Friday, October 5, 2012


అది కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆగ్నేయంగా ఉన్న చిన్న గ్రామం, సర్వాయి పేట.. అక్కడ ఎప్పుడో 1675 లో సర్వాయి పాపన్న నిర్మించిన ఒక కోట శితిలావస్తలో ఉంది. అలనాడు సర్వాయి పాపన్న దాచిపెట్టిన సంపద దొరుకుతుంది అన్న అత్యాశ తో గుప్త ధనం కోసం కోటలోని చాల భాగాన్ని తవ్వి పోసినారు. తెలంగాణా కు చరిత్రే లేదని బుకాయించే సీమాంధ్ర పాలకవర్గాలు చారిత్రిక ఆధారాలను కాపాడడం లో విఫలం అయినారు. కోటకు కొద్ది దూరం లోనే సర్వాయి పాపన్న నిర్మించిన సర్వాయి చెరువు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఊరికి మధ్యలో ఉన్న కోట ముఖ ద్వారం, దానిని అనుకోని ఉన్న బురుజు అలనాటి దర్పానికి గుర్తుగా ఇంకా అలాగే ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆ బురుజు పైన ఫిరంగులు పెట్టి శత్రువులను నిలువరించే వారట. అక్కడినుండి భూమిలో గుండా కొమ్ముగుట్ట పైన ఉన్న కోటకు దారి ఉండేదంటారు. బురుజు పక్కన్నే పెద్ద బావి ఉన్నది.కోట ముఖద్వారం ఈ బురుజు ను ఆనుకొని ఎత్తయిన ప్రాకారం చాల వరకు శిథిలమై ఉన్నది. ఆ కోట ముఖద్వారం వద్దా కూర్చొని ఆనాటి పాపన్న గుర్రపు డెక్కల చప్పుడు ఏమైనా వినిపిస్తుందో ఏమో నని భూమికి చెవు ఆనించి విన్న గూడా 350 ఏండ్ల కింద గాలిలో కలిసిన ఆ శబ్ద తరంగాలను వినలేక పోయాము. కాని ఆ బండ రాళ్ళ పైన ఆయన హస్త ముద్రికలను , ఎత్తయిన ఆ బురుజుల పైన ఆయన నడయాడిన కాలి ముద్రల ఆనవాళ్ళను పోల్చుకొనే ప్రయత్నం లో అక్కడ నుండి కదిలినాము., అలనాడు దొరల భూస్వాముల ఆగడాలను అరికట్టడం లో అయన కూడ గట్టిన ఆ దళిత బహుజన సైన్యాలు ఎంతటి నిర్భీతి తో ఎంతటి ధైర్య సాహసాలతో ఆ నేల పైన నడయాడినాయో కదా అన్న తన్మయత్నం అక్కడనుండి కదుల లేక కదుల లేక మెల్లగా కొమ్ముగుట్ట వైపు బయలు దేరి పోయినాము. గొల్ల పల్లి, ఉమ్మాపురం గ్రామాల గుండా సాగిన మా ప్రయాణం కొమ్ముగుట్ట, బయ్యన్న గుట్ట, మూడురోకండ్ల గుట్ట, ఇట్లా ముప్పై యారు గుట్టల శ్రేణి లో తలమానికంగా ఉన్న కొమ్ముగుట్ట పాదాల నుండి ప్రయాణం సాగుతుంటే నెమలి పక్షుల కూతలు మనుషులు పిలిచినట్టుగా వినిపిస్తున్నాయి. శత్రువులు ఎవరో వస్తున్నారు జాగ్రత్త అని అలనాడు సర్వాయి పాపన్న్నకు కూడా ఇట్లాగే ఈ ప్రక్రుతి సహకరించింది కావచ్చు అనిపించింది. ఆ చిట్టడివి చెట్ల సందుల నుండి పోతుంటే చిన్న కాలి దారి వొకటి కనిపించింది.ఆ కాలి దారెంట పొతూ ఉంటె సీతాకోకలు గుంపులు గుంపులు గ బండ రాళ్ళ పైన ఉన్న, మట్టి పైన ఉన్న మాధుర్యాన్ని గ్రోలటానికి కాబోలు కింద వాలుతూ పైకి లేస్తూ వాటి ఆకలి పోరాటం సాగిస్తున్నాయి, అలాగే దాదాపు ఒక అరగంట నడిచిన తర్వాత బండ రాళ్ళ సందుల గుండా వస్తున్న సెలయేళ్ల ధారలు, అక్కడక్కడ చిన్న చిన్న మడుగులు. అబ్బ నీళ్ళు ఎంత స్వచ్చంగా ఉన్నాయి కదా ఇక్కడ అనిపించింది. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయి నందున మేము తెచ్చుకున్న నీళ్ళ బాటిల్స్ అయిపోయినందున ఆ బండల పైనుండి జల జలా వస్తున్న సెలయేటి నీటిని దోసిటి నిండా పట్టుకొని తాగినాము. అసలు మినరల్ వాటర్ అంటే అవి. . ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఆ నీళ్ళు. ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళిన మేము సరిగా గమనించ లేదు కాని అప్పటికే మేము పోతున్న దారి అన్ని చిన్న చిన్న దారులు గా విడి పోయింది . ఏ దారి గుండా వెళ్ళాలో అర్థం కావడం లేదు. సరే ఏదో ఒక దారి అనుకోని ఒక దారి గుండా వెల్లినాము. అయితే అ దారి మమ్ములను సర్వై పాపన్న నిర్మించుకున్న కోట వైపు కాకుండా మరో వైపు కు తీసుకొని పోతున్నది. అయితే అప్పటికే బాగా అలిసి పోయిన మేము ఏమి చేద్దాం తిరిగి వాపసు పోదామా , ఇంతకష్ట పడివచ్చి అయన నివసించిన స్తావరం చూడకుండా నే వెళ్ళిపోవడం ఎట్లా అని మీమాంస లో ఉండగా మా టీం సభ్యుల్లో ఒకరు అగాగో కోట గోడ అంటూ చుపెడుతున్నారు.ఉత్సాహం తో అందరం అటువైపు చూసినాము. దూరంగా చాల ఎత్తులో ఒక పాకురుబట్టిన పాత బండ రాళ్ళ గోడ ఒకటి కనిపించింది.ఏదో గొప్ప నిధి దొరికినట్టుగా అందరం బిరా బిరా అటువైపు అడుగులు వేసినం. కంటికైతే కనిపిస్తున్నది కాని దాని లోనికి పోవడానికి ద్వారం దొరుకుత లేదు.ఎటు వైపు పోయినా ఎక్కి దాట వీలు గాని కోట గోడనే అడ్డం వస్తున్నది. అరె ఆ కాలం ల ఇక్కడ ఇంతటి శత్రు దుర్భేద్యమైన కోట కట్టుకోవచ్చునని అతి సామాన్యుడు, ఒక కళ్ళు గీత వృత్తి దారునికి ఇంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎట్లా కలిగిందోకదా అని అబ్బురపడ్డాము. అయితే మాకు తెలిసింది ఏమిటంటే ఆ కోట లోపలికి పోవడానికి ఒకే ద్వారం ఉన్నదట.చివరికి మా టీం సభ్యులు చెట్లు ఆకుల తో ముసి ఉన్న ఒక ద్వారం కనుగొన్నారు. ఆ ద్వారం గుండా లోపలి పోయినాము. విశాలమయిన బండ రాళ్ళు. అక్కడ ఒక ఎత్తయిన రాయి పైన పాపన్న కూర్చునేవాడు అని ఒక రాతి సింహాసనం వంటి పెద్ద బండ రాయినే చూపినారు. అక్కడ నుండి శత్రువుల ఆచూకీని చూడడానికి రెండు వైపులా ఎత్తయిన బురుజులు ఉన్నాయి అయితే అవి చాల వరకు శిథిల మై పునాదులు, కొన్ని కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలక్షేపానికి ఆడుకొనే పులి జూదం పటం బండ పైన చెక్కి ఉన్నది. దాని కి కొంచం ఎడమ వైపు ఒక హనుమంతుని విగ్రహం చెక్కి ఉన్నది. కాని అది పాపన్న కాలం లో చెక్కినది కాకపోవచ్చుననుకొనే వారు ఉన్నారు. ఎందుకంటే పాపన్న బ్రాహ్మనీయ సంస్కృతిని పెద్దగ అభిమానించిన ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు.ఎందుకంటే ఆసియా ఖండం లోని అత్యంత ఉన్నతమైన స్తూపం నిర్మించబడి రాజ్యం చే ధ్వంసం చేయబడిన హుస్నా బాద్ పట్టణం లో సర్వాయిపాపన్న చేత మట్టి తో నిర్మించ బడ్డ పోచమ్మ గుడి ఉన్నది.దాని పూజారి గా కూడా ఒక దళిత మహిలనే నియమించి నట్లు గా ఆధారాలు ఉన్నాయి. అంతే గాకుండా ఆయనకు సమయం చిక్కినపుడల్లా రక్షణ స్తావరాలు నిర్మించుకోవడం,ప్రజల కష్టసుఖాలు తెల్సుకోవడం, శత్రువులు వసూలు చేస్తున్న పన్నులు చెల్లించ వద్దని ప్రజలను చైతన్య పరచడం. లాంటి పనులతోని తీరిక లేకుండా ఉన్న వాస్తవ వాది. ఛత్రపతి శివాజీ సమకాలికుడు అయిన పాపన్న శివాజీ వలె గుళ్ళు, గోపురాలు కట్టి ఉంటె బ్రాహ్మణా సమాజం పాపన్న చరిత్రను కుడా గ్రంధస్తం చేసి ఉండేది.మొఘల్ చక్రవర్తులను ఎదిరిస్తున్నాడు కనుక మహ్మదీయ చరిత్ర కారులు, మొఘల్ చక్రవర్తులకు తాబెదార్లు గా, పన్నులు వసూలు జేసి ఇస్తూ వారికంటే క్రూరంగా ప్రజలను హింసిస్తున్న స్తానిక హైందవ దొరలను చీల్చి చండాడుతున్నాడు కనుక హైందవ చరిత్ర కారులు పాపన్న చేరిత్రను ఎక్కడ గ్రంధస్తం చేయలేదు. అయిన ప్రజా నాలుకల పైన ఆశువు గా వచ్చిన పాపన్న చరిత్రను జానపదులు తమదయిన వీరోచిత , తమదైన సంస్కృతితో ఈ తరం దాక తమ నాలుకల పైన మోసుకొని తెచ్చినారు. ఆ కొండ పైన రెండు పెద్ద బండ రాళ్ళ మధ్యన ఉన్న చిన్న చిన్న రాళ్ళు, మట్టిని తొలిగించి అక్కడ ఆ గుట్ట పైన రెండు కోనేరులను నిర్మించినాడు.ఆ కోనేరులోనికి దిగడానికి మెట్లు సైతం చెక్కించి నాడు.సముద్ర మట్టం నుండి దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉన్న ఇతని కోటపైన సహజ సిద్ధమైన కోనేరులు నిర్మించుకొని ప్రకృతిని సైతం అక్కడ తన అధీనం లో ఉంచుకో గలిగినంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగిన అసాధరణమైన ఒక సామాన్య మనిషి పాపన్న.కొండ పై భాగాన ఉన్న శిల్పాలు కొన్ని చూసి కిందకి ప్రయాణం అయినాము. అయితే పాపన్న ఆరాధించే ఒక ప్రక్రుతి శిల్పం, దాని పేరు.బయ్యన్న, అది మాకు ఎక్కడా కనిపించలేదు. అది చూడ లేక పోయామే అన్న అసంతృప్తి మాకుఉన్నది. . కాని అప్పటేకే బాగా అలిసి పోయి ఉన్నాము .పైగా సూర్యుడు మాకంటే ముందుగానే తిరుగు ప్రయాణం లో ఉండీ మమ్ములను వేగిర పెడుతున్నాడు.అలనాడు గుర్రాలు సైతం ఎక్కినా గుట్టల పైనకు మాకు పోవడానికే గాదు రావడానికి కూడా చాల కష్టం అవుతున్నది. బండల పైనుండి జారుతూ చెట్ల ఉడలు పట్టుకొని , మెల్ల మెల్లగా కిందికి వస్తున్నాము ఒక్కసారిగా దాదాపు ఏడు ఫీట్ల ఎత్తుగా ఉన్న బయ్యన్న విగ్రహం మాకు అడ్డంగా వచ్చింది నన్ను దర్శించుకోకుండానే మిమ్ములను పోనిస్తానా అన్నట్లు గ మాకు అయన తారస పడేసరికి చాల ఆనంద ఆశ్చర్యాలు కలిగినాయి. కోర మీసాలు, ఏడు చేతులు,ప్రతి చేతిలో ఒక ఆయుధం, ఆ ఆయుధాలన్నీ కూడా ప్రకృతియే.ఇనుప శూలం,విల్లంబులు,పడగ విప్పిన నాగుపాము,అర్ధ చంద్రుడు,డమరుకం,కమలం, యమపాశం,ఉన్నాయ్. ఒక కుక్క,బుద్దుడు,నరుకబడిన శత్రువు తల ఉన్నాయి.దిగంబరంగా చెక్కిన్చుకోబడ్డ ఈ విగ్రహానికి పాపన్న కోట లోనికి వచ్చేటప్పుడు,కోటలోనుండిబయటికి పోయేటప్పుడు పూజున్చుకొని పోయే వాడట. ఆ విగ్రహం కింద నిధి ఉండవచునో ఏమో అనుకోని దుండగులు.తవ్వినారు.విగ్రహం పక్కనుండి తెల్లని సెలయేరు పారుతున్నది.బయ్యన్నను దర్శించుకున్నామన్న సంతోషం మా అలసటను తొలగించింది.చల్లని తెల్లని సెలయేటి నీరు కడుపునిండా తాగి మనుసు నిండా పాపన్న చరిత్రను తలుచుకొంటూ తిరుగు ప్రయాణం అయినాము. గుట్ట దిగువన మరో చారిత్రిక మైదానం . అదే దండు దుబ్బ. తన సైన్యానికి పాపన్న అక్కడే శిక్షణ ఇచ్చేవాడట. సామాన్యులకు, సంపద సృస్తికర్తలకు సరైన వాటా లభించాలంటే సాయుధ పోరు చేయక తప్పదని 375 సంవస్తరాల కింద నే మార్క్స్ మాటే లేని రోజుల్లో మన సర్వాయి పాపన్న మహ్మదీయులైన మొఘల్ లను, హైన్దవులయిన స్తానిక దొరలను ఎదిరించడానికి ఒక చాకలి సర్వాన్న, ఒక మంగలి మాదన్న, ఒక జక్కుల పెరుమండ్లు,ఒక దూదేకుల పీర్ సాహెబ్,లాంటి దళిత బహుజనులతో దండు గట్టి సాయుధ పోరు జేసి దళిత బహుజనుల రాజ్యం సాధించుకున్నాడు.ఇంతటి మహత్తర దార్శనికుడు., ఇంతటి గొప్ప యుద్ద్దవీరుడు,ఇంతటి ప్రజాపక్షపాతి,సంపద సృష్టికర్తలకు సంపద దక్కాలన్న సమ సమాజ వాది యొక్క చరిత్ర గాని, ఒక విగ్రహం గాని తెలంగాణా లో అందునా ఆయన పుట్టిన వరంగల్ జిల్లలో గాని,అయన సమరం జేసిన పొలాస జగిత్యాల, కరీంనగర్ లో గాని లేదా గోల్కొండానే జయించిన ఈ విప్లవ యోధుని విగ్రహం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన గాని పెట్టుమని అడుగడానికి కారణం చరిత్ర తెలియక పోవడం ఒక కారణమయితే దళిత బహుజనులలో తమ ఆత్మ గౌరవ ఉనికి కై తమ అస్తిత్వాలను నిలుపుకోవడానికి తెగించి పోరాడాలన్న సీరియెస్ నేస లేక పోవడం మరో కారణం. సంపద సృస్తికర్తలకు సమ న్యాయం జరుగాలని అనోకొనే వారు,అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించే వాళ్ళు,ఇప్పటికయినా ఒక్కటయ్యి ,375 ఏండ్ల కిందనే మొఘల్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి, అగ్రకుల హైందవ పాలనను ఓడించి, ప్రకృతినే ఆరాధించి ,దళిత బహుజలతోదండు గట్టి సాయుధ పోరుజేసిన తెలంగాణా దేశీ దార్శనికుని మార్గం లో ఆలోచించి రాజ్యాధికారం దిశలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తించవలసి ఉన్నది. పెంటయ్య.వీరగొని. విశ్రాంత విద్యపర్యవేక్షనాదికారి. న్యాయవాది.

No comments:

Post a Comment