Tuesday, September 5, 2017

ఉపాధ్యాయుల దినం.

                                                

పొద్దున్నే చంటి సురేశ్ అని నా పూర్వపు విద్యార్థి ఫోన్ . సార్ మీకు ఉపాధ్యాయుల దినం సందర్భంగా శుభా కాంక్షలు అన్నాడు. కొద్ది సేపటి తర్వాత అతని బ్యాచ్ కె చెందిన రాజేశ్వరి అనే అమ్మాయి పోనే చేసి అదే మాట చెప్పింది.

ఆ ఇద్దరి ఫోన్ కాల్ లు విన్న తర్వాత అప్పటి ముచ్చట్లు మీతో పంచుకుందామని ఇది రాస్తున్నాను. 1979 సెప్టెంబర్ లో మా నాయన చనిపోయిండు. అప్పుడు నాకు ఈ ప్రపంచమే శూన్యమే  అయిపోయింది. అప్పుడు మా అవ్వ, అక్కలు, నా భార్య అండగా నిలిచి నాకు ధైర్యాన్ని ప్రోది చేసిండ్రు. అనివార్యంగా అప్పుడు ధన్నవాడ మా ఊరు లో ఉన్న ఏకైక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లోకి నేను బదిలీ చేయించుకొని వచ్చిన. 1982-83 అనుకుంటా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో నేను మద్యపాన నిషేదం మీద ఒక ఒగ్గు కథ రాసి  పిల్లలతో ప్రదర్శింప జేసిన. మంచి రెస్పాన్స్ వచ్చింది గ్రామస్తుల నుండి. అదీ ముఖ్యంగా మహిళల నుండి. ఆ ఒగ్గు కథ ప్రధాన కథకుడు చంటి సురేశ్. అందులో ఒక ఎరుకల సాని పాత్ర రాజేశ్వరి వేసింది.

ఆ సంవస్తరం కూడా ఈ యేడు తీరుగానే స్వాతంత్ర దినోత్సవం అయిన కొద్ది రోజులకే వినాయక చవితి వచ్చినట్టు ఉన్నది. నేను ఒగ్గు కథ ట్రూప్ ను తీసుకొని వినాయకుని మండపాలళ్ళకు వెళ్ళి వాళ్ళను అడిగి స్వచ్ఛందంగా దాదాపు ఆరేడు ప్రదర్శనలు ఇచ్చినమ్. ఎక్కడ అనుకుంటున్నరు ? మంతెనల. అక్కడంతా బ్రహ్మణులు, అదీ వినాయక మంటపం , అక్కడ  మద్యపాన నిషేధం మీద మేము  కథ జెప్పుడు. ఒక బ్రాహ్మడు ఆడికి అననే అన్నడు, ఏమిటిదయ్యా ఇది? మేం బ్రాహ్మణులమ్ , ఇక్కడ మద్య మాంసాలు ఎవ్వరమ్ ముట్టం . ఇక్కడ నీ లొల్లి ఏందయ్యా? అన్నడు. మేము కథ చెప్పుతున్నది నడీ మంథని లోని పోచమ్మ వాడ , రావుల చెరు కట్ట, మహా లక్శ్మి గుడి పక్కన ఉన్న గణేశ్ మంటపం ల. మా అధృస్ట వశాత్తు పోచమ్మ వాడల కొందరు కాపొల్లు ఉంటరు. వాళ్ళకు ఒగ్గు కథ అంటే ఇస్టమ్. మా పిల్లలు హరి హరి శంకరా హరి బ్రహ్మ దేవా విద్యజెప్పువాడా యిది బ్రహ్మ దేవా ... అన్న రాగం ఎత్తుకోంగానే వాళ్ళు మా ఆధీనం లోకి వచ్చేవాళ్లు, బస్ అయ్య గారి మాట ను వాళ్ళు సాగనీయ్యలేదు. రాజేశ్వరి ఎరుకలి సాని వేషం వేసుకొని ఎరుక చెప్పే తందుకు వచ్చేది. అప్పుడు సురేశ్ " ఏ ఊరు ఏ పల్లె ఓ ఎరుకలమ్మా - మా కెరుకా జెప్పమ్మా" ! ఆనంగానే రాజేశ్వరి "మా ఊరు ధన్నాడా మరి మాదేపురమూ జిల్లా కరీంనగరూ " అంటూ గజ్జెలు ఘల్లుమన పడదునికేదీ .వంతలు గా రాగం ఎత్తుకొని కంజర డప్పు వాయించే మా బోనగిరి శీను గాడు కంజర వాయించుడుల మా దండి సుతారిగాడు.  పోరాగాండ్లకు  నిండా పన్నెండేండ్లు నిండనోల్లాయే ,  పసి ప్రాయం అమాయకత్వం తో వాళ్ళు మద్యపానం సేవించడం వలన జరిగే అనర్థాలను చెప్తుంటే  జనం గుండెల్లో చొచ్చుక పోయీ మై మరిచి లీనం అయ్యేవాళ్లు. వాళ్ళ అనుభవాలతో జత పోల్చుకొనే వాల్లట .

ఆనాటి పన్నెండేండ్ల పసి పిల్లలు 35 ఏండ్ల తర్వాత నన్ను గుర్తువెట్టుకొని ఎక్కన్నో ఖమ్మం లో , కాటారం లో ఉన్న వాళ్ళు పొద్దుగాల పొద్దుగాల ఫోన్ చేయంగనే పాత సంగతులన్నీ యాదికొచ్చినై .  మనుసు మురిసిపోయింది .

నేను ఆ ఒగ్గు కథ రాయడానికి  నేపధ్యం మా ఇంటి చుట్టూ " నాయకపు" కులస్తులు , మరియు పూసవర్ల వాళ్ళు ఉండేటోల్లు. వాళ్ళు ప్రతి రోజు సాయంత్రం మద్యం సేవించి వచ్చి గొడువలు పడుతూ భార్యల ను కొట్టేటోల్లు . నా చిన్నప్పటి నుండి చూసేటోన్ని. నేను పెరిగి పెద్దగై ఉద్యోగం వచ్చి తిరిగి మా ఊరికి వచ్చేవారకు మద్యానికి అలవాటైన కొందరు చనిపోయి వాళ్ళ భార్యా పిల్లలు అనాధాలైన పరిస్తితి ఉండే. అది చూసి బాధతో రాసిన ఆ ఒగ్గు కథను అంతే ఆర్ద్రత తో ఆ పసి బిడ్డలు ఆడి పాడి  జనం లో కొందరిని అయినా మార్చినారణి తర్వాత జనం చెప్పగా విన్నము.  మహాదే పూర్లోని అప్పటి  మెడికల్ ఆఫీసర్ డా: రామ కృష్ణ రావ్ , గుమ్మళ్ళ పెళ్లి సర్పంచ్ దమ్మి రెడ్డి కూడా మేము కథలు చెప్పే చోటికి వచ్చి సందేశాలు ఇచ్చారు. రాత్రి పూట  ఆ పిల్లగాండ్లను వేసుకొని ఊర్ల పొంట తిరుగుకుంట మద్యపానం వద్దు బాబు అని 35 ఏండ్ల కిందట ఊర్లల్ల మమ్ముల చెప్పనిచ్చిన అప్పటి జనానికి ఇప్పటి జనానికి ఎంత తేడానో మనం గమనించ వచ్చు.

No comments:

Post a Comment