Friday, December 23, 2022

Democracy- Elections.

                                                     ప్రజాస్వామ్యం - ఎన్నికలు . 



ఆకుల భూమయ్య 9 వ వర్దంతి సందర్భంగా కరీంనగర్ ఫిలిమ్ భవన్ లో ఈ రోజు 23 డిసెంబర్ నాడు సంస్మరణ సభ జరిగింది. ఆకుల భూమయ్య భూమయ్య పెద్దపల్లి జిల్లా కాచాపూర్ లో 1950 లో జన్మించారు. ఆయనకు బుద్ధి తెలిసే నాటికి రాజ్యాంగం లో చెప్పిన హామీలు నెరవేర్చ బడక దేశ నలుమూల ల అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్న రోజులు. ఆయన పదో రతరగతి లో ఉన్నప్పుడే శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాలు తెలుసుకున్నాడు. కాచాపూర్ లో పాలేరుల దీనస్తితికి స్పందించి వారి జీతాలు పెంచాలని,తమ కుటుంబాన్ని కూడా కోరిన వాడు.  అప్పటి పోచం పాడ్ ప్రాజెక్ట్ కాలువలు తవ్వే కూలీలకు అంబలి పంపకం వారి పసి బిడ్డలకు చలువ పందిర్లు వేయించిన పోరాట శీలి. 1969 లో తొలి తెలంగాణ పోరాటం లో పాల్గొన్నాడు.  ఎమర్జెన్సీ కాలం లో జైలు జీవితం గడిపి  విడుదల అయి వచ్చిన తర్వాత విద్యారంగం లో ఉన్న అవినీతి ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యమం నిర్మించాడు. తన తో బాటు ఉపాధ్యాయ ఉద్యమం లో పనిజేస్తున్న మిత్రులకు మనం కేవలం మన జీతాభత్యాల కోసం ఆర్థిక పోరాటాలు చేయడం కాదు, అశేష ప్రజల సమస్యల పరిష్కారం తోబాటే  ఉపాధ్యాయుల సమస్యలు  కూడా పరిష్కారం అవుతాయన్న ఎరుకను కలిగి ఉండాలని బోధిస్తూ వచ్చాడు. 1989 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం లో చాలా చురుకుగా పాల్గొన్నాడు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జనసభకు అధ్యక్షుడు.ఆ నాటి TDP ప్రభుత్వ ప్రధాన మద్దతు దారు అయిన రామోజీ రావు ,తెలంగాణ రాకుండా అడ్డుకొనే ప్రయత్నం లో  తన స్వంత పత్రికలో అయిన ఈనాడు దినపత్రిక  లో తెలంగాణ  జనసభ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్త  ఆని విపరీతంగా అసత్య  ప్రచారం చేసిన కారణంగా తెలంగాణ జన సభ నిషేధానికి గురైంది. తనతో బాటు గా పనిజేస్తున్న బెల్లి లలిత, కనకా చారి, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి లాంటి వారు చంద్రబాబు సర్కారులో హత్యలకు గురవు తుంటే అదురక బెదురక ప్రజాస్వామిక తెలంగాణ కొరకై పోరాటాన్ని కొనసాగించాడు. TJS నిషేదం అనంతరం తెలంగాణ ఉద్యమం ఆగిపోకూడదన్న  తపనతో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు జేసి పోరాటం కొనసాగించాడు. దానిపైన కూడా నిర్బంధం పెరిగి న తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. దానికి చేర్మన్ బాధ్యతాల్లో ఉండగా ఒక అనుమానాస్పద రోడ్డు ప్రమాదం లో 24 డిసెంబర్ 2013 నాడు దుర్మరణం పాలయ్యాడు. 


ఆయన యాదిలో ఈ రోజు ప్రజాస్వామ్యం- ఎన్నికలు అన్న అంశం పైన  ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆయన తో బాటుగా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అనేక మంది సహచరులు, ఆయన కుటుంబ సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎన్నికలు ఎంత లోపభూయిస్టంగా  జరుగుతున్నాయో చర్చించారు.  ఎంత ఏక పక్షంగా, ఎంత డబ్బు, మద్యం, పవర్, జులుం తో నిర్వహించ బడుతున్నాయో చెబుతూ ఆవేదన చెందారు. అక్కడ హాజరైన దాదాపు యాబై మంది  విద్యావంతులు , ఆలోచనా పరులు  భారత పౌరులుగా తమ  బాధ్యతగా ఎన్నికలు అవినీతి రహితంగా జరుగడానికి   కొన్ని సూచనలు చేశారు.


1. చీఫ్ ఎలక్షన్ కమిషన ర్ గా  అధికారం లో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలురు అయిన వారిని నియమించుకొని  లబ్ధి పొందుతున్నది. కనుక ప్రధానితో బాటుగా ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ,  ఒక రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి, వంటి వారితో ఒక కోలీజియం ఏర్పాటు జేసి ఆ కోలీజియం సూచన మేరకు చీఫ్ ఎన్నికల కమిషనర్ ను నియమించాలి. 


2. కార్పొరేట్ సంస్తలు ప్రభుత్వాన్ని తమకు అనుకూలమైన చట్టాలు తేవడానికి ఎన్నికల బాండ్ల ద్వారా లాబీయింగ్ కు పాల్పడి వారికి అనుకూలంగా చట్టాలను  చేయించు కుంటున్నారు. . కనుక ఎన్నికల ఫండు , చందాల సేకరణ ను నిషేధించాలి. 


3. వితీన్ ద పార్టీ లో ఎన్నికలు జరిపి ఆ పార్టీ సభ్యులు ఎవరిని అభ్యర్థిగా గెలిపిస్తామని చెబితే వారికే ఆ పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టాలి. 


4. EVM ల పైన అనేక మంది అభ్యంతరాలు చెబుతున్నారు. సాంకేతికంగా ఎంతో అభివృధ్ధి చెందిన  అమెరికా లాంటి  దేశం లో కూడా బ్యాలెట్ పత్రాలనే  ఉపయోగిస్తున్నారు. త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందన్న ఏకైక కారణం తో EVM లు వాడుతున్నారు. కానీ అంత కంటే ఎక్కువ ఆలస్యానికి కారణమ య్యే టట్టుగా ఒక రాష్ట్రం లో దఫా దఫాలు గా ఎన్నికలను నెలల తరబడి నిర్వహిస్తున్నారు. కనుక ఎవరికీ అనుమానం లేని విధంగా బ్యాలెట్ పత్రాలు ఉపయోగవంచాలి. 


5, మానిఫెస్టో లో చెప్పిన అంశాలను అమలు పరుచని యెడల న్యాయస్తానా లల్లో ప్రశ్నించే విధంగా చట్టాలు చేయాలి.


6. చట్ట సభకు ఎన్నికైన అభ్యర్థి రాజీనామా చేసిన యెడల మళ్ళీ అక్కడ బై ఎలక్షన్లు పెట్టవద్దు.మిగిలి ఉన్న కాలానికి  ఆ ప్రజల బాగోగులు చూడడానికి ఆ జిల్లా లేదా ఆ నియోజక వర్గ  ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి.  


7.  ఒక పదవిలో రెండు సార్ల కంటే ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉండకూడదు. 


8. ఏదేని నియోజక వర్గం ఒక సారి ఎస్సీ, లేదా ఎస్టీ కి రిజర్వ్ చేయబడితే అది ఎప్పటికీ అలాగే కొనసాగ కూడదు. రొటేషన్ పద్దతి లో సాగాలి. 


9. చట్ట సభలకు ఎన్నికయిన వారు, వారి  పదవీ కాలం ముగియకుండానే రాజీ నామా చేసిన యెడల అట్టి వ్యక్తికి వెంటనే ఆ  ఉపఎన్నికలో పాల్గొనే అవకాశం ఉండకూడదు.


10. ఆ నియోజక వర్గ ప్రజలు తాము ఎన్నుకున్న  ప్రతినిధి తమకు   సరైన న్యాయం చేయడం లేదని  భావించి నపుడు రీకాల్ చేసే అవకాశం ఉండాలి. 


11. ఒక ఎంపి ఎన్నికల ఖర్చు 75 నుండి 95 లక్షలు  ,   ఎంఎల్ఏ ఎన్నికల ఖర్చు 28 లక్షలు చేయాలని చట్టం చెబుతున్నది. . కానీ ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయో చూస్తున్నాము. లక్షల్లో ఉన్న పరిమితిని మించి కోట్లల్లో, పదుల కోట్లల్లో, వంద కోట్లల్లో, వందల కోట్లల్లో పార్టీలు ఖర్చు చేస్తుంటే నిఘా సంస్తలు కండ్లు మూసుకొని ఎందుకు ఉంటున్నాయి? కనుక నిఘా సంస్థలు మరియు  వారు ఖర్చు చేస్తున్న డబ్బు ను ఆడిట్ చేస్తున్న వ్యవస్త ఖచ్చితంగా ఉండాలి,


12. PM, CM లు చాలా ఎన్నికల మీటింగుల్లో ప్రజల సొమ్ముతో పాల్గొంటున్నారు. వీరు పాల్గొనే మీటింగుల పైన నియంత్రణ ఉండాలి. 


13. క్రిమినల్ కేసుల అభియోగాన్ని ఎదురుకుంటున్న ఎవరైనా ఎంతో కొంత కాలం జైళ్లల్లో నిర్బంధించబడి తమ వ్యక్తిగత స్వేచ్చా స్వాతంత్రాలను కోల్పోతున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం ఏ అభ్యంతరం లేకపోవడం సహేతుకంగా లేదు.  శిక్ష పడనంత వరకు ఎవరైనా నిర్దోషే అన్న కారణం తో ఎందరో క్రిమినల్స్ చట్టసభకు వస్తున్నారు. అలా రాకుండా కట్టడి చేయాలి. 


 ఇలాంటి మరికొన్ని సూచనలు వచ్చినాయి. 


ఇటువంటి చర్చలు విస్తృత స్తాయిలో జరుగాలి ఆని సభికులు సూచన చేశారు. ఎక్కడికక్కడ పౌర సమాజం ముందుకు వచ్చి ఇలాంటి చర్చా కార్యక్రమాలు చేపట్టాలని  సభ్యులు సూచించారు. రాజ్యాంగం ప్రజలందరికీ అర్థమై రాజ్యాంగ హక్కులు అందరికీ కలిపించాలని , రాజ్యాంగం మేరకు పాలన చేయండని ప్రజలు ప్రశ్నించే కైతన్యం కలిగిన  నాడు ఏ ప్రభుత్వమయినా ప్రజల మాట వినక తప్పదు ఆని అంబేడ్కర్ అంటాడు. 



మీటింగ్ కన్వీనర్ 


వీరగొని  పెంటయ్య 

ఆకుల భూమయ్య ఉద్యమ సహచరుడు.  



 


No comments:

Post a Comment