Wednesday, May 31, 2017

మనుసుల మాట 7

                                                             

కేంద్ర సర్కారు పశువుల వధను నిషేదిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రధానంగా దక్షిణ భారత దేశం లో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నట్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాము. దక్షిణ భారత దేశం లో సైతం సంగ పరివార్ రాజకీయాలు కలిగిన వారు ఇది చాలా గొప్ప నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వాన్ని సమర్తిస్తున్న  వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రాజకీయ విశ్వాసం ఉన్న వాళ్ళకు వాళ్ళ దార్శనికులు  ఏమి చేసినా అది గొప్పగానే కనిపిస్తుంటూ ఉంటుందేమో. ఎందుకంటే పెద్ద నోట్ల రద్ధును ఇప్పటికీ ఇంకా కొందరు సమర్థిస్తూనే ఉన్నారు. కొత్తలో నోట్ల ముద్రణ కు సమయం కావాలని సర్ది చెప్పినారు. . కాని ఇప్పటికినీ కరన్సీ లభించక సామాన్యులు నానా అగచాట్లు పడుతూనే ఉన్నారు. పెద్ద  నోట్ల రద్దువలన ఒనగూరిన ప్రయోజనం మా లాంటి ఆజ్ఞానులకు ఇంకా అర్థం  కావడమే  లేదు.  ఆ చర్యను ఓహో అంటే ఓహో అని వారి మీడియా, వారి మనుషులు తెగ పోగాడేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పొగుడుకోవడానికి  పెద్దకూర లొల్లి అదనంగా వచ్చిచేరింది.

ఈ చర్యవలన పశు సంపద వృధ్ధి అవుతుందని  కొందరి వాదన. కానీ ఆచరణ లో అది సాధ్యమయ్యే పనిగాదు . వ్యవసాయదారులకు పశువులు ఒక సంపద. వాటిని సాదడం వలన పాలు, పెరుగు, నెయ్యి, వారికి ఆహారంగ పనికి వస్తే,  వాటిని అమ్మి నాలుగు డబ్బులు జేసుకొనే అవకాశం కూడా ఉంటుంది వారికి.  అలాగే అవి వేసిన పేడ తో అవసరమైన ఎరువు రైతుకు పనికి వస్తుంది.  అవి ఇచ్చిన లేగ దూడలను ఎద్దులుగా నాగలికి ఉపయోగిస్తారు.రైతుల  ఇదంతా రైతులు, లేదా వ్యవసాయం పైన ఆధార పడి జీవించే ప్రజలు చేసే పని. వారైనా అంతా వ్యయ ప్రయాసకు ఓర్చి ఎందుకు చేస్తున్నారంటే అందులో వారి బతుకు దెరువు ఉంది. ఇపుడు ఈ కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించే వారిలో రైతులు మరియు ఆవులను సాది వాటి ద్వారా ఉపాధి పొందే వారు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే యాంత్రికత వచ్చి ఎడ్ల బండ్లు, నాగండ్లు , సవారుబండ్లు, మోటలు , బంతులు కొట్టుడు, అన్నీ బందు అయిపోయినై. అక్కడక్కడ ఏదో చిన్న చిన్న అవసరాలకోసం రైతుల వద్ద ఇంకా ఎద్దులు ఆవులు ఉన్నాయి. అయితే తనకు ఉపయోగం లేదు అనుకున్న వాటిని రైతు అమ్మివేసి మరో కొత్తదాన్ని కొని తెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ చట్టం వలన  ఆయన అమ్ముకోలేని పరిస్తితి. ఈ చట్టాన్ని సమర్థిస్తున్న పూజారి వర్గం ఆవుల పెండ దీసేది గాదూ దాని ఉచ్చ ఎత్తిపోసేదీ గాదు. చేసేటోని చేతులు కట్టివేసిన తర్వాత వాటిని సాదేదేవ్వడు ? . రేపు రేపు తనకు నిరుపయోగమైన పశువులను ఏ రైతూ పోషించడు. అప్పుడు పశువుల సంతతి అభివృధ్ధి అవుతదా ఆగిపోతదా ? ఇది గొప్పపని అని సమర్థిస్తున్న గొప్పమనుషులు ,  ఆవుల మందలను ఏ లాభం లేకుండా రేపు ఎవరైనా ఎందుకు పోషిస్తారో జవాబు చెప్పాల్సి ఉంటుంది.


Sunday, May 14, 2017

మహుసుల మాట 5.

                                                              మనుసుల మాట 5  

ఈ రోజు ఉదయం సాక్రెమంటో లో ఉన్న మా చిన్నమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు తాను కూడా బాహుబలి సినిమా చూసినట్టు చెప్పింది. సినిమాలో శివగామి పాత్రనే అన్ని అధికారాలు కలిగి అందరూ ఆమె  మాటనే శిరసావహిస్తున్నట్టుగా , చాలా ఔన్నత్యంగా  చూపారు గదా నాన్న అని అంది. అవును రాచరిక  సమాజం చాలా గొప్పది , స్త్రీలకు రాచరిక వ్యవస్తలో  ఎంతటి గొప్ప ప్రాధాన్యత ఉండేదో చూడండి , అని చెప్పడానికి రచయిత ప్రయత్నం చేసి నట్టు కనిపింస్తుంది అని అన్నాను. అంటే మరి నిజంగా లేదంటారా అని ప్రశ్నించింది. అప్పుడు నా మనస్సులో సమాజాల అభివృధ్ధి జరిగిన తీరును వివరించిన రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సే గంగా పుస్తకం చటుక్కున మెదిలింది . బేటా ఫ్రీ గా ఉన్నావా ఎక్కువ సేపు చెప్పేది ఉందని అంటే ఫరువాలేదు చెప్పు నాన్నా అంది.  అట్లా మొదలైంది ఈ దిగువన నేను రాస్తున్న విషయం.

ఓల్గా నుంచి గంగకు పుస్తకం అట్టమీదనే అడుగుజాడల  గుర్తులు , అనాచ్ఛాదిత మొరటు పాదాల అడుగు ముద్రల నుండి  నాగరిక పాదరక్షల పాదముద్రల వరకు సాగిన పయనం అని అర్థం వచ్చే విధంగా ఉంటుంది. దానిలో మొదటి కథ " నిశ " . ఇది ఓల్గా నదీ తీరం ఎగువన ఇండో యూరోపియన్ జాతి సమూహం లో క్రీస్తు పూర్వం 6000 ఏండ్ల కింద జరిగిన విషయం గా చెప్పబడుతుంది. క్రీస్తు పూర్వం 6000 ఏండ్ల కింద మాతృ స్వామిక సమాజం ఉండేదని చెప్పబడుతుంది. అంటే ఆ గుంపు కు అధిపతి ఒక స్త్రీ మూర్తే ఉంటుందన్న మాట. ఆమె ఆజ్ఞ ప్రకారం ఆ కుటుంబ సభ్యుల వేట, ఆహార పంపిణీ, ఉండేది, ఆ ప్రాథమిక కుటుంబ జీవన విధానం ఎలా ఉండేదో ఆ కథలో చెబుతాడు.  క్రీ. పూ. 3500 సంవస్తరాలల్లో జరిగిన దివ కథలో అయిదారుగురు ఉండే కుటుంబం పదుల సంఖ్యలోకి ఎదుగడం కనిపిస్తుంది. క్రీ. పూ. 2500 నాటికి పురూహుతుని కతద్వారా కజకిస్తాన్ లో  స్టిరవ్యవసాయం మొదలైనట్లు తెలుస్తుంది.  క్రీ.పూ. 2000 నాటికి పురాధానుడు కథలో  ఎగువస్వాల్ దేశం లో ఇండో ఆర్యన్ జాతి ఉన్ని దుస్తులు ధరించడం, ఆవు పాలు పెరుగు, సోమరసం సేవించడం, రాతి ఆయుధాల స్తానమ్ లో లోహ ఆయుధాలు రావడం మొదలౌతుంది. అంతవరదాకా ఉన్న మాతృస్వామిక పోకడలనుంచి ఉత్పత్తుల పైన పురుషుల ఆధిపత్యం మొదలైనట్లు ఉంది. క్రీ.పూ. 1800 నాటికి గంధారం ( తక్షశిల ) దేశం లో ఇండో ఆర్యన్ జాతి ఆంగిరా ,  కథలో  సురులు, అసురులు, రాజ్యాలు , వారి మధ్య యుధ్ధాలు, దైవ పూజా మొదలైనట్లు చెప్పబడుతుంది.  క్రీ.పూ.490 బంధుమల్లు కథ నాటికి బుధ్ధుని అనాత్మ వాద  సిధ్ద్ధాంతమ్  ప్రచారం లోకి వస్తుంది.

ఈ పరంపరను పరిశీలించినపుడు పురా యుగం లో స్త్రీకి ఉన్న స్వేచ్చా స్వాతంత్రాలు , ఎట్లెట్లా అయితే మానవ శ్రమ, సృజన కలసి వనరులను ఉపయోగించి సంపద సృస్టించబడడం మొదయ్యి అభివృధ్ధి చెందుతూ వచ్చిందో , అట్లట్లా ఆధిపత్యం మహిళల నుండి కండబలం కలిగిన పురుషుల చేతిలోకి వెళ్ళినట్లు గమనించ వచ్చు. , ఆహార సేకరణ , ఉత్పత్తి, స్వీయ రక్షణ అవసరం పెరిగినా కొద్దీ మానవులు చిన్న కుటుంబం నుండి గుంపులు గా అక్కడనుండి, గణాలు గా, గణం నుండి రాజ్యాలుగా రూపాంతరం చెందిన విషయం గమనించవచ్చు. యూరప్ ఖండం లో 1649 నాటికే అలివర్ క్రాంవెల్ వంటి వారు చార్లెస్ 1 ను చంపివేసి రాచరిక వ్యవస్తను తొలగించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్టాపించినారు. అంటే యూరప్ సమాజం లో 1650 నాటికే రాజరిక పాలన తొలిగిపోయింది. అక్కడ ప్రజాస్వామిక హక్కులు , పార్లమెంటు ఓటుహక్కు లాంటి భావనలు ఆనాటికి అంకురించాయి.

అదే భారత దేశం లో అప్పటికి మొఘల్ చక్రవర్తుల పాలన కొనసాగుతున్నది.  తెలంగాణలో ఐతే కుతుబ్ షాహిల చివరి రాజు  ( అబుల్ హసన్) తానీషా పాలన సాగుతున్నది..భారత దేశం లో రాచరిక పాలన వ్యవస్త అంతం కాకముందే బ్రిటిష్ పాలన రావడమ్ , వాళ్ళు కూడా రాజులను యధావిధిగా కొనసాగించి ప్రజాస్వామిక పునాదికి అవకాశం ఇవ్వకపోవడం, 1947 భారత స్వాతంత్ర దినం దాకా భారత దేశం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫ్యూడల్ వ్యవస్తానే కొనసాగింది. యూరప్ సమాజానికి భారత సమాజము మధ్యన  ప్రజాస్వామిక వాతావరణానికి 300 సంవస్తరాల  వెనుక బాటుతనం ఉంది.

ఆ లక్షణం మనకు శివగామి పాత్రలో దర్శకుడు చూపిస్తాడు. శివగామి తన పుత్రులు పెద్దపెరిగే దాకా సమర్థవంతంగా శత్రు భయం లేకుండా రాజ్య భారం వహించేటంతటి చతురురాలు. అంతటి రాజనీతి తెలిసిన శివగామి అవతలి సాటి మహిళ అభిమతం తెలుసుకోకుండా తన కుమారునికి భార్యగా నిర్ణయించేంతగా తన పుత్ర వాత్సల్యం తన బుధ్ధిని కమ్మివేసిందని మనం నమ్మాలి. ఆ నిమిషం దాకా ఎంతో సమర్థుడు గా కనిపించిన బాహుబలి తన మాట కాదన్న మరుక్షణమే అతడు రాజ్యాధికారానికి పనికి రాడన్న నిర్ణయం తీసుకోగలిగినంత చపల చిత్తురాలు అయిపోతుంది. ఆ తర్వాత బాహుబలి ని చంపివేయుమని కట్టప్పను ఆదేశించే టంతటి విచక్షణ హీనురాలు అయిపోతుంది. సరే దశరథుని భార్య కైకేయి వలె అలా అయిందనే అనుకుందాము. అంతటి మాహారాజ్ఞి ని కట్టప్ప లాంటి ఒక బానిస కూడా ఏకవచనం తో తప్పుజరిగింది శివగామి అన్నా ప్రేక్షకులకు తప్పుకాదు అన్నంతటి కోపాన్ని శివగామి పైన ప్రేక్షకులకు దర్శకుడు కలిగిస్తాడు. సరే ఆ బానిస అలా చెప్పంగానే మళ్ళీ శివగామి మంచిది అయిపోతుంది. ఏమీ ! శివగామీ అనే స్త్రీ కి ఒక వ్యక్తిత్వం , స్వంత నిర్ణయం ఉండనంతటి  బలహీనమైన మనిషా? అలా ఎవరు ఎటు చెపితే అటు వెళ్లిపోయేటంతటి  చపల చిత్తు రాలిగా శివగామి పాత్రను  చిత్రించడమ్ వెనుక ఈ దేశం లో ఇంకా ఇప్పటికినీ కొనసాగుతున్న ఫ్యూడల్  పురుషాధిక్య భావజాలమే ప్రధాన కారణం. అంటే ఇప్పటికీ స్త్రీ యొక్క బుధ్ధి బలాన్ని, యోగ్యతను స్వీకరించలేనంతటి అప్రజాస్వామిక భావజాలం లో భారతీయ పురుష సమాజం ఉంది అని చెప్పడానికి శివగామి పాత్ర ఒక చక్కని ఉదాహరణ .

Sunday, May 7, 2017

మనుసుల మాట 4 .

                                                 

బాహుబలి వెయ్యి కోట్ల రికార్డ్ బ్రేక్  కలక్షన్లు చూసిన తర్వాత ఒక సినిమా చూడడం కోసమే ఇన్నేసి కోట్లు ఖర్చు చేయగలిగిన భారత ప్రేక్షకుల కళా పోషణను అభినందించ వలసిందే కదా అనిపించింది. కానీ మరొక  కోణం లో చూసినప్పుడు పెట్టుబడి దారి వ్యవస్త మానస పుత్రులైన బాహుబలి దర్శక నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో భారత సమాజం వారికి అది ఇచ్చివేసింది అనిపించింది. . సినిమా ప్రారంభం లో మాహిష్మతి రాజ్యాన్ని చూపిస్తున్నప్పుడు , రామాయణం లోని సుందర కాండ లో హనుమంతుడు రావణాసురుని లంకా పట్టణాన్ని వర్ణించి నట్టుగా ఎత్తైన ప్రాకారాలు, అందమైన రాజప్రాసాదాలు, సుందరమైన ఉద్యాన వనాలు కలిసి " చూడా సొంపై ఉన్నదీ - రావణ లంక , ఎంతో సుందర మైనది - రావణ లంక "  అని హనుమంతుడు అన్నట్లు గానే అద్భుతమైన నగరాన్ని చూపిస్తారు. దేవ సేన ధరించిన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, అలాగే మహేంద్ర భూపతి ఆహార్యం చూపెట్టిన విధానం గూడ రాజులు  చాలా భోగ భాగ్యాలతో తులతూగున్నట్లుగానే ఉంది.  బల్లాల దేవునుకి దేవసేనతో పెళ్లి జరిపించడానికి నిర్ణయం జేసిన శివగామి తన టంకశాలాధిపతికి ఆదేశమిస్తూ " మాహిష్మతి సామ్రాజ్యపు కాబోయే  యువరానికి  పెట్టిన ఆభరనం పెట్టకుండా  సంవస్తర కాలానికి సరిపోయినన్నీ ఆభరణాలు చేయించండని " ఆదేశిస్తుంది. వియ్యంపుల వారికి పసిడి దారాలతో వస్త్రాలు నేయించందని చెపుతుంది. అది రాజరిక వ్యవస్తే, ప్రజలు సంపాదించేదంతా రాజుల హక్కు భుక్తమే కనుక ప్రక్షకులకెవ్వరికీ అది అసంబద్ధంగా అనిపించలేదేమో. అలాంటి రామ రాజ్యమే మళ్ళీ రావాలని అలాంటి  భక్తులంతా కోరుకుంటున్నారు. అయితే మొదటి గంటన్నర సంపద, ఆభరణాలు, ఆకాశ హార్మ్యాలు చూసి సంబుర పడి  మై మరచిపోయిన  ప్రేక్షకులు  తర్వాత సగం లో అంతకంటే ఎక్కువ రక్తపాతం చూసి కూడా సంపద వెంటే రక్తపాతం ఉంటుందన్న స్పృహ లేకుండా, దుస్ట శిక్షణ జరిగిందని అంతే సంబుర పడి పోయీ ఆనందం తో థియేటర్ నుండి బయటకు వస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్ పైన టీవీ లల్లో పొద్దాంత చర్చలు జరుగుతున్నాయి.

ఇక్కడ నిత్యం జీవన్మరణ సమస్యలతో సతమతమైపోతున్న సగటు మానవుడు వాస్తవ పరిస్తితులు చూసి దుఖ్ఖ పడీ దుఖ్ఖ పడీ అలిసి పోయి  , ఆ కాసేపైనా " తాను కలలో కూడా ఊహించని లోకం లో "  మై మరిచి పోవడానికి ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారేమో అనిపించక మానదు.  టమాటాలు పండించి గిట్టుబాటు దరలేక పశువులను మేపుతారు,
ఉల్లిగడ్డలు పండిస్తే అదే పరిస్తితి, మిర్చీ రైతులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుకుంటయి.  , గోలివాడల రైతుల గోస చూడవశం గాదు , మల్లన్న సాగర్ రైతుల గోస మరో చరిత్ర. ఏ పంట ఎందుకు దర పలుకదో రైతులకు అర్థం గాదు, పోనీ మరి వినియోగ దారులకు ఏమైనా సరసమైన దరకు సర్కులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. రైతుల గోస అట్లుంటే , నిరుద్యోగులైన యువత చేసే తందుకు చేతిల పనిలేక  దిక్కులు జూస్తున్నరు. పత్తిరైతులు ఈయేడంటే ఇట్లున్నరు కానీ వచ్చే యేడు ఎట్లుంటదో చెప్పలేని పరిస్తితి. చేనేత కార్మికుల చావులు ఆగుతనే లెవ్వు.

ఇన్ని సంక్షోభాలను మరిపిస్తూ తమ నెత్తిన పాలుబొయడానికి భారీ పెట్టుబడి తో వచ్చిన సినిమాను  కొరినంత ధరకు టికట్లు అమ్ముకోవడానికి సర్కారు దయతో అనుమతి ఇస్తది . ప్రజలుకూడా తమ ఊహకందని సంపద , కలలోకూడా ఊహించలేని ప్రేమలు, అనుభూతులల్లో కాసేపు తమను తాము అందులో పొందుపరుచుకొని కరిగిపోతూ  తమ కళా పోశన  చాటుకుంటారు . ప్రజలను నిద్రపుచ్చే కళలు, మద్యపానాలు వర్ధిల్లుతున్నంత కాలం రాజ్యమా నువ్వూ చల్లగా వర్ధిల్లుతూనే ఉంటావు.