Tuesday, November 9, 2021

                                 కనిపించని ఆ శత్రు వెవరు ?


ఈ దేశం లో ఇంకా మెజారిటీ ప్రజలు గ్రామాలల్లోనే జీవిస్తున్నారు. వారంతా దాదాపుగా వ్యవసాయం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపుగా 1980,90 దాకా  భూస్వాములు ,దొరలు, ఊరిలో తమ అధికారం చెలాయించేవారు. అణిచివేతకు గురవుతున్న వారికి తమ స్తితికి కారణం ఎవరో ఎదురు గుండానే కనిపించే వారు .


 కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పీవీ నర్సింహారావ్ ప్రధానమంత్రి గా నూతన ఆర్థిక విధానాలు అమలు జరిపిన తర్వాత పరిస్తితిలో మార్పు వచ్చింది. మన తెలంగాణ లో అయితే వామపక్ష ఉద్యమాల ఫలితంగా దొరలు గ్రామాలు విడిచి పట్టణాలకు వలసలు పోయి  తమ వద్ద ప్రోగుపడి ఉన్న సంపదలతో  అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు.  కొంత కాలం వరకు భూములు బీడుబడిపోయి గ్రామీణులకు ఉపాధి దొరుకక తమ దీన స్తితికి దొరలు లేక పోవడమే కారణం అనుకున్నారు. లబ్ధ ప్రతి స్టులైనా కొందరు  కథకులు దానికి అనుకూలంగా కథలే రాసిపడే శారు. తరువాత తరువాత కొంత భూమి స్థానిక రైతుల చేతుల్లోకి మారింది. కానీ రైతులకు అర్థం కానీ విధంగా గిట్టుబాటు ధర లభించక పరిస్తితి  పెనేం  లో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారిపోయింది. ఫలితంగా రైతు ఆత్మ హత్యలు పెరిగి పోయాయి. అందుకు కారణం ఎవడో రైతుల ముందు కనిపించడం లేదు. శత్రువు అదృశ్యం అయిండు. ఎవని తో పోరాడాలో అర్థం కానీ  పరిస్తితి. ప్రభుత్వాలతో పోరాడితే, కొన్నీ పంటలకు  మద్దతు ధర అన్నాయే కానీ గిట్టుబాటు ధర ఊసే లేదు. వామ పక్ష పార్టీలు సైతం తమ పోరాట బాణాలు ప్రభుత్వాల పైననే ఎక్కుపెట్టారు కాని అసలైన కారణం, ప్రభుత్వాలతో బాటు  పెట్టుబడి దారి విధానం అంటూ పోరాడే శక్తులకు అర్థం చేయించ లేక పోయారు. 


మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన మంచి ఆయుధం అయిన విద్య ఇప్పుడు పెట్టిబడి దారుల చేతిలో పడి వారికి నైపుణ్యవంతమైన నౌకరీ గాళ్లను తయారుజేసే పనిలో తలమునుకలై ఉంది. సమాజం కూడా పోటీ పడి తమ పిల్లలు IIT, NEET, CIVILS, వేటలో పడి పెట్టుబడి కొరల పండ్లు దోమి ఎంతో కొంత మెరుగైన జీవితం అనుభవించాలే అన్న యావలో పడి కిందామీదా కొట్టుమిట్టాడుతున్నారు. 


ఇక వైద్యం కూడా చాలా పిరపు సరుకు అయిపోయింది. ముందుగా పేదలకు బల వర్ద కమైన ఆహారం లభించే పరిస్తితి లేదు. సమీకృత ఆహారం అంటే ఇంకా ఎందరికో తెలియని స్తితి. దానికి తోడు మల్టీ నేషనల్స్ ధనదాహం తీర్చే కొరకు వచ్చిన రసాయనిక ఎరువులు,పురుగు మందులు, హైబ్రిడ్ కల్తీ విత్తనాలు, కాలుష్యం అన్నీ కలిసి మనుషుల  శరీరాలను రోగ గ్రస్తం చేస్తున్నాయి. 


ప్రజలు తాము సంపాదిస్తున్న సంపాదనలో సింహా భాగం విద్య,వైద్యం, పిల్లల ఉద్యోగాల కోచింగ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభం లో పెట్టుబడి ఉద్యోగాలను సృస్టి కి దోహద పడి, పెట్టిన పెట్టుబడి పైన వచ్చే లాభాలతో  ఉద్యోగులకు బోనస్, ప్రభుత్వాలకు పన్నులు కట్టేవి.  కానీ ఇప్పుడు పెట్టుబడి అలా చేయకుండా తమ సంపద పెంచుకోవడానికి పోటీ పడి క్రోనీ కాపిటల్ ను తాయారు చేసుకుంటున్నది. ఒక కంపనీ పెట్టి దానిపైన బ్యాంకు నుండి అప్పు తీసుకుంటుంది. ఆ కంపానీకి మార్కెటింగ్ కోసం మరో సంస్త ను తెరుస్తుంది. మొదటి కంపనీకి నస్టాలు చూపి బ్యాంకు అప్పు ఎగగొడుతుంది. ఇలాంటి జిమ్మిక్కులు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం పైన పెట్టుబడి దారుల సంపద దినదినం  కోట్లల్లో పెరుగుతుంటే ప్రజల పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, అను త్పా దక సైన్యం ( Useless Force), అంతకంతకూ పెరిగి పోతున్నది.కారణం ఏమిటి? ఎవ్వరు అనేది ప్రజలకు అర్థం కావాల్సి ఉంది.  


ఒక నాడు ప్రజలకు తెలియని సంస్కృతం ప్రజలను  ఏలింది, ఇంగ్లీష్ కొన్నాళ్ళు, ఇప్పుడు భాషలు పోయి టెక్నాలజీ, ఆర్థిక శాస్త్రం కలగల్సి ప్రజలను అవిద్యావంతులను చేస్తున్నది.    చదువులు వస్తే ఏలికలను ప్రశ్నిస్తారని, చదవునుండి దూరం చేశారు. ఆ తర్వాత ఆధునిక  టెక్నాలజీ అందరికీ అందని ద్రాక్షను చేశారు. ఆర్థిక శాస్త్రం అయితే అర్థం కానీ బ్రహ్మ పదార్థాన్ని  చేశారు. కనుక  ఇప్పుడు ఆర్థక శాస్త్రం మూలాలను అందరికీ అర్థం అయ్యే విధంగా సులభ గ్రాహ్యం చేసి , ఏలికలు , పెట్టుబడి కలగలిసి ప్రజలను ఎలా గొర్రెలుగా చేసి వేటాడి తింటున్నాయో ప్రజలకు తెలియ జెప్పి ,  తమ అవిద్యకు , అనారోగ్యానికి, ఆకలి చావులకు , నిరుద్యోగానికి , పేదరికానికి , కారణం అయిన ఆ ప్రజల శత్రువును   ప్రజల ముందు నిలుపాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరు వహిస్తారో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 


 కమ్మరెంకయ్య మామ కండ్లల్ల తిరుగుతుండు. 


రెండు మూడు రోజుల సంది కమ్మరెంకయ్య మామ మనుసుల తిరుగు తున్నడు . ఎన్నటి యాది, ఈ ముసులాయిన ఎందుకు ఊకూకే మతికి వస్తున్నడో  అర్థం అయిత లేదు. అది  నేను ఐదో తరిగతి సదివే టప్పుడు( 1960-61), అయితారం అచ్చినదంటే  మా అన్నగాని గీత కత్తులకు సాటే పిచ్చె తందుకు( కత్తులకు పదను పెట్టుడు) కొలిమి కాడికి పోకట ఉండేది. మాపటీలి మండువ  కాడికి పోతే మా అన్న నాకు కారం పుట్నాలు పెట్టిపిస్తడాయే మరి . కొలిమి కాడ ఆ రోజుల్ల  ఎట్లు ఉండెనొ , ఆ వైభోగం ఏమై పాయే, ఎందుకట్లయ్యనో తెలిసిన విషయమే అయిన ఇంతగనం  మనుసుల ఎందుకు మెసులు తాందో సుద్దామ్ అనుకుంటనే, ఇంతల   నెట్ ఫ్లిక్స్ ల గెలుకుతాఉంటే నానా పటేకర్నటించిన  మరాఠీ సినిమా “ ఆప్లా మానస్ “ కనిపిస్తే ప్లే పైన  క్లిక్ చేసన. నానా పటేకర్ మహా నటుడు గదా , చూసిన కొద్ది సూడ బుద్ది అయింది. నా వయసు వారికి మా కొడుకులు కోడండ్లు బిడ్డలు కూడా కూడా చూస్తే బాగుండు అనిపిచ్చె టట్టు ఉంది. 


కమ్మరెంకయ్య మామ ది  నల్లటి దేహం, కొలిమి వేడికి కమిలి పోయిందో ఆయిన పుట్టుకే అట్ల ఉండెనొ  కానీ అప్పటికే చేసి చేసి అలిసి పోయిన ఊగులాడే కండలు, ఎడుమ  చేతుల పట్టుకారు తోటి అప్పుడప్పుడు కొలిమిల నిప్పులు,  కాకుంటే  బొగ్గులు ఎగేసు కుంట , కుడి చేతిల పెద్దదో లేకుంటే సిన్న దో సుత్తె పట్టుకోని,   ఎప్పుడు కొలిమిల నిప్పుల తీరుగ ఎర్రటి కండ్ల తోటి విరామం లేకుంట పనిజేసుకుంట ఉండే టోడు . ఎండా కాలం అయితే బండ్లకు కమ్ములు గట్టుడు , వానా కాలం అయితే నాగండ్లకు కర్రులు అమిరిచ్చుడు , మాగిల నైతే గుంటుకులూ , ఇంకా గొడ్డన్లు , గడ్డ పారలు, పారకట్టెలు, కొడు వాండ్లు, అంగు పారలు , సిన్న పోరాగండ్ల కు బొంగురాలకు ముల్లులు, ముల్లు గట్టెలు, బురుద పొలాలల్ల తొడిమే తీసే తందుకు కురుపే ముల్లు గర్రలు, పెనాలు ,సరాతాలు , ఇట్లా చెప్పుకుంట పోతే శేతా డంత లిస్ట్ అయితది కానీ క్షణం రికాము లేకుంట పనిజేసేది. ఆయినను బువ్వ కూడా తినకుంటా ఎప్పుడు ఎవరో ఒకరు పానం మీద ఉందురు . ఇంత జేసినా ఆయిన ఇల్లు ఓ కమ్మల గుడిసె. ఆ గుడిసె ల కూడా దోశె డంత గడుకో, సారె డంత పప్పో  ఉండేది గాదు . ఆయిన భార్య ఎప్పుడు కాలం చేసిందో తెలువది. ఒక్క కొడుకు. వాడు కూడా ఏగిలి మనిషి. ఏమి పని చేసే టోడు గాదు. బిడ్డ పుట్టు గుడ్డి. ఆమె కూడా ఇంత ఉడుక వెట్టి పెట్టె ఓసల లేని మనిషి. ఇంత పని జేసుకుంటా ముగ్గురికి ఉడుకేసి ఆయినే పెట్టాలే. ఎప్పుడన్నా మా ఇంటికి ఎంకయ్య మామ వస్తే మా అవ్వ ఇంత గడుక బోటేసి ఇంత సల్ల వోసి అంచుకు ఓ మామిడిగాయ తొక్కు పెట్టేది. నా కడుపు ఇయ్యాల మా నిండింది గానీ గుడ్డి పొరికి ఏమన్నా పెట్టవా అక్క ఆని ఏదో ఓటీ అడుక్కొని పట్టుక పోయేది. బహు కస్టంగా బతుకుతున్నా గూడా ఎంకయ్య మామ ఎన్నడూ గూడ కంట నీరు పెట్టంగా చూడ లేదు. పనే ఆయినకు అంత ఆత్మ విశ్వాసం ఇచ్చింది. 


నేను సదువు కునే తందుకు ఊరిడిచి వచ్చిన తర్వాత  ఎప్పుడో ఊరికి వచ్చినప్పుడు కమ్మరెంకయ్య మామ చని పోయిండ్ ని తెలిసింది. అందరూ మనిసి కింత ఏసుకొని దహన సంస్కారం చేసిండ్రట .  ఆయన కంటే ముందే ఆ కొడుకు కూడా ఏదో జరమచ్చి చనిపోయినడట.  ఆ గుడ్డామే కట్టె పట్టుకోని ఇల్లుళ్లు తిరుగుతూ అడుక్కొని తిని బతుకుతున్నదని తెలిసింది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది. 


ఎంకయ్య మామ ఇంటి  కాడ ఒక నల్ల తుమ్మ చెట్టు  ఉండేది. దాని నీడకు కొలిమి ఉండేది. వానలు బాగా పడ్డప్పుడు రైతుల కొట్టాల కింద మామ కొలిమి పెట్టేది. మాగిల నేను కత్తులు సాటేసు క రాను పోతే తుమ్మ సెట్టు నీడకు కూసున్డే ది. తుమ్మ పూల మకరందం పీల్చుకోను తేనె టీగలు వస్తే ఆ రెక్కల సప్పుడు వినుకుంటా అట్లనే ఉంటే “పోడా ఇంటికి పోవా? ఇక్కణ్నే ఉంటవా? ఉంటనంటే సెప్పు కట్నం కింద నా కొలిమినిచ్చి గుడ్డి పొరిని నీకిచ్చి ధూమ్ ధామ గా పెండ్లి జేత్త “ అని బోసి నోటితోటి వక్కడ వక్కడ నవ్వేది. నిజంగనే సేత్తడు గావచ్చు అనుకోని కుడి సేతీలకు కత్తులు తీసుకొని  , పిర్రల మీది లాగు ఇంకా కిందికి జారిపోకుంట ఎడమ సెయ్యి తోటి మీదికి గుంజు కుంట గుంజుకుంట ఎనుకకు మర్రి గూడ సూడ కుంట ఇంట్ల వడేదాక ఉరికచ్చే టోన్ని.    ఆ గుడ్డి మనిషి చనిపోయిన తర్వాత ఆ గుడిసె ఉన్న జాగను పక్కనున్న వారు ఆక్రమించుకున్నరు. నిజాం సర్కార్ సాలార్ జంగ్ జమానల భూ సర్వే జరిపినప్పుడు ఊరుమ్మడి అవసరాల కోసం,  సదరుల కొంత భూమి తీసి అవసరం అయిన వారికి ఇచ్చేవారు. అలా వృత్తి పనివారికి, గుడుల పూజారులకు గృహ అవసరాలకు కొంత  భూమి ఇచ్చే వారు. అలాంటిదే ఈ   కొలిమి కోసం తీసిన జాగ అయి ఉంటుంది. . ఊరికి ఏ కమ్మరి ఉంటే ఆయిన ఇల్లు వేసు కొనే తందుకు  ఆ జాగా ఉంటది. మళ్ళా ఇంకో కమ్మరాయన అవసరం ఊరికి పడలేదు. ఆ భూమి మాత్రం ఎవరో ఒక్కరి సంతం అయిపోయింది. 


నిజానికి నాకు కమ్మరెంకయ్య మామ ఇంత గనం మతికి వచ్చే తందుకు కారణం ఇది రాస్తుంటేనే స్పురించింది. ఊరు మొత్తం ఉత్పత్తి లో భాగమై( పొలం దున్నే కాన్నుంచి ,పంట కోసేదాక, కోసిన పంట అన్నం ముద్దై కడుపు నిండే దాకా సకల జనుల పనిముట్ల కు కారణమైన )  ఊరందరికి అవసరమైన మనిషి కి అంత కస్టమ్ లో కూడా కడుపు నిండుగా అన్నం పెట్టని నా ఊరు,ఆయన  చస్తే ఆవల పారేసింది. ఉన్న భూమిని ఆక్రమించింది. కానీ అదే నా ఊరు,  ఊరిలో మంచికి  చెడ్డకు మంత్రం చదివే బాపనాయిన లేకపాయేనని యమ కలత చెంది    పక్కూరు నుంచి బాపనాయినను రప్పించి ఆయినకు ఇల్లు ఇరువాటు సమకూర్చి ఆయనకు మృ స్టాన్న భోజన వసతి కలిగించి శీగ్ర గతిన తంతు లకు హాజరయ్యే దానికి  ఇప్పుడో కారు కూడా కొనుక్కో గలిగిన సామర్థ్యాన్ని సమ కూర్చింది.