Tuesday, September 29, 2020

                        విద్యా చట్టం 2020  పైన REBS అభిప్రాయం. 


కస్తూరి రంగన్ విద్యాచట్టం 2020 పైన ప్రధానమంత్రి మోడి మొదలుకొని వారి పాలక పార్టీ వాళ్లందరితో బాటుగా ఆ రాజకీయాలను అభిమానించే వారంతా ఇంత మంచి విద్యా చట్టం నభూతో నభవిష్యత్ అంటూ ప్రశంసించారు. కొందరు విద్యావేత్తలు మాత్రం ఇది గత విద్యాచట్టాలకంటే ఏమీ భిన్నమైనది కాదూ అంటూనే ఇంకా అపకారం చేసేదిగా కూడా ఉందని అన్నారు.


వేదకాలం లో విద్య కేవలం  కైవల్య ప్రాప్తి కోసం అని చెప్పారు. పారిశ్రామిక విప్లవం తర్వాత కాలం నుండి అది పెట్టుబడిదారుల యంత్ర కొరలను పదునుపెట్టడానికి ఉపయోగ పడుతూ వస్తున్నది.  అసలు విద్య అంటే ఏమిటి? అది నూతనసమాజ నిర్మానికి ఎలా దోహద పడేవిధంగా ఉండాలనేది ప్రశ్న. 


 తనకంటే ముందు పుట్టిన ప్రాణుల్లో ఉన్న జీన్స్  నుండి  కొన్ని జ్ఞానాలు సహజంగానే ప్రతి ప్రాణికి పుట్టుకతోనే వస్తాయి.  సహజంగా ఉన్న జ్ఞానానికి మెరుగులు దిద్దుతూ , ప్రకృతి, పరిసరాలలో ఉండే  కొత్త జ్ఞానాలను నేర్చుకుంటూ , ఈ ప్రకృతి , ఈ సమాజం మొత్తం సహకారం వల్లనే తాను  సౌకర్యవంతంగా  జీవిస్తున్నా అనే ఎరుక కలిగి,   తనతో బాటుగా, తనతో  సమానంగా  పశుపక్షాదులు, ఇతర జీవులు, ప్రకృతి , పర్యావరనం  సమతుల్యంగా , మనగలిగే విధంగా, తాను  సహకరించడానికి అవసరమైన జ్ఞానం కలిగించే విధమైనదిగా విద్య ఉండాలి. 


ఇక కస్తూరి రంగన్ విద్యాచట్టం  2020 కి వస్తే, దాని ముసాయిదా వచ్చినప్పుడే REBS స్పందించి 28 జులై 2019 నాడు  విద్యారంగ అభిమానులతో హైద్రాబాద్ లో ఒక సమావేశం నిర్వహించినాము.ముసాయిదా లో   ప్రస్తావించిన, మాతృ భాషలో విద్య,  పూర్వ ప్రాథమిక విద్య, విద్యకు బడ్జెట్ లో ఇచ్చే ప్రాముఖ్యత , పరీక్ష విధానం లో తేనున్న  మార్పుల గురించి ఆహ్వానిస్తూనే ,పూర్వ ప్రాథమిక విద్య పైన, మాతృభాషన్లో బోధన పైన, రాష్ట్ర జాబితా లో విద్య గురించి , కామన్ స్కూల్ విధానం గురించి, ఉపాధ్యాయ శిక్షణ, నియామకాలు, కారికులం, పాఠ్యపుస్తకాల భారం , పరీక్ష విధానం, మూల్యాంకనం, మొదలగు అంశాల పైన సూచనలు చేస్తూనే మొత్తంగా విద్య ప్రభుత్వరంగం లోనే నిర్వహించాలి కోరి యున్నాము. 


కానీ తీరా ముసాయిదా, చట్టం అయివచ్చిన తర్వాత, పూర్వప్రాథమిక విద్య అదే అంగన్వాడీ లల్లో ఉండేవిధంగానే ఉంది. మాతృభాషలో బోధన కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలకె పరిమిత మయ్యేవిధంగా ఉంది. బడ్జెట్ లో 6% అన్న మాట GDP లో 6% కు మాయ జేశారు. త్రిభాషా సూత్రం అంటూ దక్షిణ భారతం పైన బలవంతంగా హింది రుద్దుతూ ఉత్తరభారతం మాత్రం దక్షినాది భాష నేర్చుకొను ఆనే ఆధిపత్య భావన కనబరుస్తోంది. ఆచరణలో లేని సంస్కృతాన్ని అంటగట్టి ఆనందపడే ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తంగా ప్రైవేట్ పరమ్ జేసెదిగా ఉంది ఈ చట్టం. మరీ ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ రంగం లో పేలవమైన  విద్య, రాజులకు స్టాన్ ఫోర్డ్ స్తాయిలో నాణ్యమైన విద్య లభించే విధమైన ఒక వివక్ష పూరిత విద్యావిధానం కొనసాగే పరిస్తితి కనబడుతోంది. 


రాజ్యం ఏదైనా తన భావజాలానికి అనుగుణంగా, తన ఆర్థిక పునాదిని స్తిరపరుచుకొనే విధంగా ఉపరితలాంశమైన విద్యను రూపొందించు కుంటుంది. కానీ ఇప్పటి ఈ  భారతదేశం 1947 కు ముంది 650 సంస్తానలతో భిన్న జాతుల , భిన్న సంస్కృతుల , సముదాయం . అదేదీ  పరిగణనలోకే తీసుకోకుండా 3000 ఏండ్ల కిందటి భావజాలాన్ని ముందటేసుకొని తాము అనుకుంటున్న అఖండ భారత భావజాలాన్ని అశేష జన  సమూహం పైన రుద్దే ప్రయత్నం జరుగుతున్నది.  


పెంటయ్య వీరగొని.
రాష్ట్ర ఉపాధ్యక్షులు 
రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ