Monday, April 3, 2017

ఇంటిమీదెవుసమ్ 39

                                             


ఇయ్యాల పొద్దుగాల మొక్కలకు నీళ్ళు పడుతుంటే ఒక గొప్ప అనుభూతి కలిగింది. నవవవలాడుతున్న, తోట కూర, పాల కూర , మొక్కలు ఒకవైపు, మరో వైపు పోంగా పోంగా దక్కిన బిడ్డల తీరుగా ఆనిపకాయ పిందెలు మరో వైపు ఆరోగ్యంగా కండ్లకు కనిపించేవారకు , నేను పోస్తున్న నీళ్ళు వాటికి జీవధారాలు అవుతుంటే, వాటి భాష  కంటికి కనిపించక పోయినా నీవేదో మంచిపనే  చేస్తూన్నావని మొక్కలు అనుకుంటున్నట్టు ఒక భావన మనుసులో మెదిలింది .  ఒక  ఎంతో హాయి అనిపించింది. కాకుంటే నేను కురిపిస్తున్న ప్రేమంతా చివరికి వాటిని కూర వండుకోవడానికే గదా అనుకున్న. కానీ,  వేతనం తీసుకొనే అయినా , ప్రతిఫలాపేక్ష  లేకుండా చేసిన కొన్ని పనులు  గూడా , నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చిన , కొన్ని పాత జ్ఞాపకాలు కూడా మనుసుల సుళ్ళు దిరుగుతూ  మీతో పంచుకోవాలని ఒక్కటే ఆరాట పడుతున్నై .


డిగ్రీ కాంగానే ఏరకమైన ట్రెనింగ్ లేకుండానే గంగారం హైస్కూల్లో లెక్కల సార్ గా ఉద్యోగం వచ్చింది. అది అప్పుడు అప్ గ్రేడెడ్ హైస్కూల్ కనుక 8 వ తరగతే పెద్ద క్లాస్. మొట్టమొదటి సారిగా ఎనిమిదవ తరగతి కి వెళ్ళిన. అంతవరదాకా వాళ్ళకు లెక్కల సారు ఫలానా అంటూ లేకపోవడం చేత నా బోధన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ( ఈ ఎండాకాలం ల సాయంత్రం నీళ్ళ తడికి మన కూరగాయల మొక్కలు నీళ్ళకోసం ఎదిరిచూస్తున్నట్టే ) . నన్ను నేను పరిచయం చేసుకున్న. మీ వాడినే, నేనూ నిన్నటిదాకా మీ తీరుగనే క్లాస్ లో కూచోని చదువుకున్నోన్నే. మీ తిప్పల ఎట్లుంటదో తెలిసినోన్నే. అయితే లెక్కల అంత  అలుకటి సబ్జెక్ట్ ఇంకోటి లేదు. అని కొన్ని నిత్య జీవితం లో ఉపయోగపడే విషయాలు లెక్కలతో అనుసంధానం ఉన్నవి చెప్పిన. నా బెరుకూ పోయింది, వాళ్ళకు కూడా సహజంగా లెక్కల సార్ అంటే ఉండే భయం పోయింది. ఆ పీరియడ్ అంతా అట్లా ముచ్చట్ల తోటే గడిసి పోయింది.

తెల్లవారి నేను వాళ్ళకు బీజగణిత సమీకరణ సాధనాలు చెప్పాల్సి ఉంది.  పోతె ,  పోతేనే నేను ఈ రోజు మీకు  ఒక కథ చెప్పుతా అని మొదలు పెట్టంగానే , పిల్లల్లో ఉండే సహజమైన ఉత్సుకతతో చెప్పండి సార్ చెప్పండి సార్ అని కోరస్  పలికిండ్రు. ఎండా కాలం మాపటీలి ఇంటిముంగట పట్టెమంచం వేసుకొని ఒక తాత , మనువడు పండుకున్నరట .  అప్పటి రోజులల్లో ,   మన తెలంగాణ  గ్రామాలల్లో ఉండే చెరువలల్లా నీళ్ళు పుష్కలంగా ఉండేటియి . అందుకని ఎక్కడెక్కడి నుంచో పక్షులు తెలంగాణ చెరువులళ్ళకు వలసలు  వఛ్చేటియి . అట్లా ఒక కొంగల గుంపు ఈ తాత మనువడు పండుకున్న మంచం పైనుండి పోతున్నయట .. మనువడు పైనుండి పొయ్యే కొంగలను లెక్కవెడుతున్నడట. అవి తేపకు ఒకటి వెనుకకు  ,మరోటి  ముందుకు రావడం తోటి మనువడు లెక్కవెట్టలేక పోతున్నడట  . ఏహ్ నీ యవ్వ ! ఈ కొంగలు సల్లగుండ లెక్కవెడుదామంటే కుదిరి చస్తలెవ్వు . తాత ! ఆ పైనుంచి పోతున్న  కొంగలు ఎన్నే అని అడిగండట . తాత నిదానంగా లెక్కవెట్టి , ఇగో మంచిగ యిను మళ్ళా ఊకూకే అడుగకు అంటూ , అన్నీ , అన్నీ , ఆన్నిల సగం, సగం ల సగం , నాతోటి కలుపుకుంటే నూరు ,అని చెప్పిండట. పిలగానికి కోపం వచ్చిందట లెక్క అర్థంకాక. తాతా పోరన్ని గాజూసి లెక్కజెప్పుమంటే కైతికాలు జేస్తున్నవ్ లే, మాపటీలి బువ్వకుండాకాడ అరుసుకోమని అమ్మకు చెప్పిన్నంటే నీ తిక్క కుదురుతది అన్నడట . ఓహ్ మొగోనికి అగ్గువ దొరికిందోయ్ షికాయత్ జేసుడు. నీకు నేను చెప్పింది అర్థం జేసుకొనే తెలివి లేక , నా మీద ఎగురుడేనా ? ఏమన్నా ఆలోచన చేసుడు ఉన్నదా లేదా అన్నడట . పిల్లలు మీరు చెప్పండోయ్ అన్న. చాలా సేపు పిల్లలు తర్జన బర్జన్లు వడ్డరు . రక రకాల నంబర్లు చెప్పినారు. ఆ జవాబు ఎట్లా వచ్చింది అంటే ఎవరు చెప్పలేదు. సరే మనకు ఏదైయానా తెలువకుంటే లెక్కల్లో దాన్ని x అంటమని తెలుసుకదా అంటే అందరూ ఓహ్ !  అన్నారు. సరే అన్నీ అంటే x అనుకుందాం సరేనా. అన్నీ , అన్నీ , ఆన్నిల సగం, సగం ల సగం నాతోటి కలుపుకుంటే నూరు కదా ? పిల్లలు కోరస్ గా అవును అన్నారు. x +x +x/2+x/4+1=100 . ఈ సమీకరణాన్ని సాధించండి అంటే , సాధించిన పిల్లలు ,  పైన పోతున్న కొంగల గుంపుల ఉన్న కొంగలు 36 సార్ అని , ఆనాడు చెట్టుమీది నుండి ఆపిల్ పండు భూమి మీద ఎందుకు పడ్డదో కనుగొన్న సర్ ఐజాక్ న్యూటన్ వలె ఎగిరి గంతులేస్తూ చెప్పిండ్రు. ఇగ అప్పటి నుండి నా లెక్కల పీరియడ్ అంటే పిల్లలు ఇస్టంగా వినేటోల్లు . నా పాఠం పిల్లలు ఇస్టంగా విన్న ప్రతీ సారీ మనుసుకు గొప్ప సంతృప్తి కలిగేది. అయితే నేను మొట్టమొదటి సారి పాఠం చెప్పిన లెక్క మా నాయిన చిన్నప్పుడు నాకు చెప్పిందే. గమ్మతి ఏందంటే , మా నాయిన కు సదువు రాకపోయేది.   

No comments:

Post a Comment