Thursday, December 24, 2015

భూమి పుత్రుడు భూమయ్య సార్ !

 భూమి పుత్రుడు భూమయ్య సార్ !
               (24 డిసెంబర్ నాడు భూమయ్య సార్ 2 వ వర్ధంతి సందర్భంగా)
ఒక మామూలు వ్యవసాయ కుటుంబం లో పుట్టి పెరిగిన ఆకుల భూమయ్య అనే ఒక సాధారణ మనిషి ని   “భూమయ్య సార్ “ అని సమాజం ఎందుకు మన్నించిదో ఆలోచించాల్సిన విషయం.
తొలి సంతానం అనారోగ్యం తో చనిపోయినపుడు మాలి సంతానమైన భూమయ్యను పుట్టగానే భూమి పైన వేసి  ఓ భూమాతా ! మా బిడ్డ ను నీవే కాపాడాలని వేడుకుంటారు. ఆ సాంప్రదాయం తెలంగాణ గ్రామాలల్లో ఉంది. భూమిని తొక్కినా , తన్నినా,తవ్వినా, దున్నినా, కాల్చినా,పేల్చినా  నశించ కుండా ఉన్నట్టుగానే మా బిడ్డడు గూడా భూమి తీరుగా చిరంజీవి గా బతుకాలని ఆ తల్లిదండ్రుల తంద్లాట.
ఆయన పాఠశాల విద్య పెద్దపల్లి హైస్కూల్ లో జరిగింది. తెలంగాణ సాయుయధ పోరాట యోధుడు గట్టే పల్లి మురళిధర రావు వెద జల్లిన విప్లవ విత్తనాలు మొలకెత్తనున్న నేల . గొప్ప గణిత బోధకుడైన దేశికా చార్యులు మెచ్చిన విద్యార్థి తను.1968 లో హైస్కూల్ చదువు అయిపోయి డాక్టర్ కావాలన్న కోర్కె తోకరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో P U C చదువుతుండగా తొలి దశ తెలంగాణ ఉద్యమం బద్దలైంది.ఉద్యమం లో ముందు వరుసలో ఉన్నాడు కనుక అరెస్టయి జైలుకు వెల్లిండు.జైలు నుండి బయటకు రాగానే తెలంగాణ వ్యాప్తంగా ఎటు జూసీనా శ్రీకాకుళోద్యమము నుండి ఎగసిపడ్డ విప్లవ నిప్పురవ్వలు దావానలమై మండుతున్నై. విద్య సంస్తలన్నింటికి సెలవులు ప్రకటించారు. విప్లవ రాజకీయాలు అధ్యయనం జేయడానికి కావలసినంత సమయం దొరికింది. ఇదే కాలం లో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న చాలా మంది యువకులు కేవలం తెలంగాణ సంకెళ్ళను తొలగించడం మాత్రమే గాకుండా భారత దేశం తో బాటుగా ప్రపంచ ప్రజల ను కట్టి వేసిన పెట్టుబడి దారి వ్యవస్త కబంద హస్తాలనుండి బంధ విముక్తుల్ని చేయాలన్న సంకల్పం తో జీవన్మరణ పోరాటాల బాటను ఎంచుకున్నారు. ఆ క్రమం లో ముందుకు వచ్చిన భూమయ్య జమ్మికుంట ఆదర్శ కాలేజీ లో బి. యస్సీ. చదువుతూ ఎంవీ తిరుపతయ్య తెలుగు ఉపన్యాసకుల పాఠాలు వింటూ నల్ల ఆదిరెడ్డి , శనిగరం వెంకటేశ్వర్లు( సాహు) ల సాహచర్యం లో విప్లవ బాటలోకి వచ్చిందంటే “పట్టిన ఆ ఎర్ర జండా ప్రాణముండగ విడువలేదు.”
1975 జూన్ లో వచ్చిన ఎమర్జెన్సీ  భూమయ్యను మళ్ళీ జైలుకు పంపింది. 1977 లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత బయిటకు వచ్చిన ఆ నాటి యువత తమ కుటుంబ జీవితాలను, వ్యక్తిగత సుఖ సంతోషాలను తృణ ప్రాయంగా భావించి ప్రజలందరి సుఖ సంతోషాల కోసం విప్లవాల బాట పట్టినారు. 1978 రాడికల్ విద్యార్థి సంగం వరంగల్ సభల తర్వాత “గ్రామాలకు తరలండి” అన్న పిలుపు ఇచ్చింది. వందలాదిగా వచ్చి చేరుతున్న కొత్త క్యాడర్ కు రాజకీయ పాఠాలు బోధించాలి. అప్పటికే ఉపాధ్యయు డు  గా ఉన్న భూమయ్యకు ఆ బాధ్యత అప్పగించ బడింది. 1978 నుండి ఈ 35 సం. ల సుదీర్ఘ కాలం భూమయ్య కేవలం బడిలో పాఠాలు జెప్పే పంతులు గా మాత్రమే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ పాఠాలు జెప్పే “సారు” గా స్తిరపడి పోయినందున ఆయన పేరు భూమయ్య సారు గా స్తిరపడిపోయింది.
సమాజ పురోగమనానికి మార్గ దర్హ్సకత్వం వహించే ది  విద్య. ఆ విద్య రంగం లో తాను ఉపాధ్యాయుడుగా పనిజేస్తౌన్నందున ఊయపాధ్యాయ రంగా సమస్యల పైన , విద్యారంగాన్ని సమూలంగా సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చాలన్న డిమాండ్ తో పోరాటం జేసె అవకాశం తనకు వచ్చింది. అందు కోసం అంతవరదాకా తాను పనిజేస్తున్న పి ఆర్ టి యు  పరిధి సరిపోలేదు. దానికి తోడు 1981 లో జమ్మికుంట లో జరిగిన పియర్టియు దశాబ్ది ఉత్సవాల్లో వీరు ప్రజా రాజకీయాల ఎజెండాను ముందుకు తెచ్చారు. మార్పు కు ఇస్ట పడని బ్రాహ్మణ భావజాల వాదులు ఉద్యమాన్ని ముందుకు పోకుండా మోకాలడ్డినారు. వారితో వేగలేక అప్పటికి కొంత ప్రజాస్వామికంగా ఉండే ఎపేటిఎఫ్ సంఘాన్ని 1983 లో తెలంగాణకు విస్తరింప జేయడం లో భూమయ్య సార్ ప్రధాన పాత్ర పోషించారు.
ఆనాటికి నక్సల్బరి పోరాటాల చేత ప్రభావితు లైన ఉపాధ్యాయులు ఎపిటిఎఫ్ నిర్మాణం లో కలిసి వచ్చినారు. అది ఉపాధ్యాయ ఉద్యమం గానీ, అది రైతాంగ ఉద్యమం గానీ, అది యువజన ఉద్యమం గానీ, అవి ఏవైనా అవి కేవలం తమ కోసం మాత్రమే గాదు మొత్తం సమాజం మార్పుకోసం జరుగుతున్నా పోరాటాలుగా గుర్తించారు. మొత్తం సమాజ సమస్యలు పరిష్కరించ బడినపుడే తమ సమస్యలు గూడా పరిష్కరింప బాదుతాయి తప్పితే కేవలం తమ సమస్యలు విడిగా పరిష్కరింప బడవు అన్న అవగాహనతో ఉద్యమాలు సాగుతుండేవి.
ఈ 35 సం.ల ఉద్యమ కాలం లో ఆయన జరిపిన పోరాటాలను రెండు గా విభజిస్తే 1. ప్రత్యక్ష పోరాటాలు. 2. బౌధ్ధిక పోరాటాలు. ప్రత్యక్ష పోరాటాల్లో రెండు అతి ముఖ్యమైనవైతే అందులో మొదటిది విద్యారంగం లోని అవినీతి అయితే రెండవది ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ అయిడెడ్ ఉపాధ్యాయుల పోరాటం.1987-88 ఎన్టీ రామా రావ్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం  లో జీవో 370 తెచ్చి వేలాది మంది ఉపాధ్యాయులను వారి వారి స్వత డివిసన్ల నుండి దూరంగా బదిలీ జేసినాడు.అధికారుల రాజకీయ నాయకుల చేతివాటం చెప్పనలవి గాలేదు. ఉపాధ్యాయులందరిని ఏక తాటి పైకి తెచ్చి జీవో రద్దు కై పోరాటం జేసినాడు. 1989-90 లో కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల , జమ్మికుంట,లాంటి జన సమ్మర్దం ఉన్న చోట ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఉపాధ్యాయులను కట్టుబానిసలకంటే హీనంగా చూస్తున్న కాలం. వారికి అండ గా అధికారులు రాజకీయ నాయకులు . భూమయ్య సార్ నాయకత్వం లో నిరవధిక సమ్మెలు, బంధు లు జరిపి ఆనాటి జిల్లా కలెక్టర్ ఐ వి సుబ్బ రావు గారి తో ఒక రాత్రంతా ఇల్లందు గెస్ట్ హౌస్ లో చర్చలు జరిపి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేశారు.
ఇక బౌధ్ధిక రంగం అంటే విధ్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చాలనీ, వివిధ యాజమాన్యాల్లోని విధ్యను ఒకే గొడుగు కిందకు చేర్చి కామన్ స్కూల్ విధానం ద్వారా ఒక ప్రాంతం లో నివశిస్తున్న వారెవరైనా గానీ ఆ ఆవాసం లోని పాఠశాలలోనే చదివించాలనే నిబంధన ఉండాలని, అలాగే ఆశాష్ట్రీయమై, ప్రజల నిత్య జీవితాలతో సంబంధం లేని తలకిందుల కారికులం స్తనం లో ఆయా ప్రాంతం లోని వనరులను ఉపయోగించుకొని ఉపాధి పొందుతూ స్వయం సంపూర్ణ వ్యవస్త ల  నిర్మాణానికి తోడ్పడే విద్యావిధానం కొరకు ఆయన కృషి చేసినారు.ఇదేదో నినాద రూపం కాకుండా ఆచరణలో ఎట్లా సాధ్య పడుతుందో చూపడం కోసం 1998 వేసవి లో ధర్మపురి లో వర్క్ షాప్ నిర్వహించి తరగతుల వారీగా విషయాల వారీగా నిష్ణాతులతో చర్చలు జరిపి ఆ సారాంశాన్ని క్రోడీకరించి  2012 లో “ శాష్ట్రీయ విద్య విధానం “ అనే ఒక పుస్తక రచన జెసి ప్రచురించాడు.
ఇక పోతే భౌగోళికంగా నైనా సాకారం అయిన తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ లోని అన్నీ మండలాల్లో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి నమూనా అన్న అంశం పైన జయా శంకర్, బియ్యాల జనార్ధన్ రావు తో అనేక సభలు సమావేశాలు ఆయన నాయకత్వం లో నిర్వహించ బడ్డాయి.ఇక తెలంగాణ ఏర్పాటు కోసం 1969 నుండి తాను కృషి చేస్తూ 1997 లో వరంగల్ డిక్లరేషన్ రావడానికి కీలక పాత్ర పోషించాడు. 1998 లో తెలంగాణ జనసభ కు సార్ కన్వీనర్ గా రాజ్యం తో రాజీలేని పోరాటం జేసినాడు. ఒక వైపు తన సహచరులైన  బెల్లి లలితా, కనకా చారి, ఆయిలన్న, చంద్రమౌళి, నల్ల సంపత్ , సుదర్శన్, వెంకటేశ్వర్లు లాంటి వారు ప్రభుత్వ ఫాసిస్టు దమన కాండ లో బలై రాలిపోతున్నా గూడా మొక్క వోని ధైర్యం తో నిలబడి ఒంటరి పోరాటం జేసినాడు.
తెలంగాణ జనసభ పైన అప్రకటిత నిషేధం వస్తే ఐక్య కార్యాచరణ కమిటీ, అది కూడా సాగనప్పుడు తెలంగాణ ప్రజాఫ్రంట్ ఇలా ఎప్పటికేది అవసరమైతే దాన్ని ఆలంబనగా జేసుకొని తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాటం జేసినాడు.భౌగోళిక తెలంగాణ తో ప్రజల బాధలు తీరవని ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ఏజండా పైకి తెచ్చాడు.1/70 చట్టం అమలుచేయకుండా పోలవరం కట్టి గిరిజనులను ముంచివేసి , ఓపెన్ కాస్ట్ మైన్స్ , గ్రానైట్ క్వారీస్, ఇసుక రీచులు, మొత్తంగా వనరులన్నింటిని కొల్లగొడుతూ గుట్ట పెట్టుబడి దార్లకు భూ పందేరమ్ జేస్తూ బడుగు జీవుల బతుకులు బుగ్గి జేసె తెలంగాణ గాకుండా అందరూ సమానంగా ప్రజాస్వామ్యయుతంగా జీవించే తెలంగాణ కొరకు 24 డిసెంబర్ 2013 నాడు బషీర్భాగ్ ప్రెస్ క్లబ్ లో “ప్రజాస్వామిక తెలంగాణ చారిత్రక పత్రాలు” ఆవిష్కరించి అమరులందరిని పేరు పేరున కొనియాడి అర్థాంతరంగా తన గమ్యం నుండి వైదొలిగి పోవడం ప్రజాస్వామిక తెలంగాణ లక్షయానికి తీవ్ర విఘాతం కలిగింది.భూమయ్య సార్ గనుక బతికి ఉన్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నఅపసవ్య విధానాలపై తప్పకుండ ఏదో ఒక ఉద్యమ నిర్మాణం జరిగి ఉండేది. ఆయన వారసులమ్ అని చెప్పుకుంటున్న వారందరము మరో ఉంద్యమానికి సన్నద్దము కావలిసిన అవసరాన్ని గుర్తించాలి .

Saturday, June 13, 2015

అయిదు లక్షల బీమా కాదు -- ఆరోగ్యకరమైన నీరా ప్రవేశ పెట్టాలి !

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అన్నీ సామాజిక వర్గాలకు అన్న పానాదులకు ఆసరా ఉంటుందన్న ఆశతో సబ్బండ వర్ణాల ప్రజలు ఎంతటి వ్యయ ప్రయాసలకైనా ఓర్చుకొని అది మిలియన్ మార్చ్ గానీ, అది సకల జనుల సమ్మె గానీ, అది సాగర హారం గానీ , రాస్తా రోకో గానే రైల్ రోకో గానీ అందరికందరు పాల్గొన్నారు.

  పోలీస్ కిస్టయ్య ఆత్మార్పణ నుండి సమైక్యాంధ్ర ఉద్యోగుల సభలో " జై తెలంగాణ " అని నినదించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ దాకా గౌడ సామాజిక వర్గాల బిడ్డలెందరో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారు .

  తెలంగాణ వచ్చింది . ఏడాది గడిచింది. హైద్రాబాద్ లో కల్లు కాంపౌండులు ఖులాయించిండ్రు.సిటీ లో ఉన్న కొద్ది మంది బడా సేట్ల నసీబ్ ఖులాయించింది. రెవెన్యూ పెంచుకోవాలన్న యావలో బడ్డ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను గానీ గీతా కార్మికుల బ్రతుకు దెరువు గురించిగానీ పట్టించుకోకుండా గ్రామ గ్రామాన బెల్టు షాపుల పేరుతో ప్రబుత్వమే చట్ట వ్యతిరేకంగా ఆల్కహాలిక్ డ్రింకుల అమ్మకాలకు పాల్పడింది. దీనితో కల్లు అమ్మకాలు పూర్తిగా మందగింప జెసి ప్రభుత్వమే  గీత కార్మికుల మెడలు విరిచింది. ఔషధీయుక్తమై , విటమిన్స్, మినరల్స్   సమ పాళ్ళలో ఉండే కల్లు,నీర స్తానమ్ లో చీప్ లిక్కర్లు తాగి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ చర్య వారి ఆరోగ్యాలను బొంద బెట్టింది.

  ఇది చాలదన్నట్లుగా ! ఇపుడు కొత్తగా గుడుంబాను అరికట్టే పేరుతో ప్రభుత్వమే తానే సర్కారు సారానో, లేక రూ|| 30/ కి 180 యామ్. ఎల్ . చీప్ లిక్కర్ తో ప్రజల వాకిల్ల ముందర అంగళ్ళు తెరవడానికి ముందుకు వస్తున్నది. ప్రస్తుతం ఉన్న 2216 లైసెన్సుడ్ షాపులు, వేలాది బెల్ట్ షాపులకు తోడు గా మరో 900 లైసెన్సుడ్ షాపులు తెరుస్తుందట. 11 వేల జనాభాకు ఒక లైసెన్సుడ్ షాప్. ఆన్ లైసెన్సుడ్ కు లెక్కే లేదు. ఇపుడు సాలీన 20 వేల కోట్ల రూపాయల ఆదాయపు టార్గెట్ కు తోడు మరో 12 వేల కోట్ల ఆదాయం పొందడానికి ప్రభుత్వం పథకం రచిస్తున్నది. మరో పక్షం రోజుల్లో ఇది అమలు లోకి వచ్చే అవకాశం ఉంది. 

  అంటే ఈ 32 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి తోడు బ్రేవరీస్ కంపనీలకు, వైన్ షాప్ ల సేట్లకు , రాజకీయ నాయకులకు, అధికార్లకు మామూల్లు. ఇవన్నీ సమకూరాలంటే ఓ లక్ష కోట్ల రూపాయల అమ్మకాలు జరుగాలి. .తాగుడుకు అలవాటైన వాళ్ళు, తాగుడు ప్యాషన్ అనుకొనే వాళ్ళు విలువైన తమ ఆరోగ్యాలను ఫణంగా  పెట్టి ప్రభుత్వ రెవెన్యూ పెంచే కృషి చేస్తున్నరు.

      ఇది జరుగుతే , 5 లస్ఖల మంది గీత కార్మికులు ఉత్పత్తి జేసిన కల్లు కు మార్కెటింగ్ లేక వాళ్ళు రోడ్డున పడుతారు. బడా పెట్టు బడి దారులైన బ్రేవరీస్ కంపనీలకు , మొలాసిస్ ఉత్పత్తి దారులకు , రెక్టిఫైడ్ స్పిరిట్  ఉత్పత్తి దారులకు మొత్తంగా మార్కెట్ ను ధారా దత్తం జేస్తూ శ్రమ జేసుకొని బతికే గీత కార్మికులకు చేతి లో పని లేకుండా జెసి బడా బాబులకు బంగారు తెలంగాణ సిద్ధింప జేసె కృషిలో ప్రభుత్వం కృతకుత్యమ్ అవుతుంది. 

   ఆ కృషి లో భాగంగానే జూన్ 10 నాడు ఉద్యమాల పితా మహుడైన మన ముఖ్య మంత్రి గారు గీత కార్మికులకు 5 లక్షల రూ|| ప్రమాద భీమా ప్రకటించిండు. ఈ ప్రమాద భీమ గీత కార్మికులకు కొత్తదేమీ గాదు . రాజశేకర్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న కాలం లో గీత కార్మిక కుటుంబ నేపథ్యం కలిగిన అనేక మంది అయితే ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కాకుంటే పార్లమెంటరీ రాజకీయాల వైపు మును ముందుకు వస్తున్నందున తమ రాజకీయాధికారానికి ఎక్కడ ఎసరు వస్తుందో అని భయ పడి వారి ఆర్థిక మూలాలు దెబ్బ దీయడానికి నూతన ఎక్సైజ్ పాలసీ తెచ్చిండు. అందులో భాగంగానే చెట్టు పై నుండి పడి చని పోతే అప్పటి దాకా ఇస్తున్న 50 వేల రూ|| ఎక్స్ గ్రేషియా స్తానమ్ లో 2 లక్షల రూ|| ఇన్సూరెన్స్ పథకం తెచ్చిండు. ఇదేదో గొప్ప పనే అనుకోని సంబుర పడ్డారు.కానీ ఆ వచ్చే 50 వేలూ రాక ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఇన్సూరెన్స్ వాళ్ళు  కొర్రీలు వేసి నస్ట పరిహారం ఇవ్వక పోగా ప్రభుత్వం నుండి లక్షలాది రూ|| ల ప్ర్రెమియమ్ ను పొందినారు. గీత కార్మికుల నోళ్ళు కొట్టి ఇన్సూరెన్స్ వాల్ల జేబులు నింపే పనే ఈ ఇన్సూరెన్స్ అని గీత కార్మికులు గ్రహించి ఉద్యమాల ద్వారా తిరిగి ఎక్స్ గ్రేషియా 2 లక్షలు సాధించుకున్నరు.

   గీత వృత్తిని పాతాళానికి తోక్కే కొత్త ఎక్సజ్ పాలసీ రేపటి నెల నుండి రానున్నందున దాన్నుండి గీత కార్మికుల దృష్టి మరల్చే కొరకు ఈ రూ|| 5 లక్షల. ప్రమాద  బీమా పథకం ప్రకటన అని గీత కార్మికులు గమనించాలి. 5 లక్షల ప్రమాద బీమా కావాలనుకుంటే మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన బీమా యోజన లో సాలీన రూ|| 342. కడితే ఎవరికైనా రూ|| 5 లక్షల ప్రమాద కవరేజి వర్తిస్తుంది. 

   ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రం లో 2 లక్షల మంది గీత కార్మికులు ఉన్నారు. ఇందులో రిజిస్టర్డ్ సొసైటీ లో సభ్యులైన వారికే ఈ సౌకర్యం వర్తిస్తుందట. అంటే అట్టి వారు ఓ లక్ష మంది కంటే మించక పోవచ్చు. ప్రతి సభ్యునికి సాలీన 342 రూ|| ల చొప్పున 3 కోట్ల 42 లక్షల ఇన్సూరెన్స్ కంపనీలకు అప్పనంగా అప్పజెపితే ఇక రేపటి నుండి చనిపోయిన , లేదా అంగవికలురైన గీత కార్మిక కుటుంబ సభ్యులు చెట్టు పై నుండి పడి దవాఖానలో శరీఖ్ అయ్యింది మొదలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే దాకా ఇన్సూరెన్స్ కంపనీల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఇన్సూరెన్స్ డబ్బులు పొంద  లేక  ఇప్పుడు వచ్చే రూ|| 2 లక్షలు, 50 వేలు, 25 వేలు, సైతం రాక బికార్ల వలె బిచ్చం ఎత్తుకొనే దరిద్రపు పరిస్తితిని కల్పించ బోతున్న ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ వృత్తి వద్దూ ఈ పడుడు వద్దూ  ఈ చచ్చుడు వద్దూ కాళ్ళు చేతులు , నడుమూ వెన్నుపూస విరుగ గొట్టుకొని చచ్చే దాకా జీవ చ్ఛవం  వలె మంచం లో పడి ఉండుడు వద్దూ , ఈ మోకు వద్దూ, ఏ ముత్తాదు వద్దూ మొత్తంగా ఈ వృత్తే వద్దని ఏ ఆటో రిక్షా డ్రైవర్ గానో  , అడ్డ కూలీగానో మారే దురవస్త వైపు ప్రభుత్వ విధానాలు నెట్టి వేస్తున్నాయి.

  ఈ విధానాలే కొనసాగితే ఎవరికి లాభమో ? ఎవరికి నస్టమో ? ఆలోచిస్తే ! ఆల్కహాలిక్ డ్రింకులు తయారు జేసె బ్రేవరీస్ కంపనీలకు, డిస్ట్రిబూటర్లకు, వైన్ షాప్ ల యజమానులకు ,కూల్ డ్రింక్స్ తయారు జేస్తున్న మల్టీ నేషనల్ కంపనీలకు, అమ్మకం దారులకు, వీటి నుండి ఆదాయం, మామూల్లు పొందే రాజకీయ నాయకులకు, వీటన్నింటినీ కంట్రోల్ జేసె ప్రభుత్వ ఉద్యోగులకు లాభం. వీరెవ్వరు గూడా రెక్కలు దప్ప మరే ఆస్తి పాస్తులు లేని వారు గారు. వీరెవ్వరు గూడ దినం శ్రమను నమ్ము కొని జీవించే వారు గాదు.
   
   ఆరోగ్యకరమైన , ప్రకృతి సహజ సిద్దమైన , అన్ని సందర్భాలలో నిరభ్యంతరంగా, నిరపాయకరంగా, కుటుంబ సభ్యులంతా సేవించ దగ్గ మినరల్స్, విటమిన్స్, సమ పాళ్ళలో ఉన్న నీర మరియు కల్లు కాను మరుగైతే సామాన్య ప్రజల ఆరోగ్యాలకు నస్టమ్ . గీత వృత్తి పోవడం తో ఆ వృత్తి దారులు ఇతర వృత్తుల వైపు వెళ్ళడం వలన శ్రమ జీవుల నిరుద్యోగ రిజర్వ్ ఫోర్స్ పెరిగి శ్రామికుల నిజ వేతనాలు పడిపోతాయి. కనుక శ్రామిక వర్గాలకు ఎనలేని నస్టమ్ జరుగుతుంది.

  ఇంతెందుకు గొప్ప గొప్ప ఆదర్శాలు వల్లిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను, గీత కార్మికుల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ప్రభుత్వం వలె నీర ను మినహాయించి సంపూర్ణ మద్య పాన నిషేదం ఎందుకు విధించరని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది.

    రాష్ట్రం లో హరిత హారం మరియు మిషన్ కాకతీయ లో భాగంగా 48 లక్షల ఈత మొక్కలు నాట బోతున్నట్లు  గొప్పగా చెబుతున్నారు. కనుక ఆ చెట్ల నుండి వచ్చే పానీయానికి కాంబోడియా దేశం లో వలె ఒక పరిశ్రమ స్తాయికి తీసుకొని వస్తే లక్షలాది మందికి చక్కని ఉపాధి లభిస్తుంది. ప్రజలకు పురుగుమందు కలిసిన కూల్ డ్రింక్స్ త్రాగే బెడద తప్పుతుంది.వారికి ఆరోగ్యం చేకూరుతుంది. అంటే గాకుండా సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన పానీయాన్ని తమ ప్రాణాలు ఫణమొడ్డి చెట్టుపై నుండి దించి తెస్తున్న గీత కార్మికులు ప్రామాదాల బారిన పడినపుడు వారి కుటుంబాలను ఆడుకోవాల్సిన బాధ్యత మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వాలదే. కనుక చెట్టు పై నుండి పది చని పోతే 10 లక్షలు, అంగ వికలురు అయితే 5 లక్షల ఎక్స్ గ్రేషియా తక్షణమే చెల్లించే ఏర్పారు ఉండాలి. కల్తీకి తావు లేని విధంగా చెట్టు వద్దనే అది నీరా ఐనా కల్లు అయినా సేకరించి ప్రాసెసింగ్, చిల్లింగ్ , మార్కెటింగ్ కై విధాన రూప కల్పన జరుగాలి. దేనిపై శాష్ట్రీయ పరిశోధన నిరంతరం జరిగి ప్రజల ఉపాధి, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ పథకాలు కొనసాగాలి . అంతే గాని  ప్రజల ఆరోగ్యాలకు ఉపాధి అవకాశాలకు విఘాతం కలిగించే చర్యలను సామాన్య ప్రజలెప్పుడు స్వాగతించరు.


     వీరగొని పెంటయ్య గౌడ్,

         అధ్యక్షులు,

 సర్వాయి పాపన్న గీత కార్మిక  సంఘం.

Sunday, April 26, 2015

child labor !

 అది 2002 జూన్ మాసం.తొలకరి వానలు పలకరించినయి. ప్రబుత్వ పాఠశాలలు ప్రారంభానికి ముందు సర్కారు జేసె జిమిక్కులో భాగంగా బడి పండుగ అని అధికారులు ఆగమ్ ఆగమ్ చేస్తున్నరు . ఆనాటి జిల్లా కలెక్టర్ కు అత్యంత ప్రాధాన్యత అంశం పిల్లల చదువులు .ఆమె గోదావరిఖని వెళ్తున్నప్పుడు ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద ఒక పిల్ల వాడు బడికి పోకుండా సోడా బండి  వద్ద పనిజేస్తున్న విషయం గమనించి వెంటనే పెద్దపల్లి ఆర్ డి వో గారికి సమాచారం ఇచ్చిందట. వెంటనే విషయం మాకు చెరింది . ధర్మారం ఎక్స్ రోడ్ వద్దకు చేరుకొనే సరికి దాదాపు ఒక కిలోమీటర్ మేర దట్టమైన రాతి దుమ్ము ఆవరించి ఉంది. ఒక నాడు ఎత్తైన గుట్టలు ఇప్పుడు కొంచెం కొంచెం కోరుక్కు తిన్నట్టు చాలా వరకు అదృశ్యం అయినయి.అంతకంటే  కొద్ది రోజులకు
ముందే క్వారీ బ్లాస్టింగు లో ఒక కార్మికుడు మరో బాల కార్మికుడు చని   పోయినారు.

  వెళ్ళే టప్పుడు పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను  కూడా వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. సోడా బండి వద్ద ఒక పిల్లవాడు సోడాలు కొట్టి ఇస్తున్నాడు. బండి యజమాని డబ్బులు తీసుకుంటున్నాడు.లేబర్ ఆఫీసర్ బండి యజమాని వద్దకు వెళ్ళి తన పరిచయం చేసుకొని పిల్ల వాణ్ని పనిలో పెట్టుకోవడం నేరం . నీవు నేరస్తునివి స్టేషన్ కు నడువ్ అని గద్దరాయించిండు .

      ఆయన దండం దాశన పెడుతూ " అయ్యా ఈ పొల్లగాని అమ్మమ్మ ఒక్క తీరుగా బతిమిలాడితే కాదన లేక ఎంతో కొంత డబ్బులిస్తే నాకింత ఆసరా అయితడని వాల్ల అక్కెర తీర్తదని పనికి రమ్మన్న గాని , ఈ పొల్లగాడు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. గీ సోడా బండి మీద వెయిలు సంపాయిత్తనా సార్. నీ  దండం బెడుత నన్ను విడిచి పెట్టుమని "కాళ్లా వెల్లా బతిమిలాడిండు . మా టార్గెట్ కూడా పిల్లవాన్ని బడిలో చేర్చడమే గాని బండి యజమాని పైన కేసు చేయడం కాదు కనుక పిల్లవాన్ని పట్టుకొని జీపు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నం . వాడు బాగా ఏడుస్తున్నడు , ఈ కొత్త వాళ్ళు తనను ఎక్కడికి తీసుక పొతారో అన్న భయం తో ఏడుస్తున్నాడనుకొని మేము తనకు హాని చేయమనీ కొత్త పుస్తకాలు బట్టలు ఇచ్చి బడిలో చేర్పిస్తామని ఉండడానికి హాస్టలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని బుజ్జగిస్తూ చెప్తున్నం . కానీ అసలు వినడం లేదు . జీపు ఎక్క నంటే ఎక్క అంటూ గింజుకుంటున్నడు.నేను బతిమిలాడు తున్న , ఇంతల మా సహాయకులు పిల్ల వాన్ని బలవంతంగా జీపులో ఎక్కించిండ్రు . జీపు పెద్దపల్లి వైపు బయల్దేరింది. పిల్లలు అట్లాగే భయపడి మారాం చేస్తారు సార్ , అక్కడ హాస్టల్ లో ఉన్న పిల్లలను చూసిన తర్వాత సంతోష పడి ఉండి పోతారు మీరు ఫికర్ చేయకండి అంటూ మా సహాయకులు చెప్పడం తో మేము సరే లెమ్మని . జిల్లా కలెక్టర్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నం.మేము ఆఫీస్ వద్ద దిగి పోయినమ్ . జీప్ పిల్లవాన్ని తీసుకొని హాస్టల్ కు వెళ్ళి పోయింది.

    సాయంత్రం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత పిల్లవాడు అడ్జస్ట్ అయినాడా లేదా అని తెల్సుకోవడానికి హాస్టల్ కు వెళ్ళిన. వార్డన్ ఎదురుగా వచ్చి" మధ్యాహ్నం మీరు పంపిన అబ్బాయి
ఇంత వరదాకా ఏడుపు ఆపలేదు, అన్నం తిన లేదు ఎక్కెక్కి పడుతూ ఏదో యాదికి జేసుకుంటూ యాదికి జేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నడు సార్ " అని చెప్పిండు.
    నేను అంధోలనగా పిల్లవాని దగ్గరకు పోయి దగ్గరకు తీసుకొని అనునయిస్తూ భుజం మీద చేయి వేయంగానే నా చేతిని విసురుగా తీసి వేసిండు. నేను చెప్పేది వినకుండా బిగ్గరగా ఏడుస్తున్నడు." అరె ! చిన్న నువ్వు ఏడువకు ఇక్కడ ఉండకుంటే మానాయే , ఇప్పుడే నిన్ను నేను మీ ఇంటి వద్ద దించి వస్తా . కానీ ఇక్కడ నీకు మంచిగ లేదా? అక్కడనే మంచిగ
ఉన్నదా" అంటే చప్పుడు చేయడు.
  బతిమాలంగా బతిమాలంగా నోరు విప్పిండు. తన పేరు రాజు అనీ తనకు ఆరు నెలల వయసున్న చిన్న చెల్లెలు , ముసలి అమ్మమ్మ ఉన్నారని చెప్పిండు.
  వాళ్ళను విడిచి పెట్టి వాల్ల నాన్న ఎటో వెళ్లిపోతే అమ్మమ్మ దగ్గర ఉంటున్నారట. ఈ మధ్యన్నే అమ్మ చనిపోయిందట. మరి మీకు రోజూ అన్నం ఎట్లా అని అడిగిన.
 " నేను రోజూ ఏదో ఒక పని చేస్త . ఆ పైసల తోటి మా చెల్లే కు మా అమ్మమ్మ పాలు కొనుక్క వచ్చి పోస్తాది . పాచి పని చేసి రాంగ అమ్మమ్మ అడుక్క వచ్చే బువ్వ తింటం " అన్నాడు.
 కడుపు తరుక్క పోయింది
  ఆఖరుకు వాడు చెప్పిన మాటకు నా కండ్ల వెంట నీళ్ళు వచ్చినయి...
  " సారూ ! మా చెల్లే ఏడుత్తాంది గావచ్చు పొద్దటి సంది దానికి పాలు లెవ్వు .సోడా బండి సేటు పైసలిచ్చినంక కొనుక్క పోతననుకున్న. అందుకనే నాకు ఏడుపు ఆగుతలేదు " అన్నాడు.
  చ! మేము ఏమి జేసీనం . వాని బతుకు బాగు జేయ బోయినట్లా !  ఆ పసి పాప ప్రాణం దీయ బోయి నట్లా అర్థం గాలేదు.

  వెంటనే డ్రైవర్ ను పిల్చి ఒక పాల పాకెట్ తెప్పించి ఆ పిల్ల వాన్ని జీపులో ఎక్కించుకొని ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న వాల్ల గుడిసె కు పోయినమ్. పిల్ల ఘోరంగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో సొమ్మ సిల్లి పోతే అమ్మలక్కలు వచ్చి పాలు పట్టినారట . మమ్ముల జూసిన ఆడవాళ్ళు ఒక్క సారిగా మా పైకి గయ్యి మని లేచిండ్రు. సిగ్గు తో చచ్చి పోయినమ్.
  పదమూడు ఏండ్ల తర్వాత నిన్న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో 29 మంది బాల కార్మికులను గుర్తించినట్లు వార్త వస్తే ! జ్ఞాపకాల పాతర తెరుచుకున్నది. పేదల ఆర్టిక స్తితి గతుల్లో మార్పు తేకుండా బాల కార్మికులు అని వాళ్ళను పట్టి తెస్తే సమస్య పరిస్కారం కాలేక పోతున్నది.

పెంటయ్య వీరగొని.
విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి .
కరీంనగర్

Thursday, March 26, 2015

రీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నదని చదివిన తర్వాత ఆ జిల్లా వాసిగా నా అనుభవం రాస్తున్నాను. ఒక 30 సంవస్తారాల కింద కరీంనగర్ జిల్లా లో గ్రానైట్ క్వారీలు అసలు లేకుందేటివి. ఆనాడు ప్రజలు ఈ గుట్టల పొంటి ఉన్న పచ్చిక మైదానాలల్లో గొర్రెలను మేపుకొని, ఆవులను,బర్రెలను మోపుకొని జీవిస్తూ ఉండే వారు. గుట్ట వెంట ఉన్న పేద వారైనగ్రామస్తులు కట్టెలు కొట్టుకొని పట్టణాల్లో అమ్మేవాళ్లు. మోదుగ ఆకులు తునికి ఆకులు సేకరించి విస్తర్లకు బీడీ లకు వాడేవాళ్లు. గుట్ట మొదళ్ళలో ఉండే ఇప్ప చెట్ల నుండి ఇప్ప పువ్వు. ఇప్ప పరుక సేకరించి అమ్ముకొని జీవించే వాళ్ళు. సీతా ఫలాలు ఓగు కాయలు బలుసు పండ్లు తవిశి బంక సేకరించి అమ్ముకొని జీవించే వాళ్ళు. గుట్ట ప్రారంభం లో ఉండే మైదానాలల్లో తాటి ఈత వనాల ను ఆసరా జేసుకొని గీతా వృత్తుల వాళ్ళు, చాపలు , బుట్టలు అల్లుకొనిజీవించే వాళ్ళకు   బ్రతుకు దెరువు ఉండేది. గుట్ట బందలకు పెట్టిన తేనె తెరల నుండి తేనె సేకరించి జీవించే వాళ్ళు.  ఇంత మందికి గుట్టలు ఆధారమై ఉండేవి. అంతే గాదు ఎన్నో వందల ఏళ్ల నుండి ఈ జీవన చక్రం ఆగి పోకుండా సాగుతున్నది.ఇంకా ఎన్ని వేల ఏండ్లయిన అరిగి పోనీ తరిగి పోనీ ఈ విధానం ఎలాగే కోన సాగే అవకాశం ఉంటుంది. గుట్ట మొదళ్ళలో ఉండే బావులల్లో నీళ్ళు పుష్కలంగా ఉండేటివి. వాటితో వ్యవసాయం నడిచేది. పది మందికి అన్నం దొరికేది, గుట్టల సమీపం లో వర్షాలు కూడా బాగా పదేవి. 
  ఇక పోతే గుట్టలను ఆసరా జేసుకొని కోతులు గుడ్డెలుగులు  జింకలు.నెమల్లు. .గడ్డలు గబ్బిలాలు. కొండ చిలువలు జీవిక్నేటివి. ఇదంతా ఒక జీవావరణ వలయం .
   గ్రానైట్ క్వారీలు వచ్చిన తర్వాత జీవ వైవిధ్యం విధ్వంసం అయింది. గుడ్డెలుగులు కోతులు కొండ చిలువలు గ్రామాలల్లో చేరినయి. పంటల దిగుబడి తగ్గింది. పంట పొలాల వైశాల్యం తగ్గింది. గ్రానైట్ ద్వారా ఏటా 200 కోట్ల రాయల్టీ ప్రభుత్వానికి వస్తున్నదట. కానీ 500 కోట్ల విలువగలిగిన రోడ్లు ధ్వంసం అయితున్నాయి . విలువ తెలియదు గాని మానేరు పై ఉన్న వంతెన పాడై పోయింది. .గ్రానైట్ క్వారీల వలన ఈ గుట్టలన్నీ అంతరించిన తర్వాత మళ్ళీ గుట్టలు మొలువవు కదా అప్పుడు ఇక్కడ జీవించే ప్రజలకు జీవనోపాధి ఉండదు. ఇక్కడ చూడ వాల్సింది పెట్టుబడి దారులకు ప్రకృతి సంపద అప్పనంగా దోచి పెట్టడానికి ప్రభుత్వాలు ఆలోచించడం గాడు స్టానికంగా జెవ్విస్తున్న ప్రజల బ్రతుకు దెరువు ఎట్లా అన్నదే ప్రధానం. గ్రానైట్ క్వారీలు రాక ముందు ఇక్కడి ప్రజలు జీవించి నారు. గ్రానైట్ క్వారీల వలన గుట్టలు అంతరించి పోయినాంక ఇక్కడి ప్రజలు ఎలా బతుకాలో ప్రభుత్వం, ఆలోచనా పరులంతా ఆలోచించాల్సిన విషయం.
  వీరగొని పెంటయ్య. విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి.

Wednesday, February 25, 2015

There wont be any mountains !

 రక్షణకు గుట్టలుండయి!

        గాలి నీరు ఆకాశ మేఘమా
        జాడ జెప్పరమ్మా గుట్టల జాడ జెప్పరమ్మా!

                              కాల గమనమున కరిగిన లోహపు
                              కంద గడ్డలమ్మా గుట్టలు పుడమి బిడ్డలమ్మా !

        పుట్టుకన్నదే లేకముందు
        ఈ గుట్టలు బుట్టినయీ  ప్రాణికి పుట్టుక నిచ్చినయీ !

                            తిండి లేక జీవ జంతు జాలము
                            తల్లడిల్లినపుడు గుట్టలే ఆదుకున్నాయపుడు !

         చెట్టు చేమలూ పెరిగేతందుకు
         మట్టిగ మారినయీ గుట్టలు పగిలి చిట్లిపోయీ !

                              ఆకలికన్నం అయ్యే చెట్లను
                             కడుపుల పెంచినయీ మనుషుల కథ నిలిపుంచుటకూ !

         దిస మొలతో ఆదవ్వ తాతలు
         దిగాలు పడినపుడు గుట్టలు నార చీరలిచ్చే !

                                వానకు  చలికి  వేడి తాకిడికి
                                వెతలు చెందినపుడు గుట్టలు దొనల దాచినాయి !

          బండ బండ రాపాడి కొండలో
          నిప్పు బుట్టె మొదట వెలుగుల జాడ జెప్పే గుట్ట !

                                  గిరుల దొరలిన గుండ్రటి రాల్లే
                                  బండి చక్రమయ్యే బతుకుల గతులు మార్చే గుట్టా !

           భీకర ప్రకృతి విలయం దెబ్బకు
          బిక్క జచ్చినపుడు మొక్కే బొమ్మ జెక్కనిచ్చే

                                  బొడ్రాయి నుండి భోలా శంకర్
                                  దేవుడెవ్వరైనా గుట్టల దేహ ఖండమేగా !

         బల్లాలు గోడ్డండ్లు గదలకు
         బతుకు నిచ్చే గుట్టా మనిషిని సాయుధునిగ జేసె !

                                 గుడులు చెక్కినా కోటలు గట్టిన
                                 గుట్ట బండే దిక్కై మనిషికి రక్షగ నిలిచింది !

        ఇన్ని జేసినా ఇమాన మెరుగని
        తేలు సంతతోల్లు కొండల తెగ నరికెస్తుండ్రు !

                                   వాగు వంకలకు పుట్టినిల్లు
                                    ఆ చెట్టు గుట్టలేగా అవి లేక చెరువు లెటుల !

           వానలుండకా చెరువు నిండకా
          పాడి పంట లెటుల ప్రజలకు బతుకు దెరువే కరువు !

                                పక్షులు పాములు ఎలుగులు కోతులు
                                యెగబడి తరుముతయీ గప్పుడు దిగబడి ఉరుకుతరు !

            కానీ ! గుట్ట లుండ వెచటా వారికి రక్షగ నిలుచుటకూ !

                వీరగొని పెంటయ్య , విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి