Saturday, July 24, 2010

మా తల్లి భూదేవి

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము!

మా తల్లి భూదేవి మన్నిస్తావా మమ్ము
లక్షల సంవస్తారాలు మంచు దుప్పటిల మగ్గి
బడబాగ్నిగ బద్దలయ్యి పురిటి నొప్పులెన్నోతీసి
గాలి నీరు గుట్ట చెట్టు ప్రజలను ప్రసవిస్తివమ్మ

మహిమగల్లా నీదు మన్నులానుంచెల్లి
నీళ్ళు నిప్పులే గాదు అన్న పానాదులను
అడుగకుంటిచ్చినవు ఆదికాలము నుండి

నీ ఎద పైన కాలూని ఎదిగినవి వృక్షాలు
పూలు పండులే గాదు కొమ్మరెమ్మలే గాదు
ఔషధీ యుక్తమగు ఆకులలములు ఇచ్చి
సల్లంగా సాదినవు ఎల్ల జనులను తల్లి

పుడమి తల్లలనాడు పుక్కిలుంచుమిసిన
గండుశిల కొండలు బండ రాళ్లన్నియు
మేఘాల పిండినవి నీ కడుపు నింపినవి
వడగాలి సుడిగాలి అధిక ఉష్ణోగ్రతల
అడ్డు నిలిచాపినవి అందరూ బతుకుటకు.

కానీ........... తల్లీ............

తల్లి వీపును చీల్చి తల్లినే చంపేటి
తేలు పిల్లల తీరు తేలినము మేమంత
అడవులను నరికినము బోడులను చేసినము
సంద్రాల నిండుగా విషమునూ నింపినము

ఐరనూ ఓరనీ సున్నాపురాయని
గ్రానైటు క్వారియని ఓపనూ కాస్టుయని
తల్లి నీ కడుపునూ పెళ్లగించితిమమ్మ
అయిలూ లాగేసి బొగ్గునూ తవ్వేసి
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

రేడియము థోరియము ఆటమూ బాంబులతో
మా బొందలను మేమే తవ్వుకుంటున్నాము
కూర్చున్న కొమ్మనే నరుకుకుంటున్నాము
అడ్డగోలుగ నిన్ను అమ్ముకుంటున్నాము

No comments:

Post a Comment