Tuesday, June 6, 2017

మనుసుల మాట 9

                                                                       

నిన్న సోమవారం మధ్యాహ్నం ఒక పెళ్ళికి వెళ్ళాను. బ్రహ్మాండమైన పెళ్లిపందిరి, వేద మంత్రాల మధ్యన పెళ్లితంతు కార్యక్రమం అయిపోవచ్చింది. చివరగా అరుంధతి నక్షత్ర దర్శనం కోసం వధూవరులకు ఆకాశం కనిపించే విధంగా ఫంక్షన్ హాల్ బయటకు పంతులుగారు తీసుకొని  వెళ్లారు. ఈ లోగా ఆహుతులను ఆహ్లాద పరిచే కార్యక్రమం లో భాగంగా  గానా బజానా లైవ్ నడుస్తున్నది. ఇంతల ఒక యువకుడు వచ్చి వారితో ఏదో మాట్లాడినాడు. అనౌన్సర్ అర్థం కానీ పదాల తో ఏదో అనౌన్స్ చేశాడు. మాకు చివరిగా అయితే స్క్రీన్ పైన చూసి ఆనందించండి అన్న మాటలు అర్థం అయినాయి. సరే ! స్క్రీన్ కు కండ్లను అతికించామ్ .

రొమాన్స్  సినిమాలో హీరో , హీరోయిన్  వెంట పరిగెత్తుతూ డూయేట్ పాడుతున్నట్లుగా పెళ్లి కూతురూ, పెళ్ళికొడుకు ఒకరి వెంట మరొకరు ఉరుకుతున్నారు. అరె భై !  అది సినిమా.ఇది జీవితం . అది  నిజం కాదు. ఇది నిజం. అక్కడ వాళ్ళు అట్లా ఆడటానికి పాడటానికి , పడటానికి, లేవటానికి ఒక డైరక్టర్, కొరియోగ్రాపర్, మ్యూసిక్ డైరెక్టర్, పాటరాసిన కవి, దానికి ఒక కథ ఇంత మాయా నాటకం వెనుక ఉంటే వాళ్ళు అలా తైతక్కలాడుతారు. దాన్ని మనం అనుకరించడం నాగరికత అనో లేక మధుర జ్ఞాపకాలు అనో అనుకోవడం తెలియని తనమే అవుతుంది. సినిమా  వాళ్ళు నిజానికి భార్య భర్తలు గా నటిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు గా కలిసి నూరేళ్ళు కాపురం చేయ వలసిన  వాళ్ళు. . వాళ్ళ ప్రణయం బజార్ల చూపితేనే వాళ్ళ బతుకుదెరువు సాగేది. కనుక ప్రజల వ్యామోహాన్ని సొమ్ముజేసుకోవడానికి వాళ్ళకు అది తప్పనిసరి అయిన కార్యక్రమం.  అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా , సీన్ టేక్ ఓ కె అయిన తర్వాత నటులు హమ్మయ్య ఒక పని అయిపోయిందని సేద తీరుతుంటారు.  అది యూరోపియన్ కల్చర్ అయినా మరే కల్చర్ అయినా సినిమాలో వలె బజారులో ప్రణయ కలాపాలు సాగించిన నాగరిక సమాజం ఇంతవరకు ఎక్కడా ఉన్నట్లుగా దాఖలాలు లెవ్వు. .  సినిమా లో వలె అంతా అబద్దమో, నటననో కాదు కదా ఇక్కడ .  వీళ్ళు ఒక జీవిత కాలం ఆలుమొగలుగా అన్యోన్యంగా జీవించ వలిసిన వాళ్ళు , వాళ్ళ ప్రేమ కలాపాలను  బజారులో పెట్టుకోవడం నాగరికత గా చలామణి కావడమే బాధాకరం అనిపించింది నాకు.

వీలైతే ఒకసారి జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత రావూరి భారధ్వాజ రాసిన " పాకుడు రాళ్ళు " నవల చదువండి.   సినిమా వాళ్ళ జీవితాలు ఎంతటి జారుడు బండలో అర్థం అవుతుంది . రేపు కలిసి గుట్టుగా కాపురం చేయవలిసిన ఈ జంట కాలువల పొంటి, చెట్ల పొంటీ , పొదలపోంటీ ఒగలవెంట ఒగలు  ఈ ప్రణయ కలాపాలు ఏమిటీ? కన్న తల్లికి అయిన కనుమరుగు అవసరం అనుకున్న మానవ నాగరికత ఎక్కడ బాయే? ఆ జంట ప్రణయకలాపాలు , ఆహ్వానితులకు వినోదమైపోవడం నాకైతే బాధాకరం అనిపించింది. ఆ తీపి గురుతులు ఆ జంట సొంతం. అవి పది కాలాల పాటు పదిల పరుచుకొని  వాళ్ళు గుర్తు పొట్టుకోవాల్సినవి కానీ రట్టు జేసుకొనేవి కాదన్నది , మానవ సమాజం  అభివృధ్ధి అయిన తర్వాత మనుషులు  నిర్దేశించుకున్న ఒక మానవీయ నాగరికత.  వీడియో గ్రాఫర్స్ తమ వ్యాపారం కొరకు ఫలానా వాళ్ళు ఇలా చేయించుకొన్నారని, మీరుకూడా చేయించుకొండని పురమాయించంగానే తలిదండ్రులు కూడా ఇది చేయించకుంటే పిల్లలు బాధపడుతారనో లేక నాకేమీ తక్కువ , నేను ఆ మాత్రం చేయించలేనా అనే ఆధిక్య భావనో ఏమో కానీ అటు తలిదండ్రులు సరే అంటున్నారు, ఇటు పిల్లలు కూడా సై అంటున్నారు. సాటి వారిముందు మేము పెళ్లి ఘనంగా చేశామని పేరెంట్స్, చేసుకున్నామని పెళ్లి జంట భావిస్తున్నారు. ఆ విధంగా ఆ కొత్త పెళ్లి  జంట ను డబ్బులు తీసుకొని  అలా నటింప జెసి దాన్ని షూట్ జెసి వచ్చిన వారికి బహిరంగంగా ప్రదర్శింపజేయడం నాగరికత అని చెప్పేవిధానం సరైందేనా అని ఒక సారి అందరం ఆలోచించాల్సి ఉంది.   ఒక విచిత్రమైన, అనాగరికమైన, అవాంఛనీయమైన ఆచరణను నాగరికం , ఆధునికం, ఆచరణీయం అన్న భ్రమల్లో ప్రజలను , వ్యాపారీకరణ  ముంచివేస్తుంటే బుధ్దిమంతులైన పెద్దవాళ్ళు సైతం దానికి వంతబాడటం అనేది తప్పకుండా అందరం ఆలోచించవలసిన విషయం.  

" ఒకప్పుడు ఇంట్లో  వండుకొని తిని - సౌచానికి బయటకు వెళ్ళేవాళ్లు.
ఇప్పుడు బయట తినివచ్చి ఇంటిలో సౌచానికి వెళుతున్నారు.

ఒకప్పుడు దాన శీలురుల ధాతృత్వాన్ని బైటి వాళ్ళు వేనోళ్ల పొగిడే వారు.
ఇప్పుడు లోభి జనులు తమను తామే పొగడుకొని చంకలు గుద్దుకుంటున్నారు .

ఒకప్పుడు బయటివాళ్లు ఆడిపాడితే - ఇంట్లో వాళ్ళు వెళ్ళి వినోదించేవారు.
ఇప్పుడు ఇంటి వాళ్ళు ఆడిపాడి బయటివాళ్లను వినోదింపజేస్తున్నారు. "  


ఆంధ్ర జ్యోతి , ఆర్ . కె   కొత్తపలుకులు కాలం లో నుండి సేకరించినవి పై మాటలు.

No comments:

Post a Comment