Sunday, December 11, 2016

ఎవుసమ్ 6

                                                              ఎవుసమ్  6

నేను దుంప బచ్చలి కోసం రఘోత్తమ్ రెడ్డి సార్ ను అడిగిన విషయం ఎఫ్ బి ల చూసిన జయంత్ సార్ నా కోసం దుంప బచ్చలి మొక్క తీసుకొనచ్చిండు. నాకు చాలా సంతోషం అయ్యింది. అయితే నాకు కొన్ని టమాటా, మిరుప మొక్కలు కూడా కావాన్నని , అవి ఎక్కడ దొరికే అవకాశం ఉందని అడిగిన. హైద్రాబాద్ రోడ్డుల తిమ్మాపురం స్టేజ్ తర్వాత రోడ్డు పక్కన కొన్ని కూరగాయల నర్సరీలు ఉన్నట్టు సార్ చెప్పిపోయిండు .
తెల్లవారి రోజు నేను, నా మిత్రుడు నాగేందర్ సార్ కల్సి రోడ్డు వెంట చూసుకుంట పోయినం . తిమ్మ పురం స్టేజ్ పక్కనే ఒక నర్సరీ ఉంది. అలాగే చాలానే ఉన్నాయి. ఒక నర్సరీ లోపటికి వెళ్ళి చూసినం . టమాట , మిరుప, కాలి ఫ్లవర్ , మునగ, బొప్పాయ మొక్కలు చాలా ఆరోగ్యంగా పెంచబడి ఉన్నాయి, నాకు అబ్బురమే అనిపించింది. నా అనుభవం లో రైతులే వారికి అవసరం ఉన్న మొక్కల కోసం నారు పెంచుకుందురు. మా చిన్నతనం లో అయితే రైతుల ఇండ్లల్లనే అవసరం అయిన విత్తనాలు ఉండేటివి. ఇప్పుడంటే విత్తనాల దుకాణం ల కొని నారు పోసుకొనేటోల్లు .
తీరా ఇక్కడ రెడీ మేడ్ మొక్కలు దొరుకుతున్నయ్ . అవి ఎవరివి అని ఆరా దీస్తే ఆంధ్ర నుంచి వచ్చి కౌలు కు తీసుకొని నారు పెంచుతున్నారని తెల్సింది. ఇప్పుడిప్పుడే స్టానిక రైతులు కూడా పెంచుతున్నారట. మొక్కలు అమ్ముడు పోతున్నాయా అని ఆరా దీస్తే వెంట వెంట నే పోతున్నాయట , అందుకే ఒకరి పైన ఒకరు పోటీలుబడి నర్సరీ దొడ్లు పెడుతున్నారని చెప్పిండ్రు. రైతులకు కూడా సమయం కల్సి వస్తున్నదట .
బాగానే ఉందని పించింది . అవసరాలకు అనుగుణంగా మార్కెట్ , దాని రూపాన్ని ఎట్లా మార్చుకుంటుందో అక్కడ కనిపించింది. ఆధునిక కాలానికి నా బాల్యానికి అంటుబంధం తెగుతున్నట్టు అనిపించింది.
మా చిన్నతనం ల ఏ కాలం కూరగాయలు ఆ కాలం లో ఇంటి అవసరాలకు పోగా మిగిలింది దగ్గరి వాళ్ళకు ఇచ్చుకుందుమ్ ఇంకా మిగిలినప్పుడు ఇంటికి వచ్చే వారికి కూడా ఇచ్చేటోల్లమ్. పాడి ఉన్న ఇండ్లల్ల పెరుగునుండి వెన్న దీసిణాంక మిగిలిన చల్లను ఎవరడుగుతే వాళ్ళకు పోసేది. సల్ల అమ్ముడు ఉండేది కాదు. ఈ కూరగాయల విత్తనాలు గూడా ఎవరు అమ్మినట్టు, కొన్నట్టు నా యాదిల లేదు. అవసరం ఉన్నోళ్ళు అడుగుతే , ఎవరిదగ్గరన్నా ఉంటే ఇద్దురు . మనుషుల మధ్యన సంబంధాలు ఇచ్చి పుచ్చుకొనే తీరుగా ఉండేటివి. ఎక్కన్నన్న చిన్న చిన్న గొడవలు వచ్చినా పండుగలప్పుడో, పెండ్లిల్లప్పుడో మాట్లాడుకునుడు అయి కలిసి పోదురు . మనుషుల మధ్యన ఒక సుహృద్భావ పరిస్తితులు ఉండేటివి. కానీ ఇప్పుడాన్ని వ్యాపార సంబంధాలే!
అనుకుంటా మొక్కలు కొనుక్కొని తెచ్చి నాటిన. అన్నీ బతికినయి. మిరుప టమాట, వంకాయ మొక్కలు రోజు పలకరిస్తున్నయి . మా చిన్నప్పుడు పెద్ద ఎవుసమ్ జేసిన్నాడు ఇంత థ్రిల్లింగ్ అనిపించ లేదు. ప్రతి మొక్క తోటి ఇప్పుడో దైహిక సంబంధం, దాని ప్రతి ఎదుగుదల లో మనది మాత్రమే అయిన శ్రమ , స్పర్శ ఉన్న కారణంగానో ఏమో సమయం చిక్కినప్పుడల్లా అక్కడికి పోబుద్ధి ఔతున్నది. వాటికి మనకు మధ్యన ఏదో సంబంధం. మనది ఖచ్చితంగా వ్యాపార సంబంధమే , కానీ మొక్కలదే ప్రకృతి సంబంధం.
జంధ్యాల పాపయ్య శాస్త్రి" పుష్ప విలాపం"  లో ఆ పువ్వులు ఇట్లా అంటాయట ,

ఆయువు గల్గు నాల్గు ఘడియల్ కనిపెంచిన తీగ తల్లి జాతీయత తీర్చి దిద్దేదము
తదీయ కరమ్ముల లోన వెచ్చగా ఊయల లూగుచు మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ కాలి వ్రేళ్ళ పై !


అట్లా తనను కని పెంచిన తల్లి రుణం మొక్కలు తీర్చుకుంటాయని అన్నాడు కవి. కానీ మనమో !

No comments:

Post a Comment