Sunday, May 14, 2017

మహుసుల మాట 5.

                                                              మనుసుల మాట 5  

ఈ రోజు ఉదయం సాక్రెమంటో లో ఉన్న మా చిన్నమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు తాను కూడా బాహుబలి సినిమా చూసినట్టు చెప్పింది. సినిమాలో శివగామి పాత్రనే అన్ని అధికారాలు కలిగి అందరూ ఆమె  మాటనే శిరసావహిస్తున్నట్టుగా , చాలా ఔన్నత్యంగా  చూపారు గదా నాన్న అని అంది. అవును రాచరిక  సమాజం చాలా గొప్పది , స్త్రీలకు రాచరిక వ్యవస్తలో  ఎంతటి గొప్ప ప్రాధాన్యత ఉండేదో చూడండి , అని చెప్పడానికి రచయిత ప్రయత్నం చేసి నట్టు కనిపింస్తుంది అని అన్నాను. అంటే మరి నిజంగా లేదంటారా అని ప్రశ్నించింది. అప్పుడు నా మనస్సులో సమాజాల అభివృధ్ధి జరిగిన తీరును వివరించిన రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సే గంగా పుస్తకం చటుక్కున మెదిలింది . బేటా ఫ్రీ గా ఉన్నావా ఎక్కువ సేపు చెప్పేది ఉందని అంటే ఫరువాలేదు చెప్పు నాన్నా అంది.  అట్లా మొదలైంది ఈ దిగువన నేను రాస్తున్న విషయం.

ఓల్గా నుంచి గంగకు పుస్తకం అట్టమీదనే అడుగుజాడల  గుర్తులు , అనాచ్ఛాదిత మొరటు పాదాల అడుగు ముద్రల నుండి  నాగరిక పాదరక్షల పాదముద్రల వరకు సాగిన పయనం అని అర్థం వచ్చే విధంగా ఉంటుంది. దానిలో మొదటి కథ " నిశ " . ఇది ఓల్గా నదీ తీరం ఎగువన ఇండో యూరోపియన్ జాతి సమూహం లో క్రీస్తు పూర్వం 6000 ఏండ్ల కింద జరిగిన విషయం గా చెప్పబడుతుంది. క్రీస్తు పూర్వం 6000 ఏండ్ల కింద మాతృ స్వామిక సమాజం ఉండేదని చెప్పబడుతుంది. అంటే ఆ గుంపు కు అధిపతి ఒక స్త్రీ మూర్తే ఉంటుందన్న మాట. ఆమె ఆజ్ఞ ప్రకారం ఆ కుటుంబ సభ్యుల వేట, ఆహార పంపిణీ, ఉండేది, ఆ ప్రాథమిక కుటుంబ జీవన విధానం ఎలా ఉండేదో ఆ కథలో చెబుతాడు.  క్రీ. పూ. 3500 సంవస్తరాలల్లో జరిగిన దివ కథలో అయిదారుగురు ఉండే కుటుంబం పదుల సంఖ్యలోకి ఎదుగడం కనిపిస్తుంది. క్రీ. పూ. 2500 నాటికి పురూహుతుని కతద్వారా కజకిస్తాన్ లో  స్టిరవ్యవసాయం మొదలైనట్లు తెలుస్తుంది.  క్రీ.పూ. 2000 నాటికి పురాధానుడు కథలో  ఎగువస్వాల్ దేశం లో ఇండో ఆర్యన్ జాతి ఉన్ని దుస్తులు ధరించడం, ఆవు పాలు పెరుగు, సోమరసం సేవించడం, రాతి ఆయుధాల స్తానమ్ లో లోహ ఆయుధాలు రావడం మొదలౌతుంది. అంతవరదాకా ఉన్న మాతృస్వామిక పోకడలనుంచి ఉత్పత్తుల పైన పురుషుల ఆధిపత్యం మొదలైనట్లు ఉంది. క్రీ.పూ. 1800 నాటికి గంధారం ( తక్షశిల ) దేశం లో ఇండో ఆర్యన్ జాతి ఆంగిరా ,  కథలో  సురులు, అసురులు, రాజ్యాలు , వారి మధ్య యుధ్ధాలు, దైవ పూజా మొదలైనట్లు చెప్పబడుతుంది.  క్రీ.పూ.490 బంధుమల్లు కథ నాటికి బుధ్ధుని అనాత్మ వాద  సిధ్ద్ధాంతమ్  ప్రచారం లోకి వస్తుంది.

ఈ పరంపరను పరిశీలించినపుడు పురా యుగం లో స్త్రీకి ఉన్న స్వేచ్చా స్వాతంత్రాలు , ఎట్లెట్లా అయితే మానవ శ్రమ, సృజన కలసి వనరులను ఉపయోగించి సంపద సృస్టించబడడం మొదయ్యి అభివృధ్ధి చెందుతూ వచ్చిందో , అట్లట్లా ఆధిపత్యం మహిళల నుండి కండబలం కలిగిన పురుషుల చేతిలోకి వెళ్ళినట్లు గమనించ వచ్చు. , ఆహార సేకరణ , ఉత్పత్తి, స్వీయ రక్షణ అవసరం పెరిగినా కొద్దీ మానవులు చిన్న కుటుంబం నుండి గుంపులు గా అక్కడనుండి, గణాలు గా, గణం నుండి రాజ్యాలుగా రూపాంతరం చెందిన విషయం గమనించవచ్చు. యూరప్ ఖండం లో 1649 నాటికే అలివర్ క్రాంవెల్ వంటి వారు చార్లెస్ 1 ను చంపివేసి రాచరిక వ్యవస్తను తొలగించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్టాపించినారు. అంటే యూరప్ సమాజం లో 1650 నాటికే రాజరిక పాలన తొలిగిపోయింది. అక్కడ ప్రజాస్వామిక హక్కులు , పార్లమెంటు ఓటుహక్కు లాంటి భావనలు ఆనాటికి అంకురించాయి.

అదే భారత దేశం లో అప్పటికి మొఘల్ చక్రవర్తుల పాలన కొనసాగుతున్నది.  తెలంగాణలో ఐతే కుతుబ్ షాహిల చివరి రాజు  ( అబుల్ హసన్) తానీషా పాలన సాగుతున్నది..భారత దేశం లో రాచరిక పాలన వ్యవస్త అంతం కాకముందే బ్రిటిష్ పాలన రావడమ్ , వాళ్ళు కూడా రాజులను యధావిధిగా కొనసాగించి ప్రజాస్వామిక పునాదికి అవకాశం ఇవ్వకపోవడం, 1947 భారత స్వాతంత్ర దినం దాకా భారత దేశం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫ్యూడల్ వ్యవస్తానే కొనసాగింది. యూరప్ సమాజానికి భారత సమాజము మధ్యన  ప్రజాస్వామిక వాతావరణానికి 300 సంవస్తరాల  వెనుక బాటుతనం ఉంది.

ఆ లక్షణం మనకు శివగామి పాత్రలో దర్శకుడు చూపిస్తాడు. శివగామి తన పుత్రులు పెద్దపెరిగే దాకా సమర్థవంతంగా శత్రు భయం లేకుండా రాజ్య భారం వహించేటంతటి చతురురాలు. అంతటి రాజనీతి తెలిసిన శివగామి అవతలి సాటి మహిళ అభిమతం తెలుసుకోకుండా తన కుమారునికి భార్యగా నిర్ణయించేంతగా తన పుత్ర వాత్సల్యం తన బుధ్ధిని కమ్మివేసిందని మనం నమ్మాలి. ఆ నిమిషం దాకా ఎంతో సమర్థుడు గా కనిపించిన బాహుబలి తన మాట కాదన్న మరుక్షణమే అతడు రాజ్యాధికారానికి పనికి రాడన్న నిర్ణయం తీసుకోగలిగినంత చపల చిత్తురాలు అయిపోతుంది. ఆ తర్వాత బాహుబలి ని చంపివేయుమని కట్టప్పను ఆదేశించే టంతటి విచక్షణ హీనురాలు అయిపోతుంది. సరే దశరథుని భార్య కైకేయి వలె అలా అయిందనే అనుకుందాము. అంతటి మాహారాజ్ఞి ని కట్టప్ప లాంటి ఒక బానిస కూడా ఏకవచనం తో తప్పుజరిగింది శివగామి అన్నా ప్రేక్షకులకు తప్పుకాదు అన్నంతటి కోపాన్ని శివగామి పైన ప్రేక్షకులకు దర్శకుడు కలిగిస్తాడు. సరే ఆ బానిస అలా చెప్పంగానే మళ్ళీ శివగామి మంచిది అయిపోతుంది. ఏమీ ! శివగామీ అనే స్త్రీ కి ఒక వ్యక్తిత్వం , స్వంత నిర్ణయం ఉండనంతటి  బలహీనమైన మనిషా? అలా ఎవరు ఎటు చెపితే అటు వెళ్లిపోయేటంతటి  చపల చిత్తు రాలిగా శివగామి పాత్రను  చిత్రించడమ్ వెనుక ఈ దేశం లో ఇంకా ఇప్పటికినీ కొనసాగుతున్న ఫ్యూడల్  పురుషాధిక్య భావజాలమే ప్రధాన కారణం. అంటే ఇప్పటికీ స్త్రీ యొక్క బుధ్ధి బలాన్ని, యోగ్యతను స్వీకరించలేనంతటి అప్రజాస్వామిక భావజాలం లో భారతీయ పురుష సమాజం ఉంది అని చెప్పడానికి శివగామి పాత్ర ఒక చక్కని ఉదాహరణ .

No comments:

Post a Comment