Tuesday, November 9, 2021

                                 కనిపించని ఆ శత్రు వెవరు ?


ఈ దేశం లో ఇంకా మెజారిటీ ప్రజలు గ్రామాలల్లోనే జీవిస్తున్నారు. వారంతా దాదాపుగా వ్యవసాయం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపుగా 1980,90 దాకా  భూస్వాములు ,దొరలు, ఊరిలో తమ అధికారం చెలాయించేవారు. అణిచివేతకు గురవుతున్న వారికి తమ స్తితికి కారణం ఎవరో ఎదురు గుండానే కనిపించే వారు .


 కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పీవీ నర్సింహారావ్ ప్రధానమంత్రి గా నూతన ఆర్థిక విధానాలు అమలు జరిపిన తర్వాత పరిస్తితిలో మార్పు వచ్చింది. మన తెలంగాణ లో అయితే వామపక్ష ఉద్యమాల ఫలితంగా దొరలు గ్రామాలు విడిచి పట్టణాలకు వలసలు పోయి  తమ వద్ద ప్రోగుపడి ఉన్న సంపదలతో  అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు.  కొంత కాలం వరకు భూములు బీడుబడిపోయి గ్రామీణులకు ఉపాధి దొరుకక తమ దీన స్తితికి దొరలు లేక పోవడమే కారణం అనుకున్నారు. లబ్ధ ప్రతి స్టులైనా కొందరు  కథకులు దానికి అనుకూలంగా కథలే రాసిపడే శారు. తరువాత తరువాత కొంత భూమి స్థానిక రైతుల చేతుల్లోకి మారింది. కానీ రైతులకు అర్థం కానీ విధంగా గిట్టుబాటు ధర లభించక పరిస్తితి  పెనేం  లో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారిపోయింది. ఫలితంగా రైతు ఆత్మ హత్యలు పెరిగి పోయాయి. అందుకు కారణం ఎవడో రైతుల ముందు కనిపించడం లేదు. శత్రువు అదృశ్యం అయిండు. ఎవని తో పోరాడాలో అర్థం కానీ  పరిస్తితి. ప్రభుత్వాలతో పోరాడితే, కొన్నీ పంటలకు  మద్దతు ధర అన్నాయే కానీ గిట్టుబాటు ధర ఊసే లేదు. వామ పక్ష పార్టీలు సైతం తమ పోరాట బాణాలు ప్రభుత్వాల పైననే ఎక్కుపెట్టారు కాని అసలైన కారణం, ప్రభుత్వాలతో బాటు  పెట్టుబడి దారి విధానం అంటూ పోరాడే శక్తులకు అర్థం చేయించ లేక పోయారు. 


మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన మంచి ఆయుధం అయిన విద్య ఇప్పుడు పెట్టిబడి దారుల చేతిలో పడి వారికి నైపుణ్యవంతమైన నౌకరీ గాళ్లను తయారుజేసే పనిలో తలమునుకలై ఉంది. సమాజం కూడా పోటీ పడి తమ పిల్లలు IIT, NEET, CIVILS, వేటలో పడి పెట్టుబడి కొరల పండ్లు దోమి ఎంతో కొంత మెరుగైన జీవితం అనుభవించాలే అన్న యావలో పడి కిందామీదా కొట్టుమిట్టాడుతున్నారు. 


ఇక వైద్యం కూడా చాలా పిరపు సరుకు అయిపోయింది. ముందుగా పేదలకు బల వర్ద కమైన ఆహారం లభించే పరిస్తితి లేదు. సమీకృత ఆహారం అంటే ఇంకా ఎందరికో తెలియని స్తితి. దానికి తోడు మల్టీ నేషనల్స్ ధనదాహం తీర్చే కొరకు వచ్చిన రసాయనిక ఎరువులు,పురుగు మందులు, హైబ్రిడ్ కల్తీ విత్తనాలు, కాలుష్యం అన్నీ కలిసి మనుషుల  శరీరాలను రోగ గ్రస్తం చేస్తున్నాయి. 


ప్రజలు తాము సంపాదిస్తున్న సంపాదనలో సింహా భాగం విద్య,వైద్యం, పిల్లల ఉద్యోగాల కోచింగ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభం లో పెట్టుబడి ఉద్యోగాలను సృస్టి కి దోహద పడి, పెట్టిన పెట్టుబడి పైన వచ్చే లాభాలతో  ఉద్యోగులకు బోనస్, ప్రభుత్వాలకు పన్నులు కట్టేవి.  కానీ ఇప్పుడు పెట్టుబడి అలా చేయకుండా తమ సంపద పెంచుకోవడానికి పోటీ పడి క్రోనీ కాపిటల్ ను తాయారు చేసుకుంటున్నది. ఒక కంపనీ పెట్టి దానిపైన బ్యాంకు నుండి అప్పు తీసుకుంటుంది. ఆ కంపానీకి మార్కెటింగ్ కోసం మరో సంస్త ను తెరుస్తుంది. మొదటి కంపనీకి నస్టాలు చూపి బ్యాంకు అప్పు ఎగగొడుతుంది. ఇలాంటి జిమ్మిక్కులు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం పైన పెట్టుబడి దారుల సంపద దినదినం  కోట్లల్లో పెరుగుతుంటే ప్రజల పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అను త్పా దక సైన్యం ( Useless Force), అంతకంతకూ పెరిగి పోతున్నది.కారణం ఏమిటి? ఎవ్వరు అనేది ప్రజలకు అర్థం కావాల్సి ఉంది.  


ఒక నాడు ప్రజలకు తెలియని సంస్కృతం ప్రజలను  ఏలింది, ఇంగ్లీష్ కొన్నాళ్ళు, ఇప్పుడు భాషలు పోయి టెక్నాలజీ, ఆర్థిక శాస్త్రం కలగల్సి ప్రజలను అవిద్యావంతులను చేస్తున్నది.    చదువులు వస్తే ఏలికలను ప్రశ్నిస్తారని, చదవునుండి దూరం చేశారు. ఆ తర్వాత ఆధునిక  టెక్నాలజీ అందరికీ అందని ద్రాక్షను చేశారు. ఆర్థిక శాస్త్రం అయితే అర్థం కానీ బ్రహ్మ పదార్థాన్ని  చేశారు. కనుక  ఇప్పుడు ఆర్థక శాస్త్రం మూలాలను అందరికీ అర్థం అయ్యే విధంగా సులభ గ్రాహ్యం చేసి , ఏలికలు , పెట్టుబడి కలగలిసి ప్రజలను ఎలా గొర్రెలుగా చేసి వేటాడి తింటున్నాయో ప్రజలకు తెలియ జెప్పి ,  తమ అవిద్యకు , అనారోగ్యానికి, ఆకలి చావులకు , నిరుద్యోగానికి , పేదరికానికి , కారణం అయిన ఆ ప్రజల శత్రువును   ప్రజల ముందు నిలుపాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరు వహిస్తారో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 


 కమ్మరెంకయ్య మామ కండ్లల్ల తిరుగుతుండు. 


రెండు మూడు రోజుల సంది కమ్మరెంకయ్య మామ మనుసుల తిరుగు తున్నడు . ఎన్నటి యాది, ఈ ముసులాయిన ఎందుకు ఊకూకే మతికి వస్తున్నడో  అర్థం అయిత లేదు. అది  నేను ఐదో తరిగతి సదివే టప్పుడు( 1960-61), అయితారం అచ్చినదంటే  మా అన్నగాని గీత కత్తులకు సాటే పిచ్చె తందుకు( కత్తులకు పదను పెట్టుడు) కొలిమి కాడికి పోకట ఉండేది. మాపటీలి మండువ  కాడికి పోతే మా అన్న నాకు కారం పుట్నాలు పెట్టిపిస్తడాయే మరి . కొలిమి కాడ ఆ రోజుల్ల  ఎట్లు ఉండెనొ , ఆ వైభోగం ఏమై పాయే, ఎందుకట్లయ్యనో తెలిసిన విషయమే అయిన ఇంతగనం  మనుసుల ఎందుకు మెసులు తాందో సుద్దామ్ అనుకుంటనే, ఇంతల   నెట్ ఫ్లిక్స్ ల గెలుకుతాఉంటే నానా పటేకర్నటించిన  మరాఠీ సినిమా “ ఆప్లా మానస్ “ కనిపిస్తే ప్లే పైన  క్లిక్ చేసన. నానా పటేకర్ మహా నటుడు గదా , చూసిన కొద్ది సూడ బుద్ది అయింది. నా వయసు వారికి మా కొడుకులు కోడండ్లు బిడ్డలు కూడా కూడా చూస్తే బాగుండు అనిపిచ్చె టట్టు ఉంది. 


కమ్మరెంకయ్య మామ ది  నల్లటి దేహం, కొలిమి వేడికి కమిలి పోయిందో ఆయిన పుట్టుకే అట్ల ఉండెనొ  కానీ అప్పటికే చేసి చేసి అలిసి పోయిన ఊగులాడే కండలు, ఎడుమ  చేతుల పట్టుకారు తోటి అప్పుడప్పుడు కొలిమిల నిప్పులు,  కాకుంటే  బొగ్గులు ఎగేసు కుంట , కుడి చేతిల పెద్దదో లేకుంటే సిన్న దో సుత్తె పట్టుకోని,   ఎప్పుడు కొలిమిల నిప్పుల తీరుగ ఎర్రటి కండ్ల తోటి విరామం లేకుంట పనిజేసుకుంట ఉండే టోడు . ఎండా కాలం అయితే బండ్లకు కమ్ములు గట్టుడు , వానా కాలం అయితే నాగండ్లకు కర్రులు అమిరిచ్చుడు , మాగిల నైతే గుంటుకులూ , ఇంకా గొడ్డన్లు , గడ్డ పారలు, పారకట్టెలు, కొడు వాండ్లు, అంగు పారలు , సిన్న పోరాగండ్ల కు బొంగురాలకు ముల్లులు, ముల్లు గట్టెలు, బురుద పొలాలల్ల తొడిమే తీసే తందుకు కురుపే ముల్లు గర్రలు, పెనాలు ,సరాతాలు , ఇట్లా చెప్పుకుంట పోతే శేతా డంత లిస్ట్ అయితది కానీ క్షణం రికాము లేకుంట పనిజేసేది. ఆయినను బువ్వ కూడా తినకుంటా ఎప్పుడు ఎవరో ఒకరు పానం మీద ఉందురు . ఇంత జేసినా ఆయిన ఇల్లు ఓ కమ్మల గుడిసె. ఆ గుడిసె ల కూడా దోశె డంత గడుకో, సారె డంత పప్పో  ఉండేది గాదు . ఆయిన భార్య ఎప్పుడు కాలం చేసిందో తెలువది. ఒక్క కొడుకు. వాడు కూడా ఏగిలి మనిషి. ఏమి పని చేసే టోడు గాదు. బిడ్డ పుట్టు గుడ్డి. ఆమె కూడా ఇంత ఉడుక వెట్టి పెట్టె ఓసల లేని మనిషి. ఇంత పని జేసుకుంటా ముగ్గురికి ఉడుకేసి ఆయినే పెట్టాలే. ఎప్పుడన్నా మా ఇంటికి ఎంకయ్య మామ వస్తే మా అవ్వ ఇంత గడుక బోటేసి ఇంత సల్ల వోసి అంచుకు ఓ మామిడిగాయ తొక్కు పెట్టేది. నా కడుపు ఇయ్యాల మా నిండింది గానీ గుడ్డి పొరికి ఏమన్నా పెట్టవా అక్క ఆని ఏదో ఓటీ అడుక్కొని పట్టుక పోయేది. బహు కస్టంగా బతుకుతున్నా గూడా ఎంకయ్య మామ ఎన్నడూ గూడ కంట నీరు పెట్టంగా చూడ లేదు. పనే ఆయినకు అంత ఆత్మ విశ్వాసం ఇచ్చింది. 


నేను సదువు కునే తందుకు ఊరిడిచి వచ్చిన తర్వాత  ఎప్పుడో ఊరికి వచ్చినప్పుడు కమ్మరెంకయ్య మామ చని పోయిండ్ ని తెలిసింది. అందరూ మనిసి కింత ఏసుకొని దహన సంస్కారం చేసిండ్రట .  ఆయన కంటే ముందే ఆ కొడుకు కూడా ఏదో జరమచ్చి చనిపోయినడట.  ఆ గుడ్డామే కట్టె పట్టుకోని ఇల్లుళ్లు తిరుగుతూ అడుక్కొని తిని బతుకుతున్నదని తెలిసింది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది. 


ఎంకయ్య మామ ఇంటి  కాడ ఒక నల్ల తుమ్మ చెట్టు  ఉండేది. దాని నీడకు కొలిమి ఉండేది. వానలు బాగా పడ్డప్పుడు రైతుల కొట్టాల కింద మామ కొలిమి పెట్టేది. మాగిల నేను కత్తులు సాటేసు క రాను పోతే తుమ్మ సెట్టు నీడకు కూసున్డే ది. తుమ్మ పూల మకరందం పీల్చుకోను తేనె టీగలు వస్తే ఆ రెక్కల సప్పుడు వినుకుంటా అట్లనే ఉంటే “పోడా ఇంటికి పోవా? ఇక్కణ్నే ఉంటవా? ఉంటనంటే సెప్పు కట్నం కింద నా కొలిమినిచ్చి గుడ్డి పొరిని నీకిచ్చి ధూమ్ ధామ గా పెండ్లి జేత్త “ అని బోసి నోటితోటి వక్కడ వక్కడ నవ్వేది. నిజంగనే సేత్తడు గావచ్చు అనుకోని కుడి సేతీలకు కత్తులు తీసుకొని  , పిర్రల మీది లాగు ఇంకా కిందికి జారిపోకుంట ఎడమ సెయ్యి తోటి మీదికి గుంజు కుంట గుంజుకుంట ఎనుకకు మర్రి గూడ సూడ కుంట ఇంట్ల వడేదాక ఉరికచ్చే టోన్ని.    ఆ గుడ్డి మనిషి చనిపోయిన తర్వాత ఆ గుడిసె ఉన్న జాగను పక్కనున్న వారు ఆక్రమించుకున్నరు. నిజాం సర్కార్ సాలార్ జంగ్ జమానల భూ సర్వే జరిపినప్పుడు ఊరుమ్మడి అవసరాల కోసం,  సదరుల కొంత భూమి తీసి అవసరం అయిన వారికి ఇచ్చేవారు. అలా వృత్తి పనివారికి, గుడుల పూజారులకు గృహ అవసరాలకు కొంత  భూమి ఇచ్చే వారు. అలాంటిదే ఈ   కొలిమి కోసం తీసిన జాగ అయి ఉంటుంది. . ఊరికి ఏ కమ్మరి ఉంటే ఆయిన ఇల్లు వేసు కొనే తందుకు  ఆ జాగా ఉంటది. మళ్ళా ఇంకో కమ్మరాయన అవసరం ఊరికి పడలేదు. ఆ భూమి మాత్రం ఎవరో ఒక్కరి సంతం అయిపోయింది. 


నిజానికి నాకు కమ్మరెంకయ్య మామ ఇంత గనం మతికి వచ్చే తందుకు కారణం ఇది రాస్తుంటేనే స్పురించింది. ఊరు మొత్తం ఉత్పత్తి లో భాగమై( పొలం దున్నే కాన్నుంచి ,పంట కోసేదాక, కోసిన పంట అన్నం ముద్దై కడుపు నిండే దాకా సకల జనుల పనిముట్ల కు కారణమైన )  ఊరందరికి అవసరమైన మనిషి కి అంత కస్టమ్ లో కూడా కడుపు నిండుగా అన్నం పెట్టని నా ఊరు,ఆయన  చస్తే ఆవల పారేసింది. ఉన్న భూమిని ఆక్రమించింది. కానీ అదే నా ఊరు,  ఊరిలో మంచికి  చెడ్డకు మంత్రం చదివే బాపనాయిన లేకపాయేనని యమ కలత చెంది    పక్కూరు నుంచి బాపనాయినను రప్పించి ఆయినకు ఇల్లు ఇరువాటు సమకూర్చి ఆయనకు మృ స్టాన్న భోజన వసతి కలిగించి శీగ్ర గతిన తంతు లకు హాజరయ్యే దానికి  ఇప్పుడో కారు కూడా కొనుక్కో గలిగిన సామర్థ్యాన్ని సమ కూర్చింది.         


Thursday, October 28, 2021

భారత స్వాంతంత్రోద్యమ చరిత్ర కు చెందిన సర్దార్ ఉద్దం సినిమా రివ్యూ.

 భారత స్వాతంత్రోద్యమానికి చెందిన ఒక అద్బుతమైన, ఉత్తేజ పూరితమైన , చరిత్ర పుటల లో నిక్షిప్తమైన భావోద్వేగ దృశ్య కావ్యం సర్దార్ ఉద్దం సినిమాను ప్రైమ్ వీడియోస్ లో మిత్రుడు సిద్ధార్థ్ సుభాష్ చంద్రబోస్ రివ్యూ చదివిన తర్వాత ఇప్పుడే చూసిన. 1952 లో నేను పుట్టే నాటికి ఇంకా స్వాతంత్ర్ ఉద్యమ చరిత్ర జ్ఞాపకాలను పెద్దవాళ్ళు చెపుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవాళ్ళం.  నేను 1973 లో ఉపాధ్యాయునిగా  పనిజేసే పాఠశాలల్లో 15 ఆగస్తునాడు ఆ చరిత్రను ఉపాధ్యాయులుగా మేము చెబుతుంటే పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళు. ఆనాటి ఉపాధ్యాయ లోకం కూడా భారత స్వాతంత్రోద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనే విధంగా చెప్పేవారు. అందుకు కారణం ఆనాటి ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది అగ్రవర్ణాల వారు ఉండేవారు. వారి కుటుంబాల్లో కాంగ్రెస్ నాయకులు ఉండేవారు. అందుకు వారు ఆ చరిత్రే చెప్పేవారు.  వారిలో కొందరికి  భగత్ సింగ్ త్యాగం గొప్పగా కనిపించినా ఆయన సిద్దాంతాల పట్ల వారికి సద్భావన ఉన్నట్లుగా కనిపించేది  కాదు.  ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా ఆని దేశ ప్రజల్లో  కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం సన్నగిల్లింది.ఇక  అప్పటినుండి  నుండి  కాంగ్రెస్ పార్ట్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల వలన కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా వ్యతిరేకత  రావడం, దాన్ని బిజేపి సొమ్ము చేసుకోవడం తో అంతటి త్యాగపూరితమైన భారత స్వాతంత్రోద్యమ చరిత్ర మసక బారి పోతున్న పరిస్తితి ఏర్పడింది. 


ఇలాంటి సందర్భం లో సుజిత సర్కార్ తీసిన సర్దార్ ఉద్దం సినిమా , ఆనాటి వీరుల త్యాగాలను కండ్లకు కట్టినట్టుగా చూపింది. జలియన్ వాలా బాఘ్ కాల్పులకు అనుమతి ఇచ్చే పంజాబ్ సివిల్ అధికారి జనరల్ డయ్యర్ తో కాల్పులు మామూలుగా ఉండకూడదు ప్రజలను భయో త్పా తానికి, దిగ్భ్రాంతి కి   గురి చేసేదిగా ఉండాలని హెచ్చరిస్తాడు. ప్రస్తుత పాలకులు సైతం మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో రైతుల పట్ల  డయ్యర్ పాలసీ నే కదా అమలు చేసింది. 


1 &  2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటీష్ ప్రభుత్వం తరుపున పోరాడి  26 లక్షల మంది సైనికులు , చర్చిల్ అవలంభించిన  వార్ టైమ పాలసీ కారణంగా  ఏర్పడ్డ బెంగాల్ కరువు వలన  40 లక్షల మంది భారత పౌరులు తమ ప్రాణాలను దారబోసి సాధించుకున్న భారత స్వాతంత్ర  ఉద్యమ ఫలితాలు ఎవరి పాలు అవుతున్నాయో చూస్తే , ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉరికంబాలను ముద్దాడిన భగత్ సింగ్,రాజ్ గురు,  సుఖదేవ్, ఉద్దం సింగ్ లాంటి 3300 మంది వీరుల వీరమరణం  త్యాగాలన్నీ ఇలా వృథా కావాల్సిందేనా అనిపిస్తున్నది.   


ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే నన్న నేటి యువ తరానికి ఎంత రక్త తర్పణం, ఎన్నెన్ని త్యాగాలు, ఎందరెందరో  బిడ్డలను కోల్పోయిన తల్లులు, తలీదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన యువత త్యాగాల పునాదుల మీదుగా బ్రిటీషయర్ల కబందా హస్తాల నుండి విడిపించబడిన దేశ వనరులు ఎవరి పాలవుతున్నాయో అర్థం చేసుకునే అవకాశం కొంతైనా కలుగుతుందేమో అన్న చిన్న ఆశ తో .. 


Thursday, May 6, 2021

మనిషి ప్రయాణం.

                                                 మనిషి ప్రయాణం. 


కరోనా కాటుకు మనుసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సీజన్ లబించడం లేదు. రెంసివిడర్ ఇంజెక్షన్ దొరుకదు. వాక్సిన్ వేయించుకోండి అని చెప్పుడే గాని వాక్సిన్ కేంద్రాలకు వెళితే వాక్సిన్ అందుబాటులో  ఉండడం లేదు. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలై కొడారిపోయే పరిస్తితిలో ఉన్నాయి. ఈ పరిస్తితికి కారణం ఎవరూ అంటే చాలా మంది, మరి  ప్రజలు కాకుంటే మరెవరు అవుతారు అని  ఎదురు ప్రశ్న వస్తున్నది. 


దేశం లో గత ఏడు సంవస్తారాలుగా గతం లో అంతగా   లేనట్టి  ఒక కొత్త భావజాలం వేగంగా వ్యాప్తి చెందుతోంది. అది ఏమంటే? ప్రశ్నించడాన్ని సహించలేక పోవడం. తాము చెప్పిందే నమ్మాలి, వినాలి, ఆచరించాలి , అన్న అహంకారం , అధికారమై కాటువేస్తున్నది.


ప్రశ్నకు జవాబు లేని ఒక మూడత్వాన్ని, నేనే గొప్ప, నా జాతే గొప్పా, నా మతమే గొప్ప అనే ఒక దురహంకారానికి లోనైన ఒక వికృత మానవ నైజం ,   కాదన్నోన్ని  దేశ ద్రోహి, పాకిస్తానీ, కమ్యూనిస్ట్, అర్బన్ నక్సలైట్ అని వాని  మీద బడి కాలిపిక్కలను కరుస్తున్నది. . నిజానికి  ఈ భూమి పైన ఎన్ని సార్లు   జీవరాశి శూన్యమై పునర్నిర్మానమై ఈ 20 లక్షల సంవస్తారాల  ఆధునిక మానవుని (హోమోసేపియన్స్) జీవిత కాలం లో ఎన్నెన్ని ప్రస్తానాలు ఎక్కడెక్కడి నుండి ఎక్కడెక్కడిదాక జరిగినాయో  అన్న ఒక శాస్త్రీయమైన అవహాహన కలిగి ఉంటే వాళ్ళే చేప్బుతున్నట్లుగా ఈ వసు దైక కుటుంబం లో మానవులుందరూ ఒకటే, సమానమే, అందరికీ గాలి నీరు భూమి అనే పంచబూతాలపై సమాన మైన హక్కులు ఉంటాయి అన్న విషయం అర్థం అవుతుంది.


ఒకప్పుడు భూమి,  ఇప్పుడు మనం చూస్తున్న ఆరు కండాలుగా విభజించవడి లేకుండే అన్నది, ఈ భూమి పైన ఇదివరకు ఐదు సార్లు 440 బిలియన్ ,365 బిలియన్, 250 బిలియన్, 210 బిలియన్ చివరగా 65 బిలియన్ సంవస్తారాలక్రితం సర్వం నిర్మూలనమైపోయింది అని  ఫాసిల్స్ లో నిక్షిప్తమై ఉన్న శిలాజాల ద్వారా కార్బన్ టెస్ట్ తో  శాస్త్రీయంగా నిరూపించబడ్డసత్యం.


ఐస్ ఏజ్ . మంచు యుగం. 46 లక్షల సంవస్తారాలనుండి 26 లక్షల సంవస్తారాల క్రితం వరకు దఫాదఫాలుగా మంచుయుగం ఈ భూమి పైన వచ్చినట్లు శిలాజాలు చరిత్రను నిక్షిప్తం చేసినాయి.అప్పుడూ సర్వం నిర్మూలన అయింది.  అలాగే 70 వేల సంవస్తారాల క్రితం ఇండోనేషియా లోని తోబా అగ్నిపర్వత విస్పోటనం వలన కొన్ని వేల మైళ్ళ దూరం లో ఉన్న దక్షిణ  మధ్య భారతం పైన కొన్ని మీటర్ల మందంగా ధూళి , బూడిద వచ్చిపడ్డాయి. అనేక వృక్షాలు జంతువులు తుడిచిపెట్టుక పోయాయి. అనేక మంది ఆదిమ మానవులు మరణించారు. కర్ణాటకలోని జ్వాలాపురం లో ఆదిమ జాతుల నివాస ప్రాంతం లో జరిపిన తవ్వకాల్లో మీటర్ల మందాన పేరుకొని  పోయి ఉన్న ధూళి ని గమనించారు. ఆ ధూళి తోబా అగ్నిపర్వతం నుండి వెలువడ్డది గా నిర్ధారించారు. ఆ తర్వాత 12000 సంవస్తారాల నుండి  అరేబియా నుండి కొత్తగా వచ్చిన మానవ సమూహాలు కొత్త రాతి యుగానికి స్వీకారం చుట్టినాయి. పదునైన రాతి పనిముట్లను తయారుజేసుకొని సంచార నివాసం నుండి స్టిర నివాస ఏర్పాట్లు ప్రారంభం అయినాయి. పశ్చిమ ఆసియాలోని జేరికో, బలూచిస్తాన్ లోని మెహర్ గడ్ , వంటి ప్రదేశాల్లో గ్రామాలు వెలసినాయి. ఆ కాలం లో పశ్చిమ ఆసియా నుండి మధ్యధరప్రాంత జాతులు, దక్షిణ ఇరాన్ నుండి ఏలమైట్ జాతులవారు, సింధు ఉత్తరప్రాంతాలైన పంజాబ్, స్వాత్ లోయ, గాంధారా, వక్షు నది ప్రాంతం లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రీ.పూ. 6000 నాటికి వక్షునది నాగరికత ప్రారభమ్ అయింది. సింధు నాగరికత క్రీ.పూ. 3000 నాటికి ఉచ్ఛదశ చేరుకోవడం తో ఆ నాగరికత ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, తూర్పున పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, మహారాస్ట్రా ప్రాంతాలవరకు విస్తరించింది. కొత్తరాతి యుగపు ఆదిమ జాతులను కూడా తనలో ఇముడ్చుకొంది. 


దాదాపు 10 వేల ఏళ్ల క్రితం ఆగ్నేయ ఆసియా ప్రాంతాలనుండి ఆస్ట్రలైడ్ జాతులవారు తిరిగి వెనుకకు వచ్చి భారత ఈశాన్య ప్రాంతం లో స్తిరపడ్డారు. వీరిలో నాగాలు, బోడోలు, చక్మాలు, కూకీలు, అంగామీలు, ఖాసీలు, తదితర జాతులు మాట్లాడే వివిధ భాషలు ఆస్ట్రోలైడ్ మూలాలు కలిగిఉన్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాలకు చైనా ప్రాంతాలనుండి మంగోలాయిడ్ జాతుల ప్రజలు వచ్చి స్టిరానివాసాలు ఏర్పాటుజేసుకున్నారు. వీరినే వేదకాలం లో కిరాతులుగా ప్రస్తావించారు. వీరే కాక తోబా అగ్నిపర్వత భారీవిస్పోటనం తర్వాత జరిగిన వలసలలో అస్త్రలాయిడ్ జాతులకు చెందిన ఆదివాసులుగా పిలువబడే గొండ్లు, కోయలు, చెంచులు, తదితర అనేకజాతులవారు, ఒరిస్సా,మధ్యప్రదేశ్, చత్తిస్గడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలల్లోకి వలస వచ్చి ఇప్పటికీ నివసిస్తున్నారు. వీరే కాక అండమాన్ దీవులలోనూ, దక్షిణాది రాస్ట్రాల్లోనూ , నీగ్రోలాయిడ్ జాతులవారు నివసిస్తున్నారు. వీరికి మధ్య ఆఫ్రికా జాతులవారి మూలాలు ఉన్నట్లుగా జన్యుపరీక్షలో తేలింది. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ  మానవజాతి అనేక చేర్పులు మార్పులకు లోనౌతు ప్రకృతి శక్తులతో నిరంతరం పోరాడుతూ నిలిచి ఉంది. 


ఇక క్రీ పూ. 3000 సంవస్తారాల నుండి ఉన్న హరప్పా, మహొంజొదారో , సిందునాగరికత స్తానమ్ లో వచ్చిన ఆర్య నాగరికత అదో చరిత్ర. అసలు సిందూ నాగరికతే ఆర్యనాగరికత అనీ, అదే మొదటినుండి ఉంది. సిందూ లేదు ద్రావిడ లేదు అనే ఒక మొండి వాదన చారిత్రిక ఆధారాలు లేని, ప్రపంచ చరిత్రకారులెవ్వరూ అంగీకరించని ఒక వితండ  వాదన చేస్తున్నారిప్పుడు కొందరు . రాహుల్ సాంకృత్యాన్ రాసిన ఓల్గాసే గంగా, మర్ల విజయ్ కుమార్ రాసిన భారతీయుల మూలాలు చదివినా సింధు నాగరికత నుండి ఆర్యుల నాగరికత వరకు భారత దేశం లో జరిగిన చరిత్ర తెలుస్తుంది. ఈ పుస్తకాలకు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. వట్టి పుక్కిటి పురాణాలు ప్రామాణికం కాజాలబోవు. అందులో ఉన్నది చరిత్ర కాజాలబోదు . ఒక కథ, ఒక నవల, ఒక ప్రబంధ సాహిత్యం, ఒక పురాణ సాహిత్యం, మాత్రమే.  అవన్నీ ప్రజల మధ్యన ఉండే సంబంధ బాంధవ్యాలను, జీవన విధానాలను, ఆహార విహారాలు,  ఆహార్యం, ఆలోచనా విధానాలను మాత్రం చెపుతాయి.


సింధు నాగరికత విధ్వంసం తర్వాత ఆయా పొలిమెరల్లో నివసించే భిల్లులు, సంతాలులు, గొండ్లు, తదితర జాతులు మధ్యభారం లోకి తరలి వచ్చారు. క్రీ. పూ. 1800 నాటికి చోటనాగ్పూర్  ప్రాంతం లో ఇనుపవస్తువుల తయారీకి శ్రీకారం చుట్టి ఇనుపయుగానికి నాంది పలికారు. క్రీ.పూ. 500 నాటికి పర్షియా సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా నుండి పశ్చిమ ఆసియా, పర్షియా, తూర్పు సింధు ప్రాంతం , ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమేనిస్తాన్, తజకిస్తాన్, వరకు విస్తరించింది. నేటి యుగోస్లేవియా, అల్బేనియా, టర్కీదక్షిణ భాగం, అశ్శీరియ, జోర్డాన్ ప్రాంతాలలో నివశిస్తున్న గ్రీకులు,  వీరందరని కలిపి యవనులు అనే వారు.పర్షియన్  చక్రవర్తి దారియన్ ఆకాలం లో ఈ యవన సైనికులను తన రాజ్యం లోని ఆఫ్ఘనిస్తాన్ అందలి  గాంధారా కు తీసుకు వచ్చారు. పర్షియన్ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత, క్రీ.పూ. 326లో అలెగ్జాండర్ సింధు నది ప్రాంతం వరకు  విస్తరించాడు. గ్రీక రాజ్యం సెల్యూకస్ వారసుడు మినాండర్ బౌద్ధాన్ని స్వీకరించి మిళిందునిగా ప్రసిధ్ధి  చెందాడు. ఇండో గ్రీక్ రాజ్యాలు పతనమైణాంక ఆ యవన  సైన్యాలను అనేక రాజ్యాలు ఉపయోగించుకున్నాయి. కాల క్రమం లో వారు క్షత్రియులు గా బ్రాహ్మణులుగా భారతసమాజం లో విలీనం అయినారు. 


క్రీ.పూ. 3 వ శతాబ్దం నుండి దాదాపు 600 సం. పాలించిన పర్షియన్ రాజులు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరపంజాబ్, వరకు తమ రాజ్యాన్ని విస్తరించారు. తర్వాత సింగియాంగ్ ప్రాంతం నుండి దండెత్తి వచ్చిన ఇండో యూరోపినులైన శకుల దాడితో ఇండో గ్రీకు రాజ్యాలు పతన దశకు చేరుకున్నాయి. శకులు జన్యుపరంగా ఆర్యులకు దగ్గరి వారు. అయితే చైనా లోని గ్వాంగ్జూ ప్రాంతం లో నివసించే మరో ఇండో యూరోపియన్ జాతి యుయఝీలు వీరు శకుల రాజ్యాన్ని ఆక్రమించుకొని క్రీ. పూ. 50 నాటికి కుశాన్ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్నారు. కుశాన్ రాజులలో కనిష్కుడు ప్రముఖుడు. ఈ విధంగా ఉత్తరాన ఉన్న పచ్చిక మైదానాల గుండా అనేక జాతుల వారు దక్షిణ ఆసియాలో రాజ్యాలు స్టాపించుకొని కాలక్రమేణా వారంతాకూడా భారతీయులలో కలిసి పోయారు. క్రీ.ష. 5,6 శతాబ్దం లో తుర్కెమినిస్తాన్ నుండి శ్వేతహూణులు దోపిడి ప్రధానగా దాడులు జరిపి వారు తిరిగి వెనుక్కు పోలేదు. 11 వ శతాబ్దం నుండి 7 వందల ఏండ్ల పాటు తురుష్కులు పాలించారు. జొరాష్ట్రీయన్ మతస్తులైన పార్శీలు పశ్చిమ భారత్ లో ప్రవేశించారు. ఆఫ్రికా జాతులైన అబిసీనియన్లను ఇతర తూర్పు ఆఫ్రికా దేశస్తులను ఇక్కడికి అంగరక్షకులుగా తెచ్చుకున్నారు. 17 వ శతాబ్దం నుండి యూరోపియన్లు ఈ దేశాన్ని పరిపాలించారు. అలా ఆంగ్లో ఇండియన్లు, ఫోర్చుగీసువారు, టిబెటీయులు , ఇరానీయులు ఆఫ్ఘనిస్తాన్ వారు భారత దేశం లో స్తిరపడ్డారు. 


1947 దాకా భారత దేశం నానా జాతుల సమితి. అందుకే భారత దేశం ఒక గణతంత్ర రాజ్యం. అనేక మతభేదాలతో, కులబెధాలతో వేల సంవస్తారాల నుండి ఇక్కడ  కలిసి మెలిసి సోదరభావం తో నివశిస్తున్నామ్. 

ఒక్క భారతదేశం లోనే కాదు.అన్ని  ప్రపంచదేశాల దేశాల్లో ఇదేవిధమైన అన్ని జాతుల, అన్ని మతాల, అన్ని రంగుల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. కానీ ఈ దేశం లో ఈ మతస్తులే ఉండాలి, ఈ రంగు వాళ్లే ఉండాలి , ఈ జాతివారే ఉండాలి అని; మాట్లాడటం లో అర్థం లేదు. జాతి మతమూ రంగు అన్ని మనుషులు ఏర్పాటుచేసుకున్న పరిధులు మాత్రమే. భారతదేశం లో హిందూయిత్వం, , అమెరికాలో ట్రంప్ ఇజమ్,   ఆస్ట్రేలియాలో స్కాట్ మార్సియనిస్మ్, యు.కె. లో బోరిస్ జాన్సనిజమ్ ఇట్లా ఏదేశానికి ఆ దేశం ప్రజలను వేర్పాటు వాదం వైపు నడిపిస్తున్నాయి. కానీ మానవుల యొక్క సహజస్వభావం మనుషులను వెదుక్కోవడం. కలిసి ఉండడం. 


పోనీ మనుషులను విడదీస్తున్న ఈ మతరాజకీయాలు, జాతి రాజకీయాలు, ప్రజలందరి శ్రేయస్సుకోసం ఏమైనా చేస్తున్నాయా అంటే అదీ లేదు. ఇది అలనాటి రాచరిక వ్యవస్థ నాటి నుండి కూడా లేదు. రాజు సుప్రీం. దాన్ని స్తిరత్వం చేయడానికి పూజారివర్గం, కండబల వర్గం ఎలాగూ ఉండనే  ఉనాయి. ప్రజలు పనిజేసే యంత్రాలు మాత్రమే. సంక్షేమ రాజ్యాలు, రాజ్యాంగం , ప్రజాస్వామ్యం అంటూ వచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. 1698 లో స్టీమ్ ఇంజిన్ కనుక్కున్న తర్వాత 1860 ప్రాంతం లో వచ్చిన  పారిశ్రామిక విప్లవం , పెట్టుబడి శ్రామికులను సృస్టిస్తే ఆ తర్వాత శక్తికి అవసరమైన బొగ్గు, పెట్రోలియం, వచ్చిన తర్వాత సాంకేతిక అభివృధ్ధి జరిగి ఆ  తరువాత భూమి పైన, భూమి లోపల ఉన్న సకల వనరులను దోచుకోవడం ప్రారంభం అయింది. భూమి భోమితోబాటుగా ఉన్న అన్ని సహజసంపదలను ప్రజలందరికీ సమానంగా పంచవల్సిన బాధ్యతల ను వదిలి వేసిన పాలక పక్షం అవన్నీ డబ్బున్న సంపన్నులకు దోచి పెడుతూ అదే చాలా గొప్ప అభివృధ్ది అని ఊదరగొడుతున్నది. 


ఒక్క మతాన్ని నీ చేతిలో పెట్టి నీకున్నదంతా గోచిగుడ్డతో సహా సంపన్నులకు దోచిపెట్టి కార్యక్రమం ఒకవైపు నిరాఘాటంగా సాగుతుంటే,  నేనే గొప్ప, నా మతమే గొప్ప అంటో ఎంతకాలమైతే ప్రజలు ఆ మాయలో ఉంటారో అంతకాలం తమ వెనుకబాటు తనానికి ఆ ప్రజలే కారణ మౌతారు.  


అమెరికా లో ఎలాన్ మస్క్ అనే ఒక టెక్నో క్రాట్, పెట్టిబడి దారు, బ్యాటరీ కార్లు తేవడం తో బాటుగా ఇప్పుడు SN 15 అనే ఒక కొత్త 15 అంతస్తుల రాకెట్ కనుక్కొని రేపు అంగారక గ్రహం మీదికి రాకపోకలు సాగిస్తాడట. అంటే ఈ గ్రహాన్ని మానవయోగ్యం కాకుండా జెసి ప్రపంచ  సంపన్న వర్గాలు అంగారకునికి పైకి లేచిపోయే ప్రయత్నం ఒకవైపు సాగుతుంటే ఇక్కడ మన భారతదేశం లాంటి చోట్ల రోగులకు కనీసం ఆక్సీజన్ అందించలేని పరిస్తితి లో ఉంటూ నా దేశం , నా మతం, నా జాతి అంటూ శుష్కవాదాలు చేస్తూ ఎంతకాలం మనుషులను భ్రమల్లో ఉంచుతారు. ప్రజలు గొర్రెల్లా  తలలూపడం మానుకొని  ఇకనైనా మేల్కొని మనలో మనం కొట్టుకోవడం మానివేసి  ప్రశ్నించడాన్ని నేర్చుకొని ప్రకృతి ని కాపాడుకొంటూ పరిమితంగా మాత్రమే ప్రకృతి సంపదలను వాడాలని నినదిస్తూ ఉత్పత్తి అయిన సంపద సమానంగా పంచబడాలే అని, అందరికీ ఒకే విధమైన,ఒకే నాణ్యమైన  ఉచిత  విద్య, ఉచిత వైద్యం  అందే దానికి పాలక వర్గాని ప్రశ్నించండి. 


వీరగొని పెంటయ్య. 

రాష్ట్ర ఉపాధ్యక్షులు 

రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ. 

కరీంనగర్. 

        


Sunday, March 7, 2021

మంతెన్న బడి ఇచ్చిన చైతన్యం యాదిలో.

                                       మంతెన్న బడి ఇచ్చిన చైతన్యం యాదిలో !.



మంథని హైస్కూల్ విద్యార్థి కొండెల మారుతి.  ఆయన విద్యార్థి దశ నుండే ఉద్యమ స్వభావం ఉన్న వ్యక్తి కావడం వలన మంథని విద్యార్థి యువత అన్న పేరుతో , ఆనాడు  మంథని హైస్కూల్ తో చదువుకున్న విద్యార్థులందరిని  ఒక్క దగ్గరికి చేర్చి మంథని 116 సంవస్తరాల విద్యామహోత్సవం జరిపించాలన్న తలంపుతో ఎవరు సహరించినా సహకరించకపోయినా ఒంటరిగా ఆ యజ్ఞానికి పూనుకున్నాడు. 


ఆ క్రమం లో ఒక 15 రోజుల క్రితం హైద్రాబాద్ లో, ఈ రోజు కరీంనగర్ లో ఆత్మీయ గోస్టీ నిర్వహించాడు. నేను కూడా హాజరైనాను. నాకంటే సీనియర్స్ అయిన జిలానీ గారు, మరియు చీఫ్ ఇంజనీర్ గా పనిజేసిన కృష్ణ మూర్తి గారు, మరియు నాకంటే జూనియర్ విద్యార్థులు మొత్తం 12 మందిమి హాజరైనాము. 


ఎవరికైనా బాల్యం, విద్యార్థి దశ, ఆనాటి మిత్రులు, సహచరులు, ఉపాధ్యాయులను యాదికి జేసుకోవడం గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా? రెగ్యులర్ గా కలుసుకొనే జిలానీ మేడమ్, వీక్షణం రమేశ్ కాకుండా మిగతామిత్రులను చాలా రోజుల తర్వాత అక్కడ చూసి చాలా ఆనందం కలిగింది. అందుకు నిజంగా కొండెల మారుతి అభినందనీయుడు. అప్పటి ఉపాధ్యాయులను, క్లాస్ మేట్స్ ను, సహ మిత్రులను జ్ఞాపకం చేసుకున్నాము. బాల్యం లోకి తొంగి చూసుకొని  కాసేపు చిన్న పిల్లలమే అయిపోయినాము. 


మంథని లో చదువుకొన్న అక్కడ గుమికూడిన వారిలో  మేము అందరం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మేము సామాన్య జనాలకంటే ఎంతో కొంత మెరుగైన  జీవితాలు అనుభవించి యున్నవారమే. అంతే  కాకుండా పెన్షన్ డబ్బులతో ఎవ్వరిమీద ఆధార పడకుండా స్వతంత్ర జీవితాలు సాగిస్తున్న వారమే.కేవలం కొండెల మారుతి మాత్రం మా అందరిలోకి స్తిరమైన ఆదాయం లేని వ్యక్తి. కానీ ఆయనే మా అందరికంటే ముందుబడి ఎంతో వ్యయప్రయాసకు ఓర్చుకొని ఈ బృహత్కార్యక్రమాన్ని నిర్వ్హిస్తున్నాడు.  అయితే అక్కడ చాలా పెద్ద పెద్ద  వాళ్ళ ప్రస్తావన వచ్చింది.  అక్కడ పుట్టి పెరిగి విద్యాబుధ్ధులు నేర్చుకొని, సమాజం లో చాలా ఉన్నతమైన హోదా పొందిన వాళ్ళ గురించి, అలాగే మంతెన నియోజక వర్గం ప్రజల ఓట్లతో రాజకీయంగా ఎదిగి దేశ ప్రధాని అంత ఎత్తుకు ఎదిగిన వారి  ప్రస్తావన కూడా వచ్చింది. అంతటి ఉన్నతమైన వ్యక్తులు మన మంథని వారు కావడం మనకు గర్వకారం అంటూ మిత్రులు కొందరు ఆనంద పడ్డారు. 


ఇక్కడ ప్రధానంగా రెండు విషయాల పైన చర్చ చేయాలన్న ఉద్దేశం తో ఇది రాస్తున్నాను. ఒకటి మంథని లో హైస్కూల్ ఉన్న కారణంగా , విద్వత్తు కలిగిన మంచి  ఉపాధ్యాయుల బోధనల కారణంగా కస్టపడి చదువుకున్న కొందరు తాము ఆర్జించిన ఉన్నత విద్యార్హత ల  కారణగా ఏదో ఒక  ఉద్యోగం పొంది తాము కాయకస్టమ్ లేని జీవితం గడిపి తమ సంతానానికి కూడా స్తిరమైన ఉద్యోగమో ఉపాధో కలిగే విధంగా కృషి చేసి ఒక తండ్రిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానని సంతోష పడి పోయి పదుగురిలో ప్రతిస్టగా బతుకుతున్నామని మురిసి పోయేవారం కొందరం అయితే, మరికొందరు పొందిన ఉద్యోగాన్ని తాకట్టుపెట్టి తరతరాలు తిన్నా తరుగని ఆస్తిపాస్తులు కూడబెట్టి తనవంటి బుద్ధి కుశలత ఎవరికుంది అని మురిసిపోయే గొప్పవారు మరికొందరు. ఇంకా చివరలో ప్రజల ఓట్ల తో గెలుపొంది వారుబతికినన్నాళ్లు రాజవైభోగాలు అనుభవించి,  తమ తదనంతరం తమ వారసులకు ఆ పదవులు కట్టబెట్టి పాలనా వారసత్వ పగ్గాలు జారిపోకుండా గట్టి  పునాదులు వేసుకొన్న వారు కొందరు ఉన్నారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసిన కారణంగా వారికీ లభించిన కీర్తి ప్రతిస్టల వలన సామాన్య జనాలకు ఏమైనా లాభం కలిగిందా? పెద్దపెద్ద రాజకీయ పదవులు ఏలిన వారి కీర్తికిరణాలు సోకడం  వలన బీదా , బిక్కి పేదా , సాదా జనాల జీవితాలల్లో ఏమైనా  వెలుగు నిండిందా? 


మంథని లో 1904లోనే అంటే నిజాం కాలం లోనే ఒక హైస్కూల్ ఉన్న కారణంగా కొందరైనా ఓ మాదిరి చదువులు చదువుకున్నారు. కానీ ఇంత పెద్ద పదవులు నిర్వహించిన ఆ  గొప్పగొప్ప వాళ్ళు మంథనీకి ఒక మంచి విద్యాలయం , సాంకేతిక కళాశాల, ప్రాంతీయులకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏదైనా ఒక పరిశ్రమ తెచ్చారా? మంతని నియోజక వర్గం చుట్టూ పారే గోదావరి నది నుండి చుక్క నీరు ఉపయోగించుకొనే ప్రాజెక్టు కట్టారా? నాతో సహా ఏదో ఒక ఉద్యోగం చేసుకొన్నవారం మా మేలు మేము  చూసుకున్నామే గాని ప్రజలకోసం చేసింది ఏమి లేదు. అలాగే రాజకీయ పదవులు పొందిన వారుకూడా చేసింది అంతే. అదేదో సినిమాలో ధర్మావరం సుబ్రమణ్యం అంటాడు, " ఏమిరా బాల రాజు ! నీవలన దేశానికి  సమాజానికి ఉపయోగం" అంటాడు. 


నిజమే ఎవరమైనా సమాజానికి ఉపయోగం అయ్యే పనులు ఎందుకు చెయ్యాలి? మనకేం అవసరం? సమాజం ఏమైనా ఉద్యోగం ఇచ్చిందా? బువ్వ పెట్టిందా?  ( రాజకీయాల్లో ఉన్నవారికైతే అలా  అడిగే అర్హతే లేదు. ఎందుకంటే వారి పదవులు ఏవైనా అవన్నీ సమాజం వేసిన బిచ్చమే). అంటే! అవును మనం పొందుతున్నవి ఏవైనా అవి సమాజం మొత్తంగా మనకు పెట్టిన బిక్షే! ఎలాగంటే, ఆ బడి ప్రజల పైసలతో కట్టబడింది. మన ఉపాధ్యాయుల కు  జీతాలు ప్రజల పైసలే. ఉద్యోగులమ్ గా మనం పొందిన వేతనాలు ప్రజలు ఇచ్చిన పన్నుల ద్వారానే కదా మనం పొందేదీ. ఇక ఏ మనిషైనా వాడు చదువుకున్నా చదువుకోక పోయినా వాడు పొందే సామాజిక జ్ఞానం ఏదైతో ఉందో అది సమాజం నుండి నేర్చుకొన్నదే. కనుక మొత్తంగా ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సమాజానికి ఋణపడి ఉన్నవాడే!  


   అయితే ఈ రాజకీయాలు మనకెందుకు అని అడుగవచ్చు. మన మంథని నుండే తన రాజకీయ జీవన  ప్రస్తానమ్ ప్రారంభించిన pv గారు 1991 లో ప్రధాని అయిన తర్వాత మొదటి సారిగా వారు ప్రవేశ పెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాల కొనసాగింపే కదా, మోడీ గారు ప్రవేశ పెట్టిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు . అలాగే LIC,BSNL,IOC,BPL, Aluminiyam , Steel, Petroleum and gas,Banking,Defence equipments, IT, Coal mines, Power transmission,   etc. అలాగే అన్నీ PSU(Public, Sector Units) లను ప్రైవేట్ చేస్తానని  మోడీ గారు  చెప్తున్నారు. అయితే మనకేమిటి  అని మీరనవచ్చు. ఆనాడు మంథని లాంటి ఒకచోట అయినా  ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్నందున్నే కదా  మాలాంటి వాళ్ళం ఎంద రమో చదువుకు నోచుకున్నది . విద్యా ప్రభుత్వ ఆధీనం లో ఉంది గనుక ఉపాధ్యాయునిగా ఉద్యోగం లభించింది. ఇవ్వాళ అన్నీ ప్రైవేట్ అయితే పేదవారికి విద్య, ఉపాధి అందని ద్రాక్షే  అవుతుంది. మళ్ళీ రాజరిక వ్యవస్త కాలం దాపురించే ప్రమాదం ఉంది. కనుక బుధ్ధి జీవులుగా సమస్త వ్యవస్థలను ప్రైవేటీకరించ వద్దు అనీ, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలని కనీసం ఒక నినాదం అయినా ఇవ్వవలసిన సామాజిక బాధ్యత మనపైన ఉందని నేను భావిస్తున్నాను.