Friday, December 23, 2022

Democracy- Elections.

                                                     ప్రజాస్వామ్యం - ఎన్నికలు . 



ఆకుల భూమయ్య 9 వ వర్దంతి సందర్భంగా కరీంనగర్ ఫిలిమ్ భవన్ లో ఈ రోజు 23 డిసెంబర్ నాడు సంస్మరణ సభ జరిగింది. ఆకుల భూమయ్య భూమయ్య పెద్దపల్లి జిల్లా కాచాపూర్ లో 1950 లో జన్మించారు. ఆయనకు బుద్ధి తెలిసే నాటికి రాజ్యాంగం లో చెప్పిన హామీలు నెరవేర్చ బడక దేశ నలుమూల ల అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్న రోజులు. ఆయన పదో రతరగతి లో ఉన్నప్పుడే శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాలు తెలుసుకున్నాడు. కాచాపూర్ లో పాలేరుల దీనస్తితికి స్పందించి వారి జీతాలు పెంచాలని,తమ కుటుంబాన్ని కూడా కోరిన వాడు.  అప్పటి పోచం పాడ్ ప్రాజెక్ట్ కాలువలు తవ్వే కూలీలకు అంబలి పంపకం వారి పసి బిడ్డలకు చలువ పందిర్లు వేయించిన పోరాట శీలి. 1969 లో తొలి తెలంగాణ పోరాటం లో పాల్గొన్నాడు.  ఎమర్జెన్సీ కాలం లో జైలు జీవితం గడిపి  విడుదల అయి వచ్చిన తర్వాత విద్యారంగం లో ఉన్న అవినీతి ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యమం నిర్మించాడు. తన తో బాటు ఉపాధ్యాయ ఉద్యమం లో పనిజేస్తున్న మిత్రులకు మనం కేవలం మన జీతాభత్యాల కోసం ఆర్థిక పోరాటాలు చేయడం కాదు, అశేష ప్రజల సమస్యల పరిష్కారం తోబాటే  ఉపాధ్యాయుల సమస్యలు  కూడా పరిష్కారం అవుతాయన్న ఎరుకను కలిగి ఉండాలని బోధిస్తూ వచ్చాడు. 1989 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం లో చాలా చురుకుగా పాల్గొన్నాడు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జనసభకు అధ్యక్షుడు.ఆ నాటి TDP ప్రభుత్వ ప్రధాన మద్దతు దారు అయిన రామోజీ రావు ,తెలంగాణ రాకుండా అడ్డుకొనే ప్రయత్నం లో  తన స్వంత పత్రికలో అయిన ఈనాడు దినపత్రిక  లో తెలంగాణ  జనసభ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్త  ఆని విపరీతంగా అసత్య  ప్రచారం చేసిన కారణంగా తెలంగాణ జన సభ నిషేధానికి గురైంది. తనతో బాటు గా పనిజేస్తున్న బెల్లి లలిత, కనకా చారి, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి లాంటి వారు చంద్రబాబు సర్కారులో హత్యలకు గురవు తుంటే అదురక బెదురక ప్రజాస్వామిక తెలంగాణ కొరకై పోరాటాన్ని కొనసాగించాడు. TJS నిషేదం అనంతరం తెలంగాణ ఉద్యమం ఆగిపోకూడదన్న  తపనతో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు జేసి పోరాటం కొనసాగించాడు. దానిపైన కూడా నిర్బంధం పెరిగి న తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. దానికి చేర్మన్ బాధ్యతాల్లో ఉండగా ఒక అనుమానాస్పద రోడ్డు ప్రమాదం లో 24 డిసెంబర్ 2013 నాడు దుర్మరణం పాలయ్యాడు. 


ఆయన యాదిలో ఈ రోజు ప్రజాస్వామ్యం- ఎన్నికలు అన్న అంశం పైన  ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆయన తో బాటుగా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అనేక మంది సహచరులు, ఆయన కుటుంబ సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎన్నికలు ఎంత లోపభూయిస్టంగా  జరుగుతున్నాయో చర్చించారు.  ఎంత ఏక పక్షంగా, ఎంత డబ్బు, మద్యం, పవర్, జులుం తో నిర్వహించ బడుతున్నాయో చెబుతూ ఆవేదన చెందారు. అక్కడ హాజరైన దాదాపు యాబై మంది  విద్యావంతులు , ఆలోచనా పరులు  భారత పౌరులుగా తమ  బాధ్యతగా ఎన్నికలు అవినీతి రహితంగా జరుగడానికి   కొన్ని సూచనలు చేశారు.


1. చీఫ్ ఎలక్షన్ కమిషన ర్ గా  అధికారం లో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలురు అయిన వారిని నియమించుకొని  లబ్ధి పొందుతున్నది. కనుక ప్రధానితో బాటుగా ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ,  ఒక రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి, వంటి వారితో ఒక కోలీజియం ఏర్పాటు జేసి ఆ కోలీజియం సూచన మేరకు చీఫ్ ఎన్నికల కమిషనర్ ను నియమించాలి. 


2. కార్పొరేట్ సంస్తలు ప్రభుత్వాన్ని తమకు అనుకూలమైన చట్టాలు తేవడానికి ఎన్నికల బాండ్ల ద్వారా లాబీయింగ్ కు పాల్పడి వారికి అనుకూలంగా చట్టాలను  చేయించు కుంటున్నారు. . కనుక ఎన్నికల ఫండు , చందాల సేకరణ ను నిషేధించాలి. 


3. వితీన్ ద పార్టీ లో ఎన్నికలు జరిపి ఆ పార్టీ సభ్యులు ఎవరిని అభ్యర్థిగా గెలిపిస్తామని చెబితే వారికే ఆ పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టాలి. 


4. EVM ల పైన అనేక మంది అభ్యంతరాలు చెబుతున్నారు. సాంకేతికంగా ఎంతో అభివృధ్ధి చెందిన  అమెరికా లాంటి  దేశం లో కూడా బ్యాలెట్ పత్రాలనే  ఉపయోగిస్తున్నారు. త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందన్న ఏకైక కారణం తో EVM లు వాడుతున్నారు. కానీ అంత కంటే ఎక్కువ ఆలస్యానికి కారణమ య్యే టట్టుగా ఒక రాష్ట్రం లో దఫా దఫాలు గా ఎన్నికలను నెలల తరబడి నిర్వహిస్తున్నారు. కనుక ఎవరికీ అనుమానం లేని విధంగా బ్యాలెట్ పత్రాలు ఉపయోగవంచాలి. 


5, మానిఫెస్టో లో చెప్పిన అంశాలను అమలు పరుచని యెడల న్యాయస్తానా లల్లో ప్రశ్నించే విధంగా చట్టాలు చేయాలి.


6. చట్ట సభకు ఎన్నికైన అభ్యర్థి రాజీనామా చేసిన యెడల మళ్ళీ అక్కడ బై ఎలక్షన్లు పెట్టవద్దు.మిగిలి ఉన్న కాలానికి  ఆ ప్రజల బాగోగులు చూడడానికి ఆ జిల్లా లేదా ఆ నియోజక వర్గ  ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి.  


7.  ఒక పదవిలో రెండు సార్ల కంటే ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉండకూడదు. 


8. ఏదేని నియోజక వర్గం ఒక సారి ఎస్సీ, లేదా ఎస్టీ కి రిజర్వ్ చేయబడితే అది ఎప్పటికీ అలాగే కొనసాగ కూడదు. రొటేషన్ పద్దతి లో సాగాలి. 


9. చట్ట సభలకు ఎన్నికయిన వారు, వారి  పదవీ కాలం ముగియకుండానే రాజీ నామా చేసిన యెడల అట్టి వ్యక్తికి వెంటనే ఆ  ఉపఎన్నికలో పాల్గొనే అవకాశం ఉండకూడదు.


10. ఆ నియోజక వర్గ ప్రజలు తాము ఎన్నుకున్న  ప్రతినిధి తమకు   సరైన న్యాయం చేయడం లేదని  భావించి నపుడు రీకాల్ చేసే అవకాశం ఉండాలి. 


11. ఒక ఎంపి ఎన్నికల ఖర్చు 75 నుండి 95 లక్షలు  ,   ఎంఎల్ఏ ఎన్నికల ఖర్చు 28 లక్షలు చేయాలని చట్టం చెబుతున్నది. . కానీ ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయో చూస్తున్నాము. లక్షల్లో ఉన్న పరిమితిని మించి కోట్లల్లో, పదుల కోట్లల్లో, వంద కోట్లల్లో, వందల కోట్లల్లో పార్టీలు ఖర్చు చేస్తుంటే నిఘా సంస్తలు కండ్లు మూసుకొని ఎందుకు ఉంటున్నాయి? కనుక నిఘా సంస్థలు మరియు  వారు ఖర్చు చేస్తున్న డబ్బు ను ఆడిట్ చేస్తున్న వ్యవస్త ఖచ్చితంగా ఉండాలి,


12. PM, CM లు చాలా ఎన్నికల మీటింగుల్లో ప్రజల సొమ్ముతో పాల్గొంటున్నారు. వీరు పాల్గొనే మీటింగుల పైన నియంత్రణ ఉండాలి. 


13. క్రిమినల్ కేసుల అభియోగాన్ని ఎదురుకుంటున్న ఎవరైనా ఎంతో కొంత కాలం జైళ్లల్లో నిర్బంధించబడి తమ వ్యక్తిగత స్వేచ్చా స్వాతంత్రాలను కోల్పోతున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం ఏ అభ్యంతరం లేకపోవడం సహేతుకంగా లేదు.  శిక్ష పడనంత వరకు ఎవరైనా నిర్దోషే అన్న కారణం తో ఎందరో క్రిమినల్స్ చట్టసభకు వస్తున్నారు. అలా రాకుండా కట్టడి చేయాలి. 


 ఇలాంటి మరికొన్ని సూచనలు వచ్చినాయి. 


ఇటువంటి చర్చలు విస్తృత స్తాయిలో జరుగాలి ఆని సభికులు సూచన చేశారు. ఎక్కడికక్కడ పౌర సమాజం ముందుకు వచ్చి ఇలాంటి చర్చా కార్యక్రమాలు చేపట్టాలని  సభ్యులు సూచించారు. రాజ్యాంగం ప్రజలందరికీ అర్థమై రాజ్యాంగ హక్కులు అందరికీ కలిపించాలని , రాజ్యాంగం మేరకు పాలన చేయండని ప్రజలు ప్రశ్నించే కైతన్యం కలిగిన  నాడు ఏ ప్రభుత్వమయినా ప్రజల మాట వినక తప్పదు ఆని అంబేడ్కర్ అంటాడు. 



మీటింగ్ కన్వీనర్ 


వీరగొని  పెంటయ్య 

ఆకుల భూమయ్య ఉద్యమ సహచరుడు.  



 


Monday, December 19, 2022

ఉచితాలు అనుచితాలేనా?

                                                      ఉచితాలు అనుచితాలేనా ?  


ఈ మధ్య కాలం లో కేంద్ర పెద్దల నోట ఉచితాలు దేశానికి చాలా  హాని చేస్తాయనే మాట విరివిగా వినబడుతోంది. నిజానికి పేద ప్రజలకు ఇచ్చే రాయితీలు ఆయా సర్కార్లు ఏందుకు ఇస్తున్నారో, ఎవరి అవసరం కోసం ఇస్తున్నారో  ఒకసారి  చూద్దాం.


 భారత రాజ్యాంగం లోని మొట్టమొదటి వాక్యం WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens:. సోషలిస్ట్ అనే పదం సొసైటీ లో ప్రజలందరికీ సమాన అవకాశాలు, ప్రజలందరూ సమానం అనీ, డెమోక్రటిక్ అనే పదం ప్రజాస్వామ్య అనే మాటను, సెక్యూర్ అనే పదం ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ భద్రత అనే విషయాలను  చెబుతున్నాయి. . ఇప్పటికీ ఈ దేశం లోని ప్రజలందరికీ సమాన అవకాశాలు గానీ, సంపద సమాన  పంపిణీ గానీ లేదు. ఒక అడ్డా కూలి దినమంతా పనిజేస్తే సాయంత్రానికి ఒక 600 నుండి 800  రూపాయలు పొందుతాడు. అదే ఒక చట్ట సభ ప్రతినిధి ఏడాది పాటు ఒక్క రోజు కూడా చట్ట సభలో కూర్చోకున్నా కూడా  నెలకు లక్ష నుండి రెండు లక్షల రూపాయల జీతం పొందుతున్నాడు. అలాగే ఒక ఉద్యోగి 30 సంవస్తారాలు సర్వీస్ చేసినా పెన్షన్ ఉండదు, కానీ ఒక సారి ఎన్నికల్లో గెలిచి ఐదు సంవస్తారాల కాలం లో ఆయన ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండకపోయినా , లక్షలాది రూపాయల జీతాభత్యాలు, ఉచితాలు ఎన్నో పొందిన తర్వాత కూడా నెలా నెలా పెన్షన్ పొందుతాడు.  


ఒక పార్లమెంట్ మెంబర్ ప్రతి నెల 2,70,000/- రూపాయల వేతనం తో బాటు గా పార్లమెంటు సెషన్స్ జరిగితే ఆయన సిటింగ్ చార్జెస్ ఉంటాయి. రకరకాల అలవెన్స్ లు అనేక ఉచితాలు అంటే విమాన ప్రయాణం, రైలు ప్రయాణం, హై క్లాస్ మెడికల్ సౌకర్యాలుంటాయి.   ఇందులో కొన్నింటి పైన టాక్స్ కూడా ఉండదండోయ్.  ఇంత సంపన్నులకు ఏమో టాక్స్ ఫ్రీ అట. అలగే పెద్దమొత్తం పో పెన్షన్ తో బాటు గా చాలా సౌకర్యాలు ఉచితంగానే పొందుతారు. ( గూగుల్ లో చూడవచ్చు) 


  ఇక తెలంగాణ MLA లు సంవత్సరం  లో ఒక్క రోజు కూడా అసెంబ్లీ కి హాజరు కాకున్నా కూడా నెలకు 2,68,000( source telangana legislature webcite ) జీతం తీసుకుంటారు. పెన్షన్ తక్కువకు తక్కువ నెలకు  50,000/- ఎక్కువకు ఎక్కువ 75,000/- పొందుతున్నారు.( దక్కన్ క్రానికల్ న్యూస్ మార్చి 2021) .


గద్దెల పై కూర్చున్న ఈ పెద్దలు తీసుకుంటున్న సొమ్మంతా నువ్వూ నేను పేద ప్రజలంతా వినియోగించే ప్రతి వస్తువు పైన విధించే పన్నుల నుండి వసూలు చేస్తున్న సొమ్ముల నుండే.  దినకూలి వేతనం ముప్పై రోజులు కస్టపడితే 18000 నుండి 24000 వరకు పొందగలిగితే ఒక ప్రజా ప్రతినిధి చుక్క చెమట కారకుండా ఒక్కరోజు కూడా పనిచేయక పోయినా కూడా నెలకు 2,68,000 రూపాయల వేతనం  పొందుతాడు. ఆయన పదవీ కాలం లో తన తర తరాలు తిన్నా తరుగనంత ఆస్తులు కూడబెట్టుకుంటాడు.   ఇక ఇంట్లో కూర్చుంటే నెలా నెలా  50,000 నుండి 75,000 రూపాయలు అప్పనంగా పెన్షన్  తీసుకుంటాడు . కానీ  అదే ఒక  దినసరి కూలికి ఆయన  కుటుంబం లో ఒకరికి 2000 రూపాయల నెల సరి పెన్షన్ ఇస్తే మాత్రం  ఇంత ఏడుపా ? 


ఇక వీరు కార్పొరేట్ కంపనీలకు ఇస్తున్న ఉచితాల గురించి చూద్దాం. కరోనా కాలం లో పనులు లేక ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి కోల్పోయిన పరిస్తితి లో అమెరికా లాంటి దేశం లో ప్రభుత్వం నేరుగా  ప్రజల, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమజేస్తే భారత ప్రభుత్వం మాత్రం ప్రజల తో నేరుగా సంబంధం లేని  కార్పొరేట్ కంపనీలకు డబ్బులు ఇచ్చింది.


అలాగే ఈ మధ్య కాలం లో బ్యాంకులను ముంచి దేశం విడిచి వెళ్ళిపోయిన నీరవ మోడి, ఆయన భార్య అమీ మోడి, నీషా మోడి, లలిత మోడి, మహుల్  చోక్సీ , విజయ్ మాల్యా లాంటి వాళ్ళు 29 మంది మన దేశం లో బ్యాంకులలో సామాన్య ప్రజలు దాచుకొన్న 40,000 కోట్ల రూపాయలను  బ్యాంకులకు ఎగవేసి పోయారు. అయినా దేశానికి ఏమీ నస్టం లేదట. పేద ప్రజలకు ఏమైనా ఉపకారం జరిగితే మాత్రం మహాపరాధం జరిగిపోయి దేశం దివాళా తీస్తుందట. వాళ్ళ దృస్టీలో దేశం అంటే కెవలం కొద్ది మంది  పెట్టుబడి దారులు, కార్పొరేట్ కంపనీల వాళ్లేనా?   


నిన్న 12 డిసెంబర్ 22 నాడు పార్లమెంట్ లో స్వయంగా  ఆర్థిక మంత్రి ఈ మూడు సంవత్సరాల కాలం లో ఆరు లక్షల కోట్ల ఋణాలు  మాఫీలు చేసినట్లు తెలిపింది. మొత్తం పైన గత ఐదు   సంవస్తరాల  కాలం లో బడా బాబులకు కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన నజరానా ఏమిటంటే ,  9,91,640 కోట్ల రూపాయల ఋణ మాఫీ చేసింది. ఇందులో విల్ ఫుల్ డీఫాలటర్స్  అంటే ఉద్దేశ పూర్వకంగా ఎగవేత దారులు 10,306 మంది ఉన్నారట . అంటే పదివేల మంది దొంగలకు కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా దోచి పెట్టామని నిర్భయంగా  ప్రకటిస్తున్నది. ఈ ఋణ మాఫీ పొందిన వారిలో ఎవరైనా పేద వారు ఉన్నారా? అంతా వేలాది కోట్ల సంపద అనుభవిస్తున్న వారే కదా?  ప్రభుత్వం చేసిన ఈ చర్య  ఏ దేశ అభివృధ్ధికి తోడ్పడు తుందని అడిగే చైతన్యం ఈ దేశ పౌరులకు ఎలాగూ లేదన్న ధైర్యం తోనే కదా దాన్ని ప్రస్తావించకుండా దాని ఊసు ఎత్తనీయకుండా పేదలకు ఇచ్చే రెండు రూపాయల కిలో బియ్యం రెండు  వేల వృద్ధాప్య పెన్షన్, చిన్న పిల్లల మధ్యాహ్న భోజనాన్ని, పేదల కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్, పేద విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ , ఆరోగ్య శ్రీ, గొర్రె,  బర్రెలకు ఇచ్చే చిరు ఆసరాల వంటి ప్రజలకు అంతో ఇంతో ఆసరా అవుతున్న   పథకాలను వద్దని వారిస్తున్నది.దళితులకు బాహుజనులకు ఏ కాసింత మేలు జరిగినా అన్యాయం జరిగి పోతున్నదని పెద్ద గొంతెసుకొని లేస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలం లో 10,40,000 /- కోట్ల రూపాయలు కొందరు పెద్దల వెసులుబాటు కోసం ప్రజలనుండి పన్నుల రూపం లో సేకరించిన సొమ్ములను ఖర్చు చేసిన దాంట్లో పేద ప్రజలకోసం వెచ్చిస్తున్న సొమ్ము ఎన్నో వంతు ఆని ఎందుకు నోరున్న మేధావులు అడుగలేక పోతున్నారన్నది ప్రశ్న. రాఫెల్ యుధ్ధ విమానాల నుండి, విమానాశ్రయాల కేటాయింపుల నుండి, PSU ప్రైవేటీకరణ దాకా ఎన్నెన్ని కోట్ల సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్ళిన లెక్కలు అడుగకుండా ఉండే దానికే కదా పేదల ఉచితాల గురించి పెద్ద రచ్చ చేస్తున్నది. 


 పేదల ఉచితాల గురించి  ఉపాధ్యాయుల్లో కూడా కొంత మంది అవును కదా ఆని ముక్కున వేలేసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు.  దానికి  నిదర్శనమే కదా ఈ మధ్యన ఏదో ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో ఉచితాలు ప్రజలను సోమరులుగా , సమాజానికి చేటు చేసే వారీగా తయారు చేస్తున్నాయని తమ దేశ భక్తి ని ఘనంగా చాటు కొని నాటకం వేయించారు . 1985 నుండి 1995 కాలం లో  మిత్రుడు జనార్ధన్ రెడ్డి పిన్నీసు పల్లి కాయ నాటకం వేసి ప్రజల , రైతుల, కస్ట జీవుల పక్షాన ఉపాధ్యాయులు మేధావులు నిలువాలి అనే నినాదం ఇస్తూ  వీధినాటకాలు వేస్తే ఇప్పుడు కొందరు  ఉపాధ్యాయులు మాత్రం ,  ప్రభుత్వం పక్షాన నిలబడి  ప్రజలను నోళ్ళు  మూయించే కార్యక్రమాలు చేస్తున్నారు. 


ఉపాధ్యాయులు గా మనం ఎంతో కాలం నుండి బోధిస్తున్నది,  రైతులు, కార్మికులు, ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యేవారంతా  సంపద సృస్టి కర్తలు ఆని చెబుతూ వస్తున్నాము. కానీ చిత్రంగా ఈ మధ్యన పెద్దల నోటివెంట కార్పొరేట్ దిగ్గజాలను  సంపద సృస్టికర్తలు ఆని పొగుడుతున్నారు. నిజానికి వాళ్ళంతా కడుపులో చల్ల కదులకుండా శ్రమయజీవులు  సృస్టిస్తున్న అదనపు విలువను లాభం పేరుతో అప్పనంగా తమ ఖాతాలో జమ చేసుకుంటున్న దోపిడీ దారులు. 


ఇంకా ముందుకు పోతే ఈ దేశం లో కులాలు ఉన్నది వాస్తవం. అత్యధిక సంఖ్యలో శూద్రులు అంటే ఈ నాటి భాషలో బాహుజనులు ఉన్నారన్నది వాస్తవం. వీరిలోనే అత్యధికులు పేద వారీగా, బిలో పావర్టీ  లైన్ లో ఉన్నారన్నది కూడా  వాస్తవం. వారే అలా ఏందుకు ఉన్నారని లోతుల్లోకి వెళితే ఐదువేల ఏండ్లు గా ఈ దేశం లో ప్రజలందరూ సమానం కాదు కొందరు ఎక్కువ, కొందరు తక్కువ , అది జన్మ తహా వచ్చిన లక్షణం అనే  మనువాదం అమలులో ఉండి శూద్రులకు ఆస్తి హక్కు, ఆయుధ ధారణ హక్కు, అక్షరాలు నేర్చుకునే హక్కు వంటి అనేక స్వేచ్చా స్వాతంత్రాలతో జీవించే హక్కులు  తిరస్కరించ బడ్డాయన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే,  ఈ బాహుజనులకు ఈ దేశం లో ఫూలే అంబేద్కర్ ల దాకా  విద్య ఎందుకు లేకుండేనో,  ఆత్మ గౌరవ చిహ్నమైన భూమి చెక్క ఎందుకు దక్కకుండా పోయిందో, , ఉత్పత్తి సాధనాలైన భూమితో బాటుగా పరిశ్రమలు, పెట్టుబడి వీరివద్ద ఎందుకు లేకుండా పోయిందో  అనే విషయాలు  అర్థం అయితే గానీ ఈ వర్గాలకు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా సరైన  ప్రాతినిధ్యం లభించలేదన్న విషయం అర్థం అయితే గానీ వీరికి రాజ్యాంగం లో రాసిన విధంగా ప్రజాస్వామిక హక్కులు, అందరితో బాటుగా  సమానంగా జీవించే హక్కు  కలిగించాలంటే కొన్ని రిజర్వేషన్లూ,కొన్ని రాయితీలు కల్పించక తప్పదు అన్న విషయం అర్థం అవుతుంది. 


పది లక్షల కోట్ల రూపాయల సంపదతో ఇవ్వాల ప్రపంచం లో మూడవ అత్యంత సంపన్నుడుగా ఆదాని ఎదుగడానికి  క్రోనీ క్యాపిటలిజం కారణం కాదా? లక్షలాది కోట్ల ఎన్నికల బాండ్లు ఎవరి ఖాతాలో పడుతున్నాయి, ఏందుకు పడుతున్నాయి? నీవు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అ ని ఇచ్చి పుచ్చకుకొనే విధానం కొనసాగడం లేదా? పసుల కొట్టం లో ఉలువ పప్పు, తెలుక పిండి ని ఆవులు గేదెలు ఆవురావురు మనీ తింటా ఉంటే కోడి పిల్లలు వచ్చి చిన్న ముక్కను  ముక్కున కరుచు పోయే ప్రయత్నం చేస్తే ఏయ్ అటేటు పో అని పసులు  కొమ్ములు ఊపినట్టు చేస్తున్నాయి పెద్ద తలుకాయలు. 


     క్యాపిటలిజం కన్నబిడ్డలు అయిన ప్రపంచ బ్యాంకు, WTO ల  షరతుల మేరకే భారత దేశ పెద్దలు ఇలా మాట్లాడుతున్నారన్న విషయం  మనం ఒక సారి 1991 లోకి వెళ్తే అర్థం అవుతుంది.  గాట్ ఒప్పందం పైన సంతకాలు చేసిన దేశాలు గ్లోబలైజేషన్ లో భాగంగా రైతులకు సబ్సిడీలు ఇవ్వకూడదనీ, ఉచితాలు ఏవీ కూడా ప్రజలకు ఇవ్వవద్దనీ ఆనాడే ప్రపంచ బ్యాంకు షరతులు విధించింది. లిబరలైజేషన్ రెండవ ఫేజ్ ను  ఇవ్వాల భారత ప్రభుత్వం  చాలా నిర్మొహ మాటంగా  అమలు చేస్తున్నది. ఆ  విధానం లో భాగంగా ఈ రోజు డిల్లీ పెద్దలు ఈ మాటలు మాట్లాడు తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకొకుండా ప్రజలకు ఇచ్చే చిన్న చిన్న వెసులు బాటులను  ఫ్రీ బీస్ ఆని నిందిస్తూ , అవి  ప్రజలను సోమరి పోతులుగా చేస్తున్నాయి  అని వీల్లు  ఎందుకు  ఆడి  పోసుకుంటున్నారో అర్థం కాదు. 


1980 ప్రాంతం లో మంథని హైస్కూల్ లో ఇద్దరు విద్యాలు హాస్టల్ లో ఉంటూ చదువుకొనే వారు. వారు ఒకసారి వారి హక్కుల గురించి కొందరు విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. వారిని అరెస్ట్ చేసిన అప్పటి  పోలీస్ అధికారి చౌదరి గారు, 

“ ఆరేయ్ పొర గాండ్లు , సర్కారు మీకు ఉచితంగా , పండుకొను హాస్టల్ వసతి ఇస్తున్నది, ఉచితంగా అన్నం పెడుతున్నది, పుస్తకాలు, బట్టలు ఇచ్చి ఉచితంగా చదివిస్తున్నది. ఇంకా మీకు ఏమి కావాలి రా? “ ఆని బెదిరించే ప్రయత్నం చేసిండు. 


“ సార్, మాకు ఇంకా రావాల్సినయి చాలా ఉన్నై సార్. అయ్యన్ని మావి మాకు వచ్చేదాకా మేము కోట్లాడుతనే ఉంటాం . అయ్యన్ని   అచ్చే దాకా మా తర్వాత వచ్చే టోల్లు  గూడా కోట్లాడుతనే ఉంటరు సారు . మీరెంత కొట్టుకుంటారో ఏమి చేసుకుంటారో మీ ఇస్టం” అని అప్పుడు ఆ విద్యార్థులు  చెప్పిన  మాటలు ఇప్పటికీ  యాదికి వస్తున్నై . చైతన్య వంతమైన ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల ఆకాంక్షల కొనసాగింపుకు మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉంది. అందుకోరకు  అవసరమైన ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరాన్ని సమాజం కోరుతున్నది.    


వీరగోని పెంటయ్య 

విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి. 

కరీంనగర్. 

9908116990.