Saturday, September 7, 2019

చంద్రయాన్ ప్రయోగాల మరో పార్షమ్.

                             చంద్రయాన్ ప్రయోగాల మరో పార్షమ్. 

ఈ రోజు మధ్యాహ్నం  చంద్రయాన్ పైన నేను పెట్టిన నా ఆలోచనలను సంపూర్ణంగా సమర్థించని కొందరు నా శ్రేయోభిలాషులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు, అవి ఏమిటంటే…
1). అభివృధ్ధి అనేది సమాంతరంగా జరుగాలి  , ఏ శాఖ పని అది చేసుక పోవాలి. . ఒక దాని కోసం మరొకదాన్ని ఆపివేస్తే అది సమగ్ర అభివృధ్ధి అనిపించుకోదు. 
2). రష్యా, అమెరికా , చైనా తర్వాత రోదసీ లో వియజయవంతమైన ప్రయోగాలు చేసిన ప్రపంచం లోని  4 వ దేశం గా మన దేశ శాస్త్రజ్ఞుల టాలెంట్ ను మనం గుర్తించాలి. 
3). ISRO ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రీయ దృక్పథాన్ని ఉటంకించ లేదు. 
4). దేశం యావత్తు isro కృషిని పొగడుతుంటే మీరు దాన్ని అంగీకరించక పోవడం సరిగాదు; 

పై నాలుగు అభ్యంతరాలను పరిశీలిద్దాం.
1). అభివృధ్ధి సమాంతరంగా జరుగాలి. 
 " దేశమంటే మట్టి గాదోయ్ - దేశమంటే మనుషులోయ్" , గురుజాడ అన్నప్పటికినీ  మనందరం గూడా ఆ మాట తో కొంత సయోధ్య కలిగే ఉన్నాము. భారత దేశం లో 58శాతం ప్రజలు ఇప్పటికినీ ఇంకా గ్రామాలల్లో వ్యవసాయం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే 130 కోట్ల భారత ప్రజానీకం లో 75 కోట్ల మంది ప్రజలు ఆధార పడి జీవిస్తున్న రంగమైన వ్యవసాయాన్ని గాలికి వదిలేసి ఇప్పటికిప్పుడు భారత ప్రజలకు అత్యవసరం కానీ రోదసీ పరిశోధన కు అన్నేసి కోట్లు ఖర్చు చేయడం భావ్యమేనా? చేస్తే చేసిండ్రనే అనుకుందాం. వారి పరిశోధన వ్యవసాయం తో బాటుగా ఉష్ణమండలం అయిన భారత దేశం లో ప్రజలు ఇంత ఉక్కపోత వేడి తో సతమతమై పోతున్న క్రమం లో పర్యావరణానికి , పంటల దిగుబడి కి, దోహద పడేదిగా వాళ్ళ పరిశోధన  ఉండాలి. లేదా, ఉంటే ప్రజోపయోగకరం . కానీ మరింత పర్యావరణ హానికరమైన రేడియేషన్ కు కారణమయ్యే రేడియో విద్యుత్ తరంగాలను ఉత్పత్తి జేసె ఉపగ్రహాల చెత్తకుప్పలను రోదసీ లో ఇబ్బడి ముబ్బడి గా ప్రవేశ పెడుతూ మల్టీనేషనల్ కంపనీలకు లాభాల పంటలు పండించే టెక్నాలజీ సృస్టించి , సామాన్య ప్రజానీకాన్ని ఉత్పత్తి క్రమం నుండి దూరం జేస్తున్న ఎంటర్టైన్ మెంట్ జాడ్యాన్ని ప్రజలకు అంటగడుతుంటే పాలకవర్గాలు భళా భళా అని కీర్తిస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అధికార పక్షానికి అంటకాగుతుంటే , దాని అభివృధ్ధి ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేక పోవడం, ఉన్నా విషతుల్యమే అయితే దాన్ని సరైన దిశలో పెట్టే ప్రశ్నించే విధానం అవసరమే అని నా అభిప్రాయం.  
2). ప్రపంచ 4 వ దేశం గా టాలెంట్ ను గుర్తించడం . 
మన శాస్త్రజ్ఞులు చేస్తున్న ప్రయోగాలల్లో వారు ఉపయోగిస్తున్న సరంజామా సింహా భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదే. స్వదేశీ సరంజామా, సాంకేతికత మనం ఇంకా అభివృధ్ధి చేసుకొని మన స్వంత టెక్నాలజీ పైన ఆధార పడి ప్రయోగాలు  చేస్తే తప్పకుండా మనం వారిని అభినందించ వలసిందే. అలాగే రోదసీ లో ప్రయోగాలు ఎందుకు చేయాలి? అంటే మన భూమి తో బాటు గా ఉనికి లోనికి వచ్చిన తక్కిన గ్రహాలు ఏ స్తితి లో ఉన్నాయి? అక్కడ మానవ మనుగడకు అవసరం అయిన గాలి, నీరు, వాతావరణం ఉన్నాయా? ఉంటే మానవ కళ్యాణం కోసం వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? ప్రపంచానికి ఇదిగో ఇది మన కాంట్రీ బ్యూషన్  అని చెప్పగలిగే స్తితి లో ఉండాలి. కానీ జరుగుతున్నది ఏమిటి? సాధించినది ఏదైనా ఉంటే అది మా ఘనతే అని రాజకీయ నాయకులు మార్కెటింగ్ జేసుకోవడానికే ఉపయోగించుకొంటున్నారు. ఒకవైపు భూమి పుట్టు పూర్వాల పైన ఇస్రో ద్వారా పరిశోధన అంటారు,మరోవైపు మాది సనాతన ధర్మం, ఈ చరాచర సృస్టికి మూలం భగవంతుడే తప్ప ఏ సైన్స్ గాదని మొండిగా వాదిస్తారు. ఈ ద్వైదీ భావం తో ఎవరిని మోసం చేయడానికి ఈ పరిశోధనలు అని ప్రశ్నించవలసిన అవసరం లేదా?
3). ISRO శాస్స్త్రీయతను ఉటంకించడం ....

నిజమే ఇస్రో కు ఉన్న శాస్త్రీయత ఏమిటి అన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఇస్రో శాస్త్రజ్ఞులు రాకెట్ , రాకెట్ లాంచర్, చంద్రయాన్ మిషన్ రూపొందించి దానిని ప్రయోగించే ముందు మన తిరుపతి వెంకన్న పాదాల వద్ద పెట్టి అర్చనా చేయించి ప్రయోగం విజయవంతం కావాలని కొబ్బరికాయ కొట్టి దేవునికి నైవేద్యం సమర్పించి , ఆ ప్రాజెక్ట్ రూపకర్త , సృస్టి కర్త అంతా దేవుడే అతని దయయే   అని ప్రార్థించి వస్తారు. అక్కడ ఇంకా మన శాస్త్రజ్ఞుల విజ్ఞానం ఏముంది, అంతా దేవుని దయ యే కదా? దేవుని దయ ఉంటే అది విజయవంతం అవుతుంది లేకుంటే కాదు. మరీ ముఖ్యంగా దేవుడు ముందే నిర్ణయించిన ప్రకారం అది విజయవంతం కావాలని రాసి పెడితే విజయవంతం అవుతుంది. లేకుంటే లేదు. అంతే కదా? సైన్స్ ప్రకారం పదార్థం ప్రధానం అంటుంటే , ఆస్తిక వాదులు భావం ప్రధానం అంటారు. మనం ఒకవైపు పదార్థ పరిణామ క్రమాన్ని పరిశోధించే ప్రయోగానికి పూనుకుంటూ , పదార్థం ప్రధానం కాదు, మనం ఉంది అనుకుంటే ఉంటది, లేదు అనుకుంటే ఉండదు అన్న సిద్ధాంతాన్ని బోధించే భగవంతుని దయ అనే సిద్ధాంత  విధానం ఎలా శాస్త్రీయం అవుతుంది అన్నది కూడా నా ప్రశ్న. 
4). ISRO కృషిని పొగడక పోవడం. 

ఇప్పుడు పరిస్తితి ఎలా ఉందంటే, మన ప్రధాని ఇస్రో శాస్త్రజ్ఞుల తో 20 నిమిషాల పాటు ప్రసంగించిన తన ప్రసంగ ప్రారంభం లోనే " భారత్ మాతా కి జై " అన్నారు. ఆయన అలా అన్నప్పుడు ఎవరైనా అలా అనకపోతే అతడు దేశ భక్తుడు కాదు అన్న అభిప్రాయం ప్రోవోక్ చేయబడింది. కనుక ఇపుడు ప్రతిపక్షం , పత్రికలు అన్నీ కూడా " నమహోమ్" అంటున్నాయి. మొన్నటికి మొన్న 370 ఆర్టికల్ రద్దును సమర్థించని కాంగ్రెస్ పార్టీ ని ఏమని అన్నారో విన్నాం . కనుక అందరూ ఇప్పుడు మోడీ దేన్ని సమర్థిస్తే అందరూ దాన్నే సమర్థించే , దేన్ని వ్యతిరేకిస్తే దాన్ని వ్యతిరేకించే ఒక పరాధీన పరిస్తితి లో ఉన్నారు. అయినా 130 కోట్ల భారత ప్రజలల్లో రోజూ పత్రికలు చదివే వారు 10 శాతం కూడా ఉంటారో ఉందరో నాకు అనుమానమే. అలాంటి వాళ్ళకు మాత్రమే చంద్రయాన్ వైఫల్యమో, సాఫల్యమో కొంత తెలుసు. వాళ్ళంతా నోరుండి మాట్లాడజాలని అవసరార్త్తులో అనుచరగణాలో అయి ఉంటారు. కనుక వాళ్ళు ప్రామాణికం కాదు అన్నది నా ఉద్దేశం. పైగా 978 కోట్ల రూపాయల ప్రజా ధనం కొన్ని వేల పనిగంటలు వృథా అయిపాయే గదా? మన శాస్త్రజ్ఞులు దేవుని పైన భారం వేయకుండా తమ సామర్థ్యం పైన నమ్మకం ఉంచి మరింత సైంటిఫిక్ గా ఆలోచించి , మరింత సామర్థ్యం తో  పని చేసి ఉంటే నిజంగానే ఆ ప్రయోగం సక్సెస్ అయ్యేది కదా అన్నది నా బాధ. సరే అది ఎంత సక్సెస్ అయినా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను ఎంతో కొంత నెరవేర్చెదిగా ఉన్నప్పుడే దానికి సార్థకత . లేదంటే ప్రజలను మరికొంత కాలం మభ్యపెట్టడానికి పాలక వర్గాల చేతిలోని పనిముట్టుగానే ఈ ప్రయోగాలన్నీ మిగిలి పోతాయి.                                                    

No comments:

Post a Comment