Wednesday, June 21, 2017

మనుసుల మాట 10.

                                                

మొన్న మా ఊరికి పోయి వస్తుంటే మంథనికి వచ్చే సరికి నేను చిన్నప్పుడు చదువుకున్న బడి ని చూద్దాం అనిపించింది. బడి వద్దకు పోయే సరికి గేటు తీసే ఉన్నది. మేన్ గేట్ లోకి ఎంటర్ అవుతూ కుడి వైపు తిరిగి చూసిన, మేము చిన్నప్పుడు ప్రార్థన గంట కంటే ముందే వచ్చి కూచుండే మట్టి కట్ట ఆనవాలు కోసం చూసిన. ఆ మట్టి కట్ట మీద బొడ్డుమల్లే చెట్లు ఉండేటియి . చలికాలం ల రాలిన బొడ్డుమల్లే పూలు ఏరుకొని వాటి సువాసనలు మనుసు నిండా పీల్చుకునేటోల్లమ్. అవి ఏవీ లేవు. ఉంటే ఆనందం, ఆశ్చర్యం , కానీ లేకపోవడం అదీ 50  సంవస్తారాల తర్వాత వాటి ఆనవాలు కోసం వెతుక్కోవడం నా అత్యాశ గాక మరెంటి. 1968 ల హెచ్ ఎస్సీ లో ఉండంగా ఎందుకో మా బడి ఫీసులు పెంచిండ్రు అప్పుడు. మేమంతా ఫీసులు తగ్గించాలే అని స్ట్రైక్ చేసి క్లాసులళ్లనుండి మొత్తం వెయ్యి మందిమి  బయటికి వచ్చి ఆ మట్టి కట్టమీద కూసున్నం. మా హెడ్ మాస్టర్ ఖాదర్ ఫిదా గారు మా లీడర్లను పిలిచి అరే ! బిడ్డా! ఫీసుల సంగతి మీ అమ్మా నాయినలు చూసుకుంటరు, మీకు చదువు నస్టమ్ అయిద్ది క్లాసులళ్ళకు వెళ్ళండి అని ఎంత నచ్చజెప్పినా మా లీడర్లు గాని మేము గాని అస్సలు వినలేదు. ఆయిన సరే మంచిది బిడ్డా అని , తన చాంబర్లకు పోయి ఈత బరిగే  తీసుకొని  వచ్చి ,క్లాసులళ్ళకు పోతరా పోరా! అని ముందర ఉన్నోన్ని ఎవ్వన్నో ఒక్కటి పీకిండు. ఇగజూడు ! అందరం ఎగవడి, ఎగవడి క్లాసులళ్ళకు ఊరుకినమ్. అప్పుడు మా వయసు 15--16 ఉంటై. అయినా మా పెద్దసారు ఒక్క గద్దరాయింపుకు  గజ్జుమని క్లాసులళ్ళకు పోయినమ్. అది ఆ కాలం ల ఉన్న క్రమశిక్షణ .

అది యాది జేసుకుంటా కొంచం ముందరికి పోయే వరకు మేము రోజూ ఉదయం ప్రార్థన జేసె స్తలమ్, అక్కడ మేము 6 నుండి 11 తరగతులకు చెందిన 12 సెక్షన్ల వాళ్ళం 12 లైన్లు గట్టి నిలబడితే మా ముందు, మా పెద్దసారు ఆయిన తర్వాత లెక్కల సారు లొకే కిషన్ రావు సారు, సైన్సు సారు గీట్ల జనార్ధన్ రెడ్డి, హింది సారు పి. రాజన్న, తెలుగు సారు బి . అచ్యుత రాజు సారు, జి. శ్రీరాములు.సారు, గట్టు బుచ్చయ్య సారు,లొకే లక్ష్మణ శర్మసారు,  మారుపాక రాజన్న సారు, గణపతి సారు ఇట్లా దాదాపు 20 మంది సార్లు ఉద్దండ పండితులు నిలబడి ఉండే నిండు పెరోలగమే ఆ ప్రార్థన సమావేశం సభ. ఆ సార్లు నిలబడి ఉండే స్తలమ్ లకు వెళ్ళి నిలబడ్డ . ఏదో పులకరింపు. ఆ నాడు నిటారుగా నిలబడి ఉన్న టేకు మొగురాలు కాల ప్రభావం వలన పడమటికి పొద్దువాలి పోయినట్లే వాలి పోయి ఉన్నాయి. గోడ మీద ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంథని, స్టాపితం 1944 అని రాయబడి ఉంది. అక్కడినుండి కొంచం ఎడమ వైపు అంటే తూర్పు వైపు తిరిగి ( నేను వెళ్లింది సాయంత్రం 5 గంటలకు కనుక బడి మూసి వేయబడి ఉంది) గోడ వెంట వెళితే మేము 1964-65 సంవస్తారామ్ లో 8 వ తరగతి చదివినప్పుడు కూచున్న తరగతి గది వచ్చింది. కిటికీల తలుపులు మూసి ఉన్నాయి. ఆ కిటికీ ఇనుప ఊచలు తడిమి చూసిన. అచ్యుత రాజు సారు గజేంద్ర మోక్షం చెప్పుతున్నప్పుడు చదివిన " సిరికిన్ జెప్పడు శంఖ చక్రముల్ చేదోయి సంధింపడు" , అలాగే నరకా సుర వధ లో " వేణిమ్ జొల్లెము జూట్టి లేచి నిలిచే , వేణీ లోచన తన ప్రాణేశాగ్రభాగంబునన్ " , వరూధిని ప్రవరాఖ్యలోని " నిండు మనంబు  నవ్యనీత సమానంబు" ,  ఎన్ని పద్యాలని ఆ సారు గొంతునుండి రాగయుక్తంగా పాడిన రాగాలు ఆ గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయా అన్నట్లు  అనిపించింది. నాకు ఇట్లా ముచ్చట్లు రాసే విధానం , సాహిత్యం పట్ల అభిరుచి కలుగడానికి  మా నాయిన వీరగొని నర్సయ్య, నుండి మా అన్న వీరగొని చేంద్రయ్య తర్వాత అచ్యుత రాజు సార్ వంటివాళ్లు పెట్టిన బిక్షే.  కొంచెం ముందుకు వెల్లీ మూల తిరుగంగానే నైంత్ క్లాసుల పి. రాజన్న హిందీ పాఠం యాదికి వచ్చింది, కవయిత్రి సుమిత్ర చౌహాన్ రాసిన, " మై లేట్ ఆయీ థీ , మై లేఠీ థీ, మేరే ఊపర్ ఏక్ లేటా థా !.......ఏ దునియా శకల్ మత్ కరో వో మేరా బేటా థా!" ఏమి కవిత్వమని. ఆ గది దాటి ముందుకు రాంగానే టెంత్ క్లాస్ ల గీట్ల జనార్ధన్ రెడ్డి సారు జెప్పిన భౌతిక శాస్త్ర నియమాలు,  ఆ గది తర్వాత మేము హెచ్ ఎస్సీ చదువుకున్న లెవెన్త్ క్లాస్ రూమ్, అక్కడ లొకే కిషన్ రావు సారు చెప్పిన అజంతా రేఖా గణితం, అజంతా బీజగణిత సూత్రాలు, ఖాదర్ ఫిదా సార్ చెప్పిన ఇంగ్లీష్ గ్రామర్, అన్నీ సినిమా రీల్ల తీరు తిరిగినై.   చివరల ఇంకొక్క సంగతి చెప్పాలే మీకు. రాదారం సీతారాం సార్ అని అప్పటికే పెద్దాయన, బడి ని డిసిప్లిన్ ల ఉంచుడుల పి టి సార్ ఇబ్రాహీం సార్ కు జతగా రాదారం సీతారాం సార్ ఉండేటోడు. సార్ కు కోపం వస్తే దిబ్బడ దబ్బడ రెండు ఉతికేటిది. తెలివైన పెద్దపిల్లలు ఒక్కటి కొట్టంగనే టిపిక్కిన కింద వడి లిట్టర, లిట్టర కొట్టుకునుడు జెద్దురు. ఆని సోపతిగాళ్ళు అయ్యో,అయ్యో, సార్ ! పొరడు ఎట్లనో చేస్తున్నడు ఆనంగానే అరే! మల్లయ్య! ( అటెండర్) మంచినీళ్లు తే అని తాగిపిచ్చి తంద్లాడుతుండేది. మెల్లెగా కండ్లు తెరిచిన  దెబ్బలు తిన్న పిలగానికి అరే వీనికి అయ్యన్న హోటల్ ల ఇడ్లీ తినిపిచ్చి చాయ్ తాగించుక రా పొండ్రి అని వాణి వెంట పొయ్యేతందుకు ఇంకో పిల్లగానికి అని 2 టిఫిన్ , చాయ్ అని రాసిచ్చిన  చిట్టి మీద వీళ్ళు 2 పక్కకు 0 పెట్టి 20 టిఫిన్ లు తిని చాయ్ లు తాగి వద్దురు. అందుకని సారు తోటి దెబ్బలు పడే దానికి ఒక బ్యాచ్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేది.  

చివరగా మేము హాకీ , వాలీ బాల్ ఆడిన మైదానం లకు వెళ్ళిన అప్పటికే అక్కడ జమైన పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒకసారి నేను హాకీ ఆడుతున్న. నాకు పెద్దగా ఆ ఆట వచ్చేది గాదు. స్టిక్ పట్టుకొనే వచ్చే బాల్ కు ఎదురుగా ఊరికి వస్తున్న మా క్యాప్టెన్ మాదాడి భాస్కర్ రెడ్డి ,  అది ఔట్ బాల్ రా వదిలేయ్ అంటున్నడు , నేనూ వదిలేద్దామనే అనుకున్న కానీ నేనూ బాల్ కు ఎదురుగా ఉరికస్తున్నగదా , అది కాలు కు తాకీ ఫౌల్ అయి  పెనాల్టీ ఇవ్వడం తో వాళ్ళు గోల్ చేసిండ్రు. ఇగ నన్ను టీం మేట్స్ అందరూ ఒక్కటే తిట్టుడు. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మనుసంత ఆనందం నిండగా బయటకు రోడ్డు మీదికి వచ్చిన.

ఇగో ఇక్కన్నేఈ రోడ్డు మీదనే , నా  మిత్రుడు నాగేందర్ కలిసి పి యు సి చదివేతందుకు తాను కరీంనగర్ వెళ్తున్నా అని చెప్పి నా చదువు కొనసాగడానికి మార్గదర్శకుడు అయిండు.

అయ్యా అవ్వలు జన్మనిచ్చి విద్యాబుద్దులు చెప్పిస్తే, ఉపాధ్యాయులు జ్ఞాన బిక్ష పెడితే , నిజమైన మిత్రులు ఎందరో మన అభ్యున్నతికి తోడ్పడ్డారు. ఎవరమైన మనం ఇప్పుడు ఈ స్తాయిలో ఉన్నమంటే, జన్మనిచ్చిన తలిదండ్రులు, ఆటపాటలు నేర్పిన తోడబుట్టువులు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత మన పట్ల ఈర్ష్య అసూయలు  లేని నిజమైన  మిత్రులే కారణం.

No comments:

Post a Comment