Sunday, April 26, 2015

child labor !

 అది 2002 జూన్ మాసం.తొలకరి వానలు పలకరించినయి. ప్రబుత్వ పాఠశాలలు ప్రారంభానికి ముందు సర్కారు జేసె జిమిక్కులో భాగంగా బడి పండుగ అని అధికారులు ఆగమ్ ఆగమ్ చేస్తున్నరు . ఆనాటి జిల్లా కలెక్టర్ కు అత్యంత ప్రాధాన్యత అంశం పిల్లల చదువులు .ఆమె గోదావరిఖని వెళ్తున్నప్పుడు ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద ఒక పిల్ల వాడు బడికి పోకుండా సోడా బండి  వద్ద పనిజేస్తున్న విషయం గమనించి వెంటనే పెద్దపల్లి ఆర్ డి వో గారికి సమాచారం ఇచ్చిందట. వెంటనే విషయం మాకు చెరింది . ధర్మారం ఎక్స్ రోడ్ వద్దకు చేరుకొనే సరికి దాదాపు ఒక కిలోమీటర్ మేర దట్టమైన రాతి దుమ్ము ఆవరించి ఉంది. ఒక నాడు ఎత్తైన గుట్టలు ఇప్పుడు కొంచెం కొంచెం కోరుక్కు తిన్నట్టు చాలా వరకు అదృశ్యం అయినయి.అంతకంటే  కొద్ది రోజులకు
ముందే క్వారీ బ్లాస్టింగు లో ఒక కార్మికుడు మరో బాల కార్మికుడు చని   పోయినారు.

  వెళ్ళే టప్పుడు పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను  కూడా వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. సోడా బండి వద్ద ఒక పిల్లవాడు సోడాలు కొట్టి ఇస్తున్నాడు. బండి యజమాని డబ్బులు తీసుకుంటున్నాడు.లేబర్ ఆఫీసర్ బండి యజమాని వద్దకు వెళ్ళి తన పరిచయం చేసుకొని పిల్ల వాణ్ని పనిలో పెట్టుకోవడం నేరం . నీవు నేరస్తునివి స్టేషన్ కు నడువ్ అని గద్దరాయించిండు .

      ఆయన దండం దాశన పెడుతూ " అయ్యా ఈ పొల్లగాని అమ్మమ్మ ఒక్క తీరుగా బతిమిలాడితే కాదన లేక ఎంతో కొంత డబ్బులిస్తే నాకింత ఆసరా అయితడని వాల్ల అక్కెర తీర్తదని పనికి రమ్మన్న గాని , ఈ పొల్లగాడు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. గీ సోడా బండి మీద వెయిలు సంపాయిత్తనా సార్. నీ  దండం బెడుత నన్ను విడిచి పెట్టుమని "కాళ్లా వెల్లా బతిమిలాడిండు . మా టార్గెట్ కూడా పిల్లవాన్ని బడిలో చేర్చడమే గాని బండి యజమాని పైన కేసు చేయడం కాదు కనుక పిల్లవాన్ని పట్టుకొని జీపు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నం . వాడు బాగా ఏడుస్తున్నడు , ఈ కొత్త వాళ్ళు తనను ఎక్కడికి తీసుక పొతారో అన్న భయం తో ఏడుస్తున్నాడనుకొని మేము తనకు హాని చేయమనీ కొత్త పుస్తకాలు బట్టలు ఇచ్చి బడిలో చేర్పిస్తామని ఉండడానికి హాస్టలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని బుజ్జగిస్తూ చెప్తున్నం . కానీ అసలు వినడం లేదు . జీపు ఎక్క నంటే ఎక్క అంటూ గింజుకుంటున్నడు.నేను బతిమిలాడు తున్న , ఇంతల మా సహాయకులు పిల్ల వాన్ని బలవంతంగా జీపులో ఎక్కించిండ్రు . జీపు పెద్దపల్లి వైపు బయల్దేరింది. పిల్లలు అట్లాగే భయపడి మారాం చేస్తారు సార్ , అక్కడ హాస్టల్ లో ఉన్న పిల్లలను చూసిన తర్వాత సంతోష పడి ఉండి పోతారు మీరు ఫికర్ చేయకండి అంటూ మా సహాయకులు చెప్పడం తో మేము సరే లెమ్మని . జిల్లా కలెక్టర్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నం.మేము ఆఫీస్ వద్ద దిగి పోయినమ్ . జీప్ పిల్లవాన్ని తీసుకొని హాస్టల్ కు వెళ్ళి పోయింది.

    సాయంత్రం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత పిల్లవాడు అడ్జస్ట్ అయినాడా లేదా అని తెల్సుకోవడానికి హాస్టల్ కు వెళ్ళిన. వార్డన్ ఎదురుగా వచ్చి" మధ్యాహ్నం మీరు పంపిన అబ్బాయి
ఇంత వరదాకా ఏడుపు ఆపలేదు, అన్నం తిన లేదు ఎక్కెక్కి పడుతూ ఏదో యాదికి జేసుకుంటూ యాదికి జేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నడు సార్ " అని చెప్పిండు.
    నేను అంధోలనగా పిల్లవాని దగ్గరకు పోయి దగ్గరకు తీసుకొని అనునయిస్తూ భుజం మీద చేయి వేయంగానే నా చేతిని విసురుగా తీసి వేసిండు. నేను చెప్పేది వినకుండా బిగ్గరగా ఏడుస్తున్నడు." అరె ! చిన్న నువ్వు ఏడువకు ఇక్కడ ఉండకుంటే మానాయే , ఇప్పుడే నిన్ను నేను మీ ఇంటి వద్ద దించి వస్తా . కానీ ఇక్కడ నీకు మంచిగ లేదా? అక్కడనే మంచిగ
ఉన్నదా" అంటే చప్పుడు చేయడు.
  బతిమాలంగా బతిమాలంగా నోరు విప్పిండు. తన పేరు రాజు అనీ తనకు ఆరు నెలల వయసున్న చిన్న చెల్లెలు , ముసలి అమ్మమ్మ ఉన్నారని చెప్పిండు.
  వాళ్ళను విడిచి పెట్టి వాల్ల నాన్న ఎటో వెళ్లిపోతే అమ్మమ్మ దగ్గర ఉంటున్నారట. ఈ మధ్యన్నే అమ్మ చనిపోయిందట. మరి మీకు రోజూ అన్నం ఎట్లా అని అడిగిన.
 " నేను రోజూ ఏదో ఒక పని చేస్త . ఆ పైసల తోటి మా చెల్లే కు మా అమ్మమ్మ పాలు కొనుక్క వచ్చి పోస్తాది . పాచి పని చేసి రాంగ అమ్మమ్మ అడుక్క వచ్చే బువ్వ తింటం " అన్నాడు.
 కడుపు తరుక్క పోయింది
  ఆఖరుకు వాడు చెప్పిన మాటకు నా కండ్ల వెంట నీళ్ళు వచ్చినయి...
  " సారూ ! మా చెల్లే ఏడుత్తాంది గావచ్చు పొద్దటి సంది దానికి పాలు లెవ్వు .సోడా బండి సేటు పైసలిచ్చినంక కొనుక్క పోతననుకున్న. అందుకనే నాకు ఏడుపు ఆగుతలేదు " అన్నాడు.
  చ! మేము ఏమి జేసీనం . వాని బతుకు బాగు జేయ బోయినట్లా !  ఆ పసి పాప ప్రాణం దీయ బోయి నట్లా అర్థం గాలేదు.

  వెంటనే డ్రైవర్ ను పిల్చి ఒక పాల పాకెట్ తెప్పించి ఆ పిల్ల వాన్ని జీపులో ఎక్కించుకొని ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న వాల్ల గుడిసె కు పోయినమ్. పిల్ల ఘోరంగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో సొమ్మ సిల్లి పోతే అమ్మలక్కలు వచ్చి పాలు పట్టినారట . మమ్ముల జూసిన ఆడవాళ్ళు ఒక్క సారిగా మా పైకి గయ్యి మని లేచిండ్రు. సిగ్గు తో చచ్చి పోయినమ్.
  పదమూడు ఏండ్ల తర్వాత నిన్న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో 29 మంది బాల కార్మికులను గుర్తించినట్లు వార్త వస్తే ! జ్ఞాపకాల పాతర తెరుచుకున్నది. పేదల ఆర్టిక స్తితి గతుల్లో మార్పు తేకుండా బాల కార్మికులు అని వాళ్ళను పట్టి తెస్తే సమస్య పరిస్కారం కాలేక పోతున్నది.

పెంటయ్య వీరగొని.
విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి .
కరీంనగర్

No comments:

Post a Comment