Thursday, July 30, 2020

             కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం పైన REBS స్పందన. 


కేంద్రప్రభుత్వ ఆలోచన మేరకు కస్తూరి రంగన్ రూపొందించిన నూతన విద్యావిధానం  ముసాయిదా పత్రం  పైన గత సంవస్తరమ్ Right Education for Better Society ఆధ్వర్యం లో హైద్రాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి rebs పక్షాన కస్తూరి రంగన్  కమిషన్ కు కొన్ని సూచనలు చేయడం జరిగింది. 


నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నూతన విద్యా  బిల్ లో మేము సూచించిన  కొన్ని సూచనలు పరిగణలోకి తీసుకున్నట్లుగా గమనించినాము. 


1).  ప్రాథమిక స్తాయి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలని rebs పక్షాన మేము కోరి యున్నాము. ప్రభుత్వం అందుకు అంగీకరించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇది అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు గైకొనాలని మేము కోరుతున్నాము. 


2) .  GDP లో 6% శాతం నిధులు ఇస్తామన్న  కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని కూడా కేంద్రం నిర్దేశించాలి .   ఎందుకంటే  విద్యా సెస్సు పేరుతో కేంద్రం  4% శాతం( 3+1) నిధులు ఎలాగూ ప్రజలనుండి వసూలు చేస్తున్నది. అందులో కొంత రాష్ట్రాలకు ఇస్తున్నది కనుక  రాష్ట్రాలు 30% నిధులు కేటాయించాలని కేంద్రం ఆదేశించవచ్చు . 


3). పరీక్షా విధానం కూడా మార్చాలని rebs కోరింది. అయితే అన్నీ తరగతులకు ప్రతి సంవత్సరము జరిపే  వార్షిక పరీక్షలు రద్దు పరుస్తూ కేవలం 3,5,8 తరగతులకు  మాత్రమే పరీక్షలను  పరిమితం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం .  విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం వీటినికూడా రద్దు  చేయాలి అని కోరుతున్నాం. 


4).  నర్మగర్భంగా సంస్కృతాన్ని బోధించే విషయాన్ని విద్యా చట్టం ప్రస్తావించింది . కానీ ఎక్కడా వాడుకలో లేని మృత  భాష అయిన సంస్కృతం లో  ఏదో విద్వత్తు దాగి ఉందన్న భ్రమలో విద్యార్థుల నెత్తిన ఆ భాషను రుద్దడం అశాస్త్రీయం. కనుక ఆ ఆలోచన మానుకోవాలి.  


5). ఉపాధ్యాయ శిక్షణా కోర్స్ డిగ్రీతో కలుపుకొని 4 సంవస్తరాల ఇంటెగ్రేటెడ్  ప్రొఫెషనల్ కోర్స్ గా తేవడాన్ని ఆహ్వానిస్తూనే ప్రాథమిక తరగతులు బోధించడానికి ఇంటర్ తో కలిపి 3 సంవస్తరాల  డిప్లమా ఇంటెగ్రేటెడ్ కోర్స్ కూడా  ఉంటే బాగుంటుంది. 


      ఇంకా చాలా విషయాలల్లో కమిషన్ ఏమి చెప్పిందో ఇంకా పూర్తిగా బయిటకు రాలేదు. కానీ చాలా రోజులనుండి ప్రజాస్వామికవాదులు శాష్ట్రీయ విద్యా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి ఇప్పటి ఈ కోవిడ్ 19 కాలం మంచి సందర్భం.  శాస్త్రీయ విద్యా అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. కా|| ఆకుల భూమయ్య సార్ శాష్ట్రీయ విద్యా పైన చాలా చక్కటి సూచనలతో ఒక పుస్తకం రాశారు. పూర్వకాలం లో విద్య మతాన్ని బోధించేది గా ఉంటే పారిశ్రామిక విప్లవం తర్వాత  పెట్టుబడిదారులకు వాళ్ళ సంపదలు ఇబ్బడి ముబ్బడిగా పెంచే ఒక వనరుగా విద్య ను కొనసాగిస్తున్నారు. భూమి, పర్యావరణం లో భాగమైన ప్రకృతి, జీవజాలం, మనిషి పరస్పర సహకారం తో సహజీవనం చేయడానికి విద్య దోహద పడాలి. అందుకు భూమి, పర్యావరణం, ప్రకృతి సూత్రాలు,  కుటుంబం, సమాజం, ఆహారం, ఆరోగ్యం గురించిన విద్య , విద్యార్థుల వయస్సు ను  దృస్టిలో   పెట్టుకొని ఆయా స్తాయిలకు తగ్గట్టుగా  కరిక్యులం రూపొందించబడాలి. రూపొందించిన కరిక్యులం బోధనకోసం పెడగాజి తోడ్పడాలి. 


ప్రైవేట్ పాఠశాలలు ఒకనాటికి వలె పోల్ట్రీ ఫార్మ్ కేజ్  లల్లో కోడిపిల్లలను ఉంచినట్లు గా ఇప్పుడు పిల్లలను ఉంచి చదువు చెపుతామంటే విచక్షణ జ్ఞానం ఉన్న ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. ఆన్లైన్ బోధనల వలన 70% పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదని సర్వేలు చెబుతున్నాయి. మరి పరిష్కారం ఏమిటి అంటే? సమాఖ్య భావజాలం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలం నుండి డిమాండ్ చేస్తూ వస్తున్నట్లుగా ఇప్పుడు నైబర్ హుడ్ స్కూల్స్ కావాలి. అంటే ఒక వెయ్యి పదిహేను వందల జనాబాకు వారికి నడిచి పోవడానికి అనుకూలమైనంత దూరం లో ఆన్ని సౌకర్యాలతో , చాలినంత మంది ఉపాధ్యాయులతో చక్కని పాఠశాల ఉండాలి.రెండో అంశం  కామన్ స్కూల్స్  కావాలి. అంటే ఆ ఆవాసం లో ఉన్న అందరూ పిల్లలు అదే బడిలో చదువుకోవాలి. ఎక్కడికంటే అక్కడికి ఎత్తిపంపే విధానం రద్దుచేయాలి. ప్రపంచం లో ఎక్కడ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ పద్దతి లేదు. తలిదండ్రుల పెంపకం ,ప్రేమ నుండి దూరం చేసే ఈ దుర్మార్గమైన పద్దతి కేవలం మన దేశం లో అదీ ప్రధానంగా దక్షిణ భారత దేశం లోనే ఎక్కువగా కనిపిస్తున్నది. దానికి సర్కార్లు ఓ  వత్తాసు.


పౌరసమాజం, తలిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు  కోవిడ్ 19 సందర్భాన్ని అయినా పురస్కరించుకొని నైబర్ హుడ్, కామన్ స్కూల్ విధానం కోసం ఇప్పుడైనా ఉద్యమించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తారని ఆశిస్తున్నాము . చాలు,  ఇక చాలు.  మన మన వ్యక్తిగత స్వార్థాల కోసం, మొత్తం సమాజపు బాగుకోరే  మంచి విద్యావిధానాన్ని అమలు పరుచుకోలేని  కారణంగా ఇప్పటికే మన సమాజం చాలా నస్టపోయింది . ఒక ఆహార స్పృహ, ఒక ఆరోగ్య స్పృహ, ఒక సోదరభావం , కరుణ,దయ, జాలి, బాధ్యత, ప్రశ్నించే తత్వం అడుగంటి పోయిన ఒక స్వార్థపూరిత సమాజం లో బతుకుతున్నాం. సరైన విద్యా విధానం ఉంటే వీటన్నిటిని చక్కదిద్దుకోవచ్చు. ఎలా ఆచరణలోకి తెద్దాం ఆలోచించండి !


వీరగొని పెంటయ్య 

రాష్ట్ర ఉపాధ్యక్షులు,

REBS ( రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ)