Thursday, December 21, 2017

మనుసుల మాట 19 .

                                           

ఇప్పటికీ సరిగ్గా 16 సంవస్తారాల క్రితం అది , ఇదే డిసెంబర్ 2001 ల నేను మలహార్ మండలం లో ఏం ఈ వో గా పనిజేస్తున్నాను.  చంద్రబాబు సర్కారుల పోలీస్ అధికారం అప్రతిహతంగా  అగ్గై మండుతున్న కాలం.  కొయ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రె పల్లె అనే చిన్నపల్లెటూరు. ఆ పల్లెటూరుకు చెందిన కొందరు యువకులు విప్లవాల బాట వీడి ప్రభుత్వానికి లొంగి పోయారు. మీ చిరకాల కోర్కె ఏదైనా ఉంటే చెప్పండి అన్నారట అప్పటి పోలీస్ ఎస్ పి,  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే వాళ్ళు అప్పుడు, చిన్నప్పుడు  మేము చదువు కోవడానికి మా ఊరిలో బడి లేనందున మేము సమీపాన ఉన్న గంగారం పోవాల్సి వఃచ్చేది, అంత దూరం పోలేక మేము బడికి బందు అయితే అప్పుడు గంగారం లో పనిజేస్తున్న రాజయ్య సార్ రాత్రి పూట వచ్చి మాకు చదువు చెప్పేది. మా ఊర్లో బడి ఉండి ఉంటే మేము కూడా బాగా చదువుకొనే వాళ్ళం , ఉద్యమం లోకి పోకపొయ్యేవాళ్లం అని వాళ్ళు అన్నారట. ఇప్పటికీ మా ఊరిలో బడి లేదు కనుక మా ఊరికి బడి కావాలని అన్నారట.

ఇంకేంది రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా,  ఎం ఈ వో ఐన నాకు ఓ లెటర్ వచ్చింది. గొర్రె పల్లేకు బడి కావాలే అని. ఐతే అప్పటి రూల్స్ ప్రకారం ప్రతి ఆవాసానికి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలనే నిబంధన మేరకు ఒక టీచర్ ను అప్పటికే  మంజురి ఇచ్చారు. కానీ అక్కడ బడి బంగ్లా అప్పటికి మంజూరీ కానందున పిల్లల అవసరం రీత్యా వల్లెమ్కుంట లో ఆ టీచర్ పనిజేస్తున్నాడని,  గొర్రెపల్లే ఆవాసం పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారని నివేదిక ఇచ్చాను. ఇంకేంది ఎస్ పి సాబ్ ఆదేశాల మేరకు అక్కడ బడి పేరుతో ఒక రేకుల షెడ్ వెలిసింది. దాని కి గొర్రెపల్లే ప్రభుత్వ పాఠశాల అన్న  నేమ్ బోర్డ్ తగిలించారు.

దానికి ఒక శుభ ముహూర్తాన ప్రారంభోత్సవ కార్యకారమాన్ని తలపెట్టారు. చుట్టుపక్కల  ప్రతిగ్రామం నుండి ప్రజలను తరలించాలని ,  సర్పంచులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు  పోలీస్ హుకుం వెళ్లింది .వందలాది గా ప్రజలు తరలించబడ్డారు. రేకుల షెడ్ బడి కట్టినదానికంటే నిర్వాహణ ఖర్చు కొన్ని రెట్లు ఎక్కువైందని అక్కడ గోనుక్కోవడం విన్నాను. వచ్చిన సామాన్య ప్రజలకు పులిహోర పోట్లాలు, నీళ్ళ పాకెట్ లు పంచారు. వి ఐ పి లకు మాత్రం కోడి పలావు దావత్ దక్కిందనుకో అది వేరే విషయం.

ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ యువకులు వేదికనుండి మాట్లాడుతూ తాము ఎందుకు లొంగి పోవాల్సి వచ్చిందో చెబుతున్న క్రమం లో అన్నలు అడివిలో ఉంటూ ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నందున మా ప్రాంతం అభివృద్ధి ఆగిపోతున్నదనీ, మాకు రోడ్లు లేనందున మా ప్రాంత ప్రజలు దవఖానాలకు పోలేక పోతున్నారని  ఆ బాధలు చూడలేక, ప్రభుత్వ అభివృధ్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై మేము అడివిబాట వదిలినమ్. అడివిల ఉన్నోళ్ళు ఎంత తొందరగా ఆ బాట విడిచి వస్తే అంతా తొందరగా అభివృధ్ధి జరుగుతదీ అని మాట్లాడిండ్రు. నిర్వాహకులు , ఆహ్వానితులు , ఆ ముచ్చట్లు వాళ్లతోని చెప్పించినోళ్ళు అందరూ చప్పట్లు గొట్టిండ్రు.

ఆనాటి ఈ ముచ్చట ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత నాకు ఎందుకు యాదికచ్చిందంటే , ఇప్పుడే టి వి లో ఒక వార్త వచ్చింది , హైద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో మరో 20 అధునాతన డయాలసిస్ కేంద్రాలను సర్కారు నెలకొల్పిందని. వెంటనే నాకు పాపం ఆ లొంగిపోయిన అమాయకుల ఆవేదన యాదికి వచ్చింది. దవాఖానకు పోయేతందుకు రోడ్లు వచ్చినై , . వైద్యం చేసేతందూకు అధునాతనమైన చికిత్స పద్దతులు వచ్చినై. ఆ నాటికి కిడ్నీల ఫెల్యూర్ అనే మాటే  తెలువని సర్కార్ కామ్రేడ్ లకు అభివృధ్ధి పేరుతో  కిడ్నీల వ్యాధులకు డయాలసిస్ కేంద్రాలు వచ్చినై. రానిదల్లా , లేనిదల్లా అందరికీ అంత్యంత ఆవశ్యకమైన ఆరోగ్యం.  మరి అది ఎందుకు లేకుండా పోయిందంటే? అభివృధ్ధి వచ్చింది కదా? వనరుల విధ్వంసం విజృంభిస్తున్నది,  కాలుష్యం పెరిగి పోయింది , ప్రకృతి అంతరించి పోతున్నది. వాటికి కారకులైన .  కోటీశ్వరుల సంఖ్య దేశం లో పెరుగుతున్నది . . దరిద్రుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో రెట్టింపు అయి రోగుల సంఖ్య కూడా అలివిగాని రీతిలో పెరుగిపోతున్నది.  . అందుకని ప్రాణాంతక వ్యాధుల ఉపశమనానికి దవఖానాలు కూడా అదే నిష్పత్తిలో వస్తున్నాయి. దవఖానాల పెట్టుబడి దార్లకు, కాసుల వర్షాన్ని కురిపిస్తున్నై.  కానీ రానిదల్లా, లేనిదల్లా ,  సామాన్య ప్రజలకు ఆహార భద్రత,  ఆరోగ్య భద్రత, తో బాటుగా రాజ్యాంగ బద్ద హక్కైన ఆరోగ్యంగా ఆనందంగా జీవించే హక్కు.

No comments:

Post a Comment