Monday, November 20, 2017

ఇంటిమీద ఎవుసమ్ 1 .

ఎవుసమ్
ఈ రోజు మిద్దె తోట ల వంకాయ మొక్కలను నాటినం . మిత్రులు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తోట చూడడానికి వచ్చి తాను రాసిన ఇంటి పంట పుస్తకం ఇచ్చిండు.
తోట పెట్టినవ్ సరే ! రేపు రేపు కాయలు గూడా కాస్తాయి గావచ్చు. కానీ నీ తీరుగా ఇంకా పది మంది తోట పెంచాలంటే వారికి స్పూర్తి ఇచ్చే విధంగా నీ అనుభవాలను పది మందికి
పంచి, నీవు ఎందుకు తోటను పెంచాలనే నిర్ణయం తీసుకున్నావో రాయాలని కోరిండు . భూమి నుండి బువ్వదీసే అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు గా , మట్టి పిసికి మట్టి బుక్కిన
మనుషుల సాహ చర్యమ్ కలిగిన కారణాల దృస్ట్యాను , అలాగే కొంత కాలం ఆ పని నుండి దూరమై తిరిగి భూమిపైన కాలూన డానికీ కారణం వివరిస్తూ రాస్తే అది ప్రకృతికి మేలు
జేయడమాత్రమే గాకుండా భూమి తల్లిని కాపాడిన వాళ్ళం కూడా అవుతామని కథా రచయితవు కూడా కనుక నీవు రాయాలని అడిగిండు. అట్లా మొదలయింది ఈ ఎవుసమ్ కథ .
ఇప్పటికీ అరువై ఏండ్ల కిందటి ముచ్చట. అంటే 1 9 5 7 జూన్ మాసం అది. మా ఇంట్ల శిలుకావు అని ఒక ఆవు ఉండేది. డానికీ ఒక కోడె లేగ ఉండేది. దాని పేరు కూడా శిలుకే.
అది పుట్టినప్పుడు మా నాయిన దాని ఊపురానికి తువ్వాల జుట్టి నోటి తోటి పైకి లేపిండట అందుకని అది నడుస్తున్నప్పుడల్లా దాని ఊపురం ఒయ్యారంగా అటుయిటూ ఊగుతుండేది .
ఆ శిలుక కోడె లేగ అన్నా దాని ఊపురంఅటూ ఇటూ ఊగుతుంటే దాని ఉరుకుడు అన్నా నాకు బాగా ఇస్టం ఉండేది.
పాల కోసం ఒక బర్రె ఉండేది. దాని పేరు పాపలి బర్రె. డానికీ ఒక పెయ్య దుడ్డే ఉండేది . ఆ రెండీటీ తో ఆడుకునుడంటే నాకు చాలా ఇస్టమ్ . నేను ఎటుబోతే అవ్వి నా వెంటనే
తిరిగేటియి . ఆటితోటి ఆడుకోవడం ..మా అవ్వ బెట్టే బువ్వ దీనుడు,నా లోకంగా ఉండేది. మాపటీలి పాలకుండ కడుగంగా అవ్వ గీకి పెట్టిన పాలగోకుడు దీనుడు ఇస్టమ్
అసోంటిది మా నాయిన నన్ను బడికి తీసుకొని పోయిండు . ఒక కట్టె పలుక, దాని మీద దిద్దే తందుకు బలుపమ్ ఇచ్చి బల్లే కూసున్ద బెట్టి తన పనికి తను పోయిండు.
నా మనుసంత మాపటీలి అవ్వ గీకి పెట్టె పాలగోకుడు మీద , కొల్లాగ , పెయ్య దుడ్డే మీద.
నరహరి సార్ ఆ ,ఆ లు పెట్టిచ్చిండు పలుక మీద . ఆ, ఆ అనుకుంట దిద్దుమన్నడు .
రెండు మూడు సార్లు దిద్దిన గావచ్చు. నాకు తెలువకుంటనే నా ఇద్దరు దోస్తులు ఎప్పుడో నా మనుసులకు వచ్చి చేరిండ్రు.
ఇగ నా లోకం ల నేను ఉన్న.
ఈపుల సర్రు మని ఒక సరుపు వడ్డది .
అన్నన్న నీయవ్వ ! అనుకుంట ఎనుకకు దిరిగిన .
. చెంప మీద చెళ్లుమని మల్లోటి వడ్డది .
ఏమన్నవురా ? సారు గద్దరాయించిండు .
లాగు దడిసింది . ఏమనలేదు సారు. లాగుడదిసింది అన్న.
చల్ , బేవకూఫ్ , ఇంటికివోయ్యి ఇంకో లాగు దొడుక్కొని రాపో అన్నడు.
కట్టె పలుక భుజమ్మీద పెట్టుకున్న, నీ బడి పీసునా వారేద్దు , ఇంకా నీ బడికి అత్తనా కొడుక అని మనుసుల అనుకుంట ఇంటి దారి వట్టిన .
గలుమ కాడికి వచ్చిన్నో లేదో ఎక్కడికి వోయినవ్ అన్నట్టుగా ఒర్రుకుంట ఉర్కచ్చినయి రెండూ.
ఆ రెండీటీని వట్టుకొని ఎవ్వలకు దొరుక కుంట. జల్లుకచ్చిన మక్కతోట ల జొచ్చిన.
పచ్చటి మక్కతోట , కమ్మటి వాసన. మేము ముగ్గురం అటూ మెసులు తుంటే మక్కా కర్రలకు ఒరుసుకుంటున్నం. మక్క జల్లు కొసలనుంచి పుప్పొడి కుంకుమ తీరుగా
మామీద పడుతుంటే ఇగ దాంట్ల నుంచి బైటికి రా బుద్ది గాలేదు.
నిన్న గట్టిన మోట నీళ్ళకు భూమి మెత్తగ తడిసి ఉన్నది. కుంకుమ తీరుగ మీదబడ్డ పుప్పొడి తోటి కలగలిసి కమ్మటి వాసన .
మన్ను పిస్కు కుంట ఎడ్లను జేసుకుంట, ఎట్లున్నయి ?మీ తీరుగ ఉన్నయా? అని వాటికి జుపుకుంట ఎంతన్న సేపు అట్లనే ఆడుకుంట ఉన్న.
మాపటీలి బర్లచ్చే యేళ్ల అయ్యింది గావచ్చు దుడ్డెబొక్కు ఒర్రుడు షురూ జేసింది.
నాకు గూడ పాలగోకు కుతి లేసుడు మొదలైంది.
నాయిన ఏనంగా జూసిండో . ముసిముసి నవ్వు నవ్వుకుంట అడుగుల అడుగులేసుకుంటా కాలు సప్పుడు గాకుంట మాదగ్గెరికి వచ్చిన సంగతి ఆటలాడుకుంటున్న మేము
గమనించనే లేదు.
నెత్తి మీది బూరు అందుకోని ఆవుదు కాడికి దీసుక పొయ్యి చేతులకంటిన బురుద కడిగి అవ్వకు అప్పజెప్పిండు .
అట్లా మొదలైంది నా ఎడ్లు, ఎవుసమ్ , భూమి సంబంధం కథ.

No comments:

Post a Comment