Wednesday, March 29, 2017

ఇంటిమీదెవుసమ్ 38

                                                   

నిన్న ఉగాదినాడు మధ్యాహ్నం షహీదా రాసిన " అమూల్యం " కథ చదువుతున్న . కథా  కథనం అద్భుతంగా ఉన్నందున అందులో లీనమై పోయిన. ఉన్నట్టుండి ఒక్కసారి  పెద్దచప్పుడుతోటి గేటు దీసిన చప్పుడు వినిపిస్తే ఒక్కసారి గిరుక్కున అటుదిరిగి చూసిన.  చూసేవారకు అది మా గేటు కాదు. ఎదురింటి గేటు తెరిచిన ఆ ఇంటి ఇల్లాలు ఒక ఆవును తన గేటు లోపలికి ఆహ్వానిస్తూ కనిపించింది. ఉగాది పర్వదినం కదా ? గోమాతకు అన్నం పెడితే పుణ్యం వస్తుందని ఏ మహాత్ముడు చెప్పాడో ఆవుకు పరమాన్నం పెట్టి అది తింటుంటే దాని చుట్టూ తిరిగి దండం బెడుతున్నది. వండిన అన్నం ఆవులకు విషతుల్యం అని ఆమెకు తెలియక పోవచ్చు. ఆవుల జీర్ణాశయం మనకు వలె ఉండదు. పచ్చి గడ్డి మేసి అరిగించుకోవాలి కనుక దాని కడుపు నాలుగు భాగాలు ఉంటుంది. ఉడికిన ఆహారం తింటే దానికి ఎసిడిటీ అవుతుంది. కానీ అవతలి వైపు ఏమైతే వారికేమిటి ? వారికి కావాల్సింది ఇనిస్టెంట్ పుణ్యం కదా? ఈ ఇల్లాలే ఉగాది ముందు ఆమె అత్తగారు ఊరునుండి కొడుకు దగ్గరకని వస్తే పెద్ద గొడవ జేసి ఆమె తన ఇంటి నుండి వెళ్లిపోయేదాకా సతాయించి నానాయాగీ జేసిన  విషయం వాడంతా చూసింది. కనీ , పెంచీ పెద్దజేసీ విద్యా బుద్దులు చెప్పించి ప్రయోజకుణ్ణి జేసి ఈమెకు జోడీ జేసిన  కొడుకు వద్దకు ఆ తల్లి వస్తే ఆమెకు పిడికెడు మెతుకులు పెట్టాలే అన్న సోయి లేదు కానీ ఆవుకు అన్నం బెట్టి తేరగా పుణ్యం కొట్టేద్దామన్న సంకల్పం మాత్రం పుష్కలం. ఆమెకు బూత దయ,భక్తీ ,  పూజా పునస్కారాలంటే  చాలా ఇస్టమ్  అని వాడ వాడంతా అనుకోవాలని ఆమె ఆరాటం మరి. అప్పుడప్పుడు వ్రతాలనీ  , పూజలనీ వాడవాడంతటిని  పెరంటాలు పిలుస్తది .

యాబై ఏండ్ల కిందటి మా నాయిన జేసిన ఉగాది పండుగు మతికివచ్చింది ఈ సంఘటనతోటి. ఉగాది నాడు మాపటీలి మా ఇంట్ల ఎడ్లకు పండుగు జేసేది మా నాయిన. మాది మూడు నాగండ్ల ఎవుసమ్. ఆరు ఎడ్లు పెద్దై , రెండు చిన్నెడ్లు ఉండేటియి. ..చిన్న పలుకంచే నిండా అన్నీటికి ఒక్కొక్క బూరె , నానవెట్టిన తౌడు గలిపిన ఉలువ గటుక , ముందట వెట్టి అవి తినేదాకా నాయిన అక్కడనే వాటి తోటే ఉండేది. అప్పుడు జెప్పిండు నాయిన ఉడికిన పదార్థాలు పశువులకు  కడుపునిండ పెట్టవద్దని. ఎడ్లు , మనకు దేవుని కంటే గూడా ఎక్కువ అని చెప్పేటిది. వాటికస్టం తోటే మనం బతుకుతున్నం , వాటి చాకిరిలోనే మన బతుకులు , అని చెప్పేటిది. ఎవుసానికి ఎడ్లు మా ఆవుల మందనుంచే వచ్చేటియి . ఆయిన వాటిని పానం లెక్క అరుసుకునేది. ఆయిటి పనులు మొదలైనై అంటేనే , తడువకుంట ఇంటి అటుకు మీద దాసిపెట్టిన తెల్లజొన్న సొప్ప వేస్తుండే  ఎడ్లకు. పగటీలి  పొంటే నాగండ్లు ఇడిసినప్పుడు ఒక్కొక్క ఎద్దుకు గంపేడు గంపేడు కంకెన పొట్టు  , కంది పొట్టు పెడుతుండే.  కడుపునిండా నీళ్ళు తాగవెట్టి నంక గాని నాగండ్లు కట్టనియ్యక పొయ్యేది. ఆయిటిల వరినాట్లు అయినయంటే మళ్ళా వానలు ఎనుకకు వట్టి భూములు మంచిగా ఆరి పొడి దుక్కికి నాగటి సాలు వచ్చేదాకా ఎడ్లకు రికాము ఉండేది. అందుకే అందురు,  అసలేరుల (ఆశ్లేష కార్తే ) ముసలెద్దు గూడా లెంకలు (రంకెలు) గొడుతది అని. మళ్ళా మాగిజొన్న దుక్కులు , జొన్న పోతలు అంటే గోదావరి వొడ్డెంబడి ఉన్న గ్రామాలకు పెద్ద  పనిపండుగు. అప్పటి జొన్న పోతలు అంటే ఇప్పుటి  పిలగాండ్లకు పరీక్షల సీజన్ తీరుగా ఉండేది అప్పటి కాలం ల. నడిజాము దిరిగినంక  ఓ రాత్రి , అంటే గోరుకొయ్యలు వంగినయంటేనే ఎడ్లను రాత్రి మేపుకు కంచెకు తీసుక పొదురు. ప్రతి రైతుకు ఒక అయిదారెకురాల కంచె ఉండేది. తెల్లారేదాకా వాటిని కంచేల కడుపునిండా మేపుకొనివద్దురు. ఇగ ఇంటికాడ తల్లులు తెల్లవారెటాళ్ళకు అన్నం కూర వండి గంపలల్లా వెట్టి తయారు గా ఉందురు. అటు కరకర పొద్దువోడుస్తున్నది అంటే ఇంటికి వచ్చిన మొగోళ్ళు మొఖాలు కడుక్కోని ఇంతదిని నాగండ్లకు కొడార్లు వేసు కొని చేన్లళ్లకు బైల్దేరుదురు. జొన్నపోతలకు కొందరు "గొఱ్ఱు" గట్టి పోస్తే కొందరు నాగండ్ల తోటి జొన్న పోత   పొసెటోల్లు . మా నాయిన ఐతే మాత్రం " గొఱ్ఱు' పోతే పోసేది. జడ్డిగమ్ కు మూడు రంద్రాలు ఉంటై . ఒక్కొక్క రంధ్రానికి ఒక కంక గొట్టం జతజేయబడి నాగటి సాలు వెంట ఇంచులోపట విత్తనం బడే తీరుగా ఉండేది గోఱ్ఱుపోత . పొద్దుగాల కట్టిన గొఱ్ఱు మధ్యాహ్నం పొంటెలు ఇడిసి మళ్ళా కట్టిండ్రు అంటే చీకటి అయ్యేదాకా జొన్న పోత సాగుతనే ఉండేది. "ముందో మందు " అంటా , జొన్న పోత మాది ముందు అయిపోయిందని చెప్పుకోవడాన్ని గొప్పగా అనుకుందురు. పసులను పాణం తీరుగా అరుసుకుందురు అదే తీరుగా పనిజేయించుకుందురు . పశువుల గొడ్డుచాకిరి మనుషుల మేధో, శ్రమ శక్తి కలగలిసి బంగారు పంటలు  పండించేవాళ్లు.  వానా కాలం ల అయితే గొడ్ల కొట్టం , గడ్డి పైకప్పు ఉరిసేది, గొడ్లు  ఉచ్చలు పోసేటియి .రోజూ పొద్దుగాల పెండదీసుడు పెద్ద గండం తీరు ఉండేది. ఉరిసిన నీళ్ళు , పోసిన ఉచ్చ ఎత్తి పోస్తుంటే నెత్తిల నుంచి , మొఖం మీద నుంచి , బొచ్చె దాకా  పెయ్యంతా  కారేడిది . నేను గూడా ఎన్నోసార్లు అట్లా ఎత్తిపోసిన . వాటికి చాకిరీ జేస్తే అన్నం దొరుకుతది అనేది ఆనాటి మా ప్రత్యక్ష అనుభవం , విశ్వాసం కూడా .కానీ ఇప్పుడు  ఆవుల ఆలన పాలన నుంచి మనిషిని దూరం జేసి , దుక్కిటెడ్లను ఎవుసానికి దూరం జేసిన పని పూర్తయింది.   ఎవుసానికి ఎడ్లు లెవ్, దొడ్లే ఆవులు లెవ్ . .  కానీ  ఆవులకు  పూజలు జెసి దండం బెడితే పుణ్యం వస్తదని , అది మన విశ్వాసం అని నీతి మాటలు చెప్పుతున్నరు పెద్ద పెద్దోల్లు .

No comments:

Post a Comment