Tuesday, September 4, 2018

ఉపాద్యాయ దినోత్సవం !

                                               

తావి లేని పూవు ఎలాగో  ప్రజా ప్రాయోజితం లేని విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయ వృత్తి కూడా అలాగే ఉంది ఈనాడు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఆయాస్తానిక భౌగోళిక పరిస్తితులను బట్టి గుంపుకు, కుదురుకు, గణానికి ఒక భాషను ఏర్పాటుజేసుకొని , వారి వారి దైనందిన జీవితాల్లో వారి భావాలను వ్యక్తం జేసుకోవడానికి భాష ఉపయోగపడింది. వారి సామాజిక భద్రతకు, వారి సాంస్కృతిక జీవనవిధాన ఆచరణకు భాష ఉపయోగపడింది. మనిషి గుంపులు గా, గణాలుగా ఉన్న నాటికి ఆహార సంపాదన, శత్రుదాడి నుండి రక్షణయే ప్రధానంగా జరిగేది. గణ జీవన విధానం కంటే అంతకంటే పెద్దనైన  రాజ్య జీవన విధానం ఒకింత రక్షణగా ఉండగలదన్న విశ్వాసం తో ఆనాటి మానవులు రాజ్యాల నిర్మాణం కు ముందుకు వచ్చినారు. అందుకు సైనిక బలగం, యుధ్ధ విద్యల, బౌధ్ధిక విద్యల అవసరం ఏర్పడింది. అప్పటికే ప్రకృతి ధర్మాలపైనా ఒకింత అవగాహన కలిగి యున్న గణ పెద్దలు నదికి ఏటవాలుగా వెళ్ళితే వేట లభిస్తుందనీ, నీటి లభ్యత దొరుకుతుందని చెప్పడం , అది వారికి ఎలా తెలుస్తున్నదో అర్థం కానీ గణ సభ్యులు , అన్నపానీయాల రేవు తెలుపుతున్నారన్న కృతజ్ఞతతో వారిని గౌరవించడం వలన వారు అప్పటికే పూజారి వర్గంగా గుర్తింపబడియుంటారు .ఇది అన్నీ సమాజాలల్లో, అన్నీ నాగరికతలల్లో ఏక కాలం లో కాకపోయినా క్రమానుగతంగా జరిగి ఉంటాయి.
ప్జ్రపంచ వ్యాప్తంగా ఓడిన గణాలు , యుధ్ధం లో  గెలిచిన గనాలకో , రాజ్యాలకో దాసులు గా లేదా బానిసలుగా లొంగి బతుకవలసిన పరిస్తితులే. ప్రాణాలు కాపాడుకోవాలంటే మరో గత్యంతరం లేని పరిస్తితులు, అయితే భారత దేశం లో మాత్రం అప్పటికే ఇక్కడ సింధు నాగరికత, హరప్పో మహోంజొదారో నాగరికతలు వెళ్లివిరిసిన ఈ నెల పైకి యూరోషియా ప్రాంతం నుండి వచ్చిన ఆర్య తెగల తో జరిగిన యుధ్ధాలలో ఓడిపోయిన స్తానిక మూలవాసులను గెలిచిన ఆర్య తెగలు దాసులుగా చేసుకున్నారు. ఓడిన మూలవాసులను దశ్యులు, ద్రావిడులు అని కూడా అన్నట్లుగా చరిత్ర చెపుతున్నది. ఇప్పుడు కొందరు అదంతా తప్పు ఆర్యులు ఇక్కడి ములవాసులే అంటున్నారు. కానీ ఆర్యులు మూల వాసులే అయితే ఈ ద్రావిడులు లేదా దశ్యులు లేదా ఇప్పుడున్న శూద్రులు ఎవరంటే , గజం మిథ్య ఫలాయణం మిథ్య అంటున్నారు. ఈ వాదనజేసేవారి వద్ద జవాబు లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బానిస వ్యవస్తా ఏర్పడితే భారత దేశం లో మాత్రం బానిస వ్యవస్తాకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ శూద్రకుల వ్యవస్తను ఆనాటి విజేతలు సృస్టించారు.

చారిత్రిక ఆధారాలను బట్టి ఆది వేదం అయిన ఋగ్వేదం క్రీ. పూ. 15 వ శతాబ్దం కాలం అంటున్నారు. అప్పటి నుండి ప్రారంభమయిన వేద విద్యలు క్రీ. పూ. 5 శతాబ్దం లో బుద్ధుడు వచ్చి బౌద్ధ మతాన్ని వ్యాప్తి జేసె దాకా వేదాలు అపౌరుశేయాలు వాటిని మహిళలు, శూద్రులు ఉచ్చరించకూడదన్న బ్రాహ్మణవాదుల  విధానాలతో విద్య శూద్రులకు అందకుండా పోయింది. మళ్ళీ క్రీ. శ. ఒకటవ శతాబ్దం లో భారత దేశం నుండి బౌధ్ధాన్ని తరిమి వేసిన తర్వాత వేద కాలం కాస్త హైందవ మతంగా లేదా హైందవ ధర్మంగా మారి యాజ్ఞ వల్క స్మృతి మనుస్మృతి అనే కొత్త కోరలతో శూద్రులను అట్టడుగుకు అణగదొక్కి చదువు కాదుకదా కనీసం గౌరవంగా జీవించే పరిస్తితులు కూడా లేకుండా చేసింది హైందవ ధర్మం.

ఎప్పటిదాకా అంటే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఫ్రీ ఆండ్ కంపల్సరీ ఎదుకేషన్ అనేది మానవుల హక్కు అని 1870 లో చట్టం తెచ్చిన  నేపథ్యం లో 24 సెప్టెంబర్ 1873 లో సత్యశోధక సమాజ్ ఏర్పాటు జేసి శూద్రులు కూడా అందరూ చదువుకోవాలే అనే ఉద్యమం మహాత్మా జ్యోతి బా ఫూలే లేవనెత్తేదాకా శూద్రులందరికి విద్యా అందుబాటులో లేకుండేది అన్నవిషయం మరిచి పోకూడదు.(1835 లో మెకాలే ఎదుకేషన్ చట్టం వచ్చినా అది కొందరు అగ్రవర్ణాల వారికే పరిమితమైంది) . సావిత్రి బాయి ఫూలే కు జ్యోతి బా చదువు నేర్పించి మహిళలకు చదువులు చెప్పించే దాకా భారతదేశం లో శూద్ర జాతికి, మహిళలకు  విద్య అందుబాటులో లేకుండేది . ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలంటే మొట్టమొదటి బహుజనుల విద్యాప్రదాత సావిత్రిబాయి ఫూలే జన్మ దినం అయిన 3 జనవరి ఉపాధ్యాయ దినోత్సవం కావాలి. కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవం కావడం వెనుక ఏ భావజాల ప్రభావం , ప్రయోజనం ఉందో మనం అర్థం చేసుకోవాలి.

భారత దేశ స్వాతంత్ర సంగ్రామం గురించి చదివితే ఆనాడు డా: భీమ్ రావ్ అంబేడ్కర్ ఎవరి నుండి ఎవరికి స్వాతంత్రం కోసం సంగ్రామం జరుగుతున్నది? మా స్వాతంత్రం కోసం జరుగని పోరాటం కోసం మేమేందుకు పాల్గొని పోరాడాలి అని ప్రశ్నించినప్పుడు , ప్రాణాలర్పించేది, రక్తాన్ని ఎరులై పారించే తెగువ కలిగిన బహుజనులు లేకుండా బ్రిటిష్ వాళ్ళ పైన గెలువ జాలమని భావించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ రచనను తప్పని సరి పరిస్తితుల్లో ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమ చరిత్రలను ఔపోశనం బట్టిన అంబేడ్కర్ గారికి ఆ బాధ్యత అప్పగించి కూడా ఎన్ని అడ్డంకులు కల్పించారో అంబేడ్కర్ రచనలు చదివితే అర్థం అవుతాయి. ( అశేష దళిత బహుజనుల రక్తార్పణల పునాదుల పైన అంబేడ్కర్ రాజ్యాంగ ఫలితంగా చదువరులైన కొందరు దళిత బహుజన విద్యావేత్తలు తమ పూర్వీకులను చదువు సంపదలనుండి దూరం జెసి తమ వెనుకబాటు తనానికి అసలైన కారకులను వదిలేసి గత చరిత్రను అవమానాలను మరిచిపోయి వారినే తలకెత్తుకొని పూజిస్తున్నారు).  

డా: అంబేడ్కర్ , భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 27 A పొందుపరిచిన 6-14 సంవస్తారాల పిల్లలందరికి నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పిన ఫలితంగా రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 26 జనవరి 1950 నుండే భారత దేశం లో దళిత బహుజనులందరికీ ఉచితంగా చదువుకొనే అవకాశం వచ్చింది. ఆ గొప్ప అవకాశాన్ని భారత ప్రభుత్వం ద్వారా తమకు ఉచితంగా అందించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతా పూర్వకంగా  ఆనాటి విద్యార్థి లోకం తరఫున ప్రభుత్వాలు ఉపాధ్యాయ దినోత్సవాలు జరిపించింది. అది ఇప్పుడు ఒక ఆనవాయితీ గా మారింది. ప్రభుత్వాల చిత్తశుధ్ధి లేని , బాధ్యత లేని పరిపాలనా విధానాలకు తోడు కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అంకిత భావం విడనాడి బిల్ అండ్ బెల్ సిధ్ద్ధాంతాన్ని తలకెక్కించుకున్న ఫలితంగా నేడు ప్రజలల్లో ప్రభుత్వ ఉచిత విద్యపట్ల విశ్వాసం లేకుండా పోయింది. భారత దేశం లో మొదటి నుండి ఉత్పత్తితో , ఆధునిక సాంకేతికతతో సంబందం లేకుండా సాంప్రదాయ వాద విద్యా విధానం అమలు లో ఉన్నప్పటికినీ సేవా రంగం లో కొంతకాలం దాకా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విద్యా సంస్కరణలను , కరికులం లో జరుగుతున్న ఆధునికతను గమనించ కుండా , అయితే విదేశీ విద్యను యథాతధంగా అమలు చేయడం,లేదా ఏకంగా ఇప్పుడైతే విదేశీ విశ్వవిద్యాలయాలనే ఆహ్వానించడం, ఇంకా కాదంటే క్రీ. పూ. 1500 ఏండ్లనాటి కాలం చెల్లిన విషయాలను అత్యంత ఆధునికాలని నూతన విద్యా విధానం పేరుతో ప్రజలకు ఎక్కించాలని పూనుకోవడం వలన ప్రభుత్వ ఉచిత విద్య ప్రజల్లో మరింత చులకనై పోతున్నది. ఇలాంటి పరిస్తితుల్లో తమకు ఉపాధిని ఇవ్వని , ఉద్యోగం ఇవ్వని సమాజం లో గౌరవం ఇవ్వని విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుల పట్ల కూడా విద్యార్థులకు తద్వారా విద్యార్థుల తలిదండ్రులకు గౌరవం లేకుకుండా పోతున్నది. ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల గౌరవ మర్యాదల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.

No comments:

Post a Comment