Tuesday, September 5, 2017

మనుసుల మాట 15

.                                             

నేటి యువత హేర్ స్టైల్, డ్రెస్ స్టైల , ఫుడ్ స్టైల్, అంటూ తమ లైఫ్ స్టైల్  కు  సినిమా హీరోలను, క్రికెట్ స్టార్ లను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఏమి ఆదర్శమై నిలుస్తున్నదో  చూద్దామా !

ఒక మానసిక శాస్త్ర నిపుణుడు ఏమంటాడంటే , ఎవరైనా ఒక వ్యక్తి తనకు  ప్రత్యేకమైన గుర్తింపుకోసం అందరికీ భిన్నంగా ఒక చెవికి రింగు వేసుకున్నా, వెంట్రుకలను విభిన్నంగా కత్తేరించుకున్నా దాని ఉద్దేశం ఏమిటటా అంటే ఆ మనిషి తనను జనం గుర్తించాలనే తపనలో పడిపోయాడని అర్థం ఆట. వాఖ్యానించే వాళ్ళు రకరకాలైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారనుకో. మనిషి పుట్టుకతోనే గుర్తింపు కోరుకుంటాడనీ , అందుకే తల్లి కడుపులో నుండి బయటకు రాగానే కేర్ కేర్ మని గట్టి గట్టి గా మొత్తుకుంటాడని వాదిస్తుంటారు. కాక పోతే శిశువు సమశీతోష్ణంగా ఉన్న తల్లి కడుపుల నుండి భయంకరంగా ఉండే బయటి వాతావరణానికి రాగానే భరించ లేక భాధతో ఏడుస్తుంది, అది నిజం, బౌతికం కంటికి కనిపించేది. అలాగే ఆకలి కూడా కారణం. కొందరేమో గుర్తింపు ఆకలని అంటున్నారు.

వయసు వంక తీరుస్తది అంటారు. మనిషి ఎట్లా ఉన్నా యుక్త వయసుకు వచ్చిన తర్వాత అందంగా కనిపిస్తుంటారు. దానికి కారణం శరీర నిర్మాణం లో వచ్చిన ఎదుగుదల,  అంతర్గతంగా జరిగుతున్న రసాయనిక మార్పులు,సమతల  హార్మోన్ల విడుదల . యవ్వనమే ఒక సుందరమైన , అందమైన అనుభూతి. తనలో ఏ నైపుణ్యం లేదు అనుకొనే ఒక ఆత్మ న్యూనతా భావానికి గురైన కొంత మంది యువకులు ఏదో తీరుగా తమకు గుర్తింపు దొరుకాలే అన్న తపనతో  ఓ చెవి పోగు ధరించడం, మోకాళ్ళు చిరిగిన లాగులు తొడుక్కోవడం, ఎవడో చేసుకొన్న హేర్ స్టైల్ తనకు కూడా బాగుంటుందని అడ్డగోలు గా కత్తిరించుకొని సెల్ఫీలు దిగి దొస్తు గాళ్లకు పంపుకొని మురిసి పోవడం , జీవితం అంటే అదే , అదే గొప్ప థ్రిల్లింగని, అదే ఎంజాయ్ మెంట్ అని చాలా మంది యువత భ్రమల్లో బతుకడాన్ని  గమనిస్తున్నాము. నా ఈ రాతలు ఏ యువత చదువక పోవచ్చు.  కానీ ఒక బాధ్యత గల పౌరీనిగా ఇది వాళ్ళకు చేరాలన్న తపనతో,  చేరక పోతుందా అన్న ఆశ తో  రాస్తున్నాను.

ఒక భగత్ సింగును , ఒక ఆజాద్ చంద్ర శేకర్ ను, ఎందుకు ఆదర్శంగా చూస్తారంటే యువకులైన వాళ్ళు త్మ సుఖాలకోసం గాకుండా  దేశ అవసరాలకోసం జీవించారు. కాని నేటి యువత వాళ్ళ ఫాషన్ ప్రపంచం కోసం జీవిస్తున్నారు.

మొన్న ఈ నెల 2,3 తేదీలల్లో హైద్రాబాద్ లో , కొ ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ మీటింగ్ విన్నాను. సోనీ సోరీ అని ఒక సామాన్య స్కూల్ టీచర్ ,  సర్కారు బలగాలు ఆమె పైన జరిపిన అత్యాచారం , అఘాయిత్యం , దాస్టీకమ్ వలన రాజ్యాంగ బద్దంగానే రాజ్యం పైన తిరుగుబాటు చేసింది. ఇప్పుడు ఆమె లక్షలాది గిరిజన ప్రజల ఆరాధ్య దైవం అయింది. ఆమె రూపం అందామా చిన్న ఆకారం, బక్క పలుచటి శరీరం, చామన ఛాయ రంగు,ఇప్పటికే ఒక సారి మొఖం పైన ఆసిడ్ దాడి జరిగిన ఫలితంగా కమిలి పోయి ఉన్న ముఖ ఛాయ, అయినా !  ఆమె లెజండ్. అందరూ ఆమెను అభిమానంగా చూడడానికి ,ఆరాధనతో ప్రేమపూర్వకంగా ఆశీర్వదించడానికి కారణం ఆమె తోటి ప్రజల పట్ల చూపు తున్న కన్సర్న్, పంచుతున్న ప్రేమ, సాటి వారి పట్ల కనబరుస్తున్న బాధ్యతాయుతమైన ప్రవర్తన.  అంతే గాని ఆమె గుర్తింపుకు ఆమె గొప్పదనానికి ఆమె రూపం గాని ఆమె పేదరికం కానీ అడ్డుకాలేదు.  కనుక కారు ఉంటేనో , బంగ్లా ఉంటేనో, బుల్లెట్ బైక్ ఉంటేనో, వెరైటీ కటింగ్ ఉంటేనో, చెవికి రింగో, చేతికి బంగారు బ్రాస్ లెటో ఉంటే నో తాము గొప్పవారిగా గుర్తించబడుతాము అనుకోవడమ్ ఒక భ్రమ. ఆ ! అట్లా  వచ్చే గుర్తింపు మరి వేరే గా ఉంటుంది , కానీ ఒక సోనీ సోరీకి , ఒక హిడిమా కు, ఒక భగత్ సింగ్ కు ఉండే గుర్తింపు ఉండదు.

No comments:

Post a Comment