Monday, December 21, 2020

Article on Education.

 .                పాలక వర్గాలకు పావుగా ఉపయోగ పడుతూ వస్తున్న విద్య.


జాతీయ విద్యావిధానం 2020చట్టం,  భారత సమాజం లో  ఏదో చాలా గొప్పమార్పు  తీసుకొని వస్తుంది అని వాదిస్తున్నారు కొందరు. కానీ ఈ చట్టం లో చెప్పబడిన అనేక విషయాలు ఎప్పుడో 200 ఏండ్ల కింద అమెరికాలో ప్రవేశ పెట్టబడి,  పెట్టుబడిదారీ విధానానికి పట్టుగొమ్మలుగా నిలిచిన విషయాన్ని మనం గమనించ వచ్చు. 


క్రీ.ష. 1776 లో అమెరికా కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు, స్టేట్  ,ఫెడరల్ ప్రభుత్వాల అధికారాల పంపకం ,  మరియు అక్కడ ఉన్న నల్ల జాతులవారి బానిస విధానానికి వ్యతిరేకంగా జరిగిన సివిల్ వార్ 1861 లో మొదలై 1865 లో ముగిసింది. ఈ మధ్య కాలం లో యూరప్ లో పారిశ్రామిక విప్లవం మొదటి దశ ప్రారంభింప బడి పారిశ్రామికాధిపతుల వద్ద డబ్బు ప్రోగు పడడం మొదలైంది. అలా ప్రోగుపడ్డ సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ వివిధ పరిశ్రమలల్లో పెట్టుబడులు పెట్టి సరుకు ఉత్పత్తి చేసి మారకం చేయడం ద్వారానే పెట్టుబడి అభివృధ్ధి అవుతుంది అన్న  ఆర్థిక సూత్రాల ఆధారంగా పెట్టుబడి దారి విధానం మొదలైంది.అందరికీ చెందవలసిన యూనివర్సల్ సంపద అయిన  మౌలిక వనరులు ఖర్చై  డబ్బున్న వారి సంపదే పెరుగుతున్నది కదా సామాన్యులమైన మాకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న మొదలైన తర్వాత మీకు పనిజేసుకొనే అవకాశం కల్పిస్తున్నాము కదా అన్న ఊరడింపు, బుజ్జగింపు  మాటలు ముందుకు వచ్చాయి. 


 అధిక సరుకుల ఉత్పత్తి అధిక లాభాలు తెచ్చి పెడుతుందన్న వాదన వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణకు సాంకేతిక నైపుణ్యం అవసరం పడింది. అందుకు శ్రామిక జనాలకు కూడా విద్య అందించ  వలసిన అవసరం పడింది. అప్పుడు,  అంటే 19 వ శతాబ్దం ప్రారంభం లోనే యూరప్, అమెరికా, పారిశ్రామికీకరణ చెందిన దేశాలల్లో  పెద్ద ఎత్తున శ్రామిక జనాలకు విద్య  అందించ వలసిన అవసరం ఏర్పడింది. అప్పటివరకూ ఆయా మతగ్రంథాల బోధన వరకే పరిమితమైన చదువులు సాంకేతిక, భౌతిక,రసాయనిక శాస్త్రలను బోధించడం కూడా మొదలుపెట్టక తప్పలేదు. అందుకని ప్రధానంగా అమెరికా లో కామన్ స్కూల్ విధానం 19 వ శతాబ్దం లోనే ప్రారంభించ బడింది. 


ఒక రాజకీయ పార్టీ అధికారం లోకి రావడానికి ప్రజలు పెద్దసంఖ్యలో ఓట్లు వేసి దానిని గెలిపించుకోవాలి. అట్లా అధికారం లోకి వచ్చిన పాలక పార్టీ ,  పెట్టుబడి దారి వర్గానికి తమ సేవలను అమ్ముకోవడానికి ప్రజలను ఎప్పటికప్పుడూ ఒప్పిస్తూ వారు లాభాలు పెంచుకోవడానికి దోహద పడుతూ ఉండాలి. పాలక పార్టీ ఆ విధంగా దోహద పడనప్పుడు,  పెట్టుబడి తమవద్ద ఉన్న సంపద, ప్రచార సాధనాలను ఉపయోగించి దాని స్తానమ్ లో తమకు అనుకూలంగా ఉండే మరో పార్టీని అధికారం లో కూర్చోబెడుతుంది.( ఒక దళారి పశ్చాత్తాపం)  


1945 లో 2వ  ప్రపంచ యుధ్ధం ముగుసి 1947 లో బ్రిటిషర్ల నుండి స్తానిక   పాలకుల చేతిలోకే అధికారం బదిలీ అయిన తర్వాత దేశం లో  మిశ్రమ ఆర్థిక విధానాలను అమలుపరిచే క్రమం లో విద్యా విధానం ఎలా ఉండాలి అనే దానికి పెద్దగా కస్టపడవలసిన అవసరం లేకుండానే తాము వలసగా ఉన్న ఇంగ్లాండ్ విద్యావిధానన్నే యథాతథంగా కొనసాగించడానికి పాలకులు నిర్ణయించారు. కానీ యూరప్ లో మాదిరిగా దేశం లో పారిశ్రామికీకరణ జరుగనందున సాంకేతిక విద్య అవసరం అంతగా లేకుండా పోయింది. సామాజిక శాష్ట్రాలు, న్యాయ, వైద్య విద్య అవసరాలు ఎక్కువగా ఉండేవి. వైద్య విద్యాలయాల ఏర్పాటు ఖర్చుతో కూడినవి కావడం చేత ప్రభుత్వాలే తమ శక్తి మేరకు చాలా స్వల్పంగా వైద్యవిద్యాలయాలు ఏర్పాటుచేశాయి. ప్రభుత్వాపాలనలో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలల్లో,, రక్షణ, రెవెన్యూ శాఖల్లో, న్యాయ శాఖలో పనిజేయడానికి పరిమితమైన అవసరాల కోసం తాలూకాకు ఒక పాఠశాల, జిల్లాకు ఒక కాలేజీ, రాష్ట్రానికి ఒకటి లేదా రెండు యూనివర్సిటీలు  ఏర్పాటు చేశారు. అవన్నీ ప్రభుత్వాల అవసరాలు తీర్చేవిగానే ఉన్నాయి. 


ఇప్పుడు  మనం చూస్తున్న భారత దేశం 650 సంస్తానాలు, ఇంకా ఒకనాడు 56 రాజ్యాలు గా ఉండేవి. ఇక్కడ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు భాష, కట్టు బొట్టు, ఆహారం,  ఆహార్యం ఎంతో భిన్నంగా ఉంటాయి. హింది, భోజ్పురి, మరాఠీ,బెంగాలీ, రాజస్తానీ, పంజాబీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, మణిపురి, కన్నడం, తమిళం, తెలుగు, మలయాళం, లాంటి లిపి ఉన్నవి ,లేనివి అనేక భాషలు  మాట్లాడే ప్రజలున్నారు. వీరందరికి ఆయా స్టానిక పరిస్తితులకు అనుకూలంగా రాష్ట్రాల జాబితాలో విద్య ఉండేది. తార్వాత విద్య ,  కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి చేర్చ బడింది. సరే మాద్యమాలు ఏవైనా బోధించే విషయాలను చూసినపుడు అవి ప్రభుత్వ ఉద్యోగులు గా లేకుంటే ప్రైవేట్ వారికి సేవలు చేసేడానికి ఉపయోగ పడేవిగానే ఉన్నాయి. నెహ్రూ, కాలం లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కోసం అవసరమైన ప్రాజెక్టులు, భాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ, చంబల్, గండక్ , తుంగభద్రా, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ లాంటి భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం సివిల్, టెక్నికల్ నిపుణుల అవసరం కొరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల అవసరం ఏర్పడింది. మొత్తంగా ఏ విద్యాసంస్తాలు వచ్చినా అయితే అవి ప్రభుత్వ సేవలకు లేదా ప్రైవేట్ రంగం లో ఉన్న పెట్టుబడిదారుల సేవలకే పరిమితమైనవి దప్పితే    మనం మొదటే చెప్పుకున్నట్లుగా సామాన్యులకు పనిజేసుకొని బతికే అవకాశం కలిపించ బడిందే కానీ సమాజం లో ఉన్న ఆర్థిక సామాజిక  అంతరాలు తగ్గించడానికి విద్య ఎంతమాత్రం దోహద పడలేదన్నది నిర్వివాదాంశం. 


ఇక 1991 లో పాముల పర్తి వెంకట నర్సింహా రావ్ ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం అప్పుడప్పుడే ఏర్పాటు చేయబడ్డ నూతన ఆర్థిక , పారిశ్రామిక  విధానాలకు  దేశం లో తలుపులు బార్లా తెరిచారు. ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల కు రూపకర్త అప్పటి ప్రపంచ బ్యాంక్ చేర్మన్ ఆర్థర్ డంకేల్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్ నేషనల్ మానిటరింగ్ ఫండ్, మరియు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యం లో Build Sruggle to Stop the Explaitation Of Working People అన్న నినాదం తో ( ఇప్పుడు గదా మధ్య దళారీల నుండి రైతుల దోపిడీని ఆపుతామని సాగు చట్టాలు తెచ్చినట్టు) అమెరికా సూపర్ పవర్ ను ప్రపంచం లో ఎస్టాబ్లిష్ చేయడానికి  ఆర్థర్ డంకేల్ , తన డంకేల్ డ్రాఫ్ట్ ను ప్రపంచం ముందుకు తెచ్చి అలిమిన్నో, బలిమిన్నో భారత్ ను ఒప్పించారు. అట్లా ఇక్కడ అమెరికా అవసరాలు నెరవేర్చడానికి విద్యా రంగం లో మార్పులు తీసుకొని రాబడ్డాయి.. 


నిజానికి విద్య మానవుల జీవితాల్లో అభివృధ్ధికరమైన మార్పు తేవడానికి చాలా బలమైన సాధనం, కానీ అది ఇంతవరదాక పాలక వర్గాల ద్వారా పెట్టుబడికి ఊడిగం చేయడానికే పనికి వచ్చింది గాని సామాన్యుల బతుకుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పుతేవడం లో పెద్దగా దోహద పడలేదు అన్నది గత 250 సంవస్తారాల చరిత్ర చెబుతున్నది.   


వీరగొని పెంటయ్య 

 విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి 

కరీంనగర్.     


Sunday, December 20, 2020

On Agricultural Acts 2020.

               కొనుగోలు దారులు ఎక్కువైతే రైతులకు ఎక్కువ రేటు వస్తుందా? 


సాగు చట్టాలను సమర్థించే వారు చెపుతున్న దాని ప్రకారం కొనుగోలు దారులు ఎక్కువైతే రైతులకు ఎక్కువ రేటు వస్తుంది అంటున్నారు, అది నిజమేనా చూద్దాం.


నిజానికి రైతు మార్కెట్ లో రైతులు అమ్ముకుంటున్న దానికంటే గూడా ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ ద్వారా నే ధాన్యం ఎక్కువగా అమ్మబడుతున్నది అనేది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇప్పుడుకూడా  రైతులు ప్రభుత్వ రైతు మార్కెట్ లోనే అమ్ముకోవాలే అనే నిబంధనలు కూడా ఏవీ లేవు. ఎవరు వచ్చి రైతుల వద్దనుండి కొనుగోలు చేస్తామన్నాకూడా ఎలా రైతుల వద్ద కొంటావు అని ప్రశ్నించే వారు కూడా ఎవరు లేరు. అయినా సరే సాగు చట్టాలు చేయడమే అని ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలతో ఉందో తర్వాత చెప్పుకుందాం. 


మోనోపాలి ఉంటే ఎక్కడైనా వినియోగ దారునికి నస్టమే. . ప్రభుత్వ రైతు మార్కెట్ మోనాపలి ఏమీ కాదని మొదటే చెప్పుకున్నాము. నిజానికి  ప్రివెట్ మార్కెట్ ఇవాళ ప్రపంచం లో  మోనాపలి చలాయిస్తు లాభాలు గడిస్తున్నది. అది ఇక్కడ మన దేశీయ మార్కెట్ లో ఎలా  చేస్తున్నాధో చూద్దాం. గత సంవస్తరకాలంగా కోవిడ్ 19 మూలంగా ప్రతి రంగం వెనుక బడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే మరింతగా కుంగి పోయింది అనేది Builders Associations Of India( బి‌ఏ‌ఐ) మరియు( BCA)  Building Construction Association వారి ఆవేదన. అంటే కట్టడానికి స్కిల్లెడ్ లేబర్ దొరకని కారణం ఒకటైతే, కట్టినవి అమ్ముడు పోనీ కారణంగా మొత్తం పైన  రియల్ ఎస్టేట్ రంగం నస్టాల్లో ఉంది అన్నది వారి గోడు. ఐతే ఇప్పటికే ఒక సంవస్తర కాలం గడిచిన కారణంగా ఇప్పుడిప్పుడే ఆ రంగం కొద్ది కొద్దిగా పుంజుకుంటున్నది.  కట్టుబడికి ముడి సరుకులు  అయిన సిమెంట్, ఐరన్ దరలు ప్రస్తుతం ఆకాశానికి అంటాయి. ఈ సంవస్తర కాలం లో వీటి దరలు  సిమెంట్ 24% శాతం ఐరన్ 48% శాతం పెరిగింది. సిమెంట్ కు ఐరన్ తయారీకి అవసరం అయిన ముడి సరుకులు ఏవీ గూడా పెద్దగా పెరిగిన దాఖలాలు ఏమీ లేవు. మార్కెట్ లో సిమెంట్ , ఐరన్ ప్రొక్యూర్ చేసే కంపనీలు చాలానే ఉన్నాయి. వాటి మధ్య అమ్మకోవడానికి అవి ఏమీ పోటీ పడి  వాటి దరలు ఏమీ తగ్గించుకోవడం లేదు. పైగా అవి ఒకదానితో ఒకటి పరస్పర  ఒప్పందం,  అంటే సిండికేట్ అయి దరలు పెంచేసుకొని లాభాల మీద లాభాలు సంపాదించుకొంటున్నాయి. మరి ఇక్కడ మార్కెట్ లో కార్పొరేట్ సంస్తలు పోటీ పడి వినియోగ దారులకు లాభాలు చేకూరే విధంగా వ్యవహరించడం లేదు కదా? Price Controle System ఏమి చేస్తున్నాట్లో సామాన్యునికి అర్థం కానీ విషయం. వాళ్ళు ఎంత రేటుపెట్టిన జనం  కొంటున్నారు, కట్టుకుంటున్నారు.  ఏమైంది పోటీ? ఎవరికి జరుగుతున్నది లాభం? ఇక్కడ ప్రభుత్వ సిమెంట్ కంపనీలో , ప్రభుత్వ ఇనుప కంపనీలో వినియోగ దాంరుని పక్షాన  నిలిచి వినియోగ దారులకు లాభం చేకూర్చడమేమీ లేదు కదా? ఉన్నవి అన్నీ ప్రైవేట్ కంపనీలే కదా, పోటీబడి వాటి ఉత్పత్తులను చౌకగా వినియోగ దారులకు ఇవ్వడం లేదేందుకు?  ఇంతింత మాత్రంగా ఉన్న ఈ రైతు మార్కెట్లను కూడా ప్రభుత్వ పాఠశాలల వలె నిర్వీర్యం చేస్తే నోరు లేని రైతుల పరిస్తితి ఏమిటి అని రైతులు ప్రశ్నించడం  నేరమా?  వారికి విశ్వాసం కల్పించాల్సింది పోయి రైతులను వారిపక్షాన నిలిచి పోరాడుతున్నవారిని దేశ ద్రోహులు, కలిస్తానీలు, పాకిస్తానీలు, చైనీలు, అంటూ తిట్టిపోయడం ఏమిటి?  అదేనా ప్రజాస్వామ్యం? 


దీని వలన రేపు వినియోగ దార్లు కూడా దారుణంగా నస్టపోతారు. రైతుల వద్ద నుండి ధాన్యం ఎవరెవరు ఎంతెంత కొంటున్నారు, లెక్కలు లేవు. ఎవరెంత స్టాక్ పెట్టుకుంటున్నారు, లెక్కలేదు. ఏమి రేటుకు కొంటున్నారు లెక్కలేదు. ఎంతకూ అమ్మబోతున్నారు ,లెక్కలేదు. ఈ లెక్క లేని తత్వం ఎవరికి లాభం చేకూర్చుతుంది? ఈ విశ్రుంకలత్వం  ఎవరి లాభం కోసం? 


అరే అయ్యా! రైతు పండించే పంటకు అవసరం అయిన ముడి సరుకు భూమి. అది పంటలు పండించడం ద్వారా నిస్సారం అవుతోందా? మౌలికంగా భూమి దేశ ప్రజల అందరి  సొత్తు. అది నిస్సారం అవుతుంటే దాని ఫలితం దేశ ప్రజలందరికీ చెందాలా లేదా?. ఇక రెండోది నీరు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు. అది పంటలకు విరివిగా ఉపయోగిస్తారు. నీటి  వినియోగం ద్వారా లభించే ఆ లాభం ఏ ఒక్కరికో ఎలా ఇస్తారు. ఎరువులు, పురుగు మందులు, విద్యుత్ ఉత్పత్తికి కాల్చే బొగ్గు, వినియోగం వలన అయ్యే  కాలుష్యం వలన దేశ ప్రజలందరూ సఫర్ అవుతారు, ఇంత మంది  నస్టానికి కారణం అవుతున్న పంట మీద దొరికే లాభం ఒక్క దళారీకీ  పంచి, మిగతా వారి నోరు కొడతా అన్న నీతి నీకు ఏ రాజ్యాంగం నేర్పింది అని ప్రశ్నించడం నేరమా?  


రైతు తన పంటను నెలల పర్యంతరం గోడామ్ లల్లో పెట్టుకొని వాటి అద్దే  కట్టడం చేయలేడు. ఆ పంట ఆయన అమ్ముకొని అప్పులు కట్టుకోవాలి.  కుటుంబ అవసరాల మేరకు అంటే పిల్లల చదువులు, వైద్యం, పెండ్లిల్లు, దుస్తులు, గృహోపకరణాలు, లాంటి అనేకి దినసరి అవసరాలకు ఖర్చు చేసుకోవడానికి ఆయనకు ఉన్న ఒకే ఒక వనరు తాను పండించిన పంట. వ్యాపారి కి వలె ఆయన నెలల పర్యంతం రేటు వచ్చేదాకా నీవు చెప్పినట్లు గోడామ్ లో దాచుకొంటే కుదురదు .  ప్రభుత్వం రైతుకు అండగానిలిచి గిట్టుబాటు దర లభించే విధంగా చూడవలసింది పోయి చచ్చిన శవాన్ని రాబందులకు ఈడ్చి పారేసి నట్లు కార్పొరేట్ శక్తుల ధన దాహానికి రైతుల శ్రమను, వారి బతుకు దెరువులను , దేశ మూల వనరులు అయిన భూమి, నీరు, గాలిని వదిలేయడం అమానవీయం అవుతుంది. ఆర్థిక విషయాలు, అన్నపానీయాలతో సంబంధం లేకుండా కేవలం భావావేశాలతో ఎంతో కాలం మనుషులను మోసగించలేమని మనకు హిట్లర్ చక్కటి మార్గదర్శకత్వం చూయించి పోయినాడు.  


Veeragoni Pentaiah.

Rtd. Dt. Academic Monitoring Officer

Karimnagar.

9908116990


Thursday, November 19, 2020

                             విద్యారంగం ..వైఫల్యాలు .. పరిష్కారాలు. 


రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ (REBS) యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుజేసిన వెబ్నార్ లో విద్యారంగం..వైఫల్యాలు..పరిష్కారాలు అన్న విషయంగా చర్చ జరిగింది. ఈ  చర్చలో పానల్ స్పీకర్ల్లుగా లింగయ్య rtd Dy director, అల్లం రాజయ్య రచయిత, డా. సాంబయ్య DIET, సంజయ్ ఒమెకర్ పొటర్స్ వీల్ ఎజుకేషన్, మరియు  సమన్వయ  కర్తగా వీరగొని పెంటయ్య సంస్త ఉపాధ్యక్షులు వ్యవహరించారు.   సంస్త సభ్యులు మరియు విద్యాభిమానులు  చర్చలో పాల్గొన్నారు. 

 

  పుట్టిన ప్రతి బిడ్డ ,  తన తలిదండ్రుల నుండి సమాజం నుండి నేర్చుకున్న జ్ఞానానికి విద్య మెరుగులు అద్ది , అనేకంగా ఉన్న సామాజిక అవసరాలల్లో ఏదో ఒక చోట తనకు అబ్బిన విద్య ద్వారా  సామాజిక అవసరాలను తీరుస్తూ తన జీవికను కొనసాగించేదిగా విద్య  ఉండాలి. 


  కానీ మన చదువుల్లో మార్కులు గ్రేడ్ లు, పాస్, ఫెయిల్, అనే విధానం  అమలౌతున్నప్పటినుండి కొందరు పిల్లలు జీనియస్, వరప్రసాదులు అనీ, మరికొందరు చదువు అబ్బనివారు, స్లో లర్నర్స్ అని ముద్ర  వేసి మన విద్యావిధానం బడి బయటకు పంపుతున్నది. తద్వారా  కోట్లాది మంది పిల్లలు సరైన ఉపాధి అవకాశం లభించక సమాజం లో గౌరవంగా జీవించే అవకాశాన్ని కోల్పోతున్నారు. 


పోనీ ఈ జీనియస్ లు గొప్పగా చేస్తున్నది ఏమిటని గమనిస్తే ఐతే కార్పొరేట్ సంస్టల్లో ఉద్యోగాలు జేస్తూ వారి సంపదను మరికొన్ని రెట్లు పెంచడానికి దోహదపడుతున్నారు. కాదూ కూడదు అంటే , కార్పొరేట్ సంస్తలకు ప్రకృతి సంపదలను, కారుచౌకగా మానవ వనరులను సమకూర్చి పెట్టె ప్రభుత్వాలల్లో బ్యూరోక్రాట్లు గా పనిజేస్తూ దోపిడి ప్రభుత్వాల పాలనను సుస్తిరం జేసె పనిలో తలమునకలై జీవిస్తున్నారు తప్పితే, సమాజం లో ప్రేమ, సమభావం, సౌశీలం, సంపద సమానంగా పంచబడాలనే దానికోసం వారు పనిజేయడమ్ లేదు, అలాగే మన విద్యావిధానం కూడా ఆ జ్ఞానాన్ని అందించడం లేదు. 


విద్యారంగం యొక్క ఈ వైఫల్యాలను తొలగించే పరిస్కార మార్గాల అన్వేషణలో ఈ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక వక్తలు పైవిషయాన్ని దృస్టిలో పెట్టుకొని మాట్లాడాలని సమన్వయకర్త కోరగా చర్చ ప్రారంభించబడింది. 


అల్లం రాజయ్య:-  విద్యను పై పై గా ఉపరితలం నుండి చూస్తే అనేక అంశాలు మనకు సరిగా అర్థం కావు. అందుకే విద్యా అంటే ఏమిటి? విద్యకు సమాజానికి ఉండే సంబంధం  ఏమిటి? విద్యకు చరిత్రకు ఉండే సంబంధం ఏమిటి అనే సామాజిక పునాది నుండి ఆలోచించక పోతే మనం ఎన్ని పిల్లిమొగ్గలేసినా దాని రూపానికి సంబంధించిన విషయమేతప్ప సారనికి చెందిన విషయాన్ని అర్థం జేసుకోలేము. సారం అంటే ఏమిటి? ఏ దేశం లోనైనా , ఏ ప్రాంతం లోనైనా ఉత్పత్తి శక్తులు ఎట్లున్నై అనే దాని పైన్నే ఆధారపడి విద్య,విజ్ఞాన శాస్త్రం , రాజకీయకార్య కలాపాలు , కళలు,మతాచారాలు,  అన్నీ ఉంటాయి. రెండోది ఉత్పత్తి సంబంధాలు. భారత దేశం లాంటి చోట్ల ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉన్నాయి? ఉత్పత్తి సంబంధాలను నిర్ణయించే పద్దతి ఏముంటది? ఉత్పత్తి సాధనాల రూపం కూడా విద్యలో ప్రధానమైంది. ఉత్పత్తిలో మనుషుల స్తానమ్ ఏమిటి? పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయి? ఉత్పత్తి పంపిణీ ఎలా ఉంది? ఇవన్నీ కూడా అన్నీ రకాల సామాజిక జీవితాల  తో బాటు విద్యాపైన కూడా  ప్రభావం చూపుతాయి. మన దేశానికి వస్తే కులమున్నది, వర్గమున్నది, మతమున్నది. లింగవివక్షత ఉంది. భాషా పర వివక్షత ఉంది. ప్రాంతీయ వివక్షత ఉంది. ఇవన్నీ వివక్షలతో బాటు పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంటదో  చూద్దమ్. 


అద్భుతమైన వ్యక్తిత్వం తో రూపొందించబడాల్సిన విద్యార్థికి  ప్రప్రథమంగా స్వంత ఆస్తి కేంద్రం గా గల కుటుంబాల్లో ముందుగా వాళ్ళ తలిదండ్రులనుండే వారి మానసిక వికాసానికి అడ్డంకులు ఎదురౌతాయి. విద్యార్హి ఏమో ఉత్పత్తి శక్తుల వికాసం గురించి ఆలోచిస్తే వారి తలిదండ్రులేమో స్వంత ఆస్తి కేంద్రంగా  వాళ్ళు ఏమి చేయాలో నియంత్రిస్తారు. కుటుంబం లో ఆడపిల్లలను ఒక రకంగా చూస్తార్, మొగపిల్లలను ఒకరంగా చూస్తారు.కుటుంబంలో  పితృస్వామిక భావజాలం పసిపిల్లల మనసులను తీవ్రంగా గాయపరుస్తుంది. తనకు ఊహ తెలిసినప్పటినుండే స్వేచ్ఛగా వికసించాల్సిన పసి మనసులను  తలిదండ్రులు నిర్దయగా నలిపేస్తున్నారు. తాను ఏమి  నేర్చుకోవాలో తెలియని అయోమయం లో పిల్లలను కుటుంబ వ్యవస్త ఖూనీ చేస్తున్నది. ఇక రెండోది బడి. ఆ బడి ప్రజలు పెట్టుకున్నది కాదు.  తన అవసరాలకోసం ప్రజలనుండి అదనపు ఉత్పత్తిని  ఎలా పిండుకోవాల  అన్న స్వార్థ  చింతనతో దానికి ఓక పద్దతిని రూపొందించి రాజ్యం పెట్టిన బడి అది. ఇక్కడ పెట్టిన కరికులం అంతా కూడా అంటే అది భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, ఆలోచనలు అన్నీ కూడా హేతు విరుద్దం అయినవి. పుక్కుటి  పురాణాలు.  3000 ఏండ్ల నుండి ఇదే  విధానం మనది. పిల్లలు వేసే అనేక ప్రశనలకు మనవద్ద జవాబులు ఉండవు. ఎంతో అద్భుతంగా వికాసం చెందాల్సిన విద్యార్థిని ఒక చెరసాల, ఒక కాన్సెంత్రేషన్ క్యాంప్ లాంటి చోట పెడుతున్నాం. అక్కడ మళ్ళీ భాష వివక్షత, కుల ,లింగ వివక్షత తో పాటు ఉపాధ్యాయుల కోపతాపాల మనోభావాల ఫలితాలు ఉంటాయి. ఇలాంటి అభ్యసన కేంద్రాలల్లో 48 కోట్ల మంది  18 సంవస్తారాల లోపు పిల్లలు విద్యను అభ్యశిస్తున్నారు. ఇలాంటి చోట్ల వారి శారీరక, మానసిక వికాసం ఎట్లా జరుగుతది? వాళ్ళు ఏ సమాజం గురించి ఆలోచిస్తారు. 3000 సంవస్తారాల నుండి ఇదే ఒక అసమంజసమైన విధానం నడుస్తా ఉంటే మరీ ముఖ్యంగా గ్లోబలైజేషన్ మొదలైనప్పటి నుండి ఈ సమస్యలన్నీ ఇలాగే ఉండగా భారతీయ సంపదను ఎలా కొల్లగొట్టుక పోవాలనే దానికి ఒక ప్రణాళిక జరుగుతున్నది. 


ఈ విషయాలేవీ చెర్చించకుండా కేవలం విద్యావిధానం గురించి చర్చిస్తామంటే మనం గోతిలో పడ్డాట్లే. ప్రపంచీకరణ అంటే స్టానిక సమస్యలు వస్తాయి. ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఉంటది. సార్వత్రీకరణకు , వ్యక్తిగతానికి ఘర్షణ ఉంటది. సాంప్రదాయానికి,సనాతన వాదానికి  , గతితార్కికానికి ఘర్షన ఉంటది. దీర్ఘ కాళిక ప్రయోజనాలకు తక్షణ ప్రయోజనాలకు ఘర్షణ ఉంటది.  ఈ ఘర్శనలన్నీ మాయజేసి పోటీ తత్వం, నేర్చుకోవడం అనే ఓ పుక్కిడి పురాణాల కల్పిత గాతలను పిల్లల ముందుకు తెస్తు , మొత్తంగా భారతీయ సంపదని కొల్లగొట్టేందుకు మొత్తంగా 65% శాతం యువతను సర్వీస్ రంగం అనే ఒక కట్టుబానిస వ్యవస్తాలోకి తెచ్చే ఒక  కుట్ర అమలౌతున్నది. 


పైన చెప్పుకున్న అన్నీ సమస్యల గురించి భారతీయ సమాజం ఆలోచిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ వైఫల్యాలు వైదొలుగాలి అంటే కార్మికుల, ఆదివాసీల, రైతుల, పేదల, కింది కులాల   బిడ్డలు అందరికీ  శాస్త్రీయమైన ,  నాణ్యమైన విద్య అందాలి. పాఠ్యాంశాలను ఆచరణతో,  శారీరక శ్రమతో, ఉత్పత్తి ప్రక్రియ తో అనుసంధానం జేయడం, అప్పజెప్పే బట్టే విధానం కాకుండా జ్ఞానాన్ని కలిగించే బోధన,  జ్ఞాపక శక్తి కంటే జ్ఞానాన్ని సమీక్షించే పరీక్షావిధానం, వ్యక్తిగత జ్ఞానాన్ని లాజికల్ జ్ఞానం గా లాజికల్ జ్ఞానాన్ని  గతితార్కిక చారిత్రిక జ్ఞానం గా అభివృధ్ధి చేయడం, 40 కోట్ల మంది  పిల్లలు 30 కోట్ల మంది యువకుల జీవితాలు అర్థం,పర్థం  లేకుండా పోవడానికి ముందుగా రాజ్యం , ఆ తర్వాత ఉపాధ్యాయులు, తలిదండ్రులు , పౌర సమాజం మొత్తంగా  బాధ్యత వహించవలసి ఉంటుంది.  దీనికి కారణాలు  కొందరు పిల్ల పైకి నెడితే, కొందరు ఉపాధ్యాయుల పైన మరికొందరు తలిదండ్రుల పైంకి నేడుతున్నారు. తెలివైన వారు మాత్రం రాజ్యం పైకి నేడుతున్నారు.విద్య ఒక వర్గ పోరాటం.  ఒక ఆచరణాత్మకమైన అంశం. విద్య సామాజిక వైరుద్యాల్తో కూడుకున్నది. ఈ వైరుద్యాలు ఏమిటో  తెలుసుకున్నంత  మాత్రాన అవి  పరిష్కారం కాజాలవు .   మరి  ఎవరు పరిష్కరించాలి అంటే విద్యార్థులు తమ వ్యక్తిగత అనుభవాన్ని లాజికల్ అనుభవంగా, లాజికల అనుభవాన్ని గతితార్కిక అనుభవంగా , చారిత్రిక అనుభవంగా చేసుకొని ఉద్యామిస్తూ ఉంటే వారికి జతగా ఉపాధ్యాయులు,  తలిదండ్రులు,  మొత్తంగా పౌర సమాజం ఉద్యామిస్తే దప్ప ఈ విద్యా రంగ సంస్యలకు  పరిష్కారం లభించబోదు.  


Tuesday, September 29, 2020

                        విద్యా చట్టం 2020  పైన REBS అభిప్రాయం. 


కస్తూరి రంగన్ విద్యాచట్టం 2020 పైన ప్రధానమంత్రి మోడి మొదలుకొని వారి పాలక పార్టీ వాళ్లందరితో బాటుగా ఆ రాజకీయాలను అభిమానించే వారంతా ఇంత మంచి విద్యా చట్టం నభూతో నభవిష్యత్ అంటూ ప్రశంసించారు. కొందరు విద్యావేత్తలు మాత్రం ఇది గత విద్యాచట్టాలకంటే ఏమీ భిన్నమైనది కాదూ అంటూనే ఇంకా అపకారం చేసేదిగా కూడా ఉందని అన్నారు.


వేదకాలం లో విద్య కేవలం  కైవల్య ప్రాప్తి కోసం అని చెప్పారు. పారిశ్రామిక విప్లవం తర్వాత కాలం నుండి అది పెట్టుబడిదారుల యంత్ర కొరలను పదునుపెట్టడానికి ఉపయోగ పడుతూ వస్తున్నది.  అసలు విద్య అంటే ఏమిటి? అది నూతనసమాజ నిర్మానికి ఎలా దోహద పడేవిధంగా ఉండాలనేది ప్రశ్న. 


 తనకంటే ముందు పుట్టిన ప్రాణుల్లో ఉన్న జీన్స్  నుండి  కొన్ని జ్ఞానాలు సహజంగానే ప్రతి ప్రాణికి పుట్టుకతోనే వస్తాయి.  సహజంగా ఉన్న జ్ఞానానికి మెరుగులు దిద్దుతూ , ప్రకృతి, పరిసరాలలో ఉండే  కొత్త జ్ఞానాలను నేర్చుకుంటూ , ఈ ప్రకృతి , ఈ సమాజం మొత్తం సహకారం వల్లనే తాను  సౌకర్యవంతంగా  జీవిస్తున్నా అనే ఎరుక కలిగి,   తనతో బాటుగా, తనతో  సమానంగా  పశుపక్షాదులు, ఇతర జీవులు, ప్రకృతి , పర్యావరనం  సమతుల్యంగా , మనగలిగే విధంగా, తాను  సహకరించడానికి అవసరమైన జ్ఞానం కలిగించే విధమైనదిగా విద్య ఉండాలి. 


ఇక కస్తూరి రంగన్ విద్యాచట్టం  2020 కి వస్తే, దాని ముసాయిదా వచ్చినప్పుడే REBS స్పందించి 28 జులై 2019 నాడు  విద్యారంగ అభిమానులతో హైద్రాబాద్ లో ఒక సమావేశం నిర్వహించినాము.ముసాయిదా లో   ప్రస్తావించిన, మాతృ భాషలో విద్య,  పూర్వ ప్రాథమిక విద్య, విద్యకు బడ్జెట్ లో ఇచ్చే ప్రాముఖ్యత , పరీక్ష విధానం లో తేనున్న  మార్పుల గురించి ఆహ్వానిస్తూనే ,పూర్వ ప్రాథమిక విద్య పైన, మాతృభాషన్లో బోధన పైన, రాష్ట్ర జాబితా లో విద్య గురించి , కామన్ స్కూల్ విధానం గురించి, ఉపాధ్యాయ శిక్షణ, నియామకాలు, కారికులం, పాఠ్యపుస్తకాల భారం , పరీక్ష విధానం, మూల్యాంకనం, మొదలగు అంశాల పైన సూచనలు చేస్తూనే మొత్తంగా విద్య ప్రభుత్వరంగం లోనే నిర్వహించాలి కోరి యున్నాము. 


కానీ తీరా ముసాయిదా, చట్టం అయివచ్చిన తర్వాత, పూర్వప్రాథమిక విద్య అదే అంగన్వాడీ లల్లో ఉండేవిధంగానే ఉంది. మాతృభాషలో బోధన కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలకె పరిమిత మయ్యేవిధంగా ఉంది. బడ్జెట్ లో 6% అన్న మాట GDP లో 6% కు మాయ జేశారు. త్రిభాషా సూత్రం అంటూ దక్షిణ భారతం పైన బలవంతంగా హింది రుద్దుతూ ఉత్తరభారతం మాత్రం దక్షినాది భాష నేర్చుకొను ఆనే ఆధిపత్య భావన కనబరుస్తోంది. ఆచరణలో లేని సంస్కృతాన్ని అంటగట్టి ఆనందపడే ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తంగా ప్రైవేట్ పరమ్ జేసెదిగా ఉంది ఈ చట్టం. మరీ ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ రంగం లో పేలవమైన  విద్య, రాజులకు స్టాన్ ఫోర్డ్ స్తాయిలో నాణ్యమైన విద్య లభించే విధమైన ఒక వివక్ష పూరిత విద్యావిధానం కొనసాగే పరిస్తితి కనబడుతోంది. 


రాజ్యం ఏదైనా తన భావజాలానికి అనుగుణంగా, తన ఆర్థిక పునాదిని స్తిరపరుచుకొనే విధంగా ఉపరితలాంశమైన విద్యను రూపొందించు కుంటుంది. కానీ ఇప్పటి ఈ  భారతదేశం 1947 కు ముంది 650 సంస్తానలతో భిన్న జాతుల , భిన్న సంస్కృతుల , సముదాయం . అదేదీ  పరిగణనలోకే తీసుకోకుండా 3000 ఏండ్ల కిందటి భావజాలాన్ని ముందటేసుకొని తాము అనుకుంటున్న అఖండ భారత భావజాలాన్ని అశేష జన  సమూహం పైన రుద్దే ప్రయత్నం జరుగుతున్నది.  


పెంటయ్య వీరగొని.
రాష్ట్ర ఉపాధ్యక్షులు 
రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ 

Wednesday, August 5, 2020

కొత్తాచూపు కోసం ఎదిరిచూద్దాం !

                                 కొత్త చూపుకోసం ఎదిరిచూద్దాం! 


మొన్నటినుండి వాట్సాప్ లల్లో ఫెస్బుక్ లల్లో సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు అభినందనలు తెలుపుతూ కొందరు పోస్టింగ్లు పెడుతున్నారు. మంచిదే కదా? మెరిటోరియస్ వ్యక్తులను అభినందిస్తే ఆనంద పాడాల్సిందే కదా,  అభ్యంతరం దేనికి అన్న ప్రశ్న సహజంగానే ఎవరైనా వేస్తారు. బ్రిటిష్ పాలకుల నాటి ICS నుండి ఇప్పటి IAS, IPS లవంటి సివిల్ సర్వెంట్స్ అంటే ప్రజల సేవకుల దాకా  ఎవరికి సేవజేస్తున్నారో నేను మరోసారి చెప్పవలసిన అవసరం లేదు. అప్పటి నుండి ఇప్పటి దాకా ఈ సివిల్ సర్వీస్ సేవా రంగం లోకి ప్రధానంగా ఎవరు వస్తున్నారో చూద్దాం. అధికారం చెలాయించడం లో, ఆనందం పొందే వర్గాలు, తనకున్న హోదా ద్వారా లభించే గౌరవ మర్యాదలు, అతిధిసత్కారాలు, ఆదరణల రుచి తెలిసిన వారు మరీ కోరి కోరి ఈ రంగం లోకి వస్తున్నట్లు మనం గంనించ వచ్చు. డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, ఒకప్పుడు ఇంజ నీర్ల కొడుకులు ఇంజనీర్లు, అవుతున్నట్టుగానే సివిల్ సర్వీస్ లో పని జేస్తున్న వ్యక్తులు తమ పిల్లలను ఎన్ని కోచింగ్ లు ఉంటే అన్నీ కోచింగ్ లకు పంపి కొండోకచో తమ పలుకుబడి ఉపోయోగించి  ఇంటెర్వ్యూ లో నెగ్గింపజేసి తమ సంతానాన్ని సివిల్ సర్వెంట్లు గా చేస్తున్నారు.  అడపాదడపా ఎక్కడో ఒకచోట వెనుకబడిన తరగతులకు చెందినవారు కూడా అప్పుడప్పుడు  వస్తున్నారు. ఇక ఉన్న రిజర్వేషన్ అవకాశాన్ని వినియోగించుకొని Sc,St బిడ్డలు కూడా  కొందరు వస్తున్నారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే సివిల్ సర్వీస్ లోకి వస్తున్న మెజారిటీ పిల్లలు సవర్ణులో లేక సంపన్నులో అయి ఉంటున్నారన్న విషయం మనం గమనించాలి. తమ కులం వాడని, తమ మతం వాడని, తన ప్రాంతం వాడని ఎంత పక్షపాత పరిపాలన సాగుతున్నదో చూస్తూనే ఉన్నాం.  ఎలాగో ఓ లాగున వస్తున్నారు సరే! వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి చేస్తున్నారో జగమెరిగిన  సత్యమే కదా? రాజకీయ నాయకుల ప్రజాకర్షణ, ఓట్ల రాజకీయ పథకాలను అమలు చేసే పనిలో వాళ్ళు తీరికలేకుండా పనిజేస్తున్నారు. ఎక్కడో మచ్చుకు ఒక శంకరన్ లాంటి ప్రజాసేవా తత్పరతులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒక పూనమ్ మాలకొండయ్య లాంటి ఖచ్చితమైన అధికారులు అక్కడక్కడ కనిపిస్తుంటారు . సెలక్ట్ అయినకాన్నుంచి వాళ్ళకు లభించే శిక్షణ, దర్జా, సౌకర్యాలు, నౌకార్లు,చౌకర్లు, కార్లు, బంగ్లాలు, సేవకులు, లాంటి అనేక రాజలాంచనాలు ప్రజల డబ్బులతో సమకూర్చబడుతాయి. కానీ మెజారిటీ సివిల్ సర్వెంట్లు ఒక  PM,CM , Ministers, కు ఇచ్చే విలువలో పైసా వంతు కూడా సామాన్య ప్రజలకు ఇవ్వంగా నేనైతే చూడలేదు. మరి అంతంతేసి చదువులు చదివిన వివేచనా  పరులని, అత్యంత తెలైవైనవారనీ,  అసాధారణ ప్రజ్ఞావంతులని ఎన్నుకోబడిన ఈ సమూహం అంత స్వార్థ పూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నదంటారు ? అంటే చిన్నప్పటి నుండి తనకు బోధించ బడుతున్న విద్య, మరియు విలువలు ఎలా ఉంటున్నాయో చూడాల్సి ఉంటుంది.  తనకున్న నైపుణ్యం, తెలివితేటలు తన పూర్వీకుల జీన్స్ , తన కృషి ఫలితంగా  కాకుండా పూర్వజన్మ సుకృతం, దైవ కృప అనే ఒక అశాస్త్రీయమైన ఆలోచనా విధానం ఒక కారణమైతే, మరోకారణం సమాజం లో , నీవు ఎట్లా సంపాదించావనేది కాకుండా ఎంత సంపాదించావనే ప్రాతిపదికన గౌరవ మర్యాదలు లభించడం ఇంకో కారణం . 1947 నుండి మనం గమనిస్తే ఆ తొలి రోజుల్లో త్యాగపూరిత ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకోసం పనిజేసిన వారికి గౌరవ మర్యాదలు లభించేవే. కానీ ఇప్పుడు అతనికి ఉన్న సంపదను బట్టి అతనికి మర్యాద దొరుకుతున్నది. ఇప్పుడు చాలమందికి ఆదర్శం అంబానీలు, ఆదానీలు, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఉన్న వ్యక్తులు ఆరాధ్యం అయి కూర్చుంటున్నారు. కనుక ఆ పోటీలో ఎవరికి ఎంత చేతనైతే అంతా కూడబట్టుకొనే యావలో ఆ  పరుగుపందెం లో పాల్గొంటూ దక్కినకాడికి చిక్కించుకొనే పనిలో ఉంటున్నారు. ఇది కేవలం సివిల్ సర్వెంట్లే అలా చేస్తున్నారా అని వారిని ఆడిపోసుకోలేము. అటెండర్ నుండి IAS, దాకా, వార్డు మెంబర్ నుండి CM, లు PM ల దాకా ఎవరికి అవకాశం లభిస్తే వారు డబ్బుకోసమో అధికారం కోసమో సామాన్య ప్రజల ఎదల పైన్నుండో ,తలల పైన్నుండో ఎదిగి అందలం ఎక్కుతున్నవాళ్లే. అది ఈ కాలం నీతి అయ్యింది. పరుగుపందెం లో నీవు వెనుకబడకూడదనుకుంటే పక్కోడు పడిపోతున్నా నీవు పట్టించుకోవద్దు. దయ, జాలి , కరుణా, సౌభ్రాతృత్వం, సౌశీల్యం వంటి మాటలు  వద్దు, నీ గోల్ వైపు నీవు సాగిపో. నీ లక్ష్యం  డబ్బు సంపాదన, అధికారం సంపాదన అదే నీ కండ్ల ముందు కదులాడాలి. అందుకు నీవు డాక్టరువు అవుతావా? ఇంజనీరువు అవుతావా? సివిల్ సర్వెంటువు , రాజకీయనాయకుడువి అవుతావా? లేకుంటే బాబా అయినా ఫరువాలేదు  అన్న నీతి చలామణిలో ఉంది. 


ఇది మారాలంటే బడులు, విశ్వవిద్యాలయాలు, ఆరోగ్యశాలలు, అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. అందుకు ప్రజా ఉద్యమాలు జరుగాలి. 


Tuesday, August 4, 2020

భారతమా ఎటువైపు నీ పయనం.


                                               భారతమా ఎటువైపు నీ పయనం !


మునుపెన్నడూ కనీవినీ ఎరుగని  ఒక భయానకమైన ప అరిస్తితి. పులి దాడికి ఆలమంద జడిసి పరుగులిడినప్పటి పరిస్తితి. ఆనాడు ఆలమందకు ఓ  బోయిడు ఉన్నాడు కనుక  బతికున్న మందకు ధైర్యానికి  నేనున్నాను భయం వీడి మేతమేయండి అని ధైర్యం చెప్పే ఉంటాడు.  కానీ ఇప్పుడేమో సర్కారు మీడియా కలిసి కావాల్సినంత భయాన్ని కుమ్మరించి తడిసి వణుకుతున్న జనాల్ని పట్టించుకోకుండా రొమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకొన్న రొమ్ చక్రవర్తి  చందంగా వారి కంఫర్ట్ జోన్ లో వాళ్ళు హాయిగా బాతాలు జెప్పుతూ బతికేస్తున్నారు. 


రాష్ట్రంలో పార్టీ ఆఫీసుల నిర్మాణాల పైన, అడవులు, గుట్టలు నరికెసి నాటిన మొక్కల పైన,  తమ కార్య కర్తలతో రివ్యూ  చేసుకుంటున్నారు. అరే మేరే భయ్యా! ఇప్పుడు అది గాదు కదా కావాల్సింది? మీ ఉర్లే నర్సు, ఉందా? మీ మండలం లో ఉన్న దవాఖాంల డాక్టర్లు, నర్సులు ఎందరున్నారు? మందులున్నాయా? కారెంటైన్ కు సరిపోయే పబ్లిక్ ప్లేస్ లు ఉన్నాయా? ( స్కూల్ భవనమో, పంచాయత్ కార్యాలయామో, ఇంకా ఏదైనా) , మీ గ్రామం ఎవరికైనా కరోనా వస్తే సహకరించి ధైర్యం చెప్పడానికి ఎంతమందితో  వాలెంటీర్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు? నా నుండి (  MP,MLA,MPP,MPTC, Sarpanch) ఏ సహాయం కావాలో చెప్పండి, నేనున్నాను అధైర్యపడవద్దు అని  ధైర్యం చెప్పే నాయకుడే కరువైపోయిండేంది? 


ఇప్పుడు అర్జంటుగా మనుషులకు కావాల్సింది వైద్యశాలలు. కానీ మనం ఏంజెస్తున్నం? గుళ్ళు కడుతున్నం, ఇంకా అడిగితే  ఉన్నవి కూలగొట్టి మరీ కొత్తై కడుతున్నం. భారత ప్రధాన మంత్రి గుడి శంకు స్తాపనకు పోతడు. నరేంద్ర మోడీకి తాను ఏ మతాన్నైనా కలిగి ఉండే హక్కు ఉంటది. కానీ ప్రధాన మంత్రి పదవికి ఏ మతము ఉండదు, రాజ్యాంగ పదవులు మతాతీతమైనవి  అని మన రాజ్యాంగం చెబుతున్నది. కానీ మన ముఖ్యమంత్రులు తమ మత  విశ్వాసాలమేరకు ప్రజల డబ్బులతో గుడులకు మొక్కులు చెల్లించుకుంటరు. రాజకీయ లబ్దికొరకు హజ్ యాత్రికులకు,మసీద్, మందిర  పూజారులకు, ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు చెల్లిస్తారు. బోనాలు, ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ ఈవ్ లు ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తారు. రాజ్యాంగ స్పూర్తి కి ఇది విరుద్ధమైనా  మనం చేస్టలు ఉడిగి చూస్తుంటాము. 


భారత రాజ్యాంగం లో ఉన్న సెక్యులర్ మరియు  సోసియలిస్టిక్ అన్న రెండు పదాలకు ప్రస్తుతం చోటు లేకుండాపాలకులు  జాగ్రత్త పడుతున్నారు.  అప్పటి కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్  ఈ రెండు పదాలను తొలగించి భారత రాజ్యాంగం రీరైట్ చేయాలని ఏకంగా భారత పార్లమెంట్ లోనే చెప్పారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, వారు ఏ మతం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో ఈ దేశం లోని మిగతా ప్రజలంతా అదే విశ్వాసం కలిగి ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం . అవును అలా ఉంటే తప్పేమిటి అన్న ప్రశ్న వేసేవారు ఎక్కువగానే ఉన్నారు. అప్పుడు మరి  రాజ్యాంగం లోని మతస్వేచ్ఛకు అర్థం లేకుండా పోతది కదా? అంటే ,  పోతే పోతది కావచ్చు, అయినా ఈ మతం గోల నీకెందుకయ్యా అని మీరనొచ్చు.  అది అంతవరకే అయి ఊరుకోవడం లేదే? మతం ప్రాతిపదికన రాజ్యాధికారానికి వచ్చిన చరిత్ర మన కండ్ల ముందే కదలాడుతున్నది కదా? ఎల్ కె అద్వానీ, మురలి మనోహర జోషి లాంటి వాల్ల రథయాత్ర ఫలితమే గదా బిజెపికి అధికారం ప్రాప్తించింది? సరే ఇప్పుడు వాళ్ళను  భూమి పూజకు పిలువనే లేదట. ఇదికూడా ఒక సంకేతమే, అధికారం ఎవరిచేతిలో ఉంటే వారిమాటే చెల్లుబాటు.  అక్కడ  అంతకు ముందు కృషి చేసిన  వారి పట్ల  కృతజ్ఞత, గౌరవ మర్యాదలు ఉండవలసిన అవసరం లేదని ఈ ఉదంతం నిరూపిస్తున్నది. సరే మత భావనలు పాలన లో అమలు జరిపేవారు  రాజ్యాధికారం లోకి వస్తే నీకో,  సామాన్యులకో జరిగే నస్టమ్ ఏమిటో అన్నది కదా మీ ప్రశ్న? 


కస్తూరి రంగన్ కమిషన్ , బి ఎడ్ ను  4 సంవస్తారాల కోర్స్ చేసింది.  2 సంవస్తారాలు విద్యార్థులకు ఎలా బోధించాలో నేర్పిస్తారట. మిగతా రెండు సంవస్తారాలు దేశం లో అనాదిగా వస్తున్న సనాతన సంస్కృతి , ధర్మాలు, ఇతిహాసాల గొప్పదనం గురించి బోధిస్తారట. అవ్ , బోధిస్తారు,  అయితే తప్పేమిటి?  అంటే ఉపాధ్యాయుని సామాజిక చింతన ఏదైతే తన విద్యార్థులకు అదే బోధిస్తాడు. కనుక ఈ సమాజాన్ని తమ భావజాలానికి అనుగుణంగా, ప్రశ్నించే తత్వం లేకుండా, ఒకడు ఇచ్చేవాడు ఉంటాడు, మనం వాణ్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకొని అడుక్కోవాలి అంతే గాని ఇవి  మా  హక్కులు అంటూ ప్రశ్నించ కూడదు అని నేర్పించే ఉపాధ్యాయుల ను తయారుజేస్తారట .  ఒక మూస ఉంటుంది.  ఆ మూసలో ఏ మట్టి నింపినా ఒకే రకమైన బొమ్మలు వస్తాయి. ఆ మూస ద్వారా  ఎన్నయినా ఒకే రకమైన వినాయకుల విగ్రహాలు తయారు చేయవచ్చు. ఆ మూస తో రాముని విగ్రహాలు చేయలేము. కనుక కొత్త  ఉపాధ్యాయ మూసలను సమాజ నిర్మాణం కోసం తయారు చేసి తేబోతున్నారట. 


ఇక సోసియలిజం అంటే సమానత్వం. వ్యవసాయం మొదలైన తర్వాత ప్రపంచం లో  ఏ సమాజం లో కూడా సమానత్వం లేకుండా పోయింది. భారత దేశం లో మరీ లేకుండా పోయింది. ఇక్కడ కులాలు, వర్ణాలు ఉన్న మూలంగా ఒక కులం ఎక్కువ మరో కులం తక్కువ అనేది అనాదిగా ఉంది. అలాగే స్త్రీలు పురుషులతో సమానం అనే భావన కూడా లేదు. న స్త్రీ స్వతంత్ర మర్హతి అన్నారు. పుస్తకం వనితా విత్తం , పర హస్తం గతం గతః అన్నారు. ఇట్లా ఎన్నయినా చెప్పవచ్చు. ప్రజాస్వామిక పోరాటాలు జరిగిన దేశాలల్లో రంగు, లింగ బేధాల వివక్ష ఉండకూడదన్నారు. ఆ స్పూర్తి మేరకే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ , దండలో దారం వలె రాజ్యాంగ స్పూర్తిలోనే సెక్యులర్ సోసియలిజం భావనల  సువాసనలను భారత రాజ్యాంగానికి అద్దినాడు. కానీ ఆ రెండు పదాలకు నేడు  కాలం చెల్లిపోయింది అంటున్నారు పాలకులు.    


Thursday, July 30, 2020

             కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం పైన REBS స్పందన. 


కేంద్రప్రభుత్వ ఆలోచన మేరకు కస్తూరి రంగన్ రూపొందించిన నూతన విద్యావిధానం  ముసాయిదా పత్రం  పైన గత సంవస్తరమ్ Right Education for Better Society ఆధ్వర్యం లో హైద్రాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి rebs పక్షాన కస్తూరి రంగన్  కమిషన్ కు కొన్ని సూచనలు చేయడం జరిగింది. 


నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నూతన విద్యా  బిల్ లో మేము సూచించిన  కొన్ని సూచనలు పరిగణలోకి తీసుకున్నట్లుగా గమనించినాము. 


1).  ప్రాథమిక స్తాయి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలని rebs పక్షాన మేము కోరి యున్నాము. ప్రభుత్వం అందుకు అంగీకరించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇది అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు గైకొనాలని మేము కోరుతున్నాము. 


2) .  GDP లో 6% శాతం నిధులు ఇస్తామన్న  కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని కూడా కేంద్రం నిర్దేశించాలి .   ఎందుకంటే  విద్యా సెస్సు పేరుతో కేంద్రం  4% శాతం( 3+1) నిధులు ఎలాగూ ప్రజలనుండి వసూలు చేస్తున్నది. అందులో కొంత రాష్ట్రాలకు ఇస్తున్నది కనుక  రాష్ట్రాలు 30% నిధులు కేటాయించాలని కేంద్రం ఆదేశించవచ్చు . 


3). పరీక్షా విధానం కూడా మార్చాలని rebs కోరింది. అయితే అన్నీ తరగతులకు ప్రతి సంవత్సరము జరిపే  వార్షిక పరీక్షలు రద్దు పరుస్తూ కేవలం 3,5,8 తరగతులకు  మాత్రమే పరీక్షలను  పరిమితం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం .  విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం వీటినికూడా రద్దు  చేయాలి అని కోరుతున్నాం. 


4).  నర్మగర్భంగా సంస్కృతాన్ని బోధించే విషయాన్ని విద్యా చట్టం ప్రస్తావించింది . కానీ ఎక్కడా వాడుకలో లేని మృత  భాష అయిన సంస్కృతం లో  ఏదో విద్వత్తు దాగి ఉందన్న భ్రమలో విద్యార్థుల నెత్తిన ఆ భాషను రుద్దడం అశాస్త్రీయం. కనుక ఆ ఆలోచన మానుకోవాలి.  


5). ఉపాధ్యాయ శిక్షణా కోర్స్ డిగ్రీతో కలుపుకొని 4 సంవస్తరాల ఇంటెగ్రేటెడ్  ప్రొఫెషనల్ కోర్స్ గా తేవడాన్ని ఆహ్వానిస్తూనే ప్రాథమిక తరగతులు బోధించడానికి ఇంటర్ తో కలిపి 3 సంవస్తరాల  డిప్లమా ఇంటెగ్రేటెడ్ కోర్స్ కూడా  ఉంటే బాగుంటుంది. 


      ఇంకా చాలా విషయాలల్లో కమిషన్ ఏమి చెప్పిందో ఇంకా పూర్తిగా బయిటకు రాలేదు. కానీ చాలా రోజులనుండి ప్రజాస్వామికవాదులు శాష్ట్రీయ విద్యా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి ఇప్పటి ఈ కోవిడ్ 19 కాలం మంచి సందర్భం.  శాస్త్రీయ విద్యా అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. కా|| ఆకుల భూమయ్య సార్ శాష్ట్రీయ విద్యా పైన చాలా చక్కటి సూచనలతో ఒక పుస్తకం రాశారు. పూర్వకాలం లో విద్య మతాన్ని బోధించేది గా ఉంటే పారిశ్రామిక విప్లవం తర్వాత  పెట్టుబడిదారులకు వాళ్ళ సంపదలు ఇబ్బడి ముబ్బడిగా పెంచే ఒక వనరుగా విద్య ను కొనసాగిస్తున్నారు. భూమి, పర్యావరణం లో భాగమైన ప్రకృతి, జీవజాలం, మనిషి పరస్పర సహకారం తో సహజీవనం చేయడానికి విద్య దోహద పడాలి. అందుకు భూమి, పర్యావరణం, ప్రకృతి సూత్రాలు,  కుటుంబం, సమాజం, ఆహారం, ఆరోగ్యం గురించిన విద్య , విద్యార్థుల వయస్సు ను  దృస్టిలో   పెట్టుకొని ఆయా స్తాయిలకు తగ్గట్టుగా  కరిక్యులం రూపొందించబడాలి. రూపొందించిన కరిక్యులం బోధనకోసం పెడగాజి తోడ్పడాలి. 


ప్రైవేట్ పాఠశాలలు ఒకనాటికి వలె పోల్ట్రీ ఫార్మ్ కేజ్  లల్లో కోడిపిల్లలను ఉంచినట్లు గా ఇప్పుడు పిల్లలను ఉంచి చదువు చెపుతామంటే విచక్షణ జ్ఞానం ఉన్న ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. ఆన్లైన్ బోధనల వలన 70% పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదని సర్వేలు చెబుతున్నాయి. మరి పరిష్కారం ఏమిటి అంటే? సమాఖ్య భావజాలం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలం నుండి డిమాండ్ చేస్తూ వస్తున్నట్లుగా ఇప్పుడు నైబర్ హుడ్ స్కూల్స్ కావాలి. అంటే ఒక వెయ్యి పదిహేను వందల జనాబాకు వారికి నడిచి పోవడానికి అనుకూలమైనంత దూరం లో ఆన్ని సౌకర్యాలతో , చాలినంత మంది ఉపాధ్యాయులతో చక్కని పాఠశాల ఉండాలి.రెండో అంశం  కామన్ స్కూల్స్  కావాలి. అంటే ఆ ఆవాసం లో ఉన్న అందరూ పిల్లలు అదే బడిలో చదువుకోవాలి. ఎక్కడికంటే అక్కడికి ఎత్తిపంపే విధానం రద్దుచేయాలి. ప్రపంచం లో ఎక్కడ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ పద్దతి లేదు. తలిదండ్రుల పెంపకం ,ప్రేమ నుండి దూరం చేసే ఈ దుర్మార్గమైన పద్దతి కేవలం మన దేశం లో అదీ ప్రధానంగా దక్షిణ భారత దేశం లోనే ఎక్కువగా కనిపిస్తున్నది. దానికి సర్కార్లు ఓ  వత్తాసు.


పౌరసమాజం, తలిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు  కోవిడ్ 19 సందర్భాన్ని అయినా పురస్కరించుకొని నైబర్ హుడ్, కామన్ స్కూల్ విధానం కోసం ఇప్పుడైనా ఉద్యమించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తారని ఆశిస్తున్నాము . చాలు,  ఇక చాలు.  మన మన వ్యక్తిగత స్వార్థాల కోసం, మొత్తం సమాజపు బాగుకోరే  మంచి విద్యావిధానాన్ని అమలు పరుచుకోలేని  కారణంగా ఇప్పటికే మన సమాజం చాలా నస్టపోయింది . ఒక ఆహార స్పృహ, ఒక ఆరోగ్య స్పృహ, ఒక సోదరభావం , కరుణ,దయ, జాలి, బాధ్యత, ప్రశ్నించే తత్వం అడుగంటి పోయిన ఒక స్వార్థపూరిత సమాజం లో బతుకుతున్నాం. సరైన విద్యా విధానం ఉంటే వీటన్నిటిని చక్కదిద్దుకోవచ్చు. ఎలా ఆచరణలోకి తెద్దాం ఆలోచించండి !


వీరగొని పెంటయ్య 

రాష్ట్ర ఉపాధ్యక్షులు,

REBS ( రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ)