Sunday, March 7, 2021

మంతెన్న బడి ఇచ్చిన చైతన్యం యాదిలో.

                                       మంతెన్న బడి ఇచ్చిన చైతన్యం యాదిలో !.



మంథని హైస్కూల్ విద్యార్థి కొండెల మారుతి.  ఆయన విద్యార్థి దశ నుండే ఉద్యమ స్వభావం ఉన్న వ్యక్తి కావడం వలన మంథని విద్యార్థి యువత అన్న పేరుతో , ఆనాడు  మంథని హైస్కూల్ తో చదువుకున్న విద్యార్థులందరిని  ఒక్క దగ్గరికి చేర్చి మంథని 116 సంవస్తరాల విద్యామహోత్సవం జరిపించాలన్న తలంపుతో ఎవరు సహరించినా సహకరించకపోయినా ఒంటరిగా ఆ యజ్ఞానికి పూనుకున్నాడు. 


ఆ క్రమం లో ఒక 15 రోజుల క్రితం హైద్రాబాద్ లో, ఈ రోజు కరీంనగర్ లో ఆత్మీయ గోస్టీ నిర్వహించాడు. నేను కూడా హాజరైనాను. నాకంటే సీనియర్స్ అయిన జిలానీ గారు, మరియు చీఫ్ ఇంజనీర్ గా పనిజేసిన కృష్ణ మూర్తి గారు, మరియు నాకంటే జూనియర్ విద్యార్థులు మొత్తం 12 మందిమి హాజరైనాము. 


ఎవరికైనా బాల్యం, విద్యార్థి దశ, ఆనాటి మిత్రులు, సహచరులు, ఉపాధ్యాయులను యాదికి జేసుకోవడం గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా? రెగ్యులర్ గా కలుసుకొనే జిలానీ మేడమ్, వీక్షణం రమేశ్ కాకుండా మిగతామిత్రులను చాలా రోజుల తర్వాత అక్కడ చూసి చాలా ఆనందం కలిగింది. అందుకు నిజంగా కొండెల మారుతి అభినందనీయుడు. అప్పటి ఉపాధ్యాయులను, క్లాస్ మేట్స్ ను, సహ మిత్రులను జ్ఞాపకం చేసుకున్నాము. బాల్యం లోకి తొంగి చూసుకొని  కాసేపు చిన్న పిల్లలమే అయిపోయినాము. 


మంథని లో చదువుకొన్న అక్కడ గుమికూడిన వారిలో  మేము అందరం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మేము సామాన్య జనాలకంటే ఎంతో కొంత మెరుగైన  జీవితాలు అనుభవించి యున్నవారమే. అంతే  కాకుండా పెన్షన్ డబ్బులతో ఎవ్వరిమీద ఆధార పడకుండా స్వతంత్ర జీవితాలు సాగిస్తున్న వారమే.కేవలం కొండెల మారుతి మాత్రం మా అందరిలోకి స్తిరమైన ఆదాయం లేని వ్యక్తి. కానీ ఆయనే మా అందరికంటే ముందుబడి ఎంతో వ్యయప్రయాసకు ఓర్చుకొని ఈ బృహత్కార్యక్రమాన్ని నిర్వ్హిస్తున్నాడు.  అయితే అక్కడ చాలా పెద్ద పెద్ద  వాళ్ళ ప్రస్తావన వచ్చింది.  అక్కడ పుట్టి పెరిగి విద్యాబుధ్ధులు నేర్చుకొని, సమాజం లో చాలా ఉన్నతమైన హోదా పొందిన వాళ్ళ గురించి, అలాగే మంతెన నియోజక వర్గం ప్రజల ఓట్లతో రాజకీయంగా ఎదిగి దేశ ప్రధాని అంత ఎత్తుకు ఎదిగిన వారి  ప్రస్తావన కూడా వచ్చింది. అంతటి ఉన్నతమైన వ్యక్తులు మన మంథని వారు కావడం మనకు గర్వకారం అంటూ మిత్రులు కొందరు ఆనంద పడ్డారు. 


ఇక్కడ ప్రధానంగా రెండు విషయాల పైన చర్చ చేయాలన్న ఉద్దేశం తో ఇది రాస్తున్నాను. ఒకటి మంథని లో హైస్కూల్ ఉన్న కారణంగా , విద్వత్తు కలిగిన మంచి  ఉపాధ్యాయుల బోధనల కారణంగా కస్టపడి చదువుకున్న కొందరు తాము ఆర్జించిన ఉన్నత విద్యార్హత ల  కారణగా ఏదో ఒక  ఉద్యోగం పొంది తాము కాయకస్టమ్ లేని జీవితం గడిపి తమ సంతానానికి కూడా స్తిరమైన ఉద్యోగమో ఉపాధో కలిగే విధంగా కృషి చేసి ఒక తండ్రిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానని సంతోష పడి పోయి పదుగురిలో ప్రతిస్టగా బతుకుతున్నామని మురిసి పోయేవారం కొందరం అయితే, మరికొందరు పొందిన ఉద్యోగాన్ని తాకట్టుపెట్టి తరతరాలు తిన్నా తరుగని ఆస్తిపాస్తులు కూడబెట్టి తనవంటి బుద్ధి కుశలత ఎవరికుంది అని మురిసిపోయే గొప్పవారు మరికొందరు. ఇంకా చివరలో ప్రజల ఓట్ల తో గెలుపొంది వారుబతికినన్నాళ్లు రాజవైభోగాలు అనుభవించి,  తమ తదనంతరం తమ వారసులకు ఆ పదవులు కట్టబెట్టి పాలనా వారసత్వ పగ్గాలు జారిపోకుండా గట్టి  పునాదులు వేసుకొన్న వారు కొందరు ఉన్నారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసిన కారణంగా వారికీ లభించిన కీర్తి ప్రతిస్టల వలన సామాన్య జనాలకు ఏమైనా లాభం కలిగిందా? పెద్దపెద్ద రాజకీయ పదవులు ఏలిన వారి కీర్తికిరణాలు సోకడం  వలన బీదా , బిక్కి పేదా , సాదా జనాల జీవితాలల్లో ఏమైనా  వెలుగు నిండిందా? 


మంథని లో 1904లోనే అంటే నిజాం కాలం లోనే ఒక హైస్కూల్ ఉన్న కారణంగా కొందరైనా ఓ మాదిరి చదువులు చదువుకున్నారు. కానీ ఇంత పెద్ద పదవులు నిర్వహించిన ఆ  గొప్పగొప్ప వాళ్ళు మంథనీకి ఒక మంచి విద్యాలయం , సాంకేతిక కళాశాల, ప్రాంతీయులకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏదైనా ఒక పరిశ్రమ తెచ్చారా? మంతని నియోజక వర్గం చుట్టూ పారే గోదావరి నది నుండి చుక్క నీరు ఉపయోగించుకొనే ప్రాజెక్టు కట్టారా? నాతో సహా ఏదో ఒక ఉద్యోగం చేసుకొన్నవారం మా మేలు మేము  చూసుకున్నామే గాని ప్రజలకోసం చేసింది ఏమి లేదు. అలాగే రాజకీయ పదవులు పొందిన వారుకూడా చేసింది అంతే. అదేదో సినిమాలో ధర్మావరం సుబ్రమణ్యం అంటాడు, " ఏమిరా బాల రాజు ! నీవలన దేశానికి  సమాజానికి ఉపయోగం" అంటాడు. 


నిజమే ఎవరమైనా సమాజానికి ఉపయోగం అయ్యే పనులు ఎందుకు చెయ్యాలి? మనకేం అవసరం? సమాజం ఏమైనా ఉద్యోగం ఇచ్చిందా? బువ్వ పెట్టిందా?  ( రాజకీయాల్లో ఉన్నవారికైతే అలా  అడిగే అర్హతే లేదు. ఎందుకంటే వారి పదవులు ఏవైనా అవన్నీ సమాజం వేసిన బిచ్చమే). అంటే! అవును మనం పొందుతున్నవి ఏవైనా అవి సమాజం మొత్తంగా మనకు పెట్టిన బిక్షే! ఎలాగంటే, ఆ బడి ప్రజల పైసలతో కట్టబడింది. మన ఉపాధ్యాయుల కు  జీతాలు ప్రజల పైసలే. ఉద్యోగులమ్ గా మనం పొందిన వేతనాలు ప్రజలు ఇచ్చిన పన్నుల ద్వారానే కదా మనం పొందేదీ. ఇక ఏ మనిషైనా వాడు చదువుకున్నా చదువుకోక పోయినా వాడు పొందే సామాజిక జ్ఞానం ఏదైతో ఉందో అది సమాజం నుండి నేర్చుకొన్నదే. కనుక మొత్తంగా ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సమాజానికి ఋణపడి ఉన్నవాడే!  


   అయితే ఈ రాజకీయాలు మనకెందుకు అని అడుగవచ్చు. మన మంథని నుండే తన రాజకీయ జీవన  ప్రస్తానమ్ ప్రారంభించిన pv గారు 1991 లో ప్రధాని అయిన తర్వాత మొదటి సారిగా వారు ప్రవేశ పెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాల కొనసాగింపే కదా, మోడీ గారు ప్రవేశ పెట్టిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు . అలాగే LIC,BSNL,IOC,BPL, Aluminiyam , Steel, Petroleum and gas,Banking,Defence equipments, IT, Coal mines, Power transmission,   etc. అలాగే అన్నీ PSU(Public, Sector Units) లను ప్రైవేట్ చేస్తానని  మోడీ గారు  చెప్తున్నారు. అయితే మనకేమిటి  అని మీరనవచ్చు. ఆనాడు మంథని లాంటి ఒకచోట అయినా  ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్నందున్నే కదా  మాలాంటి వాళ్ళం ఎంద రమో చదువుకు నోచుకున్నది . విద్యా ప్రభుత్వ ఆధీనం లో ఉంది గనుక ఉపాధ్యాయునిగా ఉద్యోగం లభించింది. ఇవ్వాళ అన్నీ ప్రైవేట్ అయితే పేదవారికి విద్య, ఉపాధి అందని ద్రాక్షే  అవుతుంది. మళ్ళీ రాజరిక వ్యవస్త కాలం దాపురించే ప్రమాదం ఉంది. కనుక బుధ్ధి జీవులుగా సమస్త వ్యవస్థలను ప్రైవేటీకరించ వద్దు అనీ, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలని కనీసం ఒక నినాదం అయినా ఇవ్వవలసిన సామాజిక బాధ్యత మనపైన ఉందని నేను భావిస్తున్నాను.