Sunday, December 1, 2019

ఆర్టీసీ సమ్మె - ఉద్యోగుల పై కెసిఆర్ వరాల జల్లు.

                        

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె జేసినన్ని రోజులు వాళ్ళ పైన ఉరుములు పిడుగులు కురిపించిన వ్యక్తి అకస్మాత్తుగా ఇయ్యాల వరాల జల్లు ఎందుకు కురిపించి నట్టు? కొందరు 
టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు కీర్తిస్తున్నట్టుగా ఆయన కరుణామయుడు, చేతికి ఎముకలేని  అపర దానకర్ణుడేనా ? లేక ప్రజాస్వామిక ఆకాంక్షలకు విలువ ఇచ్చే ఉద్యమనేతనేనా ఆలోచిద్దాం. 

ఆర్‌టి‌సి ని రక్షించుకుందాం అన్న నినాదం తో, ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో బాటుగా వారి సర్వీస్ రూల్స్ కు , సౌకర్యాలకు సంబంధించిన మరికొన్ని డిమాండ్స్ తో ఆర్టీసీ ఉద్యోగ్గులు 4అక్టోబర్ నుండి సమ్మేలోకి దిగిన నాటినుండే సియెమ్ కెసిఆర్ నేరుగా రంగం లోకి దిగి సమ్మెను ఉక్కుపాదం తో అణగదొక్కే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆర్టీసీ ఎండి గాని, కార్మిక శాఖ అధికారులు గాని, ఆర్టీసీ మంత్రి గాని దశలవారిగా స్పందించాల్సి ఉండగా నేరుగా సియెమ్ ఎందుకు కలుగ జేసుకున్నట్టు అని ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన మందకృష్ణ, కోదండరాం , బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తూనే ,  ఆర్టీసీ ఆస్తులపైన కన్నెసే సియెమ్ నేరుగా జోక్యం చేసుకున్నారు అని విమర్శలకు పూనుకున్నారు. ఖమ్మం లో శ్రీనివాసరెడ్డి ఆనే ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య కు పాల్పడేదాక ఆర్టీసీ మంత్రి, కొందరు బంగారు తెలంగాణ గ్రూప్ మంత్రులు ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సమ్మెను వ్యతృరేకిస్తూ మీడియా ముందు మాట్లాడినా శ్రీనివాస రెడ్డి మరణం తర్వాత అంతా సైలెంట్ అయిపోయినారు. కానీ సమ్మె ఉదృతం అవుతున్న క్రమం లో స్వయంగా ముఖ్యమంత్రే గంటల తరబడి సమీక్షలు జరిపి,గడువు లోగా డ్యూటీ లో జైన కాకుంటే సెల్ఫ్ డిస్మిస్సే అన్నాడు. ఆయన మాటను ఆర్టీసీ ఉద్యోగులు ఖాతరు చేయకపోవడం తో ఆర్టీసీ ని ప్రైవేటీకరిస్తున్నా అని, ఆర్టీసీ మూసి వేత , సమ్మె ముగింపు రెండు ఏకకాలం లో జరుగుతాయి అని ఉద్యోగులను భయభ్రాంతులకు గురిజేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు అభద్రతా భావానికి గురి అయిన కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా , అలా ఎవ్వరూ చేయవద్దు నిలబడి కలబడుదాం అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ , మరో వైపు ఆర్టీసీ నస్టాల కు కారణాలను , కారకులను గణాంకాలతో సహా ప్రజలముందు  బహిరంగ పరిచి ప్రజల మద్దతుకోసం చేతులు జోడించి , ప్రభుత్వ దాస్టీకాన్ని ప్రజలముందు బట్టబయలు చేస్తూనే , ఉద్యోగులు ఎంతమాత్రం బెదురకుండా తెలంగాణ ఉద్యమం లో చేసినట్లే ఆన్ని పోరాట పద్దతుల్లో మొక్కవోని ధైర్యం తో ఒక్కతాటి పైన నిలిచి పోరాటం చేసినారు. ఉద్యమ నాయకులు గా వ్యక్తులుగా , మంద కృష్ణ, కోదండరాం సమ్మె కు మద్దతుగా నిలబడినా, ఎంతో కొంత ప్రజామద్దతు కలిగిన కాంగ్రెస్, బిజెపి లు సమ్మెకు బయటనుండి మద్దతు గా నిలిచినారే గాని సమ్మేలో ప్రత్యక్షంగా వారి శ్రేణులను పాల్గొన జేసి సమ్మె ఉదృతానికి పూనుకోలేక పోయినారు. సమ్మె కారణంగా తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ప్రతిపక్ష పార్టీలు సొమ్ముజేసుకోలేక పోయాయి. సమ్మె సఫలమైతే అది మా పోరాట పటిమ ఫలితమే అందాం, సఫలం కాకపోతే ప్రభుత్వ నిరంకుశ వైఖరి అంటూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అనుకున్నాయేగాని పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోలేక పోయాయి. కారణం ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేకపోవడం అయినా అయి ఉండవచ్చు, లేదా ప్రపంచ బ్యాంకుకు ప్రీతిపాత్రమైన ప్రైవేటీకరణకు బలమైన మద్దతుదారులు వీరే కావడం మూలాన కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చారు అన్న సామెత  అయినా ఐ ఉండవచ్చు. . 

ఇక సామాన్య ప్రజల వైపు నుండి ఆలోచిస్తే! దసరా పండుగ ముందు సమ్మె జేసుడు సరిగాదని ప్రజలు సమ్మె ప్రారంభం లో కొంత మంది  గొణిగినా ఆ తర్వాత తర్వాత సమ్మెకు ప్రజలనుండి మద్దతు లభించడానికి కారణం, ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం,  డబ్బుల కోసం మిగిలిన ప్రభుత్వ సంస్తలవలే ప్రజలను వేధించిన సందర్భాలు లేవు, అవకాశం కూడా లేదు. అంటే ఎలాంటి అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా , వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా ప్రజలకు తమ సేవలను ప్రతిదినం కనీసం 8 గంటల పాటు అందజేస్తు,  నిత్యం ప్రజలతో కలిసి పనిజేస్తున్నతక్కువ వేతనం పొందుతున్న కస్టజీవులైన ఉద్యోగులు వీరే కావడం ఒక కారణం అయితే, చక్కని శిక్షణతో, క్రమశిక్షణ తో అతి తక్కువ ప్రమాదాలతో భద్రతాయుతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందజేస్తున్న ఏకైక సంస్త ఆర్టీసీ కావడం కూడా ప్రజల మద్దతు వీరికి లభించడానికి మరో కారణం.

ఒక వైపు సియెమ్ దఫా దఫాలుగా రోజులకొద్ది సమీక్షలు జరుపుతూ ఆర్టీసీ ని  మూసువేస్తున్నాం అని ప్రకటనలు చేయడం, మరోవైపు ఆత్మస్తైర్యమ్ కోల్పోయిన ఉద్యోగులు నాదే చివరిమారణం కావాలి అంటూ పిట్టల్లా రాలిపోతుంటే ,ఏకతాటి పై  ఎంత సంఘటితంగా ఉద్యమం సాగుతున్నా కూడా , మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి అంటే ఉద్యమాన్ని ఆపక తప్పని పరిస్తితిలో సమ్మెను విరమించి బేషరతుగా మేము డ్యూటీ లో చేరుతున్నాం అని కార్మికులు ముందుకు వచ్చారు. ఉద్యమం ఇక్కడే అసలైన మలుపు తీసుకుంది.31 మంది తమ సహచరులను కోల్పోయారు, మరో పది మందిని బస్సులు తొక్కి చంపివేసినాయి. లాఠీ చార్జీలతో వేలాది మంది గాయపడ్డారు. బేషరతు గా డ్యూటీలో చేరుతామ్ అంటే గూడా ఒప్పుకోకుండా తన్ని తరిమి వేస్తున్న ప్రభుత్వ వైఖరికి  అవమాన భారం తో అల్పజీవులైన ఉద్యోగులు అందునా ఆడ బిడ్డలు మీడియా ముందు లాఠీల గాయాలు చూపెడుతూ గోడు గొడున విలపించిన తీరు సామాన్య ప్రజల హృదయాలను కలిచి వేసింది. ఔరా! ప్రజలు ఇచ్చిన అధికారం ఆసరాతో ప్రజలపైన్నే ఇంత దాస్టీకమా ? ఇది రాచరిక వ్యవస్తా కూడా కాదే, ఇవాళ వారి వంతు అయింది కావచ్చు రేపు అది ఎవరి వంతు అయినా ఆశ్చర్యపడవలసిన పని లేదుకదా అంటూ ప్రజలు పెదవులు కొరుక్కోవడం ప్రభుత్వ వేగుల కంట పడక పోలేదు. అలాగే బహుశా ప్రభుత్వ శ్రేయోభి లాషులు ఎవరో సియెమ్ గారికి ప్రజల్లో రగులు తున్న కోపాగ్ని బడబానలం వలన ప్రభుత్వ ప్రతిస్ట కొంతైనా మసక బారే అవకాశం ఉందని నచ్చ చెప్పినట్టే ఉంది. లేకుంటే కోర్టు మందలింపులకు గాని, ప్రతిపక్షాల ఆడిపోసుకునుడుకు గానీ, 52 రోజుల సమ్మెకు గానీ, మొత్తంగా ఓ 40 మంది ప్రాణాలు పోయినా బెట్టు సడలని పట్టుదల, సామాన్య ప్రజలు పళ్ళు బిగించి కళ్ళు తెరువంగానే సట్టున చల్లారి ఇవ్వాళ సాయంత్రం వరాలు వర్షించింది అంటే అది ప్రజల విజయం గాక మరేమిటి? 

ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఫ్యూడలిస్టిక్ అధికార ఆహాన్ని కొంత సంతృప్తి పరిచినట్లుగానే ఉంది. సియెమ్ తలుచుకుంటే ఎవరి అసంతృప్తి అయినా ఏమీ చేయదు, 

అది ప్రతిపక్షమైనా ,స్వపక్షమైనా .  ఎవరు ఏ సమ్మెలు చేసినా ఆయన అదరడు బెదరడు, ఆయన అలిగితే అవతలి వారి ఆశలు మలిగిపోతాయి , ఆయన కరుణిస్తే అవతలి వారి ఆశలు వెలిగిపోతాయి. ఆయన రాజు. దానకర్ణ మహారాజు. దండించనూ గలడు, దయచూపనూ గలడు. కనుక  బహుపరాక్ అంటూ ఒక హెచ్చరికను గూడా ఈ సందర్భంగా జారీ చేసినట్లు అయింది.  

No comments:

Post a Comment