Wednesday, August 5, 2020

కొత్తాచూపు కోసం ఎదిరిచూద్దాం !

                                 కొత్త చూపుకోసం ఎదిరిచూద్దాం! 


మొన్నటినుండి వాట్సాప్ లల్లో ఫెస్బుక్ లల్లో సివిల్ సర్వీస్ ర్యాంకర్లకు అభినందనలు తెలుపుతూ కొందరు పోస్టింగ్లు పెడుతున్నారు. మంచిదే కదా? మెరిటోరియస్ వ్యక్తులను అభినందిస్తే ఆనంద పాడాల్సిందే కదా,  అభ్యంతరం దేనికి అన్న ప్రశ్న సహజంగానే ఎవరైనా వేస్తారు. బ్రిటిష్ పాలకుల నాటి ICS నుండి ఇప్పటి IAS, IPS లవంటి సివిల్ సర్వెంట్స్ అంటే ప్రజల సేవకుల దాకా  ఎవరికి సేవజేస్తున్నారో నేను మరోసారి చెప్పవలసిన అవసరం లేదు. అప్పటి నుండి ఇప్పటి దాకా ఈ సివిల్ సర్వీస్ సేవా రంగం లోకి ప్రధానంగా ఎవరు వస్తున్నారో చూద్దాం. అధికారం చెలాయించడం లో, ఆనందం పొందే వర్గాలు, తనకున్న హోదా ద్వారా లభించే గౌరవ మర్యాదలు, అతిధిసత్కారాలు, ఆదరణల రుచి తెలిసిన వారు మరీ కోరి కోరి ఈ రంగం లోకి వస్తున్నట్లు మనం గంనించ వచ్చు. డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, ఒకప్పుడు ఇంజ నీర్ల కొడుకులు ఇంజనీర్లు, అవుతున్నట్టుగానే సివిల్ సర్వీస్ లో పని జేస్తున్న వ్యక్తులు తమ పిల్లలను ఎన్ని కోచింగ్ లు ఉంటే అన్నీ కోచింగ్ లకు పంపి కొండోకచో తమ పలుకుబడి ఉపోయోగించి  ఇంటెర్వ్యూ లో నెగ్గింపజేసి తమ సంతానాన్ని సివిల్ సర్వెంట్లు గా చేస్తున్నారు.  అడపాదడపా ఎక్కడో ఒకచోట వెనుకబడిన తరగతులకు చెందినవారు కూడా అప్పుడప్పుడు  వస్తున్నారు. ఇక ఉన్న రిజర్వేషన్ అవకాశాన్ని వినియోగించుకొని Sc,St బిడ్డలు కూడా  కొందరు వస్తున్నారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే సివిల్ సర్వీస్ లోకి వస్తున్న మెజారిటీ పిల్లలు సవర్ణులో లేక సంపన్నులో అయి ఉంటున్నారన్న విషయం మనం గమనించాలి. తమ కులం వాడని, తమ మతం వాడని, తన ప్రాంతం వాడని ఎంత పక్షపాత పరిపాలన సాగుతున్నదో చూస్తూనే ఉన్నాం.  ఎలాగో ఓ లాగున వస్తున్నారు సరే! వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి చేస్తున్నారో జగమెరిగిన  సత్యమే కదా? రాజకీయ నాయకుల ప్రజాకర్షణ, ఓట్ల రాజకీయ పథకాలను అమలు చేసే పనిలో వాళ్ళు తీరికలేకుండా పనిజేస్తున్నారు. ఎక్కడో మచ్చుకు ఒక శంకరన్ లాంటి ప్రజాసేవా తత్పరతులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒక పూనమ్ మాలకొండయ్య లాంటి ఖచ్చితమైన అధికారులు అక్కడక్కడ కనిపిస్తుంటారు . సెలక్ట్ అయినకాన్నుంచి వాళ్ళకు లభించే శిక్షణ, దర్జా, సౌకర్యాలు, నౌకార్లు,చౌకర్లు, కార్లు, బంగ్లాలు, సేవకులు, లాంటి అనేక రాజలాంచనాలు ప్రజల డబ్బులతో సమకూర్చబడుతాయి. కానీ మెజారిటీ సివిల్ సర్వెంట్లు ఒక  PM,CM , Ministers, కు ఇచ్చే విలువలో పైసా వంతు కూడా సామాన్య ప్రజలకు ఇవ్వంగా నేనైతే చూడలేదు. మరి అంతంతేసి చదువులు చదివిన వివేచనా  పరులని, అత్యంత తెలైవైనవారనీ,  అసాధారణ ప్రజ్ఞావంతులని ఎన్నుకోబడిన ఈ సమూహం అంత స్వార్థ పూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నదంటారు ? అంటే చిన్నప్పటి నుండి తనకు బోధించ బడుతున్న విద్య, మరియు విలువలు ఎలా ఉంటున్నాయో చూడాల్సి ఉంటుంది.  తనకున్న నైపుణ్యం, తెలివితేటలు తన పూర్వీకుల జీన్స్ , తన కృషి ఫలితంగా  కాకుండా పూర్వజన్మ సుకృతం, దైవ కృప అనే ఒక అశాస్త్రీయమైన ఆలోచనా విధానం ఒక కారణమైతే, మరోకారణం సమాజం లో , నీవు ఎట్లా సంపాదించావనేది కాకుండా ఎంత సంపాదించావనే ప్రాతిపదికన గౌరవ మర్యాదలు లభించడం ఇంకో కారణం . 1947 నుండి మనం గమనిస్తే ఆ తొలి రోజుల్లో త్యాగపూరిత ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకోసం పనిజేసిన వారికి గౌరవ మర్యాదలు లభించేవే. కానీ ఇప్పుడు అతనికి ఉన్న సంపదను బట్టి అతనికి మర్యాద దొరుకుతున్నది. ఇప్పుడు చాలమందికి ఆదర్శం అంబానీలు, ఆదానీలు, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఉన్న వ్యక్తులు ఆరాధ్యం అయి కూర్చుంటున్నారు. కనుక ఆ పోటీలో ఎవరికి ఎంత చేతనైతే అంతా కూడబట్టుకొనే యావలో ఆ  పరుగుపందెం లో పాల్గొంటూ దక్కినకాడికి చిక్కించుకొనే పనిలో ఉంటున్నారు. ఇది కేవలం సివిల్ సర్వెంట్లే అలా చేస్తున్నారా అని వారిని ఆడిపోసుకోలేము. అటెండర్ నుండి IAS, దాకా, వార్డు మెంబర్ నుండి CM, లు PM ల దాకా ఎవరికి అవకాశం లభిస్తే వారు డబ్బుకోసమో అధికారం కోసమో సామాన్య ప్రజల ఎదల పైన్నుండో ,తలల పైన్నుండో ఎదిగి అందలం ఎక్కుతున్నవాళ్లే. అది ఈ కాలం నీతి అయ్యింది. పరుగుపందెం లో నీవు వెనుకబడకూడదనుకుంటే పక్కోడు పడిపోతున్నా నీవు పట్టించుకోవద్దు. దయ, జాలి , కరుణా, సౌభ్రాతృత్వం, సౌశీల్యం వంటి మాటలు  వద్దు, నీ గోల్ వైపు నీవు సాగిపో. నీ లక్ష్యం  డబ్బు సంపాదన, అధికారం సంపాదన అదే నీ కండ్ల ముందు కదులాడాలి. అందుకు నీవు డాక్టరువు అవుతావా? ఇంజనీరువు అవుతావా? సివిల్ సర్వెంటువు , రాజకీయనాయకుడువి అవుతావా? లేకుంటే బాబా అయినా ఫరువాలేదు  అన్న నీతి చలామణిలో ఉంది. 


ఇది మారాలంటే బడులు, విశ్వవిద్యాలయాలు, ఆరోగ్యశాలలు, అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. అందుకు ప్రజా ఉద్యమాలు జరుగాలి. 


No comments:

Post a Comment