Thursday, December 21, 2017

మనుసుల మాట 19 .

                                           

ఇప్పటికీ సరిగ్గా 16 సంవస్తారాల క్రితం అది , ఇదే డిసెంబర్ 2001 ల నేను మలహార్ మండలం లో ఏం ఈ వో గా పనిజేస్తున్నాను.  చంద్రబాబు సర్కారుల పోలీస్ అధికారం అప్రతిహతంగా  అగ్గై మండుతున్న కాలం.  కొయ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రె పల్లె అనే చిన్నపల్లెటూరు. ఆ పల్లెటూరుకు చెందిన కొందరు యువకులు విప్లవాల బాట వీడి ప్రభుత్వానికి లొంగి పోయారు. మీ చిరకాల కోర్కె ఏదైనా ఉంటే చెప్పండి అన్నారట అప్పటి పోలీస్ ఎస్ పి,  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే వాళ్ళు అప్పుడు, చిన్నప్పుడు  మేము చదువు కోవడానికి మా ఊరిలో బడి లేనందున మేము సమీపాన ఉన్న గంగారం పోవాల్సి వఃచ్చేది, అంత దూరం పోలేక మేము బడికి బందు అయితే అప్పుడు గంగారం లో పనిజేస్తున్న రాజయ్య సార్ రాత్రి పూట వచ్చి మాకు చదువు చెప్పేది. మా ఊర్లో బడి ఉండి ఉంటే మేము కూడా బాగా చదువుకొనే వాళ్ళం , ఉద్యమం లోకి పోకపొయ్యేవాళ్లం అని వాళ్ళు అన్నారట. ఇప్పటికీ మా ఊరిలో బడి లేదు కనుక మా ఊరికి బడి కావాలని అన్నారట.

ఇంకేంది రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా,  ఎం ఈ వో ఐన నాకు ఓ లెటర్ వచ్చింది. గొర్రె పల్లేకు బడి కావాలే అని. ఐతే అప్పటి రూల్స్ ప్రకారం ప్రతి ఆవాసానికి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలనే నిబంధన మేరకు ఒక టీచర్ ను అప్పటికే  మంజురి ఇచ్చారు. కానీ అక్కడ బడి బంగ్లా అప్పటికి మంజూరీ కానందున పిల్లల అవసరం రీత్యా వల్లెమ్కుంట లో ఆ టీచర్ పనిజేస్తున్నాడని,  గొర్రెపల్లే ఆవాసం పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారని నివేదిక ఇచ్చాను. ఇంకేంది ఎస్ పి సాబ్ ఆదేశాల మేరకు అక్కడ బడి పేరుతో ఒక రేకుల షెడ్ వెలిసింది. దాని కి గొర్రెపల్లే ప్రభుత్వ పాఠశాల అన్న  నేమ్ బోర్డ్ తగిలించారు.

దానికి ఒక శుభ ముహూర్తాన ప్రారంభోత్సవ కార్యకారమాన్ని తలపెట్టారు. చుట్టుపక్కల  ప్రతిగ్రామం నుండి ప్రజలను తరలించాలని ,  సర్పంచులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు  పోలీస్ హుకుం వెళ్లింది .వందలాది గా ప్రజలు తరలించబడ్డారు. రేకుల షెడ్ బడి కట్టినదానికంటే నిర్వాహణ ఖర్చు కొన్ని రెట్లు ఎక్కువైందని అక్కడ గోనుక్కోవడం విన్నాను. వచ్చిన సామాన్య ప్రజలకు పులిహోర పోట్లాలు, నీళ్ళ పాకెట్ లు పంచారు. వి ఐ పి లకు మాత్రం కోడి పలావు దావత్ దక్కిందనుకో అది వేరే విషయం.

ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ యువకులు వేదికనుండి మాట్లాడుతూ తాము ఎందుకు లొంగి పోవాల్సి వచ్చిందో చెబుతున్న క్రమం లో అన్నలు అడివిలో ఉంటూ ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నందున మా ప్రాంతం అభివృద్ధి ఆగిపోతున్నదనీ, మాకు రోడ్లు లేనందున మా ప్రాంత ప్రజలు దవఖానాలకు పోలేక పోతున్నారని  ఆ బాధలు చూడలేక, ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై మేము అడివిబాట వదిలినమ్. అడివిల ఉన్నోళ్ళు ఎంత తొందరగా ఆ బాట విడిచి వస్తే అంతా తొందరగా అభివృధ్ధి జరుగుతదీ అని మాట్లాడిండ్రు. నిర్వాహకులు , ఆహ్వానితులు , ఆ ముచ్చట్లు వాళ్లతోని చెప్పించినోళ్ళు అందరూ చప్పట్లు గొట్టిండ్రు.

ఆనాటి ఈ ముచ్చట ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత నాకు ఎందుకు యాదికచ్చిందంటే , ఇప్పుడే టి వి లో ఒక వార్త వచ్చింది , హైద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో మరో 20 అధునాతన డయాలసిస్ కేంద్రాలను సర్కారు నెలకొల్పిందని. వెంటనే నాకు పాపం ఆ లొంగిపోయిన అమాయకుల ఆవేదన యాదికి వచ్చింది. దవాఖానకు పోయేతందుకు రోడ్లు వచ్చినై , . వైద్యం చేసేతందూకు అధునాతనమైన చికిత్స పద్దతులు వచ్చినై. ఆ నాటికి కిడ్నీల ఫెల్యూర్ అనే మాటే  తెలువని సర్కార్ కామ్రేడ్ లకు అభివృధ్ధి పేరుతో  కిడ్నీల వ్యాధులకు డయాలసిస్ కేంద్రాలు వచ్చినై. రానిదల్లా , లేనిదల్లా అందరికీ అంత్యంత ఆవశ్యకమైన ఆరోగ్యం.  మరి అది ఎందుకు లేకుండా పోయిందంటే? అభివృధ్ధి వచ్చింది కదా? వనరుల విధ్వంసం విజృంభిస్తున్నది,  కాలుష్యం పెరిగి పోయింది , ప్రకృతి అంతరించి పోతున్నది. వాటికి కారకులైన .  కోటీశ్వరుల సంఖ్య దేశం లో పెరుగుతున్నది . . దరిద్రుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో రెట్టింపు అయి రోగుల సంఖ్య కూడా అలివిగాని రీతిలో పెరుగిపోతున్నది.  . అందుకని ప్రాణాంతక వ్యాధుల ఉపశమనానికి దవఖానాలు కూడా అదే నిష్పత్తిలో వస్తున్నాయి. దవఖానాల పెట్టుబడి దార్లకు, కాసుల వర్షాన్ని కురిపిస్తున్నై.  కానీ రానిదల్లా, లేనిదల్లా ,  సామాన్య ప్రజలకు ఆహార భద్రత,  ఆరోగ్య భద్రత, తో బాటుగా రాజ్యాంగ బద్ద హక్కైన ఆరోగ్యంగా ఆనందంగా జీవించే హక్కు.

Tuesday, November 28, 2017

మనుసుల మాట 18.

                                                 


ఈ రోజు ఉదయం  నుండి హైద్రాబాద్ లో ఒక వైపు మెట్రో రైల్ ప్రారంభోస్తవం మరోవైపు ఇవాంక నాయకత్వం లో  ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ను టి వి లో చూస్తూ మెదడు వేడెక్కింది. ఏదైనా ఒక మంచి పాట విని  మనుసును ప్రశాంత పర్చుకుందామని యు ట్యూబ్ ను  ఓపెన్ చేసిన. లతా మంగేష్కర్ పాడిన "యే మేరే వతన్ కీ లోగో " పాట ఎంతో హృద్యంగా అంతకంటే ఎక్కువ గంభీరంగా దేశ సరిహద్దుల్లో దేశ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల రక్షణ  కొరకు తమ ప్రాణాలను అరిస్తున్న అమర జవాన్ ల  కుర్బాణీ ని కీర్తిస్తున్నపాట వింటుంటే నిజంగానే షహిదొంకా యాద్ సే అంఖోమే ఆంసూ ఆయా.

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ

తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దీన్ హై హమ్ సబ్కా "
కింది రెండు లైన్లు ఇవ్వాళ చాలా మందే అన్నారు. ఈ రోజు చాలా శుభదినం అనే అన్నారు అందరూ. ఒకటి కాదు రెండు కాదు 180 దేశాల వ్యాపార ప్రతినిధులు భారత దేశం లో  పెట్టుబడులు పెట్టడానికి వచ్చిండ్రు . . వారికి ఫలకు నామా ప్యాలస్ లో నీతి ఆయోగ్ ద్వారా భారత ప్రజల కస్టార్జిత సొమ్ము తోటి  ఒక్కొక్క భోజనానికి 18000 రూపాయల పెట్టి భోజనాలు కూడా పెట్టిచ్చిండ్రు . . వాళ్ళకు మంచిగా తినవెడితే తాగవెడితే వాళ్ళు ఖుషీ అయి చాలా ఉద్యోగాలు కల్పిస్తారని ప్రజల సొమ్ము దండిగానే ఖర్చు చేసి చాలా ఆశలే కల్పిస్తున్నరు అందరు.  ఉద్యోగాలు వస్తే మంచిదే కానీ గత చరిత్ర అనుభవాలు అందుకు భిన్నంగా ఉన్నయి మరి.

1964-65 లో నేను మంథని హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అమెరికా నుండి ఇద్దరు వ్యవసాయ శాస్త్ర వేత్తలు వచ్చిండ్రు. వాళ్ళు ఇక్కడ మనకు కొత్త కొత్త విత్తనాలు ఇచ్చి ఇక్కడి మన వ్యవసాయాన్ని అభివృధ్ధి చేస్తామని వచ్చిండ్రు అన్నరు , కానీ తీరా వాళ్ళు వెళ్ళు పోయిన తర్వాత తెలిసింది వాళ్ళు మన విత్తనాల జీన్స్ ను ఎత్తుకెళ్లి పోయిండ్రని.

మోన్సాంటో కంపనీ అట్లనే బి టి విత్తనాలను ప్రవేశ పెట్టినప్పుడు కూడా ఇక పంట కు ఢోకా ఉండదు రైతుల ఇండ్లు బంగారు గోడలతోటే కట్టుకుంటరు అని ప్రచారం చేసిండ్రు. కానీ మనం ఇక్కడ రోజూ చూస్తున్నం  రైతుల  మరణాల వార్త లేని రోజు ఉంటలేదు.

చంద్రబాబు హయాం లో జినోమ్ వ్యాలీ తోటి ఇంక ఇక్కడ ఔషధాలు కారు చౌకగా లభిస్తాయని అన్నరు. కానీ తీరా ఇక్కడి భూములు పోయినై, ఉన్న భూములల్లో కూడా భూగర్భ జలాలు కలుషితమై కాలకూట విషపు నీళ్ళ నే తాగునీటికి సాగు నీటికి వాడుకొనవలసిన పరిస్తితులు వచ్చినై.

పరాయి దేశం నుండి వస్తున్న వాళ్ళకు కారు చౌకగా భూములు, నీళ్ళు( ఈ నీళ్ళను వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రజలను అప్పులల్లో ముంచుతున్నరని  ప్రతి పక్షపొల్లు ఇప్పటికే ఆడిపోసుకుంటున్నరు), కరెంటు ఉచితంగా ఇచ్చుకుంట వాళ్ళు విసిరేసే చిన్నా చితకా ఉద్యోగాలను మహాప్రసాదంగా భావిస్తున్న పరిస్తితి. కానీ ఆ భూములకే వీళ్ళకు ఇచ్చినట్లే నీళ్ళు కరెంటు, ఎరువులు, విత్తనాలు ,  ఇస్తే మన రైతులే , వీళ్ళు వెదజీమ్మే కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా ఎందరికో ఉపాధి కల్పించే అవకాశం మన వ్యవసాయం లోనే ఉన్న పరిస్తితిని పాలకులు మరిచి పోతున్నరు.

ఆనాడు ఇక్కడి వనరులు దోచుకొనే పోతున్నరని  300 యేండ్లు కోట్లాడి ఒక్క ఆంగేయులను వెళ్లగొట్టగలిగినం . అదీ ఇప్పుడు , ఒక్కరు  కాదు ఇద్దరు కాదు 180 దేశాల వాళ్ళను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాం . దానికి ,

" తుమ్ ఖూబ్ లగాలో నారా
యే శుభ్ దిన్ హై హమారా  

అంటున్నం. కానీ ,

"యే మేరే వతన్ కే లోగో
జర ఆంఖ్ మే భర్ లో పానీ  "

అనే పరిస్తితి రాకుండా జాగ్రత్త పడినమా అనేది నా లాంటి సామాన్యుని ప్రశ్న.

.

Monday, November 20, 2017

ఇంటిమీద ఎవుసమ్ 1 .

ఎవుసమ్
ఈ రోజు మిద్దె తోట ల వంకాయ మొక్కలను నాటినం . మిత్రులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తోట చూడడానికి వచ్చి తాను రాసిన ఇంటి పంట పుస్తకం ఇచ్చిండు.
తోట పెట్టినవ్ సరే ! రేపు రేపు కాయలు గూడా కాస్తాయి గావచ్చు. కానీ నీ తీరుగా ఇంకా పది మంది తోట పెంచాలంటే వారికి స్పూర్తి ఇచ్చే విధంగా నీ అనుభవాలను పది మందికి
పంచి, నీవు ఎందుకు తోటను పెంచాలనే నిర్ణయం తీసుకున్నావో రాయాలని కోరిండు . భూమి నుండి బువ్వదీసే అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు గా , మట్టి పిసికి మట్టి బుక్కిన
మనుషుల సాహ చర్యమ్ కలిగిన కారణాల దృస్ట్యాను , అలాగే కొంత కాలం ఆ పని నుండి దూరమై తిరిగి భూమిపైన కాలూన డానికీ కారణం వివరిస్తూ రాస్తే అది ప్రకృతికి మేలు
జేయడమాత్రమే గాకుండా భూమి తల్లిని కాపాడిన వాళ్ళం కూడా అవుతామని కథా రచయితవు కూడా కనుక నీవు రాయాలని అడిగిండు. అట్లా మొదలయింది ఈ ఎవుసమ్ కథ .
ఇప్పటికీ అరువై ఏండ్ల కిందటి ముచ్చట. అంటే 1 9 5 7 జూన్ మాసం అది. మా ఇంట్ల శిలుకావు అని ఒక ఆవు ఉండేది. డానికీ ఒక కోడె లేగ ఉండేది. దాని పేరు కూడా శిలుకే.
అది పుట్టినప్పుడు మా నాయిన దాని ఊపురానికి తువ్వాల జుట్టి నోటి తోటి పైకి లేపిండట అందుకని అది నడుస్తున్నప్పుడల్లా దాని ఊపురం ఒయ్యారంగా అటుయిటూ ఊగుతుండేది .
ఆ శిలుక కోడె లేగ అన్నా దాని ఊపురంఅటూ ఇటూ ఊగుతుంటే దాని ఉరుకుడు అన్నా నాకు బాగా ఇస్టం ఉండేది.
పాల కోసం ఒక బర్రె ఉండేది. దాని పేరు పాపలి బర్రె. డానికీ ఒక పెయ్య దుడ్డే ఉండేది . ఆ రెండీటీ తో ఆడుకునుడంటే నాకు చాలా ఇస్టమ్ . నేను ఎటుబోతే అవ్వి నా వెంటనే
తిరిగేటియి . ఆటితోటి ఆడుకోవడం ..మా అవ్వ బెట్టే బువ్వ దీనుడు,నా లోకంగా ఉండేది. మాపటీలి పాలకుండ కడుగంగా అవ్వ గీకి పెట్టిన పాలగోకుడు దీనుడు ఇస్టమ్
అసోంటిది మా నాయిన నన్ను బడికి తీసుకొని పోయిండు . ఒక కట్టె పలుక, దాని మీద దిద్దే తందుకు బలుపమ్ ఇచ్చి బల్లే కూసున్ద బెట్టి తన పనికి తను పోయిండు.
నా మనుసంత మాపటీలి అవ్వ గీకి పెట్టె పాలగోకుడు మీద , కొల్లాగ , పెయ్య దుడ్డే మీద.
నరహరి సార్ ఆ ,ఆ లు పెట్టిచ్చిండు పలుక మీద . ఆ, ఆ అనుకుంట దిద్దుమన్నడు .
రెండు మూడు సార్లు దిద్దిన గావచ్చు. నాకు తెలువకుంటనే నా ఇద్దరు దోస్తులు ఎప్పుడో నా మనుసులకు వచ్చి చేరిండ్రు.
ఇగ నా లోకం ల నేను ఉన్న.
ఈపుల సర్రు మని ఒక సరుపు వడ్డది .
అన్నన్న నీయవ్వ ! అనుకుంట ఎనుకకు దిరిగిన .
. చెంప మీద చెళ్లుమని మల్లోటి వడ్డది .
ఏమన్నవురా ? సారు గద్దరాయించిండు .
లాగు దడిసింది . ఏమనలేదు సారు. లాగుడదిసింది అన్న.
చల్ , బేవకూఫ్ , ఇంటికివోయ్యి ఇంకో లాగు దొడుక్కొని రాపో అన్నడు.
కట్టె పలుక భుజమ్మీద పెట్టుకున్న, నీ బడి పీసునా వారేద్దు , ఇంకా నీ బడికి అత్తనా కొడుక అని మనుసుల అనుకుంట ఇంటి దారి వట్టిన .
గలుమ కాడికి వచ్చిన్నో లేదో ఎక్కడికి వోయినవ్ అన్నట్టుగా ఒర్రుకుంట ఉర్కచ్చినయి రెండూ.
ఆ రెండీటీని వట్టుకొని ఎవ్వలకు దొరుక కుంట. జల్లుకచ్చిన మక్కతోట ల జొచ్చిన.
పచ్చటి మక్కతోట , కమ్మటి వాసన. మేము ముగ్గురం అటూ మెసులు తుంటే మక్కా కర్రలకు ఒరుసుకుంటున్నం. మక్క జల్లు కొసలనుంచి పుప్పొడి కుంకుమ తీరుగా
మామీద పడుతుంటే ఇగ దాంట్ల నుంచి బైటికి రా బుద్ది గాలేదు.
నిన్న గట్టిన మోట నీళ్ళకు భూమి మెత్తగ తడిసి ఉన్నది. కుంకుమ తీరుగ మీదబడ్డ పుప్పొడి తోటి కలగలిసి కమ్మటి వాసన .
మన్ను పిస్కు కుంట ఎడ్లను జేసుకుంట, ఎట్లున్నయి ?మీ తీరుగ ఉన్నయా? అని వాటికి జుపుకుంట ఎంతన్న సేపు అట్లనే ఆడుకుంట ఉన్న.
మాపటీలి బర్లచ్చే యేళ్ల అయ్యింది గావచ్చు దుడ్డెబొక్కు ఒర్రుడు షురూ జేసింది.
నాకు గూడ పాలగోకు కుతి లేసుడు మొదలైంది.
నాయిన ఏనంగా జూసిండో . ముసిముసి నవ్వు నవ్వుకుంట అడుగుల అడుగులేసుకుంటా కాలు సప్పుడు గాకుంట మాదగ్గెరికి వచ్చిన సంగతి ఆటలాడుకుంటున్న మేము
గమనించనే లేదు.
నెత్తి మీది బూరు అందుకోని ఆవుదు కాడికి దీసుక పొయ్యి చేతులకంటిన బురుద కడిగి అవ్వకు అప్పజెప్పిండు .
అట్లా మొదలైంది నా ఎడ్లు, ఎవుసమ్ , భూమి సంబంధం కథ.

Thursday, November 16, 2017

గీతా కార్మికుల వెలుగు దివ్వే దేశిని చిన మల్లయ్య.!

                                 

( 20 నవంబర్ 2017 సోమవారం నాడు కరీంనగర్ లో కా: దేశిని చినమల్లయ్య సంస్మరణ సభ సందర్భంగా )

ఒక సామాన్య గీతా కార్మికుడై ఉండీ, కేవలం ఐదవ తరగతి చదువుతోనే  22 సంవస్తరాలు బొమ్మన పెళ్లి గ్రామ సర్పంచ్ గా, 20 సంవస్తరాలు ఇందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా , అదీ ఒక ప్రతిపక్ష పార్టీ అయిన సి పి ఐ నుండి గెలుపొందడం అతని అసామాన్య రాజకీయ చతురతకు , ప్రజా పక్షపాత వ్యక్తిత్వానికి నిదర్శనం.

దేశిని చినమల్లయ్య యుక్తవయస్సు వచ్చేనాటికి పోరాటాల పురిటి గడ్డ హుస్నా బాద్ ప్రాంతం లోని అతని స్వగ్రామం అయిన బొమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న మహ్మదా పూర్ గుట్టల శ్రేణుల్లో  కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కార్యక్రమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నై. సహజంగానే తాటి చెట్లు ఎక్కడానికి రెక్కలు తప్ప మరో ఆధారం లేని దేశిని , కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడు అయినాడు.  .స్తానికునిగా , గీతకార్మినికునిగా మహ్మదా పూర్ గుట్టల శ్రేణి ఆయనకు కొట్టిన పిండి కనుక ,  సాయుధ రైతాంగ గెరిల్లా వీరులకు అన్నపానాదుల కల్పనలో , డెన్ ల నిర్వహణలో , వార్తాహరునిగా  చురుకైన పాత్ర పోషించాడు. తన కనుల ముందే కాకలు తీరిన వీర యోధులు ఒరిగిపోయి , తాను కలల్లుగన్న సమ సమాజ స్వప్నం కూలిపోగా రెక్కలు తెగిన పక్షిలా తిరిగి తన గీతా వృత్తి వైపు రాక తప్పలేదు.

సాయుధ పోరు విరమించిన సి పి ఐ పార్టీ 1952 లో ఎన్నికల బరిలో దిగింది. 1959 లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయత్ రాజ్ చట్టం అమలైంది. తదనంతరం  నిజాయితీకి , నిస్వార్థానికి మారుపేరైన దేశిని మల్లయ్యను ప్రజలు బొమ్మనపెళ్లి గ్రామ సర్పంచగా ఎన్నుకున్నారు.  ఆనాటి నుండి 22 సంవస్తరాలు అప్రతిహతంగా సర్పంచ్ గా గ్రామ ప్రజల ఆదరాభిమానాల మేరకు పనిజేశాడు. 1976-77 లో హుస్నాబాద్ సమితి ప్రసిడెంట్ రాంభూపాల్ రెడ్డి , పదవీచ్యుతుడు అయినందున వైస్ ప్రసిడెంట్ గా ఉన్న మల్లయ్య సమితి ప్రసిడెంట్ అయినాడు. ఎమర్జెన్సీ తర్వాత 1978 లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఇందుర్తి నియోజక వర్గం నుండి ఎమ్మెల్లే గా ఎన్నిక కావడం సామాన్య విషయం కాదు. జాతీయ పార్టీ కాంగ్రెస్, జనతా పార్టే అభ్యర్థులు సంపన్నులు మరియు అగ్రవర్ణాలకు చెందిన వారు అయినప్పటికినీ సి పి ఐ  పార్టీ నుండి  ప్రజల మనిషిగా ఒక సామాన్య గీతా కార్మికుడు తాడి చెట్లు ఎక్కుకుంటూనే ప్రచారం చేసుకొని వచ్చి గెలిచి రావడం ఒక అబ్భురమే ఆనాటికీ ఈనాటికీ.  1985, 1989, 1994 వరుసగా మూడు సార్లు ఇందుర్తి నియోజక వర్గం నుండి వైరి వర్గం ఎంతో బలమైన రాజకీయ ఆర్థిక పునాది కలిగినది అయినప్పటికినీ  ప్రజల మద్దతుతో గెలుపొందాడు. తన నియోజక వర్గ ప్రజలకోసం ఎంతదూరమైనా అలసట లేకుండా బస్సులో, కాలి  నడకన వచ్చి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవాడు. ప్రస్తుత రాజకీయ అవినీతి ఆడంబరాలకు ఆయన ఆమడ దూరం లో ఉండేవాడు. 1999 లో సి పి ఐ కుల రాజకీయ చదరంగం లో దేశీనికి ఇందుర్తి నుండి టికెట్ ఇవ్వలేదు. పైగా ప్రారంభం లో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అది సమర్థించలేదు ,  కనుక అనివార్యంగా సి పి ఐ ని విడిచి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం లోకి  ఉరికినాడు. మొన్న 11 నవంబర్ నాడు తన అంతిమ శ్వాశ విడిచేదాక పీడిత ప్రజానీకం గురించే తపించిన నిస్వార్థ జీవి.

1964 ఆగస్టు లో  ఏపీ కోఆపరేటివ్ ఆక్ట్ వచ్చేదాకా తెలంగాణ లో  దొరలు , భూస్వాములు ప్రభుత్వం వద్ద కలాల్ మాములాను హర్రాజ్ పాడుకొని వచ్చి గ్రామాలల్లోని గీతకార్మికులనుండి  మునాఫా తీసుకొని చెట్లు గీయనిచ్చేవాళ్లు. దొరలు , భూస్వాములు అడిగినంత మునాఫా వెల్లదు , ఇవ్వలేమని వేడుకున్నా గూడా చెట్లను స్తానికులకు ఇవ్వకుండా  వేధించేవాళ్లు. వాస్తవానికి తెలంగాణ గీతకార్మికులకు నైజాం పాలన ప్రత్యక్ష పీడనకంటేగూడా స్తానిక దొరల, భూస్వాముల గడీల పీడనే అధికంగా ఉండేది.  

"మా భూమి"  సినిమా లో "దొరా ! మీరుకొట్టిన దెబ్బలకు గౌండ్ల నారిగాడు సచ్చిపోయిండు . " అంటాడు జీతగాడు.
" గడీ గోడ అవుతల బొంద వెట్టుండ్రి " అంటడు దొర. అటువంటి పరిస్తితిలో దేశిన చిన మల్లయ్య, ధర్మ భిక్షాం గారల నేతృత్వం లో ఖమ్మం జిల్లా గార్ల లో గీతా కార్మికులతో పెద్ద మీటింగ్ జరిపి "కల్లు  గీతా కార్మిక సంఘం " ఏర్పాటుజేసి , హర్రాజ్ విధానం రద్దు జెసి కలాల్ మాములాలను కల్లు గీతా కార్మిక సంఘాలకు అప్పగించాలని ఉద్యమించడం జరిగింది.  దేశిని చినమల్లయ్య, ధర్మ భిక్షం గారల నాయకత్వం  మరియు గీతా కార్మికుల సంఘటిత శక్తి కి దిగివచ్చిన ప్రభుత్వం అప్పటినుండి గీసే వాళ్ళకే చెట్లు అన్న హక్కును కలుగ జేసి హర్రాజ్ విధానానికి స్వస్తి పలికింది .

మారిన కాలానికి అనుగుణంగా చెట్లు ఎక్కే సాధనాలు ఆధునీకరించబడని కారంగా గీస్తున్న చెట్ల పైనుండి గీతకార్మికులు పడి చనిపోతుంటే వారికి ప్రభుత్వం నస్టపరిహారమ్ ఇవ్వాలని అసెంబ్లీ లో పోరాడిన ఫలితంగా 5000 రూపాయలతో ప్రారంభమైన ఎక్స్ గ్రేషియా ఇప్పుడు 5 లక్షలకు చేరడానికి ఆద్యుడు దేశిని చినమల్లయ్య.

ప్రభుత్వాలకు ఆనాటి నుండి నేటి వరకు  కల్లు గీతా వృత్తి ఒక ఆదాయ వనరు. వాస్తవానికి వృత్తులన్నీ అడుగంటి పోయి బతుకు దెరువే గగణమై పోతున్న పరిస్తితి లో ఇంకా కల్లు వృత్తి దారులనుండి పన్ను వసూలు చేయడం దారుణం. అలాగే మినరల్సు, విటమినులు పుష్కలంగా కలిగి ఉన్న నీరా ను నిర్ణీబంధంగా స్వేచ్చ మార్కెట్ లో విక్రయానికి అవకాశం ఇచ్చి గీతా కార్మికుల వృత్తిని బలోపేతం చేయాలని ఉద్యమించే శక్తి యుక్తులు కలిగిన మరో దేశిని చినమల్లయ్య లాంటి యువ నాయకత్వం కోసం  గీతా కార్మిక సమాజం ఎదురు చూస్తున్న క్రమం లో,  ఉన్న వయోవృధ్ధ పెద్ద దిక్కు దేశిని చిన మల్లయ్యను , కోల్పోవడం  గీతా కార్మిక లోకానికి తీరని లోటు.



Thursday, November 9, 2017

.మనుసుల మాట 17.

                                                           
భారత దేశం లోని 2.19 లక్షల మంది కుబేరుల సంపద 87,700 కోట్ల డాలర్లు అంటే అక్షరాల 56.12 లక్షల కోట్ల రూపాయలు. దైనందిన జీవితం లో వారు ఉపయోగించుకొంటున్న స్తిర, చర ఆస్తుల విలువ , వారు సేకరించుకొన్న కళా ఖండాల విలువ కాకుండా కనీసం పది లక్ష్ల డాలర్లు అంటే 6.4 కోట్ల సంపద పై బడి ఆస్తులు కలిగి ఉన్న  లక్స్మీ పుత్రుల జాబితా ఇది. కాప్ జెమినీ అంతర్జాతీయ సంస్త సేకరించిన వివరం ఇది.  

ఆర్థిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత స్టీగ్లిట్జ్ విశ్లేషణ ప్రకారం ప్రపంచం లోని 99 శాతం సంపద కేవలం 1 శాతం గా ఉన్న కుబేరుల వద్ద నే ఉందన్నాడు. ఈ లెక్కన భారత దేశం లోని ఈ 2.19 కుబేరుల పైన ప్రభుత్వం దృస్తి పెడితే సరిపోయే దానికి 130 కోట్ల మంది సామాన్య ప్రజలను నోట్ల రద్దు పేరుతో జి‌ ఎస్ టి పేరుతో రేపు బి టి టి అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ పేరు తో ప్రజలను చావమోది చెవులు మూయడం  ఎందుకన్నది మా లాంటి మంద బుద్ధుల ప్రశ్న .  

ప్యారడైస్ పేపర్ లీక్ లో 740 మంది, పనామా పేపర్ లీక్ లో 500 మంది , స్విస్ బ్యాంక్ వివరాల లీక్ లో 1195 మంది, రాడియా టేప్స్ లో 100 మంది, భారతీయులు , అందులో ;దేశ భక్తుల పేరుతో బడా పెట్టుబడి దారులు,  బ్రాండ్ అంబాసిడర్లు  , కేంద్ర  ప్రబుత్వ క్యాబినెట్ మంత్రులు, వారి ఎంపీలు ఉంటారు కానీ వారిని ఎవరూ ఏమీ అనరు. పైగా ఆ లిస్టులల్లో పేర్లు ఉన్నంత మాత్రాన వారిని తప్పుబట్టలేమని ప్రభుత్వ పెద్దలే వెనుకేసుకొని వస్తున్నారు. మరి  ఇక దొంగలు ఎవ్వరు? సామాన్య ప్రజాలెనా? కండ్లు మూసుకొని మీకు ఓట్లు వేస్తున్నందుకా? మీరు వేస్తున్న పన్నులన్నీ నోరుమూసుకొని చెల్లిస్తున్నందుకా?  ఇన్నేసి కుంభ కొనాలకు ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నాఏనాడూ కూడా  ఇదేందని అడుగని ప్రజల అమాయకత్వమే నేరమా?

ఇంత విస్పస్టంగా ప్రజలందరికీ చెన్దవలసిన సంపద ఎక్కడ పోగై ఉందో తెలుస్తున్నా గూడా అది వెలికి తీసే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా నల్ల డబ్బు పనిబడుతాం, అవినీతి పరుల పై పోరాటం చేస్తాం అంటూ, సంపన్నుల పైన్నే పన్నులు వేసి అట్లా వచ్కిన సంపద పేదలకు పంచుతామని బీరాలు పోతూ  ఎంతకాలం నమ్మబలుకుతారని  ప్రజలు ప్రశ్నించే కాలం ఇంకా ఎంతో దూరం లో లేదు.

రోజూ పత్రికలల్లో చూస్తున్నాం ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చి పెట్టె సంస్తలల్లో పనిజేసే అధికారుల ఇండ్లల్లో, సంక్షేమ పథకాలను అమలుపరిచే సంస్టల్లో పనిజేస్తున్న అధికారుల ఇండ్లల్లో, రక్షణ, నిఘా విభాగాలల్లో పనిజేస్తున్న అధికారుల ఇండ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు లెక్కకు మిక్కిలి కోట్లాది రూపాయుయల ఆస్తులు బట్టబయలు అవుతున్నాయి. తెలుస్తూనే ఉంది కదా సంపద ఎక్కడ పొగైతున్నదో.

ప్రభుత్వాలకు నిజంగానే చిత్త శుద్ది ఉంటే నీతి గా పాలన చేయాలన్న సంకల్పమే ఉంటే మన లాంటి వారం ఎవ్వరమ్ కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేకుండా చాలా తేట తెల్లంగా కనిపిస్తున్న సత్యాలను చూడ  నిరాకరించకుండా చర్యలు గైకొంటే సామాన్యుల పైన భారం తప్పుతుంది.

Wednesday, October 18, 2017

మనుసుల మాట 16.

                                                                 

సంబరాల పేరుతో పటాకులు పేల్చి వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మనుషులు ఆరోగ్యంగా జీవించే ప్రాథమిక హక్కుకు  భంగం వాటిల్లజేయడం మంచిది గాదు అని భారత అత్యున్నత న్యాయస్తానమ్ చెప్పిన తీర్పు నచ్చని కొందరు ఇది మా తరతరాల సాంప్రదాయం అని వాదిస్తున్నారు. అలాగే ఈ రోజు నేను నివసిస్తున్న కరీంనగర్ పట్టణం లో కూడా  మా ఇంటి చుట్టూ విపరీతమైన పటాకలు కాలుస్తున్నారు.  

క్రీ:పూ: 200 సం. లో చైనా వాళ్ళు  దయ్యాలను, భూతాలను పారద్రోలాడానికి కంక బొంగులతో " Baozhu " అనే ఫైర్ క్రాకర్   " బొంగు ప్రేలుడు " ను ఉపయోగించేవారట. ఆ చప్పుడుకు దయ్యాలు దెంక పోతాయని వారివిశ్వాసమట. 9 వ శతాబ్దం నాటికి బొంగు ప్రేలుడునే   చైనా వాళ్ళు అభివృధ్ధి పరిచి గన్ పౌడర్ ను కనుక్కున్నట్లు చెప్పబడుతున్నది. ,1) .కంపాస్.  2 ) గన్ పౌడర్, 3) పేపర్. 4). ప్రింటింగ్ అనేవి ద గ్రేట్ ఫోర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ చైనా అని పిలువబడుతున్నాయి. ఇదంతా అబద్దం మన భారత రామాయణ కాలం లోనే బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం ,ఉండేవి అనే వాదన కూడా ఉంది. కానీ సర్వ వేద విద్యా పారంగతుడైన చాణుక్యుడు క్రీ:పూ: 322-185 కాలం లో చంద్రగుప్తుని తోటి కత్తి యుధ్ధాలే చేయించాడెందుకో  !   క్రీ: శ: 1030 ప్రాంతం లో భారత దేశం పైన 17 సార్లు దండయాత్ర చేసి  సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి 50,000 మందిని చంపి 1,300కిలోల బంగారం, 50,00000 దీనారాలను కొల్లగొట్టుక పోయినపుడు కొట్లాడింది కత్తులు బల్లాల తోటే .  క్రీ: శ: 1178-1192 లో పృథ్వీ రాజ్ చౌహాన్ మహ్మద్ ఘోరీ తో పోరాడినపుడు మన ఆయుధాలు కత్తులు బల్లాలు, బాణాలే.

ప్రారంభం లో సల్ఫర్ , చార్కోల్, పొటాషియం నైట్రేట్ ల మిశ్రమం ఈ గన్ పౌడర్.  గంధకం , చార్కోల్ తో కలిసి మండిన వేడికి   నైట్రైట్  కరిగి వాయు రూపం చెంది అధికంగా వ్యాకోచించి వాటిని చుట్టి ఉన్న గొట్టాన్ని పెద్ద ఫోర్స్ తో బద్దలు గొట్టుకొని పెద్ద శబ్దం తో బయటకు మిరుగులను విరజిమ్మెది. క్రీ: శ: 11 వ శతాబ్దం నాటికి సాంగ వంశ చక్రవర్తి అయిన హ్యూజాంగ్ సాంగ్  దీనిని రాకెట్ గా అభివృధ్ధి పరిచినాడట. క్రీ: శ: 1240 లో చైనా వారినుండి ఈ పరిజ్ఞానాన్ని అరబ్బులు సంపాదించినారట . క్రీ: శ: 14 వ శతాబ్దం లో అరబ్బులు , చైనా నుండి ఈ మందు గుండు సామాగ్రిని  ఇండియా కు మరియు యూరప్ కు తీసుకొని వెళ్ళినట్లు గా చెప్పబడుతోంది. క్రీ: శ: 1497-1539 లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గజపతి ప్రతాపరుద్రదేవుడు రాసిన కౌటుక చింతామణి అను సంస్కృత  గ్రంథం  లో వివాహాది శుభకార్యాలల్లో , పండుగ పబ్బాల సందర్భంగా చైనా లో వాడిన ముడి పదార్థాలు ఇక్కడ లభించనందున  దేశీయ పదార్థాలను వాడి పటాకులను తయారుచేసి  వాడినట్లుగా రాయబడింది.  క్రీ: శ: 1609 లో బిజాపుర్ సుల్తాన్ ఇబ్రాహీం అదిల్ షా కుమారుడైన మాలిక్ అంబర్ ,  పెళ్ళికి ఆనాడే రూ: 80,000 రూపాయల విలువ చేసే పటాకులు కాల్చినట్లు " మధ్య యుగాల పాలకుల పాలన " అన్న పుస్తకం లో ఆధునిక చరిత్ర కారుడు సతీశ్ చంద్ర రాసినాడు.  క్రీ: శ: 19 వ శతాబ్దం నాటికి , కులీనులు, సంపన్నులు , వారి వారి ఇండ్లలో జరిగే వేడుకలల్లో,  ఘనంగా , తమ తమ డాంబీకాలను, గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ టపాకాయళ్ను పేల్చేవారు.  అది సంపన్నుల సాంప్రదాయం , శ్రమజీవుల సాంప్రదాయం కాదు అనేది చరిత్ర.

అట్లా ఎందుకు అంటున్నానంటే 1977- 78 లో మా ఊరి భూస్వామి మా ఊరిలో మొదటి సారిగా పట్నం నుండి పటాకులు తెచ్చి దీపావళి రోజున తన కొడుకులు, కూతుర్ల తోటి కాల్చి పేల్చి పిస్తుంటే  మా ఊరోళ్ళంతా అబ్భురంగా విచిత్రంగా చూసిన విషయం నాకింకా కండ్ల ముందు కదులాడుతున్నది.  కాకుంటే పంట చేండ్లను నక్కలు, అడివి పందుల నుండి కాపాడుకోవడానికి మోతుబరి రైతులు గన్ పౌడర్ ను ఇనుప రోలు రోకలి లో వేసి బండకు కొట్టి ఢాం ఢాం అని దెబ్బలు వేగించేది.

నా అనుభవం లో మా చిన్నతనం లో " దివిలె " పండుగు మా ఊరిల ఎట్లా జరుపుకుందురు అంటే,ఆనాటికి వరిపంట మంచి పాలు పోసుకొనే సమయం ల ఉండేది. వరి పొలాలకు  నీళ్ళు పెట్టె పనిల ఊరు ఊరంతా తలమునుకలై ఉండేది. అప్పటెకే వర్షాలు వెనుకకు పట్టేది కనుక చెరువు నీల్లే ఆధారమై ఉండేది. తూము నుండి వచ్చే నీళ్ళు , పొలం తడారక ముందే  తడి అందాలన్న ఆరాటం అందరికీ ఉండేది. ఇక మడ్లల్ల పోసిన తెల్ల జొన్నలు నాగటి సాలెక్కి ( ఆరేడు అంగుళాల ఎత్తుకు పెరిగేవి) చేనంత పచ్చటి తివాచీ పరిచినట్టు ఉండేవి. అవే గ్రామీణులకు ఆహ్లాద  కేంద్రాలు, ఆనందం పంచుకొనే ఆటమైదానాలు, సంబురాలు జరుపుకొనే సంపద వెలుగులు. దీపావళికి సన్నగా చలి మొదలెయ్యేది. అడివంచు ఊరాయే చెట్ల ఈదర గాలికి సాయంత్రం అయ్యేవారకు  చలి చలి ఉండేది. సాయంత్రం అయిందంటే , దడుల పొంటి బీర తీగల కు కాసి , ఆకుల సాటున దొరుకకుంట దాగుండి పోయిన  ముదిరిన బీరకాయలను కోసుకొని తెచ్చి వాటికి టేకు పేళ్లు బిగించి అగ్గి ముట్టిచ్చి " కొలర కోలా"  అని ఆ మంట మండుతున్న కొలను తలచుట్టూ తింపుకుంటూ ఊరంతా తిరిగేది. ఇక రేపు భోగి ఆనంగా మొత్తం కర్రతో చేసిన కోల లు ఎవరివి వారు పెద్దవాళ్లతో కట్టించుకొనేది, ఊరు మొత్తానికి ఒక పెద్ద కోల కట్టించి దాన్ని ఊరు మధ్యన ఉండే సావడి కాడ  పెడుదురు.రేగు లేదా తునికి కర్ర కు సన్నగ పాపిన టేకు కొయ్యలు కొట్టి అవి కాలినప్పుడు  కూలి పోకుంట దుస్శేరు తీగల కడాలు తొడుగుదురు.  బలవంతుల పోటీ అది. దాన్ని అందరికంటే ముందు ఒక చుట్టు  తింపి జాగ్రత్తగా కింద పెట్టినోడు సిపాయన్న మాట. చాలా మంది  ప్రయత్నం చేద్దురు కానీ ఎవరో మంచి ఒడుపు మీద ఉన్న బలవంతుడు మాత్రమే లేపి తింపేది. అక్కడ కుల ప్రస్తావన ఉండక పోయేది. మా బోడోళ్ళ మొద్దెంకటి మామ ఎప్పుడైనా మొదట తింపే బలవంతుడు. మొద్దెంకటి మామ దళితుడు , కానీ ఆ పట్టింపులు ఆనాడు ఉండక పొయ్యేది.  అది అలుకగ అయినంక పొరగాండ్లమ్ అందరం కొలర కోల అని ఓ సుట్టు తింపి కింద వెడుదుం. ఇంటికచ్చి తానం జేసి , జొన్న ఛేండ్ల కు పాండువ దేవుళ్ళకు మొక్కవోదుము. పెరిగిన జొన్న కర్రలకు పురుగు పట్టవద్దని, రోగాలు రావద్దని మంచి పంట పండాలని మొక్కుడన్న మాట. పలిగిన పాత కుండలకు సున్నం రాసి, సర్వల నీళ్ళు పట్టుకొని, పప్పుబెల్లం కలుపుకొని , పసుపు కుంకుమ పట్టుకొని ఆవి  కావడిల పెట్టుకొని చేనుకు పోదుము . తంగేడు కొమ్మలతోటి పందిరి వేసి పందిరిల సర్వతోటి తెచ్చిన నీళ్ళు చల్లి నున్నగా అలికీ పసుపు కుంకుమ తోటి పట్టు పోసి పందిరి చుట్టూ, చెనుల మధ్య మధ్యన సున్నం పూసిన కుండలు బోర్లిద్దుమూ. కనుక చీడ పీడలు పంటను ఆశించక పొయ్యేది. పందిరిల మొక్కిణాంక పప్పుబెల్లం పలారం తిని ఇంటికి వద్దుము. దాదాపుగా అందరి ఇండ్లల్ల కేదారి వ్రతం అని నోములు ఉండేటియి. అప్పుడే పండిన పత్తి,  దారం తీసి దండ జెద్దురు. గుమ్మడికాయ , చిక్కుడు కాయ, కొత్త చింతకాయ, దోసకాయ, కాకర కాయ , తమాట ,ఇట్లా అన్నీ కూరగాయలతోటి వంట జెద్దురు. నేతిల కాల్చిన బెల్లపు అప్పాలు,పాశం బువ్వ  నైవేద్యం తయారు జెద్దురు . పొద్దుగూకంగా సదువచ్చినోళ్ళు ఎవరి ఇంటికాడ వాళ్ళు కత చదువంగనే అందరం సామూహికంగా భోజనం చేద్దుము. ఇది ఆనాటి మా దీపావళి పండుగ. ప్రకృతి సల్లంగా ఉండాలని ప్రకృతిని కాపాడుకొని బతుకాలని మా తరం దాకా  దీపావళి అంటే  అట్లుండే టిది .  







Tuesday, September 5, 2017

మనుసుల మాట 15

.                                             

నేటి యువత హేర్ స్టైల్, డ్రెస్ స్టైల , ఫుడ్ స్టైల్, అంటూ తమ లైఫ్ స్టైల్  కు  సినిమా హీరోలను, క్రికెట్ స్టార్ లను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఏమి ఆదర్శమై నిలుస్తున్నదో  చూద్దామా !

ఒక మానసిక శాస్త్ర నిపుణుడు ఏమంటాడంటే , ఎవరైనా ఒక వ్యక్తి తనకు  ప్రత్యేకమైన గుర్తింపుకోసం అందరికీ భిన్నంగా ఒక చెవికి రింగు వేసుకున్నా, వెంట్రుకలను విభిన్నంగా కత్తేరించుకున్నా దాని ఉద్దేశం ఏమిటటా అంటే ఆ మనిషి తనను జనం గుర్తించాలనే తపనలో పడిపోయాడని అర్థం ఆట. వాఖ్యానించే వాళ్ళు రకరకాలైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారనుకో. మనిషి పుట్టుకతోనే గుర్తింపు కోరుకుంటాడనీ , అందుకే తల్లి కడుపులో నుండి బయటకు రాగానే కేర్ కేర్ మని గట్టి గట్టి గా మొత్తుకుంటాడని వాదిస్తుంటారు. కాక పోతే శిశువు సమశీతోష్ణంగా ఉన్న తల్లి కడుపుల నుండి భయంకరంగా ఉండే బయటి వాతావరణానికి రాగానే భరించ లేక భాధతో ఏడుస్తుంది, అది నిజం, బౌతికం కంటికి కనిపించేది. అలాగే ఆకలి కూడా కారణం. కొందరేమో గుర్తింపు ఆకలని అంటున్నారు.

వయసు వంక తీరుస్తది అంటారు. మనిషి ఎట్లా ఉన్నా యుక్త వయసుకు వచ్చిన తర్వాత అందంగా కనిపిస్తుంటారు. దానికి కారణం శరీర నిర్మాణం లో వచ్చిన ఎదుగుదల,  అంతర్గతంగా జరిగుతున్న రసాయనిక మార్పులు,సమతల  హార్మోన్ల విడుదల . యవ్వనమే ఒక సుందరమైన , అందమైన అనుభూతి. తనలో ఏ నైపుణ్యం లేదు అనుకొనే ఒక ఆత్మ న్యూనతా భావానికి గురైన కొంత మంది యువకులు ఏదో తీరుగా తమకు గుర్తింపు దొరుకాలే అన్న తపనతో  ఓ చెవి పోగు ధరించడం, మోకాళ్ళు చిరిగిన లాగులు తొడుక్కోవడం, ఎవడో చేసుకొన్న హేర్ స్టైల్ తనకు కూడా బాగుంటుందని అడ్డగోలు గా కత్తిరించుకొని సెల్ఫీలు దిగి దొస్తు గాళ్లకు పంపుకొని మురిసి పోవడం , జీవితం అంటే అదే , అదే గొప్ప థ్రిల్లింగని, అదే ఎంజాయ్ మెంట్ అని చాలా మంది యువత భ్రమల్లో బతుకడాన్ని  గమనిస్తున్నాము. నా ఈ రాతలు ఏ యువత చదువక పోవచ్చు.  కానీ ఒక బాధ్యత గల పౌరీనిగా ఇది వాళ్ళకు చేరాలన్న తపనతో,  చేరక పోతుందా అన్న ఆశ తో  రాస్తున్నాను.

ఒక భగత్ సింగును , ఒక ఆజాద్ చంద్ర శేకర్ ను, ఎందుకు ఆదర్శంగా చూస్తారంటే యువకులైన వాళ్ళు త్మ సుఖాలకోసం గాకుండా  దేశ అవసరాలకోసం జీవించారు. కాని నేటి యువత వాళ్ళ ఫాషన్ ప్రపంచం కోసం జీవిస్తున్నారు.

మొన్న ఈ నెల 2,3 తేదీలల్లో హైద్రాబాద్ లో , కొ ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ మీటింగ్ విన్నాను. సోనీ సోరీ అని ఒక సామాన్య స్కూల్ టీచర్ ,  సర్కారు బలగాలు ఆమె పైన జరిపిన అత్యాచారం , అఘాయిత్యం , దాస్టీకమ్ వలన రాజ్యాంగ బద్దంగానే రాజ్యం పైన తిరుగుబాటు చేసింది. ఇప్పుడు ఆమె లక్షలాది గిరిజన ప్రజల ఆరాధ్య దైవం అయింది. ఆమె రూపం అందామా చిన్న ఆకారం, బక్క పలుచటి శరీరం, చామన ఛాయ రంగు,ఇప్పటికే ఒక సారి మొఖం పైన ఆసిడ్ దాడి జరిగిన ఫలితంగా కమిలి పోయి ఉన్న ముఖ ఛాయ, అయినా !  ఆమె లెజండ్. అందరూ ఆమెను అభిమానంగా చూడడానికి ,ఆరాధనతో ప్రేమపూర్వకంగా ఆశీర్వదించడానికి కారణం ఆమె తోటి ప్రజల పట్ల చూపు తున్న కన్సర్న్, పంచుతున్న ప్రేమ, సాటి వారి పట్ల కనబరుస్తున్న బాధ్యతాయుతమైన ప్రవర్తన.  అంతే గాని ఆమె గుర్తింపుకు ఆమె గొప్పదనానికి ఆమె రూపం గాని ఆమె పేదరికం కానీ అడ్డుకాలేదు.  కనుక కారు ఉంటేనో , బంగ్లా ఉంటేనో, బుల్లెట్ బైక్ ఉంటేనో, వెరైటీ కటింగ్ ఉంటేనో, చెవికి రింగో, చేతికి బంగారు బ్రాస్ లెటో ఉంటే నో తాము గొప్పవారిగా గుర్తించబడుతాము అనుకోవడమ్ ఒక భ్రమ. ఆ ! అట్లా  వచ్చే గుర్తింపు మరి వేరే గా ఉంటుంది , కానీ ఒక సోనీ సోరీకి , ఒక హిడిమా కు, ఒక భగత్ సింగ్ కు ఉండే గుర్తింపు ఉండదు.

ఉపాధ్యాయుల దినం.

                                                

పొద్దున్నే చంటి సురేశ్ అని నా పూర్వపు విద్యార్థి ఫోన్ . సార్ మీకు ఉపాధ్యాయుల దినం సందర్భంగా శుభా కాంక్షలు అన్నాడు. కొద్ది సేపటి తర్వాత అతని బ్యాచ్ కె చెందిన రాజేశ్వరి అనే అమ్మాయి పోనే చేసి అదే మాట చెప్పింది.

ఆ ఇద్దరి ఫోన్ కాల్ లు విన్న తర్వాత అప్పటి ముచ్చట్లు మీతో పంచుకుందామని ఇది రాస్తున్నాను. 1979 సెప్టెంబర్ లో మా నాయన చనిపోయిండు. అప్పుడు నాకు ఈ ప్రపంచమే శూన్యమే  అయిపోయింది. అప్పుడు మా అవ్వ, అక్కలు, నా భార్య అండగా నిలిచి నాకు ధైర్యాన్ని ప్రోది చేసిండ్రు. అనివార్యంగా అప్పుడు ధన్నవాడ మా ఊరు లో ఉన్న ఏకైక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లోకి నేను బదిలీ చేయించుకొని వచ్చిన. 1982-83 అనుకుంటా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో నేను మద్యపాన నిషేదం మీద ఒక ఒగ్గు కథ రాసి  పిల్లలతో ప్రదర్శింప జేసిన. మంచి రెస్పాన్స్ వచ్చింది గ్రామస్తుల నుండి. అదీ ముఖ్యంగా మహిళల నుండి. ఆ ఒగ్గు కథ ప్రధాన కథకుడు చంటి సురేశ్. అందులో ఒక ఎరుకల సాని పాత్ర రాజేశ్వరి వేసింది.

ఆ సంవస్తరం కూడా ఈ యేడు తీరుగానే స్వాతంత్ర దినోత్సవం అయిన కొద్ది రోజులకే వినాయక చవితి వచ్చినట్టు ఉన్నది. నేను ఒగ్గు కథ ట్రూప్ ను తీసుకొని వినాయకుని మండపాలళ్ళకు వెళ్ళి వాళ్ళను అడిగి స్వచ్ఛందంగా దాదాపు ఆరేడు ప్రదర్శనలు ఇచ్చినమ్. ఎక్కడ అనుకుంటున్నరు ? మంతెనల. అక్కడంతా బ్రహ్మణులు, అదీ వినాయక మంటపం , అక్కడ  మద్యపాన నిషేధం మీద మేము  కథ జెప్పుడు. ఒక బ్రాహ్మడు ఆడికి అననే అన్నడు, ఏమిటిదయ్యా ఇది? మేం బ్రాహ్మణులమ్ , ఇక్కడ మద్య మాంసాలు ఎవ్వరమ్ ముట్టం . ఇక్కడ నీ లొల్లి ఏందయ్యా? అన్నడు. మేము కథ చెప్పుతున్నది నడీ మంథని లోని పోచమ్మ వాడ , రావుల చెరు కట్ట, మహా లక్శ్మి గుడి పక్కన ఉన్న గణేశ్ మంటపం ల. మా అధృస్ట వశాత్తు పోచమ్మ వాడల కొందరు కాపొల్లు ఉంటరు. వాళ్ళకు ఒగ్గు కథ అంటే ఇస్టమ్. మా పిల్లలు హరి హరి శంకరా హరి బ్రహ్మ దేవా విద్యజెప్పువాడా యిది బ్రహ్మ దేవా ... అన్న రాగం ఎత్తుకోంగానే వాళ్ళు మా ఆధీనం లోకి వచ్చేవాళ్లు, బస్ అయ్య గారి మాట ను వాళ్ళు సాగనీయ్యలేదు. రాజేశ్వరి ఎరుకలి సాని వేషం వేసుకొని ఎరుక చెప్పే తందుకు వచ్చేది. అప్పుడు సురేశ్ " ఏ ఊరు ఏ పల్లె ఓ ఎరుకలమ్మా - మా కెరుకా జెప్పమ్మా" ! ఆనంగానే రాజేశ్వరి "మా ఊరు ధన్నాడా మరి మాదేపురమూ జిల్లా కరీంనగరూ " అంటూ గజ్జెలు ఘల్లుమన పడదునికేదీ .వంతలు గా రాగం ఎత్తుకొని కంజర డప్పు వాయించే మా బోనగిరి శీను గాడు కంజర వాయించుడుల మా దండి సుతారిగాడు.  పోరాగాండ్లకు  నిండా పన్నెండేండ్లు నిండనోల్లాయే ,  పసి ప్రాయం అమాయకత్వం తో వాళ్ళు మద్యపానం సేవించడం వలన జరిగే అనర్థాలను చెప్తుంటే  జనం గుండెల్లో చొచ్చుక పోయీ మై మరిచి లీనం అయ్యేవాళ్లు. వాళ్ళ అనుభవాలతో జత పోల్చుకొనే వాల్లట .

ఆనాటి పన్నెండేండ్ల పసి పిల్లలు 35 ఏండ్ల తర్వాత నన్ను గుర్తువెట్టుకొని ఎక్కన్నో ఖమ్మం లో , కాటారం లో ఉన్న వాళ్ళు పొద్దుగాల పొద్దుగాల ఫోన్ చేయంగనే పాత సంగతులన్నీ యాదికొచ్చినై .  మనుసు మురిసిపోయింది .

నేను ఆ ఒగ్గు కథ రాయడానికి  నేపధ్యం మా ఇంటి చుట్టూ " నాయకపు" కులస్తులు , మరియు పూసవర్ల వాళ్ళు ఉండేటోల్లు. వాళ్ళు ప్రతి రోజు సాయంత్రం మద్యం సేవించి వచ్చి గొడువలు పడుతూ భార్యల ను కొట్టేటోల్లు . నా చిన్నప్పటి నుండి చూసేటోన్ని. నేను పెరిగి పెద్దగై ఉద్యోగం వచ్చి తిరిగి మా ఊరికి వచ్చేవారకు మద్యానికి అలవాటైన కొందరు చనిపోయి వాళ్ళ భార్యా పిల్లలు అనాధాలైన పరిస్తితి ఉండే. అది చూసి బాధతో రాసిన ఆ ఒగ్గు కథను అంతే ఆర్ద్రత తో ఆ పసి బిడ్డలు ఆడి పాడి  జనం లో కొందరిని అయినా మార్చినారణి తర్వాత జనం చెప్పగా విన్నము.  మహాదే పూర్లోని అప్పటి  మెడికల్ ఆఫీసర్ డా: రామ కృష్ణ రావ్ , గుమ్మళ్ళ పెళ్లి సర్పంచ్ దమ్మి రెడ్డి కూడా మేము కథలు చెప్పే చోటికి వచ్చి సందేశాలు ఇచ్చారు. రాత్రి పూట  ఆ పిల్లగాండ్లను వేసుకొని ఊర్ల పొంట తిరుగుకుంట మద్యపానం వద్దు బాబు అని 35 ఏండ్ల కిందట ఊర్లల్ల మమ్ముల చెప్పనిచ్చిన అప్పటి జనానికి ఇప్పటి జనానికి ఎంత తేడానో మనం గమనించ వచ్చు.

Tuesday, August 8, 2017

మనుసుల మాట 14 .

                                                    

" రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేల్ల లో దళిత బహుజనుల పైన పోలీసులు జరిపిన చిత్రహింసల పైన విచారణ జరిపించి దొషులను కఠినంగా శిక్షింప జేస్తా " అని ఆ నియోజక వర్గ ఎమ్మెల్లే మరియు మంత్రిగారైన కె టి ఆర్ గారు సెలవిచ్చారు.

బస్ ఇంకేంది, ఖేల్ ఖతమ్ దుక్నమ్ బంద్. అంతేనా? ఇన్నోద్దుల సంది నోరుదెరువని ఏలికలు వచ్చి ఎముడాల కాడ ఎదురుకునంగనే ఎతంత  సల్లారి పోయినట్టేనా? కొట్టిన దెబ్బలను, అయిన గాయాలను పుణికి చూసినంత మాత్రాన మంత్రమేసినట్టు మాని పోతయా? మీ ఉసురువోసుకోన్నోళ్లను ఊకేనే వదిలిపెట్టమని జోకొట్టి నంత మాత్రాన బుసగొట్టిన సర్పాలన్నీ బుట్టల వడ్డట్టేనా ? ఆ పోలీసు లాఠీలన్నీ వారం రోజుల పాటు ఊరికేనే వీళ్ళ శరీరాలను చీరి పోగులు పెట్టినయా? వాళ్ళ పక్కటేముకలు పుటుక్కు పుటుక్కుమని వట్టిగనే విరిగి పోయినయా? వాళ్ళ కిడ్నీలు కమిలి పోయి వట్టిగనే అవసాన దశకు చేరుకున్నయా? ఆ నరక బాధ భరించలేక పెయ్యంత వేడి వేడి ఆవిర్లు గక్కుతుంటే కమిలి పోయిన దెబ్బలకు , నోట్లే  నాలుక పిడుచ గట్టుక పోయి ,  మొత్తుకునే శక్తి లేక నోట్లే నుంచి వచ్చే పిల్లికూతల కీకలకు కడుపుల పేగులు నోట్లెకు వచ్చేదాకా ఏడ్చిన ఎడ్పులకు కార్చిన కన్నీళ్ళకు కారణమేవ్వడని  కె టి ఆర్ ను ప్రశ్నించగలరా ? ( ప్రశ్నిస్తే మల్లెన్ని తన్నులో ) అంత విచక్షణ రహితంగా  గొడ్లను కొట్టినట్టు ( అమ్మో! గొడ్లను కొడితే గో రక్షనోళ్ళు సావగొట్టరు? )  కొట్టేతందుకు పోలీసోళ్ళకు ఏమన్నా పిచ్చి లేసిందా ? ఎవ్వరి ఆదేశాలు లేకుంటనే గంతగణం  కొడుతరా? ప్రజలను ఇంతలా కొట్టి భయభ్రాంతులకు గురి జేయవలసిన అవసరం ఎవరికుంటది? ఆ ఇసుక , ఆ గ్రానైట్ , లారీల వైపు, క్వారీల వైపు కన్నెత్తి చూడ సాహసించని పరిస్తితి ఎవరి లాభం కోసం? ( అట్లని ఎవ్వడన్న నోరుదెరిచి అడుగ సాహసిస్తే కడమంచి వెంకటేష్ తీరుగా ఎల్లారెడ్డి పేట లాకప్ డెత్ కథే మరి . సర్కారా మజాకా ? )  .
మక్కెలిరుగ దంచి మలాం బూసుడంటే గిదేనేమో?

దళిత గిరిజన బహుజనులకు ఇదంతా కొత్తేమీ గాదు . ఇప్పటికీ తొమ్మిది వందల ఏండ్ల కిందట 12 వ శతాబ్దం లోనే తెలంగాణ చరిత్రకే గర్వకారణమైన ( ప్రత్యేక తెలంగాణ సాధన మాదేనని ఎట్లైతే గర్వంగా చెప్పుకుంటారో ) కాకతీయ చక్రవర్తుల కాలం లోని తొలి చక్రవర్తి ప్రతాపరుద్ర దేవుని కాలం లో ఇప్పుడు మేడారం గా పిలువు బడుతున్న మేడరాజు రాజ్యాన్ని మేడ రాజు కూతురైన సమ్మక్కను పెండ్లాడిన కరీంనగర్ జిల్లాకు చెందిన పగిడిద్దే రాజు (కోయ) పరిపాలిస్తున్న కాలం. వరుసగా రెండు మూడు సంవస్తరాలనుండి వర్షాలు పడని కారణంగా పంటలు పండక పన్నులు చెల్లించ లేమని పగిడిద్దే రాజు చక్రవర్తికి మొరవెట్టుకుంటడు . కాదు కూడదు పన్నులు కట్టవల్సిందే నని రాజు హుకూమ్ జారీ జేస్తడు . ఈ అడివిని రాజు మొలేసి నీళ్ళు వొసిండా ? అడివిల కాయగసరు తిని బతుకున్న మనం పన్నులు కట్టకుంటే రాజు తలదీసి మొలేసేది ఉంటదా అని నమ్మిన కోయలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటరు .

పాయే! ప్రతాప రుద్రదేవునికి విషయం చేరే! ఉగ్రుడైన చక్రవర్తి తన సైన్యాలను పగిడిద్దే రాజు మీదికి యుధ్ధానికి పంపుతడు. సంపెంగ వాగు కాడ అడ్డమొచ్చిన జంపన్న ను అడ్డంగా నరికి చంపుతరు. పగిడిద్దే రాజును ఆయన కోయ సైన్యాలను ఊచ కోత  కొస్తరు. బరిలోకి దూకిన సమ్మక్కను పట్టపు రాణివి అవుదువు రమ్మని ప్రలోభ పెడుతరు . కానీ దేనికీ ప్రలోభ పడని , జంకని సమ్మవ్వ కరవాలమ్ దీసుకొని కదన రంగాన దునికి కడదాకా యుద్ధం జేస్తది . సమ్మక్క , ఆమెతో బాటు ఆమె కూతురు సారలమ్మ కూడా యుధ్ధం లో అమరులు అవుతారు. తమకు రక్షకులు గా నిలిచిన సమ్మక్క సారలమ్మలను (పేన్కు) పితృ దేవతలను చేసుకొని కోయలు ఏడాదికోసారి వాళ్ళను యాది జేసుకుంటరు. కొంత కాలం తర్వాత వాళ్ళ మనుసులకు అయిన గాయం మసక బారిన తర్వాత గిరిజనులను మాయ జెసి మళ్ళా పన్నులు వసూలు జేసుకొనే కొరకు గుర్రాల మీద ఒంటెల మీదా బెల్లం కుడుకలు పట్టుకొని సమ్మక్క జాతరను జరిపిస్తామని మేడారం జేరవస్తరు కాకతీయ రాజులు . ( నేరెళ్ళ ఓట్ల కోసం ఇప్పుడు కె టి ఆర్ వచ్చినట్టు)

రాజ్యం బహు క్రూరమైంది . అది సమ్మక్క సారలక్కలను చంపుతది మేడారం జాతర జరిపిస్తది . కొమురం భీమ్ ను చంపుతది జోడే ఘాట్ ల దర్బార్ వేడుతది . ఇంద్రవెల్లిల అమాయక గిరిజనుల పై తూటాల వర్షం  కురిపిస్తది  శాంతి సభలు జరుపుతది . చుండూరు, కారం చేడుల ఊచకోత కోస్తది అంతా ఉట్టిదే అంటది. నేరెళ్ళలో చావగొట్టి చెవులు మూస్తది , కొట్టినోని సంగతి చూస్త అంటది. 12 వ శతాబ్దం నుండి 21 వ శతాబ్దం వరకు ఎన్నో రాజ్యాలు వోయినై , ఎందరో రాజులు వొయిండ్రు ,. కానీ రాజ్యం స్వభావం మాత్రం మారలేదు. మారుతున్నదల్లా బాధలు భరిస్తూ మళ్ళీ మళ్ళీ వాల్లనే నమ్ముతున్న , ఆరాధిస్తున్న ప్రజలు మాత్రమే!

మా తల రాతలు ఇంతే , మా ఖర్మ ఇంతే, అని భరించగలిగిన ఖర్మ సిద్దాంతాన్ని పట్టుకొని వ్రేలాడే విధంగా ఉన్న మన మెదళ్ళకు పట్టిన ఆ బూజును వదిలించుకొనేదాక మేడారం, నేరెళ్ళలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి.

Wednesday, July 12, 2017

మనుసుల మాట 13.

                                                          

ఇంటిమీద నాటిన బీర పాదులు , ఆనిగపు  పాదులు తీగలు యెల్లినై.ఈ రోజు  వాటిని పందిరి మీదికి ఎక్కించే పని జేసేవరకు పెయ్యంత చెమటలు పట్టినై. శుబ్రంగా స్నానం చేసిన తర్వాత ప్రాణానికి చాలా హాయి అనిపించింది. బయట వాతావరణం కూడా ఈ రోజు చాలా ఆహ్లాదంగా ఉంది. మిత్రుడు నాగేందర్ ను కలిసి వద్దామని ఈజీగా ఉంటుందని ఫ్యాంట్ టి షర్ట్ వేసుకొన్న. ఆ టీ షర్ట్ మా చిన్నోడు ,  నేను అమెరికా వెళ్లినప్పుడు నాకెందుకురా బట్టలు , చాలానే ఉన్నై , అన్నా వినకుండా కొన్ని బట్టలు తీసుకున్నడు. వానికి నా ఇస్టమ్   ఎట్లా తెలుసో గానీ నాకూ కొన్న వాటిలో ఒక చక్కని తెల్లటి టీ షర్ట్ అడ్డంగా ఆకుపచ్చ గీతలు ఉన్న టీ షర్ట్ తీసుకున్నడు. అదే వేసుకున్న. తెల్ల టీ షర్ట్ కు నాకూ ఉన్న అనుభూతి ఒక్కసారి మనుసుల మెదిలి నా బాల్యం లోకి  తీసుక పోయింది.  

నేను తొమ్మిదో  తరగతి చదువుతున్నప్పుడు అంతవరదాకా ఉన్న సత్యనారాయణ హెడ్ మాస్టర్ రిటైర్ అయితే రాఘవా చారి అని ఒక సాంప్రదాయ ఆచార్యులు హెడ్ మాస్టర్ గా వచ్చిండు.  ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలంటే చాలా ఇస్టమ్.  1966 రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమం లో గ్రామీణ కళలకు అవకాశం ఇచ్చిండు. అంత వరదాకా మా మంతెన హై స్కూల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే రామాయణ, మహాభారతాల పాత్రల " ఏక పాత్రాభినయాలు " , లేదా పౌరాణిక నాటకాలు వేద్దురు. కానీ మాకు గ్రామీణ కళల ప్రదర్శనకు అవకాశం వచ్చింది కనుక రామయ్య అనే మిత్రుడు నేను , ఇంకా రాజీ రెడ్డి అనే మరో క్లాస్ మేట్ , ముగ్గురం కలిసి ఎల్లమ్మ ఒగ్గు కథ చెప్పినమ్. తబలా, డోలక్, మృదంగ వాయిద్యాలు తెలిసిన మా మంతెన శ్రోతలకు మొదటి సారిగా మేము కంజీరా డప్పుసప్పుడుతో కథ జెప్పుడు షురూ జేసినప్పుడు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసిన మాకు  కథజెప్పుడు అయిపోయినంక మనకు తప్పకుండా ప్రైజ్ వస్తది అనుకున్నం . అనుకున్నట్టే మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా ముగ్గురికి తెల్లటి టీ షర్ట్ లు బహుమతి గా ఇచ్చిండ్రు. అంతవరదాకా అంగీలు తొడుక్కున్న నాకు తెల్లటి టీ షర్ట్ బలే బాగున్నది అనుకున్న వేసుకొని చూసి. దాన్ని అట్లనే దాసి పెట్టుకోని సంకురాత్రి పండుక్కు ఇంటికి పోయినప్పుడు మా అవ్వకు చూపిన . ఎక్కడిది కొడుకా అని ఆరా దీసింది. విషయం చెప్పంగనే బాగ సంబుర పడి ,అయితే నువ్వు పోటీలల్ల కొత్త ఆంగి గెలుసుకచ్చినవా కొడుక  అని తన చేతుల తోటి నాకు ఆ ఆంగి, అంటే అదే టీ షర్ట్ తొడిగింది. ఆ రోజంతా తెల్లగా పాల తీరుగ మెరిసిపోతున్న టీ షర్ట్ తోటి ఊరంతా తిరిగి అందరికీ చూపి సంబుర పడ్డ. తెల్లారి ఆంగి ఇడిసినంక సబ్బువెట్టి పిండుకొని దాసిపెట్టుకున్న.

ఏప్రిల్ మాసం ల ఏడాది పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన . వచ్కేవారకల్లా జొన్న కోతలు జరుగుతానై. జొ న్న పోతలు అన్నా, జొన్న కోతలు అన్నా ఆ కాలం ల రైతులకు పెద్ద పని, పెద్ద సంబురమ్, ఇంటిల్లిపాది అందరూ చీకటి తోటి  లేసిందంటే  పొద్దు చెండ్లల్లనే పొడిసేది. మా నాయిన ఎప్పుడు పుంజులుగుయ్యంగా పోయిండో గానీ లేసినంక వీన్ని మడ్ల చెండ్లకు పంపుమని మా అవ్వకు చెప్పి పోయిండట . నేను పొద్దుగాల లేసి ఇంటిముందట ఉన్న వేప చెట్టు నుంచి పలుకర పుల్ల ఇరుసుకొని పండ్లు తోముకుంటుంటే అవ్వ ఆ ముచ్చట చెప్పింది. నాకేమో తానం జెసి తెల్ల టీ షర్ట్ వేసుకొని దోస్తుగాళ్లతోటి గడుపుదామని ఉండే. అదే ముచ్చట అవ్వతొని చెప్పిన. అయితే మానాయే బిడ్డ మాపటీలి పోదువుగాని, పూర్ణం బూరెలు జేత్త నువ్వచ్చేవారకు అని బుదరిచ్చి పొమ్మన్నది. సరే ఇగ తప్పెటట్టు లేదని ఆ తెల్ల టీ షర్ట్ తొడుక్కోనే చేనుకు పోయిన. నేను పోయే వారకు నాయిన జొన్న సొప్పకట్టలను ఒక్క దగ్గెర గూడేత్తున్నడు . జొన్న చేను రాత్రి పూటనే కోస్తరు. ఎందుకంటే అప్పటికే ఎండలు బాగ ముదురుతై, ఎండెక్కిందంటే జొన్న ఆకులు కోసుక  పోతై. రాత్రి పూట మంచుకు మెత్తబడి ఉంటై కనుక తెల్లారక ముందే కోత కోసి మనుసులు ఇంటికి జేరుతరు. ఇన్టోల్లు మెదలను కట్టలు కట్టుకొని ఒక్కదగ్గర గూడేసుకోని ఆ సొప్ప గూళ్లను ఎడ్ల బండ్ల మీద ఇంటికి కల్లం లకు చేరేసుకొని ఓ మంచి రోజునాడు కంకి ఇరుసుడు షురూ జేస్తరు .  

నేను పొయ్యే వారకు నాయిన మా ఇంటి పాలేర్లు అందరు కలిసి సొప్ప కట్టలు కట్టి గూడేసుడు అయిపోయింది. నేను పోయినంక ఎడ్లను దెచ్చి బండ్లు గట్టినమ్. ఒగ పాలేరేమో అక్కడక్కడ మిగిలి పోయిన జొన్న కర్రలు ఒక్క దగ్గెర ఏరి కుప్పేస్తున్నడు. ఇద్దరు పాలేర్లు ఒగ బండి మెలుగుతున్నరు ( సొప్ప కట్టలను బండిల పేర్సుడు) . మా నాయిన బండి మెలుగుతే నేను సొప్ప కట్టలు బండి మీదికి ఇసిరి వెయ్యాన్నన్న మాట. రేకల పాల్లమ్ మెలిగే దాక ఇబ్బంది లేదు . రేకల పాల్లమ్ వచ్చేదాకా సొప్పకట్టలు పొడుగు మెలుగుతరు. రేకల మీదికి వచ్చిన తర్వాత  అడ్డంగా మెలుగుతరు. ఆ పని అందరికీ సరిగా రాకపోయ్యేది. మా నాయిన ఏ పనిల ఐనా గొప్ప సుతారికాడే. ఆయన పొడుగు మెలుగుడు అయిపోయింది అడ్డం మెలుగుతున్నాడు. ఒక్కక్క సొప్పకట్టాను పైకి పది పన్నెండు ఫీట్ల ఎత్తుకు ఇసురాలే. ఒక్కెక్క కర్రకు కంకి దాదాపు కడుముంతంత  , కడుముంతంత ఉన్నై. ఆ యేడు కంకులు బాగ మంచిగ ఏపినై ( పెరిగినై) . ఒక్క కంకి నలిస్తే అరుసోడు (పావుకిలో) జొన్నలు రాల్తై. బలిమిటికి , బలిమిటికి కట్టలు పైకి ఇసురుతున్న. ఇంతల ఒక కాటుక కంకి (ఫంగస్ వలన నల్లబడినవి) పలిగి నా తెల్లటి టీ షర్ట్ కు కర్రెటి మరక చేసింది. అయ్యో ఎంత పని అయిపాయే తొడుక్కోని రాకున్నా మంచిగుండు అని నేను నా షర్ట్ దిక్కు చూసుకుంటున్న. పైకి సొప్పకట్ట పోకపోయ్యేవరకు నాయిన వంగి కిందికి చూసేవారకు నేను షర్టును చూసుకుంటున్న. పని ఎవ్వరు సక్కగ చెయ్యక పోయినా ఆయినకు బాగ కోపం వచ్చేది. నేను కట్ట పైకి వెయ్యకుండా నా షర్ట్ దిక్కు చూసుకుంటా పని ఆపివేసినందుకు కోపం వచ్చి కర్రకు ఉన్న ఓ కంకిని విరిసి నా మీదికి విసిరిండు. కంకి తలుకాయకు తాకింది. టిపిక్కిన కిందవడ్డ. ఆర్రే కొడుకా అని బండి మీదినుంచి నాయిన కింద దునికిండట . రెండు చెవులు మూసి కంతలు నలిసిండట, ఏడుసుకుంట కండ్లు దెరిసిన. నిండిన కాడికి సాలనుకోని మెలిగిన  బండికి గిర్రసేరు తోని  కట్టేసుకొని ఇంటికి వచ్చినమ్. అవ్వకు విషయం దెలిసి నాయినను మస్తు కొప్పడ్డది. ఇగ ఈడు పనిజేత్తే మనం బతికినట్టే గాని  ఇంటికాన్నే ఉండనియ్ అని నాయిన బండి కొట్టుకొని చేనుకు పోయిండు. ఇంతకు ఇదే నయం అనుకోని తానం జేసి అవ్వజేసిన బూరెలు దిని షర్ట్ కు అంటిన మసి ని శుభ్రం జేసుకొని టింగురంగా అనుకుంటా సోపతి గాల్లకు నా టీ షర్ట్ సోకులు చూపేతందుకు నడూళ్ళెకు నడిచిన.  ఈ ముచ్చెట మీతోటి పంచుకొనేదాకా మనుసుల వట్టలే . అందుకే ఇదంతా రాసిన.

Sunday, July 2, 2017

మనుసుల మాట 12.

                                                       

సరుకుల బండ్లకు రాజులు
సైనిక కాపలను యిచ్చి
సేవ పేరు తోటి పన్ను
సేఠ్ ల నుండూడ గొడితే

                                గూడ్స్ టాక్స్ పేర  నేడు
                                గుండు గుత్త పన్నంటూ
                                పన్ను పోటు ప్రజల పైన  
                                పస్తులున్న తప్పదాయే!

సరుకుల తయ్యారులోన
సర్వజనులు శ్రామికులే
సరుకులుగొను ప్రజలందరు
కట్టే పన్ను ప్రజల శ్రమే !

                                 బేపారికి కమీషను
                                 నౌకరిగాండ్లకు జీతాల్
                                 నాయకులెన్నికల ఫండ్
                                 శ్రమ జీవుల కస్టఫలమే !

తిన్న తిండి మీద పన్ను
పన్న పడక మీద పన్ను
పాలు దాగే పసి బిడ్డకు
పన్ను పోటు పొత్తిళ్ళు !

                                ప్రజల గోళ్ళు ఊడగొట్టి
                                పన్నులు వసూలు జేసె
                                పనే కదా సర్కారంటే
                                రాజైనా ప్రదానైనా చేసేది అదే పనే !

రాజ్యాంగం ప్రియాంబులు
పెద్ద పెద్ద లెక్చర్లూ
గద్దెల నెక్కేంత వరకే ,
ఎమ్మెన్ కంపిన్ల సేవే ఏకైక పరమార్థం !

                                 సంక్షేమపు రాజ్యమంటు
                                 ప్రజల కొరకే పాలననే
                                 మాటలన్ని బూటకాలే
                                 మనువాదపు నాటకాలే !

బుక్కెడంత బువ్వకొరకు
రెక్క బొక్కలిరుగుతుంటే
ఎక్కే దిగే విమానాలు
ఎవని సేవలోన వారు?

                                అడవులను తెగనరికి  
                                గుట్టబండ లిరిగేసి  
                                ఇసుక బొగ్గు మసి జేసి
                                నేల  నీరు గాలి కూడ అంగట్లో అమ్ముకొంటు !

సహజ వనరు సంపదంత
దర్జాగా అమ్ముకొంటూ
ప్రజల పైన పన్నెందని
ప్రశ్నించుడు తప్పెటులా ?

                                 కోట్ల కోట్ల సంపదంత
                                 కొల్లగొట్టినోళ్ల గొట్ట
                                 చేవలేని సర్కారుకు
                                 చేతైంది పన్నులేయ !

అధికారం, ప్రతిపక్షం
అందరు పన్నుల పక్షమే
అందుకే ఓ జనులారా
అడుగ రండి ముందుబడి !

                                రాజకీయ ముసుగులిడిచి
                                రండి కదలి ప్రజలంతా
                                ఎవరికొరకు ఈ పన్నులు
                                ఎదురు నిలిచి అడుగాలే !