప్రకటనలు చేయడం, మరోవైపు ఆత్మస్తైర్యమ్ కోల్పోయిన ఉద్యోగులు నాదే చివరిమారణం కావాలి అంటూ పిట్టల్లా రాలిపోతుంటే ,ఏకతాటి పై  ఎంత సంఘటితంగా ఉద్యమం సాగుతున్నా కూడా , మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి అంటే ఉద్యమాన్ని ఆపక తప్పని పరిస్తితిలో సమ్మెను విరమించి బేషరతుగా మేము డ్యూటీ లో చేరుతున్నాం అని కార్మికులు ముందుకు వచ్చారు. ఉద్యమం ఇక్కడే అసలైన మలుపు తీసుకుంది.31 మంది తమ సహచరులను కోల్పోయారు, మరో పది మందిని బస్సులు తొక్కి చంపివేసినాయి. లాఠీ చార్జీలతో వేలాది మంది గాయపడ్డారు. బేషరతు గా డ్యూటీలో చేరుతామ్ అంటే గూడా ఒప్పుకోకుండా తన్ని తరిమి వేస్తున్న ప్రభుత్వ వైఖరికి  అవమాన భారం తో అల్పజీవులైన ఉద్యోగులు అందునా ఆడ బిడ్డలు మీడియా ముందు లాఠీల గాయాలు చూపెడుతూ గోడు గొడున విలపించిన తీరు సామాన్య ప్రజల హృదయాలను కలిచి వేసింది. ఔరా! ప్రజలు ఇచ్చిన అధికారం ఆసరాతో ప్రజలపైన్నే ఇంత దాస్టీకమా ? ఇది రాచరిక వ్యవస్తా కూడా కాదే, ఇవాళ వారి వంతు అయింది కావచ్చు రేపు అది ఎవరి వంతు అయినా ఆశ్చర్యపడవలసిన పని లేదుకదా అంటూ ప్రజలు పెదవులు కొరుక్కోవడం ప్రభుత్వ వేగుల కంట పడక పోలేదు. అలాగే బహుశా ప్రభుత్వ శ్రేయోభి లాషులు ఎవరో సియెమ్ గారికి ప్రజల్లో రగులు తున్న కోపాగ్ని బడబానలం వలన ప్రభుత్వ ప్రతిస్ట కొంతైనా మసక బారే అవకాశం ఉందని నచ్చ చెప్పినట్టే ఉంది. లేకుంటే కోర్టు మందలింపులకు గాని, ప్రతిపక్షాల ఆడిపోసుకునుడుకు గానీ, 52 రోజుల సమ్మెకు గానీ, మొత్తంగా ఓ 40 మంది ప్రాణాలు పోయినా బెట్టు సడలని పట్టుదల, సామాన్య ప్రజలు పళ్ళు బిగించి కళ్ళు తెరువంగానే సట్టున చల్లారి ఇవ్వాళ సాయంత్రం వరాలు వర్షించింది అంటే అది ప్రజల విజయం గాక మరేమిటి? 

ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఫ్యూడలిస్టిక్ అధికార ఆహాన్ని కొంత సంతృప్తి పరిచినట్లుగానే ఉంది. సియెమ్ తలుచుకుంటే ఎవరి అసంతృప్తి అయినా ఏమీ చేయదు, 

అది ప్రతిపక్షమైనా ,స్వపక్షమైనా .  ఎవరు ఏ సమ్మెలు చేసినా ఆయన అదరడు బెదరడు, ఆయన అలిగితే అవతలి వారి ఆశలు మలిగిపోతాయి , ఆయన కరుణిస్తే అవతలి వారి ఆశలు వెలిగిపోతాయి. ఆయన రాజు. దానకర్ణ మహారాజు. దండించనూ గలడు, దయచూపనూ గలడు. కనుక  బహుపరాక్ అంటూ ఒక హెచ్చరికను గూడా ఈ సందర్భంగా జారీ చేసినట్లు అయింది.