Tuesday, June 6, 2017

మనుసుల మాట 8.

                                                           

ప్రపంచ పర్యావరణ దినం ఈ రోజు. పెరిగి పోతున్న గ్లోబల్ వార్మింగ్ గురించి బుధ్ధీజీవులంతా చాలా మదనపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త , స్టీఫెన్ హాకింగ్  ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ఈ భూ గ్రహం ఇంకో వంద సంవస్తారాలకంటే ఎక్కువ కాలం మనుగడలో ఉండదు అని చెపుతున్నాడు. సామాన్యులమైన మనం కూడా అలివిగాని వేడి ని అనుభవిస్తున్నాము. ఎవరికి వాళ్ళం మన మన జీవిత కాలం లో ఇంత వేడిని ఎప్పుడూ అనుభవించి ఉండలేదని చెప్పుకుంటూ తల్లడిల్లి పోతున్నాం.

పర్యావరణాన్ని రక్షించుకోవడానికి చెట్లు పెంచాలనీ, జంతు జీవజాలాన్ని కాపాడుకోవాలని, ఫాసిల్ ఇందనాలను మండించకూడదనీ , అణుధార్మిక పదార్థాల వినియోగం వద్దని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కానీ జరుగుతున్నదేమిటి? నా చిన్నప్పుడు పట్టణాల నుండి గుత్తే దార్లు మా అటవీ ప్రాంతమైన మహాదేపూర్ జంగల్ కు వద్దురు. వాళ్ళు కోపులు గుత్తవడుదురు . సర్కారే అడివిని నరుకుక పొమ్మని అనుమతి ఇచ్చేదీ. సర్కారు అనుమతి ఇచ్చేది ఇంత ఐతే ఆయన లంచాలు ఇచ్చి జంగలంతా నరుకుక పొయ్యేది. ఆ కాంట్రాక్టర్ లను ఎవరైనా ఇదేంది అంటే వాళ్ళు అడివిల అన్నలు అయిపోదురు, సర్కారు కు టార్గెట్ అయేటోల్లు. సరే అడివంతా  ఒడిసిపాయే. కరీంనగర్ చుట్టూ కాలారి గుట్టలు ఉండేటియి. ఆ గుట్టల మీద అడివి ఉండేది, సమస్త జంతు జీవజాలం బతికేదీ , గుట్టకింద భూమిల పుష్కలంగా నీటి జాడలు ఉండేటియి. కానీ జంగలాత  కాంట్రాక్టర్ల తీరుగానే గ్రానైట్ కాంట్రాక్టర్లు  కూడా సర్కారు మద్దతు తోటి వాళ్ళకు కేటాయించిన స్తలమ్ కంటే ఎన్నో రెట్ల భూమిని తవ్విపోసిండ్రు. గుట్టలు పోవడం వలన సమస్త జంతుజీవజాలం గ్రామాల పైన, పట్టణాన పైన పడ్డై. భూగర్భ నీటిమట్టం పడిపోయి హరిత హారం పేరుతోటి సర్కారు పెట్టిన చెట్లు చచ్చి ఊరుకుంటున్నై. వేల కోట్ల ఖర్చు వృధా. ప్రజలు అలివిగాని వేడితో అల్లాడుతున్నారు. ఇక ఫాసిల్ ఇందనాలు అయిన డీసీల్ పెట్రోల్ , బొగ్గు విపరీతంగా మండించ బడుతున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయిన పవన, సోలార్, విద్యుత్తులు , బ్యాటరీల తో నడిచే కార్ల వినియోగం పెరుగాల్సి ఉందని అన్నా ప్రభుత్వాలు వాటిపైన శ్రధ్ధ పెట్టడం లేదు. అను ధార్మిక పదార్థాల వినియోగం కూడదని అంటున్నాకూడా మనం కూడక్కలమ్ వద్ద అనుయింధన విద్యుత్ ఉత్పత్తికి నిన్ననే రష్యా తో ఒప్పందం చేసుకున్నాము. అటు ఎక్కువకు ఎక్కువ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న అమెరికా ప్యారిస్ ఒప్పందం తో మాకు పనిలేదు పర్యావరణ పరిరక్షణకు పైసా విదిల్చేది  లేదని ట్రంప్ మహాశయుడు ఢంకా బజాయిస్తున్నాడు.పైగా ప్రపంచదేశాలకు ఆయుధాలను అమ్మే వ్యాపారం విరివిగా చేస్తూనే ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు.  మన దేశం లో కూడా పర్యావరణానికి హాని జేసె వనరుల విధ్వంసం ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాస్త్ర, పశ్చిమ బెంగాల్, లో విచ్చ్కల విడిగా సాగుతున్నది. వద్దని మొత్తుకుంటున్న స్తానిక గిరిజనులను నిర్ధాక్షిణ్యంగా సర్కారు బలగాలతో అణిచివేస్తున్నారు.


అయ్యా ! అభివృధ్ధి పేరుతోటి మీరు కూడబెడుతున్న ఈ సంపద అంతా ఎవరు అనుభవించాలి రేపు? తరతరాలు తిన్నా తరుగని సంపద సంపాదించామని మురిసిపోతున్న సంపన్నులారా! ప్రకృతి ధర్మానికి విరుధ్ధంగా పోతే ఎవ్వరూ మిగలరు అని చరిత్ర చెపుతున్నది. అంతెందుకు మీరెన్ని డబ్బులు పెట్టుకున్నా మీ ఆయుష్షును 100, 120 కంటే పెంచుకోలేరు కదా ? అదనంగా జీవించే ఆ కాలం కూడా ఏ రకమైన ఆకలిలేక, చురుకుదనం లేక, శరీరాలను బలవంతంగా కదిలిస్తూ, ఏమే తినలేక తాగలేక , బతుకు మీది యావ చావక జీవశ్చవాళ్ళా బతుకుతున్నారే! ఆ బతుకు ఏమి బతుకురా తండ్రి! ఇంతమంది ఉసురుబోసుకుంటూ బొర్రలు, కండల కళేబరాలు పెంచుకుంటూ మీకు మీరు  మురిసి పోతున్నారేమో కానీ మీ మురుగును ప్రకృతి ఇంకా  ఎంతో కాలం భరించలేదని పర్యావరణ వేత్తలు  మొత్తుకుంటున్నారు. భూమి ఘోషను ఆలకించండి. లేదంటే ఎవడి గోతిని వాడే తవ్వుకొనే అవసరం లేకుండానే అవని మాత ఆసాంతం అదృశ్యం అయిపోనున్నదట.

No comments:

Post a Comment