Friday, April 14, 2017

మనుసుల మాట 1

                                                    

తెలంగాణ ముఖ్యమంత్రి రైతులకు ఎరువులు ఉచితంగనే ఇస్తడట అన్న ముచ్చట చదివినంక చిన్నప్పుడు మా నాయిన జెప్పిన సాత్రమ్ మతికచ్చింది . ఆయిన ఏదన్న ముచ్చట జెప్పుతే అది కథ తీరుగానే ఉండేది.

వందేండ్ల కిందట మా ఉర్లే పొద్దుగాల  ముంతవట్టుకొని పోకడగూడా అడివిలకే ఉండేదట. అంటే అడివి ,  ఊరును ఆనుకొనే ఉండేదట . నెమలి పిట్టెలు మేతకోసం అప్పుడప్పుడు పంట సెండ్లళ్లకు వచ్చేటియట. ఒక నెమిలి పిట్ట రోజు అడివంచుదాక వచ్చి పంట సేండ్ల వడి ఏరుక తిని పోయెదట. ఆ నెమిలి పిట్టెను గమనిస్తున్న ఓ ఇగురమంతుడు , " నెమిలి పిట్టే , నెమిలి పిట్టే , నువ్వు రోజు అడివిల నుంచి ఇంత దూరం దాకా నడిచి వచ్చి ధాన్యం ఏరుక తింటున్నవ్ గదా , నీకు గంత కస్టమ్ ఎందుకు ,  నడిచి నడిచి నీ సొగసు, వొయ్యారం , అందమంత అలిసిపోతాంది  , నాకు రోజుకు నీ ఒంటిమీదున్న ఒక్క ఈక పీకి ఇస్తివా అంటే నీకు రోజు తినే అంత ధాన్యం , అడివంచుదాక తెచ్చి ఇస్తా , నీకు ఈ సేను సెలకల సుట్టు దిరిగే కస్టమ్ లేకుంట నీకు సేవ జేస్త ,"  అన్నడట .
నెమలి పిట్టెకు ఇదేదో చాలా బాగానే ఉంది గదా అనిపించిందట. సరే మంచిది అని ఒప్పుకున్నదట . ఇగ అప్పటి నుంచి రోజు అడివిల నుంచి నెమిలి పిట్ట బయిటికి రాంగానే ఈ ఇగురమంతుడు ఓ బుట్టనిండా ధాన్యం తీసుకపొయ్యి దాని ముందట వెడితే , అది ఆ ధాన్యం తిని ఓ ఈక అతనికి ఇచ్చి అడివిలకు పోయి నిద్రపోయెదట . కొన్ని రోజులకు నెమిలి పిట్టే పెయి మీదున్న ఈకలన్నీ ఒడిసి పోయినై. ఈకలు ఒడిసిపోయినంక , ఇగురమంతుడు ఇటుదిక్కు మర్రి చూడ లేదు. కడుపులకు ఆహారం లేక, ఎగిరి పొయ్యేతందుకు రెక్కలకు ఈకలు లేక కస్టపడి ఆహారం వెదుక్కోనే అలవాటూ ఓపిక లేకుంట పోయింది. అందం వొయ్యారం అన్నీ లేకుంట పోయినై. బూరు పీకిన కోడి తీరుగా సొడలు , సోడలు పోతున్నదట , నడువలేక.   ఆకరికి   రేసుకుక్కల వేటకు నెమలి పిట్టే బలై పోయిందట " అని మా నాయిన సాత్రమ్ అయిపోయిందన్నడు.  

రైతులు పండిచ్చిన పంటకు గిట్టుబాటు దర లేక రైతులు ఎంతగా అల్లల్లలాడి పోతున్నారో అందరం దినామ్ చూస్తునే ఉన్నాం. . వాళ్ళ ఆత్మహత్యలు ఆపండి అని నెత్తినోరు కొట్టుకుంటూ దేశమంతా మొత్తుకున్నాగూడా  రైతుల ఆత్మహత్యలు ఇయ్యాల కొత్తయా అని సర్కారు ఎదురు ప్రశ్నలు వేసిన ఉదంతాలు చూసినమ్. ఇయ్యాల పుక్కటికే ఎరువులు ఇస్తామంటే ఇండ్ల ఏదో మతులబు ఉండున్టది అని జనమంతా  అనుకుంటుండ్రు. రసాయన ఎరువుల కూడు తిని ఆరోగ్యాలన్నీ పాడై పోతున్నయని ఒగదిక్కు లోకమంతా కొడై కూస్తుంటే ఈనే ఇప్పుడు "  రసాయన ఎరువులు ముద్దు ఆరోగ్యాలు రద్దు " ,  " ప్రజల ప్రాణాలు, పైసలు- ప్రైవేటు విద్యా వైద్యాల పాలు " . అంటూ కుయుక్తులు జేస్తున్నడు .  నిజంగా సర్కారుకు చిత్తశుద్ది ఉంటే ప్రైవేటుకు తావులేని విధంగా నాణ్యమైన విద్యా వైద్యం ప్రజలందరికీ సమానంగా ఉచితంగా  అందేటట్లు చూస్తూ రైతులు పండిచ్చిన పంటకు గిట్టుబాటు దర చెల్లించే ఏర్పాటు జేస్తే ఏ ఉచితాలు ప్రజలు ప్రభుత్వం నుండి కోరుకోరు.

పైనజెప్పిన కథల ఇగురమంతుని ప్రేమంతా ఈకల మీదనే గాని నెమలి పిట్ట ఆరోగ్యం, ఆకలి మీద కానట్టే ఇక్కడ సర్కారోని ప్రేమంతా ప్రజల ఓట్ల మీదనే గాని వాళ్ళ బతుకుదెరువు మీదగాదన్న సత్యాన్ని ప్రజలు గ్రహిస్తారని ఆశిద్దాం.

                          

No comments:

Post a Comment