Thursday, October 28, 2021

భారత స్వాంతంత్రోద్యమ చరిత్ర కు చెందిన సర్దార్ ఉద్దం సినిమా రివ్యూ.

 భారత స్వాతంత్రోద్యమానికి చెందిన ఒక అద్బుతమైన, ఉత్తేజ పూరితమైన , చరిత్ర పుటల లో నిక్షిప్తమైన భావోద్వేగ దృశ్య కావ్యం సర్దార్ ఉద్దం సినిమాను ప్రైమ్ వీడియోస్ లో మిత్రుడు సిద్ధార్థ్ సుభాష్ చంద్రబోస్ రివ్యూ చదివిన తర్వాత ఇప్పుడే చూసిన. 1952 లో నేను పుట్టే నాటికి ఇంకా స్వాతంత్ర్ ఉద్యమ చరిత్ర జ్ఞాపకాలను పెద్దవాళ్ళు చెపుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవాళ్ళం.  నేను 1973 లో ఉపాధ్యాయునిగా  పనిజేసే పాఠశాలల్లో 15 ఆగస్తునాడు ఆ చరిత్రను ఉపాధ్యాయులుగా మేము చెబుతుంటే పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళు. ఆనాటి ఉపాధ్యాయ లోకం కూడా భారత స్వాతంత్రోద్యమం అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనే విధంగా చెప్పేవారు. అందుకు కారణం ఆనాటి ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది అగ్రవర్ణాల వారు ఉండేవారు. వారి కుటుంబాల్లో కాంగ్రెస్ నాయకులు ఉండేవారు. అందుకు వారు ఆ చరిత్రే చెప్పేవారు.  వారిలో కొందరికి  భగత్ సింగ్ త్యాగం గొప్పగా కనిపించినా ఆయన సిద్దాంతాల పట్ల వారికి సద్భావన ఉన్నట్లుగా కనిపించేది  కాదు.  ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా ఆని దేశ ప్రజల్లో  కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం సన్నగిల్లింది.ఇక  అప్పటినుండి  నుండి  కాంగ్రెస్ పార్ట్ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల వలన కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా వ్యతిరేకత  రావడం, దాన్ని బిజేపి సొమ్ము చేసుకోవడం తో అంతటి త్యాగపూరితమైన భారత స్వాతంత్రోద్యమ చరిత్ర మసక బారి పోతున్న పరిస్తితి ఏర్పడింది. 


ఇలాంటి సందర్భం లో సుజిత సర్కార్ తీసిన సర్దార్ ఉద్దం సినిమా , ఆనాటి వీరుల త్యాగాలను కండ్లకు కట్టినట్టుగా చూపింది. జలియన్ వాలా బాఘ్ కాల్పులకు అనుమతి ఇచ్చే పంజాబ్ సివిల్ అధికారి జనరల్ డయ్యర్ తో కాల్పులు మామూలుగా ఉండకూడదు ప్రజలను భయో త్పా తానికి, దిగ్భ్రాంతి కి   గురి చేసేదిగా ఉండాలని హెచ్చరిస్తాడు. ప్రస్తుత పాలకులు సైతం మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో రైతుల పట్ల  డయ్యర్ పాలసీ నే కదా అమలు చేసింది. 


1 &  2 ప్రపంచ యుద్ధాలలో బ్రిటీష్ ప్రభుత్వం తరుపున పోరాడి  26 లక్షల మంది సైనికులు , చర్చిల్ అవలంభించిన  వార్ టైమ పాలసీ కారణంగా  ఏర్పడ్డ బెంగాల్ కరువు వలన  40 లక్షల మంది భారత పౌరులు తమ ప్రాణాలను దారబోసి సాధించుకున్న భారత స్వాతంత్ర  ఉద్యమ ఫలితాలు ఎవరి పాలు అవుతున్నాయో చూస్తే , ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఉరికంబాలను ముద్దాడిన భగత్ సింగ్,రాజ్ గురు,  సుఖదేవ్, ఉద్దం సింగ్ లాంటి 3300 మంది వీరుల వీరమరణం  త్యాగాలన్నీ ఇలా వృథా కావాల్సిందేనా అనిపిస్తున్నది.   


ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే నన్న నేటి యువ తరానికి ఎంత రక్త తర్పణం, ఎన్నెన్ని త్యాగాలు, ఎందరెందరో  బిడ్డలను కోల్పోయిన తల్లులు, తలీదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన యువత త్యాగాల పునాదుల మీదుగా బ్రిటీషయర్ల కబందా హస్తాల నుండి విడిపించబడిన దేశ వనరులు ఎవరి పాలవుతున్నాయో అర్థం చేసుకునే అవకాశం కొంతైనా కలుగుతుందేమో అన్న చిన్న ఆశ తో ..