Tuesday, November 29, 2016

ఎవుసమ్ 5

                                                    ఎవుసమ్ 5

మన మిద్దె తోట ను చూసెతందుకు పాత్రికేయ మిత్రుడు జయంత్ గారు వచ్చిండ్రు . రఘోత్తమ్ సార్ తన గూఫీ కి వీళ్ళు మనోల్లే అని చెప్పి శాంతింప జెసి నట్టు కాకపోయినా నా మొక్కలకు ఈ సారు మిమ్ముల జూసేతందుకే వచ్చిండని నోటి తోటి చెప్పలేదు గాని మా స్పర్శను బట్టి అవ్వే అర్థం జేసుకున్నయ్ . మెంతులు మారాకు వేసినయ్ తోట కూర సన్నగ నాజూకు వొతున్నది . ధనియాలు ఇంకా దినాలు లెక్కబెడుతున్నయ్ . రోజూ నీళ్లయితే చల్లుతున్న అని జయంత్ సార్ కు చెప్పిన.
ఆయిన వెళ్ళి పోయినంక నిన్న మొన్న రాయక పోతి గదా అనుకున్న. ఎందుకు రాయ లేదో మీతో గూడా పంచుకుందామని మొదలు వెట్టిన ఇగో ఇట్లా . అది 1966 అనుకుంటా ఎండా కాలం ల  మా ఊర సెరువు ఎండి పోయినంక శిగురు బాయిల దునికి ఈతలు గొడుతున్నం పోరాగాండ్ల మంత జమై. మా యీడు పిలగాడే ఒగాయిన మాతోటి గలిసి ఈత గొట్టే తండు.కు బాయి కాడికి వచ్చిండుకొత్తగ .  బాయి వాళ్ళ మామదే గనుక మాతోటి ఆయినకు ఏం పని అనుకుండో ఎందో గాని " గభేళ్ళు " మని బాయిల దునికిండు . ఒడ్డెంబడి  దరి మీద నిలబడి చూస్తున్న మేమంతాబిడియ పడి  పైకి ఎక్కినమ్. బట్టలు మార్చుకొని పొడి బట్టలు కట్టుకున్నం , వెళ్ళి పొయ్యేతందుకు తయారైతున్నం . బాయిల ఉన్న కొత్త పిలగాడు మీది నుంచి దునుకుదామని కావచ్చు పైకి ఎక్కిండు. మేమంతా వెళ్ళి పొయ్యేతందుకు సిద్దంగా ఉన్నం గదా, మమ్ముల జూసీ మీతో ఆడుకుందామని నేను వస్తే మీరెల్లి  పోతరా ? అన్నడు . పాపం అనిపించింది. అరె , మనం కూడా ఈనే తోటి కాసేపు ఆడుకుందాం అని వాళ్ళను ఆపిన. ఇగో గట్ల మొదలైంది మా డొస్తానీ. బాయిల ఈత గొట్టుడు నుంచి మొదలైన సోపతి సేను శెలుకల పొంటి దిరుగుడు, వరి కల్లాల కాడ గంటల కొద్ది ముచ్చట.


వరి పొలం బంగారి రంగుల పండిందంటే కోతకు వచ్చినట్టు లెక్క. మేమైతే పొలం కోత మొదలు వెట్టే నాడు కోడి పిల్లను కోసుకొని పోలి జేసుకుందుము . పొలం కోత అయి మెద ఎండినంక మెద గడుదురు . కట్టిన మెద మోపులను కల్లం లకు మోసుకొని తెద్దురు . కల్లం అంటే గుండ్రంగా వృత్తాకారం లో పారవట్టి నున్నగా చెక్కి ఉశికే లేకుంట చెత్త లేకుంట ఎత్తి పోసి పెండ తోటి అలుకుదురు . తెచ్చిన మెద తెచ్చినట్టు ఒక బండి గీరే అంటే బండి చక్రంమీద కొట్టే వాళ్ళు ,దాన్ని పంజగొట్టుడు అంటరు . రాలిన వడ్లను కొలుసుకొని ఇంటికి తెచ్చుకుందుం బండ్ల మీద బోరాలు వేసుకొని.పంజ గొట్టిన గడ్డిని  కుప్ప పేరుద్దురు గుండ్రంగా. అది అందరికీ రాకపోయ్యేది . అదో పెట్టుడు సుతారమే అప్పుడు. అట్లా కుప్ప వెట్టిన తర్వాత ఓ మంచి రోజు చూసుకొని బంతి గడుదురు. బంతి అంటే కొన్ని ఎడ్లను లైను గా ఉంచి తలుగుల తోటి ఒకదానితోటి ఇంకొకటి కలిపి బంతి ( గుంపు) గట్టి ఆ ఎడ్ల తోటి వరిని తొక్కిస్తే వరికంకులకు మిగిలి  ఉన్న వడ్లు కర్ర నుంచి వేరయ్యేటియి . నడుమ నడుమ ఎన్ను వొడుసుడు ఉంటది. బడి ఎగ్గొట్టి బంతి గొట్టుడంటే బలే సంబురమయ్యేది . వరి కర్రలకు ఉన్న ముల్లు గుట్టి మస్తు దురుద వెట్టేది . ఉడుకుడుకు నీళ్ళ తోటి తానం జెస్తుంటే అబ్బ ఎంత హాయిగ ఉండేదో పానానికి . అయితే ఆ బంతులు గొట్టే కాడికి ఆయన్ను వాళ్ళ మామ పంపేటోడు . సాయితకు నేను గూడా పోతుంటి అసోంటి జానీ డొస్తు సుడిగాల రమేశ్ ఇప్పుడు అమెరికల పౌరుడు. ఆయిన సొంతూరు కాళేశ్వరం. ఆయిన మొన్న వాళ్ళ అమ్మ చెన్నూరుల ఉంటే ఆమె కోసం చెన్నూరుకు వస్తే కలుద్దామని నేనూ పోయిన అందుకని రెండు రోజులు నాగా వడ్డది ఎవుసమ్ జేసుడు.

No comments:

Post a Comment