Thursday, November 16, 2017

గీతా కార్మికుల వెలుగు దివ్వే దేశిని చిన మల్లయ్య.!

                                 

( 20 నవంబర్ 2017 సోమవారం నాడు కరీంనగర్ లో కా: దేశిని చినమల్లయ్య సంస్మరణ సభ సందర్భంగా )

ఒక సామాన్య గీతా కార్మికుడై ఉండీ, కేవలం ఐదవ తరగతి చదువుతోనే  22 సంవస్తరాలు బొమ్మన పెళ్లి గ్రామ సర్పంచ్ గా, 20 సంవస్తరాలు ఇందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా , అదీ ఒక ప్రతిపక్ష పార్టీ అయిన సి పి ఐ నుండి గెలుపొందడం అతని అసామాన్య రాజకీయ చతురతకు , ప్రజా పక్షపాత వ్యక్తిత్వానికి నిదర్శనం.

దేశిని చినమల్లయ్య యుక్తవయస్సు వచ్చేనాటికి పోరాటాల పురిటి గడ్డ హుస్నా బాద్ ప్రాంతం లోని అతని స్వగ్రామం అయిన బొమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న మహ్మదా పూర్ గుట్టల శ్రేణుల్లో  కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కార్యక్రమాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నై. సహజంగానే తాటి చెట్లు ఎక్కడానికి రెక్కలు తప్ప మరో ఆధారం లేని దేశిని , కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడు అయినాడు.  .స్తానికునిగా , గీతకార్మినికునిగా మహ్మదా పూర్ గుట్టల శ్రేణి ఆయనకు కొట్టిన పిండి కనుక ,  సాయుధ రైతాంగ గెరిల్లా వీరులకు అన్నపానాదుల కల్పనలో , డెన్ ల నిర్వహణలో , వార్తాహరునిగా  చురుకైన పాత్ర పోషించాడు. తన కనుల ముందే కాకలు తీరిన వీర యోధులు ఒరిగిపోయి , తాను కలల్లుగన్న సమ సమాజ స్వప్నం కూలిపోగా రెక్కలు తెగిన పక్షిలా తిరిగి తన గీతా వృత్తి వైపు రాక తప్పలేదు.

సాయుధ పోరు విరమించిన సి పి ఐ పార్టీ 1952 లో ఎన్నికల బరిలో దిగింది. 1959 లో ఆంధ్రప్రదేశ్ లో పంచాయత్ రాజ్ చట్టం అమలైంది. తదనంతరం  నిజాయితీకి , నిస్వార్థానికి మారుపేరైన దేశిని మల్లయ్యను ప్రజలు బొమ్మనపెళ్లి గ్రామ సర్పంచగా ఎన్నుకున్నారు.  ఆనాటి నుండి 22 సంవస్తరాలు అప్రతిహతంగా సర్పంచ్ గా గ్రామ ప్రజల ఆదరాభిమానాల మేరకు పనిజేశాడు. 1976-77 లో హుస్నాబాద్ సమితి ప్రసిడెంట్ రాంభూపాల్ రెడ్డి , పదవీచ్యుతుడు అయినందున వైస్ ప్రసిడెంట్ గా ఉన్న మల్లయ్య సమితి ప్రసిడెంట్ అయినాడు. ఎమర్జెన్సీ తర్వాత 1978 లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఇందుర్తి నియోజక వర్గం నుండి ఎమ్మెల్లే గా ఎన్నిక కావడం సామాన్య విషయం కాదు. జాతీయ పార్టీ కాంగ్రెస్, జనతా పార్టే అభ్యర్థులు సంపన్నులు మరియు అగ్రవర్ణాలకు చెందిన వారు అయినప్పటికినీ సి పి ఐ  పార్టీ నుండి  ప్రజల మనిషిగా ఒక సామాన్య గీతా కార్మికుడు తాడి చెట్లు ఎక్కుకుంటూనే ప్రచారం చేసుకొని వచ్చి గెలిచి రావడం ఒక అబ్భురమే ఆనాటికీ ఈనాటికీ.  1985, 1989, 1994 వరుసగా మూడు సార్లు ఇందుర్తి నియోజక వర్గం నుండి వైరి వర్గం ఎంతో బలమైన రాజకీయ ఆర్థిక పునాది కలిగినది అయినప్పటికినీ  ప్రజల మద్దతుతో గెలుపొందాడు. తన నియోజక వర్గ ప్రజలకోసం ఎంతదూరమైనా అలసట లేకుండా బస్సులో, కాలి  నడకన వచ్చి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేవాడు. ప్రస్తుత రాజకీయ అవినీతి ఆడంబరాలకు ఆయన ఆమడ దూరం లో ఉండేవాడు. 1999 లో సి పి ఐ కుల రాజకీయ చదరంగం లో దేశీనికి ఇందుర్తి నుండి టికెట్ ఇవ్వలేదు. పైగా ప్రారంభం లో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అది సమర్థించలేదు ,  కనుక అనివార్యంగా సి పి ఐ ని విడిచి ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం లోకి  ఉరికినాడు. మొన్న 11 నవంబర్ నాడు తన అంతిమ శ్వాశ విడిచేదాక పీడిత ప్రజానీకం గురించే తపించిన నిస్వార్థ జీవి.

1964 ఆగస్టు లో  ఏపీ కోఆపరేటివ్ ఆక్ట్ వచ్చేదాకా తెలంగాణ లో  దొరలు , భూస్వాములు ప్రభుత్వం వద్ద కలాల్ మాములాను హర్రాజ్ పాడుకొని వచ్చి గ్రామాలల్లోని గీతకార్మికులనుండి  మునాఫా తీసుకొని చెట్లు గీయనిచ్చేవాళ్లు. దొరలు , భూస్వాములు అడిగినంత మునాఫా వెల్లదు , ఇవ్వలేమని వేడుకున్నా గూడా చెట్లను స్తానికులకు ఇవ్వకుండా  వేధించేవాళ్లు. వాస్తవానికి తెలంగాణ గీతకార్మికులకు నైజాం పాలన ప్రత్యక్ష పీడనకంటేగూడా స్తానిక దొరల, భూస్వాముల గడీల పీడనే అధికంగా ఉండేది.  

"మా భూమి"  సినిమా లో "దొరా ! మీరుకొట్టిన దెబ్బలకు గౌండ్ల నారిగాడు సచ్చిపోయిండు . " అంటాడు జీతగాడు.
" గడీ గోడ అవుతల బొంద వెట్టుండ్రి " అంటడు దొర. అటువంటి పరిస్తితిలో దేశిన చిన మల్లయ్య, ధర్మ భిక్షాం గారల నేతృత్వం లో ఖమ్మం జిల్లా గార్ల లో గీతా కార్మికులతో పెద్ద మీటింగ్ జరిపి "కల్లు  గీతా కార్మిక సంఘం " ఏర్పాటుజేసి , హర్రాజ్ విధానం రద్దు జెసి కలాల్ మాములాలను కల్లు గీతా కార్మిక సంఘాలకు అప్పగించాలని ఉద్యమించడం జరిగింది.  దేశిని చినమల్లయ్య, ధర్మ భిక్షం గారల నాయకత్వం  మరియు గీతా కార్మికుల సంఘటిత శక్తి కి దిగివచ్చిన ప్రభుత్వం అప్పటినుండి గీసే వాళ్ళకే చెట్లు అన్న హక్కును కలుగ జేసి హర్రాజ్ విధానానికి స్వస్తి పలికింది .

మారిన కాలానికి అనుగుణంగా చెట్లు ఎక్కే సాధనాలు ఆధునీకరించబడని కారంగా గీస్తున్న చెట్ల పైనుండి గీతకార్మికులు పడి చనిపోతుంటే వారికి ప్రభుత్వం నస్టపరిహారమ్ ఇవ్వాలని అసెంబ్లీ లో పోరాడిన ఫలితంగా 5000 రూపాయలతో ప్రారంభమైన ఎక్స్ గ్రేషియా ఇప్పుడు 5 లక్షలకు చేరడానికి ఆద్యుడు దేశిని చినమల్లయ్య.

ప్రభుత్వాలకు ఆనాటి నుండి నేటి వరకు  కల్లు గీతా వృత్తి ఒక ఆదాయ వనరు. వాస్తవానికి వృత్తులన్నీ అడుగంటి పోయి బతుకు దెరువే గగణమై పోతున్న పరిస్తితి లో ఇంకా కల్లు వృత్తి దారులనుండి పన్ను వసూలు చేయడం దారుణం. అలాగే మినరల్సు, విటమినులు పుష్కలంగా కలిగి ఉన్న నీరా ను నిర్ణీబంధంగా స్వేచ్చ మార్కెట్ లో విక్రయానికి అవకాశం ఇచ్చి గీతా కార్మికుల వృత్తిని బలోపేతం చేయాలని ఉద్యమించే శక్తి యుక్తులు కలిగిన మరో దేశిని చినమల్లయ్య లాంటి యువ నాయకత్వం కోసం  గీతా కార్మిక సమాజం ఎదురు చూస్తున్న క్రమం లో,  ఉన్న వయోవృధ్ధ పెద్ద దిక్కు దేశిని చిన మల్లయ్యను , కోల్పోవడం  గీతా కార్మిక లోకానికి తీరని లోటు.



No comments:

Post a Comment