Monday, November 6, 2023

సర్వాయి పాపన్న గుట్టల రక్షణలో

 సర్వాయిపాపన్న గుట్టల రక్షణలో మీ వైకరి తెలుపండి అంటున్న ప్రజాసంఘాలు.  


     ఆర్థిక సరళీకరణ విధానాల అమలు మొదలైన నాటినుండి అభివృద్ధికి అర్థమే మారిపోయింది. ప్రజలంతా అనుభవించవలసిన సహాజవనరులను అతికొద్దిమందికి రాజ్యం కట్టబెడుతున్నది . పునరుత్పత్తికి అసలే అవకాశం లేని ఆ వనరులను ఏ నియమ నిబంధనలు పాటించకుండా ధ్వంస రచన కొనసాగించి తద్వారా ఉత్పత్తి అయిన వస్తు సంపద కొద్దిమందికి  స్వంత ఆస్తిగా మారిపోతున్న క్రమాన్ని చూస్తున్నాము. ఈ క్రమ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు బడాయిలు పోతున్నాయి. నిజానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 51-A (g) ప్రకారం ప్రభుత్వానికే కాదు ప్రతి పౌరునికి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుతూ దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ కాపాడవలసిన వారు వారి వారి అక్రమ సంపాదన వెంపర్లాటలో మరింత విధ్వంసానికి సహకరిస్తున్నారు. 


ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి ఎటు జూసినా యాబై కిలోమీటర్ల మేర చిన్నా పెద్ద కొన్ని వేల గుట్టలు ఉండేటివి. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రస్తుత బీఆరేస్ సర్కారు వరకు అందరూ ఎవరికి చేతనైనంత మేరకు వాళ్ళు ఈ గుట్టలను హారతి కర్పూరం లా వెలిగించుకొని కరిగించుకొని కాసుల పంట పండించుకున్నవారే. 


అవునూ,  గుట్ట బండలు అమ్ముకొని సొమ్ముజేసుకుంటే ప్రజలకు వచ్చే ఇబ్బందేమిటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానంగా గ్రానైట్ క్వారీలు తవ్వుతున్నప్పుడు చేసే బ్లాస్టింగుల శబ్దాలకు కోతులు, కొండచిలువలు భయపడి పారపోయి వచ్చి ఊర్ల పైన పడుతూ ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పర్యావరణ హితకారులైన పశుపక్షాదులు అయితే  పత్తా లేకుండా పారిపోతున్నాయి లేదా  ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. పంటపొలాలు పాలినేషన్ కు నోచుకోకుండా తాలు తపుకను ప్రసవిస్తున్నాయి , రోడ్లు మొత్తంగా సత్తె  నాశనం అయిపోతున్నాయి. గుట్టలపైకి మేతకోసం వెళ్ళే గ్రామీణ ప్రాంత గొర్రెమేకలకు , పాడి పశువులకు మేత సంగతి దేవుడెరుగు,  మెడలూపుకునే పాటి జాగా కూడా లేకుండా పోయింది. అనాదిగా గుట్టల పైన ఉన్న గుడులను, దేవుళ్ళను, ఆఖరుకు హుస్నాబాద్ మండలం పోట్ల పెళ్లి లోని ఆదిమానవుల సమాధులైన కుచ్చెగూళ్లను కూడా తొలగించివేసినారు. రోడ్లకు అడ్డంగా ఉన్న మత చిహ్నాలను తొలగిస్తే నానాయాగీ చేసే పూజనీయుల చేతులను ఈ అభివృద్ధి నమూనా ఎలాగో కట్టివేయగలిగింది.


మందబలం వందిమాగధుల బలం సమకూర్చుకోవడానికి అక్రమ వ్యాపారవర్గాలు తమ ఈజీ మనితో గ్రామాల్లోని మాటకారులను, దుడుకు స్వభావులను చేరదీసి ప్రశ్నించే వారి నోర్లు మూయిస్తున్నారు.


భారత రాజ్యాంగ 73 వ సవరణ  11 వ షెడ్యూల్ ప్రకారం స్తానీక సంస్తలకు స్వతంత్రంగా  విద్య, వైద్యం, భూమి అభివృద్ధి, నీటిపారుదల, పశుసంపద, చేపల పెంపకం, సామాజిక అడవుల అభివృద్ధివంటి 29 అంశాల పైన నిర్ణయం తీసుకొనే అధికారం ఉంటుంది. తమ పాలనాధికార కాలం లో ఈ గుట్టలకు అనుమతి ఇస్తే పెద్దమొత్తం లో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న యావలో పడి కొందరు  సర్పంచులు NOC ఇస్తున్నారు. ఊరివారికే లేని పట్టింపు మాకెందుకని మిగతా ప్రభుత్వ శాఖలు ధారాళంగా NOCలు ఇస్తున్నాయి. ఇందులో రెవెన్యూ, ఫారెస్ట్, పురావస్తు , భూగర్భ గనుల శాఖలు ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ వ్యవహారం లో ఎక్కడకూడా ప్రజలు అడ్డురాకుండా  పోలీస్ వ్యవస్త తన అధికార బలం తో అడ్డుగా నిలుస్తుంది.


పైగా వనరులను విధ్వంసం చేస్తూ ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ గ్రానైట్ క్వారీ తవ్వకాలను  ప్రభుత్వం పరిశ్రమ గా  గుర్తించి బ్యాంకు అప్పుల్లో, విద్యుత్తు లో సబ్సిడీ ఇస్తున్నది. రోజు  లక్షల గ్యాలన్ల నీటిని  ఉపయోగించుకోనిస్తున్నది. ఒకటన్ను బొగ్గు మాడి మసైతే టన్ను కు పైగా కారబండయాక్సైడ్ వదిలి,8000 డిగ్రీల వేడి వదిలి, కొన్ని వేల గ్యాలన్ల నీటిని ఆవిరిచేస్తే  2000 యునిట్ల విద్యుత్ వస్తుంది. అంటే ఒక గ్రానైట్ క్వారీ ఎంతెంత సహజ వనరును ఉపయోగించుకొని ఎవరికి నోట్ల కట్టల పంట పండిస్తున్నది? ఎవరికి అలివిగాని కాలుష్యాన్ని వదిలి పెట్టి ఎవరిని రోగాలకుప్పలుగా మారుస్తున్నదో  అడుగవలిసిన బాధ్యత ఈ సమాజానికి  రాజ్యాంగం కల్పించింది.  


కరీంనగర్జిల్లా సైదా పూర్, సిద్దిపేటజిల్లా హుస్నాబాద్, హన్మకొండ జిల్లా భీమదేవర పల్లి మండలాలను పరివెస్టించుకోని దాదాపు 15000 ఏకరాలల్లో సర్వాయి పాపన్న గుట్టలు విస్తరించి ఉన్నాయి. 17 వ శతాబ్దం లో ఔరంగా జేబు నుండి బహదూర్షా ల పాలన కాలం లో సర్వాయిపాపన్న ఈ గుట్టలశ్రేణి ని రక్షణ స్తావరంగా చేసుకొని మొఘల్ చక్రవర్తుల పక్కలో బల్లెమై  భూమిపై  దళిత బహుజనుల హక్కుకోసం,  రాజ్యాధికారం కోసం పోరాడి ప్రాణమిచ్చిన తొలి తెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న. ఏడంచల రక్షణ వలయం తో గుట్టపైన కోటలు, అతడు పూజించిన బయ్యన్న విగ్రహం, సైన్యానికి యుద్ధవిద్యలు నేర్పిన దండు దిబ్బలో ఇప్పటికీ ఫిరంగి గుండ్లు ఆనవాలుగా ఉన్నాయి.


అలాంటి గుట్టలపై గ్రానైట్ తవ్వకాలకు 2013 లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాపన్న ఆనవాళ్ళు చెరిగి  పోకూడదని ఆనాటినుండి సర్వాయిపాపన్న గీత కార్మిక సంఘం తో కలిసి స్తానిక ప్రజలు నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక దొడ్డిదారిలో గుట్టపైనా పాగావేయడానికి గ్రానైట్ వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న వారు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి 30 సెప్టెంబర్ నాడు రెండువేల మందితో హుజూరాబాద్ పట్టణం లో  ఊరేగింపు జరిపి RDO ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.  


ఈ నేపథ్యం లో సర్వాయి పాపన్న గీతాకార్మిక సంఘం ,  గుట్ట చుట్టూ ఉన్న దాదాపు వంద గ్రామాల ప్రజల ముందు ఒక విజ్ఞాపన పత్రం ఉంచింది. ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్న రాజకీయ పార్టీల నేతలతో సర్వాయి పాపన్న గుట్టల రక్షణ కొరకు మన ప్రజల పణాళికనువారు  ఎలా అమలు పరుస్తారో అడిగి  తెలుసుకోండి ఆని కోరుతున్నది. 


1. గుట్టల పైన KG నుండి PG వరకు ఉన్నత ప్రమాణాలతో ఒక విద్యాలయం ఏర్పాటు చేయాలి .

2. ప్రకృతి ఒడిలో ఉన్నత ప్రమాణాలతో Telangana Institution Of Medical Sciences.నెలకొలపాలి  

3. చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చేరుకోవడానికి గుట్టల శ్రేణి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్.                మరియు ఇంటర్నల్ రోడ్స్  వేయించాలి 

4. ఈ గుట్టలపైన కురుస్తున్న వర్షాలను ఒడిసిపట్టి గ్రావిటీ ద్వారా చుట్టుపట్ల అనేక గ్రామాలకు సాగునీటి , తాగునీటి అవసరాలు నెరవేర్చడానికి వీలైనన్ని చెరువులు నిర్మించాలి. చేపల పెంపకం పరిశోధనా కేంద్రం ఏర్పారు చేయాలి. 

5. గుట్టల చుట్టూ ఉన్న దాదాపు వంద గ్రామాలల్లో లక్ష మంది గీతవృత్తి పై ఆధార పడి జీవిస్తున్నారు. కనుక కల్లుగీత పరిశోధనా కేంద్రం, తాటి, ఈత ఉప ఉత్పత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి. 

6. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం మరియు పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేయాలి. 

7. గుట్టల చుట్టూ ఉన్న వేలాది గోళ్లకుర్మ ల జీవనోపాధి ప్రమాణాల మెరుగు దలకు గొర్రె మేకల ఆవుల, రోగనిర్ధారణ  పరిశోధనా కేంద్రం మరియు పశువైద్య విద్యాలయం నెలకొలపాలి. 

8. చర్మకార పరిశోధనా కేంద్రం ఏర్పాటుజేసి తొలువస్తువుల తయారీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి. 

9. రాయికల్ జలపాతం, మొయిన్ చెరువు, సర్వాయిపేట కోట, గుట్టపైన ఉన్న కోట అన్ని కలిపి టూరిజం కేంద్రం గా అభివృద్ధి పరుచాలి. 


వీరగొని  పెంటయ్య  సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం వ్యవస్తాపక అధ్యక్షులు 

సింగం సత్తెయ్య గౌడ్  రాష్ట్ర అధ్యక్షులు 

గణగాని సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 

సంపునూరి మల్లేశం గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ 

కోడూరి పరశురాములు గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు 

మేడగొని బుచ్చయ్య గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 

మండల జంపయ్య చేర్మన్ బయో డైవర్సిటి కమిటి తెలంగాణ.